– గంటి భానుమతి

జాగృతి – ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో మొదటి బహుమతి పొందిన రచన

ఎవరో గట్టిగా మాట్లాడుతూంటే ఈ లోకంలోకి వచ్చింది. తను వెళ్ళాల్సిన ఏర్‌లైన్స్ ‌కౌంటర్‌ ‌వైపు చూసింది. ఖాళీ. ఎవరూ లేరు. బోర్డింగ్‌ ‌పాస్‌ ఇవ్వలేదు. బాగేజి తీసుకోలేదు. ఇంకా టైముందేమో అనుకుని మళ్ళీ కళ్ళు మూసుకుని కూచుంది.

 కలకలం. హడావుడిగా మాడ్లాడుతున్న మనుషులు. అంతవరకూ గతాన్ని తలపోస్తున్న సుధీర గబుక్కున కళ్ళు తెరిచింది. అటూ ఇటూ తిరుగుతూన్న వాళ్ళు, ఓ చోట గుంపులుగా నుంచుని మాట్లాడు తున్న వాళ్ళు.

‘‘ఏమైంది?’’ అని అడిగింది.

‘‘ఢిల్లీ వెళ్ళే ఫ్లైట్లలో బాంబులు పెట్టారని తెలిసిం దిట. ఎన్ని ఫ్లైట్లలో పెట్టారో తెలీదుట. అందుకని అవి డిలే అవుతాయిట. కాన్సిల్‌ ‌కూడా అయ్యాయని అంటున్నారు.’’

సరిగ్గా అదే సమయానికి విక్రాంత్‌ ‌ఫోన్‌ ‌వచ్చింది.

‘‘న్యూస్‌ ‌నీకు తెలిసిందో లేదో అని ఫోన్‌ ‌చేస్తున్నాను. నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. బాంబు పెట్టారని ఫ్లైట్లు డిలే అయ్యాయని తెలిసింది. కొన్ని ఇప్పటికి కాన్సిల్‌ అయ్యాయని అన్నారు. నువ్వు వచ్చెయ్యి!’’

ఆమెకేం చెయ్యాలో తెలీలేదు. ఏంటిలా జరిగింది.! వెళ్ళిపోదామనుకున్న తను మళ్ళీ అదే ఇంటికి వెళ్ళాల్సివస్తోంది.

‘‘ఇంక ఆలోచించకుండా ఇప్పటికి వచ్చెయ్యి. నామీద కోపంతో అక్కడే ఉండిపోకు. మరో రోజున వెళ్దువు!’’ మరో అరగంటకి తన టిక్కట్టు వాళ్ళకిచ్చి తన కాంటాక్ట్ ‌నంబరూ అదీ ఇచ్చి బయటికి వచ్చింది. బయటికిరాగానే విక్రాంత్‌ ‌కనిపించాడు .

 కారులో కూచుంది కానీ, మనసులోనే ఏడుస్తోంది. ఇంత వరకూ ఉన్న ఉత్సాహం, చైతన్యం, రెండు కూడా రాత్రి కాగానే నిర్జనం అయ్యే వీధిలా పక్షులు గూళ్ళకి వెళ్ళిన ఆకాశంలా, మనసు అయిపోతుంది.

‘‘సుధీరా!’’ ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చి పడింది సుధీర. కారు ఓ పక్కగా ఆపాడు విక్రాంత్‌. అప్పుడు గమనించింది, కారు నడుపుతున్నది సీతారామ్‌ ‌కాదు, విక్రాంత్‌ అని.

‘‘నిన్నొకటి అడగాలని ఇక్కడ ఆపాను. నీతో మాట్లాడడం కోసమే సీతారాంని పంపించేసాను. అడగనా?’’

సుధీరకి తెలుసు అతను ఏం అడగ దలుచుకున్నాడో. అయినా తల ఊపింది, ‘చెప్పు’ అన్నట్లుగా.

‘‘ఇప్పుడు చెప్పు. నువ్వు నిజంగానే వెళ్ళిపోవాలను కుంటున్నావా?’’

సుధీర ఆశ్చర్య పోలేదు. ఆమె ఊహంచిందే. సమాధానం ఆమె దగ్గర సిద్ధంగా ఉంది.

‘‘అవును. నాకు ఈ జీవితం నచ్చలేదు. నువ్వు, నీ ఉద్యోగం మానేస్తావో లేదో ఇప్పుడు నాకు అనవసరం. నిన్నటి వరకూ నీతో వద్దామనే అనుకున్నాను. కానీ నువ్వు కదిలే ప్రయత్నాలేం చెయ్యడం లేదు. నాకు ఈ లేజీ ప్రపంచం నచ్చలేదు.’’

‘‘అప్పుడే అలా అనేస్తే ఎలా? మనం వచ్చి ఒక నెల కూడా కాలేదు. మనం అమెరికా వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. అయినా అమెరికానే జీవితం కాదు. దానికి అవతల కూడా జీవితం ఉంది. నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను నిన్ను ఒక సాయం అడగాలని ఇక్కడికి తీసుకొచ్చాను.’’

తను అడగాలనుకున్నది సాయమా ! చస్తే చేయదు.

ఆమె మౌనం చూసి ధైర్యంగా నోరు విప్పాడు.

‘‘మనం బెంగళూరు వెళ్ళాలి.’’

ఉత్సాహంగా చూసింది.

‘‘ అమెరికా వద్దనుకున్నారు, బెంగళూరులో ఉద్యోగం వచ్చిందా?’’

‘‘కాదు, మా చెల్లెలు దగ్గరికి!’’

‘‘చెల్లెలా! మీకు ఓ చెల్లెలుందని తెలుసు కానీ తను మన పెళ్ళికి రాలేదు.’’

‘‘అవును రాలేదు. రాలేకపోయింది. కారణం ఉంది. తనకి కంప్లీట్‌ ‌బెడ్‌ ‌రెస్ట్ అవసరం. ఈ రెండు నెలలు మా అక్క ఇంట్లో ఉంది. అందుకే అక్క కూడా మన పెళ్ళికి రాలేదు. నిన్న ఆమెని ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అమ్మని రమ్మనమని అక్క ఫోన్‌ ‌చేసింది. అమ్మకి కష్టం. నీల ఇంట్లో ఉన్నప్పుడు అక్కకి అంత ఇబ్బంది లేకపోయింది. ఇప్పుడు ఆసుపత్రి అంటే అటూ ఇటూ తిరగడం అదీ..’’

 సుధీరకి అర్థం అయింది. ఇప్పుడు తను ఆమెకి అటెండర్‌గా వెళ్ళాలి. అసలు తనని గురించి ఏమనుకుంటు న్నాడు? ఢిల్లీ లాంటి ఊళ్ళో చదువుకుని ఉద్యోగం చేసిన తనని, తన చెల్లెలిని చూసుకోవడానికి వెళ్ళమంటున్నాడు. ఇది అవమానం. అందుకే, ‘ఆమెకి ఏమైంది? ఎందుకు కంప్లీట్‌ ‌బెడ్‌ ‌రెస్ట్ అవసరం వచ్చింది’ అని అడగడానికి మనసొప్పలేదు.

ఆమె మౌనంగా ఉండడం చూసి తనే మాట్లాడాడు.

‘‘ మామూలుగా అయితే అమ్మ, నాన్నగారు వెళ్ళాలి. కాని నాన్నగారి ఎముక విరిగింది. పూర్తిగా అతుక్కోడానికి ఇంకో రెండు నెలలు పడ్తుందని డాక్టర్లు అన్నారు. అందుకని అమ్మ వెళ్ళడానికి లేదు. ఇది కొన్నిరోజులకి మాత్రమే. ఆ తరవాత అమ్మ ఏదో పరిష్కారం చూస్తానంది.’’

‘‘అంటే అంత వరకూ నేను ఆమెని ఓ ఆయాలాగా చూసు కోవాలా?’’ టక్కున అంది.

విక్రాంత్‌కి ఏమనాలో తెలీలేదు.

‘‘పోనీ ఉండక్కర్లేదు. ఓసారి మనం వెళ్దాం. పెళ్ళయ్యాకా చూళ్ళేదు కదా. ఓసారి నిన్ను చూసినట్లవుతుంది!’’

‘‘సరే అయితే! బెంగుళూరు నుంచి వచ్చాకా నేను ఢిల్లీ వెళ్ళిపోతాను. ఆ తరవాత ఏ సంగతీ తేల్చాల్సింది మీరే!’’

 తను ఎంతో ఇష్టపడి పెళ్ళి చేసుకున్న ఈమెకి, తన ఇంటి పరిస్థితి, తన పరిస్థితి ఎందుకు అర్థం కావడం లేదు? ఏం చెయ్యాలో బెంగళూరు నుంచి వచ్చాకా ఆలోచించచ్చు. కాని ఆలోచిస్తే సొల్యూషన్‌ ‌దొరుకుతుందా! ఇక్కడ అసలు సొల్యూషన్‌ అనే దానికి అర్థం ఏంటీ? విడిపోవ డమా? ఏం జరిగిందని విడి పోవాల్సి వస్తోంది! కారణాలు వింటే ఎంత సిల్లీగా అనిపిస్తోందో! అసలు సుధీర తనని పెళ్ళి చేసుకోడానికి కారణం అమెరికానా, తనా? అమెరికా వెంటనే వెళ్ళకపోవ డానికి కారణం ఆమెకి బాగా తెలుసు. వెళ్ళనంత మాత్రాన విడిపోవడమేనా ! అదొక్కటే పరిష్కారమా! ఆమె చదువు ఆమెకి అర్థం చేసుకునే శక్తి ఇవ్వలేదు. మెచ్యూరిటీ లేదు.

‘‘సరే. కాని ఒక్కరోజే ఉంటాను. ఆ తరవాత ఉండమన్నా ఉండను!’’ ఆ మాటలకి విక్రాంత్‌ ‌నీరు కారిపోయాడు. ఈ వైవాహిక జీవితం ఎలా ముగుస్తుందో! ఎలాంటి ముగింపు ఇస్తాడో ఆ దేపుడు!

ఇంటికి వెళ్ళాకా సంగతి తెలుసుకున్న కామాక్షి, ఊపిరి పీల్చుకుంది.

‘‘నీల నన్ను రమ్మని ఫోన్‌ ‌చేసింది. నాకు కుదరదు. ఎవరో ఒకరు దొరికే వరకు సుధీరని పంపుదాం అనుకుంటే తను ఢిల్లీ వెళ్ళింది, దుర్గని పంపిద్దామని అన్నాను. కాని ఆ దేవుడు అన్నీ విన్నట్లు, అందుకు సమాధానమన్నట్లు నిన్ను పంపించాడు. లేకపోతే బాంబులున్నాయంటూ ఫ్లైట్లు కాన్సిల్‌ అవడం ఏంటీ? అన్నీ మన మంచికే అనుకుందాం! ఓసారి మీఇద్దరూ వెళ్ళిరండి. నేను ఓ ఇద్దరిని కాంటాక్ట్ ‌చేసాను. వాళ్ళు ఏసంగతి రెండు రోజుల్లో చెప్తామని అన్నారు. అంత వరకూ మీరిద్దరూ అక్కడ ఉండండి!’’

సుధీరకి కోపం వచ్చేస్తోంది. సమాధానం చెప్పడానికి ఇష్టపడక అక్కడి నుంచి వెళ్లి పోయింది. ఆ రోజంతా ఇద్దరూ మాట్లాడుకోలేదు.

ఆ మర్నాడు ఉదయాన్నే ఇద్దరూ విక్రాత్‌ అక్క వినోద ఇంటికి బెంగళూరు వెళ్ళారు.

 వినోద ఇల్లు చాలా పెద్దది. చుట్టూ కాంపౌండు, చెట్లూ మూలంగా అందంగా కనిపించింది. ఆ ఇంట్లో వినోద, భర్త, ఇద్దరు పిల్లలు, అత్తగారు మామగారు. ఉంటారు. ఆమె భర్త పెద్ద ఉద్యోగస్థుడు. నెలలో ఓ నాలుగైదు సార్లు ఇతర దేశాలకీ, సిటీలకీ వెళ్ళాల్సి వస్తూంటూంది. అందుకే ఇంటి బాధ్యత అంతా వినోదదే.

గేటు శబ్దం వినగానే, వినోద నవ్వుతూ ఎదురొచ్చింది.

 వినోద ఎంతో ఆప్యాయంగా సుదీరని దగ్గరికి తీసుకుంది. ప్రేమగా పలకరించింది. పెళ్ళికి రాలేక పోయినందుకు కారణం చెల్లెలు వినీల పరిస్థితి అని సంజాయిషీ ఇచ్చింది. పెట్టెలు పెట్టుకోడానికి గది చూపించింది. సుధీర అటూ ఇటూ వెళ్తూ ఇంటిని పరిశీలిసోంది. ఖరీదైన ఫర్నిచర్‌ ఆ ఇం‌టి ఆర్ధిక స్థితిని చెప్తోంది.

 ‘‘చెల్లి ఇన్ని రోజులూ ఇంట్లోనే ఉంది. మొన్న రాత్రి కొంచెం తేడాగా ఉంటే డాక్టరుకి చూపించాం. వెంటనే అడ్మిట్‌ అవాలని అన్నారు. అందుకని దాన్ని అక్కడే ఉంచి రాత్రి చెప్తే కంగారు పడతారని పొద్దున్నే అమ్మకి విషయం చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు నాన్నగారికి ఎలా ఉంది? తుంటి ఎముక కదా విరిగింది! సద్దుకోడానికి చాలా రోజులు పడుతుంది. అక్కడ మూమెంట్‌ ఎక్కువ. అందుకే అతుక్కోడానికి టైం తీసుకుంటుంది. మామ్మ పోయాకా అమ్మ మరీ ఒంటరిదైపోయి ఉంటుంది. సరే దుర్గ ఉందనుకో!’’

 దుర్గ గుర్తొచ్చింది. ఎక్కడో పుట్టింది. తల్లి లేదు. తండ్రి చేతులు దులుపుకున్నాడు. ఎక్కడో పెరిగింది. ఏమాత్రం పరిచయం లేని ఊరుకొచ్చింది. తనకన్నా ఓ పద్దెనిమిదేళ్ళు పెద్ద అయిన మనిషిని పెళ్ళి చేసుకోవాల్సి వచ్చింది. తను కనని పిల్లలకి తల్లయింది. అందులో ఏదీ కూడా తను కోరుకున్నది కాదు. కాని ఆమె అన్నింటికీ రాజీపడిపోయింది. జీవితం ఎలా ఎదురొస్తే దాన్ని అలాగే ఆహ్వా నించింది. ఉన్న దానితో సంతృప్తిగా ఉన్నట్లు కనిపిస్తుంది. నాకు సమాజంలో గౌరవప్రదమైన హోదాని కల్పించిన మామ్మగారికి, కామాక్షి పిన్నికి ఈ జన్మలో నా రుణం తీర్చుకోలేను అని అంది. ఎప్పుడూ చలాకీగా, అటూ ఇటూ తిరుగుతూ అందరి నోట్లో నాలుకలా ఉంటోంది. ఇక్కడ జీవితానికి అర్థం జీవితం ఏమిటి ! ఎలా ఎదురైతే అలా చేతులు చాపి దానినే ఆహ్వానించడమేనా? తను ఆ పని చేయగలదా! అదే జరిగితే, తమ అమెరికా ప్రయాణం లేకపోతే ఈ పల్లెటూరి జీవితాన్ని ఆహ్వానించినట్లు కాదా! ఆ పని మనస్పూర్తిగా చేయగలదా!

ఈ లోపల ఓ మనిషి కాఫీలు తీసుకొచ్చింది. ఆ పక్కనే వినోద కూడా ఉంది.

‘‘ఏదైనా లైట్‌గా తింటారా? వంటవుతోంది. భోంచేసాకా మనం వినీలని చూడ్డానికి వెళ్దాం!’’

‘‘ ఏం వద్దు! ఫ్లైట్‌లో మంచి బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చాడు. ఇప్పుడు కాఫీ తాగాం. ఓ రెండుగంటల వరకూ పరవాలేదు. వినీల దగ్గర ఇప్పుడెవరున్నారు? అని అడిగాడు విక్రాంత్‌.

 ‘‘ఎవరూ లేరు. దీన్ని అబ్సర్వేషన్‌లో పెట్టారు. అలాంటప్పుడు నేను అక్కడ ఉండీ లాభం లేదు. ఇంక నా అవసరం ఉండదని నేను ఇంటికి వచ్చాను. వినీల మొగుడు కిషోర్‌ ‌రోజూ ఫోన్‌ ‌చేస్తున్నాడు, ఎలా ఉందని! తనకి ఓ రెండు నెలల వరకూ రావడానికి లేదుట. దాని అత్తగారూ మామగారూ ఇద్దరూ కోడలి డెలివరీ కోసం యూఎస్‌ ‌వెళ్ళారు. వాళ్ళు కూడా ఇప్పుడప్పుడే ఏం రారు. మామ్మ పోకుండా ఉంటే నాన్నగారికి ఎముక విరిగేది కాదు. అప్పుడు అమ్మా నాన్నగారు ఇద్దరూ ఇక్కడికి వచ్చేద్దురు. దుర్గని మామ్మ దగ్గర ఉంచేసి వచ్చేవారే..’’

‘‘ఇప్పుడు వినీలకి ఎన్ని వారాలు?’’ అని అడిగాడు.

‘‘ఇరవై ఐదు. ఇది వరకు రెండు అబార్షన్స్ అయ్యాయి కదా! అందుకే బెడ్‌ ‌రెస్ట్.’’

‌సుధీరకి కొంచెం కొచెం అర్థమయింది. ‘పాపం’ అనుకుంది.

విక్రాంత్‌ ‌సుధీర హాస్పటల్‌కి వెళ్ళి వినీల గురించి కనుక్కున్నారు. ఆమె ఉన్న రూం కి వెళ్ళారు. సుదీరని చూసి పలకరింపుగా నవ్వింది. ఆమె నవ్వినందుకు జవాబుగా ఎలా ఉంది అని అడిగింది సుధీర.

‘‘బావుందని చెప్పను. ఏం బాగా లేదు. నొప్పులు వస్తున్నాయి. కాంట్రాక్షన్స్ ‌వస్తున్నాయి. వీపు కింద భాగం కూడా బాగా నొప్పిగా ఉంది. ఏమాత్రం సుఖంగా లేదు. ఎంతో అనీజీగా ఉంటోంది. అసలు ఏ మాత్రం కంఫర్టబుల్‌ ‌గా ఉండడం లేదు. పరిస్థితి చూసి, ఆపరేషన్‌ ‌చేస్తే చేయచ్చు. ఏంటో భయంగా ఉంది!’’ అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకుంది.

విక్రాంత్‌కి ఏం అనాలో తెలీక మౌనంగా ఉన్నాడు. సుధీర కలగ చేసుకోక తప్ప లేదు.

‘‘ఊరుకో. నీకు ఏంకాదు. అంతా సవ్యంగా జరుగుతుంది!’’ అంటూ ఆమె పక్కన నుంచుని, ఆమె తలని తన కడుపుకి ఆనించుకుంది సుధీర.

ఆమెకే ఆశ్చర్యం అనిపించింది. తనేనా అలా మాట్లాడింది? కారణం తను ఓ మనసున్న ఆడది కాబట్టి. జాలిపడే గుండె ఉంది కాబట్టి అలా మాట్లాడింది. సహజంగా వచ్చేసింది.

‘‘అంతా సవ్యంగా జరగాలి. అదే మాకు కావాలి. అందరం అలాగే కోరుకుంటున్నాం. వదినా! ఈ పాప మాకు కావాలి, ఈ పాప మాకు ఎంతో విలువైనది. ఈ పాప కడుపులో పడినప్పటి నుంచి మాకు ఒకటే బెంగ. మా ఇద్దరి ప్రయాణం ఎక్కడికి తీసుకెళ్తుందో తెలీదు. సరిగ్గా గమ్యం చేరుకుంటుందా లేదా అన్న భయం. రోజులు గడుస్తున్నకొద్దీ లోపల లోతుల్లో బాధ ఎక్కువైతున్న కొద్దీ ఈ పాప మీద ప్రేమ ఎక్కువైపోతోంది!’’ అంటూ కళ్ళు తుడుచుకుంది.

‘‘ఏడవకు వినీలా!’’ అంటూ ఆమె తల నిమిరింది సుధీర.

‘‘ఏడవకుండా ఎలా ఉంటాను! లేదు వదినా! ఈ నొప్పులూ అవీ చూస్తూంటే ఈ పాప ఇప్పుడో అప్పుడో పుడ్తుందనిపిస్తోంది. ఇప్పుడు పుడితే బతుకు తుందా? ఇప్పటికి ఇరవై ఐదు వారాలు మాత్రమే నిండాయి. ఇప్పుడు పుట్టిన పిల్లలు బతుకుతారా? ఆరునెలలు అంటే చాలా ముందర. కాని పాప మాత్రం లోపల్నించి బయటికి రావడానికి చాలా తొందరపడ్తోంది. బయటికి రాకుండా ఆపలేం కదా!’’

 అంతలో సిస్టర్‌ ‌వచ్చింది. ఆ వెనకాలే ఇద్దరు తెల్ల కోట్లు వేసునున్న డాక్టర్లు వచ్చారు.‘‘వీళ్ళిద్దరూ పీడియాట్రీషియన్స్!’’ అని పరిచయం చేసారు. వినీలని పక్కకి తిప్పి పడుకోపెట్టింది. ఆ వెనకే మరో డాక్టరు ఎనస్థటిస్ట్ ‌వచ్చి, వెన్నెముకి ఎపిడ్యూరల్‌ ఎనస్థిటిక్‌ ఇచ్చింది. అందర్ని బయటికి వెళ్ళమన్నారు.

‘‘వినీలా ఎలా ఉంది? నొప్పులు బాగా ఉన్నాయా? ఇప్పుడు ఏం పరవాలేదు. కాస్సేపైతే కింద భాగం అంతా తిమ్మిరెక్కినట్లుగా ఉంటుంది. స్పర్శ ఉండదు. ఇప్పుడు డైయలేట్‌ అవుతుంది. కాబట్టి ఇంక ఎక్కువ సమయం తీసుకోదు.’’

అలాగే అయింది.

‘‘ఇప్పుడు పెద్ద రిలీఫ్‌గా అద్భుతంగా అనిపిస్తోంది. ఇంక ఎంతోసేపు పట్టదనిపిస్తోంది!’’ అంది వినీల.

ఆమెని లేబర్‌ ‌రూంకి తీసుకెళ్తూంటే అక్కడి నుంచి బయటికి వచ్చేసి ఆమెతో పాటూ వాళ్ళిద్దరూ రూమ్‌ ‌వరకూ వెళ్ళారు. తలుపులు వేసేసారు. వాళ్ళిద్దరూ అక్కడే ఆగిపోయారు. బయటకొచ్చి సుధీర విక్రాంత్‌ ‌కూచున్నారు. ఇద్దరికీ కొంచెం ఆందోళనగానే ఉంది. సుధీరకి ఇదంతా అయోమయంగా ఉంది. ఫలానా ఆమెకి డెలివరీ అయింది. ఈమెకి కూతురు. ఫలానా ఆమెకి కొడుకు. సిజేరియన్‌ ‌చేయాల్సి వచ్చింది. కానీ తల్లీ పిల్లా కులాసాగా ఉన్నారు. ఇలాంటివి వింది కానీ, ఇది ఎప్పుడూ చూళ్ళేదు. ఓ జీవి కడుపులోంచి బయటికి రావాలంటే ఇంత కష్టమా!

రేపు తనకైనా ఇంతేనా! ఇంత యాతన అనుభవిస్తేనే గాని పిల్లలు పుట్టరా ! అదే మాట పైకి అంది. ఓ క్షణం ఆమెవైపు చూసి మొహం తిప్పుకున్నాడు. తనలాగే ఈ విషయం గురించే ఆలోచిస్తున్నాడనిపించింది.

(ఇంకా ఉంది)

About Author

By editor

Twitter
Instagram