‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన
ధరణి ఉత్తరం రాయడం శ్రీధర్‌ని ఆశ్చర్య పరిచింది. సాయంత్రం ఏటి వైపు వెళ్లి అక్కడ చెట్టుకింద కూర్చుని దానిని చదవసాగాడు.
“శ్రీధర్ మాస్టారు గారికి!
ధరణి రాయునది.. నేను ఊరు వదిలి పదకొండేళ్లు అయింది. అప్పట్నుంచి నా గ్రామం తిరిగి రావాలనుకున్నప్పటికీ, కొని కారణాల వల్ల కుదÁరలేదు. మా మావను వెతుక్కుంటూ వెళ్లానని అందరూ అనుకున్నారు. కానీ నిజానికి పోలీసుల వేధింపులకు భయపడి వెళ్లిపోయాను. ఇప్పటికీ ఆడి ఆచూకీ తెలియలేదు. యాడికెళ్లాడో తెలియదు. నా ప్రయాణంలో నక్సలైట్లను కలిశాను. ఒకసారి కొండల్లోకి వెళ్లి వాళ్లను కలిస్తే వెనక్కి రావటం అంత సులభం కాదనీ నెల రోజుల తరువాత తెలిసింది. ఇక్కడి కొచ్చిన తరువాత నక్సల్స్ పడుతున్న బాధలు నాకు అర్థమయ్యాయి.
ఏ ముహూర్తాన పశ్చిమ బెంగాల్లో చారు మజుందార్ ఈ నక్సల్ ఉద్యమాన్ని మొదలు పెట్టాడో కానీ దాని వల్ల పేద గిరిజనులు బాగుపడ్డారో లేదో తెలియదు కానీ ఎందరో తెలివైన యువతీ యువకులు ఈ ఉద్యమం అనే దీపం వైపు ఆకర్షితులై శలభాల్లా మాడి మసైపోయారు. ఒకసారి ఉద్యమంలోకి వెళినవాళ్లు ప్రభుత్వాలకు శాశ్వత శత్రువులుగా మారుతూ,సమాజానికి దూరం అవుతున్నారు.
మృత్యువు ఏ క్షణంలో ఏ రూపంలో వస్తుందోనని అనుక్షణం చస్తూ బతుకుతుంటారు. గమ్యంలేని పయనం వీరిది. వీటికి తోడు ఆధునిక సాంకేతికత వీళ్లకి కంటి విÖద కునుకు లేకుండా చేసున్నది. పోలీసులు ఆధునిక ఆయుధాలు, సెల్‌ఫోన్లు, వాకీటాకీలు, హెలికాప్టర్లు వాడుతుంటే వీళ్ల దగ్గర పాత రకం తుపాకీలు తప్పా ఏవీ లేవు. వీళ్లకి తిండి, మందులు, దుస్తులు ఉండవు. వీటి కోసం సమీప గిరిజన గ్రాయాలకు వెళితే…వారికి ఆశ్రయం ఇస్తున్నారంటూ, గ్రామస్థులను పోలీసులు హింసిస్తున్నారు.
ఒకసారి గానీ ఈ ఉద్యమంలోకి వస్తే ఈ ఊబిలోంచి బయటపడలేరు.ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉంది.నాకు రెండేళ్ల క్రితం క్షయ వ్యాధి సోకింది.వ్యాధి బాగా ముదిరిపోయింది.ఊపిరి తిత్తుల్ని పూర్తిగా తినివేసింది. దగ్గు, కఫం పట్టి పీడిస్తున్నాయి. ఈ మధ్యనే ఒక డాక్టరు నన్ను పరీక్షించి, నేను ఎంతో కాలం బతకననీ చెప్పారు. ఈ క్షయ నాకు చివరకు మరణ శాసనం రాసేసింది.
ఆంధ్ర`ఒరిస్సా సరిహద్దులోని ఒక గిరిజన పల్లెలో రహస్యంగా తలదాచుకున్నాను.
వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా దుఃఖం కలుగుతోంది. ఎక్కడో మారుమÖల చిన్న గిరిజన తండాలో మొదలైన నా జీవితం ఎన్నో మలుపులు తిరిగి చివరకు మరణశయ్యకు చేరుకుంది.
ఇప్పుడు బతకాలన్న ఆశ కలుగుతోంది. అది తీరనిదని తెలిసినా ఏమÖలనో కొడిగట్టిన దీపంలా అది రెపరెపలాడుతోంది. అలా మరణాన్ని జయించి వందేళ్ల బతకాలన్న కోరిక లేదు. కానీ చనిపోయే లోపు నా మావను, కూతుర్ని చూడాలని ఉంది. మా మావ ఎక్కడ ఉన్నాడో, అసలు ఉన్నాడో లేడో కూడా తెలియదు. కానీ అక్క గౌరికి… తన దగ్గర ఉన్న నా కూతురు వనజను ఒకసారి చూపించాలని కబురు పెట్టాను. పాప మీ దగ్గర పెరుగుతున్నదని అక్క చెప్పింది.
ఆ మాట ఒక విధంగా నాకు బాధ కలిగించినా మీ దగ్గర హాయిగా బతుకుతోందన్న సంగతి సంతోషాన్ని కలిగించింది. దానినిని కడుపున మోసి కన్నాను కానీ నా చేతులతో పెంచ లేకపోయాను.ఈ బాధ నన్ను ఏ లోకంలో ఉన్నా వేధిస్తూనే ఉంటుంది.
చనిపోయే ముందు వనజని ఒకసారి కళ్లారా చూడాలని, గుండెలకు హత్తుకోవాలని ఉంది.ఈ పరిస్థితుల్లో నా ఈ కోరిక తీరే అవకాశం ఉందా? అనే అనుమానం నా గుండెను కలచివేస్తోంది.
కానీ మీరు తలుచుకుంటే నా కోరిక తీరుతుందనిపిస్తుంది. ఈ ఉత్తరం అందిన వెంటనే విÖరు నా కూతురు వనజని తీసుకొని రాగలరని విన్నవించుకుంటున్నాను. మా అక్క గౌరి ద్వారా నేనెక్కడున్నానో తెలుస్తుంది. నా చివరి కోరికను తీరుస్తారని ఆశిస్తూ, నా కూతురి చూపు కోసం,మీ రాక కోసం వేయి కళ్లతో నిరీక్షిస్తూ`ధరణి”… సుదీర్ఘ ఉత్తరం చదివిన శ్రీధర్ గుండె ఆవేదనతో బరువెక్కింది. కళ్లు చెమర్చాయి. కొద్ది సేపటి తరువాత భారమైన హృదయంతో ఇంటి దారి పట్టాడు.
ఆ రాత్రి అతనికి నిద్రపట్ట లేదు.ఆ ఉత్తరం గురించి కౌసల్యకి చెబుదామను కున్నాడు. కానీ వనజను కొండల్లో ఉన్న ధరణి దగ్గరికి తీసికెళ్లడానికి కౌసల్య ఒప్పుకోకపోవచ్చు.అందుకనీ చెప్పకపోవడమే మంచిదనే నిర్ణయానికొచ్చాడు.
అయినా అక్కడకు వెళ్లడం చాలా ప్రమాదకరం. నక్సలైట్లు ప్రబలంగా ఉన్న ఆ ప్రాంతంలో పోలీసులు అడుగడుగునా జల్లెడ పడుతుంటారు. వాళ్ల కళ్లు గప్పి ధరణి దగ్గరకు వెళ్లటం చాలా సాహసంతో కూడిన పని. ఏ మాత్రం తేడా వచ్చినా, నక్సలైట్ల సానుభూతిపరులమన్న అనుమానం కలిగినా పోలీసుల తూటాలకు బలికావచ్చు. ఒకవేళ ప్రాణాలతో బయటపడినా, పోలీసులు వెంటాడతారు. ఉద్యోగానికి ముప్పు వాటిల్లుతుంది.
ఇలా అతని ఆలోచనలు పరి పరి విధాలుగా సాగిపోతున్నాయి.
కానీ వనజను తల్లికి చూపించకపోతే అది విశ్వాస ఘాతుకం అవుతుంది. తనకు తెలియకుండా, తన అనుమతి లేకుండా గౌరిని ఒప్పించి తెచ్చి పెంచుకుం టున్నాం. తల్లి తిరిగి వస్తే అప్పగిస్తామన్న షరతుకు అంగీకరించాం. అటువంటిది, మరణం అంచున ఉన్న ధరణి తన కూతుర్ని చూడాలన్న చివరి కోరికను తీర్చలేకపోవడం తప్పవుతుందేమో! ఒక విధంగా పాపం కూడా. ఆ అపరాధ భావం తనను జీవితాంతం వెంటాడుతుంది.వెళితే ఒక సమస్య, వెళ్లకపోతే ఇంకొక సమస్య. దీన్ని అధిగమించడం ఎలా? ఆలోచనలతో శ్రీధర్ మస్తిష్కం వేడెక్కిపోతోంది.
అర్ధరాత్రి అయినా నిద్రపట్టడం లేదు. కౌసల్య, ప్రి¾య ఆదమరచి నిద్ర పోతున్నారు. తన మనసులోని అలజడి వాళ్లకి తెలియదు. నిన్నటి వరకూ ప్రియ సమస్య…ఇప్పుడు ధరణి సమస్య.అతనిలో ఆందోళన పెరగసాగింది.
ఆ మర్నాడు ఓ నిర్ణయానికి వచ్చి భోజన సమయంలో ధరణి రాసిన ఉత్తరాన్ని కౌసల్యకు చూపించాడు. ఉత్తరం చదివిన ఆమె మౌనంగా ఉండిపోయింది. ఆమె ముఖంలో ఆందోళన గమనించాడు శ్రీధర్.
“ఇప్పుడు ప్రియని తీసుకెళ్లాలంటారా? అయినా ఆ కొండలెక్కడం చాలా కష్టం. అదీకాక తను ఎక్కడుందో తెలియదు. అక్కడికి చేరడం కష్టం. పొరపాటున పోలీసుల కంటబడితే మనకూ, ఆమెకు కూడా ప్రమాదం. ఒకవేళ ప్రియను తల్లికి చూపిస్తే చిన్నదాని మనస్సు ఎలా మారుతుందో చెప్పలేం. ‘అమ్మను వదలి నేను రాను’ అంటే ఏం చెయ్యగలం?
కాబట్టి ఈ ఉత్తరం సంగతి మరచి పోండి. అన్నిటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే వెళ్లలేం. ఈ ఉత్తరం విషయం ప్రియకి తెలియనివ్వకండి. దాన్ని చింపేయండి. లేకపోతే అది చూసే ప్రమాదం ఉంది” సలహా ఇచ్చింది కౌసల్య.
ఆమె మాటలకు ఆశ్చర్యపోయాడు శ్రీధర్. ధరణి తల్లిప్రేమను కౌసల్య సరిగ్గా అర్థం చేసుకోలేదని అనుకున్నాడు శ్రీధర్.
అయినా చాలా మంది స్వార్థంతో అలానే ఆలోచిస్తారు. వాళ్లు తమ వైపు నుంచే చూస్తారు. నాణేనికి రెండవ వైపు ఉంటుందనీ అనుకోరు. ధరణే లేకపోతే ఇక ప్రియ ఎక్కడ? తాము తనను పెంచుకోగలిగేవారమా?” అనుకున్నాడు.
ధరణి రాసిన ఉత్తరం గురించి భవిష్యత్తులో ప్రియకు తెలిస్తే తను తమను క్షమించదు. ఇలా సాగిపోతున్నాయి ఆతని ఆలోచనలు.
అలా డోలాయమానంలో ఉన్న శ్రీధర్‌కి రెండు రోజుల తరువాత ప్రియ రూపంలో ఓ పరిష్కారం దొరికింది.
ఆ రోజు రాత్రి వెన్నెల్లో డాబా విÖద పడుకొని ఉన్నాడు శ్రీధర్. ఆ సమయంలో “నాన్నగారూ’ అంటూ గద్గగ స్వరంతో ప్రియ వచ్చింది.
అతను లేచి కూర్చున్నాడు. వెన్నెల వెలుగులో ఆమె కంటనీరు కనిపించింది.
“ఏం జరిగిందమ్మా?’ అడిగాడు గాబరాగా..
“నాన్నగారూ! నాకు మా అమ్మని చూడాలని ఉంది. అసలు మా అమ్మ ఎలా ఉంటుందో చూడాలని ఉంది. నన్ను మా అమ్మ దగ్గరకు తీసుకెళ్లరా?” అడిగింది కళ్లు తుడుచుకుంటూ…
ఆమె మాటలకు ఆశ్చర్యపోయిన శ్రీధŠర్…
“ప్రియా! విÖ అమ్మ ఇప్పుడు వాళ్ల ఊళ్లో లేదు. ఎక్కడ ఉందో తెలియదు. మీ అమ్మానాన్నల కోసం పోలీసులు వెతుకుతున్నారు.
వాళ్లు ఒక£వేళ మనరాకను పసిగడితే, మన ద్వారా మీ అమ్మను గురించి తెలుసుకొని అమెను అరెస్టు చేసే ప్రమాదం. కొన్నాళ్లు పోతే పరిస్థితులు చక్కబడవచ్చు. అప్పుడు తీసికెళ్లి చూపిస్తాను. మీ అమ్మ ఫొటో కావాలంటే మీ పెద్దమ్మ గౌరికి రాసి తెప్పిస్తాను. నువ్వు బాధపడకు. ధైర్యంగా ఉండు” అన్నాడు శ్రీధర్.
అతని మాటలకు ఆమె మౌనం దాల్చింది.
కానీ ఆ తెల్లవారు జామున ఆమెకు విపరీతంగా జ్వరం వచ్చింది. ఒళ్లు కాలిపోతోంది. “అమ్మా! అమ్మా” అంటూ కలవరింతలు. డాక్టరు వచ్చి మందులు ఇచ్చాడు.
“వాళ్లమ్మని చూడాలన్న కోరిక ఆమెలో బలంగా నాటుకు పోయింది. మందులు తాత్కాలికంగానే పనిచేస్తాయి. వీలైతే ఒకసారి వాళ్లమ్మను చూపిస్తే మంచిది” శ్రీధర్‌కు డాక్టరు సూచించాడు. సాయంత్రానికి ప్రియకు జ్వరం తగ్గింది.కానీ నీరసంగానే ఉంది. శ్రీధర్ స్కూలుకి సెలవు పెట్టి ఆమెని జాగ్రత్తగా గమనించసాగేడు.
ఆ రాత్రి భోజనాల తరువాత కౌసల్య, “ప్రియకి వాళ్లమ్మని చూపించడమే మంచిదనిపిస్తోంది. లేకపోతే అమ్మను చూడలేదన్న వేదన తన ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. అప్పుడు పరిస్థితి మన చెయ్యి దాటిపోవచ్చు. కాబట్టి రేపే కెంగువకు బయలు దేరదాం. కనీసం వాళ్ల పెద్దమ్మ గౌరినైనా చూసి సంతోషిస్తుంది. అక్కడ నుంచి వీలుంటే ధరణి దగ్గరకు వెళదాం. అలా చేయక£పోతే ప్రియ మన విÖద ద్వేషం పెంచుకునే అవకాశం లేకపోలేదు” అనిశ్రీధర్‌కు వివరించింది. రెండు రోజుల తరువాత అతను కౌసల్య, ప్రియతో కలసి కెంగువ బయలుదేరి వెళ్లాడు.
* * *
వాళ్లు కెంగువ చేరేసరికి సాయంత్రం ఐదు గంటలైంది.
చెప్పా పెట్టకుండా వచ్చిన శ్రీధర్ కుటుంబాన్ని చూసి గౌరి ఆశ్చర్యపోయింది. ముఖ్యంగా చెల్లెలు ధరణి కూతురు ప్రియని చూసి చాలా ముచ్చట పడింది. ఎప్పుడో మÖడేళ్ల వయసులో పిల్లను వాళ్ల చేతుల్లో పెట్టింది. ఇప్పుడు ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్న ప్రియను చూడగానే ఆమెకు ఆనందతో కంటనీరు తిరిగింది. ఆ రోజు శ్రీధర్ గాని దీనిని తీసికెళ్లకపోతే ఆ పిల్ల తన దగ్గరే సరియైన తిండి, సదుపాయాలు పెరిగేది.దానిని అలా పంపించడం మంచిదయింది. ఆరోగ్యంగా, అందంగా ఉంటూ బాగా చదువుకుంటోంది’ అనుకుంది గౌరి.
కాకపోతే శ్రీధర్ ఆమె పేరుని ‘ప్రియ’గా మార్చటం గౌరికి బాధ కలిగిం చింది. తన చెల్లలు ధరణి ఆ పిల్లకు పెట్టిన పేరు వనజ.ఆ పేరునే కుడి చెయ్యి విÖద పచ్చ బొట్టుగా పొడిపించింది కూడా.
ఆ రాత్రి వాళ్ల ముగ్గురికి వంటచేసింది గౌరి. భోజనాల తరువాత కౌసల్య, ప్రియ పడుకున్న తరువాత శ్రీధర్, తాము వచ్చిన పని గురించి గౌరికి చెప్పాడు. “గౌరీ! నీకిచ్చిన మాట ప్రకారం ఏ లోటు లేకుండా వనజను ఎంతో ముద్దుగా పెంచాం. అయితే ‘మేము తన కన్నవారం కామని, ఎక్కడి నుంచో తెచ్చి పెంచుకుంటున్నాం’ అని ఈ మధ్యనే ఎవరో దాని మనసుని పాడు చేశారు..
అప్పటి నుంచి దాని ప్రవర్తనలో బాగా మార్పు వచ్చింది. అంతవరకూ ఆరోగ్యంగా, చలకీగా ఉండే తనలో ఉత్సాహం తగ్గింది. నిర్లిప్తత పెరిగి పోయింది. తను ఎవరని ఒకరోజు నన్ను అడిగింది. ఆ వివరాలు చెప్పకూడదని ముందు అనుకున్నాను. కానీ దాంతో అనుమానం మరింత పెరిగి అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని చెప్పక నిజం చెప్పక తప్పలేదు.
తాము తన తల్లితండ్రులం కాదని తెలిసినప్పటి నుంచి ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది. తన అమ్మానాన్నలను, మరీ ముఖ్యంగా అమ్మ ధరణి చూడాలన్న కోరిక పెరగటం మొదలైంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆ కన్నతల్లికి తన పిల్లని చూపించకుండా చేసి ఆ పాపాన్ని మÖటకట్టుకోలేను. అదీగాక,తాను చాలా అనారోగ్యంతో.. క్షయతో బాధపడుతున్నానని, కూతురిని చూడాలని ఉందంటూ ధరణి ఉత్తరం రాసింది. నిన్ను కలిస్తే, తానున్న ప్రాంతం గురించి, అక్కడికి చేరే విధానం గురించి చెబుతావని రాసింది. అందుకే నీ దగ్గరికి వచ్చాము” వివరించాడు శ్రీధర్.
(సశేషం)

గన్నవరపు నరసింహ మూర్తి