ఉత్తరప్రదేశ్‌ ‌పర్యాటక శాఖ సహకారంతో థాయ్‌లాండ్‌ ‌సంయుక్తంగా నిర్వహించిన బుద్ధభూమి కార్యక్రమం వైభవంగా జరిగింది. థాయ్‌లాండ్‌ ‌రాజధాని బ్యాంకాక్‌లో ఫిబ్రవరి 23 నుంచి మార్చి మూడో తేదీ వరకు ఈ ఉత్సవం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లో ఉన్న బౌద్ధ క్షేత్రాలకు ప్రచారం కల్పించి, యాత్రికులను, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బౌద్ధులను ఆకర్షించేందుకు ఈ ఉత్సవం ఏర్పాటు చేశారు. ఆ పదిరోజులలో దాదాపు 15 లక్షల మంది ఉత్సవాన్ని సందర్శించారు. మహా పరినిర్వాణ స్తూపం పేరుతో ఉత్తరప్రదేశ్‌ ‌పర్యాటక శాఖ బుద్ధుని జీవిత విశేషాలతో ఒక ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఒక్క థాయ్‌ ‌లాండ్‌ ‌నుంచే కాకుండా పలు దేశాల నుంచి బౌద్ధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారంతా తాము ఉత్తరప్రదేశ్‌లోని బౌద్ధక్షేత్రాలను దర్శించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. నిజానికి థాయ్‌లాండ్‌కు కూడా భారత పర్యాటకుల తాకిడి ఎక్కువే. ఒక్క 2023లోనే 16 లక్షల మంది భారతీయులు అక్కడకు వెళ్లారు. ఇరు దేశాల మధ్య ఉన్న ఈ పర్యాటక బంధాన్ని బుద్ధభూమి ఉత్సవం మరింత పటిష్టం చేస్తుందని చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్‌తో పాటు బిహార్‌, ఇం‌కొన్ని ఇతర ప్రాంతాలలో  కూడా కొన్ని బౌద్ధక్షేత్రాలు ఉన్నాయి. వాటి వివరాలు విదేశీ పర్యాటకులకు తెలియదు.

బుద్ధుడు తన జీవితకాలంలో ఎక్కువ భాగం ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌ అని పిలుచుకుంటున్న ప్రాంతంలో గడిపాడు. ఉత్సవం సందర్భంగా బ్యాంకాక్‌లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో అయోధ్య రాముని గాథల ఆధారంగా ప్రదర్శించిన కళారూపాలు ఆకట్టుకున్నాయి. ఆ సమయంలో జైశ్రీరామ్‌ ‌నినాదం మారుమోగింది.

మారిన పరిస్థితులలో ఉత్తరప్రదేశ్‌ ‌పెట్టు బడులకు అనుకూలమన్న సంకేతాలు ఇవ్వడానికి కూడా బుద్ధభూమి ఉత్సవం ఉపయోగపడింది. ముఖ్యంగా పర్యాటక విభాగంలో పెట్టుబడులకు అవకాశాలు ఎంతో మెరుగుపడిన సంగతిని ఆ శాఖ అందరి దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేసింది. బౌద్ధక్షేత్రాలలో యాత్రికులకు చేసిన ఏర్పాట్ల గురించి కూడా ప్రభుత్వం విశేషంగా ప్రచారం చేస్తున్నది. అందులో భాగంగానే ఉత్తర ప్రదేశ్‌ ‌పర్యాటక వివరాలను వివరించే లఘు చిత్రాలను కూడా అక్కడ పెద్ద పెద్ద మాల్స్‌లో  ప్రదర్శిస్తున్నారు. కపిలవస్తు, సార్‌నాథ్‌, ‌శ్రావస్థి, కౌశాంబి, కుశినగర్‌, ‌సంకిస, దేవదా వంటి బౌద్ధక్షేత్రాలకు కొత్త రూపును ఇస్తున్నారు. భారతభూమిని సందర్శించాలన్న ఆకాంక్ష చాలామంది విదేశీ పర్యాటకులకు ఉంటుందని ఏనాడో రుజువైంది. భారతదేశ దక్షిణ ప్రాంతంలోని మహాబలిపురం మొదలు, హింపీ-విజయనగరం, అజంతా-ఎల్లోరా, కోణార్క సూర్యదేవాలయం, అండమాన్‌ ‌కారాగారం వరకు ఎన్నో పురాతన కళాఖండాలు చూడడానికి పర్యాటకులు ప్రపంచం నలుమూలల నుంచి వస్తుంటారు.

అందుకే భారతదేశంలోని పురాతన కట్టడాల పట్ల ప్రపంచ పర్యాటకుల శ్రద్ధ మరింత పెంచడానికి ప్రభుత్వం, స్థానికులు కూడా తమ వంతు కృషి చేయవలసి ఉంటుందని ఇప్పుడు అంతా భావిస్తున్నారు. ఒక దర్శనీయ స్థలం దగ్గర ఎన్ని సౌకర్యాలు కల్పించారో తెలియచేయవలసి ఉంటుంది. ఇటీవలి కాలంలో వెలుగులోకి వచ్చిన అదాలాజ్‌ ‌ని వావ్‌ ‌కథ ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అదాలాజ్‌ ‌ని వావ్‌ అం‌టే సోపానాలతో నిర్మించిన పెద్ద బావి. అడుగడుగునా  శిల్పకళతో అలరారే ఈ బావి గుజరాత్‌ ‌రాజధాని గాంధీనగర్‌కు సమీపంలోనే ఉంది. 15వ శతాబ్దానికి చెందిన ఈ బావిని చూడడానికి ఇప్పుడు జనం ఎగబడుతున్నారు. ఇందుకు ఒక చిన్న కారణం ఉంది. భారత్‌ ‌క్రికెట్‌ ‌జట్టు మాజీ కెప్టెన్‌ ‌రోహిత్‌ ‌శర్మ, ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌ ‌పాట్‌ ‌కుమ్మింగ్స్ ‌క్రికెట్‌ ‌కప్పుతో ఈ బావి వద్దనే శిల్పకళతో అలరారుతున్న ఒక స్తంభం వద్ద నిలబడి తీయించుకున్నట్టు ఉన్న ఫోటో.

పర్యాటకం ఏ దేశానికయినా ఒక అద్భుత ఆదాయ వనరు. ఆర్థికాభివృద్ధికీ, ఉద్యోగాల కల్పనకీ కూడా తోడ్పడే మంచి సాధనం. ఇటీవల కేంద్రం ఆరంభించిన వారసత్వ కట్టడాల దత్తత, వాటి గురించి మీడియా ద్వారా చేస్తున్న  ప్రచారం మంచి ఫలితాలను ఇస్తున్నది.హార్ట్ ఆఫ్‌ ఇం‌డియా పేరుతో గుజరాత్‌, ‌మధ్యప్రదేశ్‌ ‌రాష్ట్రాలు తమ తమ ప్రాంతాలలోని శిల్ప సంపద గురించి, వారసత్వ కట్టడాల విశిష్టతను తెలుపుతూ నిర్మించిన లఘుచిత్రాలు ఎంతో మేలు చేశాయి. ఇందులో ప్రముఖ బాలివుడ్‌ ‌నటుడు అమితాబ్‌ ‌బచ్చన్‌ ‌వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ ప్రయత్నం దేశంలో పర్యాటక రంగానికి కొత్త ఊపును ఇచ్చిందని చెబుతున్నారు.

ఇప్పటి వరకు అనేక ప్రాంతాలలో ప్రాచుర్యం లేక నిర్లక్ష్యం నీడలో ఉండిపోయిన అనేక వారసత్వ కట్టడాల• ఇటీవల కాలంలో  వెలుగులోకి వచ్చాయి. ఆర్కియో టూరిజం అని ఈ కృషికి ఒక పేరు కూడా వచ్చింది. దీనితో చాలా వారసత్వ కట్టడాలు యునెస్కో దృష్టికి వెళుతున్నాయి.

ఇంతకాలం పర్యాటకులకు ప్రవేశం లేకుండా ఉంచిన పలు వారసత్వ కట్టడాలను చూడడానికి ఇటీవలి కాలంలో ప్రభుత్వం అనుమతి ఇస్తున్నది. దీని వెనుక ఉద్దేశం వారసత్వ కట్టడాలను ఉపయోగించుకుంటూ, పరిరక్షించడం. రాఖీగఢి, కాలిబంగన్‌ ‌తవ్వకాలలో బయటపడిన పురాతన కట్టడాలను చూడడానికి అనుమతించడం ఇందులో భాగమే. అయితే ఇలాంటి అద్బుతమైన వారసత్వ సంపదను చూసేందుకు వెళ్లేవారికి వాటి పట్ల గౌరవం ఉండాలి. వెళ్లదలిచిన వారు కచ్చితమైన నిబంధనలు పాటించాలి. ఇది లేకపోతే వాటికి నష్టం జరిగే అవకాశం ఎక్కువే.

రాఖీగఢి హరియాణాలో బయటపడింది. రాఖీఖాస్‌, ‌రాఖీ షాపూర్‌ అనే గ్రామాలలో ఈ వారసత్వ కట్టడాలు విస్తరించి ఉన్నాయి. ఎక్కడో ఢిల్లీ నుంచి వచ్చిన ఒక పర్యాటకుడు వాటి దగ్గరకు చేరాలంటే కొంచెం కష్టపడాలి. పొలాలలో ఉండే ఆ పురాతన కట్టడాలను చూడడానికి సన్నటి బాటల వెంట వెళ్లాలి. స్థానికుల ఆచార వ్యవహారాల మేరకు వాటి సందర్శనకు కొన్ని పరిధులు కూడా ఉంటాయి. మరీ దురదృష్టం కొన్ని చోట్ల ఇలాంటి వారసత్వ కట్టడాలు ఉన్న స్థలాలు శ్మశానవాటికలుగా మారాయి. కొన్ని పిల్లలు క్రికెట్‌ ‌మైదానాలుగా ఉపయోగపడుతున్నాయి. కొన్ని కట్టడాల మీద ఆయా గ్రామాలలోని మహిళలు పిడకలు కూడా కొడతారు. ఇలాంటివి ఆపాలంటే వాటికి ప్రాముఖ్యం ఎంతటిదో స్థానికులకు అవగాహన కల్పించాలి. కాబట్టి  పురాతన కట్టడాలను చూడడం, వారసత్వ కట్టడాలను చూడడం వేర్వేరు. కాబట్టి వారసత్వ సంపద పరిరక్షణలో ఆయా ప్రాంతాల వారికి కీలక పాత్ర ఉంటుంది. పర్యాటకులక• కొన్నిచోట్లకుండే వాస్తవిక పరిస్థితులు తెలియవు. ఆగ్రాలో తాజ్‌ను చూసినంత సులభంగా చాలా వారసత్వ కట్టడాలను చూడడానికి సదుపాయాలు ఉండవు. కొంతదూరం నడవవలసి ఉంటుంది. ఇది చాలామందికి సరిపడదు. ఇలాంటి సమస్యలు గుర్తించి సదుపాయాలు కల్పించడానికి స్థానికులే ఏర్పాట్లు చేస్తున్నారు. అది ఉపాధి. పర్యాటకులకు సౌకర్యం. రాఖీగఢీ ప్రాంతమంతా తిప్పి చూపించడానికి  ఇప్పుడు అస్తిత్వ పేరుతో ఒక సంస్థ ఏర్పడింది. అలాగే ఆర్కియలాజికల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అమెరికా, ఆర్కియాలజీ మ్యాగజీన్‌, అడ్వెంచర్‌ ‌ట్రావెల్‌‌ట్రేడ్‌ అసోసియేషన్‌ ‌పురాతన కట్టడాలను చూసే వారి కోసం ప్రత్యేక పాఠాలనే తయారు చేశాయి. పురావస్తు లేదా వారసత్వ కట్టడాలను మనం చేసే చిన్న హాని అయినా గొప్ప సంపద పట్ల సరిదిద్దుకోలేని తప్పిదంగానే ఉండిపోతుంది. వాటిని మనం తిరిగి సృష్టించలేం. ప్రత్యామ్నాయం తీసుకురాలేం కూడా. వారసత్వ కట్టడాల పరిరక్షణ పర్యావరణ మీద, స్థానికుల దోరణుల మీద ఆధారపడి ఉంటుంది. ఇలా ప్రజలే ఏదో ఒక భావంతో వారసత్వ సంపదను రక్షించుకుంటున్న ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఒక ఉదారహరణ: అంబాపూర్‌ని వావ్‌ అనే సోపానాల బావి గాంధీనగర్‌కు సమీపంలోనే ఉంది. అయితే ఇది అదాలాజ్‌ ‌ని వావ్‌ అం‌తటి ప్రసిద్ధిలోకి రాలేదు. కానీ స్థానికులు దీనిని రక్షిస్తున్నారు.

వారసత్వ సంపద ఆధారంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకోవడం కచ్చితంగా గొప్ప దృష్టి. దీనితో మన పూర్వికుల కళాదృష్టి నేటి ప్రపంచానికి తెలుస్తుంది. సాంకేతిక పరిజ్ఞానం స్థాయి వెల్లడవుతుంది. దీనికి తోడు దేశానికి గొప్ప ఆదాయవనరు అవుతుంది.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram