భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది


‘‘‌నేను పెళ్లి చేసుకుంటున్నాను.’’.

ఆ మాటలు శూన్యంలోంచి వచ్చి, గాల్లో తేలుతూ,నా చెవిలోకి ప్రవేశించాయి. కాదు. వినిపించాయి.

తరవాత నిశ్శబ్దం.

ఏం చెప్తాడో! ఇంకా ఏం వినాలో!.

అటువైపు నుంచి ఏం శబ్దం రాలేదు.అంటే చెప్పడం అయిపోతుందన్నమాట.

అంతేనా! నాతో మాట్లాడేందుకు ఇంకేం లేదా! తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు? ఆ విషయాలు ఏవీనాకు తెలీకూడదా! ఆమె ఏం చదువుకుంది, ఏం చేస్తోంది ఇవన్నీ నాకు చెప్ప కూడదా… !

సన్నని బాధ గుండెని మెలి పెట్టింది.

నేనంటే లెక్కలేని వాడిని, లెక్కలేనంతగా ఇష్ట పడడం, నా బలహీనత.

ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి, వాడి దృష్టిలో చీప్‌ అయిపోయాను. నేను అది చేసిన తప్పు.

ఇది బాధ..కాని బాధ కన్నా వాడితో బంధం ముఖ్యం. వాడి కోసం భరించలేని బాధని భరిస్తూ వచ్చాను. ఇప్పుడు కూడా అంతే.

అవతల వాడు నా జవాబు కోసం ఎదురు చూస్తున్నాడనిపించింది.ఏదో ఒకటి చెప్పాలి.

నాకు తెలీకుండానే వాడు నా ప్రపంచంలోంచి, ఎప్పుడో వెళ్లిపోయాడు. నేనే మా బంధాన్ని వదులుకోడానికి ఇష్ట పడడం లేదు.

‘‘ కంగ్రాట్యులేషన్స్.’’ అం‌తకు మించి వేరే పదాన్ని వాడలేను.

మళ్లీ నిశ్శబ్దం.

వాడు చెప్పాల్సింది చెప్పాడు. నేను విన్నాను. అంతే. అందులో రమ్మన్న పిలుపు ఉందా! లేక అది వాడు నాకు ఇస్తున్న ఇన్ఫర్మేషనా!

ఎంత వెతికినా నువ్వు రావాలి, నువ్వు రాకపోతే నేను పెళ్లి చేసుకోను లాంటివి ఏం లేదు. అలాంటి అర్థం ఆ మాటల్లో నాకు కనిపించలేదు.

‘‘థాంక్స్ ‘‘ అన్నాడు. ఫోన్‌ ‌పెట్టేసిన శబ్దం. ఇంక మాట్లాడ్డానికి ఏం లేదు.

దీర్ఘంగా నిట్టూర్చి, మొబైల్‌ని వెనక జీన్స్ ‌పాకెట్‌లో పెట్టుకున్నాను.

 వాడు నాకన్నా పన్నెండేళ్లు చిన్నవాడు. అమ్మపని చేసుకుంటున్నప్పుడు నేనే వాడికి పాలు పట్టే దాన్ని. ఏడుస్తుంటే జోల పాడి, జోకొట్టి పడుకో పెట్టే దాన్ని. వాడు నేను పెంచిన వాడు. కాని, ఇప్పుడు శత్రువు. అమ్మా నాన్నా యాక్సిడెంట్‌లో రెండు రోజుల తేడాలో పోయారు.అప్పుడు నాకు పదహారేళ్లు. పంచరంగుల కలల ప్రపంచం లోంచి ఒక్కసారి వాస్తవాల, బాధ్యతల నేల మీద పడ్డాను. నా కోరికల్ని, ఆశలని, కలలని ఆ నేల కింద పూడ్చేసాను.

ఏడుస్తున్న వాడి కన్నీళ్లు తుడిచి హత్తుకున్నాను. ‘‘అమ్మా నాన్న లేకపోతేనేం నీకు నేనున్నాను’’ అన్నాను. ‘‘నీ బాధ్యత నాది. నిన్ను మంచి స్కూల్లో వేస్తాను’’ అన్నాను. నా మాటలు వాడికెంత అర్థం అయిందో తెలీదు.

 వాడికి అన్నీ నేనే. అమ్మా నాన్న లేరు అని వాడనుకోకూడదు. వాడిని మంచి స్కూల్లో వెయ్యాలి. మంచి జీవితం ఇవ్వాలి. మంచి స్కూలంటే డబ్బు కావాలి. అదే మాట. మమ్మల్ని వాళ్లింట్లో ఉంచుకుని, ఆదరిస్తున్న తాతగారు, మామయ్యలతో అన్నాను.

‘‘వద్దు, ఆ స్కూలు ఖరీదైనది. ఆ స్కూలు ఫీజులతో మేం తూగలేం. అంత తాహతు మాకు లేదన్నారు. నీ తాహతుకు తగ్గ స్కూలు దగ్గర్లో ఉంది. అందులో చేర్చు’’ అన్నారు.

‘‘అది నాకిష్టం లేదు.’’ అన్నాను,

‘‘ఇష్టం లేదంటే ఎలా? నువ్వు చిన్నపిల్లవి, నీకు పరిస్థితులు అర్థం కావడం లేదు. అలాంటి స్కూలంటే ఫీజులు అవీ ఎక్కువ, ఫీజు కట్టగానే సరిపోలేదు, అంతటితో అయిపోదు. ప్రతీ వ•డు నెలలకోసారి టర్మ్ ‌ఫీజంటారు…మరోటి మరోటి అంటారు. ఇవన్నీ డబ్బుతో కూడుకున్నవి. మనవల్లకాదు ఇవన్నీ. చిన్నపిల్లవి..నీతో కాదమ్మా మామాట విను, దగ్గరి స్కూల్లో వెయ్యి అది కూడా మంచి స్కూలే..’’

నేను వినలేదు.

‘‘పీజులెక్కువ కనకే, అంత డబ్బు లేదు కాబట్టి, అమ్మ బంగారం అమ్మాలనుకుంటున్నానని’’ చెప్పాను.

 ‘‘తప్పు తల్లీ! ఆ బంగారంలో మంగళసూత్రాలు కూడా ఉన్నాయి. వాటిని అమ్మకూడదు.అవి నీకోసం..నీ పెళ్లికోసం అట్టేపెట్టాం’’ అని తాతగారు, మావయ్యలు అన్నారు.

 ‘‘అమ్మే లేనప్పుడు ఆ బంగారం అదీ ఎవరికి తాతగారూ? నా పెళ్లి సంగతంటారా, నేను పెళ్లి చేసుకున్నప్పటి సంగతి కదా! ఇంక ఈ సూత్రాల సంగతంటారా.. పసుపు కొమ్ము కట్టుకుని, మంగళ సూత్రాలని అమ్మిన సీన్లు ఎన్నో సినిమాలలోచూసాం. అప్పుడు ఆ సెంటిమెంటు పనికొచ్చినప్పుడు ఇప్పుడు కూడా పనికొస్తుంది. అయినా మనకు బంగారం అనేది ఓ సెక్యూరిటీ. అవసరానికి ఉపయోగపడేది. ఇప్పుడు కూడా అంతే. ఈ విధంగా సమయానికి పనికొచ్చిందని తెలిస్తే అమ్మ కూడా సంతోషిస్తుంది. వాడికి మంచి ఎజ్యుకేషన్‌ ఇవ్వాలి,’’ అని అన్నాను,

‘‘నీకు తెలీదనుకుని చెప్పాం. కాదు, కూడదు అమ్ముతానంటే నీ ఇష్టం‘‘ అని అన్నారు.

వెంటనే బంగారంతో పాటు సూత్రాలని కూడా అమ్మేసి తమ్ముడిని మంచి ఇంటర్నేషనల్‌ ‌స్కూల్లో వేసాను.

ఆ స్కూలు, ఆ వాతావరణం, హాస్టల్‌ ‌జీవితం వాడికి నచ్చలేదు. నాకు ఎదురు తిరిగాడు. బాధపడలేదు. చిన్నవాడు, వాడికి ప్రపంచం తెలీదు.ఇప్పుడున్న జీవితం కన్నా ఇంకా మంచి జీవితం, మెరుగైన జీవితం కావాలంటే ఆ స్కూల్లో చేరాలన్నాను. మెల్లిగానచ్చ చెప్పి మళ్లీ హాస్టల్‌కి పంపాను.

స్కూల్లో చేర్చాను, తరవాత నెలనెలా డబ్బు… ఎలా…ఇప్పుడు వాడికి నెలనెలా పంపడానికి డబ్బుకావాలి, బంగారం అమ్మగా మిగిలింది వాడికి కొన్ని నెలలు హాస్టల్‌ ‌ఫీజ్‌గా పంపడానికి సరిపోతుంది.

ఆ తరవాత…..

అదే సమయంలో మామయ్యకి తెలిసిన వాళ్లమ్మాయి చంటిపిల్లని తీసుకుని దుబాయ్‌ ‌వెళ్తూంటే నన్ను ఆమెకి సాయంగా వెళతావా అని అడిగారు. ఇంటర్‌ ‌తో ఆగిన నా చదువు గురించి ఆ తరవాత నా జీవితం ఏంటీ అని ఆలోచించ లేదు. వెంటనే సరే అన్నాను.

 నేను నా వందొమ్మిదేళ్ల వయసులో డబ్బు సంపాదించడానికి ఆ అక్కతో దుబాయ్‌ ‌వెళ్లాను. వయసుకు మించిన కష్టం పడ్డాను. అలా అని అనుకోలేదు.

వీసా, వర్క్ ‌పర్మిట్‌, ఇన్సూరెన్స్ ‌వాళ్లదే. ఉండడానికి వసతి, బోజనం కాకుండా జీతం వెయ్యి దిరహంమ్‌లు అన్నారు. ఒక దిరహమ్‌ ఇరవై రెండు చిల్లర. రూపాయల్లోకి మార్చుకున్నాను. నాకు ఎక్కువే. సంతోషంగా ఒప్పుకున్నాను. నేను దుబాయ్‌లో, వాడు హాస్టల్లో, ఇంతకంటే కావల్సిందేం ఉంది.

ఆ మాత్రం చాలు. మా జీవితాలు గడిచిపోడానికి. వాడి చదువు వెళ్లిపోతుంది.

ఆర్నెల్లకోసారి అక్కతో ఇండియా వచ్చినప్పుడల్లా హాస్టల్‌ ‌కి వెళ్లి, చా క్‌లెట్లు, టీషర్టులు ఇచ్చేదాన్ని. సన్నటి మీసాలు, గడ్డం పెరగడం, వాడు పెరగడం అన్నీ చూసాను.

ప్రతీ నిమిషం మా ఇద్దరి మధ్యన దూరం పెరుగుతోంది అని తెలుసుకున్నాను. మా మధ్య మాటల్లేవు. నాలుగ్గోడల మధ్య కూడా ద్వీపాలం టాయి. ఎప్పుడైనా, ఎవరైనా ఇలా ఓ ద్వీపంలో ఉన్నారా, నేను ఇప్పడు అలాగే బందీ అయి ఉన్నాను అని అనుకునేదాన్ని.

ఎక్కడైనా పొరపాటు చేశానా? జీవిత పర్యంతం ఎన్నో అనుభవాలు. అన్ని జ్ఞాపకాలని తుడిచేయలేను. ఎందుకంటే అవి చేదు జ్ఞాపకాలు. అలా మిగిలి పోయాయి.

దారి దొరికితే వెళ్లిపోయే బంధాలు దారి దొరికే వరకు ఉంటాయి. వెళ్లడానికి వేరే దారులున్నానీ దారిలో నడిచే బంధమే నీతో చివరి వరకు ఉంటుంది.

 నా అదృష్టాన్ని అప్‌లోడ్‌ ‌చేయలేను. గడిచిన కాలాన్ని డౌన్‌లోడ్‌ ‌చెయ్యలేను.

ఈ గూగుల్‌ ‌నా జీవితంలోని ఎన్నో ప్రశ్నలకి సమాధానం ఇవ్వదు.

రియాలిటీలోకి లాగిన్‌ అవాల్సిందే.

 వెనక్కి తిరిగి చూసుకుంటే తెలుపు నలుపు గళ్ల జీవితం.

నీ బాధ్యత నెరవేర్చావు. కష్టపడ్డావు. అవును కష్టపడ్డాను. అన్నీ పర్ఫెక్ట్‌గా చేసాను అనుకున్నాను.

అక్క వాళ్లకి వేరే ఊరు షార్జా అయింది. వాళ్ల బాబు కూడా పెద్దవాడయ్యాడు. నా అవసరం లేదు.

అందుకే నాలుగిళ్లల్లో వంట పనికి కుదిరాను. షేరింగ్‌ ‌రూమ్‌లో ఉంటున్నాను.

 అన్నీ ఆ చిన్న తమ్ముడి కోసం ఈ కుటుంబం నడవడానికి చేసాను.

రామ చరణం… రామ చరణం… ఫోన్‌ ..‌తీసి చూసాను.

అది మేడమ్‌ ‌ఫోన్‌..

‌వంట ఏం చెయ్యాలో..కూర, దాల్‌, ‌సలాడ్‌, ‌చపాతీలు ఎన్ని చెయ్యాలో ఆవిడ చెప్పింది.

‘‘జీ మేమ్‌’’ అని ఫోన్‌ ‌నా వెనక పాకెట్‌లో పెట్టుకున్నాను.

ఆమె మాటలతో వెంటనే చార్జ్ అయ్యాను. ఆలోచనలు అన్నీ పక్కకి తోసాను. గంటలో వంట పనంతా చేసేసాను.

 మళ్లీ వాడి మాటలు. గింగురుమంటున్నాయి. మనసుని సముదాయించ లేక పోతున్నాను.పెళ్లికి రమ్మనలేదు. పిలిస్తే తప్పకుండా వెళ్లే దానిని. ఈ దుబాయ్‌ ‌నుంచి హైదరాబాదు ఎంతో దూరం కాదు. ఇప్పటికిప్పుడు ట్రావెల్స్ ‌వాళ్లతో మాట్లాడి టిక్కెట్‌ ‌కొనుక్కో గలను. లేకపోతే ఆ డబ్బుని వాడికి గిఫ్ట్‌గా పంపగలను.

కాని పిలవనప్పుడు ఎలా వెళ్తాను. పిలవకుండా వెళ్లాల్సిన దగ్గరితనం ఎప్పుడో పోయింది.

ఎదురుగా ఉన్న గోడ గడియారంలో టైం ఆరు అని చూపిస్తోంది. ఇంటికెళ్లే టైము. ఇంటికెళ్లాలని లేదు. ఎక్కడికైనా వెళ్లాలి. వాడి మాటల కాలుష్యం నుంచి దూరంగా వెళ్లాలి.నన్ను నేను రక్షించుకోవాలి, ఎక్కడికి… బీచ్‌. అవును అక్కడ కూచుని అన్ని మరిచి పోతాను.

నేను పని చేస్తున్న జుమేరా బీచ్‌ ‌రెసిడెన్సీ కాంప్లెక్స్ ‌నుంచి బయటికి వచ్చాను. అక్కడ అన్నీ ఐదు నక్షత్రాల హోటళ్లే. హిల్టన్‌, ‌డెల్టా ఇంకా చాలా చాలా హోటళ్లు. రెస్టారెంట్లు, రకరకాల మనుషుల్ని పిల్లలని, పిల్లలున్న ప్రామ్‌లని తోస్తున్న న్యానీలు, కుక్కపిల్లల్ని లాక్కెళ్తున్న పెద్దలని, అతి వేగంగా వెళ్తున్న ఈ-స్కూటర్లు, కరీమ్‌, ‌నూన్‌, ‌తలాబత్‌ ‌ఫుడ్‌ ‌డెలివరీ బైక్‌లు, ఫొటోలు తీసుకుంటున్న ఆడ మొగవాళ్లని, కార్లని, హొటల్‌ ‌వర్కర్లని వాళ్ల క్యాంపులకి తీసుకెళ్లే తెల్ల బస్సుల్ని దాటుకుంటూ, సముద్రం దగ్గరికి చేరుకున్నాను. సూర్యుడి ఆఖరు కిరణాలు చిన్న చిన్న అలల మీద పడి బంగారు రజనులా మారుతోంది. ఓవైపున ప్రపంచంలోకే పెద్ద ఐన్‌ (‌పెద్ద జైంట్‌ ‌వీల్‌.)

‌బీచ్‌ అం‌తా బిజీగా ఉంది.తెరచాప పడవలు, చిన్నా, పెద్దా క్రూస్‌ ‌పడవలు, యాట్‌లు, అన్నీ చూస్తున్నా కాని, వాడి మాటలు చెవుల్లో పదే పదే సముద్రంలో ముందు కదులుతున్న అలలల్లా మనసుని కల్లోలం చేస్తున్నాయి.

విసుగు లేని అలలు తీరాన్ని తాకుతున్నాయి.. విరిగి పోతున్నాయి, వెనక్కి వెళ్తున్నాయి నా జ్ఞాపకాల్లాగే. పోగేసిన జ్ఞాపకాలు, ఎదురయ్యే అనుభవాలు. జ్ఞాపకాలు పాతవే, అనుభవాలు పాతవే. ఇంక కొత్తదనం ఎక్కడుంది. ఏంటో పిచ్చి, వీటి మధ్య ఉన్న గాప్‌ని అప్పుడప్పుడుదగ్గర చేస్తూం టాను. ఓ చోట కూచుని, కళ్లు వ•సుకున్నాను.

హెమింగ్వే లా సముద్రంలోకి వెళ్లిపోయాను. తలత్‌ ‌లోకంలోకి వెళ్లాను ఆలోచనలకి అంతరాయం.

రామ చరణం…రామ శరణం…

ఫోన్‌ ‌తీసి చూసాను. పసరిక. మాతో రూమ్‌ ‌షేర్‌ ‌చేసుకునే రూమ్మేటు.

‘‘సప్నా, ఇవేళ మనం అందరం కలసి డిన్నర్‌ ‌చేస్తున్నాం. వంట కూడా కలిసి చేస్తున్నాం. కొన్ని కరీమ్‌తో తెప్పిస్తున్నాం. (కరీమ్‌ అం‌టే మన దగ్గర స్విగ్గీ లాంటి సర్వీస్‌.) ‌నువ్వు వచ్చెయ్యి.’’ అంది పసారిక.

మనసు కాస్త డైవర్ట్ అయింది.

పసారిక నేపాలీ అమ్మాయి. తెల్లగా లావుగా, ఎత్తుగా ఉంటుంది. ఒక రూమ్‌ ‌షేర్‌ ‌చేసుకునే మా ఎనిమిది మందిలో ఆమె ఒకత్తి. ఆమె కూడా నాలాగే వంట మనిషి. ఆమెకి పగలు వ•డిళ్లు, సాయంత్రం రెండిళ్లు ఉన్నాయి. ఆ రూమ్‌లో మా అందరికన్నా ముందు వచ్చేస్తుంది. మా అందరికి కలిపి ఒకటే బాత్రూమ్‌. ఎవరి టైమింగులు వాళ్లవి. మేం అందరం వచ్చేలోగా, ఆమె స్నానం, బట్టలుతుక్కోడం కూడా అయిపోతుంది..

పసారిక మాటలతో కాస్త ఉత్సాహం వచ్చింది. నా ఆలోచనలని వదిలి, మావ•లు మనిషిని అయ్యాను. వెంటనే లేచి, మనుషుల్ని దాటుకుంటూ జుమేరా బీచ్‌ ‌రెసిడెన్సీ ట్రాముస్టాప్‌ ‌వైపుగా వెళ్లాను. ఆ తరవాత ఏ ఆలోచనలు లేకుండా, ముందు ట్రామ్‌, ‌తరవాత మెట్రో, ఆఖరున బస్సులో వెళ్లి, కాస్త దూరం నడిచి, మా రూము కెళ్లాను.

అప్పటికే మా మంచాలమధ్య ఉన్నకొద్దిపాటి స్థలంలో ఓ దుప్పటి పరిచి వండిన గిన్నెలన్నీ మధ్యలో ఉంచారు. ఓ పక్కన ప్లేట్లు, లబాన్‌ ‌డబ్బాలున్నాయి. (లబాన్‌ అం‌టే ఇక్కడ దొరికే మజ్జిగ) కుబూస్‌లు. (ఇక్కడి చపాతీలు) ఆర్డర్‌ ‌చేసినవి కరీమ్‌ ‌కంపెనీ నుంచి వచ్చేసాయి.

తమ్ముడి మాటలు మర్చిపోయాను.

స్నానం చేసి, అద్దంలో మొహం చూసుకున్నాను. ఒత్తైన నల్లని జుట్టులో అక్కడక్కడా తెల్ల వెంట్రుకలు. నలభై దాటింది. నా జీవితాన్ని త్యాగం చేశాననుకోను.. అది నా బాధ్యత అంతే.

మళ్లీ తమ్ముడి మాటలు. ఆ వార్త విని నేను బాధ పడే వయసులో లేను. అందుకే కన్నీళ్లు పెట్టుకునే వయసు కూడా కాదు. గతం అంతా అలాచెత్తలోకి వెళ్లిపోయింది.

దానికోసం ఏదో శక్తిని ఎక్కడి నుంచో తెచ్చుకోవాలని లేదు. చిన్నప్పుడు వాడు ఏడుస్తూంటే జోల పాడి నిద్రపుచ్చేదాన్ని. వాడు ఇప్పుడు నాకు నిద్రని దూరం పెట్టాడు. నాకు జోల ఎవరు పాడాలి. నాకు నేనే పాడుకోవాలి.

ఏం చెయ్యాలి? వాడితో ఎదురుగా నుంచుని మాట్లాడితే…నా బలహీనతలని, నా ఓటములు అన్నీ సరిచేసుకున్నట్లవుతుందా!

ఇప్పుడు నీకు నలభై ఏళ్లు. ఇప్పుడు ఈ వయసులో నీ తమ్ముడు గురించి బాధపడుతూ ఉండడం ఎందుకు నీకు ఓ చక్కటి అవకాశం ఇచ్చాడని అనుకో.

ఎందుకు ఇలా జరిగింది. ఎక్కడైనా పొరపాటు చేశానా?

‘‘సప్నా క్విక్‌ …’’ అం‌దరం కూచున్నాం. అంటూ నా వైపు చూసింది పసారిక.

‘‘వస్తున్నా’’ అంటూ నాదగ్గర ఉన్న పచ్చళ్లూ, అవీ మధ్యలో పెట్టాను.

అప్పుడు నాకు ఓకొత్త అమ్మాయి కనిపించింది

‘‘ఈమె పేరు వహీదా. ఇప్పటి నుంచి మనతో ఉంటుంది.’’

ఆమె తన పెద్దకళ్లెత్తి చూసింది.

ఆమె నిశ్శబ్దంగా ఉంది. తరవాత తెలిసింది. పెళ్లి చేసుకున్నాడు, కడుపు అని తెలియగానే తలాక్‌ ‌తలాక్తలాక్‌ అని వదిలి పెట్టాడు.

వెంటనే ఆమె కడుపు వైపు చూసాను.

చంటిపిల్లాడిని వదిలి వచ్చింది.

ఆ పిల్లాడు ఆమెకి ఓ బరువైన బంధం. అయినా వాడికోసం కష్టపడుతోంది. ఆమెకి నిండా పాతికేళ్లు లేవు.

ఏజెంటు ద్వారా దుబాయ్‌ ‌గ్రీన్స్‌లో, ఫిలిప్పీన్స్ ఇం‌ట్లో పని చేయడానికి వచ్చింది.

ఆలోచనలో పడ్డాను, మా బాధల్లో ఎవరిది ఎక్కువ?

 మా ఇద్దరిని ఓ త్రాసులో వేసి తూస్తే, తక్కెడ ఆమె వైపు కిందకి వంగిపోతుంది. నిజమే ఆమె బాధ కన్నా నాది చాల చిన్నది. అలా అనుకోగానే నా మనసు తేలికైంది. తేలికైన మనసుకి జోల ఎవరూ పాడక్కర్లేదు.

– ‌గంటి భానుమతి

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.