స్వాతంత్య్రదినోత్సవ వేడుకల సందర్భంగా వందేమాతరం పట్ల కాంగ్రెస్ నాయకత్వం కనబరిచిన అసహనం, కేరళ, ఇతర చోట్ల జరిగిన ఇలాంటి వివాదాలతో పాటు, జాతీయ, నాగరికతా చిహ్నాల పట్ల ఆ పార్టీ వైఖరిపై విమర్శలకు దారితీసింది. ఒకప్పుడు బ్రిటిష్ వారు ‘‘వందేమాతరం’’ పిలుపునకు భయపడేవారు. కానీ 2026 స్వాతంత్య్ర దినోత్సవం నాడు, అదే శాశ్వత నినాదం పట్ల కాంగ్రెస్ నాయకత్వం స్పష్టంగా అసహనంతో కనిపించింది. న్యూఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో పూర్తి వందేమాతరం గీతం ఇంకా వినిపిస్తున్నప్పటికీ, సోనియాగాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ మాట్లాడుకుంటూ, హావభావాలు ప్రదర్శిస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. గంభీరమైన స్మరణ క్షణంగా ఉండాల్సిన ఆ సందర్భం, భారతదేశ జాతీయ, నాగరికతా చిహ్నాలతో కాంగ్రెస్‌కు ఉన్న ఇబ్బందికరమైన సంబంధానికి మరో ఉదాహరణగా ముగిసింది.
ఢిల్లీ ఉదంతం ఒక్కటే వివాదం కాదు. ఎందుకంటే పూర్తి గీతాన్ని ఆలపించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినప్పటికీ, కేరళలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తమ అధికారిక స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమం నుండి ‘‘వందేమాతరం’’ను మినహాయించింది. అంతకు ముందు, కేరళ అసెంబ్లీ ప్రారంభ సమావేశంలో ఈ గీతం వివాదాన్ని రేకెత్తించింది. అదే రాష్ట్రానికి చెందిన మంత్రుల్లో ఒకరు తాను పూర్తి గీతాన్ని పాడేది లేదని బహిరంగంగా ప్రకటించారు. అదే సమయంలో, కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ తాను గౌరవ సూచకంగా నిలబడతానని, కానీ ఆ గీతాన్ని పాడేది లేదని చెప్పారు. అంతకుముందు ఇండోర్‌కు చెందిన ఒక కాంగ్రెస్ కార్పొరేటర్ కూడా ఇలాంటి ప్రకటననే చేశారు. ‘‘వందేమాతరం’’ పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న అసహనం ఒక్క సంఘటనతో ముడిపడింది కాదని, అది ఒక రాజకీయ ప్రతిచర్య అనే భావనను పై ఘటనలు బలపరిచాయి. ప్రతి పౌరుడికి వారి వ్యక్తిగత నమ్మకాలు, రాజ్యాంగ స్వేచ్ఛలు ఉంటాయి. ఏ మతాన్ని అపహాస్యం చేయకూడదు. కానీ కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీ తన దేశ వ్యతిరేక రాజకీయ సంస్కృతిని ఇప్పటికీ కొనసాగిస్తోంది. ఎందుకంటే, ఒక జాతీయ చిహ్నాన్ని పూజించే లక్షలాది మంది ప్రజల మనోభావాల కంటే, దానికి వ్యతిరేకంగా జరిగే నిరసనలే నిరంతరం ఎక్కువ ఆందోళనను రేకెత్తించినప్పుడు, ఈ ధోరణిని ఇకపై కేవలం యాదృచ్ఛికం అని కొట్టిపారేయలేము. సాంస్కృతిక జాతీయవాదానికి వ్యతిరేకంగా వచ్చే ప్రతి అసమ్మతిని ప్రోత్సహించి, ఆపై జాతీయ స్మృతిని కాపాడాలనుకునే వారిలో విభజన సృష్టిస్తున్నారని ఆరోపించడం కాంగ్రెస్ నైజం. ఢిల్లీ, కేరళ, ఇండోర్ లలో జరిగిన ఘటనలు ఆ దిశగా కాంగ్రెస్ ప్రతిచర్యను వెల్లడిస్తున్నాయి. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హాజరైన గోవాలోని ఒక కాంగ్రెస్ కార్యక్రమంలో, పార్టీ కార్యకర్తలు వందేమాతరం మొదటి రెండు చరణాలను మాత్రమే పాడినట్లు సమాచారం. పార్టీ కార్యక్రమాలలో మొదటి రెండు చరణాలను మాత్రమే పాడాలన్న తమ 1937 నాటి వైఖరిని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పునరుద్ఘాటించిన కొద్దిరోజులకే ఈ సంఘటన జరిగింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ ‘‘తీవ్రమైన బుజ్జగింపు విధానానికి’’ నిదర్శనంగా విమర్శించారు. అంతేకాకుండా, ఆ గీతాన్ని చారిత్రాత్మకంగా కుదించడం బంకించంద్ర చటోపాధ్యాయకు, దాని నుండి స్ఫూర్తి పొందిన స్వాతంత్య్ర సమరయోధులకు అవమానమని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ దీనిని ఒక చారిత్రక తీర్మానాన్ని పునరుద్ఘాటించడంగా పేర్కొనవచ్చు. కానీ రాజకీయ ఐక్యతను సాధించాలనే ఆశతో, 1919లో కాంగ్రెస్ నాయకత్వం ఒక నిర్దిష్ట మత-రాజకీయ డిమాండ్‌ను విస్తృత జాతీయవాద వ్యూహంలో భాగంగా మారడానికి అనుమతించిన ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం లాంటిదేనా ఇది? అనే ఒక ఇబ్బందికరమైన ప్రశ్నను చరిత్ర లేవనెత్తుతుంది. ఈ పోలిక కచ్చితమైనది కాదు. ఈ రెండు సంఘటనలు చాలా భిన్నమైన పరిస్థితులకు చెందినవి. కానీ దీని వెనుక ఉన్న రాజకీయ వైఖరి పరిశీలనకు అర్హమైనది.
వందేమాతరంతో తనకున్న సంబంధంపై ప్రశ్నలను ఎదుర్కోవడం కాంగ్రెస్‌కు ఇది మొదటిసారి కాదు. •••పీఏ హయాంలో, 2006లో జాతీయ గీతం వేడుకలు వివాదాస్పదమయ్యాయి. వాటిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కార్యక్రమానికి పార్టీ అప్పటి అధ్యక్షురాలు సోనియా గాంధీ హాజరు కాలేదు. ఆమె గైర్హాజరును బీజేపీ విమర్శించగా, ఆమెకు ఇతర కార్యక్రమాలు ఉన్నాయని కాంగ్రెస్ సమర్థించుకుందని ఆనాటి నివేదికలు పేర్కొన్నాయి. నిరసనల నేపథ్యంలో వందేమాతరం గీతాన్ని ఆలపించడాన్ని ఐచ్ఛికం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం కూడా ఈ వివాదంలో భాగమైంది. అయితే ఒక కార్యక్రమానికి హాజరు కాకపోవడం ఒక్కటే అగౌరవాన్ని రుజువు చేయదు. అలాగే, వందేమాతరం ఆలపించే విధానంపై ప్రతి విభేదాన్ని దేశభక్తికి పరీక్షగా మార్చకూడదు. కానీ 2006 నాటి సంఘటనను, 1937 నాటి వారసత్వాన్ని, 2026లో కాంగ్రెస్ పునరుద్ఘాటనను పక్కపక్కన పెట్టి చూసినప్పుడు, ఒక సంకుచితమైన రాజకీయ ధోరణిని విస్మరించడం కష్టమవుతుంది.
తన ధోరణిని సమర్థించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రతిసారీ లౌకికవాదాన్ని తెర మీదకు తెస్తుంది. తద్వారా లౌకికవాదాన్ని వక్రీకరిస్తుంది. ఎందుకంటే నిజమైన భారత లౌకికవాదం ప్రతి పంథాను గౌరవిస్తుంది కానీ నాగరికతను మరచిపోయేలా చేయదు. వందేమాతరం ఏ భారతీయుడినీ తమ విశ్వాసాన్ని వదులుకోమని అడగదు. కానీ అందరికీ చెందిన మాతృభూమికి వందనం చేయమని పౌరులను కోరుతుంది. కాంగ్రెస్ పదేపదే సాంస్కృతిక ఆత్మవిశ్వాసాన్ని ఒక మతపరమైన ప్రశ్నగా మార్చగా, దాని పక్షపాత లౌకికవాదం భారతదేశంలోని మెజారిటీ ప్రజలు తమ సొంత పదజాలానికి క్షమాపణ చెప్పాలని ఆశిస్తుంది. జాతీయ చిహ్నాలను ధిక్కరించడాన్ని రాజకీయంగా ఉపయోగపడే సున్నితత్వంగా చూస్తుంది.
అందువల్ల బీజేపీ విమర్శ కేవలం కాంగ్రెస్ కార్యకర్తలు రెండు చరణాలు పాడతారా? లేక ఐదు పాడతారా? అనే దాని గురించి మాత్రమే కాదు. దీని వెనుక ఉన్న లోతైన సమస్య సైద్ధాంతికమైనది. భారతదేశ జాతీయ గుర్తింపును మతపరమైన గుర్తింపు సున్నితత్వాల ద్వారా నిరంతరం చర్చించు కోవాలా? లేదా ప్రతి పౌరునికి సమాన గౌరవం, రాజ్యాంగ హక్కులను కల్పిస్తూనే, భారతదేశం తన సొంత నాగరిక చరిత్ర ద్వారా తన జాతీయ చిహ్నాలను నిర్వచించుకోగలదా? అనే రెండు ప్రశ్నలు అనాదిగా చర్చనీయాంశాలుగా పదేపదే తెరమీదకు వస్తున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలు చాలా కాలంగా రెండవ దానికే మొగ్గు చూపుతున్నాయి. ప్రతి పౌరుడిని ఒక జాతీయ చిహ్నాన్ని గౌరవించమని అడగడంలో అంతర్గతంగా మైనారిటీ వ్యతిరేకత ఏమీ లేదు. అదేవిధంగా, ఒక నిర్దిష్ట మత వర్గాన్ని నొప్పించకుండా ఉండేందుకు జాతీయ-సాంస్కృతిక వ్యక్తీకరణలను పదేపదే సవరించడంలో అంతర్గ తంగా లౌకికవాదం ఏమీ లేదు. నిజమైన లౌకిక వాదం అంటే మెజారిటీ ప్రజల నాగరిక పదజాలాన్ని నిరంతరం పలుచన చేయాలని కాదు. అలాగే, నిజమైన జాతీయవాదానికి ఏ వర్గాన్ని ద్వేషించాల్సిన అవసరం లేదు. దేశానికే ప్రథమ ప్రాధాన్యత, ప్రతి వర్గం జాతీయ గుర్తింపులో సమాన భాగస్వామిగా పాలుపంచుకోవాలి అనే సరైన సూత్రం అత్యంత సరళమైనది.
వందేమాతరం 150 ఏళ్ల ఉత్సవాల సందర్భంగా పార్లమెంటులో జరిగిన ప్రత్యేక చర్చలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ, దీనికి సంబంధించిన చారిత్రక క్రమాన్ని ప్రస్తావించారు. అక్టోబర్ 15, 1937న లక్నోలో జిన్నా దీనిని వ్యతిరేకించిన విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. అలాగే, సుభాష్ చంద్రబోస్‌కు జవహర్‌లాల్ నెహ్రూ అక్టోబర్ 20న రాసిన లేఖను కూడా ఆయన ప్రస్తావించారు. ఆ లేఖలో, ఆ గీతానికి ఉన్న ఆనందమఠ్ నేపథ్యం ముస్లింలను రెచ్చగొట్టవచ్చని నెహ్రూ ఆందోళన వ్యక్తం చేశారు. సరిగ్గా ఇక్కడే సమకాలీన కాంగ్రెస్ వైఖరి చారిత్రాత్మకంగా ప్రాముఖ్యతను సంతరించు కుంటుంది. 2026లో, కాంగ్రెస్ కేవలం ఒక పాత సంగీత సంప్రదాయాన్ని అనుసరించడం లేదు. మతతత్వ రాజకీయాలు తీవ్రమవుతున్నప్పుడు, ముస్లిం లీగ్ తన ప్రత్యేక రాజకీయ గుర్తింపును అంతకంతకూ నొక్కిచెబుతున్నప్పుడు తీసుకున్న ఒక నిర్ణయాన్ని అది స్పృహతో పునరుద్ధరిస్తోంది. బహుశా అత్యంత శక్తిమంతమైన వైరుధ్యం ఏమిటంటే, దీనికి సమాధానం కాంగ్రెస్ సొంత చరిత్రలోనే ఉంది. 1923లో, విష్ణు దిగంబర్ పాలుస్కర్ ఒక జాతీయ రాజకీయ వేదిక మతపరమైన వీటోకు లోబడి ఉండటానికి నిరాకరించారు. 1937లో, కాంగ్రెస్ రాజీని ఎంచుకుంది. 1950లో, గణతంత్రం వందేమాతరంనకు సమాన జాతీయ గౌరవ స్థానాన్ని పునరుద్ధరించింది. ఇక 2026లో, కాంగ్రెస్ 1937 నాటి సూత్రానికి తిరిగి వెళ్లాలని ఎంచుకుంది. ఇది ఒక పెద్ద జాతీయ చర్చను రేకెత్తించాలి. ఇది కేవలం చారిత్రక కొనసాగింపు మాత్రమేనా.. లేక ఒక పాత రాజకీయ ప్రవృత్తి తిరిగి రావడమా? ఖిలాఫత్ అనుభవం నేపథ్యంలో చూసినప్పుడు ఈ ప్రశ్న మరింత సందర్భోచితంగా మారుతుంది. 1919లో, కాంగ్రెస్ మతపరంగా నిర్వచించిన ఒక ఉద్యమానికి మద్దతు ఇవ్వడం ద్వారా రాజకీయ ఐక్యతను కోరింది. 1937లో, మత సామరస్యం పేరుతో ఒక జాతీయ గీతంపై వచ్చిన అభ్యంతరాలను అది సర్దుబాటు చేసుకుంది. 2026లో, మతపరమైన సర్దుబాటు రాజకీయాలలో వ•లాలున్న ఒక చారిత్రక ఆంక్షను అది మరోసారి సమర్థిస్తోంది. సందర్భాలు వేరు కావొచ్చు. అయితే, దీని వెనుక ఉన్న రాజకీయ తర్కం మాత్రం పరిశీలనకు అర్హమైనది. వందేమాతరం హిందూ-ముస్లింల మధ్య పోరాటం గురించి కాదు. వందేమాతరం, భారత్ ఏదో ఒక మత వర్గానికి చెందినదని ప్రకటించే గీతం కాదు. అది మాతృ భూమి పట్ల గౌరవానికి చిహ్నం. ఒక ముస్లిం, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ, జైన లేదా హిందూ పౌరుడు అందులోని భావాలను వేర్వేరుగా అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ గీతం జాతీయ అర్థం, స్వాతంత్య్ర పోరాటంలో దానికి ఉన్న స్థానాన్ని చిరంజీవిని చేస్తుంది.అందులోని పదాలు వలస పాలనకు వ్యతిరేకంగా అక్షరబద్ధ మయ్యాయి. ప్రతిఘటనను నినాదంగా మార్చుకున్న తరాల త్యాగాల నుండి వందేమాతరం పురుడు పోసుకుంది. అందువల్ల, విభేదాలకు సరైన ప్రతి స్పందన సంభాషణే అయి ఉండాలి తప్ప చారిత్రక విస్మృతి కాదు. వీటోల ద్వారా భారత జాతీయ గుర్తింపును నిర్మించలేము. అలాగే స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను ఎంపిక చేసుకుని గుర్తుంచుకోలేము. తన పార్టీ కార్యక్రమా లలో ఏమి పాడాలో నిర్ణయించుకునే పూర్తి రాజ్యాంగ హక్కు కాంగ్రెస్‌కు ఉంది. అయితే, ఆ నిర్ణయం 1937 నాటి రాజకీయ రాజీని స్పృహతో పునరుద్ధరించి నప్పుడు, తన నాగరికతా స్వీయ-వ్యక్తీకరణ కోసం భారత్‌ను పదేపదే చర్చలు జరపమని కోరిన బుజ్జగింపు రాజకీయాలను మనం నిజంగా అధిగమించామా? లేక ఒక కొత్త రాజకీయ రూపంలో దాని పునరాగమనాన్ని మనం చూస్తున్నామా? అనే సముచితమైన చారిత్రక ప్రశ్నను కూడా అది లేవనెత్తుతుంది.
చట్టం చాలా స్పష్టంగా ఉంది. వందేమాతరం పాడాలని అది ఎవరినీ నిర్బంధించదు. కేవలం ఉద్దేశపూర్వకంగా ఎవరైనా వందేమాతరం పాడటాన్ని అడ్డుకున్నా లేదా దానిని ఆలపిస్తున్న సభకు అంతరాయం కలిగించినప్పుడు మాత్రమే అలాంటి వారిని శిక్షిస్తుంది. ఈ శిక్షలో వ•డేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ ఉండవచ్చు. ఈ విధంగా, మోదీ ప్రభుత్వం చట్టపరమైన ఒక దీర్ఘకాలిక లోపాన్ని సరిదిద్దింది. అయినప్పటికీ, కాంగ్రెస్ నాయకులు మాత్రం అదే జాతీయ వారసత్వం విషయంలో సంకోచాన్ని, షరతులతో కూడిన వైఖరిని, అసహనాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అందువల్ల, కాంగ్రెస్ బేషరతుగా క్షమాపణ చెప్పాల్సింది బీజేపీకి కాదు, భారతదేశానికి, బంకిం చంద్ర చటర్జీకి, వలసవాదశక్తికి వ్యతిరేకంగా పోరాడిన విప్లవకారులకు, వందేమాతరంను జాతీయ ప్రశంసా వాక్యంగా భావించే ప్రతి పౌరునికి. రాజకీయ పార్టీలు రావచ్చు పోవచ్చు, రాజవంశాలు సాకులు చెప్పవచ్చు. సిద్ధాంతాలు స్మృతిని మరుగు పరచడానికి ప్రయత్నించవచ్చు, కానీ మాతృభూమికి చేసే వందనాన్ని నిలిపివేయలేరు. బేరసారాలకు లోనుకాలేరు. లేదా తుడిచివేయలేరు. వందే మాతరంలో రెండు చరణాలు మాత్రమే పాడుతాం అంటూ కాంగ్రెస్ చేసిన తీర్మానం పట్ల దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. ఈ నిరసన పట్ల కాంగ్రెస్ పాటిస్తున్న వ్యూహాత్మక మౌనం భారతదేశం పట్లనే ఒక లోతైన సైద్ధాంతిక అశాంతిని ప్రతిబింబిస్తున్నది. కాబట్టి కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే వందేమాతరం యావత్ భారతీయులకు అత్యంత గౌరవప్రదమైనది, గర్వకారణమైనది కాబట్టి.
– జాగృతి డెస్క్