పాటతో అగ్ని పుట్టించారు గరిమెళ్ల సత్యనారాయణ.

జీవితం అగ్నిపరీక్షగా మారినా, నిలిచి గెలిచారు బులుసు సాంబమూర్తి.

ఎలా అంటే ఇదిగో ఇలా…

ఉద్యమమంటే పెద్ద ప్రయత్నం. ఒకరు / కొందరు/ అందరూ చేసే విశేష కృషి. మన స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో తెలుగునాట ఎక్కడ చూసినా నవ ఉత్తేజం. ఏ ఇంట విన్నా సత్యాగ్రహ గీతాలే వినిపించేవి. వాటిల్లో ‘మాకొద్దీ తెల్లదొరతనము’ రచయిత గరిమెళ్ల. ఆయన ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లావారే. అప్పట్లో ప్రజాకవిగా అంతటా ఇంటింటా పేరుపొందారు. సొంత ప్రాంతం- నేటి పోలాకి సమీప ప్రియాగ్రహారం. తన బడి చదువంతా ఆ గ్రామంలోనే.

ఆ తర్వాత సమీప విజయనగరం పరిసరాల్లో మరికొంతకాలం చదువుకున్నారు. గరిమెళ్ల సత్యనారాయణ ఉపాధ్యాయ శిక్షణ ముగియగానే, దేశ విముక్త సాధన రంగంలోకి దూకారు. ఇదంతా శతాబ్ది కిందటి మాట.

తాను నాడు రాసి, పాడిన వాటిల్లో స్వరాజ్య గేయాలు అనేకం. మా ప్రాణాలపై పొంచి మానాలు హరియించే మాకొద్దీ తెల్లదొరతనము దేవా/ నోట మట్టీ కొట్టి పోతాడండీ ఆడీ కుక్కలపై పోరాడీ కూడూ తినమంటాడూ/ కోర్టూలంటీ పెట్టి పార్టీలు సృష్టించి సేవాభావం చంపినాడు / గాంధీ టోపీ తెచ్చి పాఠశాలలోకి రావద్దు రావద్దంటాడు/రాజ్యా ద్రోహమంటా రాజ్యంలో ఉందంట/ బాబూ మాకొద్దీ తెల్లదొరతనము.. అంటూ కొనసాగుతుందా గీతిక. దాన్ని నకలు తీసి ఆ మూల నుంచి ఈ మూల దాకా అందరికీ అందించి, ప్రచారం చేసేవారు. అది ఆ నోటా ఈ నోటా పాకి, చివరికి పరపాలక న్యాయ అధికారుల ‘దృష్టి’కి వచ్చింది. ఆయన్నే పిలిపించి పాట మొత్తం పూర్తిగా పాడమనేసరికి, సమరోత్సాహంతో గానం చేసి వాళ్ల గుండెలదరగొట్టారు. ప్రజలకు మరింత చేరువైతే తమ కొంప కొల్లేరవుతుందని తక్షణం గ్రహించి, ఆయనకు ఏడాది కారాగారవాస శిక్ష వేశారు. అదొక లెక్కా అనుకుంటూ వెళ్లివచ్చిన గరిమెళ్ల, తిరిగి జనం మధ్యకు చేరి దేశభక్త గీతగానం చేయసాగారు.

జైల్లోనే పుస్తక రచన

మళ్లీ రెండేళ్ల దండన విధించేలా చేశారు ముష్కర పాలకులు. ఈలోగా, పితృ వియోగం కలిగింది. ‘క్షమించమని అడుగు, జైలు నుంచి వదిలేస్తాం’ అని బెదిరించారు. బెదరడానికి ఆయన వేరెవరో కాదు, గరిమెళ్ల! మరో గ్రంథం ‘స్వరాజ్య గీతాలు’ 1921లోనే తెచ్చారాయన. అంతటితో ఆగలేదు సరికదా-వరసబెట్టి ఖండకావ్యాలు రాశారు. ఎన్నోమార్లు జైళ్లపాలయ్యారు. అక్కడే భాషలు నేర్చుకుని మరీ; తమిళ, కన్నడ పుస్తకాలను తెలుగులోకి అనువదించారు. ఆంగ్లంలోనూ కొన్నింటిని రచించడంతో పాటు, తెలుగు అనువాదాలు కూడా కొనసాగించారు.

అదురూ బెదురూ లేదు

ఏది రాసినా వీరత్వం తొణికిసలాడేది. దండాలు దండాలు భారత మాతా అంటుంటే ప్రజానీకం ఉర్రూతలూగేది. ఆ నిజాయతీ, నిర్భయత్వం మరెవరికీ నేర్చుకున్నా వచ్చేవి కావు మరి. ‘దండాలు దండాలు భారత మాతా! అవి అందుకుని దీవించు భారతమాతా/మమ్ము చంపబోయినారు భారతమాతా, కొంచెమైనా జంకమమ్మ భారతమాతా/కొంచెమైనా బెదరమమ్మ భారతమాతా! నీ పాదాల తోడు తల్లి భారతమాతా/అడవులన్ని వాడివంట భారతమాతా, వాడి అబ్బ వచ్చి వేసినాడ భారతమాతా/సముద్రాలు వాడివంట భారతమాతా/వాడి తాతలొచ్చి తవ్వినారా భారతమాతా!’ అంటూ సాగుతుందా భక్తిగీతిక. ‘మా వాడు, మా ఊరి మొనగాడు’ అంటూ పోలాకి ప్రాంత వాసులు నిర్మించుకున్న గరిమెళ్ల విగ్రహం ఇప్పటికీ అక్కడ కనిపిస్తుంది.

విజయవాడకు ‘పుష్కర’ కళ

వందేళ్లనాడు అదే 1921 ప్రాంతాల్లో విజయవాడ వేదికగా అఖిల భారత కాంగ్రెస్‌ ‌వ్యవస్థ మహాసభలు ఏర్పాటయ్యాయి. చరిత్రాత్మక ఘట్టమంటే అదే! స్వతంత్ర కాంక్షతో రగిలిపోతున్న వేలాది ప్రజలు అక్కడికి ఎలా వీలైతే అలా తరలివచ్చారు. పుష్కరాలను తలపించిన జన సమూహం!! దేశభక్తి భావన అణువణువునా పెల్లుబుకుతుంటే; వారి నాదాలు, నినాదాలు, పాటలు, పద్యాలు, పిలుపులు ఊరు ఊరంతా మారుమోగాయి. బాపూజీ దంపతులు సహా- జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ, లాలాలజపతి రాయ్‌ ‌వంటి జాతీయ నేతలంతా వచ్చారు. బెజవాడలోని ఇప్పటి గాంధీనగర స్థలమే అప్పటి సభామైదానం. అక్కడే నాడు త్రివర్ణ పతాక రూప కల్పన పింగళి వెంకయ్య చేతుల మీదుగా! దాన్నే బహు కొద్దిపాటి మార్పుచేర్పులతో భారత జాతీయ కాంగ్రెస్‌ ‌జెండాగా గాంధీజీ సమ్మతించారు. అందరు ప్రముఖుల సమక్షంలో మరెన్నో కీలక నిర్ణయాలు ఆనాడే వెలువడ్డాయి.

కాకినాడలో భారీ వేదిక

అటు తర్వాత రెండేళ్లకే (1923) కాకినాడలో బులుసు సాంబమూర్తి నేతృత్వంలో ఏఐసీసీ మహాసభలు. మహాత్ముడి పిలుపునకు ఎంతగానో ప్రభావితులైన ఆయన, అప్పటిదాకా తాను నిర్వర్తిస్తున్న న్యాయవాద వృత్తిని త్యజించి మరీ ఉద్యమ రంగ ప్రవేశం చేశారు. వారంరోజుల ఆ మహోత్సవాలకు ఆహ్వాన సంఘం అధ్యక్ష బాధ్యత కొండా వెంకటప్పయ్య వారిది. ఆహ్వానితుల్లో- టంగుటూరి ప్రకాశం, పట్టాభి సీతారామయ్య, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, ఉన్నవ లక్ష్మీనారాయణ, గాడిచర్ల హరిసర్వోత్తమరావు ఇంకెందరో ప్రముఖులు. మామూలు వేదికా అది? వందకు పైగా ఎకరాల సువిశాల స్థలం. వేల సంఖ్యలో జన వాహిని చేరేలా అతి పెద్ద డేరా.

ఆ రోజుల్లో కారాగారంలో ఉన్నందున బాపూజీ హాజరుకాలేని పరిస్థితి. వల్లభాయ్‌ ‌పటేల్‌, ‌చిత్తరంజన్‌ ‌దాస్‌, ‌సరోజినీ నాయుడు, మౌలానా అబ్దుల్‌ ‌కలాం ఆజాద్‌ ‌సహా నేతలెందరో వచ్చి దిశానిర్దేశం చేశారు. అత్యంత విషాదం- అదే సమయంలో ఆ మహాసభల రోజుల్లోనే బులుసువారి ఒకే ఒక కుమారుడు అస్తమించడం. అంతటి పెను శోకాన్నీ తట్టుకుని తప్పనిసరై బృహత్తర కార్యక్రమ భారం వహించిన ఆయన, ఆ తర్వాత కంటికీ మింటికీ ఏకధారగా రోదించారు!

శ్రీకాకుళం జిల్లాలోనూ…

శ్రీకాకుళం జిల్లా మందస పరిసరాల్లో వీర వనిత గున్నమ్మ స్మారక స్తూపం నేటికీ నిలువెత్తున ఉంది. తెల్ల దొరల అక్రమాల్ని, ప్రాంత పెత్తందారుల జులుంని నిలువరించి, సాహసోపేత ప్రతిఘటనకు దిగిన ఆమె తుదకు వాళ్ల ఆయుధాలకు బలైన అమరజీవి. అప్పటివరకు గుడారి రాజమణిపురంగా ఉన్న ఆ ఊరి పేరు, అటు తర్వాత అందుకే వీర గున్నమ్మపురం అయింది. దురన్యాయానికి మారుపేరైన పన్నులను కట్టకుండా, ఎస్టేటు వద్ద నుంచి కలప తీసుకురావడమే గ్రామీణులు చేసిన ‘నేరం’. తిరిగి స్వాధీనానికి ఒక్కుమ్మడిగా విరుచుకుపడిన అలనాటి అదనపు పోలీసు బలగాలను ఆ ధీర నారి ఒంటరిగా ఎదిరించింది. కరకు తూటాలకు గురై నిండు ప్రాణాలు కోల్పోయిన తాను అప్పటికే గర్భవతి. నేలవాలిన గున్నమ్మ స్మృతిచిహ్నంగానే, స్తూపాన్ని నిర్మించి గ్రామవాసులు అపార గౌరవాదరాలు చాటుకున్నారు.

స్మారకం… గోపురం

మహోద్యమ తరుణంలోనే బాపూజీ ఈ జిల్లాలోని వివిధ ప్రాంతాలను సందర్శించి, ఊరూవాడా సమర స్ఫూర్తి రేకెత్తించారు. ఒకసారి ఆయన పొందూరుకు, అక్కడి నుంచి సారవకోటకు వచ్చి రాత్రిపూట ఒక పూరింట్లో బస చేయడం చరిత్ర ప్రసిద్ధం. ఆ కారణంగా, అక్కడ అప్పట్లోనే స్మారక భవనం నిర్మితమైంది. ఇప్పుడు అదే ఊరంతటికీ పుస్తకాలయం. అదే విధంగా పాలకొండ పరిసరాల్లోని వెలగవాడ ఆలయ గోపురంపైన నేతాజీ, మహాత్మాజీ విగ్రహ రూపాలు ఇవాళ్టికీ కనిపిస్తుంటాయి.

– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

By editor

Twitter
Instagram