– వాకాటి పాండురంగారావు

‘‘ఎలెన్‌ ‌కూడా… ఇలాగే అందా?’’

రుక్మిణి ప్రశ్న టార్పెడోలా తాకింది రామకృష్ణను.

ఆనంద సముద్రములో నౌకలా ఉన్న అతడిని చిన్నా భిన్నాలు చేసింది. చటాలున లేచాడు. మంచం దిగాడు. లుంగీ చుట్టుకుని వరండాలోకి వెళ్లి ఫేముకుర్చీలో కూలబడ్డాడు.

సిగరెట్‌ ‌ముట్టించబోయాడు. లైటర్‌ ‌వెలగలేదు. మళ్లీ మళ్లీ ప్రయత్నించాడు. వెలగలేదు. ఓవర్‌ ‌కోటుజేబులోని అగ్గిపెట్టెను తీసి వెలిగించాడు.

మూడుసార్లు గంట కొట్టారు. ఎక్కడో.

మనస్సు ఉడుకుతూ ఉంది. రాత్రి నిశ్చలంగా ఉంది. తార ఇంట్లో పట్టుబడ్డ వాడిలా చంద్రుడి మొహం వెలవెలా పోతూంది.

కిటికిలో నుంచి జారుతున్న మసక వెన్నెల నామె గమనించలేదు. బోర్ల పడుకుని వెక్కి వెక్కి ఏడుస్తూంది. చీర ఆ ప్రక్కన నేలమీద కుప్పగా పడివుంది.

— —- — —

మద్రాసులో డైరెక్టర్ల వార్షిక సమావేశం, గుంటూరులో ఏదో శిక్షణ తరగతుల ప్రారంభం. తిరువనంతపురంలో ప్రాంతీయ విక్రేతల గొడవ, షిమోగ ఫ్యాక్టరీలో సంప్రదింపులు.. ఇలా వరసగా పదకొండు రోజులపాటు రోజుకు ఇరవై గంటలు తిరిగి పనిచేసి, అలసిన రామకృష్ణ హైదరాబాద్‌కని బయలుదేరి మద్రాసు చేరాడు.

అప్పటికప్పుడు అనుకుని అద్దె కారొకటి తీసుకొని మహాబలిపురం చేరాడు. బీచ్‌ ఒడ్డున కాటేజి తీసుకున్నాడు.

చుట్టు సరుగుడు చెట్లు, నేలతల్లి నవ్వినట్లున్న ఇసుక, రారమ్మని పిలిచే నీలి నీలి సంద్రం, అన్నిటికన్న ఆ ఏకాంతం ఎంతో హాయిగా అనిపించింది.

ఒక్కటే లోటు… రిక్కీ తన పక్కన లేక పోవడం. హఠాత్తుగా ప్రాణం విసిగిపోయి. తానిలా వచ్చాడు గాని పెళ్లయిన తొమ్మిదేళ్లలో ఎప్పుడూ ఆమె లేకుండా తాను హాలిడేమీద వెళ్లలేదు..

స్విమ్మింగ్‌ ‌ట్రంక్స్ ‌వేసుకొని నీళ్లలోకి దిగాడు. చల్లని చేతులతో ఆ నీరు అతడిని పొదుపుకుంటుంటే ఆ స్పర్శ ఎంతో హాయి అనిపించింది. రిక్కీ పొట్టమీద నునుపు ఇలాగే ఉంటుంది. అయినా తిరువనంతపురంలో లెయ్‌లా మీనన్‌.. ‌మైగాడ్‌.. ఆమె నుంచి తప్పించుకు పారిపోవలసి వచ్చింది. తనది రిక్కీది వేరే ప్రపంచం… అందులోకి ఇంకెవరూ రాలేదు… రారాదు.

‘హాయ్‌!’

‌నీళ్లలో తేలుతూ తిరిగి చూశాడు.

సాయంకాలపు ఎండ రంగులో కలిసిపోయిన బంగారు ముంగురులు – ఆ రబ్బరు కుళ్లాయి అంచుల నుంచి కన్పిస్తున్నాయి. ఆ నీలి కళ్లు ఎంతో స్వచ్ఛంగా ఉన్నాయి. ఆమె శరీరం అలలు నిండిన సముద్రం.

‘హాయి’

‘‘ఐ యామ్‌ ఎలెన్‌ ‌బ్లూమెంతాల్‌!’’ అని తన్ను తాను పరిచయం చేసుకుంది. తనపేరు చెప్పాడు. తాను మధ్యాహ్నం వచ్చిందట. అర్జునుడి తపస్సు శిల్పం. పాండవుల రథాలు అన్ని చూచిందట.

నీళ్లల్లో తేలుతూ ఈదుతూ ఆమె చెప్పినవన్నీ విన్నాడు.

ఓ అరగంటయ్యాక ఆమె ఒడ్డుకు నడిచింది. ఇలాంటి మెర్‌మెయిడ్‌ ‌శరీరం చూచే, శిల్పి ఉలి శిలకు జీవం పోస్తుందేమో!

ఆమె గలగల మాట్లాడుతూనే ఒళ్లు తుడుచు కుంది. పెద్ద పూల ప్రింట్లున్న పొడుగుటి గౌన్‌ను కప్పుకున్నట్లుగా వేసుకుంది. తాను ఇండియాకిది రెండోసారి రావడం అట. మొదటిసారి తనూ, రాబర్టూ… అంటే తన మొదటి మొగుడూ ఆరేళ్ల క్రితం వచ్చారట. తర్వాత ఇద్దరూ విడిపోయారట. అబ్బాయి రాబర్ట్‌తోనే ఉంటున్నాడట. మళ్లీ తను స్టీవ్‌ ‌బ్లూ మెంతాల్‌ను పెళ్లాడిందిట. అతను డెట్రాయిట్‌ ‌కార్ల ఫ్యాక్టరీలో ‘సమ్‌సార్ట్ ఆఫ్‌ ‌చీఫ్‌’’ అట. టోక్యోకు ఇద్దరూ వస్తే అక్కడినుంచి అతడు అర్జంటుగా స్టేట్స్‌కు వెళ్లిపోయాడట. తను మాత్రం అనుకున్నట్టుగా ఇండియాకు వచ్చిందట.

రామకృష్ణ తన వివరాలన్నీ చెప్పాడు. సాండ్‌విచెస్‌ ‌తిని మామిడి పళ్లరసం తాగారు.

అది తాగుతుండగా చెప్పిందామె…

‘‘ఇండియా చాలా గొప్పదేశం. అందమైన దేశం నిజమే… దారిద్య్రం ఉంది. అది పరాయిపాలనలో వచ్చింది. కొన్నేళ్లకు తప్పక పోతుంది. కాని ఈ ఎండ, ఈ సముద్రం, ఆ నాట్యం, ఆ శిల్పాలు, మధుర, కంచి, ఖజురహో, ఎల్లోరాలు, హిమాలయాలు ఎంతో కష్టంలోనైనా తలెత్తుకుని నిలబడగల్గే జనులు అబ్బబ్బ మీ కళ్లు ఎంత బాగుంటాయో చెప్పలేను. మిష్టర్‌ ‌రాం! మీ దేశంలో వాళ్లు బహుశా ఎక్కువ తిరగరేమో అంచేత వారికి ఇది తెలియదేమో కాని ఐ లవ్‌ ఇం‌డియా అండ్‌ ఇం‌డియన్స్..’’ అని గ్లాసు క్రింద పెట్టి.. ‘‘మరిచాను… మేంగో ఈస్‌ ‌మై ఫేవరెట్‌’’ అని నవ్వింది. ముదురు ఎరుపు లిప్‌స్టిక్‌ ‌పెదవుల వెనక ముత్యాలవంటి పలువరుస… రామకృష్ణ కళ్లనాకర్షించింది.

‘‘మిస్టర్‌ ‌రాం! సాయంత్రం ఎవరో గైడట వచ్చీ రాని ఇంగ్లిషులో నన్ను ఊదరగొట్టాడు. కాని నాకు ఆ అర్జునుడి తపస్సు శిల్పం మరోసారి చూపించరూ?’’ అని లేచింది ఎలెన్‌.

‘‘‌షూర్లీ మిసెస్‌ ‌బ్లూమెంతాల్‌’’, అతనూ లేచాడు.

‘‘కాల్‌ ‌మి ఎలెన్‌!’’

‌కారు దిగి నెమ్మదిగా నడవసాగారిద్దరు. అక్కడ కూడా దీపాలు వెలుగుతున్నాయి. ఒకరిద్దరు గైడ్‌లు వెంటపడగా తరిమివేశారు. ఒకటి రెండుసార్లు ఆమె భుజం తనకు తగిలినప్పుడు ఒళ్లు జల్లుమంది.

రామకృష్ణ ఆశ్చర్యపడ్డాడు. తనింత కాన్షస్‌గా ఉన్నాడేమిటివాళ. తను డైరెక్టర్‌ ‌హోదాలో ఎంతమంది స్త్రీలతో మెలిగాడు, మాట్లాడాడు? ఒంటరిగా వాళ్లతో ప్రయాణాలు చేశాడు గాని, ఈ ఫీలింగెప్పుడూ రాలేదే…

‘రిక్కీ… నువ్వు నాతో ఉండాలి ఈపూట’ అనుకున్నాడు.

వెన్నెలలో – ఆ అర్జునుడి రాతిశిల్ప ఫలకం మీద వెలుగునీడలు మాటలకు మించిన భావాలను చెబుతున్నాయి.

పల్లవులు, కఠినశిల, ఏకశిలా విమానాలు, నగర వేసార విమానాలు, అర్జునుడు, పాండవులు, కౌరవులు, కురుక్షేత్రం, పాశుపతాస్త్రం – తపస్సు అన్నీ వివరంగా చెప్పసాగాడు రామకృష్ణ. చరిత్ర, పురాణం, సౌందర్యం, శిల్పం, భక్తి, ఆరాధన- అన్ని కలిసి ఒక గంగా ప్రవాహమై ఈ దేశంలో కాలానికి ఎలా వారధిగా నిలిచిందీ.. అతడు చెబుతుంటే తన్మయత్వంతో విన్నది ఎలెన్‌. ఇద్దరూ ఓ నిమిషం మాట్లాడకుండా చూశారు. ‘‘రాం… అర్జునుడికి భార్యలెందరు?’’ ఆ ప్రశ్నకు ఉలిక్కిపడిన రామకృష్ణకు మొదటిసారిగా ఆమె తన భుజానికి ఆనుకుని నిల్చుందని తెలిసింది.

‘‘అర్జునుడికా’’ అని సిల్లీ నువ్వొకటి నవ్వి ముగ్గురో, నల్గురో ఉంటారు, అతగాడు పూర్వజన్మలో అరబ్‌ ‘‌షేక్‌’ అయివుంటాడు!’’

ఎలెన్‌ ‌విరగబడి నవ్వింది ఓహ్‌! ‌రాం అని అతడి భుజాలు పట్టుకు కుదిపింది.

ఆమె ముంగురులు అతని చెంపలను స్పృశిస్తుంటే ఆమె ఒంటిమీద సెంటు అతడిని చీలుస్తుంటే కళ్లు మూసుకున్నాడు… ‘నేనిక్కడికి వచ్చి ఉండకూడదు’ ఒంటరిగా…

ఇద్దరూ కాలేజీ చేరారు. డిన్నర్‌ ‌దగ్గర ఆ శిల్పసుందరి మాటాడుతుంటే వింటున్నాడే తప్ప రామకృష్ణ గ్రహించడం లేదు.

భోజనం అయ్యాక ఆమె కాలేజి దగ్గర ఆమెను వదిలాడు. ‘థాంక్యూ రాం.. థాంక్యూ వెరిమచ్‌..’ అం‌ది అతని చేతిని తన చేతిలోకి తీసుకుని ఎలెన్‌.

ఏదో చెప్పేసి గబగబ తన కాలేజిలోకి వచ్చి అడ్డంగా మంచంమీద పడ్డాడు రామకృష్ణ. నాలుగు సిగరెట్లు త్రాగాడు. ఎక్కడో పార్టీలో తప్ప పుచ్చుకోని తాను- బేరర్ని పిలిచి విస్కీ సోడా తెప్పించాడు. గటగట కసిగా తాగాడు. ఆ వెచ్చదనం శరీరమంతా పురివిప్పింది.

పడుకున్నాడు. పుస్తకం తీశాడు. రెండు పేజీలు కూడా చదవకుండానే మూసేశాడు. కళ్లు మూసుకు న్నాడు, రిక్కీ శరీరంలోని ఒక్కొక్క భాగాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. ఆ తొమ్మిదేళ్ల తమ ఆనందపు వెన్నెలలోని వేల వేల కిరణాల నొక్కొక్కటిగా మననం చేసుకున్నాడు. కాని, ఉహు రిక్కీ నల్లని కురులకు బదులు బంగారు ముంగురులు కదలాడాయి. వీణాగానం లాంటి ఆ ఆనంద చూపులకు మారుగా నీలి అల్లరి కనుల పియానోగానం వినిపించింది.

ఉహు… ఇప్పుడే మద్రాసు వెళ్లిపోతేని… వాచి చూశాడు. పదకొండయింది. లాభంలేదు.

నైట్‌గౌన్‌ ‌చుట్టుకొని లేచాడు. టేకాజి వెలుపలకి వచ్చాడు. చంద్రుడు నడినెత్తి మీద వెలుగుతున్నాడు. ఎంత తెల్లగా ఉన్నాడో. అయినా అతడిలో మచ్చ ఉందిట…

సిగరెట్లు కాలుస్తూ సముద్రం ఒడ్డునే నడవ సాగాడు.

ఎంతసేపు నడిచాడో. ఎంతదూరం నడిచాడో… ఆ హోరు పక్కనున్న సముద్రానిదా లేక తనలోనిదేనా. కాళ్లకడ్డంగా ఒకటి రెండు పెద్ద పీతలు పరుగెట్టాయి వంకరటింకరగా.

ఒకచోట కూలబడ్డాడు. నిరంతరంగా తరలివచ్చి, ఒడ్డుతో ఘర్షణపడి వెళ్లిపోతున్నాయి అలలు.

వెనక్కు వాలాడు. చేతులను మడిచి తలక్రింద పెట్టుకొని ఇసుకమీద పడుకున్నాడు. నక్షత్రాల జల్లెడలో ఆకాశం చిక్కుకుని ఉంది. మనిషి చంద్రుడి మీద పాదం మోపాడు. నక్షత్రం చేరే దినం ఎప్పుడొస్తుంది? వస్తుందా? అంతంత దూరాలను జయించిన మనిషి అతి దగ్గరిదయిన తన మనసున ఎందుకు…?

‘‘రాం’’… ఆ గొంతుతో జీర…

అతడు లేవడానికి ప్రయత్నించాడు.

ఆమె లేవనివ్వలేదు.

తమ నిశ్చల ఆనంద లహరిలోకి ఆ సంఘటన విసిరిన రాతి దెబ్బకు సుడులు తిరిగింది.

శాకరిన్‌ ‌బిళ్లలా అప్పటికప్పుడు తీయగా ఉన్నా చివరికి మిగిలిన చేదు ఇంకా నిలిచేవుంది.

ఆ మరు ఉదయం ఆమెతో చెప్పకుండానే హైదరాబాద్‌కు బయలుదేరాడు తను.

ఇంటికి చేరగానే తెల్లటిచీరతో, తన అక్కున చేరి స్వాగతం చెప్పింది రిక్కీ. కాని జ్ఞాననేత్రం లాంటి ఆమె కుంకుమబొట్టు తనవైపు ఎత్తిచూపుతోన్న వేలనిపించింది.

పన్నెండు రోజుల తర్వాత శరీరాలు దగ్గరయి నప్పుడు మధ్య ఆ జ్ఞాపకం పరదా అడ్డు నిలబడింది.

‘‘ఏమిటండీ… అక్కడెక్కడన్నా గొడవ పడ్డారా!’’

‘‘ఒంట్లో బాగులేదా?’’ ‘‘ఎం.డి. ఏమన్నా అన్నాడా?’’

‘‘యూనియన్‌ ‌ట్రబలా…’’ అని రిక్కి అడిగింది. ఏవో జవాబులు చెప్పాడు కాని తన చేతులు, తన మాటలు తనకే కృతకంగా తోచాయి.

ఆ నిర్మలమైన నిజం ముందు తన అబద్ధం ఎంత వికృతంగా ఉంది.

ఆ చిచ్చును ఇంకా తనలో ఉంచుకోలేక రెండురోజుల క్రింద ఒక రాత్రి చెప్పాడు రిక్కీతో… తళతళలాడే ఆ నయనాలను నీటి పొరలు కప్పుతుంటే, మంచులో తడిసిన పువ్వులాంటి ఆ మొహం వాడి పోతుంటే, ఆ అంతరాంతరాలలోని నవనీతంలాంటి నమ్మకం, ప్రేమ, అనురాగం, శరీరం, మనసు కలసిన ఒక మహానిజం ముక్కలవుతోంటే తన క్షణికోద్రేకం ఎంతటి ఘోరమో తెలిసింది.

అయినా సరే చెప్పేశాడు. కనీసం తామిక దాగుడుమూతల లాడనక్కరలేదు.

నేను మూర్ఖుడిని? నా దేవత కూర్చున్నచోట విరిగిన బొమ్మను కూచోబెట్ట యత్నించినవాడిని. ‘‘నన్ను ఎన్నన్నా అను- ఏమన్నా అను కాని మనిద్దరి మధ్య దూరం రానివ్వకు-’’ అని ఏడిస్తే ఆమె చీర కొంగుతో తుడిచింది.

కాని అయిదారు రోజులు మాటలు లేవు. ఆ తర్వాతయినా ఎవరో అపరిచితులు ఒక ఇంట్లో ఉన్నట్టుంది కాని ఆ మునుపటి వెలుగులేదు.

రెండు మనసులు, రెండు శరీరాలు ఒక్కటయిన చోట వంద మనసులు, రెండు శరీరాలు ఉన్నట్టయింది.

చివరికి ఇన్ని యాగాల తర్వాత శరీరం ద్వారా నయినా మనసును మనసుకు దగ్గరగా చేరుద్దామని, అంతరంగం మీది గాయాన్ని పెదాల తడితో తుడుద్దా మని కొత్తగా వచ్చిన ఈ అగాధాన్ని జంటగా ఎగిరి దాటి అదిగో అవతల ఉన్న తమ పూర్వపు నందన వనంలోకి వెళ్దామని ప్రయత్నిస్తే రిక్కీ అడిగింది. ‘ఎలెన్‌’ ‌కూడా ఇలాగే అందా?

హు!

తన మనసున నాటిన ఒక ముల్లులాంటి అనుభవాన్ని పెకలించి ఆమె మనసులో జ్ఞాపకంగా నాటాడు.

తను చేసింది సరియేనా?

ఆమె మనసు అరిటాకు మీద నాటిన ఆ ముల్లుకు- పాపం, ఆమె ఎంత విలవిలలాడుతున్నదో.

ఆ ముల్లును తీసి పారేయగల శ్రావణం – కాలమా లేక తమ తమ అనురాగమా?

– ఇంకో సిగరెట్‌ ‌వెలిగించాడు రామకృష్ణ.

తూర్పు ఆకాశం మీద సన్నని వెలుగురేఖ పొడ సూపింది.

– ‘శివాన్విత’ నుంచి

About Author

By editor

Twitter
Instagram