జగన్‌ ‌జైలుకు వెళితే? ప్రస్తుతానికి ఇది ఉహాజనితమైన ప్రశ్న కావచ్చు. కానీ రేపు ఏదైనా జరగవచ్చు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే జరగరానిది ఏదో జరుగుతోందన్న ఆందోళన అధికార పార్టీ వర్గాలలో వ్యక్తమవుతోంది. అది రోజురోజుకు బలపడుతోంది కూడా. పార్టీని, పార్టీ నాయకులను పెనుభూతంలా వెంటాడుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిలో కూడా ఆందోళనకు గురవుతున్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి. చివరకు సామాన్య ప్రజలు ఏ ఇద్దరు కలిసినా జగన్‌ ‌జైలుకు వెళతారా? అనే చర్చ జరుగుతోంది.

నిజానికి, జగన్‌ ‌బెయిలు రద్దవుతుందని, ఆయన మళ్లీ జైలుకు వెళ్లాలని, వెళతారని ప్రచారం చేస్తున్న వారిలో ఆయన రాజకీయ ప్రత్యర్థుల కంటే స్వపక్షంలోనివారే ఎక్కువగా ఉన్నారనే వాదన వినిపిస్తోంది. ఎంతవరకు నిజమో కానీ, జగన్‌ ‌జైలుకు వెళితే ప్రత్యామ్నాయం ఏమిటి, ఎలా? అనే విషయంలో పార్టీలో లోపాయికారి చర్చలు కూడా జరుగుతున్నాయని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఒకరిద్దరు నాయకులైతే ఇప్పటికే సీఎం కుర్చీ కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ ప్రశ్న, ఈ అనుమానం ఇప్పటిది కాదు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే జగన్‌ ‌మళ్లీ జైలుకు వెళితే ఏమవుతుంది? ఆయన స్థానంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? భార్య వైఎస్‌ ‌భారతి పగ్గాలు చేపడతారా? వంటి ఊహాగానాలు చాలాకాలంగా సామాన్య ప్రజలు మొదలు మేధావుల వరకు అందరిలోనూ ఉన్నాయి. అయితే, ఇంతవరకు జరిగిన చర్చకు, ఇప్పుడు జరుగుతున్న చర్చకు మధ్య కొంత వ్యత్యాసం ఉంది. తాజాగా వినిపిస్తున్న ఊహాగానాలకు అంతో ఇంతో ఆధారాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

జగన్‌ ‌బెయిలు రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ కృష్ణమరాజు హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించడమే కాకుండా, విచారణను వేగవంతం చేసింది. మరోవైపు జగన్‌ ‌బెయిలు రద్దు పిటిషన్‌లో సీబీఐ తన వైఖరి స్పష్టంచేయకుండా విషయాన్ని కోర్టుకే వదిలేయడంతో ఇక ఎప్పుడైనా జగన్‌ ‌బెయిలు వ్యవహారం అటో ఇటో తేలిపోతుందన్న ప్రచారం జోరందుకుంది.

రఘురామ కృష్ణమరాజు సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై జగన్‌ ‌తరఫు న్యాయవాదులు గతవారం కౌంటర్‌ ‌దాఖలు చేశారు. పిటిషనర్‌ ‌రాజకీయ దురుద్దేశంతోనే పిటిషన్‌ ‌దాఖలు చేశారని, తన పిటిషన్‌లో వాడిన భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉందని, పిటిషనర్‌ ‌రూ.900 కోట్లు బ్యాంకులను మోసం చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడని కౌంటర్‌లో పేర్కొన్నారు. పిటిషనర్‌ ‌వైసీపీ సభ్యుడిగా ఉండి, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడు తున్నారని, ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని స్పీకర్‌కి లెటర్‌ ‌రాసినట్టు కౌంటర్‌లో పేర్కొన్నారు. వ్యక్తికి, ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీకి మధ్య జరుగుతున్న విచారణలో మూడో వ్యక్తికి సంబంధం లేదని, పిటిషనర్‌ ‌పూర్వాపరాలు దాచిపెట్టి రాజకీయ లబ్ధి కోసమే పిటిషన్‌ ‌వేసినట్టు ప్రతివాది న్యాయవాదులు పేర్కొన్నారు. 2013లో జగన్‌కు బెయిల్‌ ‌వచ్చిన తరువాత ఇప్పటివరకు ఎప్పుడూ కోర్టు ఆదేశాలు ధిక్కరించలేదని, బెయిల్‌ ‌నిబంధనలు అన్ని పాటిస్తూ వస్తున్నట్టు జగన్‌ ‌తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. ఇక సీబీఐ కూడా కోర్టులో మెమో దాఖలు చేసింది. కౌంటర్లపై రీజాయిండర్ల దాఖలుకు రఘురామ తరఫు న్యాయవాది గడువు కోరారు. దీంతో తదుపరి విచారణను జూన్‌ 14‌వ తేదీకి వాయిదా వేసింది. అంటే, జూన్‌ 14‌న విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉందని అనుకోవచ్చు. అయితే, విచారణ ఎంతకాలం సాగుతుంది, చివరకు ఎలాంటి తీర్పు వస్తుందనేది ఎవరూ చెప్పలేరు.

మరోవైపు జగన్‌ ‌బెయిలు రద్దు పిటిషన్‌ ‌దాఖలు చేసిన రఘురామ కృష్ణమరాజు బలమైన ఆధారాలనే న్యాయస్థానం ముందు ఉంచారని న్యాయనిపుణులు అంటున్నారు. జగన్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 11 చార్జ్‌షీట్లను సీబీఐ నమోదు చేయడం, ప్రతి చార్జ్‌షీట్‌లో జగన్‌ ఏ-1‌గా ఉన్న విషయం మొదలు ఈ కేసులలో ముద్దాయిలుగా ఉన్న అధికారులు ప్రస్తుతం ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్నారని, ఆ విధంగా సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని తెలియజేస్తూ.. అనేక ఆధారాలను డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌తో సహా కోర్టుకు సమర్పించారు. ఈ పిటిషన్‌కు సంబంధించి కోర్టు విచారణ వేగంగా జరిగే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు.

ఏది ఎలా ఉన్నప్పటికీ రాజకీయ నాయకుల అవినీతి, అక్రమాలకు సంబంధించిన కేసుల విచారణ సంవత్సరాలు, దశాబ్దాలు సాగడం వలన జైలులో ఉండవలసిన వారు అధికార పదవులలో ఉంటున్నారు. జగన్మోహన్‌రెడ్డి విషయాన్నే తీసుకుంటే.. ఆయనపై చార్జ్‌షీట్‌ ‌దాఖలైన కేసులే ఓ డజను వరకు ఉన్నాయి. అందులో కొన్ని కేసులలో పుష్కరకాలంగా విచారణ జరుగుతోంది. ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసిన సమయంలోనూ ఆయన ఎక్కడ ఉన్నా ప్రతి శుక్రవారం హైదరాబాద్‌ ‌సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ‘అధికార’ కార్యక్రమాలను సాకుగా చూపించి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయిపు పొందుతున్నారు.

అయితే, ఇప్పుడు జగన్‌ ‌బెయిలు రద్దవుతుందా? ఆయన జైలుకు వెళతారా? అనేది ప్రశ్న కాదు. అసలు ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న, చార్జిషీట్‌ ‌సైతం దాఖలై విచారణ ఎదుర్కొంటున్న వారిని అధికార పదవులకు దూరంగా ఉంచలేమా? ఇది కదా ఇప్పుడు మేధావులు, మీడియా చర్చించవలసిన విషయం.

నిజానికి రెండు సంవత్సరాల క్రితమే దేశంలోని ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధుల క్రిమినల్‌ ‌కేసుల సత్వర విచారణపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసుల విచారణకు కార్యాచారణ ప్రణాళిక సిద్ధంచేసి వారం రోజుల్లో పంపాలని అన్ని రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను జస్టిస్‌ ఎన్‌వీ రమణ (సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయ మూర్తి) నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. అయినా, ఆరు నెలలకు మించి స్టే ఇవ్వరాదన్న సుప్రీం ఆదేశం, అదేవిధంగా ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసుల విచారణ విషయంలో సుప్రీం ఆదేశాలు ఏమయ్యాయో వేరే చెప్పనక్కరలేదు. అనేక కేసుల్లో ఐదేళ్ల పదవీ కాలమే కాదు, నూరేళ్ల జీవిత కాలం ముగిసిన తర్వాత కూడా కేసుల విచారణ కొనసాగడం చూస్తూనే ఉన్నాం. ఇక జగన్‌ ‌కేసు ఇప్పటికిప్పుడు తేలిపోతుందా? అంటే చెప్పగలిగిన సమాధానం ఒక్కటే.. ‘చట్టం తన పని తాను చేసుకుపోతుంది’ అన్నదే అది.

– రాజనాల బాలకృష్ణ, సీనియర్‌ ‌జర్నలిస్ట్

By editor

Twitter
Instagram