ఈటల మాటల బాణాలు… అధికార పార్టీలో అలజడులు

– సుజాత గోపగోని, 6302164068

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ‌వ్యవహారం తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. సర్కారుపై, ముఖ్యంగా కేసీఆర్‌పై ఈటల ఎక్కుపెడుతున్న బాణాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఒకరకంగా తెలంగాణ రాజకీయాలు రాజేందర్‌ ‌చుట్టూ తిరుగుతున్నాయని చెప్పవచ్చు. అన్ని పార్టీల శిబిరాల్లో ఆయన గురించే చర్చించుకునే పరిస్థితి. కొందరు నేతలైతే ఈటల ఆరోపణలకు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇన్నాళ్లు ముఖ్యనేతగా వ్యవహరించిన ఈటల రాజేందర్‌కు పార్టీ వ్యవహారాలు, కేసీఆర్‌ ‌వ్యూహాలు, ఆయా సందర్భాల్లో కేసీఆర్‌ అవలంబించిన విధానాలపై సంపూర్ణంగా కాకపోయినా చాలావరకు అవగాహన ఉంది. అలాంటి రాజేందర్‌ ‌మాట్లాడే మాటలను గానీ, చేసే వ్యాఖ్యలను గానీ తేలిగ్గా తీసిపారేయలేం. ప్రతీ ఆరోపణ వెనుకా, ప్రతి అంశం పైనా ఎంతో నిగూడార్థం దాగి ఉంటుందన్నది విశ్లేషకుల మాట.

హుజురాబాద్‌ ‌శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న ఈటల.. తొలినుంచీ, ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే మలిదశ ఉద్యమకాలం నుంచీ టీఆర్‌ఎస్‌ ‌వెన్నంటే ఉన్నారు. కేసీఆర్‌కు అతి సన్నిహితంగా మెదిలారు. కేసీఆర్‌తో పాటు ఆయన మేనల్లుడు హరీష్‌రావు వ్యూహాల్లోనూ ఈటల రాజేందర్‌ ‌భాగస్వాములయ్యారు. దీంతో, పార్టీలో ప్రధాన నేతల జాబితాలో ఈటల పేరు ముందు వరుసలోనే ఉంటుంది. సాధారణ ఎన్నికలకు తోడు.. ఉద్యమపార్టీ ముద్ర కారణంగా పలుసార్లు రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్లిన సందర్భాలన్నీ కలుపుకుంటే ఈటల ఇప్పటివరకు హుజురాబాద్‌ ‌నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా  గెలుపొందారు. అందుకే తెలంగాణ కల సాకారమైన తర్వాత ఏర్పడిన మంత్రివర్గంలో కీలకమైన స్థానం దక్కింది.

కేసీఆర్‌ ‌తన సన్నిహితుల జాబితాలో ఈటల రాజేందర్‌ను చేర్చుకోవడానికి మరో కారణం కూడా ఉంది. ఉద్యమపార్టీగా అవతరించిన తెలంగాణ రాష్ట్ర సమితికి తొలినాళ్లలో ఆర్థిక అండదండలు అందించింది ఈటల రాజేందరే అని చెబుతారు. అలా.. ఆర్థికంగా ఏ ఆసరా లేని సమయం నుంచీ టీఆర్‌ఎస్‌కు అండగా ఉంటూ వస్తున్నారు. ఎందుకంటే అప్పటికే ఈటల రాజేందర్‌, ఆయన సతీమణి జమున.. పౌల్ట్రీ పరిశ్రమతో వ్యాపార రంగంలో ఉన్నారు. అవసరానికి ఆదుకునే రీతిలో అందు బాటులో ఉండే ఈటలను కేసీఆర్‌ అనుయాయుల్లో ఒకరిగా చేర్చుకున్నారు.

విదేశాల నుంచి తిరిగివచ్చిన కేటీఆర్‌.. ‌టీఆర్‌ఎస్‌లో ముఖ్యపాత్ర పోషించే సమయానికే ఈటల పార్టీలో ముఖ్యనేతగా ఎదిగారు. కేసీఆర్‌ ‌కుటుంబ సభ్యులు, బంధువుల తర్వాత టీఆర్‌ఎస్‌లో తొలి స్థానం ఆక్రమించేది ఈటల రాజేందరే. ఈ విషయం అందిరికీ తెలిసిందే. అంటే.. కేసీఆర్‌ ఆలోచనలపై, ఆయన తీసుకునే నిర్ణయాలపై, కేసీఆర్‌ ‌వ్యూహాలపై దాదాపు అవగాహన కలిగి ఉన్న నాయకుడు ఈటల. అందుకే కేసీఆర్‌ ‌తర్వాత సీఎం పీఠాన్ని అధిష్టించే అంశం చర్చకు వచ్చినప్పుడు సహజంగానే కుమారుడు కావడంతో కేటీఆర్‌ ‌గురించి కుటుంబ సభ్యులు లీకులిచ్చినా.. రాజకీయంగా సొంతపార్టీ నుంచే కాకుండా.. విపక్షాల నుంచి కూడా ఈటల పేరు ప్రతిపాదనల్లోకి వచ్చింది. స్వయంగా ప్రతిపక్షాల నేతలే సీఎంగా ఈటల రాజేందర్‌ ‌సరైన నాయకుడంటూ ప్రకటించిన సందర్భాలున్నాయి.

అందుకే ఈటల టీఆర్‌ఎస్‌ ‌నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏది మాట్లాడినా సంచలనం అవుతోంది. ఏ అంశం బయటపెట్టినా రాజకీయంగా చర్చకు దారి తీస్తోంది. పలువురిని ఇరుకున పడేస్తోంది. తాజాగా ఇవే పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పటి తెలంగాణ ఉద్యమకర్త, టీఆర్‌ఎస్‌కు దశ, దిశగా ఉన్న నేటి ఓ పార్టీ అధినేత కోదండరాం నుంచి మొదలుకొని.. కేసీఆర్‌ ‌మేనల్లుడు హరీష్‌రావు దాకా  మీడియా ముందు తమ ప్రతిస్పందనలు తెలియ జేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరణలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

ఈటలను మంత్రివర్గం నుంచి తొలగించిన తర్వాత టీఆర్‌ఎస్‌ అసంతృప్త, విపక్ష నేతల మద్దతును కూడగట్టుకోవడానికి ప్రయత్నించారు. రోజుకో నేతను కలుస్తూ బిజీబిజీగా గడిపారు. మొత్తానికి తన భవిష్యత్‌ ‌కార్యాచరణ రూపకల్పన మీదే సీరియస్‌గా ఫోకస్‌ ‌పెట్టి ఆయా నేతలతో విస్తృతంగా చర్చలు జరిపారు. తన గోడును, పార్టీలో జరిగిన అవమానాలను, అన్యాయాన్ని వివరిస్తూనే, భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయంలో సలహాలు కోరారు. తెలంగాణ ఆకాంక్షల కోసం తాను చేపట్టబోయే ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తులు చేశారు.

 లాక్‌డౌన్‌ ‌ముందు వరకు తన సొంత నియోజకవర్గ కార్యకర్తలు, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వివిధ సంఘాల నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ వచ్చిన ఈటల రాజేందర్‌.. ‌సొంత పార్టీ పెట్టాలా? ఏదైనా పార్టీలో చేరాలా? అనే అంశంపై అభిప్రాయాలు తీసుకున్నారు. లాక్‌డౌన్‌ ‌విధించాక సామూహిక సమావేశాలకు చిన్న బ్రేక్‌ ఇచ్చి నేతలతో భేటీలకు ఆ సమయాన్ని వినియోగించు కున్నారు. టీఆర్‌ఎస్‌ అసంతృప్త నేత రాజ్యసభ సభ్యుడు డీఎస్‌తో సమావేశం అయ్యారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌ ‌రెడ్డి, మరో అసమ్మతి నేత సమ్మిరెడ్డిని వెంట తీసుకువెళ్లారు. సుమారు గంటన్నరకు పైగా డీఎస్‌తో చర్చలు జరిపారు. ఆ చర్చల్లో డీఎస్‌ ‌తనయుడు బీజేపీ ఎంపీ అర్వింద్‌ ‌కూడా పాల్గొన్నారు.

మరో మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నేత అయిన ఏ. చంద్రశేఖర్‌ ఇం‌టికి వెళ్లి కలిశారు. కేసీఆర్‌ ‌వ్యవహార శైలిమీద ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. గతంలో చంద్రశేఖర్‌ను కూడా పార్టీ నుంచి సస్పెండ్‌ ‌చేయగా ఆయన తిరుగుబాటు చేయడంతో కేసీఆర్‌ ఒకడుగు వెనక్కి తగ్గి ఆయనతో సంధి చేసుకున్నారు. ఆనాడు సంధి చర్చలకు వెళ్లిన వారిలో ఈటల కూడా ఒకరు. ఆనాటి ఘటనలను ఇద్దరు నేతలు గుర్తుచేసుకున్నారు. ఉద్యమ కాలం నాటి సహచరునితో తన అభిప్రాయాలు పంచుకున్న ఈటల భవిష్యత్‌ ‌ప్రణాళికలపై సలహాలు కోరారు. అదే క్రమంలో సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క ఇంటికి కూడా వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. గంట పాటు మంతనాలు జరిపారు. అలాగే, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు.. ఆ పార్టీ నేతలు డి.కె. అరుణ, స్వామిగౌడ్‌లను కలిశారు. కాంగ్రెస్‌ ఎం‌పీ రేవంత్‌ ‌రెడ్డి ఇంటికి వెళ్లి కలిశారు.

ఈ నేపథ్యంలో అన్ని పార్టీల నాయకులను కలిసిన ఈటల రాజేందర్‌ అం‌దరితో కలిసి ఐక్యవేదిక ఏర్పాటు చేసి ఉమ్మడి పోరాటం చేస్తారా? లేక సొంత పార్టీ పెడతారా? ఏదైనా పార్టీలో చేరతారా? అనేది అప్పట్లో ఆసక్తిగా మారింది. అయితే అందరితో సంప్రదింపులు ముగిసిన తర్వాత మెజారిటీ అభిప్రాయం మేరకు కరోనా ఉధృతి తగ్గిన తర్వాత నిర్ణయాన్ని ప్రకటిస్తానని రాజేందర్‌ ‌చెప్పారు. కానీ, ఇప్పటికే ఆలస్యం అయ్యిందనుకున్న ఈటల.. తన ముందున్న ప్రతిపాదనలన్నింట్లో బీజేపీ వైపే మొగ్గుచూపారు.

ఈటల రాజేందర్‌ ‌బీజేపీ ముఖ్యనేతలతో మంతనాలు సాగించడం, ఢిల్లీ వెళ్లి కాషాయపార్టీ పెద్దలతో భేటీ కావడంతో అప్పటిదాకా తనకున్న అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. టీఆర్‌ఎస్‌లో ముఖ్యనేతగా వెలుగొందిన కారణంగా పార్టీ వ్యూహాలు, ఇతర పార్టీల రహస్య అంగీకరణలు, ఒప్పందాల గురించి కూడా ఈటలకు తెలిసే ఉంటాయి. అందుకే ఆయన తన నిర్ణయం తీసుకునే ముందు కలిసిన నేతల జాబితా చూసినా, ఆయా పార్టీలపై, నాయకులపై చేసిన విమర్శలు చూసినా అత్యంత జాగరూకతతో మెదిలినట్లు అర్థమవుతుంది. అందుకే ఢిల్లీ వెళ్లి బీజేపీ ముఖ్యులను కలిసి తిరిగి వచ్చిన తర్వాత ఈటల శైలి మారిపోయింది. ఇన్నాళ్లు కేసీఆర్‌ను మాత్రమే టార్గెట్‌ ‌చేసి వ్యాఖ్యానించిన ఈటల రాజేందర్‌.. ఇప్పుడు రూట్‌ ‌మార్చారు. ఆ దిశగా చేస్తున్న వ్యాఖ్యలు, బయట పెడుతున్న విషయాలే హాట్‌టాపిక్‌గా మారుతున్నాయి.

వాస్తవానికి కమ్యూనిస్టు అయిన ఈటల రాజేందర్‌.. ‌సీపీఐ వైఖరిపైనే గురిపెట్టారు. టీఆర్‌ఎస్‌ ‌కనుసన్నల్లో, కేసీఆర్‌ ‌మార్గదర్శకత్వంలో సీపీఐ పనిచేస్తోందని బాణం ఎక్కుపెట్టారు. దీనికి సీపీఐ రాష్ట్రకార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి.. అనివార్యంగా వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

మరోవైపు.. కేసీఆర్‌ ‌మేనల్లుడు హరీష్‌రావు కూడా అనివార్యంగా స్పందించాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు ఈటల రాజేందర్‌. ‌సీఎం కేసీఆర్‌.. ‌తన సొంత మేనల్లుడిని కూడా ఇబ్బందుల పాలు చేస్తున్నారని, కేవలం పార్టీ అధినేత అయినందుకే కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా హరీష్‌ ‌నడుచుకుంటున్నాడని ఆరోపించారు. ఆ విషయం హరీష్‌రావు బయటకు చెప్పకపోయినా.. ఆయన కుటుంబ సభ్యులకు మాత్రం తెలుసని వ్యాఖ్యా నించారు. ఈ వ్యాఖ్యలతో హరీష్‌రావు ఇరుకున పడ్డారు. కాస్త ఆలస్యంగానైనా వివరణ ఇచ్చుకున్నారు. ఈటల వ్యాఖ్యలను ఖండించారు. అంతేకాదు.. తన భుజంపై తుపాకీ పెట్టి కాల్చాలని చూస్తున్నాడంటూ ఈటల రాజేందర్‌పై విమర్శలు గుప్పించారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకూ టీఆర్‌ఎస్‌ను వదిలి పెట్టబోనన్నారు. ఈటల పార్టీనుంచి వెళ్లిపోయి.. తనపై ఇలాంటి ఆరోపణలు చేయడం బాధ కలిగిస్తోందన్నారు. అయితే, ఈ విషయాలన్నీ పేర్కొంటూ హరీష్‌రావు ప్రకటన మాత్రమే విడుదల చేశారు. మీడియా ముందు మాట్లాడే ప్రయత్నం చేయలేదు.

వ్యాసకర్త: సీనియర్‌ ‌జర్నలిస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram