– కవికొండల వెంకటరావు

జన బాహుళ్యం కోసం గాను సేవ నెరపుతూ, స్వార్థమునకుగాని చిరునవ్వు నవ్వుతూ వున్నారా అన్నట్టు ఒక్కొక్కసారి ముఖవికాసం వెలిబుచ్చుతూ – పొట్ట గడవక అవసరం పడి ఎండలో చెమట్లు కక్కుతూ వున్నారా అన్నట్టు ఒక్కొక్కసారి నడుం నిలుపుకుంటూ అయిదారుగురు కార్మికాంగనలు పట్నంలో మిట్ట మధ్యాహ్నం ఆకాశం క్రింద నొక వలసగా గూర్చుని, బ్రష్షులు పెట్టి పాత రోడ్డు దుమ్ము తుడుస్తూ వున్నారు. వారి మునుముందు 30, 40 గజాల్లో ఉడుకు యంత్రాలు తారూ, ఇసకా, కంకరా కలిపి అడుగడుక్కి సరఫరా అయ్యేటట్టు పనిచేస్తూ వున్నాయి. వారి వెనుతట్టు నల్లని మెత్తమెత్తని ఘట్టిఘట్టి కలగలపు పఱపుమీద కోయిల కంఠస్థాయి నీలేశుకుంటూ రోలర్‌ ‌యంత్రం దొర్లుతూ వుంది. అటు నుంచి ఇటుగాని, ఇటు నుంచి అటుగాని జనాన్ని నడవనివ్వడం లేదు. బళ్లను పోనివ్వడం లేదు. ‘రాదారీ బంద్‌.’ ‌బంద్‌ అని రోడ్డుకడ్డంగా వెదురుకర్రలు గట్టి ఎఱ్ఱద్దాల లాంతరు తగిలించలేదు. ఊరకే ఉత్తిపీపాలు అడ్డగోడలా నిలబెట్టారు, జనం ‘దారిలేదు’ అని వూహించుకొనేటట్టు. ఆ పీపాల కంటే ఎత్తుగా నున్న పౌరులు పీపాలావల నుండి విడ్డూరంగా చూడొచ్చు, కొత్త పద్ధతిని పడుతూవున్న రస్తా ఏలా వేయబడుతూ వుందో.

 *     *      *

పైడి తల్లి ఆమె పేరు. ‘పైడితల్లొదినే అని’ సంబోధించేరు, మొగాళ్ళూ ఆడవాళ్ళూ కూడా ఆమెను వాళ్ళ వూళ్ళో. వాళ్ళ వూరు చక్కని పల్లెటూరు. ఆ పల్లెటూరు చుట్టూ చిక్కని తోటలు. ఆ తోటల్లో పగలు నడుస్తూ వుంటే సూర్యుని కిరణాలు ఆకులంట నేలకు వాల్తూ నల్లని నీడజాడలూ అవీ గాలికేకమై పైడితల్లి నడక్కి చుఱుకిచ్చేవి. ఆ తోటల్లో రాత్రిళ్ళు ‘నడుస్తూంటే మిణుగురు పురువులు పైడితల్లి కొప్పు చుట్టేశేవి – అదేదో ఆకుల జొంపం అనుకొనేటట్టు, వేఱే బంగారపు తిరితిరి తగిలింతలు అనవసరం అన్నట్టు.

అటువంటి పల్లెటూరిలో పొలం బయల పాటడి, పది కాలాలపాటు తిన్నాగానీ తరగని భాగ్యం గడించింది ఆమె. మనిషి మాంచి జభరైనమనిషి. జభరైన మనిషి గదా అని మోట కాదు. తాట మనిషి ఎంత వాడిగా చూస్తుందో అంత వాడిగాను చూడగలదు. అంత వడిగాను నడవగలదు. నల్లని ఛాయ, నల్లని ఛాయ అని కఱిమొద్దుపద్దు కాదు. తీరూ, తీయమూ ఉన్న స్త్రీ. చారిత్రక పరిశోధకున కిక్కడోపాఠం కనిపిస్తుంది. నాగరీకత యొక్క సోపాలనం ఎలా వుంటుందో!

మొదట్లో రైక తొడుక్కోవాలని తెలియనే తెలియదు ఆమెకు. ఎండా కొండా అనకుండా, తన పంచ భూతాత్మకమైన శరీరమంతా పంచ భూతాలకూ అర్పణంగా తిరిగి పుల్లా, పుడకా ఏరి తెచ్చుకొనేది, ఆ రోజుల్లో ఆమె చేతులు పొడూగుతా అంతా కేవలం మసిపూసినవతే. క్రమంగా ఊడ్పులకు, నూర్పుళ్ళకు వెళ్ళడం ప్రారంభించి మఱి పావల్డబ్బులు రోజుకు గడించడం నేర్చినకొద్దీ రయికలు మోచేతి పొడుగువి తొడుక్కుంటూ వచ్చేది. ఆ అలవాటు రోజుల్లో చాటుబలిసి ఆమె జబ్బలు అదో లేలేత చామనఛాయలోకి మారినాయి.

అయితే, మోచేతుల్దాకా వుండే రయిక మఱికొంత కాలానికో తీర్థంలో చూచిన తాత్కాలికపు పట్నవాసపు ఫాషన్‌ను అనుసరింపబోలు – టీకాల మచ్చల ప్రాంతానికి ఎగలాక్కుపోయింది. అలా కొంతకాలం అలవాటుపడ్డంలో శరీరకాంతి టీకాల దిగువను, మోచేతి ఎగువను ప్రత్యేకత వహించింది. ఇలాగ్గా ఆదిలో అంతా మిక్కిలి నలుపు శరీరమైనా, ఆచ్ఛాదన ఆనాచ్ఛాదనానుగుణంగా క్రమశః అచ్చటచ్చట లలిత శ్యామ మనోహరమై మూర్తీభవించింది.

 *     *      *

ఊడుపులుపని వానాకాలంలోను, మార్పుళ్ళపని శీతాకాలంలోను అయిపోవడంతో ప్రతి వేసంగీ వృధాగా పుచ్చడం ఏమీ బాగాలేదు; ఓ వేసంగికైనా పట్నవాసంపోయి అక్కడేమైనా పని దొరుకుతుందేమో తెలుసుకోవడం మంచిది అని తలపోసింది కొన్నాళ్ళ కోనాడు పైడితల్లి ప్రోడ.

ఆమె కాళ్ళకు కడి యాలు, అందెలూ ఎప్పుడూ వున్నవే. మఱిన్నీ చెవులకు బావిలీలు, కుంటేళ్ళు ఇలాంటివి కూడా ఎప్పుడూ శృంగారంగా ధగధగలాడిపోయీవే. ఎటొచ్చీ నాడు కొత్తగా గావించుకొన్న అలంకార మిదీ. ఎఱ్ఱని సన్నని కోక కట్టుకు, ఆ కోక వెనక్కు విరిచి వొడ్డాణంలో గుచ్చుకుంది. కనపడవద్దూ మఱి చూచేవాళ్లకు తన అందెలూ, కడియాలూ; సరే మామోలు మల్లేనే తెల్లటి టిన్‌ ‌రేకుది గిడసరయిక తొడిగింది. మెళ్ళో కంటె పెట్టుకుంది. మఱేవేవో నగలు ఉంచుకుంది. జుత్తు బాగా రెండు గుప్పిళ్ళతోనూ అదుముకు చక్కని దూముడిగా తీర్చింది. అద్దంలో చూచుకుంది. అలా చూచుకుంటూనే చెవులకు తెల్లరాళ్ళ దుద్దులెట్టుకుంది. బయల్దేరింది కాల్నడకను, నడుస్తూ ఆమె అలా ఓ చేత్తో తల నిమురుకుంటూ దూముడి వొత్తుకుంటూ వుంటే దుద్దులరాళ్ళ ముందువాళ్ళనూ, దుద్దుల సీలలు వెనకవాళ్ళనూ కూడా ఆకర్షించుకున్నాయి అనుకోండి. ‘ఎక్కడికో ఏదో లాభ సాటి చూపుమీద పోతూ

  వున్నావు పైడి తల్లీ; చెప్పవు కదూ?’ అని పలకరించనివారు లేరు, ఊరూ వాడా!

 *     *      *

తిన్నగా వచ్చి బజార్లో తనవైన మెచ్చుకోల్నడక లాపి, అక్కడ తారురోడ్డు ఎలా వేస్తూ వున్నారో చూస్తూ నిలబడిపోయింది ఉత్తిపీపాల కావల.

కంట్రాక్టరు బొజ్జన్న కనిపెట్టాడు పైడితల్లి రూపు రేఖలు. కేవలం పల్లెటూరి వాలకంగానూ లేదు. పట్నవాసపు వాటంగానూ లేదు. భాగ్యవంతు రాలిలాగూ లేదు, పేదరాలి మోస్తరుగానూ లేదు, ‘ఆ అమ్మి ఎవరైరా?’ అన్నాడు పక్క కూలీతో. పైడితల్లి వింది. ‘ఏం బాబా! నన్ను గురించేనా మీవూసు?’ అంది. కంట్రాక్టరు ‘ఆఁ’ అన్నాడు. పైడితల్లి అక్కడ రోడ్డు దుమ్ము తుడుస్తూ వున్న పాటకపు స్త్రీ జనాన్ని చూపుతూ ‘రోజు కూలి ఆళ్ల కేమిస్తారు బాబా!’ అని అడిగింది. ‘ఆరణాలు, రావాలని వుందా నీకూను ఈ పనిలోకి?’ అన్నాడు కంట్రాక్టరు. ‘ఎన్నాళ్ళుంటుంది?’ అని అడిగింది పైడితల్లి. ‘నెలమీద పదేనురోజులుంటుంది’ అన్నాడు కంట్రాక్టరు. ‘ఈ యేసంగి వెడుతుంది’ అంది పైడితల్లి. పైడితల్లికేసి కూలిజనం ఆడా, మగా అక్కడున్నవాళ్ళందరూ తేరిపార చూస్తూ విన్నారు. కంట్రాక్టరు ‘నిక్షేపంలా’ అన్నారు. పైడి తల్లి మరి పంచాంగం గించాంగం చూపించుకోలే; వెంటనే ఆ పనిలో రోజు కూలీగా జేరిపోయింది.

పనిలో ప్రవేశించినప్పటి నుంచి మొనకత్తై మెఱసి పోయింది. ముఖం వంచి బ్రష్‌పెట్టి రోడ్డు ధూళి తుడుస్తూ వుంటే ఆమె తుడిచినంత మేరా వెనుచూపులో ఆ రోడ్డుమీద ఆమె ముఖం ఆమెకు ప్రతిబింబంగా అగపించాలి! ఏమి పని మంతురాలు!

 *     *      *

అలాగ్గా నెలరోజులు పైడితల్లి ఏ రోజు కారోజు మస్తరి పిలుపుకు జవాబిస్తూ, తన మానాన్ని పనిచేసుకు ఏ రోజు ఆరణాలు ఆ రోజునే చేతిలో పడేసుకు, కంట్రాక్టరుకు దణ్ణంపెట్టి వెళ్ళిపోతూవుండడం రివాజుగా జరిగిపోయింది. 31వ రోజున పనిలోకి రాలేదు. ‘ఏం చెప్మా’ అంటే ‘ఏం చెప్మా’ అని కొంతసేపు అందరూ అక్కడివాళ్ళు యోజించారు. ‘రోజు కూలీ రాకపోతే విచారమెందుకు? కూలి దండగపడేది అదేను’ అని సమాధానపడ్డారు.

మర్నాడు పైడితల్లి మాటే మఱచిపోయినారు లోకులు.

 *     *      *

కంట్రాక్టరు అన్న నెలా పదిహేను రోజుల్లోనూ తార్రోడ్డు పూర్తి అయింది. ఆ రోజు 46వ రోజు. ఉదయాన్నే రోడ్డంతా పరిశుభ్రంగా నీళ్ళు పెట్టి కడిగించివేసినారు. అతి నల్లగా వుండి నూతన ఖద్యోతుని లేత కిరణాలకు నిగనిగలాడుతూ వుంది. అటువంటి రోడ్డుమీద ఆనాడు ముందుగా ఎవరి మోటారు కారు వెడుతుందో అని జనులు గుంపులు గుంపులుగా ఇటూ అటూ నిలబడి చూస్తూ వున్నారు.

అంత క్రితం సాయంత్రమే కంట్రాక్టరు తన కారు మిక్కిలి పరిశుభ్రంగా కడిగించి, తుడిపించి, మెరుగెట్టించి గారేజీలో నిలిపించుకొని యున్నాడు. అతగానిది మొట్టమొదటిదిగా వెళ్ళడానికి అవకాశం వుంది. లేదా జిల్లా కలక్టరుగారు వూళ్ళోకి వచ్చి మకాంచేసి యున్నారు. ఆయన కారు మొట్టమొదట నడచిపోవడాని కవకాశం వుంది. లేదా నాటిమెయిల్లో మినిస్టర్‌గారు దిగనైయున్నారు. వారి కారు పొయ్యే దాకా ఏ వొక్క పురుగునీ పాకనైనా పాకనీయరేమో ఆ రోడ్డుమీద.

ఈలాగ్గా వేయి విధాలుగా చెప్పుకుంటూ జనం నిర్ఘాంతపోయి కంటూ వున్నారు. రోడ్డు ఆరుదలకు వచ్చేసింది ఓ నిమేషంలో.

నిమేషంలో మెఱుపల్లే డాక్టరుగారు ఓ కారుమీద ఈ తట్టు నుంచి ఆ తట్టుకు ఆ రోడ్డుమీద సాగినట్టయింది. కారు సాగిసాగి కంట్రాక్టరు ఇంటివద్ద ఆగింది. కంట్రాక్టరుది. ఎక్కి తిరిగింది డాక్టరు!

డాక్టరు కారు ఆపి కంట్రాక్టరుతో వెంటనే ఇంగ్లీషు నన్నాడు, ‘‘I tested, The road is alright. The speed is alright, The cushion is alright’’ ఆమెను తీసుకువచ్చి యీ కారులో పండబెట్టండి. వెంటనే క్షయ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళి అక్కడ ఇన్పేషంటుగా చేర్పించాలి. లేకుంటే లాభం లేదు. ఇది ‘గ్యాలపింగు టైపు’ లా తోస్తుంది’’ అన్నాడు.

కంట్రాక్టరు అతి ఆదుర్దాగా ‘బతుకదూ! మా పైడితల్లి బతకదూ!’ అన్నాడు. డాక్టరు ‘చావుబతుకుల్ని గురించి ఎవరూ చెప్పలేదు. ఆలస్యం మాత్రం పనికిరాదు’ అన్నాడు. ‘నాకీ జబ్బు ఎక్కడ దాపరించింది అంటాడు డాక్టరుగారూ!’ అని అడిగింది రోగి. డాక్టరు ‘చూడమ్మా! నీవీ మధ్యను చేసినపని ఏం పనో చెబితే చెప్పగలను. ఇంతకూ క్షయకు అనేక కారణాలు వుంటాయి. అయినా ఇప్పుడు కాదు ఆ జ్ఞానం సంపాదించుకోవడం, రోగం రాకముందే జాగర్తపడి వుండవలసింది’ అన్నాడు. కంట్రాక్టరు ‘పదిహేను రోజుల క్రితం ఓ నెలరోజులు రోడ్డు దుమ్ము బ్రష్‌పెట్టి తుడిచింది ఈ కూలీ నాకింద, అంతకుమినహా చేసినపని మఱిలేదు.’’ డాక్టరు ‘ఇకనేం, అదే ఈ వ్యాధికి కారణం. క్షయదేవతకు మనుష్యు లందరూ సమానమే. అది ఉద్భవించేదే రోడ్డు దుమ్ములో. అందులోనూ ముక్కు ఆ దుమ్ముమీద పెట్టి- ఎంతకాలం నుంచి అలా ఆ దుమ్ములో అణగారి వుండి వున్నాయో బ్యాసిలీ!- ఆ దుమ్ము మీద మోము వంచి పీల్చిన తర్వాత క్షయ రాక మరేం జబ్బు వస్తుంది? బీదవాళ్లకు డబ్బు యిస్తూ వాళ్ల వల్ల పనిచేయించుకుంటూ వున్నామూ అంటే వాళ్ళ విషయమై కూడా తగిన జాగర్తలన్నీ తీసుకోవద్దటయ్యా కంట్రాక్టర్‌!’ అన్నాడు డాక్టరు. రోగి ‘నా అంతట నేనే ఈ పట్నవాసానికి వచ్చి, ఈ పనిలో కావాలని కోరి ఏరి చేరి ఈ రోగం తెచ్చుకున్నాను’ అంది. డాక్టరు ‘మఱి జాగువల్ల కాదు, ఆమెను మీ కారులో పరుండబెట్టించండీ కంట్రాక్టరుగారూ!’ అన్నాడు.

అక్కడ మఱిజనం ఎవళ్ళూ లేకపోవడంచేత కంట్రాక్టరు తన చేతులమీదనే ఎత్తి ఆ రోగిని కారులో పరుండబెట్టి తాను పక్కన కూర్చున్నాడు. డాక్టరు కారు నడుపుతూ ఉన్నాడు. రెండోసారి ఆ రోడ్డు మీదనే.

 *     *      *

రోగే పైడితల్లి, పైడితల్లే రోగి అని డాక్టరుగారి యొక్కయు, కాంట్రాక్టరు యెక్కయు సంభాషణ వల్ల వ్యక్తమైంది. కాని ఆ యుదయానికి ఆ అవస్థలో కంట్రాక్టరు ఇంటివద్ద పైడితల్లీ కనిపించడం అనేది ఎట్లా తటిస్థించిందో?

పాపం: పైడితల్లికి క్షయ : శరీరం యొక్క తూనిక సుతలాం లేదనుకోవలసిందే. అయినా సహజంగా తేజోవంతాలైన తన కళ్లు రెండూ వోచోట ఊతంగా పైకెత్తి చూచింది; నల్లనిరోడ్డు నిగనిగలాడే రోడ్డు గాంచింది. ‘ఇదేగా నే తుడిచిన రోడ్డు’ అంది.- ‘ఇదేగా నే బాగుచేసిన రోడ్డు’ అంది. ఆ మాట లంటూ తన కొన ఊపిరి ఆ నడుస్తూన్న కారులోనే విడిచింది.

ఆమె యొక్క భౌతిక నిష్క్రమణం కనలేక కాంట్రాక్టరు కంటతడి పెట్టుకొని గద్గదిగ్గా ‘డాక్టరుగారూ!’ అన్నాడు. డాక్టరు కారు ఆపి వెనక్కి చూచి నాడి పరీక్షించి ‘చనిపోయింది’ అన్నాడు.

కంట్రాక్టరు ‘ఇవిగో ఈమె వస్తువులు, డాక్టరు గారూ! ఇవి మీ కిస్తూవున్నాను. నా దగ్గఱ వుంచి నేను వాటిని మార్చి ఆమె చెప్పినదంతా చేయడానికి తగిన ధైర్యం లేదు. నా వద్ద ఆ ధైర్యం లేదు. ఎన్నిమాట్లు యోజించినా అడ్డుపీపాల ఆవల నుండి ఆమె ఈ వస్తువులు పెట్టుకుని, బాగుచేస్తూవున్న రోడ్డు చూచిన ఆమె నేలంక చూపే నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. ఆమె అన్న తుది పలుకులు నా మనస్సులో నిలవడం లేదు డాక్టరు గారూ’ అని అన్నాడు కంట్రాక్టరు మిక్కిలిగా ఏడుస్తూ.

డాక్టరు ఆ వస్తువులు చూస్తూ ‘ఈమె పేదరాలు కాదు. అరెరే! ఏమివ్యక్తి. ఇటువంటి భాగ్యశాలిని కూలిపని చేసి ఈలా మరణించిందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది దైవికం! దీనికై నీవు వగవబనిలేదు’ అంటూ కంట్రాక్టరును ఊరడించి ‘ఏం చెప్పింది తుదిపలుకు? అని అడిగాడు డాక్టరు.

‘ఏమీ లేదు. నిన్నటితో రోడ్డుపని పూర్తి అవుతుంది అని ఆమెకు తెలుసును. అంచేత నాకు కబురు చేసింది నిన్న రేత్రి. పూర్తి అయిందా అని అడిగింది. ఆయాసపడసాగింది. పూర్తి అయింది అన్నాను నేను. అనగానే ఆమె ‘మఱి నేబతకను కాని ఒకటి ఉంది.

రోడ్డుదమ్ము తుడిచిన ఆ స్త్రీలను పురుషులనూ ముస్తాబుగా దిద్దితీర్చి వాళ్లన్నందర్నీ చక్కని మోటారుకా ర్లెక్కించి ఒక్కతడవైనా ఆ రోడ్డుమీద తిప్పాలిసింది అని నా కోరిక. అందుకుగాను మీరు కారు కొనలేకపోదురేమో నాయీ వస్తువులమ్మి ప్రత్యేకంగా వాళ్లకో కారు కొని అలా నా సొమ్ము వినియోగించవలసింది’ అని చెప్పింది. నాకు మిక్కిలీ జాలి పుట్టింది. ఆమెను రాత్రికిరాత్రి నాయింటికి తీసుకువచ్చి, మీకు నేను ఉదయాన్నే వర్తమానించాను’ అన్నాడు కంట్రాక్టరు.

అంటూ కంట్రాక్టరు ‘మఱి బతకదూ నా పైడితల్లి’ అని అడిగాడు డాక్టర్ను. డాక్టరు మరొకసారి, పైడితల్లి పలికిన పలుకులజాడనే యోచిస్తూ ఆ కట్టెయొక్క పెదవులు నిదానించి పరికించి ‘మఱి బతకదు’ అన్నాడు.

ఆలా డాక్టరు నిరూపిస్తూవుంటే మృత్యు మార్గమును బట్టి పోతూవున్న పైడితల్లి యొక్క పొడుగు నీడగా కనబడింది నల్లని తార్రోడు.

About Author

By editor

Twitter
Instagram