– అలపర్తి రామకృష్ణ

వాకాటి పాండు రంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

కిటికీన్నీ బార్లా తెరిచే ఉన్నాయి.

ఎండ హాల్లోకి చొచ్చుకు వస్తూ ఉంది. దానితోపాటు దుమ్ము కూడ ఇంట్లోకి వచ్చి చేరుతూఉంది. కొన్ని వందల చిన్న చిన్న రేణువులు గాల్లో తేలియాడుతూ సూర్యరశ్మిలో కన్పించాయి.

ఆ దుమ్ము రేణువులకేసి చూస్తూ ఉండిపోయాడు సందీప్‌.

‌చల్లటి గాలి వస్తుందనుకున్నాడు కిటికీలో నుంచి, పీల్చే గాలిలో దుమ్ము కూడ ఉందన్నమాట. రోడ్డు మీద చీమల బారుల్లా వాహనాలు కదిలిపోతున్నాయి. వాహనాలు రేపే దుమ్ము ఇంట్లోకి దూరిపోతూ ఉంది. రోడ్డుకుండే ఇల్లు సురక్షితం అనుకుంటూ కిటికీ తలుపు మూసి ఇంటి వెనుక ఆవరణలోకి వెళ్లాడు. ప్రహరీ గోడ అవతలివైపు ఎత్తైన చెట్లు ఉండేవి దట్టంగా సంవత్సరం కిందటి వరకూ. చెట్లన్నీ మాయమై బహుళ అంతస్తుల భవనాలు కన్పిస్తున్నాయి.

సెల్‌ఫోన్‌ ‌మోగింది.

అపరంజి ఫోన్‌ ‌చేసింది. ఆఫీసులో ఉన్నప్పుడు నాలుగైదు సార్లన్నా ఫోన్‌ ‌చేస్తుంది రోజూ.

‘‘నీ వర్క్‌కి డిస్టర్బెన్స్. ఎం‌దుకు ఫోన్‌ ‌చేస్తావ్‌?’’ అడిగాడు సందీప్‌.

‘‘అకౌంట్స్‌తో బుర్ర వేడెక్కినప్పుడల్లా రిలీఫ్‌ ‌కోసం నీకు ఫోన్‌ ‌చేస్తూ ఉంటాను మై డియర్‌. ఏం ‌చేస్తువున్నావ్‌?’’ అడిగింది ఆమె.

‘‘దుమ్ము పీలుస్తూ ఉన్నాను. డీ•జిల్‌ ‌వాసన ఆస్వాదిస్తున్నాను. ఉచితంగా దొరికేవి అవేకదా!’’ అన్నాడు అతను.

పెద్దగా నవ్విందామె.

‘‘హాల్లో కూర్చుని ఎ.సి.వేసుకుని టీవీ చూడక ఇంటి చుట్టూ తిరుగుతావెందుకు? నీతోపాటు విన్నీ కూడ తిరుగుతూ ఉందా?’’ అడిగింది ఆమె.

‘విన్నీ’ అంటే పెట్‌ ‌డాగ్‌. ‌చాక్‌లెట్‌ ‌కలర్‌ ‌లాబ్రెడార్‌ ‌డాగ్‌. ‌బి.టెక్‌ ‌చదివేటప్పుడు సుప్రజ చిన్నపిల్లగా ఉన్న ఆ కుక్కను తెచ్చింది ఇంటికి. ముద్దుగా ఉండే దానితో ఆడుకోవడం తప్పితే పెంపకం అంతా తనే. చాకిరి తనది దానితో ఆడుకునేది కూతురు, భార్య. సుప్రజ అమెరికా వెళ్లిపోయింది. ఎం.ఎస్‌. ‌పూర్తి చేసి న్యూజెర్సీలో ఉద్యోగం చేస్తూ ఉంది. కొడుకు సూరజ్‌ ‌కూడ ఉండేది అమెరికాలోనే. వాడు డాక్టరు.

ఇంట్లో ఉండేది తను, అపరంజి. ఆమె ఛార్టర్డ్ అకౌటెంట్‌. ‌సొంతంగా ఆఫీసు పెట్టుకుంది సికింద్రాబాద్‌లో. ఆర్థికపరమైన విషయాలలో మునిగి తేలుతూ ఉంటుంది. అప్పుడప్పుడు అంకెల్లో నుంచి తలపైకెత్తి తనవైపు చూస్తూ ఉంటుంది.

‘‘గాలిలో వంద మీటర్లు ఎత్తులో వాహనాలు తిరిగే రోజులు ఎంతో దూరంలో లేవు. ట్రాఫిక్‌ ‌రద్దీని తట్టుకోవాలంటే వెహికిల్స్ ‌గాలిలో ఎగరేటట్లు కనిపెడతారు’’ అంది ఆమె వాతావరణ కాలుష్యానికి విరుగుడు చెబుతూ.

‘‘వెహికిల్స్ ‌పొగతో ఆకాశం కూడ కలుషితం అయిపో తుందప్పుడు. పరిశుభ్రమైన గాలికూడ దొరక్క మినరల్‌ ‌బాటిల్స్ ‌కొనుక్కున్నట్లు ఆక్సిజన్‌ ‌బాటిల్స్ ‌కొనుక్కుని భుజానికి తగిలించుకుని తిరగాలి! కొవిడ్‌ ‌వ్యాధి వచ్చాక అందరూ ముక్కు, నోరు కనబడకుండా మాస్క్‌లు వేసుకుంటున్నారు. చేతులకు శానిటైజర్‌ ‌రుద్దుకుంటున్నారు’’ అన్నాడు అతను.

‘‘మీరు బయట తిరక్కండి! స్టే ఎట్‌ ‌హోమ్‌. ‌స్టే సేఫ్‌! ‌ప్రధానమంత్రి గారు చక్కగా చెప్పారు. ‘జాన్‌ ‌హై తో జహాన్‌ ‌హై!’ ప్రాణాన్ని నిలబెట్టుకుంటే అందమైన లోకాన్ని చూస్తూ ఉండిపోవచ్చు!’’ అంది అపరంజి.

ఆమె ఛాంబర్‌లోకి ఎవరన్నా వచ్చేరేమో ‘‘మళ్లీ తరువాత మాట్లాడుతాను!’’ అనేసి ఫోన్‌ ఆఫ్‌ ‌చేసింది.

టీవీ ఆన్‌ ‌చేశాడు, ఏం తోచక.

అన్నీ కరోనా వార్తలే!

చైనాలోని ఊహాన్‌లో పుట్టిన కరోనా వైరస్‌ ‌ఖండాలు, దేశాల సరిహద్దులు దాటి అన్ని దేశాల్లోకి చొరబడిపోయింది. అధిక సంఖ్యలో జనం ఒకేసారి అస్వస్థులవుతున్నారు. వేలాదిమంది పిట్టల్లా రాలిపోతున్నారు. వ్యక్తిగత జాగ్రత్తలు పాటించకున్నా జన సందోహంలో సన్నిహితంగా తిరిగినా కరోనా కాటు వేస్తూనే ఉంది.

కరోనా మహమ్మారిని నిలువరించే వ్యాక్సిన్‌ అం‌దరికి అందుబాటులోకి ఎప్పుడు వస్తుందో?

‘‘అమ్మాయ్‌! అపరంజీ!’’ పక్కింటి అనసూయమ్మ పిలుపుతో ఆలోచనల నుండి తేరుకుని వెయిన్‌ ‌డోర్‌ ‌దగ్గరకు వచ్చాడు సందీప్‌.

ఆ ‌సమయంలో అపరంజి ఇంట్లో ఉండదని తెలుసు. ‘చే బదులు’ కోసం వస్తుంది ఆమె. ఎంత అడిగినా ప్రశ్నలు వేయకుండా ఇచ్చేస్తాడు తను. అపరంజి అయితే అంతకు ముందు తీసుకున్న డబ్బు ఎప్పుడిస్తారని లెక్కలు అడుగుతుంది! అందుకే అపరంజి ఇంట్లో లేనప్పుడే వస్తుందామె.

‘‘అమ్మాయి కాలేజీ ఫీజు కట్టాలి బాబూ! ఓ ఐదువేలు తక్కువయ్యాయి. ఆన్‌లైన్‌ ‌క్లాసులు మొదలయ్యాయట. ఫీజు కడితేనే కంప్యూటర్లో ఆ క్లాసులు వినచ్చొట్ట!’’ అంది ఆమె.

వాళ్ల అమ్మాయి ఫీజు అనగానే మరోమాట మాట్లాడకుండా బీరువాలో నుంచి ఐదువేలు తెచ్చి ఇచ్చేశాడు అనసూయమ్మకు.

‘‘అపరంజి అదృష్టవంతురాలు బాబూ! ఇంట్లో పనులన్నీ నువ్వే చక్క బెడతావ్‌! ‌వంటొచ్చిన మొగుడు దొరకడం అమ్మాయి అదృష్టం! మీ బాబాయి పూచికపుల్ల అటు తీసి ఇటు పెట్టరు! అన్నీ నేనే చేయాలి! నాకు డబ్బు ఇచ్చినట్లు అమ్మాయికి చెప్పకు! నేను వీలు చూసుకుని తిరిగి ఇచ్చేస్తాను’’ అంది ఆవిడ.

‘ఆవిడ తిరిగి ఇచ్చేది లేదు.తను పుచ్చుకునేది లేదు. వాళ్లమ్మాయి వనజకు బాగా చదువు వచ్చి తన కాళ్లమీద తను నిలబడితే చాలు!’ అనుకున్నాడు సందీప్‌ ‌మనస్సులో.

నాలుగు అడుగులు వేసి వెనక్కు తిరిగి వచ్చింది.

‘‘బాబూ! ఆ రంగమ్మగారి ఇంటివైపు వెళ్లకు! వాళ్లయనకు రెండ్రోజుల నుంచి జ్వరం. పెద్దగా దగ్గుతున్నాడట. ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడట! కరోనా సోకి ఉంటుంది! అటువైపు వెళ్లకు!’’ అని చెప్పేసి వెళ్లిపోయింది అనసూయమ్మ.

వీరయ్య, రంగమ్మ గార్లది పెద్ద వయస్సు. ఇద్దరూ రిటైర్డ్ ‌టీచర్లు. ఇద్దరు పిల్లలూ ఎక్కడో దూరాన ఉన్నారు. పెద్ద కొడుకు ముంబాయిలో, రెండో కొడుకు జైపూర్‌లో ఉన్నాడు. ఇద్దరివి చిన్న చిన్న ఉద్యోగాలు. హైస్కూల్లో చదివే రోజుల్లో వీరయ్యగారు తనకు టీచర్‌. ‌లెక్కలు, సైన్సు చెప్పేవాడు. పునాది గట్టిగా వేసింది ఆయనే! కాన్పూర్‌ ఐ.ఐ.‌టి.లో చదివి ఐ.ఐ.ఎ. గోల్డ్‌మెడల్‌ ‌సాధించాడు తను. చదివిన చదువుకు తనకు వచ్చిన ఉద్యోగాలకు పొంతన కుదర్లేదు. పదేళ్లు ఇంజనీరింగు కాలేజీల్లో ప్రొఫెసర్‌గా చేసి ఉద్యోగం మానేసాడు.

దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అనుసరించి దేశ ద్రోహికి ఉరిశిక్ష విధించారు. ప్రభుత్వ చర్యను నిరసిస్తూ కాలేజీ ప్రాంగణంలో మీటింగు పెట్టారు కొందరు విద్యార్థులు, ప్రొఫెసర్లు. సైద్ధాంతికంగా ఉరిశిక్షలను రద్దు చేయాలని కాదు వాళ్లు మాట్లాడింది. టెర్రరిస్టులకు మద్దతు పలికారు. ఆ మీటింగుకు మద్దతు పలికిన ప్రొఫెసర్‌తో విభేదించాడు తను. అతనే తనను ప్రశ్నించిన విద్యార్థి ‘కులం ఏమిటని?’ ఆరా తీయడం మొదలు పెట్టాడు.

ఆ వాతావరణం తనకు నచ్చలేదు. గురువు అందరిని సమదృష్టితో చూడాలి! ప్రాచీన కాలంలో గురుకులాల్లో గురువు రాజుగారి కొడుకును, సైనికుడి కొడుకును సమదృష్టితో చూసి విద్యను బోధించేవాడు. సమాజానికి ఉపయోగపడేటట్లు తీర్చిదిద్దాలి గురువు.

ఆ ఉద్యోగం మానేసి ఇంటిపట్టున ఉంటున్నాడు. అప్పుడప్పుడు విజిటింగ్‌ ‌ప్రొఫెసర్‌గా విశ్వ విద్యాలయాలకు వెళ్లి తను సంపాదించిన విజ్ఞానాన్ని ఉపన్యాసాల ద్వారా పంచిపెడుతూ ఉన్నాడు.

వీరయ్య మాష్టారుకు ఆరోగ్యం సరిగ్గా లేదని తెలిసి కలవరపడ్డాడు. సందీప్‌ ‌వాళ్లింటికి వెళ్లాడు.

మూడ్రోజుల నుంచి తగ్గని జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులు, గొంతు నొప్పి, ఛాతీలో నొప్పి, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. ఎనభైయ్యేళ్ల వయస్సులో కూడ వీరయ్యగారు రోజూ సైకిల్‌ ‌తొక్కుకుంటూ సెంటర్‌కు వెళ్లి ఇంట్లోకి అవసరమైనవి తెచ్చుకునేవాడు. ఆయన కంటే రెండేళ్లు చిన్నది భార్య రంగమ్మ.

‘‘చెబితే వినడు బాబూ! ఎప్పుడూ రోడ్లమీద తిరుగుతూ ఉంటాడు. దుమ్ము, ధూళిలో తిరిగి అనారోగ్యం కొని తెచ్చుకున్నాడు’’ అంది రంగమ్మ మొత్తుకుంటూ.

ఏదో అనుమానం వచ్చింది సందీప్‌. ‌తన దగ్గర ఉన్న పల్సోమీటరు తీసుకు వచ్చి ఆక్సిజన్‌ ‌లెవల్స్ ‌పరీక్ష చేశాడు. తొంభై నాలుగు కంటే తక్కువగా ఉంది రీడింగు.

ఆలస్యం చేయకుండా కారులో ‘కొవిడ్‌ ‌సెంటర్‌’‌కు తీసుకువెళ్లి యాంటిజెన్‌టెస్టస్, ఆర్‌టిపిసిర్‌ ‌టెస్టస్ ‌చేయించాడు దగ్గరుండి. ‘పాజిటివ్‌’ అని రిజల్ట్ ‌వచ్చింది. అపోలో హాస్పిటల్లో చేర్పించాడు. పెద్ద వయస్సు ఆయనది. పైపెచ్చు బైపాస్‌ ‌హార్ట్ ‌సర్జరీ చేయించుకున్నాడు అంతకు ముందు. స్టెరాయిడ్స్ అవసరం ఉంటుంది. అందుకే ముందు జాగ్రత్తగా ప్రైవేటు హాస్పిటల్లో చేర్పించాడు.

‘‘బాబూ! పెద్ద హాస్పి•ల్లో చేర్పించావు. ఖర్చు లక్షల్లో ఉంటుంది. నేను తట్టుకోలేను. ఇంట్లోనే నన్ను ఉంచేస్తే సరిపోయేది. రాలిపోయినా నష్టం ఏమీ లేదు.జీవితంలో అన్నీ చూసినవాడిని!’’ అన్నాడు వీరయ్య సందీప్‌తో.

‘‘అదేమిటి మాష్టారూ అలా అంటారు? ఎంతో మందికి విద్యా సుగంధం పూశారు. ప్రయోజకుల్ని చేశారు. హైస్కూల్లో చదివేటప్పుడు నాకు పైసా తీసుకోకుండా మ్యాథ్స్, ‌సైన్సు ట్యూషన్‌ ‌చెప్పారు. చదువు రాకపోయినా ఫరవాలేదు గాని, సంఘ ద్రోహి కాకూడదు! యాంటి సోషల్‌ ఎలిమెంట్స్ ‌కాకుండా ఉంటే చాలని యువతకు ఉద్బోధ చేసేవాళ్లు! మనకోసం చేసినపని మనతోనే ఆగి పోతుంది. ఇతరుల శ్రేయస్సు కోసం చేసింది కలకాలం మిగిలిపోతుందనే వాళ్లు! మీకు ఆ మాత్రం సహాయం చెయ్యలేమా?’’ అన్నాడు సందీప్‌.

‌కన్నీళ్లు పెట్టుకుని ‘‘ఇంకా బ్రతికి ఎవరిని ఉద్ధరించాలి? ‘అందరిని చదివించారు గాని మమ్మల్ని పట్టించుకోలేదు! పెద్ద చదువులు రాలేదు మాకు!’ అని నా కొడుకులు దెప్పిపొడుస్తూ ఉంటారు. అందరితో పాటే వాళ్లని కూర్చోబెట్టి చదివించేవాడిని. కానీ వాళ్లకు పెద్దగా చదువు రాలేదు శ్రద్ధ చూపించక పోవడంతో!’’ అన్నాడు వీరయ్య.

‘‘మీరు కళ్లముందు సైకిల్‌ ‌మీద తిరుగుతూ ఉంటే చాలు! అదే మాకు స్ఫూర్తి! సమాజ శిల్పులు మీరు!’’ అన్నాడు అతను.

ఆక్సిజన్‌ ఎక్కించారు అవసరమైనప్పుడు. స్టెరాయిడ్స్ ఇచ్చారు. పది రోజులకు పూర్తిగా కోలుకున్నాడు వీరయ్య మాష్టారు. డిశ్చార్జ్ ‌చేసేముందు పరీక్ష చేస్తే కరోనా లక్షణాలు ఏవీలేవు. ‘నెగిటివ్‌’ ‌రిపోర్టు వచ్చింది. తనూ పరీక్ష చేయించుకున్నాడు సందీప్‌. ‌నెగిటివ్‌ ‌వచ్చింది.

సందీప్‌ ‌కొడుకు సూరజ్‌ ‌ఫోన్‌ ‌చేసి కోప్పడినట్లు మాట్లాడాడు తండ్రితో.

‘‘మీకెందుకు డాడీ? కొవిడ్‌ ‌పేషెంటును చేతులతో మోసుకుని కార్లో కూర్చోబెట్టుకుని హాస్పిటల్లో చేర్పించారట! మీకు కరోనా వస్తే ఎలా? అమెరికా నుంచి విమానాలు పూర్తిగా ఇండియాకు పునరుద్ధరణ కాలేదు. నేను, చెల్లెలు ఇండియా వచ్చే అవకాశాలు ఇప్పట్లో లేనట్లే! మీకు ఎవరు సేవలు చేస్తారు?’’ ప్రశ్నల వర్షం కురిపించాడు సూరజ్‌.

‘‘‌మనిషికి ఆపద వస్తే ముందుగా వచ్చేది పక్కన ఉన్నవాళ్లే! దగ్గరి బంధువులు కాదు!’’ అని సమాధానం ఇచ్చాడు కొడుక్కి.

రాత్రి తొమ్మిది గంటల సమయంలో సుప్రజ నుంచి ఫోన్‌ ‌వచ్చింది. గంట సేపు మాట్లాడుతుంది వాళ్లమ్మతో. అపరంజి మాట్లాడి విసుగు వచ్చేక చివరి పది నిమిషాలు తనకు కేటాయిస్తుంది కూతురితో మాట్లాడమని.

‘‘ఇండియాలో దుమ్ము, ధూళి ఎక్కువగా ఉంటుందని అంటూ ఉంటావ్‌ ‌కదా డాడీ! నువ్వు, అమ్మా అమెరికా వచ్చేయ్యండి!’’ అంది సుప్రజ సందీప్‌తో.

‘‘ఇక్కడ దుమ్ము కంటికి కన్పిస్తూ ఉంటుంది. కానీ మీ అమెరికాలో మెదడులో దుమ్ము పేరుకుని పోతుంది. మెట్రో రైళ్ల రాకపోకలను కంప్యూటర్‌తో కంట్రోల్‌ ‌చేసినట్లు అక్కడ అందరిని ఏదొక కంప్యూటర్‌ ‌నడిపిస్తూ ఉంటుంది. కాలినడకను మర్చిపోతాడు. అమెరికాలో అంతా పోగ్రామ్‌డ్‌ ‌లైఫ్‌. ‌మనదేశంలో మట్టికాళ్ల మనిషి కూడ అద్భుతంగా స్పందిస్తాడు. ఏటిగట్టు ముందు నిలబడినా గంటల సమయం నిముషాల్లా గడిచిపోతాయి. అన్ని ప్రాంతాల్లో చైతన్యం వెల్లివిరుస్తూ ఉంటుంది. కాళ్లకు చేతులకు మట్టి అంటుకుంటుందని మాతృదేశాన్ని వదిలి రాలేము కదా! నిన్ను, అన్నయ్యను చూడటానికి వచ్చి రెండు మూడునెలలు ఉండగలుగుతాం కాని, శాశ్వతంగా అక్కడ ఉండలేం! ఊపిరాడదు!’’ అన్నాడు సందీప్‌.

‘‘‌నాన్న! నువ్వు గ్రేట్‌. ‌కంప్యూటర్‌ ‌ముందు కూర్చున్నా, కరివేపాకు తాలింపు వేసినా గుభాళిస్తునే ఉంటావ్‌. ‘ఉద్యోగం పురుష లక్షణం’ అంటారు! పురుష లక్షణం అంటే ఉద్యోగం చేసి వచ్చే సంపాదనతో నలుగురిని పోషించడం! మీరు ఉద్యోగం చెయ్యకపోయినా ఎప్పుడూ కుర్రాళ్లని చుట్టూ చేర్చుకుని విజ్ఞాన సంపదను పంచుతూనే ఉంటారు. బాగా సంపాదించాలని ఆరాటపడరు! మెదడు పొరల్లో దుమ్ము పేర్చుకుని యంత్రంలా పని చెయ్యడానికి ఇష్టపడరు! మీరు ఎందరికో ‘రోల్‌ ‌మోడల్‌!’’ అం‌ది సుప్రజ.

కూతురి మాటలు పొగడ్తగా అన్పించి ‘‘జాగ్రత్త తల్లీ!’’ అనేసి ఫోన్‌ ఆఫ్‌ ‌చేశాడు అతను.

రాత్రి భోజనం చేసేటప్పుడు ‘‘అమ్మాయికి పెళ్లి సంబంధం చూడండి!’’ అంది అపరంజి.

‘‘మనం సంబంధం చూడటం ఏమిటి? తనకు నచ్చినవాడిని తనే ఎంపిక చేసుకుంటుంది.’’

‘‘అమ్మాయి మనసు తాకినవాడు అమెరికాలో దొరకలేదట. మనమే మంచి కుర్రాడిని వెతకాలి!’’ అంది ఆమె ములక్కాడలు వేసిన పప్పుచారు వేసుకుంటూ.

‘‘ఎటువంటి క్యాలిఫికేషన్స్ ఉం‌డాలట నీ కూతురికి?’’ అడిగాడు అతను నవ్వుతూ.

‘‘బిటెక్‌ ‌చదివి ఉండాలి! అమెరికాలో ఉద్యోగం చెయ్యకపోయినా ఫరవాలేదు గాని నాలుగు రకాల వంటలు చేసి భార్యకు, పిల్లలకి పెట్టి పిల్లల్ని చక్కగా చదివించుకునే తెలివితేటలు ఉండాలట! అమెరికాలో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులైతే పిల్లల పెంపకానికి, ట్యూషన్లకు వేలకు వేలు డాలర్లు ఖర్చు అవుతాయట. పిల్లలు పెద్దవాళ్లు అయ్యాక ఇద్దరూ ఉద్యోగాలు చేసుకోవొచ్చట. అదీ సుప్రజ ఆలోచనలు!’’ అంది అపరంజి.

‘‘అటువంటి అల్లుడు దొరకడం కష్టం భార్యమణి!’’ అన్నాడు సందీప్‌.

‘…..అత్తగారింట్లో మరుగుదొడ్డి ఉంటేనే పెళ్లికి ఒప్పుకుంటాను’ అనే అమ్మాయిల గురించి విన్నాడు గాని, అమెరికా వచ్చి అంట్లు తోమి ఇంట్లో దుమ్ము ధూళి ఊడ్చేసే అబ్బాయి ఎక్కడ దొరుకుతాడు?’

కానీ సందీప్‌ అం‌చనా తప్పని తేలింది.

సుప్రజను పెళ్లి చేసుకోవడానికి పదిమంది బిటెక్‌ ‌చదివిన కుర్రాళ్లు వచ్చారు.

About Author

By editor

Twitter
Instagram