– పాణ్యం దత్తశర్మ

శ్రీగిరిరాజు ధర్మసంరక్షణ పరిషత్తు కథల పోటీకి ఎంపికైనది

తెల్లవారు ఝాము. ఐదు గంట లకు సెల్‌ఫోన్‌లోని అలారం సంగీతాన్ని పలికిస్తూ అనుపమకు మేలుకొలుపు పొందింది. కాసేపు లేవాలనింపించలే దామెకు. ఐదు నిమిషాల తర్వాత లేచింది. బాత్‌రూంకు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకుని వచ్చి వంటింట్లోకి వెళ్లింది. ఫ్రిజ్‌లోంచి పాల పాకెట్లు రెండు తీసి కట్‌చేసి, పాలు గిన్నెలో పోసి గ్యాస్‌స్టవ్‌ ‌మీద పెట్టింది.

కాలింగ్‌బెల్‌ ‌మోగింది! వెళ్లి ముందు తలుపు తెరిచింది అనుపమ పనిమనిషి దమయంతి! అమ్మగారిని చూసి నవ్వింది! లోపలికి వచ్చి చీపురు తీసుకుని ఇల్లంతా ఊడవసాగింది.

అనుపమ వంటింట్లోకి వెళ్లి పాలదగ్గర నిల్చుంది. దమయంతి ఇల్లు ఊడ్చి, తడి బట్టతో తుడిచి పెరట్లోకి (బాల్కనీ) అంట్ల గిన్నెల దగ్గర కూర్చుని తోమసాగింది.

‘‘అమ్మగారు! విమ్‌ ‌సబ్బు అరిగిపోయిందండి! అట్లే గిన్నెలు తోమే జాల్రీ (స్క్రబ్‌) ‌కూడా ఇవ్వండి’’ అంటూ కేక వేసింది.

‘‘వస్తున్నా’’ అంటూ షల్ఫులో నుండి సోపు, జాల్రీ తీసి పనిమనిషికిచ్చి వచ్చేసరికి పాలు పొంగి కిచెన్‌ ‌గట్టంతా పరుచుకున్నాయి!

‘‘అక్కడ నిలబడినంతసేపు కదలవు. ఒక క్షణం ప్రక్కకు పోతూనే పొంగి ఛస్తాయి, వెధవపాలు! ‘‘అనుకుంటూ గట్టంతా శుభ్రం చేసుకునేసరికి ఆరు కావస్తూంది.

స్నానం చేద్దామని బాత్‌రూంలోకి వెళ్లి బట్టలు తీయబోతుంటే మళ్లీ కాలింగ్‌బెల్‌ ‌మ్రోగింది! ‘‘బహుశా చెత్తబుట్ట తీసుకెళ్లేవాడయి ఉంటాడు అనుకుంది అనుపమ! భర్తకు వినబడినా లేవడని తెలుసు. పనిమనిషికి ఆ పని సంబంధం లేదు.

సరే, ఒక్కక్షణం ఆలస్యమయినా వెళ్లిపోతాడు. పరుగున వచ్చి తలుపుతీసి అతనికి చెత్తబుట్ట అందించింది.

‘ఏందమ్మా యింత లేటు? బుట్ట తలుపు బయట పెట్టొచ్చు కదా!’’

‘‘మర్చిపోయానులే’’

స్నానం ముగించి కాఫీ కలుపుకొని తాను తాగి దమయంతికి కూడా ఇచ్చింది. ఆమె వెళ్లిన తర్వాత తలుపువేసి పూజ గూటి ముందు కూర్చుని దీపారాధన చేసి, పటాలను తుడిచి, ఫ్రిజ్‌లోంచి చేమంతి పూలు తీసి దేవుళ్లకు అలంకరించింది. చటుక్కున గుర్తొంచ్చిం దామెకు ఆరోజు గురువారమని, షిర్డీ సాయిబాబాకు ప్రతి గురువారం ఇంట్లోనే కొబ్బరికాయలు కొట్టడం ఆమెకు అలవాటు. మామూలుగా అయితే ముందురోజు కాయ తెచ్చి పెట్టుకుంటుంది. నిన్న మరచిపోయింది.

బెడ్‌రూంలోకి వెళ్లి భర్తను లేపింది.

‘‘ఏమండీ! క్రిందికి వెళ్లి ఒక కొబ్బరికాయ తీసుకురండి; ప్లీజ్‌!’’ అం‌టూ బ్రతిమిలాడితే అతడు బద్ధకంగా మూల్గి,

 ‘‘తెచ్చుకోవచ్చు కదా’’ అని అటు వైపు తిరిగి పడుకున్నాడు.

వీల్లుండేది సెకండ్‌ ‌ఫ్లోర్‌. ‌తన వ్యానిటీ బ్యాగులోంచి డబ్బు తీసుకుని నడవా చివరనున్న లిఫ్ట్ ‌దగ్గరకెళ్లింది అది పనిచేయడం లేదు. కరెంటు లేనట్లుంది.

‘‘వాచ్‌మన్‌! ‌జనరేటరు వెయ్యి!’’ అంటూ క్రిందికి వినబడేలా కేక వేసింది. వాడు పలకలేదు. సరే తప్పదనుకుంటూ మెట్లన్నీ దిగి ఫర్లాంగు దూరంలో ఉన్న కిరాణాషాపుకు వెళ్లి కొబ్బరికాయ కొనుక్కుని వచ్చి ముగించేసరికి ఏడుగంటలు దాటుతూ ఉంది.

ఏడున్నరకు భర్త, పిల్లలు లేస్తారు. కుక్కర్‌లో బియ్యం, కందిపప్పు పెట్టింది. అరవింద్‌ ‌లేచి వచ్చాడు.

‘‘కాఫీ ఇవ్వవా’’ అనడిగాడు.

‘‘ఒక్కక్షణం’’ అంటూ భర్తకు కాఫీ కలిపియిచ్చింది.

‘‘ఈరోజు టిఫినేమిటి?’’ అన్నాడతడు.

‘‘ఇడ్లీపిండి, దోసెపిండి నిన్నటితో అయిపోయా యండీ. సేమ్యా ఉప్మా చేద్దామనుకుంటున్నా’’

‘‘మొదలు పెట్టావా ఉప్మా వారోత్సవం? నాకక్క ర్లేదు. నేను బయట తింటాలే’’ అన్నాడతడు కోపంగా.

‘‘సరే ఏం చేయమంటారో చెప్పండి!’’

‘‘పూరీలు చెయ్యొచ్చుగా, చాలా రోజులైంది చేసి. అయితే బొంబాయి చట్నీ మాత్రం వద్దు. బంగాళా దుంపలు కుర్మా చెయ్యి’’.

‘‘అలాగే’’ అన్నదా యిల్లాలు. గోధుమపిండి తడుపుకొని పెట్టుకుంది. బంగాళాదుపంలు మీడియం సైజులో తరిగి నీళ్లలో వేసింది. పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకుంది.

లంచ్‌లోకి కూరేం చేయాలో! పిల్లలు తినేది తండ్రికి నచ్చదు తండ్రి తినేది పిల్లలకు నచ్చదు.

ఇంతలో పిల్లలిద్దరూ లేచి వచ్చారు. పాప పెద్దది అనన్య. సెవెంత్‌ ‌చదువుతూంది. తర్వాత పిల్లవాడు అభిరాం థర్డ్‌స్టాండర్డ్ ‘‘‌లేచారా! ఉండండి హార్లిక్స్ ‌కలిపిస్తా’’ అన్నది వాళ్లను చూసి.

‘‘అబ్బా ! నాకు హార్లిక్స్ ‌వద్దమ్మా, కాఫీనే కావాలి’’ అన్నది అనన్య అభిరాం తనకు హార్లిక్స్ ‌కావాలన్నాడు. ఇద్దరికీ గ్లాసులలో కాఫీ, హార్లిక్స్ ఇచ్చి ‘‘త్వరగా స్నానం చేసి తెమలండి!’’ స్కూలు బుస్సు వచ్చేసరికి రెడీ అవకపోతే విసుక్కుంటాడు అన్నది.

‘‘అమ్మా…’’ అంటూ గునిశాడు పుత్రరత్నం.

‘‘ఏంటినాన్నా’’

‘‘నేను మ్యాత్స్ ‌హోంవర్కు చేయలేదు’’ అన్నాడు.

‘‘నేను చేయిస్తాలే త్వరగా స్నానం చేసిరా’’ అన్నదామె.

పూరీలు వత్తుకొని సిద్ధంగా ఉంచుకుంది. ప్రెషర్‌పాన్‌లో కుర్మాకు కావలసినవన్నీ పోపు వేసి మూత బిగించింది. కుక్కర్‌ ఊడదీసి ఉడికిన పప్పులో పాలకూర సన్నగా తరిగి, కారం, చింతపండు, ఉప్పువేసి కొంచెం నీరుపోసి పొయ్యిమీద పెట్టింది.

అరవింద్‌ ‌స్నానం చేసి వచ్చాడు. దేవుడి గూటి దగ్గరకు వెళ్లి దండం పెట్టుకున్నాడు. పిల్లలతో సహా హాల్లోకి డైనింగ్‌ ‌టేబుల్‌ ‌వద్ద కూర్చున్నాడు. హోటల్స్‌లో లాగా మూకుడులోంచి డైరెక్టగా ప్లేట్లోకి రావాలతనికి పూరీలు! వేడి వేడి పూరీలు ప్లేట్లల్లో పెట్టుకుని తెచ్చింది. ‘‘అబ్బా అమ్మా! ఆయిలీఫుడ్‌ ‌తిననని నీకు తెలుసుకదా! ఈ పూరీలెందుకు చేశావు?’’ అన్నది కూతురు. ‘‘ఈ ఒక్కరోజుకు తినెయ్యమ్మా, ఎనిమిది దాటింది. నాకూ ఆఫీసుకు టైమవుతుంది’’ అన్నది తల్లి.

‘నాకు వద్దు. నాకు నూడిల్స్ ‌చెయ్యి. రెండు నిమిషాల్లో అవుతాయి’’

‘‘నేనూ పూరీ తినను. నాకు ఆమ్లెట్‌ ‌వేసియ్యి’’ అన్నాడు కొడుకు.

అరవింద్‌ ‌మాత్రం శుభ్రంగా తిన్నాడు. ‘‘బాగున్నాయి డియర్‌’’ అని కితాబిచ్చాడు.

‘‘లంచ్‌బాక్స్‌ల్లోకి ఏం పెడుతున్నావు?’’ అని అడిగాడు.

‘‘పాలకూర పప్పు, అన్నం’’ అన్నదామె

‘‘మరి కూరేమీ చెయ్యలేదా?’’

‘‘లేదింకా టైం సరిపోదేమో?’’

‘‘సర్లె ఒక్కరోజుకేం మునిగిపోయింది!’’

వంటింట్లో ఒక బర్నర్‌మీద న్యూడిల్స్, ‌మరొక దాని మీద ఆమ్లెట్‌ అవుతున్నాయి. మళ్లీ కాలింగ్‌ ‌బెల్‌!

ఈసారి మాత్రం అరవింద్‌ ‌తలుపు తీశాడు. బయటకు వచ్చిన భార్యవైపు ‘‘చూశావా నేనెంత కో ఆపరేటివ్‌ ‌హబ్బీనో?’’ అన్నట్టు చూశాడు.

బయట వాచ్‌మన్‌ ‌భార్య నీలమ్మ. అమ్మా, ఇస్త్రీకి బట్టలు తీసుకుపోనీకి వచ్చిన’’ అంది అనుపమను చూసి.

‘‘రా వేస్తాను. ఒక్క నిమిషం’’ అంటూ వంటింట్లోకి పరిగెత్తి పిల్లలకు టిఫిన్‌ ‌ప్లేట్లలో వేసి డైనింగ్‌ ‌టేబుల్‌ ‌మీద పెట్టింది.

వాషింగ్‌మెషన్‌లో వేసి, బాల్కనీల్లో ఆరబెట్టిన బట్టలన్నీ తెచ్చి నీలమ్మ ముందు కుప్పగా పోసింది. ఆమె వివరంగా చెబుతుంటే ఒక చిన్నపుస్తకంలో వివరాలు రాసుకుంది. నీలమ్మ వెళ్లిపోయిన తర్వాత పప్పులో పోపు వేయలేదని గుర్తొచ్చింది. ఇంతలో

‘‘అనూ! ఒకసారి ఇలారా, త్వరగా! అన్న భర్త కేక వినిపించింది బెడ్‌రూం నుండి.

‘‘వస్తున్నా’’ అంటూ వెళ్లింది. అప్పటికే అతడు ఆఫీసుకు వెళ్లడానికి తయారయి ఉన్నాడు.

‘‘నా బండి కీస్‌ ఎక్కడ పెట్టానో కనబడటం లేదోయ్‌!’’ అన్నాడు. ‘‘కొంచెం వెతికి పెట్టు త్వరగా. ఇంతకూ లంచ్‌ ‌బాక్స్ ‌రడీ అయిందా?’’

‘‘అన్నం పప్పు అయిపోయాయి. పప్పులో పోపు వేసి బాక్స్‌ల్లో పెట్టటమే’’ అంటూ కీస్‌ ‌కోసం వెతకసాగింది. మంచం మీద విడిచి పడేసిన లుంగీ క్రిందే ఉన్నాయవి. లుంగీ మడత పెట్టి వస్తూంటే చేయిపట్టి దగ్గరకు లాక్కున్నాడు అరవింద్‌.

‘‘ఉదయం పూట పనుల హడావుడిలో తిరిగే నీవు చాలా సెక్సీగా ఉంటావు తెలుసా’’ ఆమెను మరింత దగ్గరగా పొదువుకుని.

‘‘ఒక్క..’’అంటూ ముందుకు వంగిన అతని చిరు కోరిక తీర్చి, ‘‘ముందే టైమవుతూందని ఛస్తూంటే మీ సరసమొకటి!’’ అన్నది. కానీ అంత హడావిడిలోనూ అతని ప్రేమపూర్వక చర్య ఆమెకు కొంత ఊరటనిచ్చింది.

వంటింట్లో పప్పుకు పోపు వేస్తూంటే, ‘‘అమ్మా నీకు ఫోన్‌’’ అం‌టూ సెల్‌ ‌తెచ్చిచ్చాడు కొడుకు. డిస్‌ప్లేలో పేరుచూసి ‘‘చచ్చాం!’’ అనుకుంది అనుపమ. పెద్ద తోడికోడలు! వాళ్లు గుంటూరులో ఉంటారు, వాళ్ల పిల్లలు అమెరికాలో సెటిలయ్యారు. సెల్‌ ఆన్‌ ‌చేసి, ‘‘హలో అక్కయ్యా! ఎలా ఉన్నారు?’’ అని అడిగింది.

‘‘బాగున్నాంలే గాని, ఏమిటి పనులన్నీ అయ్యాయా?’’ అంటూ మొదలు పెట్టిందామె. ఆమెకు ఉదయాన్నే పరుగులు తీయించే పనులేవీ ఉండవు. అనుపమ ఆ టైంలో బిజీగా ఉంటుందని తెలుసామెకు. కానీ అప్పుడే చేస్తుంది. అమెరికాలో తన మనుమల చిలిపి చేష్టలు, టీవీ సీరియల్స్, ‌సినిమాలు అన్ని చర్చిస్తుంది. ఫోన్‌లో తానే మాట్లాడుతుంది. అవతలి వాళ్ల మాట వినదు. పెద్దామె. ‘‘నాకు టైం లేదు’’ అని నిష్కర్షగా చెప్పలేదు. నిస్సహాయంగా వింటూనే అరవింద్‌కూ, పిల్లలకూ లంచ్‌ ‌బాక్స్‌లు సర్దింది.

పిల్లలు స్కూల్‌కు రెడీ అయ్యారు. వాళ్లను లిప్ట్ ‌వరకు తీసుకు వెళ్లి బై చెప్పి వచ్చింది. అరవింద్‌ ‌కూడా వెళ్లిపోయాడు. తానూ టిఫిన్‌ ‌చేద్దామని డైనింగ్‌ ‌టేబుల్‌ ‌దగ్గర కుర్చీలో ప్లేట్లో మూడు పూరీలు, కుర్మా వడ్డించుకుంది. తినబోతూండగా మళ్లీ ఫోన్‌ ‌మ్రోగింది. తీసి ఆన్సర్‌ ‌చేసే లోపే కాలింగ్‌ ‌బెల్‌.

‌ఫోన్‌ ‌తీసి చూస్తే తన బాస్‌!

‘‘‌గుడ్‌మానింగ్‌ ‌సర్‌!’’ అన్నది అణకువగా.

‘‘మేడమ్‌, ‌గుడ్‌మార్నింగ్‌. ‌నిన్న మీకు మనం హెచ్‌.ఓ. ‌కు పంపాల్సిన డేటా తయారు చేయ మన్నాను కదా! అయిపోయిందా?

‘‘ఆల్మోస్ట్ ‌కంప్లీటెడ్‌ ‌సర్‌! ‌కన్సాలిడేట్‌ ‌చేయడమే మిగిలి ఉంది’’.

‘‘వెంటనే చేసేసి నాకు మెయిల్‌ ‌పెట్టండమ్మా, అర్జంట్‌’’! అన్నాడాయన.

‘‘అన్నట్లు మీరు ఒక గంట లేటుగా వచ్చినా నో ప్రాబ్లమ్‌’’

‘‘‌థ్యాంక్‌ ‌యూ సర్‌!’’ ‌మరో అరగంటలో మీకు మెయిల్‌ ‌పంపుతాను’’.

పూరీలు చల్లగా అయిపోయాయి. ముందు జాగ్రత్తగా ఎక్కువగా చేయలేదు. ఎవరు తింటారో ఎవరు తినరో తెలియదు. టిఫిన్‌ ‌తినడం పూర్త యింది. ఇంకా నాలుగు మిగిలాయి. హాట్‌బాక్స్‌లో పెట్టింది రాత్రికి తనకు పనికొస్తాయని.

ఇంతలో మళ్లీ కాలింగ్‌ ‌బెల్‌ ‌మ్రోగింది. ఆ మోతలో మోగించిన వారి అసహనం కూడ ధ్వనించింది. వెంటనే వెళ్లి తలుపు తీసి చూస్తే 402లో ఉండే కమలాక్షి గారు!

‘‘రండి!’’ అంటూ ఆహ్వానించింది అనుపమ.

సోఫాలో కూర్చుందామె.

ఈ నెల మొదటివారం జరిగే అపార్ట్‌మెంట్స్ అసోసియేషన్‌ ‌మీటింగ్‌లో, 308లో ఉండే ఆ ప్రభావతి వాళ్లాయన మీద అవిశ్వాస తీర్మానం లేవనెత్తుదా మనుకుంటున్నాము అనుపమా! మెయిన్‌టన్సెస్‌ ‌ఫీజులు విపరీతంగా వసూలు చేస్తున్నారు గాని, సెక్రెటరీగా ఆయన ఉద్ధరిస్తున్నదేం చెప్పు? ఈ విషయంలో నీవూ, మీవారూ మద్దతు ఇవ్వాలి. అందుకే ముందే చెప్పి పోదామని వచ్చా’’ అన్నదామె.

అసోసియేషన్‌ ‌రాజకీయాలు జాతీయ రాజకీయాల కంటే సంక్లిష్టంగా ఉంటాయని తెలుసు అనుపమకు. సెక్రెటరీగా ఎవరున్నా అలాగే ఉంటుందని తెలుసు.

‘‘అలాగేనండి!’’ అన్నది నవ్వు ముఖం పెట్టుకుని. ‘‘కొంచెం కాఫీ… ’’అన్నది మర్యాదకు. ‘‘అబ్బే! ఇప్పుడే తాగి వచ్చా వద్దులే’’ అంటుందేమోనని అనుకుంది. ‘‘ఇవ్వు మీ ఇంట్లో కాఫీ బాగుంటుంది’’ అన్నది కమలాక్షి.

తానలా అనుకున్నందుకు గిల్టీగా ఫీలవుతూ, ఆమెకు కాఫీ కలిపి తెచ్చిచ్చింది. ఆమె తాగుతూ ఉండగానే ల్యాప్‌టాప్‌ ‌బయటకు తీసి సిద్ధంగా పెట్టుకుంది. ఆమెకు అర్థమై, కాఫీ తాగేసి వెళ్లిపోయింది.

సోఫాలో కూర్చుని నిన్న ఎంటర్‌ ‌చేసిన డాటానంత క్రేందీకరించి కన్సాలి డేటెడ్‌ ‌రిపోర్టు తయారు చేస్తుండగా ఫోన్‌ ‌మోగింది. తీసి చూస్తే తెలియని నంబరు. ఆన్సర్‌ ‌చేసింది.

‘‘హలో! ఎవరు?’’

‘‘నమస్తే మేడమ్‌! ‌మేము హెచ్‌.‌డి.ఎఫ్‌.‌సి. బ్యాంకు నుండి కాల్‌ ‌చేస్తున్నాము. మీకు క్రెడిట్‌ ‌కార్డ్ ఏమయినా అవసరం ఉందా మేడమ్‌? ఇప్పు‌డు మంచి ఆఫర్‌ ఉం‌ది. ఈరోజు సాయంత్రంలోపు తీసుకుంటే…

‘‘సారీ అమ్మా, నాకు క్రెడిట్‌ ‌కార్డు అవసరం లేదు!’’ అంటూ పెట్టేసింది.

రిపోర్టంతా తయారుచేసి బాస్‌కు మెయిల్‌ ‌పెట్టింది. రిలీఫ్‌గా నిట్టూర్చి, తనకూ లంచ్‌ ‌బాక్స్ ‌సర్దుకుంది అనుపమ. బెడ్‌రూంలోకి వెళ్లి చీరలోంచి చుడీదార్‌లోకి మారింది. ల్యాప్‌ట్యాప్‌ ‌బ్యాగు, వ్యానిటీ బాగ్‌, ‌లంచ్‌బాక్స్ ఉన్న చిన్ని బ్యాగ్‌ అన్నీ తీసుకుని, తన స్కూటి కీస్‌ ‌కూడ తీసుకొని, ముందు తలుపు జాగ్రత్తగా వేసి లిఫ్ట్ ‌వైపు నడిచిందా అష్టావధాని అనుపమ.

అదేమిటి? అనుపమ అష్టావధాని ఎలా అవుతుందని ఆశ్యర్యపోకండి. ఆమె ఉదయం లేచినప్పటి నుండి ఆఫీసుకు వెళ్లేంతవరకు చేసేది అష్టావధానం కాక మరేమిటి?

ఎలాగో వినండి. అవధానంలో పాల్గొనే పృచ్ఛకులందరూ ఉన్నారామెకు. ఉదాహరణకు నిషిద్ధాక్షరి. ఆశువుగా ఒక పద్యం చెప్పమని, ధీమ్‌ ఇచ్చి, ప్రతి పదంలో ఫలానా అక్షరం వాడకూదని నిషేధిస్తూంటాడు పృచ్ఛకుడు. ఆమె సేమ్యా ఉప్మా అంటే భర్త పూరీ అంటాడు. ఈమె బొంబాయి చట్నీ అంటే ఆయన కుర్మా అంటాడు. కూతురు న్యూడిల్స్ అం‌టుంది. కొడుకు ఆమ్లెట్‌ అం‌టాడు. అలా నిషిద్ధాక్షరిని దిగ్విజయంగా నిర్వహించిందా లేదా?

ఇక సమస్యాపూరణ. బాస్‌ ‌ఫోన్‌చేసి రిపోర్టు తయారుచేయాలనే సమస్యనిచ్చాడు. దానిని చక్కగా పూరించింది. తర్వాత అప్రస్తుత ప్రసంగం. దాన్ని తోడికోడలు చక్కగా చేసింది ఫోన్‌ ‌ద్వారా. ఇక పనిమనిషి, ఇస్త్రీ చేసే నీలమ్మ, కమలాక్షి, చెత్తబట్ట తీసుకు వెళ్లేవాడు తలా ఒక చెయ్యి వేశారు అష్టావధానంలో. వీళ్లంతా కలిసి ‘దత్తపది’ క్రిందకు వస్తారనుకుందాం. అలా కుదరదా? సరేనండి!

ఇక ఘంటానాదం. అవధానం జరుగుతున్నంత సేపూ మధ్యలో గంటలు కొడుతూంటాడొక పృచ్ఛకుడు. చివర్లో మొత్తం ఎన్ని గంటలు కొట్టారో అవధాని చెప్పాలి. అనుపమ చేసిన అష్టావధానంలో ఈ పృచ్ఛకుడు లేడే! అంటున్నారా? కాలింగ్‌ ‌బెల్లే ఆ పృచ్ఛకుడు ఎన్నిసార్లు మోగిందో అనుపమ అవలీలగా చెప్పగలదు సుమండీ!

ఆ మాటకొస్తే అనుపమే కాదు. ఉదయం ఇంటిపనీ వంటపనీ అత్యంత వేగంగా, చాకచక్యంగా, సమయస్ఫూర్తితో నిర్వహించే గృహిణులందరూ అష్టావధానులే సుమండీ!

About Author

By editor

Twitter
Instagram