– మునిమాణిక్యం నరసింహారావు

మా నాన్న చాలాకాలం స్కూలు మాస్టరీ ఉద్యోగం చేసి రిటైరు అయినాడు. ఆయన పిల్లలకు బహు ఓర్పుగా చదువు చెపుతాడు. కాని ఈ ముసలితనంలో ఆయనకు ఓర్పు కాస్త తక్కువై కోపం ఎక్కువైంది.

మా రఘూకు అక్షరాభ్యాసం చేసి కాస్త దారికి తీసుకొని వచ్చింది మా నాన్నే. ఆయన ముఖ్యంగా మనుమడికి లెక్కల్లో మాంచి తరిఫీతు ఇచ్చాడు. ఎంత పెద్ద లెక్క అయినా ఇట్టే చేసే శక్తి రావాలంటే ముందు భయం ఏమాత్రం ఉండకూడదు. ఇంత పెద్ద లెక్క నేను చెయ్యగలనా అనే ధైర్యం ఉండకూడదు. మా రఘూకు ఈ ధైర్యం ఒకటి కుదిరింది. ఎంత పెద్ద లెక్కఇచ్చినా అధైర్యపడక నోటితోనే చేసి వెయ్యటానికి ప్రయత్నిస్తాడు. అంత అలివిగాకపోతే అప్పుడూ పలకా బలవం తీసుకోటం.

ఎనిమిది తొమ్మిదేండ్ల వయసులో పిల్లల మానసిక స్థితి బహు విచిత్రంగా ఉంటుంది. తెలిసీ తెలియని వయస్సు. వాళ్ల ఊహలు కూడా బహు తమాషాగా ఉంటవి. వాళ్ల పోకిళ్లు తెలియకపోతే వాళ్లు వేసే ప్రశ్నలు విసుగు పుట్టిస్తాయి.

మా నాన్న అసలు ఓపిక మనిషే కాని ఆ రోజున ఎందుకో కోపం వచ్చి పిల్లవాడిని కాస్త కోప్పడి ఒకదెబ్బ వేశాడు. మా ఆవిడ రఘూను మహా గారాబం చేస్తుంది. వాడిమీద ఈగవాలితే గిలగిల లాడుతుంది.

ఆరోజున భోజనాలైన తరువాత రాత్రి పదిగంటల వేల మా కాంతం ఈ ప్రసంగం తెచ్చింది. ఎందుకు కొట్టాలె పసివాడిని, ఎందుకు చెయ్యాలంటూ!!
నేను సద్దేసేద్దామని ఎంతో ప్రయత్నం చేశాను. విషయం మార్చాను. నా ప్రయత్నాలేవీ అక్కరకు రాలేదు. పసివెధవను అనవసరంగా అంతదెబ్బ కొట్టాడని ఆవిడకు కడుపులో బహు ఇదిగా ఉంది.

ఆవిడను శాంతపరచాలంటే సులభంగా లేదు. ఏదో పెద్దవాడు, ముసలాయన ఓ దెబ్బ వేస్తే ఏంలే, ఆ మాత్రానికి నీవు ఊరికే ఇదౌతావు ఎందుకూ? అని కోప్పడితే ఆవిడ ఇలా అన్నది.

‘తప్పుఉంటే ఓ దెబ్బ వేయవచ్చు. అల్లాంటప్పుడు నేనేమీ అనను. నాకు మాత్రం ఆమాత్రం తెలియకపోలేదు. కాని ఏమీ తప్పు లేనప్పుడు వాడి చెవులు పట్టుకొని సాగదీయటం ఎందుకు? చెప్పండి. చెవులు రెండూ కందగడ్డలైనై.’

ఉద్రిక్తjైు  ఈ మాటలు చెప్పటం వల్ల, ఆవిడ మనస్సు బాగా కష్టపడ్టట్లు తెలిసింది.

కుర్రవాడిని మా నాన్న ఎందుకు కొట్టాడో అంతవరకు నాకు తెలియదు. తెలుసుకోవాలెనని ప్రయత్నమూ చెయ్యలేదు. ఎందుకో కోపంవచ్చి కొట్టాడులే అనుకొన్నాను. ఆవిడ ఆ విషయమై అంతగా రొష్టుపడుతున్నప్పుడు నేను పట్టించుకోకుండా తోశేసెయ్యటానికి వీలు లేకపోయింది. విషయం అంతా మొదటి నుండి చివరి దాకా విని నిజంగా మా నాన్న వాడిని అనవసరంగా కొట్టి ఉన్నట్లయితే, ‘నాన్నా వాడిని మరీ గట్టిగా కొట్టబోకు’ అని చెప్పవలసిన అవసరం వస్తే చెపుదాము, అనుకొన్నాను. అనుకొని కాంతాన్ని నా మంచానికి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి ఆవిడ చుట్టి ఇస్తూ ఉన్న తమలపాకుల ముడుపులు తీసుకొంటూ ‘అదిసరే, ఆయన అసలు ఎందుకు కొట్టాడు వీడిని, సంగతేమిటో చెప్పు’ అన్నాను.

ప్రొద్దున నేను నడవలో కూర్చుని కూరలు తరుక్కొంటున్నాను. తాతా, మనుమళ్లు హాల్లో కూర్చున్నారు. విరబోసుకొన్న గిరజాలూ, వీడూ వెధవ ముద్దొస్తున్నాడు. ఆ చిన్న మట్టలాగు తొడుక్కొని, తెల్ల చొక్కా వేసుకొని బాసిన బొట్లు వేసుకొని కూర్చుంటే దొరబాబులాగున్నారండీ’, ఇలా అంటూ ఆవిడ కొడుకును వర్ణించుకోటంలోకి దిగింది, అసలు విషయం వదిలేసి.

నేను కూడా ఆ ధోరణిలోకి దిగానా, చిన్నప్పటి నుంచి వాడు చేసిన అల్లరులూ ముద్దులూ, అవీ చెప్పుకోటంలోకి దిగుతాము. ఇక దానికి అంతు ఉండదు. అసలు సంగతి తేలక ముందే తెల్లారుతుంది.

అందుకని నేనే అన్నాను, ఆవిడతో, ఇదిగో చూడూ, దొరబాబు గారిని గురించి వర్ణనలు అనెక్కుచెయ్యవచ్చు గాని ముందు అసలు విషయం చెప్పు.

నేను ఇల్లాగ అనటం వల్ల ఆవిడ ఉత్సాహానికి భంగం కలిగినట్లు ఆమె ముఖంలో కనపడ్డది. అయినా ఆవిడ పైకేమీ అనక అసలు విషయానికేముంది లెండి ముసలాయన మనుమడిని దగ్గర కూర్చోబెట్టుకొని చదువు చెబుతూ ఉంటే ముచ్చటగా ఉండి నేనూ అక్కడే కూర్చున్నాను చూస్తూ. వింటున్నారా? నిద్ర వస్తున్నదా? అంటూ తమలపాకు ఈనె ఒకటి నా పైకి విసిరింది.
‘వింటూనే ఉన్నాను చెప్పు’ అన్నాను.

మీ నాన్న ఏదో లెక్క ఇచ్చాడండీ వీడికి. వీడు వ్రాసుకొన్నాడు. వ్రాసుకొని చెయ్యవచ్చునా. వెంటనే, చెయ్యక అలాగ చూస్తూ ఊరుకొన్నాడు. మీరెప్పుడైనా ఏదో కథ ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎల్లా చూస్తారో పిచ్చిగా, అంతా సరిగ్గా అల్లాగే చూస్తూ ఊరుకొన్నాడు అని ఆగి నా ముఖంలో ముఖంపెట్టి నవ్వింది కాంతం. కాంతం తన కొడుకును నాలోనూ, నన్ను తన కొడుకులోనూ చూస్తుంది. నాకు తెలుసు ఈ సంగతి అందుకని నేనూ నవ్వాను.

లెక్క అర్థంగాకనే అల్లాగ ఆలోచిస్తూ కూర్చుని ఉంటాడు అన్నాను నేను.

అర్థం గాకపోవటానికి ఏముందండీ ఆ లెక్కలో అంది కాంతం.

ఏమిటా లెక్క? అని అడిగాను.

వాళ్ల తాతయ్య ఇచ్చిన లెక్క చూడండి అంటూ కాంతం రఘూ పుస్తకం తెరిచి చదవటం మొదలుపెట్టింది. మనం ఈ ఇంటిని రూ.950`2`3 కు కొని

రూ. 520`15`11కు అమ్మినట్లు ఐతే, లాభమా నష్టమా? ఎంత? ఇదీ లెక్క.

‘ఈ లెక్క ఏమంత కష్టమైంది కాదే! ఒక దాంట్లో ఒకటి తీసివెయ్యటమేగా?’

ఆ సంగతి తెలియవద్దూ! తెలియకే కామాలు ఏదో ఆలోచిస్తూ ఊరుకొన్నాడు.

ఆ అల్లాకాదు. మనం ఉన్నది అద్దె ఇల్లు కదా, ఈ ఇల్లు అమ్మటం ఎల్లాగా అని అనుకొని ఉంటాడు.

అవును ఆ మాట నిజమే. అమ్మక అమ్మక అద్దె ఇల్లు అమ్మటం ఏం ధర్మం అండీ?

లెక్కలో ఈ ఇల్లుకొని అమ్మటం అని ఉంది. అందులో తప్పేమీ లేదు.

‘కొనక కొనక ఈ యిల్లేనా కొనటం?’

ఊరికే లెక్కకోసం అనుకోటమేగా!

ఊరికే అనుకొనేటప్పుడు ఈ యిల్లు కొందాము అనుకోటం ఏమి ఖర్మమూ అంటా! కేకినీమహల్‌ లాంటి ఇంటిని కొందాము అనుకొంటే సంతోషం కాదండీ.

నిజమేలే, ఇప్పుడదంతా ఎందుకు అసలు సంగతికిరా.

అదీగాక ఏదో ఒకటి స్వగృహం అంటూ ఏర్పడ్డ తరువాత దాన్ని అమ్ముదాము అనుకోటం తప్పు. అమ్ముకోవటం అంటూ వస్తే నష్టాని కమ్ముకోటం వట్టి తెలివి తక్కువ తనం.

ఈ గొడవ ఎప్పుడూ ఉన్నదే కాని వాడిని తాతయ్య ఎందుకు కొట్టాడో చెప్పు. అని నేను ఆవలించి రెండు చిటికలు వేశాను.

నాకు నిద్రవస్తున్నట్లు గ్రహించి ఆవిడ తొందరగా విషయం అంతా నాకు చెప్పేద్దామని ఆదుర్దాగానే ఇల్లా అన్నది.

రఘు అల్లాగ చూస్తూ కూర్చుంటే వాళ్ల తాతయ్య చెయ్యవేంరా లెక్క! అని కోప్పడ్డాడు. వాడు నవ్వుతూ ‘ఈ లెక్క నోటితోనే చెప్పవచ్చు. అందుకని ఆలోచిస్తున్నాను’ అన్నాడు.

‘మా నాన్న ఇచ్చిన తర్పీదు అల్లాంటిది. ఆయన దగ్గర చదువుకొన్న వాడికి, ఎంత లెక్క అయినా నోటితో ఇట్టేచేసే శక్తి వస్తుంది’ అన్నాను.
‘నోటితో చేసి చెప్పగలిగితే ఇంకేం కావాలె చెప్పు చూద్దాము’ అన్నారు మామగారు ప్రేమతోనే. వీడు ఆ లెక్కను అంత సులభంగా చెయ్యగలడా అనీ

ఆశ్చర్యం గలిగి నేనూ చూస్తూ ఊరుకున్నాను.

రఘూ కొంచెం ఆలోచించాడు. మీలాగ తొందరపడే స్వభావం కాదుగా వాడిది! అని నవ్వింది.

అవునులే నీలాగ నిదానించే స్వభావమేలే. అన్నాను నేను.

కానీ వాడు అంకెలవంక నిదానించి చూశాడు. చివరకు తలఎత్తి అన్నాడు. ఈ వ్యవహారంలో కొంత నష్టమూ ఉంది. కొంత లాభమూ ఉంది అని.
వాడి మొఖం నష్టమూ, లాభమూ రెండూ ఎల్లాగ ఉంటై? అన్నాను నేను నవ్వుతూ.

వాళ్ల తాతయ్యా ఆ మాటే అన్నారు. ‘నష్టమూ లాభమూ ఏమిట్రా పిచ్చి వెధవా ఏదో ఒకటే ఉంటుంది చెప్పు’ అని కోపడ్డాడు.

రఘు కాస్త చిన్నపుచ్చుకొని ‘అదికాదు తాతయ్యా’ నష్టమూ, లాభమూ కూడా ఉంది. ఎల్లాగంటే, ఇల్లు రూ.950-2-3కు కొని రూ.520-15-11కు

అమ్మాడా, అమ్మితే రూపాయల్లో కాస్త నష్టం వచ్చినా, అణాలపైసలలో మాంచి లాభం వచ్చింది తాతయ్యా అన్నాడు.

నాకు నవ్వొచ్చింది. వాడి తెలివి తక్కువ జవాబుకు నవ్వి, రూపాయలు, అణాలు, పైసలు వేటికవి ప్రత్యేకంగా చూశాడు పిచ్చి వెధవ అన్నాను.
మా కాంతం అన్నది చూశారా, మీరు నవ్వినట్లుగానే ఆయనా నవ్వి ఊరుకొంటే ఎంత బాగుండేది. ఆయనల్లాగ చెయ్యక వాడి చెవులు మెలేసి ఏడిపించారండీ వాడిని!!

‘ఏం ఏడిపిస్తే, మరేం ఫరవాలేదు. పిల్లవాడిని కాస్త ఓ దెబ్బ వేస్తే, నీవు ఇంత గిలగిల్లాడకూడదు’ అనే నేను మా ఆవిడనే కోపడ్డాను.

కాంతం ఏమీ తృప్తిపడలేదు. పైగా నా వంక చురచుర చూసింది కూడా ఇది ఏమీ సబబుగా కనపడలేదు. ఆయనకు పిల్లవాడిమీద ప్రేమలేకపోయిందా? చదువురావాలని ఏదో కాస్త ఇల్లాగంటే ఈవిడ మహారాద్ధాంతం చేయటం ఏమిటి!

పోనీ అంతటితో ఊరుకొన్నా కొంతనయమే. కాంతం ఊరుకోక తన కొడుకును ఆయన కొట్టినందుకు విచారపడుతూ, ఊరికే గునుపు సాగించింది. ఎందుకు కొట్టాలెందుకు చెవులు మెలవెయ్యాలె, అంటూ.

ఆ గునుపుకు అంతూపొంతూ కనిపించలేదు. నాకు ఒళ్లు మండుకొచ్చింది. ఆయనకు మటుకు వీడిమీద ద్వేషమా? ఏదో కాస్త చెవులు పట్టుకొంటే వచ్చిన అవమానం ఏముంది. ఊరుకోమంటే ఊరుకోక వచ్చింది ఈవిడ. చివరకు మా కాంతాన్నే కాస్త కోప్పడటం అవసరమనితోచి ఇల్లాగన్నాను.
‘ఏమిటా గునుపు కాకపోయినా, ఏదో పెద్ద పుట్టి మునిగి పోయినట్లు! ఈ మాత్రానికి నీబిడ్డ మరేమీ కందిపోదులే! ఐనా పెద్దవాడిని ఆయనను ఏమంటాము! ఏం జేస్తాము!’ ఈ మాటలు కోపంగానే అన్నాను.

ఏమి అనక ఊరుకొంటారా ఏమిటండి నోరు మూసుకొని పసివాడి నల్లాగ నలిపేస్తే? అన్నది పౌరుషంగా.

వూరుకొక చేసేదేమిటో చెప్పు? కాకపోయినా మహ ఎగురుతున్నావులే! అని నేను అంతకంటే ఎక్కువ పౌరుషముగా గట్టిగా కేకవేశాను.

కాంతం ముఖం ఇంతజేసుకొని కొంచెం తగ్గి ‘ఎందుకండీ కోప్పడతారు? పసివాడిని బాధపెడితే నాకు ఎంత కష్టముగా ఉందో మీరు గ్రహించాలె’ అన్నది.

నేను కొంచెం తగ్గి అన్నాను, ‘మరి ఏంజేస్తాం. పెద్ద వాడిని ఆయనను ఏమంటాం. ఊరుకోవలసిందే! అని నేను నిక్కచ్చిగా చెప్పాను. అంతకంటే ఆ విషయమై వాదన పెరగకూడదని నా నిశ్చయం.

‘నే నూరుకోను’ అని కాంతం నిక్కచ్చిగా జవాబు చెప్పింది. ‘ఊరుకోక ఏం జేస్తావు? చెప్పు!’ అన్నాను.

ఆమెగారు బుడ్డమూతి పెట్టి తలఒంచుకొని నేనూరుకోను అనటం చూస్తే నాకు నవ్వు వచ్చింది.

చెప్పు అని అన్నానే కాని ఆవిడ మాట్లాడుతుందని కాదు నా ఉద్దేశం. ఈ విషయమై ఇంత రాద్ధాంతం. చెయ్యకుండా మొదటే ఊరుకోవాల్సింది సుమా నీవు అని ఆవిడకు నేను చెప్పటం అదే!

కాంతం ఇంకా తలవంచుకొనే ఉంది. చదరంగం ఆటలో ‘షహా!’ అన్నట్లు అయిపోయింది.

కాంతం ఇంకా తలవంచుకొనే ఉంది. క్రొత్త కొత్త సింగారాలతో, గర్వంగా ఎగురుతూ పరుగెత్తుతూ వచ్చే సెలయేటి ప్రవాహానికి కొండ అడ్డమైనట్లయింది.

నేను అధికమైన గర్వంతో ఆవిడను చూస్తున్నాను. కాంతం తలఎత్తి మధురమైన గొంతుకతో అన్నది. ‘మాట్లాడుతున్నాను వినండి. నా కొడుకు చెవులు నలిపితే, నాకెంత బాధగా ఉందో మామగారికి తెలియదు.’ అని నావంక నిశితంగా, చురుగ్గా చూచింది. గులాబి పూరేకులలో మధురమైన సువాసన ఎంత రహస్యంగా దాక్కొని తొంగి చూస్తుందో అంత రహస్యంగా దాక్కొని తొంగి చూస్తున్నది చిరునవ్వు ఒకటి ఆమె పెదవుల మధ్య నుంచి. ‘నీ బాధ ఆయనకు తెలియదే అనుకో. ఐతే మటుకు నీవేం చేస్తావూ?’ అన్నాను.
‘తెలిసేటట్లు చేస్తాను’ అన్నది ఆవిడ.

‘ఎట్లా తెలిసేటట్లు చేస్తావూ?’ అన్నా నేను.

‘ఎట్లాగా? కాజీ తీర్పు ఇచ్చి, చెయ్యికి చెయ్యి, కాలికి కాలు అని వాళ్ల సిద్ధాంతం.

ఆయన నా కొడుకు చెవులు నులిపితే, నేను ఆయన కొడుకు చెవులు నులుపుతాను. అప్పుడు తెలిసి వస్తుంది ఆయనకి. బిడ్డమీద చెయ్యిపడితే కన్న కడుపుకు ఎంత బాధగా ఉంటుందో అన్న విషయం’ అంటూ కాంతం కుర్చీలో నుంచి లేచింది.

(‘తెలుగు హాస్యం’ నుండి)

By editor

Twitter
Instagram