మే 1 నర్మద పుష్కరాలు ఆరంభం

ధర్మానుసారం కర్మలను ఆచరించడం భారతీయ సంస్కృతి. పుష్కర విధి కూడా అలాంటిదే. పుష్కర అంటే ‘పుణ్యజలం’ అని అర్థం. మనిషితో పాటు దాదాపు సకల జీవరాశికి పుష్టినిచ్చే (పోషయతీతి పుష్కరం) వాటిలో నీరు ప్రధానమైనది. దీనిని బాహ్య, అంతఃశుద్ధికి వినియోస్తాం. నీటిలో దేవగురుడు (బృహస్పతి) ప్రవేశంతో మరింత పవిత్ర చేకూరుతుందని పూర్వాచార్యులు ప్రకటించారు. దేశం మనకు మాతృసమానురాలు. అందులో ప్రవహించే నదులూ మాతృసమాలే. భారతేతి ఖండాలలో నదులన్నీ జలప్రవాహాలేనని, ఈ ధర్మ, కర్మ భూమిలో పారే నదులకు మాత్రమే తీర్థత్వం ఉందని పురాణాలు పేర్కొంటున్నాయి. బృహస్పతి ఈ ఏడాది మే 1వ తేదీ బుధవారం మధ్యాహ్నం గం.1.01నిమిషాలకు వృషభ రాశిలో ప్రవేశించడంతో రేవా (నర్మద) నది పుష్కరాలు ప్రారంభమవుతాయి.

నర్మద (రేవ) మధ్య భారతదేశంలో ప్రవహించే నదుల్లో ముఖ్యమైనది. దేశంలో పొడవైన ఐదు నదులలో ఐదవది. సముద్ర మట్టానికి 1060 మీటర్ల ఎత్తులోని మధ్యప్రదేశ్‌ ‌లోని అమరకంటక్‌ ‌పర్వతాలలో కపిలధార నుంచి వింధ్య పర్వత శ్రేణుల మీదుగా పశ్చిమ వాహినియై ప్రవహిస్తుంది. మహారాష్ట్ర మధ్యప్రదేశ్‌, ‌గుజరాత్‌ ‌నుంచి సుమారు 13 వందల కిలోమీటర్లు ప్రవహించి అరేబియా సముద్రంలో సంగమిస్తుంది. మధ్యప్రదేశ్‌, ‌గుజరాత్‌ ‌రాష్ట్రాలను సుపంపన్నం చేస్తున్న నర్మదను ఆ రెండు రాష్ట్రాల ‘జీవనరేఖ’గా వ్యవహరిస్తారు. ఈ నదీ ప్రవాహం స్థిరంగా ఉంటుంది. నీరు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఈ నదిలో దొరికే గులక రాళ్లను ‘బాణలింగాలు’ అంటారు. ఈ ప్రాంతం వారు నర్మదా కే కంకేర్‌ ఉత్తే శంకర్‌ (‌శివుడు గులక రాళ్ళలో ఉన్నాడు) అని విశ్వసిస్తారు. పురాణేతహాసాల ప్రకారం, శివపార్వతులు రుక్షపర్వతంపై తపస్సు చేస్తుండగా, శివుని మేని నుంచి జలప్రవాహం బయలు వెడలి, వనితగా మారి పరమేశ్వరుని మెప్పించింది. ఆయనకు ఆనందాన్ని కలిగించింది కనుక ‘నర్మద’ అని పేరు వచ్చిందని చెబుతారు. ఆయన మేను నుంచి పుట్టింది కనుక• ‘రుద్రకన్యక’ అనీ పేరుపొందింది. పద్మపురాణం, మహాభారతం, హరివంశం తదితర పురాణాల్లో నర్మదానది ప్రస్తావన ఉంది.

ఈ నది ఉద్భవించిన అమర కంటక్‌ ‌పుణ్యప్రదాయక ప్రాంతంగా ప్రసిద్ధికెక్కింది. సాధారణం శకం 1042-1122 మధ్య కర్ణదేవుడు అనే రాజు అక్కడ ‘నర్మద’ మందిరం నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. అక్కడ ఏటా మాఘ శుద్ధ సప్తమి నాడు నర్మద జయంతి నిర్వహిస్తారు. నర్మద తీరంలోని చాండోడ్‌ ‌వ్యాస•భగవానుడి ఆశ్రమ స్థలమని ప్రతీతి. అక్కడకి 15 కి.మీ. దూరంలో వాయుసుని గుడి, ఆవలి ఒడ్డున దానికి ఎదురుగా శకుని ఆలయం ఉంది. నర్మదకు కుడివైపున దేవగాన్‌ ‌వద్ద జమదగ్ని ఆశ్రమం, జమదగ్నీశ్వర, పాతాళేశ్వర మందిరాలు ఉన్నాయి. నర్మదకు ఉత్తర తీరంలోని శుకతీర్థం ప్రముఖ క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. అక్కడికి కొంత దూరంలో భృగుమహర్షి తపస్సు చేసిన స్థలం భృగుకచ్ఛపం కాలక్రమంలో ‘బ్రోచ్‌’ ‌పట్టణంగా మారిందని, బలి చక్రవర్తి అశ్వమేధ యాగం చేసినది, రావణుడిని కార్తవీర్యార్జునుడి బంధించినది ఇక్కడే అని చెబుతారు. శంకర భగవత్పాదుల గురువు గోవిందాచార్య ఈ నదీతీరంలోనే తపస్సు చేశారని, శంకరులు వారిని ఈ నది ఒడ్డున గల ఓంకారేశ్వర్‌లో (ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి) దర్శించుకున్నారని ఐతిహ్యం.

కడిమి చెట్టు పన్నెండేళ్లకు ఒకసారి పూస్తుంది. జీవనదులకు పన్నెండేళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తాయి కనుక పుష్కరం మహా పర్వదినం.గురు గ్రహం (బృహస్పతి)ఏడాదికి ఒక రాశి వంతున పన్నెండు రాశులను పన్నెండేళ్లలో చుట్టి వస్తుంది. అలా ఒక్కొక్కరాశిలో ప్రవేశించినప్పుడు ఆ నదికి మహాత్మ్యం కలుగుతుందంటారు. సమస్త జీవులకు ఆహారం కంటే విలువై గాలి,నీరు గొప్పదనాన్ని, వాటిని గౌరవించి, రక్షించుకునే శ్రద్ధాసక్తులను పెంపొందించడాన్ని తెలియచేయడమే పుష్కర ప్రాశస్థ్యం.

పుష్కారాల ఆవిర్భావం గురించి పౌరాణిక గాథలను బట్టి… సృష్టి ఆరంభంలో తుందిలుడు అనే గంధర్వుడు ఘోరతపస్సుతో పరమేశ్వరుడిని మెప్పించి, ఆయనలో శాశ్వత స్థానం పొందేలా వరం కోరాడు. తథాస్తు అన్న పరమేశ్వరుడు, తన అష్టమూర్తులలో ఒకటైన జలమూర్తిలో ఆయనకు శాశ్వత స్థానం కల్పించాడు. అలా మూడున్నర కోట్ల తీర్థాలకు అధిపతి అయ్యాడు. జలాలకు అధికారి అయినందున పుష్కరుడు అయ్యాడు. అలా ఆయన నివసించినంత కాలంలో ఆయా నదులను మరింత పుణ్యదాయినీలుగా భావిస్తారు.

సృష్టి నిర్మాణ క్రమంలో విధాతకు జలంతో అవ•సరం ఏర్పడి శివుడి వద్ద నుంచి జలాధికారి పుష్కరుడిని గ్రహిస్తాడు. పుష్కరుడు బ్రహ్మ కమండంలో ప్రవేశిస్తాడు. కాగా సకలజీవరాశిని పునీతం చేసేందుకు, వాటికి జీవనాధారమైన జలం ఇవ్వాలని బ్రహ్మదేవుడిని బృహస్పతి అర్థించాడు. కానీ ఆ కమండలాన్ని వీడివెళ్లేందుకు పుష్కరుడికి మనస్కరించలేదు. చివరికి విధాత వారిద్దరి మధ్య సానుకూల ఒప్పందం కుదుర్చుతాడు.

బృహస్పతి ఒక నది నుంచి మరో నదికి మారేటప్పుడు పుష్కరుడు ఆయనను అనుసరించి పన్నెండు రోజులు, ఏడాది చివర బృహస్పతి మరో నదికి మారేటప్పుడు పన్నెండురోజులు ఉండేలా అవగాహన కుదురుతుంది. మిగిలిన రోజులలో ప్రతిదినం మధ్యాహ్నం రెండు ముహూర్తముల (నాలుగు గడియలు) సమయం మాత్రమే బృహస్పతితో ఉండి, మిగతా కాలమంతా తన కమండంలోనే ఉండేలా పుష్కరుడిని బ్రహ్మ ఒప్పించాడు. అలా బృహస్పతి ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తుంటాయి.

‘మేషే గంగా వృషే రేవా మిథునేచ సరస్వతీ!

కర్కటే యమునా ప్రోక్తా సింహే గోదావరీ స్మృతాః

కన్యాయాం కృష్ణవేణి చ కావేరీ ఘటకే స్మృతా

వృశ్చికే తామ్రపర్ణీ చ చాపే పుష్కర వాహనీ

మకరే తుంగభద్రాచ కుంభే సింధునదీ స్మృతా

మీనే ప్రణీతా చ నదీ గురోస్సంక్రమణే స్మృతా’

 మేషంలో (గంగ), వృషభం (రేవ), మిథునం (సరస్వతి), కర్కాటకం (యమున), సింహం (గోదావరి), కన్య (కృష్ణా), తుల (కావేరి), వృశ్చికం (భీమారథీ), ధనుస్సు (బ్రహ్మపుత్ర), మకరం (తుంగభద్ర), కుంభం (సింధు), మీనం (ప్రాణహిత) …ఇలా పుష్కరాలు వస్తుంటాయి. పుష్కరుడితో పాటే సమస్త దేవతలు, రుషులు, ఇతర నదీమ దేవతలు కూడా ప్రవేశిస్తారని, పుష్కరాల విశిష్టతకు అదీ ఒక కారణమని చెబుతారు.

‘రేవాతీరే తపః కుర్యాత్‌,‌మరణం జాహ్నవీ తటే

దానం దద్యాత్‌ ‌కురుక్షేత్రే,గౌతమీ మ్యాంత్రితయం పరం’

నర్మదా నదీ తీరంలో తపస్సు, గంగానదీ తీరంలో మరణం, కురుక్షేత్రంలో దానం విశేష ఫలప్రదాలని (ముక్తికారకాలు) ఆర్ష వాక్యము.

పుష్కర విధులు

‘జన్మప్రభృతి యత్పాతం స్త్రియావా పురుషైనవా

పుష్కరేత్‌ ‌స్నాన మాత్రస్య సర్వమేవ ప్రణశ్యతి’..

పుట్టినప్పటి నుంచి సంక్రమించే పాపాలు తొలగిపోయేందుకు పుష్కర సమయంలో నదీ స్నానం చేయాలని శాస్త్రం చెబుతోంది. పుష్కర నదిలో బృహస్పతి ఏడాదిపొడవునా ఉన్నా, ఆది, అంత్య పుష్కరాలు (తొలి పన్నెండు రోజులు, తుది పన్నెండు రోజులు) శ్రేష్ఠతమమని చెబుతారు.మిగిలిన సమయంలో కాలంలో మధ్యాహ్న సమయములో రెండు ముహూర్తాల (నాలుగ గడియలు) కాలం ఆ నదిలో పుష్మర ప్రభావము ఉంటుంది.

నీరు నారాయణ స్వరూపమని, అందులో మేధ్యం, మార్జనం అనే అంతర్‌ ‌బహిర్‌ ‌శక్తులు ఉన్నాయని వేదం చెబుతోంది. దాహార్తిని తీర్చడం, శుభ్రపరచడం బాహ్యశక్తులు కాగా, మేధ్యం, మార్జనం అనేవి అంతర్‌ ‌శక్తులని అంటారు. నదిలో స్నానం చేసి మూడుసార్లు మునకవేస్తే తెలిసీ తెలియక చేసిన పాపాలు పోతాయని (మేధ్యం),నీటిని చల్లుకోవడం అంటే సంప్రోక్షణ చేయడం (మార్జన)వల్ల ద్రవ్య శుద్ధి జరుగుతుందని పురాణాల వివరణ.

పుష్కర స్నానం సమయంలో పాటించవలసిన క్రమశిక్షణను, విధినిషేధాలను శాస్త్రం నిర్దుష్టంగా చెప్పింది. పుణ్యస్నానం అంటే మునకలు వేయడమే కానీ ఈతగొట్టడం లాంటివి కావు. స్నానఘట్టాల్లో నీటిలో ఉమ్మకూడదు. పాదరక్షలతో నీటిలో దిగకూడదు. మలమూత్ర విసర్జన చేయకూడదు. వస్త్రాలను శుభ్రపరచకూడదు. నిద్రాసమయంలో ధరించిన దుస్తులతో కాకుండా శభ్రమైన వస్త్రాలను ధరించి స్నానం చేయాలి. ఒడ్డున ఉన్న మృత్తికను (మట్టిని) లేదా పసుపును తీసుకొని నీటిలో వదిలిన తరువాతే స్నామమాచరించాలి. పుష్కరస్నానం వేళ ‘శంనో దేవీరభీష్టయ ఆపోభవంతు పీతయే/శంయోరభిస్రవస్తునః’ (దివ్యములై ఈ జలాలు మంగళకరములై మా అభీష్టములును నెరవేర్చుగాక! తాగేందుకు అనువైన నీటిని ఇచ్చుగాక! నీరు మా వైపు ప్రవహించుగాక) అని రుషిప్రోక్తమైన జలదేవతా ప్రార్థన చేయాలి, చేస్తారు. స్నానానంతరం శాస్త్రానుసారం జపం, హోమం, అర్చన, దానం, పితృతర్పణం వంటివి చేయాలి. పుష్కరసహితుడై బృహస్పతి, ముక్కోటి దేవతలు,పితృదేవతలు నదిలో ఉంటారని పురాణవచనం. దేవగణాల మాదిరిగానే పితృగణాలు 33 ఉన్నాయని ప్రవచనకర్తలు చెబుతారు.

ఓంకారేశ్వ

‘ఓం’ ఆకారంలో వెలసిన ఈ క్షేత్రంలో ఓంకారేశ్వర లింగం, అమలేశ్వర లింగం పక్కపక్కనే ఉండడం విశేషం. ఇక్కడి అమ్మవారు అన్నపూర్ణాదేవి. ఓంకారేశ్వర్‌తో పాటు అమర్‌కంటక్‌ ‌చౌసత్‌ ‌యోగిని, చౌబీస్‌ అవతార్‌, ‌మహేశ్వర్‌, ‌నెమవార్‌ ‌సిద్ధేశ్వర్‌ ఆలయాలు పురాతన దర్శనీయ స్థలాలు. ఓంకారేశ్వర్‌ ‌ప్రధాన ఆలయానికి ఎదురుగా గల కోటితీర్థఘాట్‌ అతి ముఖ్యమై నదిగా భావిస్తారు. చక్రతీర్థ ఘాట్‌, ‌గోముఖ ఘాట్‌, ‌భైరోన్‌ ‌ఘాట్‌, ‌కేవల్‌ ‌రాం ఘాట్‌, ‌బ్రహ్మపురి ఘాట్‌, ‌సంగం ఘాట్‌, అభయ్‌ ‌ఘాట్‌ అనే ఘాట్‌లు ఉన్నాయి. ఘాట్‌ల వద్ద నది లోతు తక్కువగా, భక్తులు సులభంగా స్నానాలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. నదిలో నీరు ఎక్కువగా ఉన్న లోతైన ప్రదేశాలకు పోకుండా ఇనుప కంచెలు, పటుకునేందుకు వీలుగా గొలుసులు ఏర్పాటు, భద్రత కోసం గజఈతగాళ్లతో బోటులు కూడా ఏర్పాటు చేస్తున్నారు.

డా।। ఆరవల్లి జగన్నాథస్వామి

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE