తెలుగు భాషా దినోత్సవం ఆగస్టు 29-సెప్టెంబర్‌ 09

ఆం‌ధప్రదేశ్‌-‌తెలంగాణ… ఇవి రెండూ తెలుగు రాష్ట్రాలే. అంటే ప్రధాన భాష, అత్యధిక ప్రజానీకం మాట్లాడే భాష తెలుగు అన్నది అందరూ అంగీకరించిన భాషా రాష్ట్రాలే!

ఒక రాష్ట్రమే ఉన్నప్పుడు తెలుగు భాషా దినోత్సవం గిడుగు రామమూర్తి జయంతి అంటే ఆగస్టు 29 నాడు జరుపుకొన్నాం. గిడుగు ఆంధప్రదేశ్‌లోని ఒక జిల్లాకు చెందిన మహామనిషి. అందువల్ల ఆరోజు తెలుగు భాషా దినోత్సవం ఆంధప్రదేశ్‌ ‌జరుపు కొంటుంది. తెలంగాణలో కూడా కొన్నిచోట్ల జరుపుకొంటున్నారు.

ఇక తెలంగాణ రాష్ట్రమేర్పడినప్పుడు, రాష్ట్రం కొరకు, తెలుగు కొరకు పాటుపడిన కాళోజి జయంతినాడు తెలుగు భాషా దినోత్సవం జరుపుకో వాలని ప్రభుత్వం కోరింది; కోరడమే కాదు ఆదేశాలు జారీ చేసింది. ఆ కారణంగా సెప్టెంబర్‌ 9 ‌నాడు తెలంగాణలో తెలుగు భాషా దినోత్సవం జరుగుతున్నది.

గిడుగువారి కృషి

తెలుగు భాషా వికాసానికి గిడుగువారు కృషి చేశారు. తెలుగు వాచకాల్లో గ్రాంథిక భాష ఉండరాదని వ్యావహారిక/వాడుక భాష ఉండాలని ఒక ఉద్యమ స్ఫూర్తితో ప్రచారం చేశారు. కాని కొందరు గ్రాంథిక భాషనే ఉండాలని వాదించారు. ‘ఆంధ్ర పండిత భిషక్కుల భాషా భేషజం’ అనే గ్రంథం ద్వారా తమ వాదన బలంగా వినిపించారు.

గిరిజనులూ వనవాసీలైన సపరుల భాషను నేర్చుకొని, ఆ భాషకూ గౌరవాన్ని కలిగించారు. భాషాభిమానమూ, దేశాభిమానము గురించి ఇలా తమ అభిప్రాయాలు తెలిపారు.

‘‘దేశ భాషాభిమానము తోడిదే దేశాభిమానము. ఏ కులము వారైనా, ఏ మతము వారైనా, ఏ దర్జా వారైనా తెలుగు మాతృభాషగా గల వారందరూ ఒక సంఘము వారనిన్ని ఎవరు వెనుకబడ్డా సంఘమునకు నష్టమే అనిన్ని ఎవరు త్రికరణ శుద్ధిగా భావిస్తారో వారే దేశాభిమానము గలవారని చెప్పవలెను.’’

తెలుగు పత్రికల సంపాదకులకు రాసిన ఉత్తరంలోని వాక్యాలివి. వారు కేవలం వ్యావహారిక భాషావాది కాదు; వారు మహా మానవతావాది అని పై  వాక్యాల ద్వారా తెలుస్తూనే ఉంది.

తెలుగు భాషా బోధన విషయంలో తెలుగు ఉపా ధ్యాయులకు ఎన్నో సూచనలు చేశారు. బోధనలో వ్యాకరణాన్ని ప్రస్తావిస్తూ చారిత్రక, సంప్ర దాయ, భాషా శాస్త్ర విషయాలు చెప్పాలన్నారు. భాషా కళా సౌందర్యం ద్వారా అభిరుచి పెంచాలి. ఇలా ఎన్నో విషయాలు పంతుళ్లకే పంతులుగా గిడుగు వెంకటరామమూర్తి పంతులు గారు చెప్పి భాషోపాధ్యాయు లకు మార్గ దర్శకులుగా నిలిచారు. అంతేకాదు తెలుగులో మాస్టరీ (ఎం.ఎ.) చేసే వారు తప్పకుండా ప్రాచీన సాహిత్యాన్ని అధ్యయనం చేయాలన్నారు.

మరి అటువంటి గిడుగువారి పుట్టినరోజును తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం వారిని గౌరవించడమే. తెలుగు భాషామతల్లిని గొప్పగా గౌరవించడమే.

కాళోజి కృషి

‘అన్నపురాసులు ఒకచోట/ఆకలి మంటలు ఒకచోట/సంపదలన్నీ ఒకచోట/గంపెడుబలగం ఒకచోట…’ అని ఆవేదన చెందిన ప్రజాకవి కాళోజి. ఆయన ‘నా గొడవ’ అంతా సమాజం గొడవే.

చెమ్మగిల్లిన కన్నులలో/కమ్మలెన్నో చదివాను

చెమ్మగిల్లని కనులు బతుకు/కమ్మదనము చాటలేవు..

ఇలా హృదయవాదిగా, అపూర్వ మానవతా వాదిగా కనిస్తారు కాళోజి. భాష విషయంలో మాతృభాష మాట్లాడని ఆంధ్రుణ్ణి (తెలుగువాడిని) ఎలా దుమ్ము దులిపాడో చూడండి!

ఏ భాషరా నీది-ఏమి వేషమురా

ఈ భాష ఈ వేష-మెవరికోసమురా

అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు

సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా!

ఇటువంటి భాషానిష్ఠ ఉన్న కారణంగానే, తెలంగాణ ప్రభుత్వం ఆయన జయంతిని (సెప్టెంబర్‌ 9) ‌తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది.

సంతోషం! మహా సంతోషం… కాని రెండు ప్రభుత్వాలు ఇటువైపు దృష్టి సారించాయా! తెలుగు వికాసానికి పూనుకున్నాయా!

ఈ ప్రభుత్వాలు తెలుగును ఆదరిస్తాయా!

వికాస శీల దిశలో నడవనిస్తాయా!

జాతీయ నూతన విద్యావిధానంలో దేశమంతటా వారి వారి మాతృభాషలు వికసిస్తాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. కాని తెలుగు రాష్ట్రాలు రెండు ఇంగ్లిషువైపే మొగ్గు చూపుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో పరిపాలన తెలుగులో జరుగుతుందా! ప్రభుత్వ ఉత్తర్వులు ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులో జరుగుతున్నాయా!

తెలుగు అకాడమిని తెలుగు వికాసం కోసమే పనిచేయనిస్తాయా!

ఒక్కసారి ఆలోచించండి? ఈ దిశలో జగన్‌, ‌కేసిఆర్‌ ‌నడుస్తున్నారా! తెలంగాణ ముఖ్యమంత్రి మూడేళ్ల క్రితం జరిగిన తెలుగు మహాసభల వేదికల మీద ప్రకటించిన భాషా పరమైనదేదీ అమలుకాలేదు. మాతృభాషలో పాఠశాల విద్యాబోధన జరగడం లేదు. మాతృభాష అధ్యయన శీలురకు పై చదువులకు అవకాశమే కల్పించలేదు. ఉగ్యోగాలకు మాతృభాషా అర్హత ఉండాలనేది పాటించడం లేదు.

ఇటువంటి వారికి దేశీభాషల మీద మాట్లాడే అర్హత ఉందా అన్నది ప్రశ్నే. ఆకులందున అణగిమణ నీ/కవిత కోయిల పలకవలెనోయ్‌/ఆ ‌పలుకులను విని దేశ మందభిమానములు /మొలకెత్త వలెనోయ్‌! అన్నాడు గురజాడ.

మాతృభాషపైన మమకారంతో ప్రభుత్వాలు కృషి చేయవలసిన అవసరమున్నది. అది జరిగినప్పుడే, ప్రలోభాలకు లొంగనివారున్నప్పుడే అనుకున్న పథంలో పయనించగల్గుతాం! భారతమాత ముద్దుబిడ్డలుగా పిలువబడతాం!

నిజాం పరిపాలనలో ఉర్దూ ప్రాబల్యంతో తెలుగు అడుగంటిపోయింది. అప్పుడు మాతృభాషాభిమాన సంపన్నులైన నాయకులు/మార్గదర్శకులైన నడువరైరి/ యువక ముణులార మీరింక ఊరకున్న/రాదు కీర్తింత నైజాము  రాష్ట్రమునకు… అని గోలకొండ కవుల సంచికలో 1934లో సరవరం ప్రతాపరెడ్డి ప్రచురించారు.

ఈ సందేశాన్ని తెలంగాణ, కోస్తా, రాయలసీమ, కళింగ ప్రాంత యువకులు స్వీకరించాలి. ఒక ఉద్యమరూపంలో ఈ క్రింది విధానాలు ఆచరించే ట్లుగా ప్రజానీకం చేత రెండు ప్రభుత్వాల మీద ఒత్తిడిచేసి మాతృభాషా వికాసం ద్వారా మాతృ సంస్కృతిని రక్షించుకొనే ప్రయత్నం చేయాలి.

  1. పాఠశాల విద్యను మాతృభాషా మాధ్యమం లోనే తప్పనిసరిగా కొనసాగేట్టు చేయాలి.
  2. తమ మాతృభాషలోనే బాల బాలికలు విద్యను పొందే విధంగా చేసి అది ప్రాథమిక హక్కుగా అందరు గుర్తించేట్టు వ్యవహరించాలి.
  3. మాతృభాషల్లో చదివిన వారికే ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుందనే అంశాన్ని తప్పనిసరిగా అమలుపరచాలి.
  4. భారతదేశంలోని అన్ని భాషలను జాతీయ భాషలుగా గుర్తించడమే గాక, ఆయా ప్రాంతాలలో ఉన్న అధిక సంఖ్యాక ప్రజానీకం భాషను అధికార భాషగా పరిగణించి అమలుపరచాలి.
  5. త్రి భాషా సూత్రాన్ని దేశమంతటా అమలు పరచి జాతీయ ఏకతా భావంలో పడే విధంగా చూడాలి.

ప్రజలు, ప్రభుత్వం దేశీ భాషల వికాసానికి, పరిరక్షణకు ఈ సాధారణ సూత్రాలు పాటించాలి. రెండు తెలుగు రాష్ట్రాలు దృష్టిని సారించి తెలుగులో మన సంస్కృతిని దర్శించాలి. సాంస్కృతిక మానవతా దృక్పథంతో జీవించాలి.

– ఆచార్య కసిరెడ్డి, 9866956250

By editor

Twitter
Instagram