మహాభారతం విశ్వవిజ్ఞాన కోశమని చెప్పదగిన మహా కావ్యము. అందులో చెప్పని విషయమేదియు లేదనేందుకు ‘యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తిన తత్క్వచిత్త’ అనే వ్యాసవాక్యమే తార్కాణము. మహాభారతమును ఆంధ్రీకరింప మొదలిడిన వారిలో ప్రథముడును, ఆంధ్రమునకు ఆదికవి నన్నయ భారతమును ‘ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్ర మనియు ఆధ్యాత్మవిదులు వేదాంతమనియు, నీతి విచక్షణులు నీతిశాస్త్రమనియు, కవిపుంగవులు మహాకావ్యమనియు, లాక్షణికులు బహులక్ష్య సంగ్రహమనియు, పౌరాణికులు బహుపురాణ సముఛ్చయమనియు, ఇతిహాసికులు ఇహసమనియు భావించునట్లుగను, విశ్వజనీనమై వెలుగొందునట్లు పరగుచుండునట్లుగను వ్యాస మహర్షి రచించియుండెను’అని ఆది పర్వారంభంలో తెలిపారు. అట్లే తిక్కన సోమయాజియు, వ్యాసుడు ధర్మాద్వైతస్థితితో ధార వాఖ్యమైన, లేఖ్యమైన ఆమ్నాయమును రచించెదనని విరాటపర్వాదిలో ని తెలిపారు. భారతసందేశం విశ్వజనీనం, సార్వకాలికమని, ధర్మ ప్రధామనియు, సర్వజనోద్ధిష్టమని వ్యక్తమవుచున్నది.
భారతమునందలి కథ సర్వవిది తమైనట్టిది. స్థూలముగా చూచినచో అది కౌరవ పాండవులకు, కురు క్షేత్రసంగ్రామానికి సంబంధించినదిగా కనిపించును. పాండవులు ధర్మమునకును, కౌరవులు అధర్మమునకును ప్రతీకలు. వారికి జరిగిన యుద్ధమును ధర్మా ధర్మములకు జరిగిన యుద్ధముగా భావింపవచ్చును. మానవుల నిత్యజీవితమున కూడ ధ్మధర్మాలకు సంఘర్షణము ‘జరుగుతుంటుంది. అధర్మము తాత్కాలికముగా అభ్యుదయం పొందినట్లు కనిపించినప్పటికీ చివరికి వినాశము పొందితీరును.
ఉద్యోగ పర్వ ప్రథమాశ్వాసంలో శ్రీకృష్ణుడు సంజయునితో
‘ధర్మజుండు ధర్మతరు వర్జునుడు ఘన
స్కంద మనిల సుతుడు శా•, కవల
పుష్పఫలము లేను భూసురులును
వేదములు, దదీయమై నమూలవయము
రోషమయ మహాతరువు సుయోధను
డురు స్కంద మందులోన కర్ణుడలరు
గొమ్మ సౌబలుండు, కుసుము ఫలములు దుశ్శాసనుండు, మూల శక్తి తండ్రి’ అని తలిపెను. ధర్మ జయమును అధర్మ పరాజయమును మహాభారత ఇచ్చే ప్రధాన సందేశము. అధర్మము వృద్ధిచెందుతున్నట్లు కనిపించి పతనము ప్రాప్తిం చును ధర్మము వ్యయప్రయాసలతో కూడి ఉన్నప్పటికీ వరకు జయము పొందును. మానవులు లోకంలో అనేక కార్యములు ఆచరిస్తారు. అందులో మంచివి చెడ్డవి కూడ ఉంటాయి. కొందరు అవివేకముతో మంచి యేదో చెడుయేదో యెరుగలేక చెడు చేస్తుంటారు. మరికొందరు యుక్తాయుక్త జ్ఞానం కలిగి చేస్తున్న పని చెడు అని తెలిసి కూడా దానిని చేస్తుంటారు.. అంతఃకరణ ప్రవృత్తి, వారు చేస్తున్న పని చెడ్డదని లోపల బోధిస్తునే ఉంటుంది. అయినను వారు దానిని లెక్క చేయక తమ ఇష్టమును అనుసరించి తాత్కాలిక లాభం కోసం అయుక్త కార్యాన్నే ఆయరిస్తారు. అలాంటి వారు తాత్కాలికముగా కొంత లాభము పొందినను, చివరికి ఆ కార్యాచరణ ఫలితం హాని పొంది తీరుతారు. . దీనికి దురహంకార దురభిమానాలు హేతువులు. దుర్యోధను అటువంటి అహంకార దురభిమా నములకు వశుడై పతనమయ్యాడు. లోకంలో ధర్మాధర్మాలు జరుగుతుంటాయి. ప్రస్తుతం అధర్మము ఎక్కువగా కనిపించుచున్నది. దానిని అరికట్టే శక్తి అందరికి ఉండదు. కొందరే అందుకు దక్షులై ఉంటారు. అయినను వారు మనకెందుకని అధర్మాన్ని అరికట్టుటకు యత్నించరు. దానికి హేతువులు అనేకములు ఉండవచ్చును. అట్లు అధర్మనిరోధ దక్షులయినప్పటికి ఉపేక్ష వహించు వారికి చేటు కలుగుతుంది. దృతరాష్ట్రుడు శాసకుడయిన రాజు. అధర్మము ఏదైన జరుగు తున్నప్పుడు నివారించు అధికారము అతనికున్నది. భీష్మ ద్రోణ విదురాదులు ధర్మజ్ఞులు అయినప్పటికి వారికి శాసించు అధికారము లేదు. వారు చెప్పినను దుర్యోధనుడు ఆ మాటలు పెడచెవిన పెట్టవచ్చును. ద్యూత,ద్రౌపది వస్త్రాపహరణ,ఘోషయాత్ర సందర్భాలలో దృతరాష్ఠ్రుడు శాసనాధికారము కలిగి ఉన్నప్పటికి పుత్ర ప్రేమతో అధర్మాన్ని నివారించక ఉపేక్ష వహించాడు.
శ్రీ దివాకర్ల వేంకటావధాని
‘జాగృతి’ 04.07.1981 సంచిక నుంచి