– దోర్బల పూర్ణిమాస్వాతి

భారత్‌- ‌సోవియట్‌ ‌యూనియన్‌ (‌నేటి రష్యా) సంబంధాలు బహుముఖంగా విస్తరించిన సమయంలో పాకిస్తాన్‌ ‌పట్ల అమెరికా అవ్యాజమైన ప్రేమ కనబరచేది. ఆ దేశానికి అన్నిరకాలుగా సాయం అందించేది. అనేకవిధాలుగా అండగా నిలిచేది. అడిగిన వెంటనే సైనికపరంగా అధునాతన ఆయుధా లను అందించేది. అవసరమైనప్పుడల్లా ఆర్థికంగా ఆదుకునేది. భారత్‌ అం‌టే ఒకింత గుర్రుతోనే అగ్రరాజ్యం ఇలా వ్యవహరించేది. పార్టీలకు అతీతంగా వాషింగ్టన్‌ ‌విధాన నిర్ణేతలు పాకిస్తాన్‌కు సాయమందించేవారు. కశ్మీర్‌ ‌సమస్యపై తటస్థంగా ఉన్నామంటూ చెప్పుకుంటూనే నర్మగర్భంగా మాట్లాడేవారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవా లంటూ హితోక్తులు పలుకుతూనే అవసరమైతే మధ్యవర్తిత్వానికి సిద్ధమంటూ లేనిపోని పెద్దరికాన్ని ప్రదర్శించేవారు. పర్యటనల సమయంలోనూ వివక్ష చూపేవారు. పాకిస్తాన్‌ ‌నుంచి భారత పర్యటనకు రావడమో లేదా భారత్‌లో పర్యటనను ముగించుకుని పాకిస్తాన్‌ ‌సందర్శనకు వెళ్లడమో చేసేవారు. అంతర్గత చర్చల్లో ఈ తీరును భారత్‌ ‌నిరసించేది. పాక్‌లో సైనిక పాలకులు ప్రజాస్వామ్య ప్రభుత్వాలను పడగొట్టి తమ ఆధ్వర్యంలో నియంత పాలనను ప్రారంభించినప్పుడు కూడా అమెరికా అధినేతల స్పందన అంత దీటుగా ఉండేది కాదు. పైగా సైనిక పాలకులతో చెట్టాపట్టా లేసుకుని తిరిగేవారు. అంతమాత్రాన భారత్‌ను విస్మరించేవారు కారు.

అదే సమయంలో అంతర్జాతీయంగా, ఆసియాలో ముఖ్యంగా దక్షిణాసియాలో దాని పాత్రను విస్మరించేంత సాహసం చేసేవారు కారు. దాయాది దేశాలైన భారత్‌, ‌పాక్‌ ‌పట్ల ఒకింత పక్షపాతంతో వ్యవహరించే వారన్నది చేదునిజం. అమెరికా అధినేతలకూ ఈ విషయం తెలియనిది కాదు. పైకి ఖండించినప్పటికీ అంతరంగాల్లో వారికి ఈ విషయం స్పష్టంగా తెలుసు. కాలక్రమంలో వాషింగ్టన్‌కు వాస్తవం బోధపడింది. భారత్‌ను, పాకిస్తాన్‌ను ఒక గాటన కట్టలేమన్న సంగతి తెలుసుకుంది. అలా చేయడం వల్ల తనకు దీర్ఘకాలంలో నష్టమన్న ఇంగితాన్ని ప్రదర్శించింది. అదే సమయంలో క్రమంగా ఇస్లామాబాద్‌ అసలు స్వరూపం ఏమిటో అమెరికాకు అనుభవపూర్వకంగా అర్థమైంది. తాను పాముకు పాలుపోస్తున్నట్లు కాస్త ఆలస్యంగా అయినా అర్థం చేసుకుంది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లే భారత్‌తో పాకిస్తాన్‌ను పోల్చడం ఎంతమాత్రం సరికాదని తెలుసుకుంది. తరవాత తన వైఖరిని మార్చుకుని ముందుకు సాగుతోంది.

ఇదంతా ఒకనాటి చరిత్ర. దాన్నుంచి పాఠాలు నేర్చుకోకపోతే ఎవరికైనా గుణపాఠాలు తప్పవు. అగ్రరాజ్య హోదా కోసం పరితపిస్తున్న చైనా ఈ విషయాన్ని గ్రహిస్తున్నట్లు లేదు. ఒకవేళ తెలిసినా తెలియనట్లు నటిస్తుందేమో అర్థం కాదు. కానీ అంతిమంగా దీనివల్ల నష్టపోయేది బీజింగేనన్నది నిజం. గత కొంతకాలంగా పాకిస్తాన్‌ను సైనికంగా బలోపేతం చేసేందుకు చైనా ప్రయత్నిస్తోంది. వాయు, జలమార్గాలలో దానికి మరింత శక్తిని అందించేందుకు శ్రమిస్తోంది. డ్రాగన్‌కు తరవాత టర్కీ తోడైంది. ఇస్లామాబాద్‌కు అన్నివిధాల సైనికంగా సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. చైనా, టర్కీ అధినేతలు షి జిన్‌ ‌పింగ్‌, ‌రెసెప్‌ ‌తయ్యిప్‌ ఎర్డొగాన్‌ ‌పాకిస్తాన్‌కు దన్నుగా నిలుస్తున్నారు. తన ప్రతిష్టాత్మక బెల్ట్ ‌రోడ్‌ ఇనిషియేటీవ్‌ (‌బీఆర్‌ఐ) ‌ప్రాజెక్టులో భాగంగా పాకిస్తాన్‌లో చైనా అనేక ప్రాజెక్టులు చేపడుతోంది. సీపీఈసీ (చైనా, పాకిస్తాన్‌ ఎకనమిక్‌ ‌కారిడార్‌) ‌ద్వారా పాకిస్తాన్‌లో చైనా పెద్దయెత్తున నిధులు వెచ్చిస్తోంది. బీఆర్‌ఐ ‌ప్రాజెక్టులో చేరాలని చైనా కోరినప్పటికీ భారత్‌ ‌దూరంగా ఉండిపోయిన సంగతి గమనార్హం. ఆసియా, ఆఫ్రికా ఖండాలను అనుసంధానం చేసే ఈ ప్రాజెక్టు వల్ల చైనాకు తప్ప అన్యులకు ఒరిగేదేమీ లేదన్నది భారత్‌ ‌భావన. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌ ‌ప్రావిన్స్‌లో అరేబియా సముద్ర తీరాన గ్వదర్‌ ‌పోర్టు నిర్మాణం ద్వారా పాక్‌ను ఇప్పటికే చైనా బలోపేతం చేసింది. అదే సమయంలో వెనకబడిన బలూచిస్తాన్‌ ‌ప్రావిన్స్ ‌ప్రగతిని రెండుదేశాలు విస్మరించడం గమనార్హం. పాకిస్తాన్‌ అవసరాల రీత్యా టైప్‌- 054 ‌యుద్ధ నౌకను నిర్మించింది. జేఎఫ్‌ 17 ‌ఫైటర్‌ ‌జెట్ల తయారీలో ఇస్లామాబాద్‌కు బీజింగ్‌ అన్నివిధాలా సహకరించింది. షాహిన్‌ ‌బాలిస్టిక్‌ ‌క్షిపణి కోసం చైనా డిజైన్లను అందజేసింది. యుద్ధ విమానాల తయారీకి చైనా తన సాంకేతిక పరిజ్ఞానాన్ని బదలీ చేస్తోంది. అంతర్జాతీయ వేదికలపైనా పాక్‌కు బీజింగ్‌ అం‌డగా నిలుస్తోంది. ఐరాస భద్రతా మండలిలో మద్దతు సరేసరి. ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి ఎఫ్‌ఏటీఎఫ్‌ (‌ఫైనాన్షియల్‌ ‌యాక్షన్‌ ‌టాస్క్ ‌ఫోర్సు) వ్యవహారాల్లో దన్నుగా నిలుస్తోంది. ఉగ్రవాదం అణిచివేతలో, ఉగ్రవాద సంస్థలకు అందుతున్న నిధుల విషయంలో ఇస్లామాబాద్‌ ‌నిర్లక్ష్య వైఖరిపై ఎఫ్‌ఏటీఎఫ్‌ ‌గత కొంతకాలంగా ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ కొన్ని ఆంక్షలు కొనసాగుతున్నాయి.

 అమెరికా నాయకత్వంలోని నాటో (ఎన్‌ఏటీఓ- నార్త్ అట్లాంటిక్‌ ‌ట్రీటీ ఆర్గనైజేషన్‌) ‌సభ్య దేశమైన టర్కీ ఇటీవల కాలంలో పాక్‌ ‌తరఫున వకాల్తా పుచ్చుకుంటోంది. కశ్మీర్‌ ‌పై వివాదాస్పద ప్రకటనలు చేస్తోంది. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో విస్తరించిన ఈ దేశం ఇటీవల కాలంలో తనను తాను ఇస్లామిక్‌ ‌ప్రపంచ నాయకుడిగా భావించుకుంటోంది. తద్వారా గతంలో సౌదీ అరేబియా పాత్రను పోషించాలనుకుంటోంది. ఇందులో భాగంగా ఇస్లామిక్‌ ‌ప్రపంచంలో అత్యధిక జనాభా గల పాకిస్తాన్‌ను మచ్చిక చేసుకుంటోంది. దానితో అనేక విషయాల్లో అంట కాగుతుంది. సైనిక పరంగా సాయమందిస్తోంది. సైనిక హార్డ్‌వేర్‌ అభివృద్ధిపై ఈ ఏడాది జనవరిలో ఇరుదేశాల రక్షణ అధికారులు చర్చలు జరిపారు. పాక్‌, ‌టర్కీ రక్షణ మంత్రులు మియాన్‌ ‌హహమ్మద్‌ ‌హిలాన్‌, ‌హులుసి అకార్‌; ‌సైనిక, వైమానికదళ చీఫ్‌లు సమావేశమయ్యారు. గతేడాది టర్కీ అధినేత ఎర్డొగాన్‌ ‌పాకిస్తాన్‌లో పర్యటించి ఆయుధ సరఫరాపై చర్చించారు. పాక్‌ ‌నౌకాదళానికి అధునాతన నౌకలను అందజేసేందుకు ఈ సందర్భంగా టర్కీ ముందుకొచ్చింది. సైపర్‌ ‌లాంగ్‌ ‌రేంజ్‌ ‌క్షిపణి రక్షణ ప్రాజెక్టు, టీఎఫ్‌ ఎక్స్ ‌ఫైటర్‌ ‌జెట్ల నిర్మాణంలో పాక్‌కు టర్కీ సాయ పడుతోంది. పాక్‌కు చైనా, టర్కీ అనేక విషయాల్లో సాయపడుతున్నాయి. అధునాత యుద్ధ విమానాలు, క్షిపణులు, యుద్ధ నౌకలను అవి సమకూరుస్తున్నాయి. సాధారణంగా ఏ దేశమైనా రక్షణకు సంబంధించిన అంశాలను పూర్తిగా బహిర్గతం చేయదు. కొంత గోప్యత పాటిస్తాయి. ఇతర దేశాలతో సంబంధించిన ప్రాజెక్టులపై పెద్దగా నోరువిప్పవు. అరకొరగా సమాచారాన్ని వెల్లడిస్తాయి. ఇప్పుడు చైనా, టర్కీ, పాకిస్తాన్‌ ‌విషయంలో జరుగుతున్నది ఇదే. సహజంగానే చైనా విపరీతమైన గోప్యత పాటిస్తుంది. టర్కీ కూడా దాదాపు ఇదే విధానాన్ని పాటిస్తుంది. పాకిస్తాన్‌ ‌పరిస్థితి ఒకింత భిన్నం. అయినప్పటికీ రక్షణకు సంబంధించిన అంశాలు కాబట్టి పూర్తిగా బహిర్గతం చేయవు. కేవలం రక్షణపరమైన అంశాలకే పరిమితం అవకుండా ఇతర విషయాల్లోనూ పాక్‌కు చైనా, టర్కీ దన్నుగా నిలుస్తున్నాయి.

 పాక్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌ (‌పీవోకే)పై భారత్‌ ‌నుంచి పాక్‌కు మున్ముందు ముప్పు పొంచి ఉన్నదన్నది చైనా, టర్కీ అనుమానం, వాదనగా ఉంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకే ఇస్లామాబాద్‌కు ఇతోధిక సాయం చేస్తున్నట్లు ఈ రెండు దేశాలు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి. పీవోకేపై భారత్‌ ‌మరెంతో కాలం సహనంతో ఉండదని, గట్టి చర్యలు తీసుకుంటుందని ఆ మూడు దేశాల భావన. ఒకవేళ అటువంటి పరిస్థితి ఏర్పడితే అధునాతన సైనిక సంపత్తి గల భారత్‌ను పరిమిత వనరులు గల పాకిస్తాన్‌ ఎదుర్కోవడం కష్టమన్నది చైనా, టర్కీ అంచనా. అందుకే మిత్రదేశానికి అండగా నిలుస్తున్నామని అవి చెబుతున్నాయి. ఇందుకు సంబంధించి చైనా, టర్కీలకు వాటి కారణాలు వాటికున్నాయి. చైనాకు మొదటి శత్రువు భారత్‌. ఇప్పటికే సరిహద్దు వివాదంపై 60ల్లో ఒకసారి యుద్ధం జరిగింది. తాజాగా గత ఏడాది జూన్‌లో తూర్పు లద్దాఖ్‌లో ఘర్షణ జరిగింది. ఇప్పటికీ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సమసిపోలేదు. శత్రువుకి శత్రువు మనకు మిత్రుడనే సామెత ఉంది. ఈ నేపథ్యంలో పాక్‌ ‌శత్రువైన భారత్‌ ‌సహజంగానే చైనాకూ శత్రువే. అందువల్ల పాకిస్తాన్‌ను సైనికంగా, ఇతరత్రా అన్నివిధాలా బలోపేతం చేయడం ద్వారా భారత్‌ను నియంత్రించవచ్చనేది చైనా వ్యూహం. అందుకే పాక్‌కు ఎడాపెడా సాయం చేస్తోంది. చైనాతో తమ స్నేహం తేనె కన్నా తీయనైదని, సముద్రం కన్నా లోతైనదని, ఆకాశం కన్నా ఎత్తైనదని ఒక సందర్భంగా నాటి పాక్‌ ‌ప్రధాని నవాజ్‌ ‌షరీఫ్‌ ‌వర్ణించారు. ఒక్క నవాజ్‌ ‌షరీఫ్‌ ‌మాత్రమే కాదు, ఇస్లామాబాద్‌ అధికార పీఠాలను అధిష్టించిన నేతలందరిదీ అదే వైఖరి. భారత్‌, ‌చైనా విషయంలో వారి వైఖరిలో పెద్దగా గుణాత్మక మార్పుండదు. ఇక అంతర్జాతీయ యవనికపై టర్కీ సరికొత్త పాత్రను అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. ఒకప్పుడు సాధారణ దేశంగా తన వ్యవహారాలకే పరిమితమైన ఈ దేశం ఇప్పుడు తన పరిధిని విస్తరించుకోవాలని తపన పడుతోంది. ముఖ్యంగా ఇస్లామిక్‌ ‌దేశాలకు పెద్దన్నగా వ్యవహరించాలని ఆశిస్తోంది. పైకి చెప్పనప్పటికీ దాని అసలు ఉద్దేశం ఇదే. ఇస్లామిక్‌ ‌ప్రపంచంలో సున్నీ దేశమైన సౌదీ అరేబియా, షియా దేశమైన ఇరాన్‌ ‌మధ్య వైరం అందరికీ తెలిసిందే. సౌదీకి అమెరికా మద్దతు ఉంది. అమెరికా బద్ద వైరి ఇరాన్‌. ఈ ‌పరిస్థితిని ఆసరాగా చేసుకుని ఇస్లామిక్‌ ‌దేశాలకు సారథ్యం వహించాలన్నది దాని ఆలోచన. ఇందులో భాగంగా పాక్‌కు అప్రకటిత మద్దతు ఇవ్వడం ద్వారా దానిని మచ్చిక చేసుకుంటోంది.

 చైనా, టర్కీ భావిస్తున్నట్లు భారత్‌ ‌నుంచి పాక్‌కు ఎలాంటి ముప్పు లేదు. కశ్మీర్‌ ‌సమస్యను చర్చల ద్వారానే పరిష్కరించాలనుకుంటోంది. ఇందుకు 60ల నాటి సిమ్లా ఒప్పందమే ప్రాతిపదిక కావాలంటోంది. నాటి ప్రధానలు ఇందిరాగాంధీ, జుల్ఫికర్‌ ఆలీ భుట్టో ఈ ఒప్పందంపై సంతకాలు చేసిన సంగతిని మరిచి పోరాదు. అంతేతప్ప ఏకపక్షంగా, నేరుగా పాక్‌పై దండెత్తాలని ఎంతమాత్రం అనుకోవడం లేదు. అన్ని ప్రత్యమ్నాయాలు విఫలమైనప్పుడే యుద్ధం గురించి ఆలోచిస్తుంది. ఈ విషయం చైనా, పాకిస్తాన్‌, ‌టర్కీలకు తెలియనిది కాదు. అయినప్పటికీ అంతర్జాతీయంగా భారత్‌ను బద్నాం చేయాలనే దర్బుద్ధితోనే చైనా, టర్కీ యుద్ధం బూచి చూపుతున్నాయన్నది వాస్తవం. పాక్‌తో జరిగిన మూడు యుద్ధాల్లోనూ భారత్‌ ఎప్పుడూ తనంతట తాను కయ్యానికి కాలు దువ్వలేదు. దాయాది దూకుడుగా వ్యవహరించినప్పుడే దానికి తగిన బుద్ధి చెప్పిందన్నది తెలియనిది కాదు. అర్థవంతమైన చర్చల ద్వారానే కశ్మీర్‌ ‌సమస్యలను పరిష్కరించుకోవాలన్నది ఢిల్లీ అభిమతం. ఈ వాస్తవాన్ని ఇస్లామాబాద్‌ ఎం‌త త్వరగా గ్రహిస్తే అంత మంచిది.

వ్యాసకర్త: సీనియర్‌ ‌జర్నలిస్ట్

By editor

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram