ఎన్నికలు సమీపించడంతో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర చేపట్టారు. తను ఇచ్చిన వాగ్దానాలు, నెరవేర్చినవి ప్రజలకు చెప్పి మరల ఓట్లు వేయాలని అడుగుతున్నారు. కాని ఆయన నవరత్నాల గురించి తప్ప ఇతర హామీల గురించి ప్రస్తావించడం లేదు. 2019 ఎన్నికల ముందు తన పాదయాత్రలోను, ముఖ్యమంత్రిగా పలు జిల్లాల్లో పర్యటన సందర్భంగా ఎన్నో హామీలిచ్చారు. సాగునీటి ప్రాజెక్టుల నుంచి పారిశ్రామిక అభివృద్ధి వరకు, వీధి లైట్ల నుంచి మంచినీటి సమస్య వరకు, విత్తన సరఫరా నుంచి పంట కొనుగోలు వరకు ఒకటేమిటి లెక్కిస్తే వేల కొద్దీ హామీలిచ్చారు. కాని వేటిని ఆయన పరిష్కరించలేదు. సమస్యల పరిష్కారం మాట అటుంచి ప్రజల ఆకాంక్షలు ఆయన పట్టించుకోలేదు. పాలన అంటే నవరత్నాలే అన్నట్లు ప్రవర్తించారు. అందుకే ఆయనకు పర్యటనలో ప్రజల జేజేలు కాక చీత్కారాలు, ఈసడింపులు, తిట్లు ఎదురవుతున్నాయి. ప్రజలు ఆయనను చూసేందుకు కూడా రాలేదు. బస్సు యాత్రలో రోడ్‌షోలకు కూడా డబ్బులు, మద్యం సీసాలు ఇస్తేగాని ఆ కాస్త జనమూ రావడం లేదు. ప్రజలు ఆయనకు కనీసం గౌరవం కూడా ఇవ్వడం లేదు. విద్యార్థులు, యువత పరువు తీసేందుకు వెనుకాడటం లేదు.

కాకినాడ జిల్లాలో అయితే విద్యార్థులు, యువత జగన్‌ ఎదుటే ఇతర పార్టీల నాయకులకు జేజేలు పలకడం వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం తెలిసిందే. ప్రజల డబ్బును వారి ఖాతాల్లోనే జమ చేసి తాను చేస్తున్నది అదే పెద్ద సాయం అని గొప్పగా భావించే జగన్‌కు, జనం నిజం తెలుసుకున్నారని బోధపడుతోంది. ప్రజల్లో ఉన్న ఎంత వ్యతిరేకత ఉందో.. బస్సు యాత్రలో చవి చూశారు. ఆయన తన ట్రేడ్‌ ‌మార్క్ ‌నిర్వికారమైన నవ్వు మాటున అసహనం నింపుకొని, వ్యతిరేక నినాదాలు చేసిన వారిపై కక్ష సాధించుకుంటూ వస్తున్నారు. జగన్‌ను అభిమానించే వారు తగ్గి, ద్వేషించే వారు భారీగా పెరిగారు. మామూలుగా రాజకీయ నాయకుడిపై వ్యతిరేకత ఉండవచ్చేమో కానీ.. అది ద్వేషం స్థాయికి పెంచుకోవడంలో జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి తన రాజకీయం చేశారు. అందుకే విజయవాడలో రాయి విసిరిన సంఘటన పట్ల ప్రజల నుంచి సానుభూతి రాలేదు సరికదా వెటకారంగా మారింది. సానుభూతి కోసం కోడికత్తి కేసులా దీనిని కూడా జగనే కావాలని జరిపించుకున్నట్లు అందరూ నమ్ముతున్నారు.

ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత

వైసీపీ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొం టోంది. ఈ ప్రభుత్వం తమ ఆకాంక్షలు ఏమాత్రం నెరవేర్చలేదని, పైగా తమకు వ్యతిరేకంగా పనిచేసిందని ప్రజలంటున్నారు. అయిదేళ్లలో ఒక్క అభివృద్ధి పనిచేపట్టలేదని, సంక్షేమం పేరుతో డబ్బులు పంపిణీ చేసి ఓట్లు కొనుగోలు చేయడానికి ప్రయత్నించారని ఓటర్ల అభిప్రాయం. పూర్వం నిరంకుశ రాజుల తరహలోనే ప్రస్తుత జగన్‌ ‌పాలన ఉందన్నది అంతటా వినిపిస్తున్న ప్రచారం. అభివృద్ధి జరగకపోవడం, సాగునీటి ప్రాజెక్టుల జోలిక పోకపోవడం, రాష్ట్ర సాగునీటి రంగాన్ని మార్చివేసే పోలవరం ప్రాజెక్టును గాలికి వదిలేయడం, పారిశ్రామిక అభివృద్ధి లేకపోవడం, అమరావతిని నాశనం చేసేందుకు ప్రయత్నించడం, ఉద్యోగాల కల్పనలో వైఫల్యం, నిత్యావసర వస్తువుల ధరలు అదుపులో ఉంచలేకపోవడం, పలుమార్లు కరెంటు ఛార్జీలు పెంచడం, మద్యం అమ్మకాలతో దోపిడీ, ప్రకృతి వనరుల లూటీ, ప్రభుత్వం చేసే అన్ని కార్యక్రమాల్లోను అవినీతి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

రాయలసీమలో వైఎస్‌ ‌వివేకా హత్య కేసు ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారన్న ఆగ్రహం అక్కడి ప్రజల్లో వైసీపీని ఎన్నికల్లో దెబ్బతీసే అంశాలే.

రాజరిక ధోరణిలో జగన్‌ ‌పాలన

వైసీపీ పాలన రాజరిక విధానాలను తలపిస్తూ ఉంది. రాజులు తాము దైవాంశ సంభూ తులమని నమ్మేవారు. వందిమాగధులు వారి చుట్టూ చేరి రాజును ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉంటారు. రాజు మెప్పు పొందిన వారికి కానుకలు లభించేవి. రాజరికం ప్రజాస్వామ్యానికి పూర్తి వ్యతిరేకం. రాజుకు రాజ్యంలోని ప్రకృతి వనరులపై సర్వహక్కులుండేవి. తమకు నచ్చినవారినిగాని లేదా వంశపారం పర్యంగాని వచ్చేవారిని మంత్రులు, సలహాదారులు, ముఖ్య అధికారులగా నియమించుకునేవారు. రాజ్యం ఖజానా తమ సొంత ఖజానాగా వాడుకునేవారు. పన్నులు ఇష్టం వచ్చినట్లు విధించేవారు. ప్రజలకు ఆదాయ వనరులు లేకుండా చేసేవారు. వర్షాధార పంటలను నమ్ముకున్న ప్రజలకు ఎప్పుడూ ఆర్ధిక ఇబ్బందులే. వారికి కొంత దానం చేస్తూ తమను పొగిడించుకునేవారు.తమకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా రాజులు ఆగ్రహించేవారు. వారిని శిక్షకు గురిచేసేవారు. ఇదంతా మధ్యయుగం నాటి పరిస్థితి. ఇప్పుడు ప్రజాస్వామ్యం వచ్చినా అధికారాన్ని వైసీపీ రాజరికంగా మార్చివేసింది. ప్రభుత్వ ఖజానాను ఇష్టం వచ్చినట్లు వాడుకుందంటున్నారు. ఈ అయిదేళ్లలో ముఖ్యమంత్రిని కలసిన ఎమ్మెల్యేలను వేళ్లమీద లెక్కబెట్టవచ్చు. తమ సమస్యలను చెప్పుకుని పరిష్కరించుకుందామని భావించిన ఎమ్మెల్యేలకు నిరాశే మిలిగింది. సమస్యలు పరిష్కరించలేక నియోజకవర్గంలో తిరగలేక వారంతా మొహం చాటేసుకు తిరిగారు. మంత్రులకు స్వతంత్రత లేదు. విపక్షాలను తిట్టడమే మంత్రి పదవులకు అర్హతగా నిర్ణయించారు.వారు ప్రతిపక్షాలను తిట్టడంలో చూపించిన ఉత్సాహం, సమస్యల పరిష్కరించడంలో చూపిస్తే కొంతైనా ప్రజల కష్టాలు తీరేవి.

అధికార దుర్వినియోగం

 వైసీపీ ప్రభుత్వంలో రెవిన్యూ, పోలీసు ఇతర అధికార యంత్రాంగం మొత్తం ముఖ్యమంత్రి, ఆయన ఆనుయాయులకు దాసులుగా మారిపోయిందని వైసీపీ చెప్పిందే చేస్తున్నార విమర్శ ఉంది. భారత రాజ్యాంగం ప్రకారమే చట్టాలు అమలవుతాయి. దేశంలోని 29 రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కూడా రాజ్యాంగం ప్రకారం తయారుచేసిన చట్టాలను మీరకుండా, వాటికి అనుగుణంగానే పాలించాలి. కాని రాష్ట్రంలో ఇవేమీ అయిదు సంవత్సరాలుగా కానరావడం లేదు. ప్రభుత్వం చట్ట విరుద్దమైన జీవోలు జారీచేస్తూ పలుమార్లు ఉన్నత న్యాయస్ధానం చేత చీవాట్లు పెట్టించుకుంది. ఈ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన పలువురు ఉన్నతాధికారులు కోర్టు మెట్లెక్కి బోనులో నిలబడి జైలు శిక్షలు కూడా అనుభవించారు. ఉప ఎన్నికలు, స్ధానిక ఎన్నికల సందర్భంగా ప్రభుత్వానికి సహకరించి, విపక్షాలపై ఆక్రమ కేసులు పెట్టి వేధించడం, వైసీపీ నాయకుల ఒత్తిడితో ఓటరు దొంగ ఐడీల తయారీకి సహకరించడం అవి నిరూపితమై పలువురు అధికారులు ఎన్నికల కమిషన్‌చే చర్యలకు గురికావడం తెలిసిందే. ఇవి కాక ఎన్నో అంశాల్లో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ అధికారులు రాజ్యాంగానికి తూట్లు పొడిచారు.

ఈ అయిదేళ్ల పాలనలో ప్రభుత్వం చేసిన ప్రకృతి దోపిడీకి ప్రభుత్వ యంత్రాంగం అన్ని విధాలుగా సహకరించినట్లు ప్రజలు బహిరంగంగా ఆరోపిస్తూ మండిపడుతున్నారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించిన వారిపై పోలీసులు అక్రమ కేసులు పెట్టడం, దౌర్జన్యం, వేధింపులు, దాడులకు గురైన బాధితులు ఇప్పుడు ఎన్నికలు సమీపించడంతో ఇప్పుడు బహిరంగంగా బయటకు వచ్చి ప్రభుత్వంపై తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వం సీఐడీని జేబు సంస్థగా వాడుకుంది. ప్రభుత్వ విధానాలపై పోరాడుతున్న ప్రతిపక్ష నాయకులపై అవినీతి ఆరోపణలతో కేసులు పెట్టడం, వాటిని నిర్ధారించే సరైన సాక్షాధారాలు కోర్టు ముందు ఉంచకపోవడం తెలిసిన విషయమే.

వనరుల దోపిడి

వైసీపీ ప్రభుత్వం ప్రకృతి వనరులను తీవ్రంగా దోపిడి చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇసుకను, మట్టిని, మైన్స్‌ను ఇష్టం వచ్చిన వారికి కట్టబెడ్టి దోపిడిని ప్రోత్సహించారు. వాగులు, వంకలు, నదులు, కాల్వలలో రాత్రి, పగలనే తేడా లేకుండా ఇసుకను ఇష్టం వచ్చిన రీతిలో పార్టీ నాయకులు తవ్వేసి అమ్మేసుకున్నారు.ఇసుక నూతన విధానం పేరుతో ఆరు నెలల పాటు ఇసుక సరఫరాను నిలిపివేయడం, తర్వాత సరఫరా చేసినా బ్లాక్‌ ‌మార్కెట్‌లోనే ఇసుక లభ్యం కావడంతో నిర్మాణరంగం పూర్తిగా కుదేలైపోయింది. ఈ రంగంపై ఆధారపడ్డ 20 లక్షల మంది కార్మికులు వీధిన పడ్డారు.

ఇసుక దోపిడీ•తో విచ్చలవిడిగా సంపాదించిన వారే ఈ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు. ఇక ప్రభుత్వం చెప్పినట్లు చేసిన పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉద్యోగానికి రాజీనామాలుచేసి పోటీకి దిగడం చూస్తుంటే ఎంత విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం జరిగిందో తెలుస్తుంది.

మద్యంతో సొంత ఆదాయం

 సంక్షేమ పథకాల అమలులో మద్యం నుంచి వచ్చే ఆదాయమే రాష్ట్ర ప్రభుత్వాలకు కీలకంగా మారింది. అయిదేళ్లుగా దానిని సొంత ఆదాయంగా మార్చుకున్న ఘనత వైసీపీ ప్రభుత్వానిదే అంటున్నారు. గతంలో మద్యం వ్యాపారం ప్రైవేటు వ్యక్తులు చేసేవారు. ప్రభుత్వానికి పన్నులు కట్టేవారు. తాము అధికారంలోకి వస్తే మద్యం సరఫరాను క్రమంగా తగ్గిస్తూ అయిదేళ్లలో మొత్తం నిలిపివేసి మద్యం నిషేధించి 2024 ఎన్నికలకు వెళ్తామని వైసీపీ అధినేత 2019 ఎన్నికలకు ముందు మహిళలకు హామీ ఇచ్చారు. కాని హామీని చెత్తబుట్టలో వేశారు. వైసీపీ నాయకులు తయారు చేసిన నాణ్యతలేని మద్యాన్ని రెట్టింపు ధరలకు అమ్ముతూ పేదల ఆరోగ్యం దెబ్బతీస్తున్నారనే ఆరోపణలతో తీవ్రంగా చర్చ జరుగుతోంది. చిన్న బడ్డీకొట్టులో సైతం డిజిటల్‌ ‌పేమెంట్లు జరుగుతుంటే రోజూ కోట్ల చొప్పున వ్యాపారం జరిగే కీలకమైన మద్యం వ్యాపారంలో మాత్రం నగదు వసూలు చేస్తున్నారు.

రైతాంగానికి వేధింపు

వైసీపీ ప్రభుత్వం రైతాంగాన్ని తీవ్రంగా వేధించింది. ఒకవైపు వర్షాభావ పరిస్థితులు, మరోవైపు వరదలు, తుపాన్లు, పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం, తీసుకున్న ధాన్యానికి సకాలంలో డబ్బు చెల్లించకపోవడం, నష్టానికి ధాన్యం అమ్ముకోవడం ఇలా తాము తీవ్రంగా దెబ్బతినడానికి కారణం ఈ ప్రభుత్వ విధానాలే అని రైతాంగం ఊసురుమంటోంది. కనీసం ఒక్క సాగు ప్రాజెక్టును అయినా పూర్తిచేయాలన్న సంకల్పం ఈ ప్రభుత్వానికి లేకపోడమే కరవుకు కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. ఇక నిరుద్యోగుల సంగతి సరేసరి. ఇంటికి ఒకరిద్దరు చదువుకున్న నిరుద్యోగులున్నారు. డీఎస్‌సి భర్తీ చేయకపోవడం, తీవ్ర విమర్శల తర్వాత పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వడం, జాబ్‌ ‌క్యాలెండర్‌ను అమలు చేయకపోవడంతో నిరుద్యో గులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. కొత్త పరిశ్రమలు రాకపోవడం, ఉన్నవి వెళ్లిపోవడం, సాఫ్ట్‌వేర్‌ ‌కంపెనీలు ఏపీకి వచ్చేందుకు విముఖత చూపడం వంటివి ఈ ప్రభుత్వంపట్ల యువత, వారి తల్లిదండ్రులకు తీవ్ర విముఖతను కలిగించాయి. పోస్ట్ ‌గ్రాడ్యుయేషన్‌ ‌చదివిన వారికి ఫీజు రీయింబర్స్ ‌మెంట్‌ ‌నిలిపివేయడంతో ఫీజులు చెల్లించలేని వేలాది మంది విద్యార్థులు సర్టిఫికెట్లను కళాశాలల్లోనే వదిలేశారు. అన్నివర్గాలు ప్రభుత్వ బాధితులుగానే ఉన్నారు. వీరంతా ఇప్పుడు ఈ రాజరిక వ్యవస్థను కూల్చేయాలని నిర్ణయించుకున్నారు.

టిఎన్‌. ‌భూషణ్‌

About Author

By editor

Twitter
YOUTUBE