ఏ‌ప్రిల్‌ 29 అం‌తర్జాతీయ నృత్య దినోత్సవం

ఆమె అందాల రాణి. ఆనంద మరంద బిందులహరీ సమన్విత రాగవేణి. మధుర మంజుల వీణాపాణి. సౌభాగ్యవాణి. జీవన కల్యాణి.

‘వైజయంతి’ కర్త అభిభాషణ ఇది. ఈ వర్ణనలన్నీ లలిత కళాగ్రణి అయిన నృత్యానికి పరిపూర్తిగా వర్తిస్తాయి. నృత్యానికి – ఆ కళాకారులకు ఉన్న అనుదినానుబంధ విశేషమే ఇదంతా.

నర్తన అనే పేరు వింటేనే మది పులకిస్తుంది. సరికొత్త కథ వినిపిస్తుంది.

మనోభావన రవళించి, భంగిమగా రూపాంతరం చెంది వర్థిల్లుతుంది, ఏప్రిల్‌ 29‌న అంతర్జాతీయ నృత్య దినోత్సవం. ఈరోజే ఎందుకూ అంటే నాట్యానికి ఆధునికతను సరిజోడీగా నిలిపిన కళాప్రముఖుని పుట్టిననాడు కాబట్టి. ఫ్రెంచి వ్యక్తే అయినా, తన సృజన తాలూకు పరిమళాల ప్రపంచమంతటా పరివ్యాప్తమయ్యాయి.

ప్రాచీనం, అర్వాచీనం, నాడు – నేడు, అప్పుడు – ఇప్పుడు.

మనం భావనం చేస్తోంది సంప్రదాయ కళానైపుణ్యం గురించి.

ఆ చతుర్ముఖ పవిత్రాదేశ బలము / శ్రీ సరస్వతి కృపాశీర్వాద ఫలము

దేవర్షి మహితోపదేశ రూపకము / రచియించె వాల్మీకి రామాయణమ్ము

అన్నపుడు ఆ ప్రదర్శిత ప్రకాశమే వీక్షకులమైన మనల్ని మరింత వికసింప చేస్తుంది. అమందానంద కందళిత హృదయారవిందుల్ని చేసి ఉన్నతిన నిలుపుతుంది!

ప్రత్యేకించి తెలుగు పర్వదినోత్సవాలు మూడు. సంక్రాంతి, విజయదశమి, దీపావళి.

ఒకరోజున- తెలుగుపూలు పూస్తాయి. ఆ పంటలు ఇల్లు చేరతాయి.

దసరానాడు నరుడి శంఖనాదాలు ఊరూవాడా ప్రతిధ్వనిస్తాయి.

దీపాల వరస వేళ- శోభావళ•లు సర్వత్రా వెల్లివిరుస్తాయి.

విశేషమైన తెలుగు సంవత్సరాది ఉగాది అయితే – పులకితమౌ వనసుందరి

నలినాయాత నయనదీప్త నాట్యేందిరయై సలిలత కలకంఠ వధూ

కలరవ సంస్ఫూర్తి ప్రణయగానము సలిపెన్‌

అన్నట్లు ఉంటుంది.

నా చిత్రం సుమనోజ్జం

నా నాట్యం మహనీయం

నా గానం మనోహరం

నా శిల్పం కమనీయం

అంటున్నట్లు గోచరిస్తుంది.

ఇదీ భారతీయత, ఇదే రమణీయత!

అంతర్జాతీయ స్థాయిన పేరెన్నికగన్న కళ- భారతీయ నృత్యం. భరత నాట్యంలో ముఖకవళికలు, చేత సంజ్ఞలు, కాళ్ల  కదలికలు. పలు హావభావాలు. విశేషించి దక్షిణాదిన మహిళలెందరినో నాట్య రాణుల్ని చేసిన పక్రియ. కథారూపక ప్రదర్శక అంశం ‘కథక్‌’.  అనేకానేక విన్యాసాల సమాహారం. వనితలు, పురుషుల నర్తన ప్రావీణ్యతను చాటే రూపవిధానం.

గాత్ర సంగీత, సంప్రదాయతల కలగలుపు కథాకళి. వస్త్ర అలంకరణల, లీలా విలాసాల పవిత్ర క్రతువు మణిపురి. శాస్త్రీయత, ఆచార వ్యవహారాల మేళ•వింపు- కూచిపూడి. ప్రధానంగా పురాణగాథల వ్యక్తీకరణ నృత్యం ఒడిస్సీ నృత్యవైభవం.

గాన, అభినయాల సమరసత భరితం మోహిని ఘట్టం. సునిశిత, లయబద్ధ సహిత, సౌందర్య ప్రభావిత విభవ నర్తనం.

అక్షరక్రమంలోని ఆంధప్రదేశ్‌ ‌నుంచి దాదాపు అన్ని రాష్ట్రాలకీ విస్తృతి సాధించిన పక్రియలివి. ఇవికొన్నే. నాట్యరంగాన ఉన్నవి. మరెన్నో. రీతులపరంగా శాస్త్రీయ హోదాను అందుకున్నవి ఎనిమిదికి పైనే.

భరతుడిదే నాట్యశాస్త్రం. నృత్యభాగాలుగా, జాన పదాలూ ఉన్నాయి. ప్రాథమికంగా రసపరంపరలు; శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, అద్భుతాలు. జానపద రూపాలైతే దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల లోనూ కీర్తికిరీటాలు. తెలుగునాట భామాకలాపం, వీరనాట్యం, కోలాటం వంటివి విదితాలు.

సరసోదాత్తము, భారతీయము, కళాసామ్రాజ్య, ముచ్చెర్గుణా

కర మౌచిత్యనిదాన మార్షము నలంకారా ఢ్యమున్‌, ‌దేవతా

పరిషాచ్చాక్షుష యజ్ఞ ముల్లసిత సప్తత్రింశ దదధ్యాయమౌ

పరమామ్నాయము ‘నాట్యశాస్త్ర’ మలరున్‌ ‌ప్రత్యక్షర ధ్యేయమై!

అని కదా ఆచార్య భరతుని వాక్కు. అందుకే ఆయనకు నమోవాకాలు అందిస్తూ ఉదయశ్రీ కర్త ఏమన్నారు?

లీలా తాండవలోల ధూర్జటి జటాళిందోర్మిమాలాచల

ద్బాలేందూజ్జ్వల నాట్యశాస్త్రరచనా పారంగత ప్రజ్ఞ  స

ర్వాలంకారిక మార్గదర్శకు నమందానంద మందాకినీ

శైలేంద్రున్‌; ‌రసరాజ్య ధుర్యు భరతాచార్యున్‌ ‌బ్రశంసించెదన్‌!

‌శాస్త్రం, కళ, విద్య అన్నీ సమాజ హితం కోసమే. సత్య శివ సుందర ప్రపూరితమైతేనే కళ. ఆ కళాత్మకత భారతీయ నృత్య రీతుల్లో సదా సర్వదా ప్రతిఫలిస్తూనే ఉంటుంది, ఉంటోంది.

శాస్త్రీయ నృత్య పక్రియల్లో అభివ్యక్తి ప్రస్ఫుటమవు తుంది. భా•ష, భావం, శైలి, స్వరం- వీటన్నింటా విలక్షణత ప్రతిఫలిస్తుంది. మన పురాతన ఇతిహాసాల కథలెన్ని లేవు? వాటన్నింటినీ ప్రదర్శిస్తుంది నాట్యరూపం, ఎంతైనా పంచమ వేదంగా ఖ్యాతి పొందిందిది. రుగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదాల నుంచి పాఠ్య, అభినయ, సంగీత, రసాదులు వెల్లివిరిశాయి మరి. ఉపాంగాలు నాలూగూ అంగిక, వాచిక, ఆహార్య, సాత్విక అంశాలు. ప్రతీ ప్రదర్శనా శాంతి, సుహృద్భావాలను పెంచి పోషించేదే.

మనస్సు, శరీరం, భావాల నడుమ సహజసిద్ధ సమతుల్యత తాండవంతోనే సుసాధ్యం. భారతదేశం ఐక్యతా కూడలి. ‘మనం’ అనే తాత్వికతను విస్తృతపరచే రూపమే నాట్యం. అందుకే తరచుగా నృత్యోత్సవాల నిర్వహణ భారత్‌ ‌పర్వ్ ‌తోపాటు కోణార్క, మామల్లాపురం, ఖజురహో వంటి పక్రియలు. వీటిల్లో మమేకత్వం, సార్వజనీనత ఇమిడి ఉంటుంటాయి. ఇంతటి సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటే సంస్థలూ సంఖ్యలో అనేకం. విశదీకరించాలే కానీ – ప్రతీ వ్యవస్థా అంకితభావం, నిబద్ధతల ఆలవాలం, నిరంతర సేవల ప్రతిరూపం.

నీ సుప్రభాతాలు నిత్యకల్యాణాలు

నీ కాంతి వలయాలు ఆనంద నిలయాలు

స్నిగ్ధ సుందరహాస శ్రీ శ్రీనివాసా!

అన్నపుడు ‘జయ శ్రీనివాసం’ ప్రత్విధనిస్తుంది. మూరారి రంజన! సురారి భంజన!

మొరలాలించుమయా

ప్రపంచకారణ! విపన్నివారణ

పరిపాలించుమయా

అనడంతో ‘మహాదేవశంభో’ నినదిస్తుంది.

గంగాతరంగమై పొంగె నా హృదయమ్ము

అవధరింపుము ప్రభూ! అమృతాభిషేకమ్ము

అనగానే ‘అందాల నటరాజ’ రూపం సాక్షాత్కరిస్తుంది.

నల్లని మబ్బులు జల్లు కురిసెసే

చల్లని మలయానిలము దరిసెనే

తెల్లని వెన్నెల వెల్లివిరిసెసే

మల్లెల తావికి మనసు మురిసెసే!

అంటున్నపుడు ‘నందకిశోర’త మదినంతా ఆవరిస్తుంది.

కాలిఅందెలు, గజ్జెల రవళ•లు ఎవరినైనా పులకరింప చేస్తాయి.  భరతనాట్యంతోపాటు కూచిపూడి కళాప్రవీణు రాలు యామినీ కృష్ణమూర్తి. పది హేడేళ్ల వయసులోనే తొలి నృత్య ప్రదర్శన ఇచ్చినవారు. రెండు పదుల ప్రాయానికే అంతర్జాతీయ ఖ్యాతి అందుకున్న విదుషీమణి. నర్తన శిల్పాల ఆధారంగా, నృత్య సర్వస్వమంతటినీ దృశ్య శ్రవణ మాధ్యమానికి అందించిన పద్మభూషణు రాలు. ‘నృత్యమూర్తి’ ధారావాహిక కోసం ఎంతగానో పరిశోధన సాగించిన, తన నర్తన ప్రస్థానం మీద ఆంగ్ల పుస్తకాన్ని  వెలువరించిన క్రియారూపిణి. జీవితమంతటిని నర్తనకే కేటాయించిన నాట్య ‘విద్యాభారతి’ యామిని. తన భావవేగం, పదచాలనం, విన్యాస నైపుణ్యం సాటిలేనివి. తనదొక విలక్షణ కళా ఒరవడి. ఆమె అభిప్రాయంలో నృత్యం అత్యంత పవిత్రం. ఆ కళ దైవికమని, ప్రతిభ జతచేరితే అద్భుతాలే సాధ్యమవుతాయనీ, తనకు నృత్యం ఒక వరమని, నర్తించడమే తన ఏకైక వ్యసనమనీ అన్నారామె.

పన్నెండేళ్ల బాల్యంలోనే రంగ ప్రవేశం చేశారు శోభానాయుడు. నృత్యరూపకాలపరంగా దాదాపు అన్ని ప్రధాన పాత్రలనీ పరిపోషించారు. తానూ పద్మశ్రీ యుతురాలు. తనదైన రీతిని అకాడమీని స్థాపించిన, ఎందరెందరికో చక్కని శిక్షణ ఇచ్చిన అపురూప ప్రతిభాశాలి. ‘నృత్యచూడామణి’ బిరుదాన్ని సార్థకం చేసుకున్నారు. ధన్యజీవి.

మూడు నెలల క్రితం రమారమి 1500 మంది కళాకారులతో సాగిన కథక్‌ ‌నృత్య ప్రదర్శన గిన్నీస్‌ ‌రికార్డును సృష్టించింది. ఖజురాహోలో యాభైవ నృత్య ఉత్సవ విశేషం అది. వారంతా ఏకరూప దుస్తుల్లో ఆలయ ఆవరణలో  నృత్యాభినయంతో అందరినీ మెప్పించారు. ఇది మనదైన సంస్కృతికి గర్వకారణం, భావితరాలవారికి ఆదర్శప్రాయం.

ఒకే వేదికమీద పదకొండువేలమంది నర్తించి రికార్డు సృష్టించడమన్నది సంవత్సరం క్రితం సుసాధ్యమైంది. అసోమ్‌లోని గువాహటి నగర మైదానం అక్కడి జానపద నృత్యపక్రియ ‘బిహు’తో కళకళలాడింది. అందులో వివిధ సంప్రదాయ వాయిద్యాలతో సంగీత కళాకారులూ పాల్గొన్నారు.

హస్తముద్రలు, పాదపద్మాల ప్రదర్శిత పక్రియ ‘సత్రియా’. ఇదీ అసోం లోనిదే. హావభావాల సమ్మే ళనం. ఏదైనా సుమనోహర అనుభూతిని ప్రసాది స్తుంది. ప్రకృతిలో మమేకమయ్యేంత తాదాత్మ్యతకు మూలమవుతుంది.

నృత్య, సంగీత రంగాలు రెండింటా సమసామర్థ్య మున్నవారు పద్మా సుబ్రహ్మణ్యం. ఇదే సందర్భంలో భారత ప్రజాస్వామ్య వేదిక అయిన కేంద్ర శాసనసభ అంశాన్ని ప్రస్తావించి తీరాలి. సంప్రదాయాన్ని, ఆధునికతనీ మేళవిస్తూ సరికొత్త పార్లమెంటు భవనం రూపొందడం విదితమే. ప్రారంభోత్సవ సమయంలో ప్రధానం – ‘సువర్ణ రాజదండం’. నాటి రాజులకాలం నుంచి నేడు ప్రజల వరకు అధికార మార్పిడికి సంకేతం. ఆంగ్లేయుల పాలనాకాలం నుంచీ పగ్గాలు అందుకున్న తరుణాన కనిపించిన రూపు. ఆ దండమే శాసనసభాపతి కుర్చీ పక్కన కొలువుతీరింది. ఇంతటి ప్రాధాన్య కల్పనకు సూత్రధారి పద్మా సుబ్రహ్మణ్యమే! ఆమె అభ్యర్థన పర్యవసానంగానే, దండానికి తిరిగి ఆదరణ లభించింది. సంస్కృతి, చరిత్రల గురించి మొదటి నుంచీ తనకు ఉన్న అనురక్తి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసేలా చేసింది. మళ్లీ ప్రాచుర్యం కలిగించాలన్న వినతి. అటు తర్వాత కార్యరూపం ధరించిందన్న మాట.

జాతీయతావాదంతోపాటు స్వేచ్ఛా స్వాతంత్య్ర పిపాస అత్యవసరం. ఈ మేర సమైక్యతా దృష్టికీ మూలం నాట్యకళే! ప్రాంతీయం, దేశీయం, అంతర్జాతీయం – దేని విశిష్టత దానిదే.

సరస్వతీమాతకు సంగీత సాహిత్యాలతోపాటే నాట్యమూ ప్రేమ పూరిత సంతానం. రాగం, తాళం, పల్లవి. అలాగే పదం, నర్తనం.

గీతాలు, కృతులు, కీర్తనలు, ఇతరాలకు నాట్యాభి నయం సముదాత్త వాతావరణాన్ని సృష్టిస్తుంది.

భాషావేషం ఏదయినా

భారతీయులం మనమంతా!

ఒకేమాట మనదంతా

ఒకే పాట మనదంతా

ఒకే బాట మనదంతా

ఒకే కోట మనదంతా!

భారతమాతకు సమర్చనే నర్తన. కళకు, కళాకారునికీ ఉన్న అనుబంధం చందమామ, చకోరం వంటిది. మహాగిరి, మయూరం లాంటిది. మధుర మురళి, మనోగీతిని పోలినది. ‘అందుకో నా పూజ’ కర్త కరుణశ్రీ నివేదించినట్లు –

ఆదిత్యుడవు నీవె, ఆది శక్తివి నీవె

ద్వాదశాత్ముడవీవె, వేదమూర్తివి నీవె

ఆదరింపుము స్వామి! ఆలసించెద వేమి?

నీదు సన్నిధి బాసి నిలువలేదీ ప్రాణి!

ఆ స్వామి నటరాజ. ఆ ప్రాణి కళాకార. దైవీ సంబంధం. భారతీయాత్మ ప్రకారం – నర్తనమే జీవిత సర్వం, జీవన సర్వస్వం.

నృత్య దినోత్సవం దేశీయమైనా, అంతర్జాతీయ మైనా నటరాజ మూర్తికి నృత్యాభివందనం. కళామతల్లి మెడలో దివ్యాభరణం.

నృత్యకళకు విజయోస్తు! కళాస్వరూపులకు శుభమస్తు. భారతీయతలో అంతా శ్రీకరం, ఘనతరం.

జంధ్యాల శరత్‌బాబు

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE