అక్టోబర్‌ 24 ‌దుర్గాష్టమి సందర్భంగా..

యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

అధికమాసం అశ్వీయుజం ఈ సంవత్సరానికి ప్రత్యేకం. ప్రతి 19 సంవత్సరాలకొకసారి వస్తుంది. అధికమాసంలో చేసే పూజలు, దానాలతో అధిక ఫలం ప్రాప్తిస్తుందని పెద్దలు చెపుతారు. నవరాత్రులలో ఉపాసన పద్ధతిని అనుసరించి, ప్రాంతాలను బట్టి అమ్మవారిని ఇలా అలంకరిస్తారు.

పాడ్యమి – శైలపుత్రి/ విధియ – బ్రహ్మచారిణి/ తదియ – చంద్రఘంట/చవితి – కుష్మాండదుర్గ/ పంచమి – స్కందమాత/షష్టి – కాత్యాయని/ సప్తమి – కాళరాత్రీ దుర్గ/అష్టమి – మహాగౌరి/ నవమి – సిద్ధి ధాత్రి

మొదటిరోజు ఒక ముత్తైదువని, రెండవరోజు ముగ్గురు, మూడవరోజు ఐదుగురు ఇలా పెంచుతూ, లేదా రోజు ఒక్కరినే, మరొక పద్ధతి రోజుకు 9 మంది చొప్పున పూజిస్తారు. ఈ విధంగానే ‘బాలపూజ’ కూడా చేస్తారు. అఖండ దీపారాధన మంటపారాధనలతో ముక్కోటి దేవతలన• ఆవాహన చేస్తారు.

యాదేవి సర్వ భూతేషు మాతృరూపేణ సంస్థితా

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

ఆర్తితో అమ్మా అని పిలిస్తే నేనున్నానంటూ ఆప్యాయంగా అక్కున జేర్చుకునే ఆ తల్లికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం, త్రికరణ శుద్ధిగా మనలను మనం అర్పించుకోవడం తప్ప! ఆ జగనాత్మను సేవించే భాగ్యం నవరాత్రుల రూపంలో లభించడం మన జన్మకు లభించిన అద్భుత వరం.

రాత్రి ప్రాశస్త్యాన్ని శివుని వల్ల తెలుసుకున్నది పార్వతీదేవి. ఆ పరమశివుడే నవరాత్రులు ఆ తల్లి పేరిట పవిత్రదినాలుగా వర్ధిల్లేటట్లు వరమిచ్చాడు. అవి చైత్రమాసంలో వసంత నవరాత్రులుగా, ఆశ్వయుజమాసంలో శరన్నవరాత్రులుగా ప్రాచుర్యం పొందాయి. శరన్నవరాత్రులనే ‘దేవి నవరాత్రులు’ అని, దసరా అని అంటాం. రావణుని మీద విజయం సాధించిన రాముడు ‘విజయ దశమి’ని జరుపుకున్నాడని ప్రతీతి.

యజుర్వేదానుసారంగా నవరాత్రులను మూడు భాగాలుగా విభజింపవచ్చును. మొదటి మూడురోజులకు దుర్గాదేవిని, తరువాత మూడురోజులు లక్షీదేవిని, చివరి మూడురోజులు సరస్వతి దేవిని ప్రధానంగా కొలుస్తారు. తొమ్మిది రోజులు ఆచరించలేనివారు ఐదు లేదా మూడు రోజులు ఆచరిస్తారు. అదీ వీలుకాకపోతే కనీసం ఒక్క రోజునైనా ఆచరించడం విధాయకం. సువాసిని పూజ, బాల పూజ, ప్రసాదం అమ్మవారి అలంకారాన్నిబట్టి మారుతుంటాయి.

నవరాత్రులలో దేవిని నవమూర్తులు గానూ, నవశక్తులుగానూ ఆరాధిస్తారు. అయినా ఏ రోజు ఏ స్వరూపం అనేది నిర్దిష్ట నిర్ణయంగా కనిపించదు. తిథి, నక్షత్రాలను బట్టి ఆనాటి రూపవిశేషం ఉంటుంది. ఆ తల్లి రూపాలు ప్రాంతీయ ఆచారాలను బట్టి వేరువేరుగా ఉంటాయి. అంటే శృంగేరి పీఠంలో, విజయవాడ కనకదుర్గ సన్నిధిలో దసరా ఉత్సవాలు, తిరుపతి శ్రీవారి సన్నిధిలో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి కాబట్టి, ఆయా ప్రాంతాలవారీగా అమ్మవారి రూపాలు మారతాయి. నవశక్తులు గాయత్రీమాతలో నిక్షిప్తమై ఉన్నాయని పెద్దల భావన.

నవరాత్రులోని ఒక్కొక్క రోజు జగన్మాతలోని ఒక్కొక్క కోణాన్ని దర్శింపచేస్తాయి. ఆయా తిథులలో అమ్మవారి అవతార విశేషం, సమర్పించాల్సిన నైవేద్యం, జపించాల్సిన మంత్రం, గాయత్రి ఈ విధంగా ఉన్నాయి.

పాడ్యమి – బాలా త్రిపురసుందరి – పాల పాయసం

దినకర కిరణైః జ్యోతి రూపే శివాఖ్యే

హేమ వర్ణే హిమ కర కిరణా భాసమానేన్దుచూడే

సకల జయకరీ, శక్తి బాలే నమస్తే।।

అని మొదటి రోజున బాల స్వరూపంగా పూజించాలి

బాల గాయత్రి : ఓం త్రిపురేశ్యచ విద్మహే కామేశ్వర్వైచ ధీమహి తన్నో బాలా ప్రచోదయాత్‌।।

ఈ ‌బాల గాయత్రి సహస్ర గాయత్రిగా జపిస్తే మంచి ఫలితం లభిస్తుంది.

విదియ – అన్నపూర్ణేశ్వరి – పాయసాన్నం

అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే

జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి।।

మాతాచ పార్వతీదేవి పితా దేవో మహేశ్వరః

అన్నపూర్ణ గాయత్రి : అన్నపూర్ణాయై విద్మహే జగన్మాత్రేచ థీమహి తన్నో దేవి ప్రచోదయాత్‌।।

‌తదియ – శ్రీమహలక్ష్మి – గుడాన్నం

మాతర్నమామి కమలే కమలాయతాక్షి

శ్రీవిష్ణు హృత్కమలవాసిని విశ్వమాతః

క్షీరదజే కమల కోమల గర్భగౌరి

లక్ష్మీప్రసీద సతతం సమతాం శరణ్యే।।

లక్ష్మీగాయత్రి : ఓం మహాలక్ష్యైచ విద్మహే సర్వసిద్ధ్యైచ ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్‌।।

ఓం అమృతవాసిన్యైచ విద్మహే పద్మలోచన్యైచ ధీమహి

తన్నో లక్ష్మిః ప్రచోదయాత్‌।। అని పఠించినా మంచిదే.

చవితి – గాయత్రి దేవి – కట్టు పొంగలి అన్నం

ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం

భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్‌।।

అని పఠించినట్లయితే తల్లి కరుణిస్తుంది.

పంచమి – శ్రీలలితాదేవి – పులిహోరాన్నం

అన్నఘాద్భుత చరిత్రా వాంచితార్థ ప్రదాయినీ

ఆబాలగోపవిదితా సర్వానుల్లంఘ్య శాసనా।।

శ్రీ లలితాగాయత్రి : లలితాయై చ విద్మహే కామేశ్వర్యైచ ధీమహి ఔతన్నో దేవి ప్రచోదాయాత్‌।।

‌షష్టి – శ్రీదుర్గాదేవి – చిల్లు లేకుండా అల్లపు గారెలు

ప్రథమా శైల పుత్రీచ ద్వితీయ బ్రహ్మచారిణే

తృతీయా చంద్రఘాటేతి కుష్మాండతేతి చతుర్థికీ

పంచమాస్కంద మాతేతి షష్టా కాత్యేయనేతిచ

సప్తమ కాల రాత్రిచ అష్టమా చేతి భైరవీ

నవమా సర్వస్థిశ్చేత్‌ ‌నవదుర్గా ప్రకీర్తితా।।

దుర్గా గాయత్రి : ఓం మహా దుర్గాయై విద్మహే సర్వ శక్తయైచ థీమహి తన్నో దుర్గా ప్రచోదయాత్‌

‌సప్తమి – మూలా నక్షత్రం – సరస్వతీదేవి – కొబ్బరి అన్నం

సరస్వతీత్వియం దృష్టా వీణా పుస్తక ధారణీ

హంస వాహన సమాయుక్తా విద్యాదానకరీ మమ।।

సరస్వతీ గాయత్రి : సరస్వత్వైచ విద్మహే బ్రహ్మసతియైచ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్‌।।

అష్టమి – మహిషాసురమర్దని – శాకాన్నం, కేసరిబాత్‌

‌జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే

మహిషాసురమర్దిని గాయత్రి : మహిషష్వైచ విద్మహే జగన్మాత్రేచ ధీమహి తన్నో మాతా ప్రచోదయాత్‌ ।।

‌నవమి – శ్రీరాజరాజేశ్వరి – చిత్రాన్నం, లడ్డూలు

అంబా పాలిత భక్తరాజరనిశం అంబాష్టకం యః పఠేత్‌

‌దంబాలోక కటాక్షవీక్ష లలితా ఐశ్వర్య మహ్యహతా

అంబాపావన మంత్ర రాజ పఠనాద్దంతీశ మోక్ష ప్రదా

చిద్రూపీ వరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ।।

రాజరాజేశ్వరి గాయత్రి : రాజేశ్వర్వైచ విద్మహే శ్రీభవానీయైచ థీమహి తన్నో దేవి ప్రచోదయాత్‌।।

‌నవరాత్రి పూజా నియమావళి

  1. ప్రతిరోజూ ఉదయాన్నే తలస్నానం చేయాలి
  2. నిత్యం చక్కని పిండివంటలతో నైవేద్యం చేయాలి
  3. ప్రతిరోజు నేలమీద నిద్రపోవాలి
  4. ఆఖరి మూడు రోజులు ఉపవాసం ఉండాలి
  5. మిగిలిన రోజుల్లో ఒక్కపూట భుజించాలి.
  6. దేవీ భాగవతం పారాయణం చేయాలి.
  7. శ్రీదేవి సప్తశతీ నిత్యపారాయణం చేయాలి.
  8. దుర్గా ద్వాత్రిశంన్నామ స్తోత్రం 108 సార్లు పారాయణం చేయాలి.
  9. శ్రీ లలితా సహస్ర పారాయణం 108 సార్లు మంచిది.

సువాసినీ పూజ : ప్రతిరోజు ఒక ముత్తయిదువను అమ్మవారిగా భావనచేసి ఆమెకు సర్వ ఉపచారాలు చేయాలి. వస్త్రం, ఫలం సమర్పించాలి.

స్త్రీమూర్తిగా ఎదిగే క్రమం

దేవీ నవరాత్రుల ఆచరణలో స్త్రీత్వానికి అత్యంత ప్రాధాన్యముంది. అమ్మవారి  సందేశం అవతార ఘట్టాలలో కనిపిస్తుంది. ఆడపిల్లగా పుట్టిన క్షణం నుంచి సంపూర్ణ మహిళగా స్త్రీమూర్తి ఎదిగే క్రమాన్ని చూపించింది.

మొదటిరోజు – ‘బాల’గా అవతరిస్తుంది అమ్మవారు. అప్పుడే పుట్టిన ఆడపిల్ల ఆకర్షణీయంగా అందరినీ తన దరికి రప్పించుకుంటుంది.

రెండోరోజు – ‘అన్నపూర్ణ’గా అన్నప్రాశన చేయించుకుంటుంది. ఆహారం స్వీకరించి శారీరక, మానసిక వికాసం పొందుతుంది.

మూడోరోజు – ‘లక్ష్మి’గా ఎదుగుతుంది. పట్టు పరికిణీ ధరించి, చిరుమువ్వల సందడితో కళకళలాడుతూ తిరుగుతుంది.

నాలుగోరోజు – ‘గాయత్రి దేవి’గా వికసిస్తుంది. పసితనాన్ని వీడి జ్ఞానాన్ని సముపార్జించుకుంటూ శక్తిని ప్రకటించే ప్రయత్నం చేస్తుంది.

అయిదోరోజు – ‘శ్రీలలిత’గా అవతారమెత్తుతుంది. ఈ అవతారంలో అమ్మవారిని పరిశీలనగా చూస్తే దేవతలందరి శక్తులను పొంది శక్తి స్వరూపుణిగా కనిపిస్తుంది. అదేవిధంగా ఆడపిల్ల తన ఇంట్లోని పెద్దలను, పిన్నలను పరిశీలిస్తూ వారి మంచిచెడులను విశ్లేషిస్తూ తనను తాను తీర్చిదిద్దుకుంటుంది.

ఆరోరోజు – ‘శ్రీదుర్గాదేవి’ అవతారంలో అన్యాయాన్ని సహించలేని ఆవేశమూర్తిగా దర్శనమిస్తుంది. 15 నుంచి 18 సంవత్సరాల వయసులో ఆడపిల్లలో ఉండే ఆవేశం కనిపిస్తుంది.

ఏడోరోజు – మూలా నక్షత్రంలో ‘సరస్వతి’ రూపంలో అగుపిస్తుంది. జ్ఞాన వికాసిని అయిన ఆ తల్లి చిరునవ్వుతో సౌమ్యంగా, ప్రశాంతంగా గోచరిస్తుంది. పరిశీలన శక్తితో, విచక్షణా జ్ఞానంతో ప్రకృతిపై పరిశీనాత్మక దృష్టిని సారిస్తుంది. విద్యను ముగించి యుక్త వయస్సుతో నిండుగా, కన్నుల పండువగా కనిపిస్తుంది. సమాజంపై అవగాహన పెంచుకుని పరిస్థితులను ఎలా ఎదుర్కొనాలో తనకు తెలుసుకున్న పరిపూర్ణ వ్యక్తిత్వం సరస్వతి అవతారంలో అమ్మవారు ప్రదర్శిస్తారు.

ఎనిమిదోరోజు – ‘మహిషాసుర మర్దిని’గా విజృంభిస్తుంది. దుష్ట సంహారం చేసిన కాళికలా ఆవేశపూరితంగా కనిపిస్తుంది. పరిపూర్ణ యువతి సమాజంలోని ప్రతికూల పరిస్థితులపై సాధించే విజయానికి ప్రతీకగా నిలుస్తుంది.

తొమ్మిదోరోజు – ‘శ్రీరాజరాజేశ్వరి’ రూపంలో సౌమ్యంగా ఉంటుంది. ముందురోజు ఆవేశంగా రాక్షస సంహారం గావించిన అమ్మవారు తొమ్మిదో రోజున ప్రశాంతమూర్తిగా మారుపోతుంది. చిరునవ్వుతో ఆప్యాయతను కురిపించే శ్రీరాజరాజేశ్వ రిని దర్శించుకుంటే మన మనస్సు పులకరిస్తుంది.

వివాహంతో ముత్తయిదువగా, సంతాన ప్రాప్తితో తల్లిగా మారిన తర్వాత చెదరని చిరునవ్వుతో, సంసారాన్ని చక్కదిద్దుకునే మహిళగా దర్శనమిస్తుంది. ఆవేశాన్ని దరిచేరనివ్వక, ఎదుటివారికి ఆనందాన్ని పంచడానికి, సమాజాన్ని సుసంపన్నం చేయడానికి ప్రయత్నం సాగించే పరిపూర్ణతను సంతరించు కుంటుంది. స్త్రీ ఎలా నడుచుకోవాలో అమ్మవారు ‘నవరాత్రుల్లో’నూ సూచనప్రాయంగా చెప్పింది.

జమ్మిపూజ – బంగారం దానం

పాండవులు అజ్ఞాతవాసానికి వెళుతూ ఆయుధాలను జమ్మిచెట్టు (శమీ వృక్షం)పై దాచిపెడతారు. అజ్ఞాతవాసం పూర్తయిన సమయానికే కౌరవులు విరాటరాజ్యంపైకి దండయాత్రకు వస్తారు. ఆ రోజు విజయదశమి. అజ్ఞాత వాసాన్ని ముగించుకుని ఆయుధపూజ చేసి కౌరవులపై విజయం సాధిస్తాడు అర్జునుడు. అప్పటి నుంచీ విజయదశమి రోజున జమ్మిచెట్టును పూజించడం, ఆయుధాలకు, పనిముట్లకు, వాహనాలకు పూజ చేయడం ఆనవాయితీగా వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో జమ్మి ఆకును బంగారం అంటూ పెద్దలకు ఇచ్చి నమస్కరించి  దీవెనలు పొందుతారు. తమకంటే చిన్నవాళ్లకు ‘బంగారం’ ఇచ్చి ఆప్యాయంగా కౌగిలించుకుంటారు. ఏ కార్యం తలపెట్టినా విజయం సాధిస్తామన్న ప్రగాఢ విశ్వాసంతో చాలామంది నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు.

– ఉషా అన్నపూర్ణ

About Author

By editor

Twitter
Instagram