– సి.హెచ్‌. ‌శివరామ ప్రసాద్‌ (‌వాణిశ్రీ)

వీరులపాడు జన సముద్రం అయింది. వాహనాలతో రోడ్లన్నీ నిండి పోయాయి. కేబినెట్‌ ‌మినిష్టర్లు, ఎమ్మెల్యేలు, వారి సెక్యూరిటీ సిబ్బందితో సందడిగా మారింది. జిల్లా కలెక్టర్‌, ఆర్డీఓ, తహసీల్దారు వంటి రెవెన్యూ అధికారులు, సూపరింటెండ్‌ ఆఫ్‌ ‌పోలీస్‌, ‌డీఎస్పీ, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు వగైరా ఆ ఊరికి చేరుకున్నారు. చుట్టుపక్కల గ్రామాల జనం వీరులపాడుకు తండోప తండాలుగా వస్తున్నారు. ప్రశాంతంగా ఉండే ఊరు కోలాహలంగా మారింది.

అక్కడ జాతరేం జరగడం లేదు. లాన్స్ ‌నాయక్‌ ‌చెన్నకేశవులుకు అంత్యక్రియలు జరగబోతున్నాయి. దేశ సరిహద్దుల్లో శత్రుదేశపు సైనికులతో జరిగిన ఘర్షణలో చనిపోయాడు. ఆ రోజు అతని పార్థివ దేహం స్వగ్రామం వీరులపాడు చేరుకుంది.

ప్రభుత్వ లాంఛనాలతో చెన్నకేశవులు ఆఖరి ప్రయాణం మొదలైంది. అతని కొడుకులు పసివాళ్లు. తండ్రి రిటైర్డ్ ‌మేజర్‌ ‌హనుమంతు, కొడుక్కి అంత్య క్రియలు నిర్వహిస్తున్నాడు. ఏ తండ్రికైనా చెట్టంత కొడుకు చనిపోవడం కంటే హృదయ విదారకరమైనదీ, విషాదమైనదీ మరొకటి లేదు.

మేజర్‌ ‌హనుమంతు పొలం రోడ్డుకి ఆనుకునే ఉంది. అక్కడే చెన్నకేశవులుకు అంత్యక్రియల ఏర్పాట్లు జరిగాయి. షామియానాలలో అంతా ఆశీనులై ఉన్నారు. చెన్నకేశవులు పార్థివ దేహం చితిపైకి చేర్చారు. సైనికులు తుపాకులు ఎక్కుపెట్టి గాలిలోకి కాల్పులు జరిపారు. బ్యాండు మేళం జాతీయ గీతం ఆలపిస్తుండగా హనుమంతు కొడుకు చితికి నిప్పంటించాడు. చితిమంటలలో నుంచి దట్టమైన పొగపైకి లేచింది. ఆ వీర సైనికుడి దేహం పంచ భూతాలలో కలిసిపోతోంది. అక్కడున్న వాళ్లందరిలో స్మశాన వైరాగ్యం కలిగింది. ఎప్పటికైనా మనం కూడా అలా చితిమంటల్లో కాలి బూడిదై పోవాల్సిందే కదా అనే భావం మనసుల్లో మెదులుతోంది.

చెన్నకేశవులు భార్య నాగజ్యోతి గాయపడిన పావురంలా రోదిస్తోంది. జంటలో మగపావురం నేల కూలింది. ఆడ పావురం రెక్కలు విరిగిన దానిలా గిలగిల లాడుతోంది. భర్త చిన్న వయసులో అకాల మృత్యువు పాలవడం ఆమె మనసుని కత్తిలా కోయసాగింది. ఆమె జీవితం అంధకారంలో మునిగింది.

తల్లి దేవమ్మ కడుపు కోతతో కన్నీరు మున్నీరుగా దుఃఖిస్తోంది. అక్కడున్న వాళ్ల కళ్లు అశ్రుపూరితాల య్యాయి. అందరి ముఖాల్ని దుఃఖ మేఘాలు కమ్ముకున్నాయి.

– – – – – – – – –  – —

చెన్నకేశవులు కర్మకాండలు పూర్తయ్యాయి. హనుమంతు కాశీకి వెళ్లి కొడుకు అస్తికలు గంగలో నిమజ్జనం చేసి వచ్చాడు. లోకంలో మనిషికి తగిలిన గాయం మానకుండా ఉండదు. కాలమే గాయాలకు మందులు పూసి మానేట్టు చేస్తుంది. మేజర్‌ ‌హనుమంతు కుటుంబం విషాదం నుండి నెమ్మదిగా కోలుకుంటున్నది. ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. నాగజ్యోతికి తహసీల్దారుగా నియామక పత్రాలు ఇచ్చారు.

సరిగ్గా అప్పుడే నాగజ్యోతి తల్లిదండ్రులు సోమయ్య, రాజమ్మ వీరులపాడు వచ్చారు. అల్లుడి కర్మకాండలకు హాజరైన తర్వాత మళ్లీ వాళ్లు కూతురు అత్తారింటికి ఇదే రావడం.

‘‘బావగారూ! అమ్మాయిని మా ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చాం’’ అన్నాడు సోమయ్య.

హనుమంతు ‘సరే’ నని తల ఊపాడు. భర్త చనిపోతే భార్యను పుట్టింటికి తీసుకెళ్లి కొంతకాలం ఆదరించి పంపడం సంప్రదాయమే.

నాగజ్యోతి పుట్టింటికి వెళ్లింది. కొన్నిరోజుల తర్వాత ఆమె తల్లిదండ్రులు తమ మనసులో మాట వివరించారు.

‘‘అమ్మా! నీకు గవర్నమెంట్‌ ఉద్యోగం వచ్చింది, సంతోషం. ఆ ఉద్యోగం మన ఊళ్లో వేయించుకో. వీరులపాడులో తాలూకా ఆఫీసు లేదు. వేరే ఏదో ఊరు వెళ్లి ఉద్యోగం చేయాలి. అదేదో మన ఊళ్లో చేస్తే బాగుంటుంది. ఇక్కడ పిల్లల చదువులకు ఇబ్బంది ఉండదు. మంచి మంచి స్కూల్స్, ‌కాలేజీలు ఉన్నాయి’’ చెప్పాడు సోమయ్య.

కూతుర్ని మానసికంగా తమవైపు తిప్పుకోవాలని అతని ప్రయత్నం.

‘‘ఔనమ్మా! నాన్న చెప్పినట్టు విను. ఇక నుంచి నీ బాగోగులు చూసుకోవాల్సింది మేమే కదా? ఉద్యోగం పేరుతో ఎక్కడో ఒంటరిగా ఉండడం కష్టం గదా? పిల్లలు ఆ పల్లెటూళ్లో ఎలా ఉంటారు? నువ్వుండబట్టి పిల్లల్ని సమయానికి రెడీ చేసి బస్సులో స్కూలుకి పంపేదానివి. నీ అత్తమామలు ముసలివాళ్లు. పిల్లల్ని పెంచలేరు. ఇక్కడైతే మేమంతా ఉంటాం. మేనమామ పిల్లలతో కలిసిమెలిసి హాయిగా ఉంటారు. పిల్లలు ఎక్కువమంది బంధువులతో కలిసి పెరగాలంటారు. మన ఊళ్లోనే నువ్వు ఉద్యోగం వేయించుకో’’ భర్తకు వంత పాడుతూ చెప్పింది రాజమ్మ.

నాగజ్యోతి చలనం లేని రాయిలాగా ఒక చూపు చూసింది తల్లిదండ్రుల వైపు. తర్వాత న్యూస్‌ ‌పేపర్లో తలదూర్చింది. ఆమె కళ్లు అక్షరాల వెంట పరిగెడు తున్నాయి కాని విషయాలు మనసుకి ఎక్కడం లేదు. కనిపెంచినవారిలో ఇంత స్వార్థమా? అనే ఆలోచన మనసుని మండిస్తోంది. అత్తమామల్ని దూరంగా పెట్టి తమ దగ్గర ఉండమని చెప్పడం ఏమిటి? ఆమెలో ఏ మూలనో ఆవేదన బయల్దేరింది.

ఆమెను తమ దగ్గరకొచ్చి ఉండమని అన్న, వదినలు కూడా హితబోధలు చేస్తూనే ఉన్నారు. అన్న సత్యనారాయణకు సంతోషంగా ఉంది. చెల్లెలు వచ్చి తమ దగ్గరే ఉంటుందని నమ్ముతున్నాడు. చెల్లెలు తహసీల్దారుగా తమ ఊళ్లోనే ఉంటే తమకు బంధుమిత్రుల్లో గౌరవం, పరపతి పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఉండవు.

నాగజ్యోతి వారికి బంగారు బాతులా కనిపి స్తోంది. దాన్ని ఎగిరి పోనివ్వకూడదనే పట్టుదలతో మాయమాటలు వినిపిస్తున్నారు. సెంటిమెంట్‌ ‌ప్రయోగిస్తున్నారు. రక్తసంబంధం విడదీయలేనిది అంటున్నారు.

– – – – – – – – –  – —

నాగజ్యోతి తన కర్తవ్యం గురించి ఆలోచిస్తోంది. ఆమెను గత స్మృతులు వరదలా ముంచెత్తాయి. కాలేజీలో చదువుకున్న రోజులు కళ్లముందు మెదిలాయి.

కాలేజీలో ఆమె ఎన్‌.‌సి.సి. ట్రూప్‌కి కెప్టెన్‌. ఆ ‌శిక్షణ ఆమెకు జీవితంలో క్రమ శిక్షణ నేర్పింది. సూర్యోదయానికి ముందే కాలేజీ గ్రౌండ్‌కి వెళ్లడం, డ్రిల్లు, రన్నింగ్‌, ‌మార్చింగ్‌ల్లో పాల్గొనడం ఉత్సాహం కలిగించేది. మిలటరీ అధికారులు అప్పుడప్పుడు కాలేజీకి వచ్చి ట్రైనింగ్‌ ఇచ్చేవాళ్లు. కొండల్లో ఫైరింగ్‌ ‌రేంజ్‌కి తీసుకెళ్లి షూటింగ్‌ ‌నేర్పేవాళ్లు. సంవత్సరానికొకసారి వేరే ఊళ్లకి తీసుకెళ్లి, గుడారాలలో ఉంచి క్యాంప్‌ ‌నిర్వహించేవాళ్లు.

ఆమె డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌లో ఉండగా ఢిల్లీలో రిపబ్లిక్‌ ‌డే పరేడ్‌లో పాల్గొనే అవకాశం వచ్చింది. అక్కడ ఎర్రకోటలో ప్రధానమంత్రి గౌరవ వందనం స్వీకరించడం తన విద్యార్థి జీవితంలో మరిచిపోలేని అద్భుతమైన అనుభవం.

అక్కడే తన జీవితం ముఖ్యమైన మలుపు తిరిగింది. అదే చెన్నకేశవులు పరిచయం. అతను వాళ్ల ఎన్‌.‌సి.సి. ట్రూప్‌కి కెప్టెన్‌. ‌ఢిల్లీ రిపబ్లిక్‌ ‌డే పరేడ్‌లో వాళ్ల కాలేజీ తరఫున పాల్గొనడానికి వచ్చాడు. ఒకే ప్రాంతం నుంచి వచ్చిన వాడవడం వల్ల నాగజ్యోతికి సన్నిహితుడయ్యాడు. రిపబ్లిక్‌ ‌డే తర్వాత ఢిల్లీ సిటీ సైట్‌ ‌సీయింగ్‌ ‌కలిసిమెలిసి తిరిగారు. పార్లమెంట్‌ ‌బిల్డింగ్‌, ‌రాష్ట్రపతి భవనం, కుతుబ్‌మీనార్‌, ‌నెహ్రూ మ్యూజియమ్‌, ‌బిర్లా టెంపుల్‌, ‌లోటస్‌ ‌ప్రార్థనాలయం సందర్శించారు. చాందినీ చౌక్‌లో షాపింగ్‌ ‌చేశారు.

‘‘డిగ్రీ అయిపోతోంది. తర్వాత ఏ యూని వర్సిటీలో చేరతావు చెన్నకేశవులూ?’’ అని అడిగింది నాగజ్యోతి.

‘‘ఇక చదవను జ్యోతీ, డిఫెన్స్ ‌సర్వీస్‌లో చేరతాను’’ అన్నాడు కేశవులు.

ఆశ్చర్యపోయింది ఆమె. డిగ్రీ తర్వాత ఎమ్‌.ఎ., ‌పి.హెచ్‌డి చేస్తారు, పరిశోధనలు చేసి డాక్టరేట్‌ ‌సంపాదించి ప్రొఫెసర్లు అవుతారు కొందరు. మరికొందరు సివిల్స్‌లో ర్యాంకులు పొంది ఐ.ఏ.ఎస్‌., ఐ.‌పి.ఎస్‌. ‌కలలు కంటారు. చెన్నకేశవులు ఆలోచన భిన్నంగా ఉంది.

‘‘మిలటరీ సర్వీస్‌లోకి ఎందుకు?’’ అని ప్రశ్నించింది.

‘‘మాది మిలటరీ ఫ్యామిలీ. నాకు తెలిసి మా తాత సుబేదార్‌, ‌మా నాన్న మేజర్‌గా చేసి రిటైరయ్యారు. సైన్యంలో పనిచేయడం మా కుటుంబా నికి వారసత్వంగా వస్తోంది. మా ముత్తాతలు రాజుల పరిపాలనాకాలంలో సైన్యంలో పనిచేసేవారని చిన్నప్పుడు మా తాత కథలుగా చెప్పేవాడు. వ్యవ సాయం చేస్తూనే యుద్ధ విద్యలలో శిక్షణ పొందే వారట. దేశానికి యుద్ధాలు వచ్చినప్పుడు, రాజధానికి వెళ్లి సైన్యంలో చేరిపోయేవారట’’ చెప్పాడు చెన్నకేశవులు.

మంచి హోదా, అధికారం, సుఖమయమైన జీవితం, డబ్బు సంపాదించే అవకాశాలున్న ఉద్యోగాలు కాదనుకుని డిఫెన్స్‌లో చేరి దేశసేవ చేయాలనుకునే ఉదాత్త భావాలు గల చెన్నకేశవులు ఆమెకు హీరోలా కనిపించాడు. అతని ఆలోచన కొత్తగా ఉంది. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత వారి పరిచయం కొనసాగింది. తన జీవితం చెన్నకేశవులు పరిచయమైన తర్వాతనే మేలి మలుపు తిరిగి ప్రారంభమైనట్టు తోచింది ఆమెకు. అతని సాహచర్యం సమ్మోహనంగా ఉంది. అతని పక్కన కూర్చుని గంటలకొద్దీ కబుర్లు చెప్పుకోవడం, కాలం గడపడం ఆమెకు ఇష్టంగా ఉంది.

చెన్నకేశవుల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది నాగజ్యోతి. ఏడేళ్లు కాపురం ఆనందంగా జరిగింది. ఇద్దరు మగపిల్లలు కలిగారు. సిపాయిగా చేరిన చెన్నకేశవులు ప్రమోషన్‌ ‌పొంది లాన్స్ ‌నాయక్‌ అయ్యాడు ఢిఫెన్స్‌లో. దురదృష్టం కాటేసి సరిహద్దుల్లో శత్రుదేశంతో జరిగిన ఘర్షణలో అకాలమృత్యువు పాలయ్యాడు. తండ్రిలా తనూ మేజర్‌ ‌కావాలని కలలు కనేవాడు. కాని కలలు కల్లలయ్యాయి.

నాగజ్యోతికి గతమంతా గుర్తొచ్చి నిట్టూర్చింది.

– – – – – – – – –  – —

నాగజ్యోతి పుట్టింటికి వెళ్లిన తర్వాత వీరుల పాడులో కొన్ని వదంతులు తాటాకు మంటలా ఇంటింటికీ వ్యాపించాయి. ఆమె ఇక పుట్టింటివారి ఊళ్లోనే తహసీల్దారుగా చేరుతుందనీ, పిల్లల్ని తీసుకుని వెళ్లి అక్కడే సెటిలైపోతుందని చెప్పుకున్నారు. ఎవరు పుట్టిస్తారోగాని పుకార్లు పుట్టాయి. ఒకరి నోటి నుంచి మరొకరి చెవిలోకి శరవేగంగా దూసుకుపోయాయి. ఇవన్నీ మేజర్‌ ‌హనుమంతు ఇంటికీ చేరాయి.

చెన్నకేశవులు తల్లి దేవమ్మకి ఎంతో బాధ కలిగింది. ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడు. మనవల్లో కొడుకుని చూసుకుంటూ, వారిని పెంచుతూ కాలం గడపాలనుకుంది. ‘ఇప్పుడు పిల్లలూ దూరమైతే?’ అనే ఊహ ఆమెకు దుఃఖం తెప్పిస్తోంది. భర్తకు తన మనసులో బాధ చెప్పుకుని బాధపడింది.

‘‘ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది. చెన్నకేశవులు ఇట్లా మనల్ని వదిలి పోతాడని అనుకున్నామా? కలలో గూడా అటువంటి ఆలోచన రాలేదు. విధి విలాసం. కొన్ని అలా జరుగుతాయి. మనం ఏం చెయ్యలేం. మన చేతుల్లో ఏం లేదు. కోడలు విజ్ఞురాలు. చదువుకున్నదీ, తెలివైనది. ఆమెకు ఏం చేయాలో తెలుసు. కోడలుకి ఏది సంతోషం కలిగిస్తే అలా చేస్తుంది’’ అని భార్యను ఓదార్చాడు హనుమంతు.

ఆ రోజు ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే వెంకట స్వామి హనుమంతు ఇంటికి వచ్చాడు. వీరులపాడు మీదుగా ప్రయాణం చేసేటప్పుడు హనుమంతు ఇంటికి వచ్చి కొంతసేపు గడపడం ఆయనకి సంతోషం కలిగిస్తుంది. వెంకటస్వామికి హనుమంతు అంటే హీరో వర్షిప్‌. ‌హనుమంతు పర్సనాల్టీ, మేజర్‌ ‌హోదా, అరుదుగా మనిషిలో ఉండే కల్చర్‌ అతన్ని ఆకర్షిస్తుం టాయి. రిటైరైన తర్వాత రైతుగా మారి సేద్యం చేస్తుండడం ఎంతో నచ్చుతుంది.

‘‘మేజర్‌! ‌మీ కోడలు ఇలా చేసిందేమిటీ?’’ అన్నాడు వెంకటస్వామి.

హనుమంతు మనసు చివుక్కుమన్నది.

‘‘ఏం చేసింది స్వామిగారూ?’’ కొంచెం కంగారు పడుతూ ప్రశ్నించాడు.

‘‘ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి మీ కోడలికి తహసీల్దారు ఉద్యోగం ఇప్పించాం. గెజిటెడ్‌ ఆఫీసర్‌ ‌ర్యాంక్‌. ‌జనంలో తహసీల్దారుకి ఎంత పలుకుబడి ఉంటుందో మీకు తెలీదా? తాలూకాకు మహారాణి హోదా! జ్యుడీషియల్‌ ‌పవర్స్ ఉం‌టాయి. ఎందరికి అటువంటి ఛాన్స్ ‌వస్తుంది చెప్పండి. ‘ఆ ఉద్యోగం నాకు వద్దు. నేను చేరబోవడం లేదు’ అని గవర్న మెంట్‌కి లేఖ రాసింది మీ కోడలు’’ కొంచెం నిష్టూరంగానే అన్నాడు.

అది విని హనుమంతుకి రిలీఫ్‌ ‌కలిగింది. హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. కోడలు కాలక్షేపం కోసం ఉద్యోగంలో చేరాలనుకుంటే అది వేరే విషయం. డబ్బు కోసమైతే అవసరం లేదు. తమది తరతరాలుగా సంపన్న కుటుంబం. కోడలు బాధ్యత గల గృహిణిగా మంచి నిర్ణయమే తీసుకుంది. కన్న కొడుకుల్ని పెంచి పెద్దచేసి ప్రయోజకులుగా తీర్చిదిద్దాలనే కర్తవ్యం ఆమె గుర్తించింది.

‘‘మా కోడలు సరైన నిర్ణయమే తీసుకుంది స్వామిగారూ! గుడ్‌ ‌డెసిషన్‌’’ అన్నాడు హనుమంతు.

హనుమంతు జవాబు వెంకటస్వామికి చెంప దెబ్బలా తగిలింది. ఆయన కూడా తినలా విచారి స్తాడనీ, కోడల్ని ఉద్యోగంలో చేరడానికి ఒప్పిస్తానని అంటాడనీ అనుకున్నాడు. పదవి సంపాదించి, డబ్బు కూడబెట్టుకోవాలనే దృక్పథం గల వెంకటస్వామి వంటి వారికి నాగజ్యోతి నిర్ణయం ఎందుకు నచ్చుతుంది? జీవితమంతా పగటి వేషగాళ్లలా నటించడానికి అలవాటుపడిన వాళ్లకి మనుషుల్లో ఉదాత్త ఆశయాలు, విలువలు ఏం అర్థమవుతాయి? ఆమె తహసీల్దారైతే  ఆమె ద్వారా తన వాళ్లకి ఎన్నో ఉపకారాలు సునాయాసంగా చేయించుకునే అవకాశం తప్పిపోయినందుకు ఆ ఎమ్మెల్యేకి విచారం కలిగింది కాని హనుమంతు కుటుంబానికి ఏదో నష్టం జరిగిందని కాదు.

మేర్‌గారి కోడలు తహసీల్దారు ఉద్యోగం వద్దని వదులుకుందని జనం విడ్డూరంగా చెప్పుకున్నారు. నాగజ్యోతి మీద వచ్చిన పుకార్లకు ఫుల్‌స్టాప్‌ ‌పడింది. అపోహలు తొలగాయి. జనంలో మొలకెత్తిన అనుమానాలను ఆమె నిర్ణయం తుడిచివేసింది.

తర్వాత కొన్నిరోజులకు నాగజ్యోతి పిల్లల్ని తీసుకుని అత్తగారింటికి వచ్చింది. హనుమంతు దగ్గరికి వచ్చి పాదాభివందనం చేసింది.

‘‘మావయ్యా! నన్ను ఆశీర్వదించండి.’’ అన్నది.

‘‘తహసీల్దారు ఉద్యోగం వద్దని మంచి నిర్ణయం తీసుకున్నావు. ఐ యామ్‌ ‌ప్రౌడ్‌ ఆఫ్‌ ‌యు’’ అంటూ ఆశీర్వదించాడు.

‘‘మావయ్యా! నేను సర్వీస్‌ ‌సెలక్షన్‌ ‌బోర్డ్ ఎగ్జామ్‌కి అటెండయ్యాను. సెలక్షన్‌ ‌వచ్చింది. ఆఫీసర్స్ ‌ట్రైనింగ్‌ అకాడమీలో శిక్షణకు చెన్నై బయల్దేరుతున్నాను. ఇక నుంచి మీ మనవళ్ల బాధ్యత మీదే. వాళ్లని మీకు అప్పగిస్తున్నాను’’ అన్నది నాగజ్యోతి. ఆమె కళ్లల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది.

హనుమంతు ఆశ్చర్యచకితుడయ్యాడు. కోడలివైపు అబ్బురంగా చూశాడు. ఆమె సగటు గృహిణిలా కనిపించలేదు. దేశసేవ కోసం పుట్టిన కారణ జన్మురాలిగా గోచరించింది.

‘‘మంచిదమ్మా!… బెస్టాఫ్‌ ‌లక్‌’’ అన్నాడు.

‘‘మావయ్యా! మీ అబ్బాయి లాగే నేనూ ఎన్‌.‌సి.సి.లో ట్రైనింగ్‌ అయ్యాను. మిలటరీకి అది పీట్రైనింగ్‌ అనేవారు ఆయన. చెన్నకేశవులు వంటి వీరుడి భార్యగా ఆయనకు ప్రాణప్రదమైన మిలటరీలో చేరి దేశసేవ చేస్తాను. నేను ఆయనకు ఇచ్చే నివాళి ఇదే. మా ఇద్దరి జీవితాశయమూ ఇదే కదా మావయ్యా!’’ ఆమె ఉద్వేగంతో చెప్పింది.

నాగజ్యోతి కదనరంగంలోకి ఎగిరి దూకడానికి రెక్కలు సిద్ధం చేసుకుంటున్న గరుడపక్షిలా కనిపించింది హనుమంతు కళ్లకి. ఆయన గుండె లోతుల్లో నుంచి ఆర్ద్రత పొంగుకొచ్చింది. కళ్ల నుండి కన్నీరు బుగ్గలమీదుగా కారింది. కోడలి మాటలు అతడి హృదయంలోకి దూసుకుపోయాయి. గర్వం కలిగింది. పరవశుడైపోయాడు.

‘‘అమ్మా! నువ్వు ఇప్పుడు నా కోడలివి కాదు. కూతురివి. చెన్నకేశవులుతో వారసత్వం ముగిసిందను కున్నాను. కాని ఆ వారసత్వం ఆగడానికి వీల్లేదు కొనసాగిస్తానని ఎంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నావు. నీలాంటి ఉత్సాహవంతులైన యువతుల అవసరం ఇప్పుడు మిలటరీకి ఎంతో ఉంది. దేశానికి నీలాంటి వాళ్లే కావాలి. డిఫెన్స్‌లో నువ్వు ఎంతో ఎత్తుకి ఎదుగుతావు….’’ భావోద్వేగంతో చెప్పాడు హనుమంతు. కోడలిపై ప్రశంసల జల్లు కురిపించాడు.

– – – – – – – – –  – —

కొంతకాలం తర్వాత నాగజ్యోతి ఆఫీసర్స్ ‌ట్రైనింగ్‌ ‌పూర్తి చేసింది. డిఫెన్స్‌లో లెఫ్టినెంట్‌గా చార్జి తీసుకుందని తెలిసి మేజర్‌ ‌హనుమంతు ఉప్పొంగి పోయాడు. ఒక అద్భుతమైన స్వప్నం సాకారమైనట్టు ఆనందించాడు.

(యదార్థ జీవితాల ఆధారంగా)

About Author

By editor

Twitter
Instagram