మార్చి 3 హోళీ సందర్భంగా ప్రత్యేక వ్యాసం


సామరస్య జీవన సంవిధానానికి, ఆధ్యాత్మిక చైతన్యానికి , సంప్రదాయ ప్రాభవానికి ప్రతీక హోళీ. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఆనందో త్సాహాలను పంచే వేడుక.వ్యక్తుల మధ్య సత్సం బంధాలకు, సుహృద్భావానికి నిదర్శనం. మనలోని దుర్గుణాలను అగ్నికి ఆహుతి చేసి జీవితాన్ని రంగుల మయం చేసుకోవాలని, వ్యక్తిగా కంటే సమష్టిగా జీవనం సాగించాలనే భావన ఇందులో దాగి ఉంది. రంగులు, ఆటలు, వసంతాలు, రాధాకృష్ణుల ఆరాధన, చంద్ర ఆరాధన… ఇలా వసంతాల కేళి

హోళీ పర్వదినం రాక్షసపీడ నివారణకు సంకేతం. ‘స్మృతి కౌస్తుభం’లో ఈ పండుగ ప్రస్తావన ఉంది. భాగవతం ఈ పండుగను వసంత వేడుకగా పేర్కొంది. ఈ పర్వదినానికి సంబంధించి అనేక పౌరాణిక గాథలు ప్రచారంలో ఉన్నాయి. హిరణ్య కశిపుడు తన కుమారుడు ప్రహ్లాదుడితో హరినామ స్మరణను మానిపించే ప్రయత్నంలో భాగంగా, ఆతనిని మంటలకు ఆహుతి చేయవలసిందిగా సోదరి హోళికను నియోగిస్తాడు. ఆమె బాలుడిని ఒడిలో కూర్చుండబెట్టుకొని అగ్నిలోకి దూకగా, ప్రహ్లాదుడు విష్ణుమాయతో రక్షణ పొందుతాడు. ఆ రక్కసి ప్రాణాలు కోల్పోతుంది. దానికి సూచనగా హోళీమంటలు వేస్తారు. విజయదశమి నాడు రావణ విగ్రహం మాదిరిగా, ఈ పండుగ ముందు రోజున హోళిక విగ్రహాన్ని దహనం చేస్తారు ‘దుంధ’అనే అసుర సంహారానికి ప్రతీకగా సత్యయుగం నుంచి ఈ పండుగను జరుపుకుంటున్నట్లు విష్ణుపురాణం అభివర్ణించింది.
ద్వాపరంలో పాలీయవచ్చిన మాయాపడతి (పూతన)ని బాలకృష్ణుడు హతమార్చాడు. అందుకు గుర్తుగా ఆయనను ఉయ్యాలలో ఉంచి ఆరాధిస్తారు. అదే డోలోత్సవం.అయిదవ నాడు (ఫాల్గుణ బహుళ పంచమి) ఈ పండుగ ముగింపు సూచనగా రంగులతో ‘రంగపంచమి’ జరుపుకుంటారు.
వైదిక కాలంలో ఈ పండుగకు ‘నవాహేష్ణి’ అని పేరు. దీనిని మదనపూర్ణిమ, కామ దహనమనీ వ్యవహరిస్తారు. త్రిపురాసుర సంహారానికి యోధుడి జననం (కుమారస్వామి) ఈ పండుగ నేపథ్యం. శివపార్వతుల ఉద్దీపనతో• కుమార సంభవం అనివార్యంగా భావించి, దేవతల ప్రోత్సా హంతో మన్మథుడు తన పుష్పబాణాలతో మహేశ్వ రుడి తపస్సుకు భంగం కలిగిస్తాడు. దాంతో ఆగ్రహించిన ఆయన మదనుడిని తన ఫాలనేత్రంతో భస్మం చేస్తాడు. మన్మథసతి రతీదేవి విలాపంతో ‘అనంగుడి’గా సజీవమవుతాడు. కామదహనం పేరిట జనావాసాల కూడళ్లలో పెద్ద మంటలు వేసి, అలా వచ్చిన భస్మాన్ని నుదుట ధరిస్తారు.ఐహిక కోరికలకు అతీతంగా నిష్కామకర్మతో వ్యవహరించాలని ఈ పండుగ సందేశాన్ని ఇస్తోంది.యజ్ఞ స్వరూపమైన అగ్నిలో శారీరక వాంఛలు దగ్ధమైనట్లు ఈ పండుగకు ఆధ్యాత్మిక కోణంలో అర్థం చెబుతారు.
ఫాల్గుణ పౌర్ణమికి గల మరికొన్ని విశిష్టతలు పరిశీలిస్తే… మధుర మీనాక్షీదేవి తపస్సు చేసి సుందరేశ్వర స్వామిని పరిణయమాడింది ఫాల్గుణ పౌర్ణమినాడే. ఆ రోజు దేవీదేవతలకు కల్యాణోత్సవం నిర్వహిస్తారు. లక్ష్మీనారాయణవ్రతం, అశోక పూర్ణిమ వ్రతం, శయనదాన వ్రతం, శశాంక పూజ, రాధాకృష్ణుల కల్యాణం కూడా ఆ తిథినాడు జరుపు కుంటారని చతుర్వర్గ చింతామణి, పురుషార్థ చింతా మణిలాంటి గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఫాల్గుణ శుద్ధ అష్టమి నుంచి పౌర్ణమి వరకు ‘హోలాష్టకం’ అంటారు. అష్టమి నాడు దుర్గార్చనతో మొదలుపెట్టి రోజుకో శక్తిమాతను ఆరాధించే సంప్రదాయాన్ని ‘మహాశక్తి తంత్రం పేర్కొంది.
కొత్తగా పండిన ధాన్యం, ఆవుపాలు, చెరకు రసంతో పాయసం (క్షీరాన్నం) చేసి సూర్యుడికి నివేదించి ఫాల్గుణ ప్రసాదంగా స్వీకరించేవారు.
దుష్ట సంహారం,వసంత రుతువు ఆగమనం నేపథ్యంలో ఆనంద చిహ్నంగా రంగులు చల్లు కుంటూ, మధుర పదార్థాలు పంచుకొని ఆరగిస్తారు. రుతువు మారే క్రమంలో చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ప్రకృతి సహసిద్ధ రంగులు దోహద పడతాయని నాటి పెద్దలు చెప్పేవారు. అలా వేపగింజలు, కుంకుమ, పసుపు తదితర ప్రకృతి సిద్ధ, ఆయుర్వేద పదార్థాలతో సంప్రదాయ బద్ధంగా రంగులు తయారు చేసేవారు. మొక్కల నుంచి తయారయ్యే సహజ రంగుల వల్ల అనారోగ్య సమస్య లను నివారించినట్లవుతుందని ఆయుర్వేద గ్రంథాలు పేర్కొంటున్నాయి. మామిడి చిగుళ్లు, తేనె, వేపపూత మిశ్రమాన్ని ‘మధుప్రాశనం’గా సేవించడం వల్ల్ల ఉదర సంబంధత వికారాలు తొలగిపోతాయని ‘చరక సంహిత’ వివరించింది చెట్ల ఆకులు, పూలు, పండ్లు, బెరడు ఇతరత్రా ప్రకృతి సిద్ధంగా తయారయ్యే రంగులు ఔషధాలుగా పని చేస్తాయి. దీనినే ‘రంగుల చికిత్స’ అంటారు.
కాలక్రమంలో రసాయనాలతో కూడిన రంగులు వాడకంలోకి వచ్చాయి. వీటిని చల్లుకోవడంలో ఆనందం, వినోదం మాట అటుంచి ఆరోగ్యపరంగా నష్టం వాటిల్లుతోందని, వాతావరణం కలుషితమవు తోందని నిపుణులు అంటున్నారు. రసాయనాల కారణంగా అలెర్జీ, చర్మవ్యాధులు, అంధత్వం, మూత్రపిండాల వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. సంప్రదాయకంగా వస్తున్న పండుగలను జరుపుకో వలసిందే. అదే సమయంలో పూర్వికులు ప్రతిపా దించిన నియమాలను పాటించడం ద్వారా ఆరోగ్యా లను, పర్యావరణాన్ని కాపాడినవారమవుతాం.

డా।। ఆరవల్లి జగన్నాథస్వామి
సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE