భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
శిరీష మల్లికార్జున పండితారాధ్యుల
ఈసారి రాఖిపౌర్ణమి శుక్రవారం అవ్వడంతో వారాంతపు సెలవులైన శనివారము, ఆదివారాము కలుపుకొని మూడు రోజులు వరుస సెలవులొచ్చాయి. దాంతో చాలా సంతోషంగా మా వూరికెళ్లాను. చెల్లాయితో రాఖీ కట్టించుకుని తనకి బట్టలు కొనిచ్చాను. కొండ మీద శివాలయానికి ఒకరోజు, సినిమాకోకరోజు వెళ్లొ చ్చాము, ఈ రోజు పొద్దున్నే నగరానికి వచ్చిన నాకు, మూడు రోజులు మూడు చిటికెల్లో గడిచిపోయి నట్టనిపించింది. ఆఫీసులో పొద్దున కా•ఫీ బ్రేకులో స్నేహితులం కలుసుకొని కాఫీలు తాగుతూ ముచ్చట్లు పెట్టుకోవడం అలవాటు. క్యాంటిను దగర నాకన్నా ముందొచ్చిన మనోహర్ కనపడ్డాడు. ఈ లోపల ‘‘ఎలా ఉన్నారంతా?’’ అంటూ వస్తున్న గౌరి గొంతు వినపడింది. గౌరీశంకర్ ప్రాజెక్ట్ పనిమీద ఈజిప్ట్ వెళ్లి శనివారమే దేశానికి తిరిగి వచ్చాడు. ఎక్కడెక్కడ తిరిగివచ్చినా ఎవ్వరికైనా ఇల్లే కదా స్వర్గం, చాలా ఆనందంగా కనపడుతున్నాడు. వస్తూనే అక్కడ తాను చూసిన ప్రపంచ అద్భుతాలలో ఒకటైన గిజా పిరమిడ్ గురించి, తాను వాటిని చూని ఎలా ఆశ్చర్యపోయాడో అంతా వివరిస్తున్నాడు.
ఇంతలో నేనందుకుని ‘‘అది బహుశా మానవుడు శాశ్వతంగా నిలిచిపోవాలన్న కలకు అత్యంత ఎత్తైన ప్రతిరూపమేమో’’ అంటూ, గిజా పిరమిడ్ క్రీ.పూ. 2600 ప్రాంతంలో, పారో 4వ రాజవంశం కాలంలో పాలించిన ఖుపూ అనే ఫారో సమాధి అని, పిరమిడ్ లోపల పెద్దపెద్ద సొరంగాలు, కింగ్స్ ఛాంబరు, క్వీన్స్ చాయిర్లని ఉంటాయని, ప్రస్తుతం దాని ఎత్తు 454 అడుగులని, పక్కనే ఉన్న పి•రమిడ్ 448 అడుగులు, మూడవది 344 అడుగుల ఎత్తు ఉంటాయని, వాటి నాలుగు ముఖాలు నాలుగు దిక్కులకు సరిసమానంగా ఉండేట్టుగా కట్టారు అని, ఆ మూడు పిరమిడ్లు ఆకాశంలోని ఓరియన్ కాన్సైలేషన్ మూడు నక్షత్రాలలో సమాంతరంగా ఉండేవిట అనంటూ ఆపకుండా చెప్తూ పోతున్నాను. అప్పుడు గౌరి ‘‘ఓహ్ నువ్వూ వెళ్లచ్చావా శివా?’’, అని అడగడంలో నేనాగిపోయి, ‘‘నేనెప్పుడూ వెళ్లలేదు గౌరీ’’ అన్నాను. అది విని మనోహర్ చాలా ఆశ్చర్యపోతూ ‘‘మరి ఈజిప్ట్ చరిత్ర గూగుల్ అంత బాగా ఎలా చెప్పగలుగు తున్నారు మీరు? నాకు మన చరిత్ర అంతంత మాత్రంగా తెలుసు’’ అన్నాడు. నాకంటే చిన్నవాడైన మనోహర్ నెలక్రితమే పట్టానందుకుని, మా ఆఫీసులో కొత్తగా చేరాడు.
అప్పుడే నాకు అమ్మ నుంచి ఫోన్ వచ్చింది. అమ్మ ఫోన్‌కి కారణం గ్రహించిన నేను, ‘‘అమ్మా రైలు గంట ఆలస్యంగా చేరింది, ఆఫీసుకు టైమై పోవడంలో గబగబా తయారయ్యి వచ్చేసాను ఫోన్ చెయ్యడం కుదరలేదమ్మా’’ అన్నాను.
‘‘నేనది అనుకున్నానులే నాన్న! ఈ సమయంలో ఖాళీగా ఉంటావేమో నీకో రెండు విషయాలు చెబుదామని చేస్తానురా. నాలుగు రోజుల్లో కృష్ణాష్టమి కదా! చిన్నప్పుడు కృష్ణాష్టమి ఉట్టి కొట్టడంలో ఎప్పుడూ నీది పైచెయ్యి, వీలుచూసుకుని అక్కడేక్కడైనా వేడుకల్లో పాల్గొను. అదయ్యాక ఇరవై రోజుల్లోనే వినాయకచవితి, మొన్నే ఊరెళ్లొచ్చాను మళ్లీ ఏం వెళ్తానులే, అని చవితిపండక్కి రావడానికి బద్ధకించకు నాన్న. ఇప్పుడే మన ఊరికి టిక్కెట్లు కొనేసుకో. ఈ మాట చెబుదామనే చేసాను’’ అంది అమ్మ.
‘‘అమ్మా ఈసారి వినాయకచవితి బుధవారం వచ్చింది. తరువాత రెండు రోజులూ సెలవుపెడితే కానీ ఊరికి రాలేను, నాకు సెలవు దొరకక పోవచ్చమ్మా, ఇక్కడే పూజ చేసేసుకుంటాలే’’ అంటూ కాలెండర్ చూస్తూ తేల్చి చెప్పేసాను. నా మాటలు విని అమ్మ ‘‘అయ్యో అదేంట్రా రానంటున్నావు? ఇది నాకేం నచ్చడం లేదురా, బాధగా కూడా వుంది, నీ ఇష్టం మరి’’, అనేసి ఫోన్ పెట్టేసింది.
ఈలోగా గౌరీ తన ఒంటె సవారీల గురించి, పిరమిడ్ ఎత్తులు, అందులోని సొరంగాల లోతులూ, వాటిని కట్టిన రాళ్ల బరువుల గణాంకాలు చెప్తూ ‘‘అక్కడిప్పుడు ప్రాచీన ఈజిప్ట్ ఆచార వ్యవహారాలు, నమ్మకాలు పాటించేవారు కానీ, ఆ ప్రాచీన దేవుళ్లను పూజించేవారు కాని ఎవ్వరూ లేరుట. అక్కడిప్పుడు నివసిస్తున్నవారు అప్పటి నాగరికతకు వారసులూ కాదుట, అక్కడి భూములకు కట్టడాలకు మాత్రమే వారు వారసులుట. అంతటి గొప్ప ప్రాచీన నాగరికత లుప్తమైపోయింది. ఎక్కువ శాతం ఇస్లాం మతస్తులు, చాలాతక్కువ శాతం క్రిస్టియన్లు ఉంటారుట. ఇతర దేశస్తులలాగానే వారిలో కొందరు ఆ పురాతన పిరమిడ్ల నిర్మాణ రహస్యాల మీద పరిశోధిస్తున్నారుట. వారినే ఈజిప్టులో జను అని అంటారుట’’ అని చెప్తున్నాడు గౌరీ.
అది విని, ఆ నాగరికత, ఆ అద్భుత కట్టడాలు, ఆ విజ్ఞానం, ఎవర్ని మాత్రం ఆకర్షించవు? అని అనుకుంటున్న నాకు వెంటనే మా గోపాలం మాష్టారు గారు గుర్తొచ్చారు. రెండు నిమిషాల పాటు వారి గురించి ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాను. ‘‘ఏంటి అలా అకస్మాత్తుగా ఆలోచనలో పడ్డారు?’’ అనడిగాడు మనోహర్.
నేను వర్తమానంలోకి వచ్చి, ‘‘మా గోపాలం మాష్టారు గుర్తొచ్చారు మనోహర్, వారు మాకు చరిత్ర చెప్పేవారు…కాదు కాదు చరిత్రను మా కళ్లెదుట నిలిపేవారు. అంతేకాదు మమ్మల్ని తమతోపాటు టైంమెషన్లో కూర్చోబెట్టుకుని ఆయా కాలాల్లోకి తీసుకుని వెళ్లిపోయేవారు అని అనాలి. అసలు నా మీద వారి ప్రభావం ఎంత ఉందంటే… బి.టెక్‌లో కాకుండా యూనివర్సిటీలో చేరి ఎం.ఏ చరిత్ర చదవాలి ఎన్నోసార్లు నేను అనుకునేవాణ్ణి. నాన్న లేని మా ఇంటి బాధ్యత గుర్తొచ్చి. ఆ చరిత్ర తల్లి, నాకు కావల్సినంత డబ్బు ఇవ్వగలదన్న నమ్మకం కుదరక, ఆవిణ్ణి క్షమించమని ప్రార్థించేసి ఆ ఆలోచనకి స్వస్తి పలికేశాను, ఇంజనీరింగు చదివి, ఇప్పుడు నెలకి ఆరు అంకెల జీతం సంపాదించేస్తూ ఇక్కడ ఉన్నాను.’’ అని అన్నాను.
‘‘మీ గోపాలం మాష్టారు గారి ప్రభావం నిజంగా మీమీద అంతుందా? ఇంతకీ ఆయన చరిత్ర ఎలా చెప్పేవారు?’’ అడిగాడు మనోహర్. విరామ సమయం అయిపోవడంతో తర్వాత ‘‘మాట్లాడు కుందాం’’ అనుకుంటూ మా విభాగాల్లోకి వెళ్లి పొయాము.
నేనూ మనోహర్ ఒకే ఇంట్లో ఉంటున్నాము. రాత్రి భోజనాలయ్యాక మనోహర్ నాతో గోపాలం మాష్టారు గురించి. తెలుసుకోవాలనుందండి అనడి గాడు ప్రెష్ మనోహర్. అతనిలాంటి చాలా మంది చరిత్ర అంటే 1857, 1869, 1912… అంటూ సంవత్సరాలు గుర్తుపెట్టుకోవడం అనో, అక్బర్. అశోకుడు, గాంధీ, నెహ్రూ… లాంటి పేర్లు గుర్తు పెట్టుకోవడం అనో, మంచి మార్కులు తెచ్చిపెట్ట గలిగే శక్తివంతమైన అంశం అనో అనుకుంటుం టారు. అటువంటి అతను తిరిగి ఆ ప్రస్తావన తెస్తాడు అని నేనస్సలు ఊహించలేదు. బహుశా పొదుటి ఈజిప్ట్ కబుర్ల ప్రభావేమో! నాకెందుకో చాలా సంతోషం వేసింది.
చరిత్ర అంటే అది కాక మరేంటి? నేను గోపాలం మాష్టారు గురించి చెప్పడం మొదలు పెట్టాను. ‘‘మాష్టారు మా బడికి దగ్గర్లోనే పెద్ద బంగళాలో ఉండేవారు. సెలవు రోజుల్లోనో, కొన్ని కొన్ని పాఠాలు చెప్పేటప్పుడో మమ్మల్నందరిని వారింటికి రమ్మనేవారు. మాకదో ఆట విడుపు. ర•ంగు పెన్సిళ్లు రంగు కాగితాలు, కీలుగుర్రాలు, పక్షుల ఈకలు, ఉత్తరీయాల, పల్లీలు, చేగోడీలు ఇలా ఏవేవో తీసుకుని ఎంతో ఉత్సాహంగా వెళ్లేవాళ్లం. వారు ప్రపంచచరిత్రపై, మన దేశచరిత్రపై మాతో నాటకాలు వేయించేవారు. అందులో చక్ర వర్తులు, రాజులు, సైనిక పాత్రలు మాకు వంతుల వారీగా వచ్చేవి. పాత్రని బట్టి తలపైన ఈకలో, ఇత్తడి చెంబు కిరీటాలో, తలపాగాలో పెట్టేసుకొని యూరోపు, అమెరికా చరిత్రలు, సిక్కు రాజులు, జలి యన్వాలా బామ్, 1857 తిరుగుబాటు. ఇలాంటి వెన్నో నాటకాలు వేసేవాళ్లం. ఈరోజున ఆలోచిస్తుంటే మేము చరిత్ర నేర్చుకోడానికి ఆటలా ఆడుకున్నామా లేక 5000 సంవత్సరాల నుంచి జీవించే ఉన్నామా అనిపిస్తోంది.
ఈజిప్ట్ నాగరికత పాఠాన్ని మేమలాగే నేర్చుకు న్నాము. మా నాటకంలో డాబాపైన ఈజిప్ట్ ఫారో రాజ్యమైతే, కింద పొరుగుదేశపు రాజు రాజ్యం, వారి మధ్య రహస్య సందేశాలు చేరవేసే బంటు, అతని రక్షణ కొరకు ముందు ఇద్దరు వెనక ఇద్దరు రక్షక భటులు. ఈజిప్ట్ వారు అయిదు వేల సంవత్సరాల క్రితం, పేడ పురుగు ఆకారంలో చిన్న తాయత్తులంత ఉండే బంక మట్టి బిళ్లల ద్వారా అంతర్జాతీయ సందేశాలు పంపించుకునేవారట. ఆ బిళ్లని స్కరాబ్ అని అంటారుట. ఈజిప్టువారు పాపరీలు అని పిలిచే చుట్టచుట్టిన పాపిరస్ కాగితాల్లో జీవిత చరిత్రలు, మ్యాపులు, గణిత, వైద్య బోధనలు ఉండేవిట. అవన్నీ మా ఆటల్లో భాగంగా
సృజనాత్మకంగా మాతోనే రాయించేవారు గోపాలం మాస్టారుగారు. మేమే పిరమిడ్లు ఎలా కట్టాలి అంటూ సలహా సంప్రదింపులు చేసుకు నేవాళ్లం. లెక్కలూ కట్టేవాళ్లం. స్కరాబ్ బిళ్లలు, చీపురు పుల్ల బాణాలు, ధనుస్సులు, అట్టల మద గిసిన ఆటలు… ఆనాడు ఫారొ చక్రవర్తులు సమాధుల్లో దాచినట్టుగా, డాబామెట్లనే పరమిడ్ అంతర్భాగంగా భావించి దాచేవాళ్లము. ఇప్పుడా ఈజిపై నాగరికత లేదు.
ఈమధ్య కొన్నేళ్ల క్రితం మాస్టారుగారిని కలిసి నప్పుడు, ఆయనలో మాట్లాడుతూ ‘‘కొన్ని నాగరి కతలు పూర్తిగా లుప్తమవ్వడం బాధాకరం! చాలా దురదృష్టకరం కూడా! దానిక్కారణం ఆప్పటి మతాధిపత్య యుద్ధాలు, గెలిచి ఆక్రమించిన వారక్కడి చరిత్ర ఆనవాళ్లను ధ్వంసం చేసెయ్యడమే ముఖ్య కారణాలు కదండి’’ అన్నాను. మాష్టారుగారు ఆ మాటకి నాతో ఏమాత్రము ఏకీభవించలేదు. ఇంతలో టైమ్ చూసేసరికి పది దాటిసింది. ఆలస్యమై పోయింది ఇంక పడుకుందాం అనుకుంటూ ఇద్దరమూ లేచాము.
పదిరోజులయ్యాక అమెరికా నుంచి పని మీద మనదేశానికి వచ్చిన చంద్రం మామయ్య మేమిద్దర మున్న ఇంట్లోనే దిగాడు. ఇంతలో నగరమంతా వినాయకచవితి హడావిడి మొదలైంది. ప్రతివాళ్లూ విగ్రహాలు, పందిళ్లు, ట్రాఫిక్ ఆంక్షలు, లడ్డు వేలం పాటలు ఇవే కబుర్లు. గౌరి మా ముగ్గుర్ని వాళ్లింటికి వినాయకచవితి పూజకి, భోజనానికి పిలిచాడు. గౌరి వాళ్లన్నా వదినల వద్ద ఉంటాడు. మావయ్యతో గౌరి పండక్కి పిలిచినట్టూ, తాము అమ్మమ్మ తాతయ్య వాళ్లుండిన కాలనీలోనే ఉంటున్నారని చెప్పాను. మావయ్య ఒప్పుకోవడమే కాకుండా, ఎంతో సంతోషంగానూ ఆత్రంగానూ ఎదురుచూస్తున్నట్టుగా నా కనిపించింది. పండగనాడు త్వరగాలేచి తయారై పోయి వాళ్లింటికి బయలుదేరాము.
మావయ్య పైచదువులకని అమెరికా వెళ్లడం, పెళ్లి చూపులకని వచ్చినప్పుడు మావయ్యే పట్టుబట్టి ఉన్న ఆస్తంతా తాతయ్యతో అమ్మించేయడం, కాలనీలోని ఇంటిని ప్లాట్లు చేస్తామంటూ వచ్చిన బిల్డర్లకి అమ్మేయడం, అమ్మమ్మ లేని ఇంటి నుంచి తాతయ్య చిన్న ప్లాట్లోకి మారడం, ఏడాదికల్లా ఆయన కన్ను మూయడం అన్ని వరుస ఘటనలు. ఆ కాలనీ లోకి ప్రవేశిస్తూనే మావయ్య చిన్ననాటి జ్ఞాపకాలు నెమరువేసుకోవడం, పట్టలేని ఆనందంతో మాట్లాడం, ఆయన కళ్లు చెమర్చడం, చూని ఆశ్చర్యపోయాను.
గౌరి వాళ్లన్నయ్య ఉమాశంకర్ మామయ్య ‘‘ఈ కాలనీ… నగరంలోనే చాలా పెద్దది.. పాతదిరా శివా. ఇన్ని ఆపార్ట్మెంట్లు వచ్చేసరికి గుర్తు పట్టలేకుండా ఉన్నానురా’’ అన్నాడు. ఇంట్లోకొచ్చి కూర్చుంటూ, వినాయకచవితి పండక్కి మా అమ్మమావయ్య, కాలనీ పిల్లలందరితో కలిసి, పోటీలు పడి మట్టి వినాయకుళ్లను తయారుచెయ్యడం గుర్తుచేసు కున్నాడు. కాలనీలోని గుడిని ఆనుకుని లలిత పిన్నిగారి ఇల్లు, బోలెడు చెట్లలో చాలా అందంగా ఉండేదిట. ఆవిడ వినాయకచవితికి వాళ్ల పెరట్లోని దానిమ్మ, వెలగ, రేడు, ఉత్తరేణూ, మరువముం, తుమ్మి,జాజి, వావిలాకులు ఓపిగ్గా కోసి పొట్లాలుకట్టి, వాళ్ల పిల్లలు శారదక్కతో, శంభుతోఅందరిళ్లకు పంపించేవారుట. ‘‘పండుగనాడు పూజ, భోజనా లయ్యాక పిల్లలందరమూ అందరిళ్లకు వెళ్లి వినాయ కుడి పద్యాలు చదివి, గుంజిళ్లు తీసి, ఉండ్రాళ్లు తిని, శారదక్కయ్యతో కీర్తనలు పాడిస్తే విని, చవితి కథ విని, రాత్రి చంద్రుణ్ణి చూడడానికి భయపడుతూ, అలసిపోయి ఇళ్లు చేరితేనే మా వినాయకచవితి పూర్తి అయినట్టు’’ అన్నాడు. మావయ్య. ‘‘శారదక్కయ్యకి డాక్టర్ సంబంధం కుదరితే పెళ్లయ్యాక అమెరికా లోనూ, శంభు జర్మనీలోను స్థిరపడ్డారుట’’ అంటూ చెప్పాడు.
ఉమాశంకర్ దంపతులు అమెరికాలోని సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని బదిలీ చేయించుకుని ఇక్కడ స్థిరపడాలను కుని ఇటొచ్చేశారు. ఇద్దరికీ టైమ్ లేక వినాయకుడిని, పత్రిని ఆన్లైన్లో ఆర్డర్ చేసి తిప్పించుకున్నారు. ఇక భార్యాభర్తలు భక్తిగా చేస్తున్న పూజలో వాడుతున్న పేరులేని, పేరు తెలియని తెల్ల చుక్కల ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగు ఆకులున్న క్రోటన్ పత్రిలో, దూర్వాయుగ్మం అనబడే ఒక్క సన్న గడ్డిపరక కూడా కనపడలేదు! మేముకూడా భక్తిగా వాటితోనే పూజ చేసేసుకున్నాము. నైవేద్యాలు, భోజనాలు అన్నీ సరిగ్గా సమయానికి కాటరింగ్ వాళ్లొచ్చేసి వెళ్లిపోయారు. భోజనాలయ్యాక మావయ్య ‘‘మా ఇల్లులేనే లేదు, మనం వెళ్లి శారదక్క వాళ్ల ఇల్లు చూసొద్దామా శివా’’ అన్నాడు. అప్పుడు ఉమాశంకర్ గారు ‘‘మీరు చెప్తున్న ఇల్లు కాలనీల• ఎక్కడా లేదండి, గుడిపక్కన ఇప్పుడు, స్విమ్మింగ్ పూల్, పెద్ద లాను, జమ్, టెన్నిస్ కోర్టు…. వంటి ఆధునిక సదుపాయాలతో కట్టిన విలాసవంత మైన పెద్దిల్లుందండి’’ అని అన్నారు. అలాగా అని నిట్టూర్పాడు మావయ్య.
పొద్దుటినుంచి మావయ్య మాటలను, భావాలను చాలా దగ్గ నుంచి గమనిస్తున్న నాకు ఆ కాలనీలో, అందులోని ఇళ్లలో, అక్కడి మనుషులలో, కాల క్రమేణా వచ్చిన మార్పులను ఒకసారి ఒక చలన చిత్రంలో చూస్తునట్టుగా అనిపించింది. మేమంతా చేసుకున్న పూజలో భక్తి ఉన్నా, మా అవగాహనా రాహిత్యం నాకు ప్రస్ఫుటంగా కనపడింది. ఏ పత్రి ఏదో తెలిసిన మావయ్య ఆ పత్రి దొరకని, ఈ ఆచార వ్యవహారాలకి, సంబంధ•ంలేని ప్రదేశానికి ఎప్పుడో వలస వెళ్లిపోయాడు. పూర్తిగా ఆధునికమైన ఉమాశంకర్, మనోహర్, గౌరీలు ఈ పండగ, దాని ప్రాముఖ్యతని తెలుసుకున్నందువల్ల వెంటనే కనపడే లాభనష్టాలేవి లేవు గనుక తెలుసుకునే ప్రయత్నం చెయ్యడంలేదు. దాన్ని అర్థం చేసుకోగల నేనిలా నిర్లక్ష్యంగా బతికేస్తున్నాను.
అకస్మాత్తుగా ఆరోజు మాష్టారు నాగరికత లుప్తమవ్వడానికి ఆనవాళ్లు రూపుమాపేయడమే కారణం కదండి అని నేనంటే ఎందుకు నాతో ఏకీభవించ లేదో ఈరోజు అర్థమవుతున్నట్లుగా అనిపించింది. నాగరికతను భౌతికమైన ఆనవాళ్లొక్కటే కాపాడలేవు. దాన్ని కాపాడగలిగేది స్వార్థచింతన లేని మనుషులు! మాస్టారుగారు అంత శ్రమకోర్చి చరిత్ర పాఠాలు మాకెందుకు నేర్పేవారో, వాటినుంచి ఏమి నేర్చుకోవాలో అవగతమవుతున్నట్టుగా అనిపించ సాగింది. ఆలోచిస్తే వాస్తవానికి 5000 సంవత్సరాల పూర్వపు ఈజప్టు చరిత్రంతా మనకప్పుడు చెప్పింది భౌతిక ఆనవాళ్లయిన శవపేటి•కలు, సమాధిగోడలు, వాటిపైన రాసిన రాతలు, వేసిన బొమ్మలు, తవ్వకాలలో బయటపడ్డ బంకమట్టి బిల్లటి కదా, అంటే… అనవాళ్లున్నా నాగరికత లుప్తమైపోయింది అన్న మాటేగా! ఆ ఎత్తైన పిరమిడ్ల నుంచి చిట్టిచిట్టి స్కరాబ్ల వరకు ప్రాణం లేకపోయినా మనకి ఈ విషయన్నే చెప్పాలని చూస్తున్నాయేమో. అనవాళ్లయిన మేము ఎంత చరిత్రనైనా చెప్పగలము. కాని మంచి నాగరికత కొనసాగాలంటే వారాసులుండాలి అని వాపోతున్నాయేమో! మనము వాటి మూగభాషను అర్థం చేసుకోలేక పోతున్నామన్న మాట! వారసులనే వాళ్లు ఒక ఇంట్లోనో, ఒక దేశంలోనో, ఒక నాగరికత లోనో పుట్టి, భౌతికమైన సౌందర్యము, ఆస్తులు అంతస్థులు, ప్రకృతి సంపదల వంటి వాటినే వారసత్వంగా అందుకోవడమూ అందివ్వడమే కాదు. వాళ్లు లోభమోహాలు, స్వార్థచింతన, అలసత్వము, అవగాహనారాహిత్యాలనే ఉచ్చులలో ఇరుక్కు పోకుండా నాగరికత తాలూకు ఆచార వ్యవహారాలను తామందుకుని తరువాత తరాలకి అందివ్వాలి.
నాకెప్పుడూ సనాతన భారతీయ నాగరికతలోని సంస్కృత సంప్రదాయాలన్ని సమస్త లోకానికి, జీవులకి, ప్రకృతికి అనుకూలవతమైన అత్యుత్తమమైన పద్ధతులనిపిస్తాయి. అటువంటి నాగరికతను, వేషభాషలను, జీవనశైలిని, రూపుమాపేయాలని ఎన్నో దాడులు, దండయాత్రల జరిగాయి. అయినా మా అమ్మలాంటి ఎందరో అమ్మలు, గోపాలం మాష్టారులాంటి ఎందరో మాష్టారులు, పటిష్టమైన పునాదిరాళ్లలా నిలబడి కాపాడడంతో మన నాగరికత చెక్కుచెదరలేదు. సదవగాహనతో, తమదైన శైలిలో ఈ నాగరికతను వారసత్వముగా ముందుతరాలకు అందిస్తూ, తమలాంటి వారాసులను తయారుచేయ డానికి నిరంతరం కృషిచేసి అమ్మ, మాష్టారుగారు లాంటి వారు ఏ నాగరికతకైనా నిజమైన వారసులు. ప్రస్తుతం ప్రపంచీకరణలో వచ్చిపడుతున్న ఆధిపత్య సంస్కృతుల నుంచి మహోన్నత భారతీయ నాగరికత ఉనికిని కాపాడడం పట్ల నా కర్తవ్యం అర్థ•మైనట్టని పించింది. తెలిసేట్టు బొజ్జగణపతికి మొక్కి గుంజిళ్లుతీసి నేనూ ఒక నిజమైన వారసుణ్ణి అవ్వాలని నిర్ణయించుకున్నాను.