ఆధునిక కవితా యుగకర్తగా ఎందరో కవులను ప్రభావితం చేసిన మాన్యులు ఆచార్య రాయప్రోలు. దేశభక్తి కవితకు స్ఫూర్తి ప్రదాత. భావకవుల్లో అగ్రగణ్యులు. ఉస్మానియా, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో ఎందరో శిష్యులను తీర్చిదిద్దిన మహోన్నత గురువర్యులు. దేశ, విదేశీ సాహిత్యాల్లో ప్రముఖ రచనలను అధ్యయనం చేశారు. పాశ్చాత్య సాహిత్య ప్రభావం ప్రగాఢంగా ఉంది. బ్రహ్మర్షి రఘుపతి వేంకటరత్నం నాయుడుగారి శిష్యరికంలో మెట్రిక్యులేషన్‌ ‌చదివారు. రవీంద్ర కవీంద్రుని ప్రభావంతో (1915-18), శాంతినికేతన్‌ ‌చదువుతో ఆయనలో సువిశాల సాహిత్య దృక్పథం బలపడింది.

రాయప్రోలువారు మార్చి 17,1892న బాపట్ల తాలుకా గార్లపాడు గ్రామంలో ఒక పండిత వంశంలో జన్మించారు. తండ్రి వేంకటావధాని. తల్లి ఆదెమ్మ. మేనమామ అవ్వారు సుబ్రహ్మణ్యశాస్త్రి మహాపండితులు. ఆయన ప్రభావంతో రాయప్రోలు వారు బాల్యంలో ఆశుకవితలు ఆరంభించారు. కొత్తిమేర చేలపై, చూడిగేదెల పొదుగులపై ఆశుకవితలు చెప్పేవారు. ఆయన పినతల్లి రామడుగు నరసమ్మ శంకరాచార్యుల అద్వైత సారాన్ని బోధించారు. ఆమె ప్రభావంతో స్త్రీల పట్ల గౌరవం పెంపొందింది. అమలిన శృంగార సిద్ధాంతాన్ని తొలిసారిగా ఆయన ‘తృణకంకణం’ కావ్యంలో ప్రతిపాదించారు. లలిత కావ్యం ఆంగ్ల కవి గోల్డ్ ‌స్మిత్‌ ‌రాసిన హెర్మిట్‌ ‌కావ్యానికి అనువాదం. ఈ కావ్యారంభంలో దేవతాస్తుతికి బదులు కోకిలస్వామికి మొక్కి ప్రారంభించారు.

రాయప్రోలు వారి కవిత్వంలో జాతీయాభిమానం, ఆంధ్రభాషాభిమానం, సంస్కరణ దృక్పథం, దేశభక్తి తత్పరత, స్మృతి కవిత్వం పుష్కలంగా ఉన్నాయి. ఆయన కవిత్వంలో వస్తు నవ్యత, శైలిలో సారళ్యం, అచ్చతెలుగు పదాల ప్రయోగం విరివిరిగా ఉన్నాయి. ఆయన కవిత్వంపై గురజాడ, రవీంద్రుడి ప్రభావం ఉంది. ఆంగ్ల కవులు స్మిత్‌, ‌టెన్నిసన్ల ప్రభావం బలీయంగా ఉంది. కొమర్రాజు లక్ష్మణరావు, గంటి లక్ష్మణ పంతులు, ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య వంటి వారి సాహచర్యంతో ఆయన కవిత్వ రచన సాగింది. దేశభక్తి, కవిత్వం రెండు పాయలుగా ఆ రచన ప్రవహించింది. మొదటిది భారతీయ జాతీయ సంబంధి. రెండోది ఆంధ్రాభిమానసంబంధి. సమకాలీన పరిస్థితులు, రాజకీయ ఉద్యమాల ప్రభావంతో జాతీయభావ సంబంధిగా, ఆంధ్రాభిమాన సంబంధిగా కవితా స్రవంతి రెండు పాయలుగా ప్రవహించింది. రాయప్రోలు భారత జాతీయతా ప్రబోధకంగా రాసిన జన్మభూమి గీతం ద్వారా ‘ఏదేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా / నిలుపరా నీ జాతి నిండు గౌరవమ్ము’ అంటూ జాతీయోద్యమ స్ఫూర్తితో దేశభక్తి తత్పరతతో ప్రబోధించారు. ఈ గీతాన్ని ప్రశంసిస్తూ ఆచార్య సి. నారాయణరెడ్డి ‘గురజాడ వారి దేశభక్తి గీతం తర్వాత గొప్పగా ప్రభావితం చేసిన గీతమిది’ అన్నారు. ఈ గీతం జాతీయోద్యమ కాలం నాటి యువకుల్లో గొప్ప స్పందన కలిగించి ప్రాచుర్యం పొందింది.

 రాయప్రోలు వారి మరొక పాయ ఆంధ్రోద్యమం వైపు సాగింది. రాయప్రోలు వారు ఆంధ్రాభిమానంతో ‘తెలుగు తల్లి’ అనే పదాన్ని తొలిసారిగా ప్రయోగించారు. ఆంధ్రులు సమైక్యంగా జాతీయోద్యమంలో పోరాడాలన్న కాంక్షతో వారిలో ఆంధ్రాభిమానాన్ని రగుల్కొల్పేందుకు గత వైభవ స్మరణను, వర్తమాన కర్తవ్యాన్ని యువతీయువకుల్లో ప్రభోధించాలన్న సంకల్పంతో 1914లో ‘ప్రబోధం’ అనే ఖండిక రచించారు. ‘అమరావతి పట్టణమ్మున బౌద్ధులు, విశ్వవిద్యాలయమ్ములు స్థాపించునాడు / ఓరుగల్లున వీరలాంఛనమ్ముగా / పలు శస్త్రశాలలు నిర్మించునాడు’ వంటి పద్యాలు 1914లో నెల్లూరులో జరిగిన ఆంధ్రోద్యమ రెండో మహాసభలో ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు చదివి వినిపించగా సభలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయట. అప్పటి వరకు జాతీయోద్యంలో సమాంతరంగా ఆంధ్రోద్యమాన్ని నిర్వహించాలన్న ఆలోచనను నిరసించిన కొందరిలో అనుమానాలు తొలగిపోయాయట. కవిత్వం సామాజిక ప్రయోజనాన్ని సాధించాలనే ఆధునిక సిద్ధాంతానికి లక్ష్యంగా ప్రబోధం ఖండిక ద్వారా కవితాపరమార్గాన్ని సాధించి రాయప్రోలు వారు ధన్యులయ్యారు.

‘నాదు జాతి నాదేశము నాదు భాషగా’ ఆంధ్రాభిమానాన్ని రాయప్రోలు వారు త్రివేణీ సంగమంలా ప్రవహింప చేశారు. రాయప్రోలు వారి ఆంధ్రాభిమానమే ఆంధ్రోద్యమకవితకు పునాది. ఆయన ‘ఆంధ్రావళి’ ఖండకావ్యంలో తెలుగు మాన్యము ఖండికలో తెలుగు భాషా ప్రాశస్త్యాన్ని, మాధుర్యాన్ని ప్రస్తుతించారు.తెనుగు వాణి, తెనుగుకత్తి, తెనుగు భూమి వంటి పదాలతో పాఠకుల్లో ఆంధ్రాభినివేశాన్ని కలిగించారు. రాయప్రోలు వారి ఆంధ్రావళి ఖండకావ్య ప్రభావంతో, స్ఫూర్తితో విశ్వనాథవారు ఆంధప్రశస్తి, ఆంధ్ర పౌరుషం వంటి కావ్యాలు రాశారు. తుమ్మలవారు గాంధేయవాద కవిగా గాంధీ ఆత్మకథ, మహాత్మకథ వంటి గ్రంథాలు రచించారు. దువ్వూరి రామిరెడ్డి మాతృ మందిరం, స్వాతంత్య్రరథం, నైవేద్యం వంటి ఖండికల ద్వారా పాఠకులను ప్రబోధించారు. జాషువ భరతమాత ఖండిక ఎంతో ప్రసిద్ధమైంది. కరుణశ్రీ ‘విజయశ్రీ’ ధ్వనిపూర్వకమైన గొప్పకావ్యంగా మెప్పు పొందింది. వేదులవారి ‘కాంక్ష’లో స్వాతంత్య్రోద్యమ కాంక్షను బలీయంగా వ్యక్తపరిచారు. త్రిపురనేని రామస్వామి చౌదరి ‘వీరగంధము తెచ్చినారము’ గీతం ద్వారా ప్రజల్లో నిబిడీకృతంగా ఉన్న భీరత్వాన్ని ప్రదీప్తం చేశారు. కొడాలివారు ‘హంపీ క్షేత్రం’ కావ్యంలో గత వైభవ ప్రాభవాలను గొప్పగా కీర్తించారు. ఇంకా ఎందరో కవులు దేశభక్తి తత్పరతతో రాయప్రోలు ప్రభావంతో కవితా ఖండికలు, కావ్యాలు రాశారు.

రాయప్రోలు వారు బహుముఖ ప్రజ్ఞాశాలిగా తృణకంకణం, ఆంధ్రావళి, జడకుచ్చులు, కష్టకమల, తెలుగు తోట, స్నేహలత, స్వప్నకుమారం, వనమాల, మిశ్రమంజరి వంటి ఖండకావ్యాలు రాశారు. స్నేహలత కావ్యంలో వరకట్న దురాచారానికి బలైపోయిన కన్య విషాదగాథను చిత్రీకరించారు. రమ్యాలోకం, మాధురీదర్శనం వంటి లక్షణ గ్రంథాలు రచించారు. శంకరాచార్యుల భజగోవిందగీతాన్ని అనువదించారు. ఉమర్‌ ‌ఖయ్యాం రుబాయీలను ‘మధుకలశం’గా అనువదించారు.

ఆధునిక యుగకర్తగా, దేశభక్తి కవితా స్ఫూర్తి ప్రదాతగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాయప్రోలు వారు చిరస్మరణీయులు.

– డా।। పి.వి.సుబ్బారావు 9849177594

వ్యాకసర్త : రిటైర్డ్ ‌ప్రొఫెసర్‌ & ‌తెలుగు శాఖాధిపతి, సి.ఆర్‌. ‌కళాశాల, గుంటూరు.

By editor

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram