నవంబర్‌ 19 గురునానక్‌ జయంతి

ప్రేమ, ఐకమత్యం, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఆధ్యాత్మికచింతన లాంటివి ఉత్తమ మానవుడిలోని దివ్యసంపద. ఇవి లోపించినప్పుడు ఎన్ని సిరిసంపదలు ఉన్నా వృథా. బాహ్య ప్రపంచాన్ని జaయించాలనుకునే ముందు స్వీయలోపాలను సరిదిద్దుకోవడం అత్యంత ముఖ్యం. ఒక వ్యక్తిని కానీ, మతాన్ని కానీ ఉన్నతంగా చెప్పదలచినప్పుడు ఇతరులను, ఇతర మతాలను తక్కువ చేయనక్కర్లేదు. అహంకారం మనిషికి అతి పెద్ద శత్రువు. దానిని విడనాడి వినయం, సేవాభావంతో జీవితాన్ని గడపాలి. మతం, కులం, తెగలకు అతీతంగా మనుగడ సాగించాలి. మానవసేవే మాధవసేవ అనే సూక్తికి సమాంతరంగా సేవాదృక్పథాన్ని అనుసరించాలి. ఇది సిక్కు మత ప్రవక్త గురునానక్‌ ప్రబోధం. సామాజిక అంశాలను ఆధ్యాత్మికతకు జోడిరచి మానవ జాగృతికి తపించిన మహనీయుడు గురునానక్‌. ఈ సృష్టిలో ఎవరి కన్నా ఎవరూ తక్కువా, ఎక్కువా కాదని బోధించారు. స్త్రీ,పురుషుల మధ్య వివక్షను నిరసించారు. పురుషులకు జన్మనిస్తున్న మహిళలు వారి కంటే ఎలా అల్పులు? అని ప్రశ్నించారు. భగవంతుని కృపకు ఇరువురు సమపాత్రులేనని అభిప్రాయపడ్డారు. భగవంతుడు తాను అన్ని చోట్ల ఉండలేక తనకు మారుగా స్త్రీని సృష్టించాడనే భావనను ఆయన వాదన బలపరుస్తుంది. మహిళలను పరిపూర్ణంగా గౌరవించడంతో పాటు వారికి సమాన ప్రతిపత్తి కల్పించాలని ఐదు శతాబ్దాల క్రితమే ఆయన ప్రబోధించారు.

మానవ మనుగడకు డబ్బు అవసరమే కానీ డబ్బే ప్రధానం కాదన్నారు నానక్‌. ‘డబ్బును జేబులో దాచుకోవాలి కానీ గుండెల్లో కాదు.’ అనేవారు. ఆర్జించిన దానిలో పదోవంతును అలా వినియోగించా లంటూ ‘దశ్వాంద్‌’ అనే భావనను ప్రవేశపెట్టారు. పనిచేసే వాడికే తినే హక్కు ఉంటుందని ఆనాడే చెప్పారు. దానిని ఆచరించి చూపారు. సమాజంలో విశేష మన్ననలు అందుకుంటున్నా పొలాలలో పనిచేస్తూ జీవనం సాగించి ఆదర్శంగా నిలిచారు.

‘స్వార్థాన్ని వీడి ఉన్నంతలో సత్కార్యాలు ఆచరించడమే ముక్తికి మార్గం. నిజాయతీతో కూడిన సత్ప్రవర్తనతో జీవించడం, స్వచ్ఛమైన వ్యక్తిత్వం, మంచి నడవడిక కలిగి ఉండడమే భగవంతుని చేరేందుకు ఏకైక అర్హత’ అన్నది ఆయన సందేశం. భగవంతుడు జీవకోటికి తండ్రిలాంటివాడు. అందరిలో, అన్నిటిలో పరమాత్ముని చూడగలినవారే భగవత్‌ కృపకు పాత్రులవుతారని పేర్కొన్నారు.

హిందూ, ముస్లిం సిద్ధాంతాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ఆయన రెండు మతాల ఆధ్యాత్మిక విషయాల పట్ల లోతైన అవగాహన సాధించారు. కేవలం మాటలలో మతం లేదని, మానవులందరినీ సమంగా చూసేవాడే మనిషని, తోటివారిని ప్రేమించి, ప్రేమను పొందకలిగిన వారే బóగవంతుడిని చూడగలరని ప్రబోధించారు. టిబెట్‌, అరేబియా, దక్షిణాసియా దేశాలతో పాటు అవిభక్త భారత్‌లో ఐదుసార్లు పర్యటించి తన వాణిని వినిపించారు. వీటినే ‘ఉదాసీ’ యాత్రలు అంటారు. నానక్‌ చూపిన మార్గమే సిక్కుమతంగా రూపుదిద్దుకుంది. గురుశిష్య సంబంధాలను పటిష్ట పరుస్తూ సర్వమానవ సమానత్వం, ప్రేమతత్వాన్ని పెంపొందించేలా సిక్కు ధర్మాన్ని ప్రతిపాదించారు. మూఢాచారాలను, మతం పేరిట జరిగే అనాచారాలుగా భావించి వాటిని వ్యతిరేకించారు. వివిధ మతాలలోని మంచి చెడులను గమనించి సరళమైన ధోరణిలో ఆధ్యాత్మికత ప్రబోధా నికి ఉపక్రమించారు. అలా ప్రజల భాషలో చేస్తున్న ధర్మప్రచారంతో ప్రభావితులైన వారు తమలోని లోపాలను సరిదిద్దుకునేవారట. ఆయన రూపొందిం చిన మతం సర్వ సమ్మతమై గురుగోవిందసింగ్‌ వరకు పదిమంది గురువుల నేతృత్వంలో వికసించింది.

నేటి పాకిస్తాన్‌లోని రావీ నదీతీరంలోని నన్కానా సాహిబ్‌లో సంప్రదాయ కుటుంబంలో 1469లో జన్మించిన నానక్‌ ఐదేళ్ల వయస్సు నుంచే నిరంతరం దైవ నామస్మరణ చేస్తుండేవారట. చిన్నతనం నుంచి ప్రశ్నించి, ఆలోచించే తత్త్వం కలిగిన ఆయన హిందూమతంలోని తాత్త్త్వికత పట్ల ఆకర్షితులై జీవిత రహస్యాల అన్వేషణకు ఇల్లు వదలివెళ్లారు. ఆయన సోదరి బీబీ నాన్కీ, తమ్ముడు అత్యంత పిన్న వయస్సులోనే ఆయనలోని దైవత్వాన్ని చూడగలిగారు. అప్పట్లో ఆమె దీనిని బహిర్గతం చేయకపోయినా, అనంతర కాలంలో గురునానక్‌జీ తొలి శిష్యురాలిగా పేరుపొందారు. సిక్కుల ఐదవ గురువు అర్జున్‌ తన పూర్వ గురువులు అనుగ్రహించిన సూక్తులను, బోధనలను ‘గురు గ్రంథ సాహిబ్‌’గా సంకలనం చేశారు. అందులో గురునానక్‌ చేసిన బోధనలు, సూక్తులు నిత్యసత్యాలని, ప్రతి మానవుడు ఆచరించ దగినవని వాటిని బట్టి తెలుస్తుంది.

ఏ రంగంలోనైనా సమర్థతే గణనీయం తప్ప వారసత్వం కాదన్నది గురునానక్‌ నిశ్చితాభిప్రాయంగా చెబుతారు. సమర్థ పాలకులతోనే సుపరిపాలన అందుతుందన్నట్లే సమర్థ గురువులతోనే జ్ఞానం అందుతుందని విశ్వసించారు. పాలకుల, జ్ఞాన ప్రదాతల ఎంపికలో వారసత్వం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకోరాదన్నది ఆయన భావనగా కనిపిస్తుంది. ఆత్మజ్ఞానం, అనుభవం కలవారి వల్ల మరింత ప్రయోజనం కలుగుతుందని భావించి ఉంటారు. అందుకే ఆయనకు శ్రీచంద్‌, లక్ష్మీదాస్‌ అనే కుమారులు ఉన్నప్పటికీ గురుపరంపర వారసులుగా వారిని ప్రకటించలేదు. తన శిష్యుడు లెహ్నాను గురుపీఠం వారసునిగా ఎంపిక చేశారు. ఆయనే (లెహ్నా) గురు అంగద్‌గా ప్రసిద్ధులు.

సిక్కు అనేది శిష్య అనే సంస్కృత పదానికి లౌకిక భాషారూపంగా చెబుతారు. అతనికి గురువే దేవుడు. ఆయన చెప్పే మంచే దైవం. గురువులు వాక్కుల ఆధారంగా పవిత్రజీవితాన్ని కొనసాగించాలి. ఆధ్యాత్మిక ఉన్నతికి, జ్ఞానసముపార్జనకు ప్రతి ఒక్కరికి గురువు అవసరం. గురువు లేకుండా వాటిని సాధించలేరు. గురువు ఆదేశంతోనే భగవంతుడి సందేశం వినిపిస్తుంది. జ్ఞానం చేకూరుతుంది. గురుశిష్య సంబంధం సర్వమతాలకు వర్తిస్తుంది. ప్రజలు నానక్‌ను గురువుగా భావిస్తూ ఆయనను అనుసరించారు కనుక శిష్యుల పేరిట సిక్కు మతం రూపుదిద్దుకుంది. ఈ మతం ప్రకారం గురువాజ్ఞనే దైవసూచనగా పాటించాలి. గురువు పట్ల అచంచల మైన భక్తి విశ్వాసాలు కలిగి ఉండాలి. గురు ప్రబోధం తోనే దైవం సర్వత్రా వ్యాపించి ఉన్నాడని, శిష్యరికంలో జీవిత సార్థకత ఉందని నమ్ముతారు.

– ఎ. రామచంద్ర రామనుజ

సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
Instagram