శ్రావణ పౌర్ణమి (ఆగస్టు 22) సంస్కృత భాషా దినోత్సవం

భారత ప్రతిష్ఠ సంస్కృతంలో ఉంది; సంస్కృతిలో ఉంది; ఈ రెండూ భారతదేశ గౌరవ చిహ్నాలు. ఈ రెండూ భారతదేశం గొప్పతనానికి కారణాలయ్యాయి.

‘భారతస్య ప్రతిష్ఠే ద్వే/సంస్కృతం సంస్కృతి స్తథా!’ అన్న శ్లోక పాదాలను బట్టి పై విధంగా వివరించుకొన్నాం.

ఏ భాషలోని మంచిమాటనైనా సుసంస్కృత వాక్కు అనవచ్చు. సంస్కృతం అతి ప్రాచీన భాష. అంతకన్న ప్రాచీనంగా ఉన్న ప్రాకృత (ప్రకృతి) భాషలే సంస్కరింపబడి సంస్కృతంగా మారినాయనే వాదం ఉంది. కాదు, సంస్కృతమే వివిధ ప్రదేశాలలో వివిధ విధాలుగా పలుకబడి అనేక ప్రాకృతాలుగా మారిందనే వాదనా ఉంది. మొత్తం మీద సుసంపన్నమైన భాష సంస్కృతం అనేది ప్రపంచ మేధావులందరూ అంగీకరించారు.

భారతీయులైతే సంస్కృతాన్ని గీర్వాణ భాష అనీ దేవ భాష అనీ, అమర భాష అనీ పిలుచుకొంటారు. ప్రచార ప్రసార సాధనాలు అమరవాణి పేరిట ఈనాటికీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

భాష పుట్టిన రోజే భాషా దినోత్సవమా!

ప్రపంచంలోని ఏ భాషకైనా అది పుట్టినరోజు ఇదే అని ఆధారాలు చూపించే అవకాశం లేదు. అక్షరాలు-పదాలు-వాక్యాలు-పద్యాలు-గేయాలు-వివిధ సాహిత్య పక్రియలు ఇలా వికాసం జరిగిందనడం ఒక ఆలోచన. మనసులో పుట్టిన భావాలే సంజ్ఞలుగా-ధ్వనులుగా-నాద బిందు కళా రూపాలుగా మారి సారస్వత-సాహిత్య- వాఙ్మయాలుగా పరిణతి చెందాయన్నది మరో ఆలోచన. మనుసులో ఓ కారణం పుడితే అది కార్యరూపంగా అవతరించింది. అదే భాషా రూపమనేది పై అంశాన్ని బలపరిచే ఆలోచన.

ఎలాగైతేనేమి సంస్కృతం కూడా ఈ పరిణామాల ప్రాదుర్భావమే అన్నది సాదా సీదాగా చెప్పుకొనే విషయం. సంస్కృతంలో మొదటివి వేదాలు. అవి పుట్టినరోజు నిర్ణయించగలమా! అవి అపౌరుషేయాలు, బ్రహ్మముఖము నుండి ప్రాదుర్భవించాయి అనేది విశ్వాసం.

బ్రహ్మ నోట వచ్చిన ఆ పలుకులు విని వాటిని పలికిన మేధావులు రుషులు. బ్రహ్మ స్రష్ట; రుషి ద్రష్ట. అందువల్ల ప్రతి మంత్ర భాగంపైన ఆ రుషి పేరు ఉంటుంది. ఈ వేదాలతో బ్రహ్మ సృష్టి రచన చేస్తుండేవారు.

వేదాలు విజ్ఞాన భాండాగారాలు. వీటిని సోమకాసురుడు అపహరించి సముద్రంలోకి తీసుకొని వెళ్లాడని, విష్ణుమూర్తి మత్య్సావతారమెత్తి అతణ్ణి సంహరించి, ఆ వేదాలను తెచ్చి బ్రహ్మకిచ్చాడని భాగవత  పురాణం చెబుతున్నది.

దేవీ భాగవతంలో ఇందుకు భిన్నమైన కథ ఉంది. వేదాలను మధుకైటభులు అపహరించారనీ, బ్రహ్మదేవుని కోరిక మేరకు విష్ణుమూర్తి హయగ్రీవునిగా మారి, బయలుదేరి సముద్రంలో శోధించి, వేదాలను కనుగొని తెచ్చి బ్రహ్మకిచ్చాడనీ, మధుకైటభులు హయగ్రీవుణ్ణి యుద్ధానికి ఆహ్వానించగా, యుద్ధంచేసి వారిని సంహరించాడని ఉంది.

ఏ రోజు వేదోద్ధరణ జరిగిందో ఆరోజు శ్రావణ పూర్ణిమ అని వేద పండితులు నిర్ణయించారు. అందుకే ఆరోజు సంస్కృత భాషా దినోత్సవాన్ని నిర్వహించు కోవడం సంప్రదాయమైందని చెబుతున్నారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ ‌వివిధ క్షేత్రాలలో ఒకటైన సంస్కృత భారతే కాక, సంస్కృత విద్యాలయాలు, సంస్కృత భాషా ప్రచార సంస్థలు, సంస్కృత పండితులూ- విద్యార్థులు -మేధావులు ఈ భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తూ, ఈ అమర భాషా వైశిష్ట్యాన్ని తెలియజేస్తున్నారు.

సుసంపన్నమైన సంస్కృత వాఙ్మయం

వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు, పురాణాలు, దృశ్య, శ్రవ్యకాలు, స్తోత్రాలు, స్మృతులు, ఛందస్సు- వ్యాకరణం-నిరుక్తం (భాషాశాస్త్రం) నాట్య- గాంధర్వ- ఆయుర్వేద-యోగా-అర్ధ- ఆధ్యాత్మిక శాస్త్రాలు, భూగోళ-ఖగోళ-జల గోళాది వైజ్ఞానికాంశాలున్న గ్రంథాలు… ఇవీ అవీ అనీ కాక ప్రాపంచిక జీవనానికి సంబంధించిన అనేక విషయాలున్న గ్రంథాలు సంస్కృత భాషలో వచ్చాయి.

ఇలా సుసంపన్నమైన సంస్కృత భాషనుండి, అక్షరాలు, పదాలు, పదబంధాలు, సూక్తులు, సుభాషితాలు అన్ని గ్రంథాలలోని వివిధ భావాలు స్వీకరించి, అనువదించుకొని, అనుసృజించుకొని భారతీయ (దేశీ) భాషలన్నీ వికసించాయి.

అందుకే జనని సమస్త భాషలకు సంస్కృత భాష ధరా తలంబునన్‌… అనే నానుడి స్థిరపడింది. అంతేకాక ప్రపచంలోని ఎన్నో భాషలకు తన పద- భావ సంపదను అందించింది సంస్కృతం.

కాని చరిత్ర చేసిన దురాగతాల వల్ల అది వ్యవహార (వ్యావహారిక) భాషగా బతికి బట్టకట్ట లేకపోయింది. మనుర్భవ (మనిషివి కమ్ము) సత్యమేవ జయతే, మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, యోగక్షేమం వహామ్యహమ్‌, ‌విద్యాధదాతి వినయమ్‌, ‌దీపం జ్యోతిః పరబ్రహ్మ, యతోధర్మస్తతో జయః, లోకాస్సమస్తాస్సుభినో భవంతు, అసతోమా సద్గమయ, ఓం శాంతిః శాంతిః శాంతిః, మౌనేన కలహం నాస్తి, వసుధైక కుటుంబకమ్‌, ‌సత్యం మాతా పితా జ్ఞానం, ఋణం కృత్వా ఘృతం పిబేత్‌, అహింసా పరమో ధర్మః, సత్యం-శివం- సుందరమ్‌, ‌శ్రమయేవ జయతే, ధర్మోరక్షతి రక్షితః… వంటి అనేక సూక్తి సదృశ వాక్యాలు జనం నోట నిరంతరం ప్రవహించ వచ్చుగాక! కానీ సంస్కృతమే మా మాతృభాష, మా వ్యవహార భాష అన్న కుటుంబాలు లేవు; దేశాలు లేవు.

కర్ణాటక రాష్ట్రంలో ఒకటి, రెండు గ్రామాలు పూర్తిగా సంస్కృతమే మాట్లాడుతున్నాయి. శ్రీ చమూ కృష్ణశాస్త్రి వంటి వారు సంస్కృత ప్రయోజనం అందరికీ అందాలని శ్రమిస్తున్నారు.

ఆలయ ప్రార్ధనల్లో, విధి విధానాల్లో, పెండ్లి పేరంటాదుల్లో, కర్మకాండల్లో, వ్యక్తి నామాల్లో, గ్రామ-నగర ప్రాంత దేశ నామాల్లో, అన్నం నుండి ఆనందం వరకున్న అన్ని పదాల్లో సంస్కృతమే ఉంది. సంప్రదాయాల్లో-ఆచారాల్లో సంస్కృతమే ఉంది.

వ్యవహారంలో లేని కారణంగా, ఈ దేశంలోకి విస్తరణ వాదంతో వచ్చి యేలికలుగా మారిన జాతులవారు దీనిని మృతభాష (డెడ్‌ ‌లాంగ్వేజ్‌) అని ప్రచారం చేశారు. అది మతభాష అన్నారు. ఓ వర్గం భాష అన్నారు. సంస్కృతం వ్యాపిస్తే, సంప్రదాయాలకు, జాతీయ సమైక్యతకు బలం చేకూరుతుందని భావించిన కొందరు జాతీయశక్తిని బలహీనపరచడానికి ప్రయత్నాలు చేశారు. చేస్తూనే ఉన్నారు. ఎక్కడ మంచి ఉంటే అక్కడి నుండి నీవు దానిని స్వీకరించి నీ సొంతం చేసుకో! అని వేదమే చెప్పింది.

మా మనసులోకి అన్ని వైపుల నుండి ఉత్తమ భావాలు, మంచి సంకల్పాలు వచ్చి చేరిపోవాలి. (ఆనోభద్రాః క్రతవో యన్తు విశ్వతః) అంతేగాక మన అందరి ఆశయాలు ఒకటిగా ఉండాలి (సమానీవ ఆకూతిః) అని వేదమే చెప్పింది. కలిసి జీవిద్దాం! కలిసి నడుద్దాం కలిసి ఆలోచిద్దాం అని వేదమే చెప్పింది.

వేదోద్ధరణ దినమే సంస్కృత భాషా దినోత్సవం

అలాంటి గొప్ప సంస్కృతం, మనల్ని కలిపి నిలిపే సంస్కృతం వేదాల నుండే ప్రారంభమైంది. కనుకనే ఆ వేదోద్ధరణ దినం నాడు, సంస్కృత భాషా దినోత్సవం జరుపుకుంటూ, ఆ భాషలోని మంచి విషయాలు తెలుసుకొందాం! ఆ మంచిని అందరికీ తెలుపుకుందాం! జీవితంలో ఆచరిద్దాం! సంస్కృతం ద్వారా సంస్కృతిని కాపాడుకుందాం!

About Author

By editor

Twitter
Instagram