– గంటి భానుమతి

జాగృతి – ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో మొదటి బహుమతి పొందిన రచన

‘‘అప్పుడే శుభలేఖలా! ఇంకా మన మాటలు పూర్తి అవనేలేదు. నాకేంటో కాళ్లూ చేతులూ ఆడడం లేదు’’ అంది స్వర్ణ.

‘‘వాళ్లు చెప్తే వెంటనే మనం చేసెయ్యాలా? మనకి నచ్చినట్లు మనం చేస్తాం. మన ఇష్టం వచ్చినప్పుడు చేస్తాం.’’ అంది సుధీర.

 శుభలేఖల గురించి వాళ్లు అలా చెయ్యడం భాస్కరరావుకి కూడా నచ్చలేదు. వాళ్ల శుభలేఖ ఎలా ఉందో చూడడం కోసం వెంటనే ముగ్గరూ వాళ్ల వాట్సప్‌లలో చూసుకున్నారు. అందరి ఫోన్‌ ‌నంబర్లూ సుధాకర్‌ ఇచ్చినట్టున్నాడు. అన్ని కరెక్టుగా ఉన్నాయి. అందరి పేర్లూ సరిగ్గా రాసారు. సుధాకర్‌ని అడిగారో, లేకపోతే అన్నయ్యని అడిగారో కానీ అన్ని బాగానే ఉన్నాయి.

‘‘స్వర్ణా, సుధీరా పదండి వెళ్లి కార్డులు తయారు చేయించి మనం కూడా వాట్సప్‌లో అందరికీ పెడ్దాం.’’

సుధీర అయిష్టంగానే కదిలింది. దారి పొడుగునా సుధీర విమర్శిస్తూ ఏదో అంటూనే ఉంది. అలా మాట్లాడద్దని సుధీరని చీవాట్లు పెట్టింది స్వర్ణ.

‘‘సుధీరా మాటలు తిన్నగా రానీ. కాస్త పాజిటివ్‌గా ఆలోచించు. వాళ్లు మనల్ని ఖర్చు పెట్టనివ్వడం లేదు. ఫ్లైటు టిక్కట్లు కొని పంపారు. మనల్ని కొనుక్కోమని అనలేదు కదా. హైద్రాబాదులో పెదనాన్న ఉన్నారు. పేరుకే కానీ, మనకి వాళ్లకి దెబ్బలాటలు అవీ లేకపోయినా రాకపోకలూ అవీ ఏం లేవు. మనకి అన్నివిధాలా సాయపడతారన్న నమ్మకం నాకు లేదు. వీళ్లు అన్ని చేస్తానని అంటున్నారు కదా. మనమే మగపెళ్లి వారి లాగా వెళ్దాం. ఎక్కడి కక్కడ సర్దుకోవాలి.’’

మళ్లీ అదే మాట- సర్దుకోవడం. నచ్చని మాట. పెళ్లి ఇంకా అవనే లేదు. మళ్లీ సర్దుకోవడం.

ఇన్విటేషన్‌ ‌కార్డులు కొన్ని వేయించారు. కొంత మందిని ఫోన్లో పిలిచి వాట్సప్‌లో పెట్టారు. సుధీర ఆఫీసులో అందరికీ ఫోన్‌ ‌చేసి చెప్పింది. అందరూ కూడా మనచేతుల్లో ఏం లేదు. నువ్వేం చేస్తావు. ఢిల్లీ వచ్చాకా పార్టీ ఇవ్వాలి, అని అన్నారు. మధ్యాహ్నం భోజనం కూడా చెయ్యకుండా ఫోన్లలో పిలుపులు పూర్తి చేసారు.

ఆ రాత్రంతా కూచుని చీరలు, నగలు గురించి సలహాలూ, సంప్రదింపులూ అయ్యాకా తర్జన భర్జన పడి ముగ్గురూ ఎవరి పెట్టెల్ని వాళ్లు సర్దుకున్నారు. రైలు ప్రయాణం అయితే ఎన్నో తీసుకెళ్లచ్చు, ఇప్పుడు అలా కుదరదు అని ఎన్నో సార్లు అనుకుంటూనే బయల్దేరారు.

అన్నట్లుగానే హైద్రాబాదు ఏర్పోర్ట్‌లో ఓ ఇద్దరు ప్లకార్డులు పట్టుకుని నుంచున్నారు. కార్లో తీసుకెళ్లారు. అన్నగారింటికి వెళ్తామంటే అక్కడ దింపారు.

 మర్నాడు బస్సు వస్తుంది, అందరూ రెడీగా ఉండండి. రెడీగా ఉంటే ఊరు వెళ్లచ్చు అని చెప్పి వాళ్లిద్దరూ వెళ్లిపోయారు. ఈ మధ్యలో ఓ రెండు సార్లు సుబ్రమణ్యం గారు ఫోన్‌ ‌చేసారు. ఫోన్‌ ‌చేసిన ప్రతీసారి క్షమాపణలు చెప్తూనే ఉన్నారు.

 పన్నెండు గంటలకి కార్లు పంపిస్తామని అన్నారు. అన్నట్టుగానే కార్లు రెండు వచ్చాయి. భాస్కరరావు కుటుంబం, అన్నయ్య వీరేశ్వరరావు, అతని భార్య భారతి బట్టలు కొనడానికి వెళ్లారు. మధుపర్కల కోసం నాలుగు దుకాణాలు తిరిగి ఆఖరికి ఎర్రంచు ఖోరా రంగులో ఉన్న జరీచీర కొన్నారు. మంగళసూత్రాలు, మెట్టెలు, వెండి కంచం, చెంబు రెడీమేడ్‌వి కొన్నారు. కాళ్లకడుగు పళ్లెం చెంబు ఇత్తడి సామాన్ల దుకాణంలో కొన్నారు.

మర్నాడు ఉదయానికి అంతకు ముందు ఏర్పోర్టుకి వచ్చిన వాళ్లిద్దరూ ఓ ఏసీ బస్సు తీసుకొచ్చారు. అందర్నీ అన్నవరం తీసుకెళ్లారు. గుర్‌‌గ్రాంలో ఉన్న అప్పారావు గారు, సుధాకర్‌ ‌వాళ్లు ఎదురొచ్చి, పెళ్లి జరిపే చోటుకి తీసుకొచ్చారు. ఆడపెళ్లి వారికి గదులు అవీ చూపించారు. అందరికి మర్యాదలు చేసారు.

పెళ్లికి సుబ్రమణ్యంగారు, అతని భార్య రాలేదు. మామ్మగారికి అస్సలు బాలేదు. అందుకని, పెళ్లి గుర్‌‌గ్రాంలో ఉన్న అప్పారావు గారు వాళ్లు చేసారు. ఇది విన్నాక స్వర్ణకి మనసు మూలిగింది. ఇదేం పెళ్లి. ఏదో కప్పిపుచ్చడానికి, దొంగతనంగా చేస్తున్న పెళ్లిలాగా ఉంది.

 సుధీరకైతే అసలు జరుగుతున్నది తన పెళ్లేనా? అన్న అనుమానం వస్తోంది. సరే, సుబ్రమణ్యం గారూ వాళ్ల కంటే ఏదో కారణం ఉంది, మరి ఇద్దరక్కలన్నారు కదా, వాళ్లెందుకు రాలేదు. ఏదైనా గూడుపుఠాణీ జరుగుతోందా! ఇంట్లో వాళ్లు లేకుండా పెళ్లి జరగడం ఏంటి? పెళ్లికి ముందు రాత్రి విక్రాంత్‌ ‌వచ్చాడు. సుధీర విక్రాంత్‌ని కలిసి మాట్లాడుకోవడానికి లేకపోయింది. అన్నిపనులు తనే చేసుకుంటున్నాడు. సుధీరకి ఎన్నో ప్రశ్నలు, సందేహాలూ, వాటి గురించి అడుగుదామంటే , విక్రాంత్‌ ‌కనబడడం లేదు. కనిపించినా బిజీగా ఉంటున్నాడు. తన పెళ్లి తనే చేసుకుంటున్నట్లుగా ఉంది.

ఇంక తెల్లారితే పెళ్లి, విక్రాంత్‌ని కలవడం కుదరదు. కుదరలేదు అన్నది రైటు. పెళ్లి అయిన తరవాత వాళ్లింటికి వెళ్లాలి. అక్కడందరూ కొత్త. మొహమాటం, జంకు. హనీమూన్‌కి వెళ్తే అప్పుడు అడగాలి. వీలైతే దెబ్బలాడాలి.

అన్నవరంలో పెళ్లిచేసాక అక్కడే, సత్యనారాయణ వ్రతం చేయించారు. పది గంటలకంతా అయిపోయింది. ఆ రోజే తల్లీతండ్రీ, సుధాకర్‌ ‌వాళ్లూ, అప్పారావు వాళ్లూ అంతా ఢిల్లీకి వెళ్లిపోతూంటే సుధీర ఏడ్చేసింది.

‘‘నువ్వు చిన్నపిల్లవి కాదు. చదువుకున్నదానివి, నీ చదువుని అప్లై చేసుకుంటూ నీ సంసారం నువ్వు చూసుకోవాలి. సరి చేసుకోవాలి. మేము వచ్చే వాళ్లమే, కానీ ఈ సమయంలో అక్కర్లేదని అనుకున్నాం. నువ్వు అమెరికా వెళ్లే లోగా ఓసారి వస్తాంలే. మీ అత్తగారి ఊరు చూసినట్లవుతుంది.’’

హైదరాబాదు రాకుండానే విక్రాంత్‌ని, సుధీరని ఊరు తీసుకెళ్లారు.

 అత్తగారి ఊరు చేరేసరికి సాయంత్రం అయింది. ఓ నలుగురు ముత్తైదువులు హారతిచ్చి లోపలికి రమ్మన్నారు. మామగారికి, అత్తగారికి ఇంకా ఎవరో ఉంటే అందరికీ ఇద్దరూ కలిసి దండాలు పెట్టారు.

ఆ తరవాత అత్తగారు కామాక్షి సుధీరని మామ్మ గారి గదికి తీసుకెళ్లింది. ఆవిడ పడుకుని ఉన్నారు.

ఆమె మంచం దగ్గరికెళ్లి అత్తయ్యా అంటూ భుజంపైన తట్టి లేపింది. ఆమె కళ్లు తెరిచి చూసింది.

 ‘‘మనవడికి అన్నవరంలో పెళ్లయింది. వ్రతం కూడా అక్కడే చేసుకున్నారు.’’ అంటూ అక్కడ ఉన్న ఓ కుర్చీని మెల్లిగా లాగి తను కూచుంది. సుధీరని ఆవిడ దగ్గరగా మంచం మీద కూచోమంది.

 ‘‘ఇదిగో కొత్త కోడలు సుధీర. మనవడికి తగ్గ అమ్మాయి. ఢిల్లీ అమ్మాయి. చక్కగా చదువుకుంది. ఉద్యోగం చేస్తోంది. ఆవిడకి చదువుకున్న అమ్మాయి లంటే ఇష్టం. వాళ్లు కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తారు. కుటుంబానికి, సమాజానికి, దేశానికి, ప్రపంచానికి ఉపయోగపడతారని ఆవిడ నమ్మకం’’

 సుధీరకి ఆవిడ మీద గౌరవం ఏర్పడింది. అంత వయసున్నావిడకి, ఎంత జ్ఞానం ఉందో. ఆవిడ జ్ఞానం, తెలివి అంతా అనుభవంతో వచ్చినది. ఇలాంటి అనుభవాలకి, ఇటువంటి జ్ఞానానికి చదువుకు సంబంధం లేదు.

‘‘ఆవిడ ఓ అమ్మ. ఎంతో మందికి అమ్మ. కన్న వాళ్లు ఇద్దరే అయినా పోయిన వాళ్లు ఓ అరడజను మంది. ఉమ్మడి కుటుంబం కదా, బావగారి పిల్లలని, మరిది పిల్లలని ఇంకా ఎంతో మంది పిల్లల్ని ఆవిడే సాకింది. మా అందరికీ అమ్మ. ఆమెలో నిలువెల్లా అమ్మతనం ఉంది.’’ అని అత్తగారు ఆవిడ గురించి అంటూంటే సుధీర ఆశ్చర్యపోయింది, ఓ కోడలు తన అత్తగారి గురించి ఇంత మంచి సర్టిఫికెట్‌ ఇవ్వడం చూసి.

‘‘నువ్వు ఈ కుర్చీలో కూచో, నేను అత్తయ్యకి పళ్లరసం తీసుకొస్తాను.’’ అని లేచి కుర్చీని బాగా దగ్గరగా జరిపింది. సుధీర కూచోగానే ఆమె వెళ్లిపోయింది.

‘‘నీ పేరు సుధీరా. చక్కటి పేరు. పేరుకి తగ్గట్టుగా ఉండాలి. మా విక్రమ్‌ ‌చాలా నెమ్మది. వాడు గట్టిగా మాట్లాడగా నేనెప్పుడు వినలేదు. గమనించావా’’ పక్షవాతం వల్ల మూతి కాస్త వంకరపోయినా మాట స్పష్టంగానే వస్తోంది.

సుధీర చిరునవ్వు నవ్వింది.

‘‘నువ్వు చదువుకున్నదానివి నీకన్నీ తెలుసు. అయినా చెప్తున్నాను. చాదస్తం అని అనుకోకు. నువ్వూ విక్కీ ఇద్దరూ కూడా సమాన వ్యక్తులు. చదువుకున్న వాళ్లు. మీ మధ్య ఏమైనా తేడాలు వస్తే కూచుని మాట్లాడుకోవాలి.

భృగు మహర్షి విష్ణుమూర్తి గుండె మీద తన్నాడని, ఆయనను అవమానపర్చాడని లక్ష్మిదేవి వెళ్లిపోయింది. విష్ణుమూర్తి పాపం ఆమె కోసం వెతికాడు. కనిపించ లేదు. ఆ తరవాత ఏం జరిగిందో తెలుసు కదా, పద్మావతిని పెళ్లి చేసుకున్నాడు. అంచేత మీ ఇద్దరి మధ్య తగువొస్తే అప్పటికప్పుడే తేల్చుకోవాలి. అంతేకానీ పుట్టింటికి వెళ్లకూడదు. మీరు ఎంత గొప్పవారైనా సరే. చివరికి కుటుంబమే గొప్ప. కుటుంబ వ్యవస్థ గొప్పది. అందుకని కుటుంబాన్ని కాపాడుకోవాలి.

ఈ కుటుంబం చాలా పెద్దది. సంబంధాలు పైకి బాగా కనిపించినా, కొనసాగించడం చాలా కష్టం. ఇక్కడే నీకు సానుకూల దృష్టి అవసరం. కుటుంబ పరిధిని పెంచుకోవాలి. రోజులు అన్నీ సజావుగా, నీకు నచ్చినట్లుగా, నీకు అనుకూలంగా జరుగుతున్నప్పుడు ఎవరూ అక్కర్లేదనిపిస్తుంది. అందరూ.. ఆఖరికి అత్తగారు, మామగారుతో సహా భారమనిపిస్తారు. కాని అన్నిరోజులు మనవి కాదు. అవసరమైనప్పుడు వాళ్లే మనకి సాయపడతారు. మానసిక ఆలంబన అనేది కుటుంబంలోనే దొరుకుతుంది. అన్నివిధాలా మనకి అండగా, పక్కన నిలుస్తారు.’’

 ఒక కుటుంబం ఎలా ఉండాలో ఎంత బాగా చెప్పారో. ఈవిడ చెప్పిన దానికి పూర్తిగా అపోజిట్‌ ‌నాన్నగారి వైపు వాళ్లు. అన్నింటికి కోపాలూ, తాపాలు, అహంకారాలు. మొహాలు చూసుకోకపోవడాలు. ఏదైనా సందర్భంలో కలిసినప్పుడు పాత వాటిని మరోసారి తవ్వి, మళ్లీ మాటామాటా అనుకోవడం, వీసా స్టాంపు వేసుకుని మళ్లీ కలుసుకునే దాకా మొహాలు చూసుకోకపోవడం. తమ ఇంట్లో ఎందుకిలా ఉందో. ఎవరైనా ఆలోచించారా. అనుమానమే.

‘‘వేదాల్లో ఏం చెప్పారో తెలుసా, విద్యాబలం, జ్ఞానబలాన్ని కట్నంగా ఇవ్వాలని అన్నారు. తల్లితండ్రి తమ కూతుళ్లకి ఇవే ఇవ్వాలని అనుకోవాలి, కానీ ఆస్తులు నగలూ, డబ్బూ కాదు. పెళ్లాయ్యాక కుటుంబ బాధ్యతని, బరువుల్ని మొయ్యాలి. నీకు అవన్నీ ఉన్నాయని నాకు తెలుసు. నువ్వు ఇక్కడ ఉన్నా అమెరికాలో ఉన్నా కుటుంబ పరిధిని పెంచుకుంటూ వెళ్లాలి. కుటుంబంలోని మనుషులతో మంచి సంబంధాలుంచుకోవాలి. నీ ఇంట్లో వాళ్ల తప్పుల్ని ఎలా క్షమించేస్తావో అలాగే అత్తింట్లో వాళ్లవి కూడా క్షమించేసెయ్యాలి. మీ మా అని కాదు మన అని అనడం నేర్చుకోవాలి.’’

‘‘అమ్మా! చివురాకులు ముందుకు, పైకి ఎదగడానికి, అవకాశాల కోసం ఆకాశం వంక చూస్తాయి. పండుటాకులు నేల వంక చూస్తాయి. రాలి నేలలో, మట్టిలో కలిసిపోక తప్పదు. అర్థం అయిందా. నువ్వు చిన్నదానివి. నేను ముసలి దానిని.’’

సుధీర నోట మాట రాలేదు. ఎంత చక్కటి ఉదాహరణ. ఇవి జీవితంలోంచి అనుభవంలోంచి వచ్చిన ప్రవచనాలు.

‘‘మనం శాశ్వతం కాదు. ఏ క్షణాన ఏం అవుతుందో తెలీదు. మనం ఎన్ని రోజులుంటాం. ఎన్ని రోజులున్నా ఆఖరికి భూమిలో కలిసి పోవాల్సిన వాళ్లమే. కింద పాతిపెట్టాక అందరూ ఒకలాగే నిద్ర పోతూంటారు. వాళ్లకి పరుపులూ అవీ ఏం ఉండవు. కప్పుకోవడానికి మట్టి పొరలు ఉంటాయి. అందుకే ఉన్నన్ని రోజులు మానవత్వంతో బతకాలి.’’

సుధీరకి తాను ఏదో క్లాసులో ఉన్నట్లుగా అనిపించింది. ఓ విధమైన ట్రాన్స్‌లో ఉంది.

 ఈవిడ జీవితాలని చదివిన మనిషి. ఈ జ్ఞానం చదువుకుంటే రాదు. ఈ జ్ఞానం పుస్తకాల్లో ఉండదు. స్కూళ్లల్లో చెప్పరు. ఇది ఒకళ్లు చెప్తే వచ్చేది కాదు. జీవితాలని అధ్యయనం చేస్తే వస్తుంది. కానీ ఈవిడ నాకు పాఠం చెప్పారు అని అనుకుంది.

అంతలో కామాక్షి పళ్లరసం గ్లాసు పట్టుకొచ్చింది. ఆ వెనకాల ఓ పాతికేళ్ల సన్నగా తెల్లగా ఉన్న అమ్మాయి కూడా వచ్చింది. ఆమె వస్తూనే సుధీరని చూసి పలకరింపుగా నవ్వింది.

‘‘మామ్మగారు ఎలా ఉన్నారో చూసి వెళ్దామని వచ్చాను. ఆ గ్లాసు ఇలా ఇవ్వండి పిన్ని, నేను పడతాను.’’ అంటూ చొరవగా కామాక్షి చేతిలోంచి గ్లాసు తీసుకుంది ఆమె.

‘‘దుర్గ వచ్చిందా, అయితే కామాక్షి నువ్వెళ్లు. బాత్రూములో అంబక్క పడిందిట కదా, ఓసారి చూసిరా’’

‘‘నేను అటే వెళ్లాలనే అనుకుంటున్నాను. దుర్గ వచ్చింది కాబట్టి ఓసారి వెళ్లొస్తాను’’ అని ఆమె దుర్గ వైపు తిరిగింది.

‘‘దుర్గా, సరే ఎలాగూ వచ్చావు కదా, నీకో పని చెప్తాను. కనకాంబరాలు, మల్లెలు కోసుకొ చ్చాడు వెంకటేశు. మామ్మకి రసం తాగించడం అయిపోయాక వాటిని మాలలు కట్టు. ఇక్కడ కట్టినా సరే, ఇంటికి తీసుకెళ్లి కట్టినా సరే. నీ ఇష్టం.’’ అని ఆమె వెళ్లిపోయింది.

సుధీర అక్కడే కూచుంది. దుర్గ జ్యూస్‌ ‌తాగించడం అయ్యాక, ఇద్దరూ కలిసి, పెరట్లో ఉన్న మామిడి చెట్టు కిందకి వెళ్లారు. అక్కడ రెండు పీటలున్నాయి. కూచున్నారు. దుర్గని చూస్తూ సుధీర మాల కట్టడానికి ప్రయత్నించింది, కానీ కట్ట లేకపోయింది. దుర్గ కడుతూంటే ఆమె ముఖం చూస్తూ కూచుంది. అందంగా ఉంది. తన వయసే ఉంటుంది. తన కన్నా చిన్నది కూడా కావచ్చు. అప్పుడే ఇద్దరు పిల్లలు.

దుర్గతో ఏం మాట్లాడాలో తెలీక నిశ్శబ్దంగా కూచుంది. కానీ దుర్గ మాత్రం తన ఇంటి సంగతి, పిల్లల సంగతి, పౌరోహిత్యం చేసే భర్త సంగతి, ఎన్నో చెప్పింది. మాల కట్టాక, దుర్గ పనుందని వెళ్లిపోయింది.

సుధీర తన గదిలోకి వెళ్లి ఏదో నవల చదువు కుంటూ కూచుంది. అమెరికా వెళ్లేందుకు ఎన్ని రోజున్నాయో లెక్కలేస్తూండి పోయింది. ఎవరైనా కోడల్ని చూడడానికి వస్తే, రమ్మని పిలిస్తే బయటికి వచ్చేది. వాళ్లమధ్యలో కూచుని వాళ్లు అడిగిన దానికి సమాధానాలు చెప్పేది. ఎంతో ఇబ్బందిగా అనిపిం చేంది. ఎన్నో ఊహించుకుని ఇక్కడికి వస్తే ఏంటో నిస్తేజంగా ఉన్నట్టనిపించింది. పెళ్లి అయిందన్న పేరే కాని విక్రాంత్‌తో ఇంతవరకూ మాట్లాడలేదు. అందరి ముందు విక్రాంత్‌ ‌మాట్లాడడు. ఈ పరిస్థితిలో శోభనం అదీ చేసే ప్రయత్నాలు కనిపించడం లేదు. ఈ గదిలో మీరుండండి అని రాగానే ఓ గది చూపించారు. ఇదీ ఒకందుకు మంచిదే. అందరి ముందు గదిలోకి వెళ్లడం, తలుపులేసుకోవడం. ఏంటోలా ఉంటుంది. ఏదో హోటల్లో అరేంజ్‌ ‌చేస్తే బావుండేది. తన కొలీగ్‌ ‌లిద్దరికి అలాగే జరిగిందని అన్నారు. పెళ్లైన వెంటనే హనీమూన్‌కి వెళ్లిపోయారు. ఇప్పుడు హోటల్‌ ‌లేదు, హనీమూన్‌ ‌లేదు. ఇంక అమెరికా వెళ్లాకే అన్నీ. ఇది కూడా బానే ఉంది. ఇక్కడికి వచ్చిన పని అయిపోయింది. మామ్మ గారిని చూడడం అయింది. ఇంక అమెరికా వెళ్లడమే బాకీ. అంతలోనే భోజనానికి రమ్మని పిలిస్తే వెళ్లింది. అలా వెళ్లి తినడం చాలా సిగ్గుగా అనిపించేది. అలా అని వాళ్ల దగ్గర కూచోడానికి, వాళ్ల మాటలు వినడానికి పెద్దగా ఇష్టపడలేదు. వేవ్‌ ‌లెంత్‌ అస్సలు కలవదు. అలాంటప్పుడు ఏం మాట్లాడుతుంది. అయినా ఇంకెంత రెండురోజులు. ఆ తరవాత ఢిల్లీ. అక్కడి నుంచి అమెరికా. ఆ తరవాత ఇక్కడికి రావడం అన్నది జరగకపోవచ్చు.

(ఇంకా ఉంది)

About Author

By editor

Twitter
Instagram