‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన

దాదాపు అన్ని ప్రముఖ నదులూ అన్ని దక్షిణా వర్తంలోని అన్ని రాజ్యాలలో వర్షాలు కూడా ఒక మాదిరి నుండి భారీవర్షాలు రోజులు, వారాలు, మాసాల పాటు ఎడతెరిపిలేకుండా కురవడంతో ఈ నదులన్నీ పొంగి పొర్లాయి.

ఇకనేముంది.. వాటి ప్రవాహంతో గ్రామాలన్నీ నీట మునిగాయి.. ఊర్లకు ఊళ్లు సర్వనాశనం అయ్యాయి. చాలా గ్రామాలు పూర్తిగా నీట మునగ డంతో ఒక్కరు కూడా మిగలకుండా ఆ గ్రామ ప్రజలంతా.. పిల్లా జెల్లా.. ముసలి ముతకా.. పెద్దా చిన్నా, ఆడామగ.. కోడి, కుక్క, ఎద్దు, గేదె.. పెంపుడు జంతువులు.. సర్వం నీట మునిగి చనిపోయాయి. అలాంటి గ్రామాలు ఎన్నో ఎన్నెన్నో.

విషాదం ఏమిటంటే ఆయా గ్రామాలలోని నీట మునిగిన వారిని రక్షించే వ్యవస్థ లేదు సరికదా.. ఫలానా గ్రామంలోని వారంతా చనిపోయారని పక్క గ్రామానికి తెలియజేప్పేవారు కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు.

ఈ అతివృష్టి రాజ్యాలకు ఒక పెద్ద సమస్య అయితే అప్పుడే మరొక సమస్య మొదలయ్యింది..

అదే అంటురోగాల వ్యాప్తి.

ఎన్నో గ్రామాలు.. నదీతీరాల వెంట మొత్తం తెలుగు రాజ్యాలే కాదు…మరాఠా, కన్నడ, తమిళ రాజ్యాలు.. అన్నిటా అంతటా వర్షాలవల్ల.. పొంగి పొరలిన నదుల వల్ల.. వందల గ్రామాలు ఒక్క మనిషి కూడా మిగలకుండా చనిపోగా, నీటిలో నానిన శవాలు కుళ్లి కుళ్లి ఉబ్బి.. చీలికలు పేలికలైయ్యాయి. అందుండి పుట్టాయి రకరకాల వైరములు..మెట్ట గ్రామాలకు కూడా లిప్తలకాలంలో వ్యాపించాయి.

వైరం అంటే శత్రుత్వం.. ఆరోగ్యానికి శత్రువులు వైరములు. ఈ వైరములు కోట్ల ఏళ్ల నాడే మనిషి కంటే ముందే పుట్టి గాలిలో, నీటిలో, సమస్త జంతáTజాలంలో సమృద్ధిగా ఉంటాయి. ఈ వైరములు క్రిములు, కృములు అని రెండు రకాలు. దోమలు, ఈగలు, నల్లులు, పేలు, చదలు, నులు పురుగులు, ఏలిక పాములు, బద్దె పురుగులు, నార పురు గులు.. ఇలా కంటికి కనిపించేవి, పాకేవి కృములు.

తమంతట తామే వృద్ది పొందే సూక్ష్మాతి సూక్ష్మజీవులను క్రిములు అంటారని అధర్వణ వేదం పేర్కొంది. యూక, పిపీలిక, చర్మది, చర్మ్యుకిక, బిందుకి, వర్తుల, మత్కుణ, పృధుముండ, ఆంత్రధ, దాన్యాశీకురనిభ, హృదయద, సూచీముఖ, ఉదారద, చిపిట, ఉదరవేష్ట, కించుకసన్నిభ, చురు, అనవ, మహాగుడ, మహాకుహ, ధర్భకుసుమ, కాకేరుక, అజ్వ, మాకేరుక, విజ్య, సౌసురద, కిప్య, శసులక, సలూన, గండూపద, లేలిహా, ద్విముఖ.. తదితర క్రిములను చరకుడు, శుశ్రుతుడు తదితర మహా వైద్య పండితులు గుర్తించారు.

 ఈ అంటువ్యాధులనేవీ సామాజిక సమస్య. వైద్యం ద్వారా వీటి నివారణ సాధ్యం కాదు. ఎలుకలు తండోపతండాలుగా చస్తోంటే వెనువెంటనే ఇల్లు వదలి, ఊరు విడిచి పారిపోవాలని.. దూరవాసం చెయ్యాలని.. వాత్స్యాయనుడు చెప్పాడు. ఈ అంటువ్యాధులు గుర్తించగానే ముందుగా అందరూ ఊరు విడిచి అరణ్యాల్లోకి పారిపోయి ప్రాణాలు కాపాడుకోవడం అన్ని గ్రామాల ప్రజల తక్షణ కర్తవ్యం. అదే చేస్తున్నారిప్పుడు.

 శకునాలపల్లె గ్రామవాసులంతా మహమ్మారిని గుర్తించేటప్పటికే కోళ్లు, ఆవులు, గేదెలు, ఎడ్లు, కుక్కలు, చంటిపిల్లలు, కొందరు ముసలివారు మరణించారు. చాలామందికి ఒంటిపై దద్దురులు, కళ్లు ఎర్రబారటం, దురదలు.. కొందరికి ఒళ్లంతా దురదలు వచ్చేశాయి. అప్పుడు ఊరంతా మహమ్మారి వచ్చేసిందని గుర్తించారు.. అన్నీ వదిలేసి అడవుల్లోకి పారిపోయారు.

ఇదే పరిస్థితి మరెన్నో గ్రామాలలో.. ముఖ్యంగా నదీ తీర గ్రామాలకు కాస్త దగ్గరగా ఉన్న గ్రామాలన్నీ రోజుల సమయంలోనే ఈ మహమ్మారి బారిన పడ్డాయి.

అడవుల్లో నివాసమున్న వారిని కూడా ఈ మహమ్మారి వదలడం లేదు. మరెన్నో రూపాలలో రోజురోజుకీ ఎందరెందరో చనిపోసాగారు. ఉన్న వారు ప్రాణాలు దక్కించుకోవడం కోసం అరణ్యాల లోలోపలికి.. లేదంటే మరోదారి పట్టి దూరదూర ప్రాంతాలకు పరుగులు పెట్టసాగారు. అంటే వీళ్లు ఆ జబ్బులను.. అంటే ఆ క్రిములను మరిన్ని ప్రాంతాలకు, రాజ్యాలకు వ్యాప్తి చేయసాగారు. దాంతో ఆయా ప్రాంతాలు ఈ అంటువ్యాధుల బారిన పడి నాశనం కాసాగాయి. ఇలా ఈ అంటువ్యాధులు కొన్ని నెలలు, సంవత్సరాల పాటు ఎన్నో తెలుగు రాజ్యాల గ్రామాలను నామరూపాలు లేకుండా చేస్తోంది.

కుటుంబాలు, వంశాలు, గ్రామాలు.. వదలి ఎవరెవరో, ఎక్కడెక్కడో బలుసాకు తిని అయినా బతుకుతున్నారు. కొన్నేళ్లకు వాళ్ల కుటుంబ సభ్యులు ఎవరో.. ఎక్కడున్నారో.. ఒకరికి ఒకరు తెలియదు. ఎవరది ఏ ఊరో తెలియదు. గుర్తున్నా వెళ్లేదారి తెలియదు. తూర్పు ఏదో పడమర ఏదో తెలియదు. చాలా గ్రామాలు నిరుపయోగంగా పాడు పెట్ట బడ్డాయి. గుడులు, నివాసాలు, గృహోపకరణాలు, బంగారు వెండి ఆభరణాలు.. నాణేలు, పట్టు పీతాంబరాలు.. అన్ని మట్టిలో కూరుకుపోయాయి. ఒకప్పుడు గొప్ప సంస్కృతీ కేంద్రాలుగా విలసిల్లిన గ్రామాలు, పురాలు, పట్టణాలు, నగరాలు.. ప్రజలు లేక అన్ని అడవుల్లా.. క్రూర జంతువులకు, దోపిడీదారులకు ఆవాసాల్లా మారిపోయాయి.

మరి కొన్నేళ్లకు ఈ పాడుపడిన గ్రామాలలో ఎవరెవరో వచ్చి నివాసాలు ఏర్పరచుకుని.. ఆ గ్రామ పొలాలు స్వాధీనం చేసుకుని.. ఆ గ్రామాలకు కొంత పేర్లు పెట్టుకుని.. తిరిగి నివాసయోగ్యం చేసుకో సాగారు. వాటి కొత్త పేర్లలో ‘పాడు’ అనేది తప్పక ఉంటుంది. అంటే అది ఒకప్పుడు ప్రజలతో కళకళలాడి తదనంతరం.. అతివృష్టి, అంటువ్యాధు లతో పాడుపడ్డ గ్రామమని గుర్తు.

కొన్నేళ్ల తర్వాత అక్కడ ఏ మహారాజో ఎప్పుడో వేయించిన ఓ శాసనం దొరుకుతుంది. నగలు, నాణేలు, దేవతావిగ్రహాలు దొరుకుతాయి.. నేలలో కూరుకుపోయిన దేవాలయ చిహ్నాలు, విరిగిన విగ్రహాల చెక్కా ముక్కా కనిపిస్తాయి. మొత్తంగా ఆ ప్రాంత లేదా ఆ గ్రామ పాతచరిత్ర కొత్త గ్రామస్తులకు, చరిత్రకారులకు ఓ గొప్ప ఆసక్తి కలిగించే చరిత్ర అవుతుంది. అలా చరిత్ర అనే కొత్త అంశం జన్మించింది!!

మళ్లీ తెలుగు రాజ్యాలలోని నదులు, నదాలు, వాగులు, వంకలు, కుంటలు, కాలువలు.. యధా విధిగా ప్రవహిస్తూ ఆయా గ్రామాలను సస్యశ్యామలం చేస్తూ తెలుగువారి సంస్కృతికి కొత్త భాష్యాలు చెబుతూనే ఉన్నాయి… ఉంటాయి.

ఇదంతా పాలకవ్యవస్థలు పట్టించుకోని కాలాన జరిగిన, జరుగుతున్న ఘోరకలి. ఇప్పుడైనా పాలక మహారాజులు ఈ ప్రళయ భీకరవేళ.. కొందరినైనా బ్రతికించే.. కనీసం ప్రకృతి విలయం గురించి మరో గ్రామానికి తెలిసే వ్యవస్థనయినా ఏర్పాటు చేయాలని.. అది చిన్నరాజ్యాల వల్ల కాదని సామ్రాజ్య రూపం ఏర్పడాల్సిందేనని శిబిరం కోరింది.

*******

గొబ్బూరు గ్రామం.. కొలనుపాక రాజ్యం.

వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి.

ఓ బక్కచిక్కిన కుక్క.. భయంభయంగా అటూ ఇటూ చూసుకుంటూ నేల మట్టివాసన చూస్తూ తలెత్తి అటూ ఇటూ మళ్లీ మళ్లీ చూస్తూ తడబడుతున్నకాళ్లతో నడవలేక నడుస్తోంది. డొక్కలు ఎముకలు తేలి.. కటకటలాడుతున్నాయి. తినడానికి ఎక్కడా ఏమీ లేదు. కాస్త తడి నాకుదామన్నా ఇళ్ల ముందు కనీసం నీటికుండలు కూడా కనిపించడం లేదు. వేడిగాలులు నిశ్శబ్దంగా ఉధŠృతంగా వీస్తున్నాయి. ఉండి ఉండి గాలి విసురుగా వీచినప్పుడు డొంకలోని మట్టి పైకెగసి సుళ్లు తిరుగుతోంది.

ఓ ఇంటి వెనుక నుండి నలుగురు మనుష్యులు ఆ కుక్కనే చూస్తున్నారు. వాళ్లు రెండు వీధుల నుండి దాని వెనకే మౌనంగా అనుసరించి వస్తున్నారు. ముందున్నవాడు పక్కవాళ్లను ఆగమని సైగచేసి మెల్లగా అడుగులో అడుగు వేస్తో ఆ కుక్క వెనకే వెళ్లాడు. అతని కదలిక చూస్తుంటే దానిని పట్టు కోవాలని అతని తీవ్రమైన ప్రయత్నం. అతన్ని వెనుక నుండి ప్రోత్సహిస్తున్నట్లు ముగ్గురూ చూస్తుండగా మొదటివాడు కుక్క దగ్గరగా వెళుతున్నాడు.

అప్పుడు ఊహించని సంఘటన జరిగింది.

వీళ్లు కుక్క వెనగ్గా వెళుతుండగా ఊహాతీతంగా ముందునుండి మరో బృందం మరో ఇంటి చాటునుండి హఠాత్తుగా వీధిలోకి వచ్చింది. రెండు బృందాలు ఒక్కసారిగా దగ్గరకు వచ్చేసరికి బెదిరిన కుక్క ఆ సన్నని సందులు గొందుల గుండా మాయమైంది. మొత్తం ఆరుగురూ ఆ కుక్క కోసం పరుగులు పెట్టారు. అన్ని ప్రక్కలా చుట్టుముట్టి ఎలాగైతేనేం దానిని పట్టుకున్నారు. లిప్తలకాలంలో దాని నోరు మూసేశారు. పీక పిసికేశారు. గిలగిల కొట్టుకుంటున్న దాని నాలుగు కాళ్లను విడదీసి దాని శరీరాన్ని చీల్చేశారు. రక్తం పలుచగా చిమ్మింది. ముఖంపై పడిన రక్తపు చుక్కలు వేలితో తీసి వేగంగా నోటితో నాకి తృప్తిగా గుటక వేసాడొకడు. సన్నగా కారుతున్న రక్తాన్ని దోసిలితో పడుతూ ఆబగా నోట్లో పోసుకుంటున్నాడొకడు. మొత్తంగా ఏడుగురూ అత్యంత వేగంగా ఆ కుక్క శరీరాన్ని చీల్చేస్తూ అప్పటికప్పుడు నమిలేస్తున్నారు.

మరికాసేపటికి మిగిలిన శరీరభాగాలను తలో ముక్క పంచుకుని భార్యా పిల్లల కోసమన్నట్లు పరుగులు పెట్టారు.

ఇంచుమించు ఇలాంటి దృశ్యాలే కాకతీయ రాజ్యమంతటా.. సామంత రాజ్యాలలో కూడా.

కరువు మరింత విలయతాండవం చేస్తోంది.

ఊరు ఊరంత వేడిగాలులు. తెల్లవారాక ఏ కొద్ది సమయమో చల్లదనం. ఆనక అంతా వేడిగాలులు.. ఎండలు..

ఎండలు.. ఇంకా ధనుర్మాసం ముగియలేదు. అప్పుడే ఎండలు.. ‘శివరాత్రికి శివ శివా అంటూ చలి వెళ్లిపోతుంద’ని ఊళ్లో నానుడి. అసలు జనానికి ఎప్పుడు శివరాత్రో.. ఎప్పుడు చలి వచ్చిందో.. ఎప్పుడు పోయిందో.. తెలియదు.

తెలిసిందల్లా కేవలం ఉడకబెట్టే వేడి. నిన్న మొన్నా కాదు గత ఏడేళ్లుగా కరవు. ఏడేళ్లనాడు మెల్లమెల్లగా మొదలయింది. వానలు తగ్గాయి. వేడిగాలులు హెచ్చాయి. రెండో ఏడు పంట తగ్గుముఖం పడుతున్నట్లు రైతులు గుర్తించారు. వాన తగినంత కురవలేదు. మూడో ఏడు కురిసీకురియని వానలతో సాగుచేసినా పంట మరింత తగ్గింది.

మూడేళ్ల వరకు ఎప్పటిలాగే బ్రతకగలిగారు. కాకపోతే పెళ్లిళ్లు లాంటి సంబరాలు కొందరు వాయిదా వేసుంటే కొందరు ఉన్నంతలో జరుపు కున్నారు.

నాలుగో ఏడాది నుండి ఇదొక కరవు సంవత్సరమని గుర్తించారు. వర్షాలు కురవడం లేదు. ఖర్మ ఏవిటంటే అదే సమయంలో ఎండలు మరింత ఎక్కువయ్యాయి. చెరువుల్లో, బావుల్లో ఉన్న కాసిని నీళ్లూ ఆవిరై ఎండిపోయాయి. ముందుగా అందున్న కప్పలు మాయమౌతాయి. అంటే చచ్చిపోవచ్చు లేదా ముందే మరో బావిలోకో.. చెరువులోకో వెళ్లిపోవచ్చు.

కరవు అనే మహమ్మారిని గుర్తించాక గ్రామదేవతలకు మొక్కు కుంటారు. కొలుపులు చేస్తారు. కప్పల పెళ్లిళ్లు లాంటివి చేసి వానదేవుడి కోసం పొర్లు దండాలు పెడతారు. ఒకరి వొంటిపై గ్రామదేవత పూని, బలి కోరుతుంది. నాలుగు ఎనుబోతులు, రెండు డజన్లు కోళ్లు, పది పల్లికల అన్నం వారబోయ మంటుంది. ఆనందంగా ఏకగ్రీవంగా ఊరు ఊరు ఏకమై చేస్తారు. ఊహు. ఒక్క చుక్క నీటిబొట్టు రాలితే ఒట్టు.

తర్వాత సోది చెప్పే ఎరుకల ఆమెకు గిరాకి. ఇదిగో అదిగో వర్షం అని చెప్పి బంగారంలా దాచుకున్న కాసిని గింజల్లో నాలుగు గుప్పిళ్లు పుచ్చు కుని పోతుంది. అసలు ఆకాశంలో మేఘాలే కనిపించవు. అంతా తెల్లని ఆకాశం. పాలిపోయిన ఆకాశంలాగే రోజు రోజుకూ పాలిపోతున్న మనుష్యులు..

గ్రామాలలో చాలా కుటుంబాలు గుంపులు గుంపులుగా ఉంటాయి. అంటే నాలుగు, మూడు తరాల ఓ పెద్ద ఉమ్మడి కుటుంబం. వాళ్ల కష్టసుఖాలు వాళ్లంతా పంచుకుంటారు. చర్చించుకుంటారు. ఎలా బతకాలి అనేది ఆయా కుటుంబ పెద్దలు అంచనా వేస్తూ.. చూస్తూ పరిస్థితులను ఆకళింపు చేసుకుని ఓ శుభదినాన మూటా ముల్లె సర్దుకుని పిల్లా పాపలతో, ముసలి ముతకలతో పాటుగా ఆవులు, ఎద్దులు, గేదెలు, గాడిదలు, కుక్కలు, కోళ్లు, బాతులు.. సమస్త ఆత్మీయ పెంపుడు జంతువులతో కలిసి.. ఊళ్లో దినమూ కలిసే ఆత్మీయ మిత్ర కుటుంబాలు వస్తామంటే వాళ్లను కూడా కలుపుకుని ఊరు వదలి వెళ్లిపోతారు.

వెళ్లేటప్పుడు వీడ్కోలు ఓ భరించరాని విషాద సన్నివేశం.

కానీ అది భరించక తప్పదు. గుండెబరువుతో సాగిపోక తప్పదు. తప్పని పరిస్థితుల్లో నడవలేని ముసలివాళ్ల ను అక్కడే వదిలివేయక తప్పదు.

“ఇయ్యాలో రేపో పోయేవాళ్లం కొడుకా.. మమ్మల్ని వదిలెయ్యి. ఎవరైనా దయగల తల్లులు ఇంత ముద్దపెడితే తింటాం. మరి నాలుగురోజులు బతికి ఉంటాం లేకుంటే పోతాం. మీరంతా పచ్చగా ఉన్న మరో ఊరు, మరో అడవి, మరో రాజ్యం చూసుకుని వెళ్లండి. పిల్లాపాపలతో హాయిగా బతకండి..” అని పెద్దలు చెబుతారు. “భలేవాడివి నాన్నా.. నిన్నువదిలి వెళ్లేదే లేదు. ఉన్నంతáకాలం అందరం కలిసే ఉంటాం. ఆ దేవుడు ఎవరిని ఎప్పుడు పిలుస్తాడో తెలియదు కదా. కాస్త ఓపిక చేసుకో.. అట్టా అట్టా.. కూర్చుంటా లేస్తా కలిసే పోదాం” అంటారు కొడుకులు.

కోడళ్లు ఈ విషయంలో మౌనంగా ఉంటారు.

కాని బయలుదేరేటప్పటికి పరిస్థితి వేరు. ఒకవేళ పండు ముదుసలులు వెంట కదిలినా ఎక్కడో దారిలో ఓ అడవిలోనో.. ఓ గుడి వద్దో.. ఓ యాచకుల గుంపు వద్దో వాళ్లను వదిలేసి వెళ్లిపోక తప్పదు. అంతెందుకు బాగా బరువున్న పిల్లలను కూడా మోయలేక.. వాళ్ల ఏడుపులు భరించలేక ఎక్కడో ఓచోట వదలివేసి వెళ్లిపోతుంటారు.

ఇది మూడవ ఏడాది దృశ్యం.

******

ప్రపంచంలో సామాజిక జీవన పరిణామ చరిత్రలో కరువు కాటకాలు లాంటి ప్రకృతి బీభత్సాలు మానవ వికాసాన్ని పరిహసించిన చరిత్ర అంతో ఉంది. ప్రపంచాన్ని, రాజ్యాలను, వ్యవస్థలను, సామాజిక వర్గాలను, సాధారణ ప్రజలను సర్వ నాశనం చేసిన ప్రకృతి విలయతాండవాలు ఎన్నో.

దుర్మార్గులైన మహారాజులు, యుద్ధాలు ఆయా సమాజాలను సర్వనాశనం చేశాయి అనుకుంటారు కాని ప్రకృతి విపత్తులు రాజ్య చరిత్రలను తిరగరాసిన సంఘటనలు కోకొల్లలు.

నీరు, ఎండ, వాన, చలి.. తదితర ప్రకృతి అంశాలన్నీ మానవులు బతకడానికి అత్యంత ముఖ్యం. కాని ప్రకృతి వనరులు ఉండవలసిన స్థాయి కంటే ఎక్కువయినా ప్రమాదమే తక్కువయినా ప్రమాదమే. ప్రజలు అల్లాడిపోతారు. బతుకులే ఆగమాగం అవుతాయి. సమాజమే అల్లకల్లోలం అయిపోతుంది.

వర్షం.. వర్షం.. నీరు.. నీరు!

సర్వమానవాళికి నీరే ముఖ్యం. నీరు అంటే వర్షం. వర్షం అంటే ఏడాది.. ఓ కాలగమనానికి కొలత, సంవత్సరం అనేది కూడా వర్షం అంటారు మన పూర్వీకులు.

ఆ వర్షం ఎక్కువగా కురిస్తే అతివృష్టి.. అదొక విలయం.

వర్షం తక్కువగా కురిస్తే అనావృష్టి.. అదొక ప్రళయం.

అతివృష్టితో అప్పటికప్పుడు నాశనం జరిగి పోతుంది. ఉండేవాడు ఉంటాడు. పోయేవాడు పోతాడు. కానీ అనావృష్టితో అలా కాదు. అది ఏళ్లకేళ్లు సమాజాన్ని పట్టి పీడిస్తుంది. నెమ్మది నెమ్మదిగా మనిషి నుండి ఊరును.. ఊరు నుండి స్థలను.. స్థల నుండి విషయను.. విషయ నుండి మండలాన్ని.. మండలం నుండి రాజ్యాన్ని.. మొత్తంగా జాతి మూలాలనే నిర్మూలిస్తూ పోతాయి.

అవే కరవు కాటకాలు.

అలాంటి కరవు ఇప్పుడు కాకతీయ రాజ్యాన్ని.. దాని సామంత, మహాసామంత రాజ్యాలను పట్టి పీడిస్తోంది.

ఒక్క ఏడాది వర్షాలు తక్కువ కురిస్తే అదో సమస్య.. తట్టుకోవచ్చు. ఒక ఏడు వర్షం ఎక్కువ కురిస్తే కొంత ప్రాణ నష్టం జరుగుతుంది. దానిని భరించవచ్చు.

కాని ఏడాదికేడాదికి వర్షం కాదు కదా చుక్క నీరయినా కురవకపోతే దానిని ఏమనాలి!!?

అదే ఇప్పుడు పరిస్థితి.

కరవును ముందుగా గుర్తించే విధానాన్ని కూడా మానవుడు ఇంకా ఏర్పాటు చేసుకోలేదు. కరవు కాలంలో.. సాధారణ సమాజం ఉన్నట్టుండి అసాధారణంగా మారిపోతుంది. రైతులు రోజూ పొలాలకు పోతుంటారు. గేదెలు, ఎద్దుల బళ్లు, మేకల అరుపులు, మహిళలు లేచి వీధుల్లో కల్లాపు చెల్లడం, పాలు పితకడం.. వడ్లదంపుళ్లు, అటూ ఇటూ తిరుగుతుండే చాకళ్లు, మంగళ్లు, మాదిగలు, తమ తమ వృత్తిపనుల్లో నిమగ్నులౌతారు. ఈలోగా పంచాణం వారు తమ కొలిములు సిద్ధంచేసు కుంటారు. ఇలా అందరూ తమ తమ పనుల్లో నిమగ్నమవుతుంటారు.

దైనందినం ఇలా ఎప్పటిలా కనిపిస్తుండగానే చాప క్రింద నీరులా మెల్లమెల్లగా ఎవరూ స్పష్టంగా గుర్తించని కాలం నుండి కరువు జాడలు మొదలౌ తాయి. కరవు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే వర్షాలు ఆగిపోవడం. కురిసినా తగినంత కురవక పోవడం. ఈ వర్షాలు ఒక్కసారిగా పూర్తిగా ఆగిపోవు. కరవు.. రైతు గుర్తించలేనంత గమ్మత్తుగా మొదలౌతుంది. అది పూర్తిగా గుర్తింపులోకి వచ్చి రాజ్యానికి కరువొచ్చింది అని స్పష్టమయ్యేసరికే సగం మంది రైతులు రైతుకూలీలుగా మారిపోతారు. అప్పటికే రైతు కూలీలుగా బతుకుతున్నవాళ్లు ఉన్న గ్రామంలో పని దొరక్క ఆ గ్రామాన్ని వదిలేసి కుటుంబాలుగా.. కుటుంబ బృందాలుగా పని వెదుక్కుంటూ వెళ్లి పోతారు.

వృత్తులన్నీ మెల్లమెల్లగా మూలబడతాయి. చాకళ్లు, మంగళ్లు తమ వృత్తిని మానేస్తారు. అంటే ఎవరి బట్టలు ఉతకరు. ఎవరికీ క్షౌావరం చేయరు. తమ పంటలో వారి వాటా వారికి ఇవ్వడానికి రైతుకి పంట ఏది?

రెండు మూడేళ్లకు ఈ దైనందినం పూర్తిగా మారిపోతుంది.

పొలాలకు వెళ్లడం అనేది ఉండదు. కల్లాపు చల్లెందుకు కూడా నీటి కరవు. పితకడానికి పశువులకు పాలు ఉండవు. మేకల అరుపులు, కోళ్ల గోల, బాతుల బెకబెకలు వినపడవు. రాత్రుళ్లు కప్పల బెకబెకలు వినరావు. ఎడ్లబళ్ల గరగరలు లేవు. మేకలు, గొర్రెలు, కుక్కలు, కోళ్లు, బాతులు లాంటి ఇంటి జంతువులు మెల్ల మెల్లగా కనిపించడం తగ్గి పోతుంది.

తర్వాత మనుషులు కూడా కనిపించడం తగ్గిపోతుంది.

ఆ స్థితిగతులున్న కరవు కాలంలో మొదటగా గ్రామం పూర్తిగా చీకటిమయమైపోతుంది. కారణం గ్రామ సమయం వారు దీపాలు వెలిగించే ఆముదపు నూనె కొనడం మానేస్తారు. అంతా.. గ్రామమంతా.. ఇంటింటా.. బ్రతుకంతా చీకటిమయం.

ఈ కరవు కాటకాలు, మసూచిలు, ఆటలమ్మలు.. మూకుమ్మడిగా ఊరు వదిలేసి అడవుల్లో కాపురాలు,

ఊరంతా మూకుమ్మడి సావులు.. ఈ దారు ణాలు, దౌర్భాగ్యాలకు దేవుడే దిక్కు అని రక్షించండి దేవుడో అని దేవుడికి మొరపెట్టుకుంటారే గాని కాపాడు ప్రభో.. పన్నులు వసూలు చేసుకుంటున్న మహాప్రభో అనరు.

ఏడేళ్లుగా కరవు కాటకాలు కాకతీయ రాజ్యాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వందల వేల గ్రామాలు శ్మశానాలు అవుతున్నాయి. డొంకల్లో దారుల్లో జంతుకళేబరాలే కాదు మానవశవాలు కూడా పడి కనిపిస్తున్నాయి. పీక్కూ తినడానికి కుక్కలు కూడా లేవు. ఆ కళేబరాలు కుళ్లిపోయి దరిదాపుల్లోని గ్రామాలలో అంటువ్యాధులు పుట్టి మరింత మందిని హరిస్తున్నాయి.

అయితే ప్రకృతిని మనిషి నిర్దేశించలేడు. ఇప్పటివరకు ప్రకృతికి తలవంచి మనిషి బ్రతుకు తున్నాడు. ప్రకృతి ఆగ్రహిస్తే బ్రతికితే బ్రతుకు తున్నాడు. చస్తే చస్తున్నాడు.

ప్రస్తుత వ్యవస్థ ఉన్న తీరు ఇది.

కాని తమ ఈ దౌర్భాగ్యాన్ని రూపుమాపండి అని పాలకులను ఆడగడం ఇప్పుడిప్పుడే మొదలవ్వ బోతోంది.

*****

నాలుగవ ఏడాది.. బుక్కలూరు ఓ చిన్న పల్లెటూరు.

కోమలి కుర్ర భార్య. వరదయ ముసలి భర్త. బాల్య వివాహం. ఆమెకు ముక్కు చీమిడి తీసుకోవడం రాకముందే పెళ్లి చేశారు. అప్పటికి వరదయ ఓ భార్య చనిపోయి రెండో పెళ్లికి సిద్దమైనవాడు. నెత్తి అంతా తెల్ల వెంట్రుకలు,

గెడ్డంలో అక్కడక్కడా నల్లవెంట్రుకలు కనిపిస్తున్న వయస్సు. అప్పటికి నాలుగైదు పెళ్లి సంబంధాలు చూశాడు కాని అమ్మాయి తండ్రి అనేవాడు అంగీ కరించలేదు. ఎక్కడో ఒక్కడు.. ఒక్క పరమ సన్నాసి.. సొమ్ముకు కూతురును అమ్ముకునేవాడు దొరక్కపోతాడా? అన్న ఆశతో ఓపిగ్గా వెదగ్గా కోమలి తండ్రి దొరికాడు. కోమలి తండ్రి మామూలు సన్నాసి కాదు పరమ నికృష్టుడు, అతి దరిద్రుడు. పిల్ల మరీ పసిది అంటే ‘పసిడిది’ అని మురు సుకుని వరదయ్యకు కట్టేశాడు. పెళ్లి తర్వాతే ఈ కాలపు ఆడపిల్లలకు తండ్రి ఎంత పాపో.. కొనుక్కున్నవాడు ఎంత పరమనీచుడో అవగతమౌతోంది. నా రాత నా గీత అని అన్ని భరిస్తుంది.

అది నిన్నటి వరకు.

ఈ కాలపు అమ్మాయిలు అలా సరిపెట్టుకోవడం లేదు. కానీ వ్యవస్థ అలా చచ్చింది కాబట్టి వెళ్లక తప్పడం లేదు. కాపురానికి వెళ్లేముందే.. వెళ్లాకా అక్కడ సదరుమొగుడిని ఎలా ముప్పుతిప్పలు పెట్టాలో ఆలోచించుకుని మొత్తం ప్రణాళికతో వెళుతున్నారు.

అలా వచ్చిన ఈ కాలపు భార్య కోమలి. రెండు మూడేళ్లు కాపురం చేసిందో లేదో ఈ కరువు వచ్చిపడింది.

భర్తకున్న కాస్తంత కొండ్ర ఇద్దరూ కలిసి సేద్యంచేసి రెండింతలు చేశారు. పిల్లలు పుట్టే అదృష్టం లాంటిది లేదని ఇక ఈ జన్మకు ఈ భర్త బ్రతికుండగా పిల్లల ప్రసక్తే లేదని గుర్తించిన కోమలి వీధిలో అందరికి ఆ ముచ్చట బాహాటం గానే చెప్పి నవ్వించేది.

ఏడాది పైబడినకొద్దీ కోమలి మరింత నునుపుతేలి మిలమిలమెరిసిపోతుంటే వరదయ్య కుళ్లిన కూరగాయలాగా ముడుచుకుపోతున్నాడు. కరవు కాలం మొదటి మూడేళ్లు గాదెలో ఉన్న వడ్లు దంచుకుని తిన్నారు. నాలుగో ఏడు దంచిన బియ్యంతో తను మాత్రమే తిని భర్తకు ఏవో నాలుగు మెతుకులు పడేసేది. రెండునెలలు తిట్టాడు. అరిచాడు. పోట్లాడాడు. మూడోనెల నుండి కడుపులో ఎలకలు తిరుగుతుంటే ఆకలితో ఏడ్చాడు. ఐదో నెలనుండి కడుపులో ఎలకలు కూడా తిరిగి తిరిగి చచ్చాయి. దాంతో జ్ఞానోదయమయ్యింది. బాగా నీరసించి పోయి కూర్చుంటే లేవలేడు కాబట్టి కర్ర చేతికిచ్చింది. అది పుచ్చుకుని ఎట్లాగొట్లా కాల కృత్యాలు తీర్చుకునే శక్తి కలిగేలా తిండి పెట్టేది. ఊళ్లో తనలాంటి దౌర్భాగ్య ముసలి మొగుళ్లు ఎవరున్నారో తెలుసుకుని అంత కలిసి ఓ చెట్టుక్రింద చేరి కుళ్లి కుళ్లి ఏడ్చేవాళ్లు.

(సశేషం)

మత్తిభానుమూర్తి

About Author

By editor

Twitter
YOUTUBE