రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. టెస్టుల్లో కోత విధించడంతో ప్రతిరోజు అనేకమంది పరీక్షల కోసం వచ్చి వెనక్కి వెళ్లిపోతున్నారు. కిట్ల కొరత సాకుతో అతి తక్కువ మందికే టెస్టులు చేస్తున్నారు. అందులోనూ పైరవీ ఉన్నోళ్లకే టెస్టులు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో టెస్టుల కోసం వచ్చినవారు ఇబ్బంది పడుతున్నారు. కరోనా లక్షణాలు ఉన్నవాళ్లకే టెస్టులు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో హాస్పిటళ్లకు ర్యాపిడ్‌ ‌యాంటిజెన్‌ ‌కిట్ల సరఫరాలో కోత విధించింది. రెండు నెలల క్రితం దాకా ఒక్కో జిల్లాలో సగటున 2 వేల నుంచి 3 వేల టెస్టులు నిర్వహించేవాళ్లు. కానీ, కొద్దిరోజులుగా వెయ్యి మందికి కూడా పరీక్షలు చేయడం లేదు. జిల్లా ఆసుపత్రులకు 100, పీహెచ్‌సీలకు 50లోపే కిట్లు కేటాయిస్తున్నారు.

నిజానికి వైరస్‌ ‌ప్రాథమిక దశలో ఉన్నప్పుడే గుర్తించగలిగితే ప్రాణాపాయం నుంచి బయట పడొచ్చని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. దీంతో, కరోనా అనుమానితులు పరీక్షలు చేయించుకొనేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్‌, ‌క్లస్టర్‌ ‌హెల్త్ ‌సెంటర్లు, జిల్లా ఆసుపత్రుల వద్ద బారులు తీరుతున్నారు. జలుబు, దగ్గు లక్షణాలు కనిపిస్తే చాలు.. కరోనా అయి ఉంటుందేమో అని జనం అనుమానిస్తున్నారు. పరీక్ష కేంద్రాలకు క్యూలు కడుతున్నారు. అయితే, అవసరాల మేరకు టెస్టింగ్‌ ‌కిట్లు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో సెంటర్‌ ‌దగ్గర తెల్లవారుజామున 5 గంటల నుంచే క్యూలైన్లలో నిల్చుంటున్నారు. తమ వంతు వచ్చేసరికి చేతులెత్తేస్తుండటంతో కొన్ని సెంటర్లలో జనం సిబ్బందితో వాగ్వాదాలకు దిగుతున్న సంఘటనలూ చోటు చేసుకుంటున్నాయి.

రెండోదశ కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో కొవిడ్‌ ‌నిర్ధారణ పరీక్షల సంఖ్య తగ్గించడం ఆందోళన కలిగిస్తోంది. సర్కారు ఆసు పత్రులు, హెల్త్ ‌సెంటర్లలో అవసరమైనన్ని పరీక్షలు చేయకపోవడంతో.. చాలామంది తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రధానంగా కరోనా లక్షణాలు ఉన్నవాళ్లు, లక్షణాలు తీవ్రస్థాయిలో ఉన్నవాళ్లు ప్రైవేటుగా పరీక్షలు చేయించుకోవడం అనివార్యమవుతోంది. దీంతో, ఆర్థికంగానూ నష్టపోవాల్సి వస్తోంది. కరోనా సోకిందేమో అన్న భయాన్ని ప్రైవేట్‌ ‌ల్యాబ్‌లు సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రధానంగా అవసరం లేకున్నా హెచ్‌ఆర్‌ ‌సీటీ స్కాన్‌లు చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. పైగా స్కానింగ్‌ ‌రేట్లను రెండు మూడు రెట్లు పెంచేశారు.

ప్రైవేటు ఆసుపత్రులు, టెస్టింగ్‌ ‌సెంటర్లలో ఫీజులు భారీగా వసూలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ర్యాపిడ్‌ ‌యాంటిజెన్‌ ‌టెస్టుకు వెయ్యి రూపాయలు, ఆర్టీపీసీఆర్‌ ‌పరీక్షకు 2000 రూపాయల దాకా కొన్ని లాబ్స్ ‌వసూలు చేస్తున్నాయి. కొందరు వైద్యులైతే.. హెచ్‌ఆర్‌సీటీ స్కానింగ్‌ ‌చేయాలని కూడా సలహాలు ఇస్తున్నారు. తమకు కొవిడ్‌ ఉం‌దో లేదో స్పష్టత వస్తుందన్న ఆశతో జనం డబ్బులు ఎంతైనా ఖర్చు పెట్టి పరీక్షలు చేయించుకుంటున్నారు. కొన్ని డయాగ్నోస్టిక్‌ ‌కేంద్రాలలో అయితే వైద్యుడి సలహా లేకుండానే సీటీస్కాన్‌లు చేస్తున్నారు. ఏడాది క్రితం వరకు 4 వేల రూపాయలు ఉన్న హెచ్‌ఆర్‌సీటీ స్కాన్‌కు ఇప్పుడు ఏకంగా 8 వేల నుంచి 12 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. కరోనా భయంతో వస్తున్న పేషెంట్లను ఇలా పీల్చి పిప్పి చేస్తుండటంతో మధ్య తరగతి ప్రజలు, ముఖ్యంగా పేదలు ఆర్థికంగా కుంగిపోతున్నారు.

వాస్తవానికి హెచ్‌ఆర్‌సీటీ స్కాన్‌ అం‌దరికీ అవసరం లేదంటున్నారు నిపుణులు. తీవ్ర లక్షణాలు ఉండి, మందులు వాడినప్పటికీ వైరస్‌ ‌ప్రభావం తగ్గకుండా రోజురోజుకీ సమస్య ఎక్కువవుతున్న వారికి మాత్రమే హెచ్‌ఆర్‌ ‌సీటీ అవసరం. అలాంటి వారిలో చెస్ట్ ఎక్స్ ‌రేతో పాటు.. డీ డైమర్‌ ‌వంటి కొన్నిరకాల రక్త పరీక్షలు, హెచ్‌ఆర్‌ ‌సీటీ చేయటం ద్వారా వైరస్‌ ‌తీవ్రతను గుర్తించి ప్రాణాపాయం లేకుండా కాపాడవచ్చు. స్వల్ప లక్షణాలు, లక్షణాలులేని వారికి యాంటిజెన్‌, ఆర్టీపీసీఆర్‌ ‌పరీక్షల్లోనే వైరస్‌ ‌నిర్ధారణ అవుతున్న తరుణంలో హెచ్‌ఆర్‌ ‌సీటీ వంటి పరీక్షలు చేయించుకోవటం వృథా ఖర్చు అంటున్నారు వైద్య నిపుణులు. కరోనా లక్షణాలు ఉన్న వాళ్లందరూ హెచ్‌ఆర్‌ ‌సీటీ కోసం క్యూలు కట్టి అనవసరంగా జేబులు గుల్ల చేసుకోవద్దని చెబుతున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న ఈ పరిస్థితుల నేపథ్యంలో కరోనాను కట్టడి చేయడంలోనే కాదు, ప్రైవేట్‌ ‌దందాను నియంత్రించడంలోనూ తెలంగాణ ప్రభుత్వం విఫలమయిందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో తగినన్ని వసతులు అందు బాటులో లేవు. మరోవైపు ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక ఫీజుల వసూళ్లను సర్కారు కట్టడి చేయలేక పోతోంది. పేరుకే టాస్క్‌ఫోర్స్ ‌కమిటీ వేసినా.. సమస్యల పరిష్కారానికి చర్యలు శూన్యమన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కరోనా కనికరం లేకుండా ప్రజల ప్రాణాలు తీస్తుంటే.. ప్రైవేటు ఆసుపత్రుల దందా ఈ పరిస్థితులకు మరింత ఆజ్యం పోస్తుందన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు వైద్యాన్ని పూర్తిస్థాయి వ్యాపారంగా మార్చినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. కరోనా మొదటి దశలోనూ, ఇప్పుడు రెండో దశలోనూ లక్షల రూపాయలు దండుకుంటున్నా.. వాళ్లపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందంటున్నారు. ఇప్పటివరకు ఒకటీ రెండు ఆసుపత్రులకు మాత్రమే నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న ప్రభుత్వం.. ఏడాదికాలంగా ఒక్క ఆసుపత్రిపైనా చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. కరోనా పరిస్థితులను పర్యవేక్షించాల్సిన టాస్క్‌ఫోర్స్ ‌కమిటీ సైతం లక్షల రూపాయలు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకోవడంలో విఫలమయింది.

మొదటిదశలో ఆసుపత్రుల దోపిడీపై కొందరు కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం ఆదేశాల మేరకు ప్రభుత్వం కరోనా చికిత్సకోసం ప్రైవేట్‌ ఆసుపత్రులు వసూలు చేయాల్సిన ఫీజులపై స్లాబ్‌ల విధానాన్ని రూపొందించింది. కానీ, ఏ ఒక్క ఆసుపత్రి కూడా ఆ నిబంధనలను అమలు చేయలేదు. ఇక, సెకండ్‌వేవ్‌లో అలాంటి విధానమేదీ రూపొందించ లేదు. అంతేకాదు, కనీసం ప్రైవేట్‌, ‌కార్పొరేట్‌ ‌హాస్పిటల్స్‌లో ఉన్న బెడ్‌ల వివరాలు కూడా సర్కార్‌ ‌వద్ద ఉండటం లేదు. దాంతో బెడ్‌లను బ్లాక్‌ ‌చేసి డబ్బులు ఎక్కువ ఇచ్చిన వారికి మాత్రమే చికిత్స అందిస్తున్నాయి కార్పొరేట్‌ ఆసుపత్రుల యాజ మాన్యాలు. దీంతో, వైద్యం కోసం వచ్చి హాస్పిటల్స్ ‌చుట్టూ తిరిగి బెడ్లు దొరకక రోగులు చనిపోయే పరిస్థితి నెలకొంది. మరోవైపు.. ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ ‌కార్డులు, జర్నలిస్ట్ ‌హెల్త్‌కార్డులు, ఇన్సూరెన్స్ ‌కంపెనీల మెడికల్‌ ‌బీమాలను ప్రైవేటు ఆసుపత్రులు లెక్కలోకి తీసుకోవడం లేదు.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ ‌కమిటీ కరోనాకి వినియోగించే మందులు, మందుల సరఫరా, లభ్యతపై మాత్రమే దృష్టి సారిస్తోందని చెబుతున్నారు. రెమిడిసివర్‌ ఇం‌జక్షన్ల కొరత, బెడ్ల కొరత, ఆక్సిజన్‌ ‌కొరత సృష్టించేది కార్పొరేట్‌ ఆసుపత్రులే. కానీ, టాస్క్‌ఫోర్స్ ‌కమిటీ వాటిపై ఎలాంటి నియంత్రణ చర్యలు తీసుకోకుండా రివ్యూలకు మాత్రమే పరిమితం అవుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ ‌కొరత పట్టిపీడిస్తోంది. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో బెడ్లు దొరకడం లేదు. కానీ ప్రభుత్వం ఆ సమస్యను తీర్చే చర్యలు చేపట్టడం లేదు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేరుస్తామని సీఎం కేసీఆర్‌ ‌హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా.. ఇప్పటివరకు అమలు కావడంలేదు.

రాష్ట్రంలో నెలకొన్న వైద్య పరిస్థితులపై ఇటీవల హైకోర్టులో విచారణ జరిగింది. ఆ సమయంలో ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీపై హైకోర్టు సీరియస్‌ అయింది. మొదటి ఫేస్‌లో ప్రైవేట్‌ ‌హాస్పిటల్‌ ‌చార్జీలపై ఫిర్యాదులకు ముగ్గురు ఐఏఎస్‌లతో కూడిన టాస్క్‌ఫోర్స్ ‌కమిటీ వేశారు. కానీ, ఇప్పుడు ఇంత తీవ్రత ఉన్నా ఆ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పిటిషనర్‌ ‌వాదనలు వినిపించగా, గతంలో మాదిరే ప్రైవేట్‌ ‌హాస్పిటల్‌ ‌చార్జీలపై టాస్క్‌ఫోర్స్ ‌కమిటీ చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కొవిడ్‌ ఆస్పత్రులలో బెడ్స్ ‌సామర్ధ్యంపై ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఒక సంఖ్య, క్షేత్ర స్థాయిలో మరో సంఖ్య ఉంటుందని న్యాయస్థానం అభిప్రాయ పడింది. వాదనలు ముగిసిన తరువాత ప్రభుత్వానికి హైకోర్టు పలు సూచనలు కూడా చేసింది.

ఇదిలా ఉంటే, రాష్ట్రంలో బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌కేసులు కూడా కలకలం సృష్టిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ కేసుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్లాక్‌ఫంగస్‌ ‌నోడల్‌ ‌కేంద్రాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఆ కేసుల చికిత్స కోసం కోఠి ఈఎన్‌టి ఆస్పత్రిని నోడల్‌ ‌కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అయితే, బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌బారిన పడి.. కొవిడ్‌ ‌పాజిటివ్‌గా ఉన్న వారికి మాత్రం గాంధీలో చికిత్స అందించనున్నట్టు పేర్కొంది. ఇక ఫంగస్‌ ‌సోకిన వారికి కంటి సమస్యలు తలెత్తితే సరోజిని దేవి ఆసుపత్రి వైద్యుల సహకారం తీసుకోవాలని నోడల్‌ ‌కేంద్రం అధికారులకు సూచించింది. ఈ మేరకు గాంధీ, సరోజినిదేవి, కోఠి ఈఎన్‌టి ఆస్పత్రుల సూపరిండెంట్‌లు సమన్వయంతో పని చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.

అయితే.. ప్రభుత్వం ఇప్పటినుంచే బ్లాక్‌ఫంగస్‌ ఇన్ఫెక్షన్‌ ‌చికిత్సలో వాడే యాంటీఫంగల్‌ ఇం‌జక్షన్లను సమకూర్చుకోవాలని లేకుంటే పరిస్థితి చేజారే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చ రిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో నమోదైన కేసులకు సరిపడా ఇంజక్షన్లు లేకపోవడం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది.

ప్రస్తుతం బ్లాక్‌ ‌ఫంగస్‌కు చికిత్స అందిస్తున్న ఏ హాస్పిటల్‌లోనూ అవసరానికి సరిపడా యాంటీ ఫంగల్‌ ఇం‌జక్షన్లు అందుబాటులో లేవు. బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌సోకిన వారికి 2 నుంచి 6 వారాల చికిత్స అవసరం. ఎంత తొందరగా చికిత్స మొదలు పెడితే అంత మంచిది. లేదంటే.. క్రమంగా కంటిచూపును కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. ప్రాణాంతకం అవుతుంది. రోగి పరిస్థితిని బట్టి.. రోజుకు 2 నుంచి 4 డోసుల యాంఫోటెరిసిన్‌-‌బి ఇంజక్షన్‌ అవసరం అవుతుంది. రోజూ ఈ కోర్సును కొనసాగించాల్సిందే. అంటే, 2 నుంచి 6 వారాల చికిత్సలో ఈ యాంటీ-ఫంగల్‌ ఇం‌జక్షన్‌దే అత్యంత కీలక పాత్ర. ఈ ప్రకారం.. రెండు వారాల చికిత్సకైనా ఒక రోగికి కనీసం 28 యాంఫోటెరిసిన్‌-‌బి ఇంజక్షన్లు అవసరమంటున్నారు నిపుణులు.

కొవిడ్‌ ‌చికిత్సలో అత్యంత కీలకంగా భావించే రెమ్‌డెసివిర్‌ ‌కొరతను ఎదుర్కొన్న రోగుల కుటుంబ సభ్యులు.. కరోనా గండం నుంచి గట్టెక్కాక.. యాంఫోటెరిసిన్‌-‌బి ఇంజక్షన్ల కోసం కష్టాలు పడు తున్నారు. లక్షలు పెట్టి కరోనా నుంచి బయటపడ్డా.. బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌నుంచి బయటపడేందుకు నానా కష్టాలు పడుతున్నారు. యాంటీ-ఫంగల్‌ ఇం‌జక్షన్లకు డిమాండ్‌ ‌పెరగడం. అందుకు తగ్గట్లుగా ఉత్పత్తి, సరఫరా లేకపోవడంతో వాటి ధరలు అమాంతం పెరిగి పోయాయి. కరోనాకు ముందు రూ. 3 వేల 500 నుంచి 7 వేల 500 రూపాయలకు లభించే యాంఫోటెరిసిన్‌-‌బి.. ఇప్పుడు 30 వేల రూపాయలు పెట్టినా దొరకడం లేదు. దాంతోపాటు.. యాంటీ-ఫంగల్‌ ‌చికిత్సలో ఉపయోగపడే మరో కీలక ఇంజక్షన్‌ ‌పోసకొనాజోల్‌కూ తీవ్ర కొరత నెలకొంది.

– సుజాత గోపగోని, 6302164068

About Author

By editor

Twitter
Instagram