జూన్ 10, 2026 భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక కీలకమైన ఘట్టం. ఈ రోజున, ఎన్నికైన ప్రధానమంత్రిగా వరుసగా 4,398 రోజులు పదవిలో కొనసాగిన జవాహర్‌లాల్ నెహ్రూ రికార్డును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధిగమించారు. రాజకీయ మైలురాళ్లను తరచుగా కేవలం గణాంకాలుగా మాత్రమే చూస్తుంటారు. కానీ ఈ సందర్భం మరింత లోతైన పరిశీలనకు అర్హమైనది. ఇది కేవలం పదవిలో గడిపిన రోజుల సంఖ్యకు సంబంధించిన విషయం కాదు. భారతదేశపు తొలి ప్రధానమంత్రి, ప్రస్తుత ప్రధానమంత్రి పదవీకాలాలను తీర్చిదిద్దిన విభిన్న రాజకీయ పరిస్థితులు, సైద్ధాంతిక దృక్పథాలు, దేశం పట్ల వారికున్న భిన్నమైన దార్శనికతలకు సంబంధించిన విషయం ఇది. నెహ్రూ, మోదీల మధ్య పోలిక అనేది కేవలం ఇద్దరు నాయకుల మధ్య పోలిక మాత్రమే కాదు. అనేక కోణాల్లో చూస్తే, ఇది భారతదేశం గురించిన రెండు భిన్నమైన, పరస్పర పోటీతత్వం కలిగిన భావనల మధ్య పోలిక.
ఈ రికార్డు ప్రాముఖ్యత
ఈ రికార్డుకి సంబంధించిన బహిరంగ చర్చలో ఎక్కువ భాగం పదవీకాలం (tenure) గురించే సాగింది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన వ్యత్యాసాన్ని గుర్తించాల్సి ఉంది. ఆగస్టు 15, 1947 నుండి 1964 మేలో మరణం వరకు ప్రధానమంత్రిగా జవాహర్‌లాల్ నెహ్రూ పనిచేశారు. అయితే, ఆ పదవీకాలంలో మొదటి 1,732 రోజులు ఆధునిక ప్రజాస్వామ్య కోణంలో ఆయన ఎన్నికైన ప్రధానమంత్రి కాదు. వలస పాలన ముగింపు (decolonisation) నాటి అసాధారణ పరిస్థితులలో, స్వాతంత్య్రంతో పాటు వచ్చిన రాజకీయ ఏర్పాట్లు, కాంగ్రెస్ నాయకత్వం తీసుకున్న నిర్ణయాల ద్వారా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. భారతదేశంలో మొదటి సాధారణ ఎన్నికలు 1951-52లో మాత్రమే జరిగాయి. ఆ తర్వాతే ప్రజాస్వామ్యబద్ధమైన తీర్పు ద్వారా నెహ్రూ ప్రధానమంత్రి అయ్యారు.
నరేంద్ర మోదీ పదవీకాలం ఒక భిన్నమైన కథనాన్ని ఆవిష్కరిస్తుంది. మే 26, 2014న ప్రారంభమైన ఆయన ప్రధానమంత్రిత్వంలోని ప్రతి రోజూ ఎన్నికల ద్వారా లభించిన చట్టబద్ధతతోనే కొనసాగింది. మూడు సాధారణ ఎన్నికలు, వరుసగా మూడుసార్లు ప్రజల తీర్పు పొందడం, భారత ప్రజల నుండి నిరంతర ప్రజాస్వామ్య ఆమోదం లభించడం వంటివి ఆయన ప్రస్థానాన్ని నిర్వచించాయి. ఈ వ్యత్యాసం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది భారతదేశ ప్రజాస్వామ్య పరిపక్వతను నొక్కి చెబుతుంది. మోదీ రికార్డు కేవలం సుదీర్ఘ కాలానికి సంబంధించినది మాత్రమే కాదు, అత్యంత పోటీతత్వంతో కూడిన రాజకీయ వాతావరణంలో పదేపదే ఎన్నికల ద్వారా లభించిన ఆమోదం (validation)తో పూర్తిగా సాధించిన రికార్డు ఇది.
ఆధిపత్య పాలన వర్సెస్ సంకీర్ణ పాలన
ప్రజాస్వామ్య రాజకీయాల దృష్టితో చూసినప్పుడు ఈ వ్యత్యాసం మరింత స్పష్టమవుతుంది. నెహ్రూ హయాం రాజకీయ వ్యవస్థలో కాంగ్రెస్ పార్టీ అఖండమైన ఆధిపత్యాన్ని చెలాయించింది.1952, 1957, 1962 ఎన్నికలలో, ఏ ప్రతిపక్షం కూడా గట్టి పోటీదారుగా నిలవలేదు. ఈ రోజు ఊహించ డానికే కష్టమైన స్థాయిలో కాంగ్రెస్ పార్లమెంటరీ ఆధిపత్యాన్ని సాధించింది. భారత్ వాస్తవానికి ఏక-పార్టీ ఆధిపత్య రాజ్యంగా ఉండేది. దీనికి విరుద్ధంగా, మోదీ మరింత పోటీతో కూడిన ప్రజాస్వామ్యంలో పనిచేస్తున్నారు. ప్రతి రాష్ట్ర ఎన్నిక జాతీయ పరిణామాలను కలిగి ఉంటుంది. ప్రతి పార్లమెంటరీ ఎన్నిక తీవ్రమైన పరిశీలన మధ్య జరుగుతుంది. సంకీర్ణ సమీకరణాలు, ప్రాంతీయ ఆకాంక్షలు, సోషల్ మీడియా వ్యవస్థలు, న్యాయ పర్యవేక్షణ, అలుపెరుగని ప్రతిపక్షం వంటివి రాజకీయ అధికారం నిరంతరం తనను తాను పునరుద్ధరించుకోవాల్సిన వాతావర ణాన్ని సృష్టిస్తాయి. అందుకే మోదీ సాధించిన విజయం స్వాతంత్య్రం తర్వాత కాంగ్రెస్ ఆధిపత్య విజయం కంటే, ఏంజెలా మెర్కెల్ వంటి ఆధునిక ప్రజాస్వామ్య నాయకుల విజయంతో ఎక్కువగా పోలి ఉంటుంది. ఆయన సుదీర్ఘ పాలన రాజకీయ గుత్తాధిపత్యం వల్ల వచ్చినది కాదు. అది రాజకీయ అనుకూలత, నిరంతర ప్రజా మద్దతు ఫలితంగా సాధ్యపడింది. అందువల్ల, ఆయన పనితీరు కేవలం ఓర్పునే కాకుండా ప్రజాస్వామ్య స్థితిస్థాపకతను కూడా చాటి చెబుతుంది.
వలసానంతర ప్రభుత్వం నుండి ప్రజా ప్రభుత్వం వైపు
మోదీ శకపు లోతైన ప్రాముఖ్యత ఎన్నికల విజయానికి అతీతంగా ఉంది. నెహ్రూవాదం ప్రధానంగా ఐరోపా రాజకీయ భావజాలం నుండి ఉద్భవించిన సంస్థల ద్వారా ఒక ఆధునిక జాతి-రాజ్యాన్ని నిర్మించాలని కోరింది. ప్రణాళిక, కేంద్రీకరణ, లౌకికవాదం, ఆర్థిక సామ్యవాదంపై ఇది దృష్టి సారించింది. ఈ ప్రయత్నాలు కొత్తగా స్వాతంత్య్రం పొందిన దేశాన్ని స్థిరీకరించడంలో సహాయపడినప్పటికీ, అవి భారతదేశం గురించిన ఒక అనూహ్యమైన దృక్పథాన్ని కూడా ప్రోత్సహించాయి. ఆ దృక్పథం కారణంగా భారత్ దాని నాగరికత పట్ల స్వీయ-అవగాహనను విస్మరిస్తున్న ట్టుగా కనిపించేది. దశాబ్దాలుగా, నాగరికతపై విశ్వాస ప్రకటనలను అనుమానంతో చూశారు. హిందూ నాగరికతా చైతన్యం బహిరంగ వ్యక్తీకరణను తరచుగా మతతత్వ దృష్టితో చూశారు. దండయాత్రలు, వలసవాదం వల్ల కలిగిన చారిత్రక గాయాలను ప్రభుత్వం ప్రాయోజిత జాతీయ సమైక్యత కథనం కోసం పదేపదే తక్కువ చేసి చూపించారు. స్వాతంత్య్రం తర్వాత సోమనాథ్ ఆలయ పునర్ని ర్మాణం ఈ వైఖరిని వెల్లడించింది. కె. ఎం. మున్షీ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ వంటి నాయకులు ఈ ప్రాజెక్టును నాగరికత పునరుద్ధరణ చర్యగా భావించినప్పటికీ, దానితో ప్రభుత్వం బహిరంగంగా సంబంధం కలిగి ఉండటం పట్ల నెహ్రూ అసహనం వ్యక్తం చేశారు. మోదీ శకం ఈ చట్రం నుండి ఒక ముఖ్యమైన మార్పును సూచిస్తుంది. రామ మందిర ప్రతిష్ఠ, రాజ్‌పథ్‌ను కర్తవ్య పథ్‌గా మార్చడం, చోరీకి గురైన పురాతన వారసత్వ సంపదను ప్రతిబింబించే వస్తువులు తిరిగి స్వాధీనం చేసుకోవడం, లచిత్ బోర్ఫుకాన్, బిర్సా ముండా వంటి విస్మరణకు గురైన వీరులను స్మరించుకోవడం, భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని పునరుద్ఘాటించడం వంటివి పరిపాల నను నాగరిక స్మృతితో తిరిగి అనుసంధానించడానికి చేసిన ఒక స్పృహతో కూడిన ప్రయత్నాన్ని ప్రతిబింబి స్తాయి. విమర్శకులు వీటిని కేవలం ప్రతీకాత్మక చర్యలుగా కొట్టిపారేయవచ్చు. అయినప్పటికీ, చిహ్నాలకు ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే దేశాలు కేవలం సంస్థల ద్వారానే కాకుండా సామూహిక స్మృతి, సాంస్కృతిక విశ్వాసం ద్వారా కూడా నిలబడతాయి.
ప్రభుత్వం-ప్రజల సంబంధం పునరుద్ధరణ
మోదీ హయాంలో అత్యంత కీలకమైన పరివర్తన బహుశా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉన్న సంబంధంలోనే జరిగింది. దశాబ్దాలుగా, భారతదేశంలో సంక్షేమ పథకాల పంపిణీ మధ్యవర్తుల ద్వారా జరిగేది. ప్రయోజనాల లభ్యత తరచుగా స్థానిక అధికార వ్యవస్థలు, అధికార యంత్రాంగం విచక్షణ, రాజకీయ అండపై ఆధారపడి ఉండేది. ప్రభుత్వం దూరంగా ఉన్నట్లు కనిపించేది. ప్రజలు ప్రభుత్వంలో భాగస్వాములుగా కాకుండా దానిని విన్నపదారులుగా సంప్రదించేవారు. మోదీ ప్రభుత్వం సాంకేతికత, ఆర్థిక సమ్మిళితం, పరిపాలనా సంస్కరణల కలయిక ద్వారా ఈ గతిని మార్చడానికి ప్రయత్నించింది. 55 కోట్లకు పైగా జన్ ధన్ ఖాతాలు, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) విధానాల విస్తరణ, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల వేగవంతమైన అభివృద్ధి, విస్తృత పారిశుద్ధ్య కవరేజ్, ఆయుష్మాన్ భారత్, గ్రామీణ నీటి అనుసంధానం వంటివన్నీ కలిసి, ఆశ్రిత పక్షపాతాన్ని హక్కుతోనూ, వివక్షను పారదర్శకత తోనూ భర్తీ చేయడానికి ప్రయత్నిం చాయి. ఈ చర్యలు కేవలం సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే కాదు. అవి పితృస్వామ్య రాజ్యం నుండి ప్రజాకేంద్రీకృత ప్రభుత్వం వైపు ఒక తాత్విక మార్పును సూచిస్తాయి. ఇది పరిపాలన ఆశ్రిత పక్షపాతంతో కాకుండా సాధికారత కల్పించేదిగా ఉండాలి అనే సందేశాన్ని ఇస్తున్నది.
నూతన జాతీయ స్వీయ దృక్పథం
మోదీ శకపు అత్యంత శాశ్వతమైన వారసత్వం కడకు భౌతికమైన దానికంటే మానసికమైనదే కావచ్చు. దేశాలు కేవలం వాటి వద్ద ఉన్న వనరులతోనే కాకుండా, అవి తమను తాము ఎలా చూసుకుంటాయనే దాని ద్వారా కూడా రూపుదిద్దు కుంటాయి. స్వాతంత్య్రం తర్వాత చాలాకాలం పాటు భారత్ తరచుగా తనను తాను బాహ్య దృక్కోణాల ద్వారా చూసుకుంది. పాశ్చాత్య సంస్థలు, పాశ్చాత్య మీడియా, పాశ్చాత్య మేధోపరమైన చట్రాల నుండి లభించిన గుర్తింపు, జాతీయ చర్చను రూపొందిం చడంలో విపరీతమైన ప్రాధాన్యతను సంతరించు కుంది.
అభద్రతకు బదులుగా ఆత్మవిశ్వాసం
మోదీ హయాంలో భారత్ తన సొంత సంప్ర దాయాలతో, ఆధునిక ప్రపంచంతో ఆత్మవిశ్వాసంతో మమేకమవుతూ, ఒక స్వతంత్ర ప్రపంచ దృష్టికోణం కలిగిన నాగరిక దేశంగా తనను తాను ప్రదర్శించు కుంటోంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం, పునరుద్ధరించిన బౌద్ధ దౌత్యం, ప్రవాస భారతీయులతో సంబంధాలు, సాంస్కృతిక దౌత్యం, లేదా ప్రపంచ వేదికలపై భారత్ ప్రయోజనాలను వ్యక్తీకరించడం ద్వారా దేశం ఇప్పుడు అభద్రతకు బదులుగా ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తోంది. ఈ మార్పు సమÖహంలో ఒంటరి తనాన్ని సూచించదు. ప్రపంచ వ్యవహారాలలో అర్థవంతంగా పాల్గొనే క్రమంలో భారత్ తన చరిత్ర, సంస్కృతి లేదా అధిక సంఖ్యాకుల నాగరికతా గుర్తింపు కోసం క్షమాపణ చెప్పనవసరం లేదనే పెరుగుతున్న నమ్మకాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.
పరిమితులు – పాఠాలు
ఏ ప్రభుత్వమూ లోపాలు లేకుండా ఉండదనే విషయాన్ని కూడా అంగీకరించాలి. ఆర్థిక సవాళ్లు ఇంకా ఉన్నాయి. సామాజిక ఉద్రిక్తతలు కొనసాగు తున్నాయి. పరిపాలనా అసమర్థతలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజాస్వామ్య రాజకీయాలలో అనివార్యంగా రాజీలు, అసంపూర్ణతలు ఉంటాయి. అయినప్పటికీ, చారిత్రక మూల్యాంకనానికి విస్తృత గమనాలపై దృష్టి పెట్టడం అవసరం. నరేంద్ర మోదీ పదవీకాలపు ప్రాముఖ్యత కేవలం ఆయన అమలు చేసిన విధానాలలోనే కాకుండా, ఆయన మార్చిన ప్రాథమిక ప్రమాణాలలో కూడా ఉంది. ఆర్టికల్ 370 రద్దు, రామ మందిర నిర్మాణం, డిజిటల్ పాలనను సంస్థాగతం చేయడం, సంక్షేమ పంపిణీ విస్తరణ, నాగరికతా చర్చల పునరుజ్జీవనం వంటివి భవిష్యత్ ప్రభుత్వాలు చేయాల్సిన పనిని నిర్దేశించాయి. రాజకీయ ప్రత్యర్థులు కూడా 2014కు ముందు ఉనికిలో లేని చట్రాలలోనే ఇప్పటికీ కొట్టుమిట్టాడు తున్నారు. అదే చారిత్రక ప్రభావానికి ఒక కొలమానం అవుతుంది.
అంకెలకు అతీతమైన తేదీ
కాబట్టి, జూన్ 10, 2026 అనే ఒక తేదీ నరేంద్ర మోదీకి కేవలం ఒక వ్యక్తిగత మైలురాయి మాత్రమే కాదు. అది రాజకీయ పరిణామక్రమంలో ఒక శకం నుండి మరొక శకానికి భారత్ మారడాన్ని సూచిస్తుంది. వలస పాలన నుండి బయటపడిన నెహ్రూ కాలపు భారత్ సుస్థిరత, వ్యవస్థల నిర్మాణం, అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రయత్నించింది. కానీ మోదీ కాలపు భారత్ ఆత్మవిశ్వాసం, తన నాగరికతా వారసత్వంతో అనుసంధానం, ప్రపంచ వ్యవస్థను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించడం వంటి వాటిని ఆకాంక్షిస్తోంది.
ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య చర్చలన్నింటిలోనూ జరిగే విధంగానే, ఈ రెండు దృక్పథాల మధ్య చర్చ కూడా కొనసాగుతూనే ఉంటుంది. కానీ ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన, పోటీతత్వంతో కూడిన ప్రజాస్వామ్య వ్యవస్థలలో ఒకటైన మన దేశంలో, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడంలో నరేంద్ర మోదీకి ఉన్న అసాధారణ సామర్థ్యాన్ని ఆయన రికార్డు స్థాయి పదవీకాలం ప్రతిబింబిస్తుంది అనే వాస్తవాన్ని మాత్రం కాదనలేము.
చరిత్ర వివిధ విధానాలను వేర్వేరు కోణాల్లో అంచనా వేస్తుంది. అది విజయాలు, వైఫల్యాలను చర్చిస్తుంది. అయినప్పటికీ, మోదీ శకం అందిపుచ్చు కున్న అత్యంత కీలకమైన సహకారం కేవలం ఆర్థిక, పరిపాలనా లేదా ఎన్నికలకు సంబంధించినది మాత్రమే కాదనే ఒక నిర్ధారణకు చరిత్ర చేరుకోవచ్చు. భారత్ చాలా కాలం పాటు ఇతరుల దృష్టికోణం నుండే తనను తాను చూసుకోవాలనే అవాంఛనీయ మైన ఒక తత్వాన్ని వంటపట్టించుకుంది. తన నాగరికత పట్ల అలాంటి భారత్ శతాబ్దాలుగా కోల్పోయిన తన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి సంపాదించు కోవడం ద్వారా మోదీ శకానికి గొప్ప సహకారాన్ని అందించింది.