నవంబర్‌ 19 కార్తీక పౌర్ణమి

దీపం నిత్య ఆరాధన విశేషం కాగా కార్తీక దీపం, అందునా కార్తీక పౌర్ణమి దీపారాధనను సర్వపాపహరం, సకలార్థ సాధకంగా చెబుతారు. హరిహరులకు ప్రీతిపాత్రమైన కార్తీకమాసంలో దైవసన్నిధిలో ఒక్కసారి దీపం వెలిగించినా పాపనివారణ అవుతుందని శాస్త్ర పురాణాలు చెబుతున్నాయి. కార్తీక పౌర్ణమి నాడు వెయ్యి లేదా అంతకంటే ఎక్కువ వత్తులను (గుత్తి వత్తులను) ఆలయాలలో, తులసికోటల వద్ద వెలిగించడం ఆచారంగా వస్తోంది.

దీపం జ్ఞానానికి సంకేతం. అజ్ఞానం, నిర్లక్ష్యం అనే చీకటిని పోగొడుతుంది. పరిసరాలను శక్తిమంతం చేస్తుంది. దీపారాధనలో ప్రాపంచిక పరిజ్ఞానం దాగి ఉందని చెబుతారు. తులసీపూజ, తిలకధారణ, నామ సంకీర్తనంతటిది దీప ప్రజ్వలనం. దీపం పవిత్రమైనదే కాదు. దాని దర్శనంతో ప్రశాంతత కలుగుతుంది. దీపాన్ని లక్ష్మీదేవి చిరునవ్వులతో పోలుస్తారు. దీపాలతో కళకళలాడే లోగిళ్లు సకల సౌభాగ్యాలకు నెలవులని, దీపాన్ని వెలిగించి పూజిస్తే త్రిశక్తులతో పాటు త్రిమూర్తులను అర్చించినట్లేనని, దీపం వెలిగించిన వారు విద్యావంతులు, జ్ఞానవంతులు, ఆయుష్మంతులు అవుతారని, మోక్షాన్ని పొందుతారని పెద్దలు చెబుతారు.

అగ్ని సంబంధమైన కృత్తిక నక్షత్రం ప్రధానం కనుక ఈ మాసంలో దీపాలు వెలిగించడం సదాచారం. భారతీయ సంస్కృతిలో తొలి నుంచి అగ్ని ఆరాధన ఉండగా, ఈ మాసంలో అది అత్యంత ప్రధానమైంది. ఈ మాసంలో దేవతలు సయితం భువికి దిగివచ్చి దీపారాధన చేస్తారట. లోకంలోని సమస్త ప్రాణుల హితం కోసం, వాటికి కృతజ్ఞతలు చెప్పేందుకు కార్తీక పౌర్ణమి నాడు దీపం పెట్టాలని పెద్దలు చెబుతారు. ఆనాడు ఊళ్లలో చేసే దీపారాధన కాశీలో దీపం వెలిగించినంత పుణ్యమని విశ్వాసం. దీపారాధనకు సంబంధించి కార్తీక మాసానికి, ఈ నెలలోని పూర్ణిమకు మరింత ప్రాధాన్యం ఉంది. ఆనాడు తప్పనిసరిగా దీపాలు పెట్టడం సంప్రదాయం. దామోదరుడిని కానీ, ఉమాదేవీ సహిత త్య్రంబక మూర్తిని కానీ ఆవాహన చేస్తారు. దీపదర్శనంలో మానవులకే కాక సృష్టిలోని సకల జీవరాశి పాప పరిహారం కావాలని ఆకాంక్షిస్తారు.

‘కీటా: పతంగా: మశకాశ్చ వృక్షా:జలేస్థలే యే నివసంతి జీవా:

దృష్ట్యా ప్రదీపం నచ జన్మభాగిన: భవన్తి నిత్యం శ్వపచాహి విప్రా:’ ఈ దీప(జ్వాలా)దర్శనంతో జనుల పాపాలే కాక కీటకాలు, పక్షులు, దోమలు, వృక్షాల జన్మనివృత్తి కావాలి. నీటిలోని చేపలు, ఇతర జలచరాలు, ఇతర జంతుజాలం పాపనివృత్తి కావాలి’ అని భావం.

కార్తీక పున్నమికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ‘దేవ దీపావళి’గా వ్యవహరించే ఆ రోజునే పరమ శివుడు త్రిపురాసురులను సంహరించారు. క్షీరసాగర మథనంలో పుట్టిన హాలాహలాన్ని లోకహితం కోసం శివుడు సేవించి కంఠంలో నిలిపినది ఈ రోజే. ఆనాడే విష్ణువు వేదోద్ధరణకు మత్స్యావతారం దాల్చారు. బృందాదేవి తులసీ మొక్కగా అవతరిం చారు. కార్తికేయుని, గురునానక్‌ జయంతి కూడా ఆరోజే. కార్తీక పున్నమి రాధాకృష్ణులకు అత్యంత ఇష్టమైనదిగా పేర్కొంటారు. కృష్ణ భక్తులు ‘రాసపూర్ణిమ’ ఉత్సవం జరుపుకుంటారు. ఆషాఢ పూర్ణిమ నాడు ప్రారంభించిన చాతుర్మాస్య దీక్షను కార్తీక పౌర్ణమి నాడు విరమిస్తారు. మహారాష్ట్ర ప్రాంతవాసులు కేశబంధన గౌరీవ్రతం చేస్తారు.

కార్తీక పౌర్ణమి నాడు ఇళ్లలో, ఆలయాలలో ఆవునేతితో దీపాలను వెలిగిస్తారు. ఈ దీపోత్సవా లతో పాటు శివాలయాలలో జ్వాలతోరణం ప్రత్యేక ఉత్సవంగా నిర్వహిస్తారు. దీని దర్శనం అనంత పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. పౌర్ణమి నాటి రాత్రి అరటి దొప్పలలో దీపాలను ఉంచి నీటిలో వదులుతారు. క్షేత్రదర్శనం తరువాత నదీదేవలతకు దీపం వెలిగించి హారతి ఇస్తారు.

దీపదానం

అజ్ఞానాంధకారాన్ని తొలగించే జ్ఞాపక శక్తికి ప్రతీకైన దీపాన్ని దానం చేయడం వల్ల జ్ఞానం, ఆయుర్వృద్ధి, విద్య, సకల భోగాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. కార్తీకంలో చేసే దానాలలో దీపదానం ప్రధానం, శ్రేష్టమైనది. దీపదానం వల్ల వెయ్యి సోయయాగాలు, అగ్నిష్టోమ యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుందట. కార్తీక పున్నమి నాడు కార్తీక దీపాల నోము నోస్తారు. ఇది మూడు సంవత్సరాల పాటు కొనసాగించాల్సిన నోము. ఆ రోజున దీపదానం చేస్తారు. బియ్యం పిండితో చలిమిడి చేసి, దానిలో వత్తివేసి వెలుగుతున్న దీపాన్ని దానం చేస్తారు. దానితో పాటు ఉసిరికాయ దానం చేస్తే దారిద్య్రం తొలగిపోతుందని భావిస్తారు.

అరుణాచలేశ్వరుడి మహాదీపం

తమిళనాడులోని అరుణాచలంపై అగ్నిలింగంగా వెలుగొందుతున్న ఆదిదేవుడి ఉత్సవాలలో కార్తీక పౌర్ణమి నాటి దీపారాధన అత్యంత ప్రధానమైంది. ఆ రోజు వేకువజామున ఆలయంలో భంగీదీపం, సాయంత్రం ఆరు గంటలకు కొండపై మహాదీపం వెలిగిస్తారు. శిఖరాగ్ర భాగంలో పెద్ద రాతిపై గల భారీ ప్రమిదలో భారీ పరిమాణంలో నూనె పోసి భారీ వత్తిని వెలిగిస్తారు. మహాజ్వాలగా ప్రకాశించే దానిని దర్శించేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. తిరుమలేశుడు దేవేరులతో కలసి అరుణాచలేశ్వరుడి మహాజ్యోతిని దర్శిస్తాడట. హిమాలయాల గుహల్లోని తాపసులు దానిని సందర్శించి పరవశులవుతారట. కార్తీకజ్యోతి విశిష్టతకు వీటిని నిదర్శనంగా చెబుతారు. కార్తీక మాసంలో కృత్తికా నక్షత్ర వేళ అరుణగిరిపై దర్శనమిస్తానని పరమేశ్వరుడు భక్తులకు అభయమిచ్చారట. అందుకు భక్తిపూర్వక కృతజ్ఞతతో ఈ మహాదీపోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ క్షేత్రంలో కార్తీక, చైత్ర పౌర్ణమి నాడు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆలయం రాజగోపురం ఎదురుగా ఆ రెండు రోజులూ పెద్ద మంటలు వేయడం సంప్రదాయం. అదే సమయంలో స్వామివారిని గిరి వలయ మార్గంలో ఊరేగించడం విశేషం. నిత్యం అరుణగిరి ప్రదక్షిణలు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా పౌర్ణమి నాడు, అందులోనూ కార్తీకపున్నమి నాటి ప్రదక్షిణను మిన్నగా పరిగణిస్తారు. తిరుమణ్ణాలమలై కార్తీక దీపాలకు ప్రసిద్ధి. ఈ మాసమంతా దీపాలు వెలిగించినప్పటికీ కార్తీక పున్నమి నాడు ‘దీప పండుగ’ను మరింత వైభవంగా జరుపుకుంటారు.

శ్రీశైలేశుడికి జ్వాలాతోరణం

కార్తీక పౌర్ణమి నాడు శివాలయాలలో నిర్వహించే జ్వాలాతోరణాన్ని సర్వపాపహరంగా భావిస్తారు. శ్రీశైల క్షేత్రంలో కార్తీక జ్వాలాతోరణ మహోత్సవం నయనానందదాయకం. పౌర్ణమి నాడు సంధ్యా సమయంలో గంగాధర మండపం వద్దకు భక్తులు భారీ సంఖ్యలో చేరతారు. జ్వాలాతోరణాన్ని గడ్డితో తయారు చేయడం సాధారణం కాగా అక్కడ మాత్రం పత్తిదారాలతో రూపొందిస్తారు. దేవాంగులు ఏడాది పాటు పత్తిని వడికి దారం తయారు చేస్తారు. ఆ దారపు ఉండలను పున్నమి నాటి ఉదయం శిరస్సున దాల్చి మంగళవాయిద్యాల నడుమ ఆలయానికి తీసుకువచ్చి భ్రమరాంబ మల్లికార్జునుల సన్నిధిలో పూజాదికాలు చేస్తారు. వాటిని ఆవునెయ్యి, నువ్వుల నూనెలో నానబెట్టి, సాయం సమయంలో ఆలయం వద్ద స్తంభాలకు తడిగా ఉన్న దారాలను కట్టి వెలిగిస్తారు. త్రిపురాసుర సంహరం తరువాత సతీదేవి పరమేశ్వరుడికి జ్వాలాతోరణం కింద దిష్టి తీశారని పురాణ కథనం. నాటినుంచి శైవ క్షేత్రాలలో జ్వాలాతోరణం సంప్రదాయం వచ్చిందని చెబుతారు. జ్వాలాతోరణ భస్మాన్ని భక్తులు ప్రీతిపాత్రంగా నుదుటిన ధరిస్తారు. జ్వాలాతోరణంలో కాలగా మిగిలిన గడ్డిని పశుగ్రాసంలో కలుపుకుంటే మంచిదని భావిస్తారు.

ప్రశాంతతను, చిరుచలిని, విబూతి పరిమళాలను వెంటబెట్టుకు వచ్చిన కార్తీకంలో హరిహరాలయాలలో పున్నమి రేయిలో నక్షత్ర దీపోత్సవ దర్శనం పుణ్యప్రదమని పెద్దట మాట.

– డా॥ ఆరవల్లి జగన్నాథస్వామి

సీనియర్‌ జర్నలిస్ట్‌

By editor

Twitter
Instagram