– గంటి భానుమతి

జాగృతి – ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో మొదటి బహుమతి పొందిన రచన


ఓ గంట తరవాత సిస్టర్‌ ‌బయటికి వచ్చింది. ఇద్దరూ గబుక్కున లేచి నుంచున్నారు. ఆమె దగ్గరికి రాగానే ‘ఏం జరిగింద’న్నట్లు ప్రశ్నార్థకంగా చూశారు.

‘‘పాప పుట్టింది! కానీ స్పెషల్‌ ‌కేర్‌ అవసరం. అందుకని పాపని వేరే వార్డులో పెడతారు.’’ అంటూ వెళ్లిపోయింది.

సుధీర గబగబా ఓరగా ఉన్న తలుపు దగ్గరికెళ్లి చూసింది. ఓ పెద్దగది. మధ్యలో టేబుల్‌ ‌చుట్టూ ముక్కుకి, తలకి, ఒళ్లంతా ఆకుపచ్చటి డ్రెస్‌, ‌చేతులు అటూ ఇటూ కదులుతున్నాయి. ఒక్కసారి వెలుగు కిరణాలు మెరిసాయి. అదేంటో అని అలాగే చూస్తూ నుంచుంది. లైట్ల వెలుగుపడి, మెరుస్తున్న ఓ కాగితం చూసింది.

‘‘మీరిక్కడికెందుకు వచ్చారు? వెళ్లండి!’’ అంటూ సిస్టర్‌ ‌లేబర్‌ ‌రూమ్‌ ‌లోకి వెళ్లబోతూ అంది.

‘‘వెళ్తానండి… అదేంటి? పాపని అందులో చుడుతున్నారు?’’

‘‘అదా! మేము ఓ అల్యూమినియం ఫాయిల్‌లో పాపని చుడతాం. ఇది పాపాయికి వెచ్చదనం ఇవ్వడం కోసం. ఊపిరి పీల్చడంలో సాయపడడం కోసం ఓ ట్యూబుని ఊపిరి తిత్తుల్లోకి పంపిస్తున్నారు.

అక్కడున్నవాళ్లంతా దేవుళ్లలాగా అనిపించారు. ఎంతో అనుభవం ఉన్నవాళ్లు కాబట్టి, ఆ అరడజను మంది ఏవిధమైన కన్ఫ్యూజన్‌ ‌లేకుండా చకచకా ఎవరి పనులని వాళ్లు చేస్తున్నారు.

‘‘మేము పాపని చూడచ్చా?’’ ఆ తరవాత కనిపించిన నర్సుని అడిగింది సుధీర.

‘‘వీలు పడదు. ఎందుకంటే పాపని ఇంటెన్సివ్‌ ‌కేర్‌ ‌నర్సరీకి తీసుకెళ్లి పోతాం.’’

అక్కడి నుంచి తిరిగి వచ్చి, విక్రాంత్‌ ‌పక్కన కూచుంది. తను చూసింది చెప్పింది.

‘‘పాపని ఇంటెన్సివ్‌ ‌కేర్‌ ‌నర్సరీకి తీసుకెళ్తారుట, ఓసారి నేను కూడా వాళ్ల వెనకే వెళ్లి చూసి వస్తాను, ఎక్కడికి తీసుకెళ్తున్నారో!’’ అంటూ గబగబా వెళ్లింది.  అలాంటి వార్డు ప్రతీ ప్రసూతి హాస్పటల్స్‌లో ఉంటుంది.

వాళ్ల వెనకాలే సుధీర వెళ్లింది. ఆమె లోపలికి వెళ్తూనే తలుపులు వేసేసింది. ఆ తలుపు తీయడం, వేయడం- ఆ కాస్త సమయంలోనే లోపలికి తొంగి చూసింది. ఓ పెద్ద హాలు. ఒక్కసారి వేడి గాలి తాకినట్లనిపించింది. లోపలంతా గాజుపెట్టెలు, రకరకాల మానిటర్లతో ట్యూబులతో ఉన్నాయి. సన్నటి శబ్దాలు వస్తున్నాయి.

వాళ్లంతా ప్రాణాలున్న బొమ్మలు. జీవించ డానికి పోరాడుతున్న బొమ్మలు. మనసంతా ఒకలాగా అయింది. మెల్లిగా నడుచుకుంటూ విక్రాంత్‌ ఉన్న దగ్గరికొచ్చి కూచుంది. విక్రాంత్‌ ఆమె వైపు చూడలేదు. ఏమీ అడగలేదు.

‘‘ఇక్కడెందుకు కూచోడం! రిసెప్షన్‌లో కూచుందాం. వినోద వస్తుంది’’. ఇద్దరూ లేచి రిసెప్షన్‌ ‌హల్లో ఎంట్రెన్స్‌కి దగ్గర్లో ఉన్న కుర్చీల్లో కూచున్నారు. వాళ్ల మధ్య మాటలేం లేవు. వివాహబంధం గురించి భావి జీవితం గురించి, ఇద్దరూ కూడా రాబోయే రోజులు ఎంత అలజడిగా ఉంటాయో అనే దాని గురించి ఆలోచిస్తు న్నారు.

అంతలో గబగబా ఆయాసపడుతూ వినోద వచ్చింది.

‘‘వినీలకి ఎలా ఉంది? నొప్పులు వస్తున్నాయా? కులాసాగా ఉందా?’’

‘‘కులాసా ఏంటీ? పాప కూడా పుట్టింది!’’ అంది సుధీర.

వినోదతో ఓ గంట పరిచయం మాత్రమే. అయినా ఆమెతో తన స్నేహితురాళ్లతో మాట్లాడి నట్లుగా మాట్లాడింది.

‘‘అదేంటీ, అప్పుడే డెలివరీ కూడా అయి పోయిందా? అంటే ప్రిమెచ్యూర్‌ ‌బేబి అన్నమాట. అయ్యో పాపకేం భయం లేదు కదా! ఏం అన్నారు డాక్టర్లు?’’

‘‘ఆ విషయం మాకేం తెలీదు కానీ, పాపని మాత్రం ఇంటెన్సివ్‌ ‌కేర్‌ ‌నర్సరీకి తీసుకెళ్లారు. ఇంక్యుబేటర్‌లో ఉంచుతారనుకుంటాను.’’

అంతలో ఆ సిస్టర్‌ ‌తిరిగి వచ్చింది. వినోద ఆమెని ఆపింది.

‘‘పాపకి ఎలా ఉంది? మేం చూడచ్చా?’’

‘‘సారీ మేడమ్‌! ఆ ‌యూనిట్‌కి వెళ్లడానికి పర్మిషన్‌ ‌లేదు. అక్కడ పాపల్ని చూడడానికి అక్కడ హెడ్‌ ‌నర్స్, ‌బాగా ట్రైనింగ్‌ అయిన స్టాఫ్‌ ఉం‌ది. ఇద్దరు పీడియా ట్రీషియన్స్..  అం‌దరూ ఉన్నారు, మీరు ఏం భయపడకండి. పాప సేఫ్‌ ‌హాండ్స్‌లో ఉంది.’’

‘‘అయితే మనం ఇక్కడ ఉండీ చేసేదేం లేదు. ఓ చోట కూచుందాం. కాఫీ తీసుకొచ్చాను. పాపం వినీల కూడా తాగితే బావుంటుంది.’’

అక్కడినుంచి కదిలారు.

 మూడు డిస్పోసబుల్‌ ‌గ్లాసుల్లో కాఫీ పోసి వాళ్లిద్దరికీ ఇచ్చి తనోటి తీసుకుంది.

‘‘నెల తప్పినప్పటినుంచీ ఈ సమస్యలు మొదల య్యాయా..?’’ అడిగింది సుధీర.

‘‘పీరియడ్స్ ‌మిస్‌ అయినప్పుటి సంగతి మాకు తెలీదు. వినీల చెప్పలేదు. నేను ఓసారి వాళ్లింటి కెళ్లాను. కళ్లంబడి నీళ్లు పెట్టుకుంది. అప్పుడు అది చెప్తే తెలిసింది.’’

‘‘ఏమిటో! ఈ బిడ్డ కడుపులో పడ్డప్పట్నించీ సమస్యలే. మొదట్లో ఒంట్లో బాగాలేదు. తొందరగా అలిసిపోవడం, ఏదో అయిపోతున్నట్లనిపిస్తోందని, ఆందోళనగా ఉంటోందంటే ఆఫీసు కూడా మానేసింది. ఓ వారం బాగానే ఉంది. హటాత్తుగా చెమట్లు పడుతున్నాయిట. గుండె స్పీడుగా కొట్టుకోడం, స్పృహ కోల్పోతున్నట్లుగా అనిపిస్తోందంటే వినీల మొగుడు కిషోర్‌ ‌వచ్చి మా ఇంట్లో దింపాడు.’’

‘‘పూర్తిగా బెడ్‌ ‌రెస్ట్ అని డాక్టర్లు అన్నారు. ఎందుకంటే అంతకు ముందు రెండు అబార్షన్స్ అయ్యాయి కదా అని! ఎప్పటికప్పుడు భయమే. వారాలు లెక్కపెట్టుకుంటూ కాలం గడుపుతున్నాం. పన్నెండు వారాలయ్యాయి. పరవాలేదు. పధ్నాలుగు వారాలు మామూలుగా గడిచిపోయాయి. ప్రమాదం ఏం లేదని అన్నారు. మేం కూడా గండం గడిచిందను కున్నాం. కానీ కాదు. రోజు రోజుకి ఏదోఒకటి. ఇది ఎక్కడికి దారితీస్తుందో? కడుపులో ఎక్కడ ఏం జరుగుతోందో నని భయపడుతూనే ఉన్నాం. లోపం ఏమిటో కానీ, ఏదో జరిగింది. ఎక్కడో తప్పింది. అంతవరకూ అంతా బాగానే ఉంటుంది. బేబి బాగా ఉంటుంది. ఏం కాదు అన్న నమ్మకం.. విశ్వాసం.. అన్నీ ఎటో పోయాయి. కానీ ఎక్కడో చిన్న ఆశ. తుఫానులో కొట్టుటుంటున్న చిన్న దీపం లాంటిది.

 ‘‘ఇంకొక్క రెండునెలలు నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా లోపల బేబీ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అప్పుడే బేబి బయటికి వస్తుంది. నువ్వు చూడగలవు. అని రోజూ దానికి ధైర్యం చెప్పేదాన్ని.

‘‘నేను కూడా లోపలున్నపాపాయికి చెప్పే దాన్ని! పాపా! నీకేం పరవాలేదు. నువ్వు సేఫ్‌గా ఉన్నావు. నిన్ను మేం అందరం రక్షిస్తాం. లోపల బాగా లేదని అనిపిస్తోందా? నువ్వు అలా అనుకోకుండా మేం ఏదో చేస్తాం. అని మేం అనేవాళ్లం. కాని ఆ ఏదో ఏమిటో మాకూ తెలీదు. ఆ ఏదో మేం చెయ్యలేక పోయాం. సరే ఎలాగో అలాగా ఈ రెండు నెలలు గడిచిపోతే ఏడు నెలలు నిండుతాయి. ఏడో నెలలో పుట్టిన వాళ్లు బతుకుతారని ధైర్యం చెప్పాను. ఈ లోపులే లోపల యుటరైన్‌ ఇన్ఫెక్షన్‌ ‌సోకింది. అన్నీ ఇలా ఒక్కసారి వచ్చి దాని బేబీ మీద పడ్డాయి. ఆ తరవాత ఇదే జరిగింది.’’ అంది వినోద.

ఈ లోపల కాఫీలు తాగడం అయింది. అందరి గ్లాసులు వినోద తీసుకుని బయట ఉన్న డస్ట్‌బిన్‌లో పడేసి లోపలికి వచ్చింది.

‘‘వినీలని రూంకి తీసుకెళ్లారో లేదో నేను కనుక్కుంటాను, తెలివి వచ్చిందో లేదో చూసి, అప్పుడు వెళ్దాం.’’ అంటూ బయటికి వెళ్లింది. ‘నేనూ వస్తా’నంటూ సుధీర లేచింది. లేబర్‌ ‌రూంకి వెళ్తూంటే మధ్యలో నర్సు కనిపించింది. ఆమెని అంతకు ముందు సుధీర చూసింది కాబట్టి ఆపి, అడిగింది.

‘‘మేము వినీలని చూడచ్చా? లేబర్‌ ‌రూంలోనే ఉందా! రూంకి మార్చారా?’’

‘‘ఇంకా లేదు. రూమ్‌కి షిఫ్ట్ ‌చేసాకా చెప్తాను.’’ అంటూ వెళ్లిపోయింది.

మళ్లీ వినోద జరిగినవన్నీ చెప్తూ, తన మాటలు కొనసాగించింది. చాలా సమయం వరకూ అక్కడే కూచున్నారు.

అంతలో సిస్టర్‌ ‌వచ్చి, వినీలని చూడచ్చని చెప్పింది. అందరూ రూమ్‌కి వెళ్లారు.

వినీల మంచం మీద పడుకుని ఉంది. లేత నీలం గళ్ల ఆసుపత్రి గౌనులో తెల్లగా మెరిసిపోతోంది.

నుదుటి మీద చిన్న సన్న పాయలు వాలి ఉన్నాయి. విక్రాంత్‌ ‌పోలికలు బాగా ఉన్నాయని అనుకుంది. ఆ మాటే విక్రాంత్‌కి చెప్పాలనుకుంది. కాని తను విక్రాంత్‌తో మాట్లాడడంలేదని గుర్తొచ్చింది. ముగ్గురూ మంచానికి దూరంగా నుంచున్నారు.

‘‘పాపం బాగా అలసిపోయింది కదా! పడుకుంది. డిస్టర్బ్ ‌చేయకుండా ఇక్కడే కూచుందాం. అది లేచాకా మాట్లాడచ్చు!’’ అంది వినోద మెల్లిగా.

మాటలకి అలికిడికి, కళ్లు తెరిచి చూసింది. సగం సగం తెరిచిన కళ్లతో నీరసంగా ఉన్నా ఎంతో అందంగా కనిపించింది సుధీరకి. వినోదది మరో అందం. ఇద్దరూ అందగత్తెలే! వాళ్లమ్మ పోలిక.

‘‘పాపట కదా! సిస్టర్‌ ‌చెప్పింది.’’ అని అంది

‘‘అవును పాపే!’’ అంది సుధీర.

‘‘నువ్వు చూసావా…ఎలా ఉంది?’’ అంది వినోదని చూస్తూ.

‘‘ఇంకా చూళ్లేదు. ఓ రెండుసార్లు అడిగాం, ఓసారి పాపని చూస్తాం అని.  డాక్టర్లని అడిగి చెప్తానని అంది. ఆమె వెళ్లమన్నప్పుడు నువ్వు కూడా మాతో వస్తే, అందరం చూద్దాం!’’

మామూలుగా అప్పుడే పుట్టిన పిల్లల ఇంటెన్సివ్‌ ‌కేర్‌ ‌నర్సరీ అని న్యూ బార్న్ ‌బేబీ ఆసుపత్రి ప్రత్యేకంగా విడిగా ఉంటుంది. ఇది చాలా ఆధునిక ఆసుపత్రి కాబట్టి, ఇందులో ఉంది. ఇంకొన్ని పెద్ద మెటర్నిటీ ఆసుపత్రులలో ఇంటెన్సివ్‌ ‌కేర్‌ ‌నర్సరీలుంటాయి. అయితే ఆ యూనిట్‌ ఈ ‌వార్డ్‌కి బాగా దగ్గర్లోనే ఉంటుంది అని నర్స్ ‌చెప్పింది. ఇదే విషయాన్ని డాక్టర్‌ ‌కూడా చెప్పారు.

కాస్సేపు కూచున్నాకా ముగ్గురూ వినీలకి ధైర్యం చెప్పి, ఇంటికొచ్చారు.

‘‘నేను సాయంత్రం వెళ్లిపోతాను. ప్లీజ్‌! ‌నువ్వు ఇక్కడ దుర్గ వచ్చేవరకూ ఉండు.’’ అని భోంచేసాకా విక్రాంత్‌ ‌సుధీరతో అన్నాడు.

‘‘నేనా! నేనుండను. నాకిక్కడ పనేం లేదు. అసలు నేనెందుకుండాలి? వీళ్లకి నాకు ఏం సంబంధం? చెప్పండి! మన సంబంధమే సరిగా లేదు. అలాంట ప్పుడు ఎలా అడుగుతున్నారు. నన్ను చూడడానికి వచ్చినప్పుడు మీ వాళ్లు ఏం చెప్పారు. మీరు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారని, పెళ్లయిన వెంటనే నన్ను తీసుకెళ్తారని కదా! అవేం జరగలేదు. నేను కూడా అదే అనుకున్నాను. మీరు నన్ను పెళ్లిచేసుకుని అమెరికా తీసుకెళ్లలేదు. ఇప్పుడు అసలు ఆ ఊసే లేదు. అది వదిలేయండి. ఏర్పోర్ట్‌లో ఇమోషనల్‌గా బ్లాక్‌ ‌మెయిల్‌ ‌చేసారు. బెంగళూరు తీసుకొచ్చారు. వచ్చాక ఇప్పుడు ఇక్కడ మీ చెల్లికి, అక్కకి సాయం కోసం ఉండమంటున్నారు. నన్ను అడగడం అంటూ ఏం ఉండదా అన్నీ మీ ఇష్టమేనా? పెళ్లి కూడా అంతే. మీరు అన్నట్లుగా జరిగిపోవాలి. ఆగమేఘాల మీద ముహూర్తాలు పెట్టేసారు. మాకసలు టైమివ్వలేదు. అన్ని నిర్ణయాలు మీరే చేసారు. అసలు మా గురించి మీరేం అనుకుంటున్నారు? ఆడపెళ్లివారు ఒదిగి ఉంటారనుకుంటు న్నారా? పిల్లనిచ్చుకున్నంత మాత్రాన మమ్మల్ని ఇంతగా అవమానపరుస్తారా? అవన్నీ మర్చిపోతున్న ఈ సమయంలో నన్ను ఇక్కడ ఉండ మంటారా? నాకు ఎక్కడా ఉండాల్సిన పనిలేదు. ఢిల్లీ వెళ్ళి పోతాను. నా ఉద్యోగం నేను చేసుకుంటాను.’’

విక్రాంత్‌ ‌నిస్సహాయంగా ఆమెని చూసాడు. తన పరిస్థితి ఎంతో డెలికేట్‌గా ఉంది.

‘‘అమెరికా వెళ్లడానికి ఆలస్యం అవుతుందని, పైగా నా సర్టిఫికెట్లు తీసుకోవడం కోసం, నాకు రావలసిన డబ్బు అవీ నాలుగుసార్లు తిరిగేతే కాని ఇవ్వరు. అది కూడా చూసుకోడం కోసం ఉద్యోగానికి రిజైన్‌ ‌చెయ్యలేదు. అమ్మకి పవరాఫ్‌ అటార్నీ ఇచ్చాను. కానీ ఇప్పుడు వెళ్లి ఏదో కారణం చెప్పి, ఉద్యోగంలో చేరుతాను.’’

ఆమె మాటలు విన్నాక విక్రాంత్‌కి నోట మాట రాలేదు. ఏం మాట్లాడ లేదు. నీ ఇష్టం అని కూడా అనలేదు. భర్త ఏం మాట్లాడక పోయేసరికి ఆమెకి అహం దెబ్బతింది.

‘‘ఏం మాట్లాడరేం! నేనన్నది సబబుగా లేదా..?’’

‘‘ఎందుకెళ్తున్నావు అంటే నువ్వు ఏదో కారణం చెప్తావు. ఢిల్లీ నువ్వెందు కెళ్లావో మొదట్లో కొన్నిరోజులు అమ్మా వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. కానీ ఆ తరవాత సంగతి ఏంటీ… అందుకని ఓ పది రోజులుండు. తరవాత వచ్చెయ్యి.’’

‘‘నేను ఎన్నిరోజులుండాలో మీరు నాకు చెప్పడం ఏంటీ? నేను నా ఇష్టం వచ్చినన్ని రోజులుంటాను.’’

విక్రాంత్‌ ‌బొమ్మలా నుంచుండిపోయాడు. అతని దగ్గర మాటల్లేవు.

 ‘‘పెళ్లికి ముందు ఏం చెప్పారు? మాకు తెలిసిన వాళ్లందరికి నేను ఎంతో గర్వంగా చెప్పకున్నాను. నేను అమెరికాకి వెళ్తున్నానని ఇప్పుడు వాళ్లకి ఏం చెప్పాలో, నేను సమాధానాలు వెతుక్కోవాలి.’’

విక్రాంత్‌ ‌దగ్గర జవాబుల్లేవు. ఆమెని చూడడం మినహ మరేం చేయలేక పోయాడు. పెళ్లికి పెళ్లి చూపులు ఒక్కటే సరిపోదు. మనస్తత్వం తెలుసుకోడం కూడా ముఖ్యమే. ఢిల్లీలో సుధీరతో కలిసి తిరిగినప్పుడు ఆమె అర్థం అయినట్లనిపించింది. కానీ కాదా?

‘‘నేను ఇంటికొచ్చిన రెండురోజులకే మామ్మ పోయారు. అదే టైంలో రేవు నుంచి వస్తూ కింద పడి మీ నాన్న గారి హిప్‌ ‌బోన్‌ ‌విరిగింది. మైల, శుద్ధి, సమారాధన ఇలా రోజులు గడిచిపోయాయి. అవన్నీ అయ్యేసరికి ఈ బెంగళూరు ప్రయాణం. ఇప్పుడు నన్ను ఇక్కడ ఉండమని ఎలా అడుగుతారు? ఇక్కడున్న ఈ కొన్ని రోజుల్లో ఎన్నో జరగచ్చు- అనుకోనివి, అనుకున్నవి. అంతా మారిపోవచ్చు. కానీ నాకు మాత్రం నేను వేసిన గొంగడి వేసిన చోటే. నేను వెళ్తాను. వెళ్లీ, మళ్లీ జాయినవుతాను.’’

‘‘అందరూ అడగరా.. ఎందుకు ఉద్యోగంలో చేరుతున్నావని, మానేస్తున్నానని అందరితో చెప్పావు కదా…..’’

‘‘నేను ఎవరికీ ఉద్యోగం మానే•స్తానని చెప్పలేదు. సెలవులున్నాయి కాబట్టి, సెలవు పెడ్తున్నాని అన్నాను. నాకు కొన్ని పనులున్నాయి, అందుకని తరవాత నేను వెళ్తాను.’’

విక్రాంత్‌ ఏం ‌మాట్లాడ లేదు. చెప్పుకోలేని బాధ. నిజమే పెళ్లిచేసుకని ఒక్క నెల కూడా కాలేదు. అప్పుడే విడిగా ఉండే వరకూ వెళ్లిపోతోంది వ్యవహారం. నిజంగా సుధీర వెళ్లిపోతుందా! వెళ్తే ఇంట్లో ఏం చెప్పాలి? ఏం చెప్తే ఇంట్లో వాళ్లు కన్విన్స్ అవుతారు? అసలు ఈ బంధం నిలుస్తుందా! అమెరికాలో విడాకులు చాలా సాధారణ విషయంగా తీసుకుంటారు. కలిసి ఉండడం దుర్భరం అనిపిస్తే తప్ప విడాకులు వరకూ వెళ్లదు వ్యవహారం. ఇక్కడ తామిద్దరూ కలిసి ఉన్నదే చాలా తక్కువ. దుర్భరం అనిపించ లేదు. కలిసి ఉండడం కష్టం అనే విధంగా ఎప్పుడూ అనుకోలేదు.

(ఇంకా ఉంది)

About Author

By editor

Twitter
Instagram