(భజగోవిందం – 2)

‘మూఢ జహీహి ధనాగమతృష్ణాం

కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం

యల్లభసే నిజకర్మోపాత్తం

విత్తం తేన వినోదయచిత్తం’

‘మూఢుడా! ధనం మీద విపరీతమైన అపేక్షను విడిచిపెట్టు. ధనాపేక్ష స్థానంలో మనసులో పుట్టే కోర్కెల మూలాలను మంచి ఆలోచనలవైపు మళ్లించు. నీవు చేసే పని వలన ఏది నీవు ధర్మబద్ధంగా సంపాదిస్తావో అదే నీకు ఆనందాన్నిస్తుంది. దానితోనే నీవు సంతృప్తి పడు!’ అంటారు శంకరులు.

ఇది ఈనాటి యుగ మనోప్రవృత్తులకు చాలా చక్కగా సరిపోతుంది. ఈ శ్లోకం భావాన్ని బాగా అర్థం చేసుకొని ఆచరిస్తే ఈ దేశంలో పేదరికం ఉండదు. ప్రకృతి సంపద అందరికీ కొంతమేరైనా సమానంగా పంపిణీ అవుతుంది. ఎందుకంటే ఈనాడు ప్రతీ రంగంలోను ధన సంపాదనే ముఖ్య ఆశయమైపోయింది. శీఘ్ర ఫలితాలు, త్వరిత గతిన ధనార్జన ప్రాథమిక లక్ష్యంగా సమాజం సాగు తోంది. సమష్టి శ్రేయస్సనే ఆశయాన్ని అధఃపాతా ళానికి తొక్కేసారు. వ్యాపారస్థులు, వాణిజ్యవేత్తలు, రాజకీయ నాయకులు, చలనచిత్ర నటులు, నిర్మాతలు, అధికారులు ` అందరిదీ ఒకటే లక్ష్యం. ఈజీ మనీ, ఎర్లీ మనీ. ఎవరూ తన లాభాపేక్షను, ఆదాయం మొత్తాన్ని తగ్గించుకొనే ఆలోచన చేయడం లేదు. విపత్తులొచ్చినప్పుడు జోలె పట్టుకొని సినీ నటులు, ఇతరులు వీధిల్లోకి వెళ్తామంటారు తప్ప, తమ బీరువాల్లో మూలుగుతున్న మూటల్ని బయటకు తీయరు. సామాన్యుని వినోద సాధనమైన సినిమా టిక్కెట్లు ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వాల్ని పరిస్థితుల్ని చక్కదిద్దమంటారుగాని వాళ్ల పారితోషికాల్ని, ఆదాయాల్ని తగ్గించుకొనడానికి ముందుకురారు. వాణిజ్య వేత్తలు, పారిశ్రామిక వేత్తలు చాలామంది బ్యాంకుల్ని ముంచేసి విదేశాలకు పారిపోతారు తప్పా, విలాసాలు తగ్గించడానికి ఒప్పుకోరు. వ్యవస్థల నిర్వాహణ సూత్రాల్లో వాళ్ల ఆదాయానికి పెద్ద పీట వేయడమే ఈ పరిస్థితికి కారణం. శంకరులు ఈ విషమ స్థితిని ఎంతో ముందుగా పసిగట్టి ధనంమీద మితిమీరిన ఆశను వదలమన్నారు.

ధనాన్ని వదిలేస్తే జోగి అవుతాడు ` ధనాశను వదిలేస్తే యోగి అవుతాడు.  ‘యోగస్తు కర్మకౌశలం’ ` సరైన కౌశలంతో కర్మను నిర్వహించడమే నిజమైన యోగం`ధనం లేనిదే ఎంత కౌశలం ఉన్నా ఏమీ చెయ్యలేం. ఈ శ్లోకంలో శంకరుల బోధ ఎంతో ప్రయోగాత్మకమైంది, ప్రయోజనాత్మకమైంది. ఈనాటి భారతీయ సమాజంలో అడుగడుగున ఒక వైరుధ్యం కనిపిస్తుంది. ఇంత గొప్ప సూత్రాలూ, భాష్యాలూ, భావాలతో నిండిన ఆధ్యాత్మిక సంపద ఉన్నప్పటికీ మాన్యులుగా చలామణి అవుతున్న చాలా మంది సామాన్యులకు ఆదర్శంగా నిలవలేక పోతున్నారు.

ఒక్కోసారి భగవద్గీతను బోధించే ఉపన్యాస కేసరుడు సంయమనం పాటించడు. సహనాన్ని సమత్వ దృష్టిని ప్రదర్శించలేడు. వేదవేదాంగాల్ని అధ్యయనం చేసి ధారా ప్రవాహంగా శ్లోకాలు వల్లించే పండితోత్తముడు మానవులందరూ సమానంకాదని వాదిస్తుంటాడు. ప్రజాసేవే మా జీవిత లక్ష్యం అని ప్రకటించే రాజకీయ నాయకులు, వారిని అనుకరించే అధికార గణం అవినీతికి పాల్పడకుండా నిగ్రహించు కోలేకపోతున్నారు. సినిమాల్లో ఎన్నో నీతి కబుర్లు వల్లెవేసే నటులు జీవితంలో వాటిని కనీసంగా కూడా పాటించరు. ఎందుకీ వైరుధ్యం? సనాతన ధర్మానికి వారసులుగా ఉన్న మనం, మహనీయుల ధర్మబోధ లను ప్రక్కకుతోసి ప్రక్కదారులు ఎందుకు పడుతున్నాం? ఇది తీవ్రంగా ఎవరికి వారు వేసుకోవల్సిన ప్రశ్న! శంకరుల తాత్త్విక అంతరంగంలోకి తొంగి చూడక పోవడమే ఈ దుస్థితికి కారణం.

మనందరికి ఈ జానపద కథ తెల్సిందే! ఒక పండితుడు తన సాహితీ నిపుణతతో రాజుని మెప్పిస్తాడు. రాజు కదా! మీకేమి కావాలో కోరుకో అన్నాడు పండితుడ్ని. అప్పటికే సకల సౌకర్యాలు అనుభవిస్తున్న ఆ పండితుడికి, భూమి మీద ఆధిపత్యం ఉంటే సమాజంలో గౌరవం ఉంటుందనే భావన కలిగి కొంత భూమిని దానంగా ఇమ్మంటాడు. ఎంత భూమి ఇవ్వాలో రాజుకి తట్టలేదు. ఎంత భూమి కోరాలో పండితుడికి తోచలేదు. ఈనాడు వందల వేల ఎకరాలు దానంగా ఇస్తున్న ప్రభుత్వా ల్లాగ, తీసుకుంటున్న కార్పొరేట్‌ కంపెనీల్లా ఉంది పరిస్థితి. ఈ అనిశ్చిత పరిస్థితికి పరిష్కారంగా రాజు ఏమన్నాడంటే ‘‘పండితోత్తమా! మీ కవిత్వంతో నన్నెంతో రంజింపచేసారు. నా ఆనందానికి అవధు ల్లేవు. ఇంత భూమి ఇస్తే సరిపోతుందని నేను నిర్ణ యించలేకపోతున్నాను. కాబట్టి సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీరు నడయాడిన భూతల మంతా మీదే. మీ వెంట ఉండే మా రాజ్యాధికారులు అక్కడికక్కడ మీకు రాసిస్తారు’ అని చెప్పాడు. మర్నాడు నడక ప్రారంభించాడు పండితుడు.

ఎదురుగా ఎల్లలు లేని భూమి`కొండలు, కోనలు, నదులు, నదాలు శోభాయమానంగా, మనోహరంగా ఎకరం తర్వాత ఎకరం ఆ పండితుని ఆకర్షిస్తున్నాయి. భూమిని ఎకరంగా కొలవగలం ` కోరికను నికరంగా కొలవలేం. పండితుని నడక పరుగయింది. భోజన సమయాన్ని కూడా భూమిగా మార్చుకోవాలను కున్నాడు. దాహం తీర్చుకోవడానికి ఆగి నీళ్లు తాగితే, కొంత భూమికి నీళ్లు వదులు కోవాల్సివస్తుందను కున్నాడు. ఎక్కడా పరుగు ఆపలేదు. కోరికల వేగాన్ని గుండె తట్టుకోలేకపోయింది. సూర్యాస్తమయానికి పండితుని అస్తమయం కూడా దగ్గర పడిరది. ఆఖరి శ్వాస వదిలేలోపు రాజ్యోద్యోగులు ఎంత భూమి రాసివ్వాలని అడిగారు. ‘ఆరడుగులు’ అంటూ కన్ను మూసాడు పండితుడు.

వందలాది ఎకరాలు ఆక్రమించుకొనే నాయకులు, అక్రమ పద్ధతుల్లో మితిమీరిన వర్తక సామ్రాజ్యాల్ని ఏర్పాటు చేస్తున్న వ్యాపారస్తులు, అవినీతికి పాల్పడు తున్న అధికారులు, ఆకాశాన్నంటే ధరలకు ఫ్లాట్‌లు, ప్లాటులు అమ్ముతున్న రియల్టర్స్‌, టన్నుల కొద్దీ నీతులు ఇతరులకు చెపుతూ తాము మాత్రం పాటించక్కర్లేదను కొనే ప్రముఖులూ! ఒక్కసారి శంకరుల బోధ గురించి ఆలోచించండి ` మితిమీరిన ధన సంపాదన మీద దృష్టి ఎందుకు పెట్టరాదన్నది సులభంగానే బోధపడుతుంది.

ఈ సందర్భంలో మహాత్ముడు చెప్పిన మాట గుర్తు చేసుకుందాం ‘‘ుష్ట్రవతీవ ఱం వఅశీబస్త్రష్ట్ర శీఅ ్‌ష్ట్రఱం జూశ్రీaఅవ్‌ టశీతీ వఙవతీవ శీఅవఃం అవవసం, పబ్‌ అశ్‌ీ టశీతీ వఙవతీవ శీఅవఃం స్త్రతీవవసం’’.అమెరికన్‌ రచయిత హెన్రీ డేవిడ్‌ థోరో ‘‘ుష్ట్రa్‌ ఎaఅ ఱం ్‌ష్ట్రవ తీఱషష్ట్రవర్‌ షష్ట్రశీంవ జూశ్రీవaంబతీవం aతీవ ్‌ష్ట్రవ షష్ట్రవaజూవర్‌’’ అంటాడు. మనందరం నిరాడంబర మైన కోరికలు కలిగిన సంపన్నులుగా జీవించడానికి ప్రయత్నిద్దాం. అదే శంకరులు ఆశించినది.

– సమకాలీన వ్యాఖ్య :

డా. దీర్ఘాసి విజయభాస్కర్‌

By editor

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram