సంపాదకీయం
శాలివాహన 1946 శ్రీ క్రోధి చైత్ర బహుళ షష్ఠి – 29 ఏప్రిల్ 2024, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
ప్రతి ఎన్నికలకి కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేస్తుంది. ఆ పార్టీ ప్రభుత్వానికి మాత్రం వాటితో సంబంధం ఉండదు. గరీబీ హఠావో అన్న ఆ పార్టీ నినాదం భారత్‌ను దగా చేసినట్టు మరే దేశంలోను మరే రాజకీయ నినాదమూ చేయలేదు. కాంగ్రెస్ సిద్ధాంతాలంటే పంచకూళ్ల కషాయమే. ఇందిర కాలంలో కాంగ్రెస్ విధానాల మీద సీపీఐ ముద్ర సుస్పష్టం. విద్య మీద సీపీఐ మిగిల్చిన మరక ఇప్పటికీ ఉంది. దానిని చెరిపివేయడానికి ప్రయత్నిస్తే కమ్యూనిస్టుల కంటే కాంగ్రెస్ పార్టీయే ఎక్కువ కుమిలిపోతోంది. ఈ ఏప్రిల్ 7న విడుదలైన కాంగ్రెస్ మేనిఫెస్టో న్యాయ్‌పత్ర్ కమ్యూనిస్టుల ఎర్ర పైత్యాన్నీ, మైనారిటీ ఆకుపచ్చ ఉన్మాదాన్నీ నింపుకుని వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ మేనిఫెస్టో మీద తీవ్రస్థాయిలోనే విమర్శలు చేయడం అందుకే. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అయితే, ఇది భారత ఎన్నికల మేనిఫెస్టోనా? లేకపోతే పాకిస్తాన్ ఎన్నికల కోసం కాంగ్రెస్ తయారు చేసిన మేనిఫెస్టోనా అని ప్రశ్నించారు. వామపక్షాల శుష్క నినాదాలు, సామాజికన్యాయం పేరుతో ముస్లిం బుజ్జగింపు ఈ మేనిఫెస్టోలో సుస్పష్టం.
ఆస్తుల సర్వే పేరుతో కాంగ్రెస్ మీ సంపదను ఎక్కువ మంది పిల్లలు ఉండేవాళ్లకీ, చొరబాటుదారులకీ కట్టబెడుతుంది, తస్మాత్ జాగ్రత్త అనీ; మన కుటుంబాల స్త్రీ ధనాన్ని దోచుకుంటారనీ, మంగళసూత్రాలు కూడా లాక్కుంటారనీ మోదీ రాజస్థాన్ (బాన్స్‌వార్), ఉత్తరప్రదేశ్ (అలీగఢ్) సభలలో తీవ్ర విమర్శలే చేశారు. ఈ విమర్శల మీద కాంగ్రెస్ వారు, కమ్యూనిస్టులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దేశంలో గత కొద్దికాలంగా వక్ఫ్ ఆస్తుల పేరుతో సాగుతున్న భూజిహాద్‌ను దృష్టిలో పెట్టుకునే ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులోని 1500 ఏళ్ల నాటి మానెదియావల్లి చంద్రశేఖరస్వామి ఆలయం (తిరుచ్చి జిల్లా, తిరుచెంథురై), దానికి చెందిన 369 ఎకరాలు వక్ఫ్ బోర్డుకు చెందుతాయంటూ అధికారులు వెల్లడిరచడం ఆ మధ్య సంచలనం కాలేదా? యథా ప్రకారం ఈసారి కూడా సమన్యాయం పల్లవి అందుకుంది శతాధిక వత్సరాల పార్టీ. ఈ దేశ సంపద మీద మొదటి హక్కు ముస్లింలదేనంటూ డిసెంబర్, 2006లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ సాక్షాత్తు జాతీయ అభివృద్ధి మండలిలో చేసిన వ్యాఖ్యకు అనుగుణంగా మాత్రమే ఆ పార్టీ సమన్యాయం ఉంటుంది. తన విమర్శకు ప్రధాని మన్మోహన్ వ్యాఖ్యనే ఆధారంగా చూపుతున్నారు.
న్యాయ్‌పత్ర్‌లోని మరొక చర్చనీయాంశం న్యాయవ్యవస్థ గురించి ఇచ్చిన హామీలు, ఒలకబోసిన ప్రేమ. ‘స్వేచ్ఛ కలిగిన న్యాయవ్యవస్థ మాత్రమే భారత రాజ్యాంగాన్ని రక్షించగలుగుతుంది’ అంటున్నది కాంగ్రెస్ మేనిఫెస్టో. పదేళ్ల నుంచి అస్తవ్యస్త పాలన సాగుతోందని, బీజేపీ/ఎన్‌డీఏ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని, దీని నుంచి రక్షణకు ప్రతి సాధారణ పౌరుడు ఆశగా చూసేది న్యాయవ్యవస్థ వైపేనని భాష్యం కూడా వెలగబెట్టింది. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో 14 మంది న్యాయమూర్తులను ఒక్క కలం పోటుతో మార్చేసిన చరిత్ర కలిగిన పార్టీ న్యాయవ్యవస్థ ఔన్నత్యం నిలబెట్టడం సాధ్యమేనా? ఉన్నత స్థాయి న్యాయవ్యవస్థలో ఎస్‌సీ, ఎస్‌టీ, మహిళ, మైనారిటీ వర్గాల న్యాయమూర్తులకు ప్రాధాన్యం ఇస్తామని కూడా 48 పేజీల కాంగ్రెస్ మేనిఫెస్టో పేర్కొన్నది. కానీ దీని ప్రధాన ఉద్దేశం, ముస్లింలను న్యాయవ్యవస్థలోకి చొప్పించడమేనని వేరే చెప్పనక్కరలేదు. కొన్ని మైనారిటీ వర్గాల వారి పర్సనల్ చట్టాలను సంస్కరించవలసిన అవసరం ఉందని కాంగ్రెస్ అంగీకరించింది. కానీ ఆ సాహసం ఆ పార్టీ చేయగలదా? కానీ అలాంటి సంస్కరణ అవసరం గురించి మోదీ చెబితే మతోన్మాదం అయిపోతున్నది. త్రిపుల్ తలాక్‌తో ఆ వర్గం మహిళలకు దారుణమైన అన్యాయం జరుగుతున్నదనే కదా మోదీ దానిని రద్దు చేశారు. బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన సంగతి బహుశా కాంగ్రెస్ మరచిపోయినట్టే ఉంది. అందుకే భారతీయ ఓటర్లను మోదీ హెచ్చరించవలసి వచ్చింది. అసలు న్యాయవ్యవస్థను సంస్కరించాలన్న కాంగ్రెస్ నినాదమే దగా.
ముస్లిం చట్టాల పరిధిలో వివాదాలను పరిష్కరించేందుకు దేశంలోని ప్రతి జిల్లాలోను దారుల్ ఖాజా (షరియా కోర్టు) ఏర్పాటు చేస్తామని జూలై 2018లోనే అఖిల భారత ముస్లిం పర్సనల్ బోర్డ్ వెల్లడిరచింది. అలాంటివి అప్పటికే ఉత్తరప్రదేశ్‌లో నలభయ్ పనిచేస్తున్న సంగతిని కూడా బోర్డ్ దాచి పెట్టలేదు. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రశ్నించగలదా? వారసత్వ హక్కు విషయంలో షరియాను గౌరవించవచ్చునని కేరళ సీపీఎం ప్రభుత్వం డిసెంబర్ 13, 2022న సాక్షాత్తు సుప్రీం కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో పేర్కొన్నది. షరియాకు సంబంధించి అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం ఒకటి ఉండగానే ఆ పార్టీలు ఇలాంటి వాదనలు చేయడం ఎంత విడ్డూరం? షరియా కోర్టులు ఇచ్చే తీర్పులకు చట్టబద్ధత లేదని 2014లో సుప్రీంకోర్టు ప్రకటించింది. 2005లో విశ్వలోచన్ మదన్ అనే ఢల్లీి న్యాయవాది వేసిన వ్యాజ్యం ఫలితమది. ప్రభుత్వ చట్టాలను షరియా కోర్టులు తగ్గించలేవని, వ్యక్తుల స్వేచ్ఛను హరించే విధంగా ఉంటే ఫత్వాలు చెల్లవని కూడా సమున్నత న్యాయస్థానం చెప్పింది.
కోర్టులు ఏం చెప్పినా, వాస్తవాలు ఎలా ఉన్నా, ప్రపంచ పరిణామాలు ఏం చెబుతున్నా మైనారిటీల బుజ్జగింపునే కాంగ్రెస్ నమ్ముకోదలచింది. సామాజిక న్యాయం పేరుతో మైనారిటీల బుజ్జగింపును కొనసాగించడమే దాని విధానం. మోదీ వ్యాఖ్యల వెనుక ఉన్నది ఈ ప్రమాదం గురించిన హెచ్చరిక మాత్రమే. కేరళలో కాంగ్రెస్‌కు ఎస్‌డీపీఐ (నిషిద్ధ పీఎఫ్‌ఐ తానులో ముక్క) చాటు మద్దతు ఉంది. ముస్లింలీగ్ మద్దతు సరేసరి. ఇండీ కూటమి ఉద్దేశం మళ్లీ యూపీఏ కాలం నాటి ముస్లిం మతోన్మాదానికి రాజమార్గం చూపడమే. కాబట్టి మోదీ హెచ్చరిక శిరోధార్యం.