‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన
“బాయిగారూ.. తమరికోసం దేవగిరి రాజ్యం నుండి వార్తాహరుడు ఏదో ముఖ్యమైన వార్తట.. తీసుకుని వచ్చా డు..” చెప్పి మళ్లీ కిందికి వెళ్లిపోయాడు శెట్టి.
ఆశ్చర్యంగా ఆ వేగు నుంచి వార్త లిఖించిన పట్టువస్త్రాన్ని అందుకుని చదివింది.
“కేయూరదేవుడు కొందరు ఆరే వీరులతో అనుమకొండకు వెళ్లి గణపతిదేవుని శరణువేడగా ఆయన ఆశ్రయం కల్పించినట్టు తెలియవచ్చింది.”
కేయుర దేవుడు పోయి పోయి ఆ గణపతి దేవునితో కలిశాడా??
పగకు అసహ్యమనే ఆజ్యం పోసినట్లయ్యింది.
పెద్ద పెద్దగా పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఆ లేఖను విసిరికొట్టింది బాల కవ్వల.
****
ఐదవ మెట్టు: ప్రకృతి విలయతాండవం.
వైద్యం అనే వ్యవస్థ చరిత్ర ప్రారంభానికి ముందే ఏర్పడిన మానవ సంక్షేమ వ్యవస్థల్లో మొదటిది. జ్వరపీడితుడైన ఆదిమానవుడు శరీరం వేటకు సహక రించనప్పుడు తన మనుగడ కోసం వెంపర్లాడాడు. అప్పుడే అనారోగ్యాన్ని గుర్తించాడు. ఆరోగ్యమూ, అనారోగ్యమూ కలిసే మనిషితో సహజీవనం చేస్తాయని గుర్తించాడు. బతకడం కోసం దేవుడిని దెయ్యాన్ని పూజించడం ప్రార్థ్ధించి మాత్రమే చేసి ఊరుకోలేదు. తన వేట సహచరులైన పెంపుడు జంతువులు.. క్రూs మృగాలు.. ఏఏ జబ్బుల బారిన పడుతున్నాయో పరిశీలించాడు. గడ్డి కొరికి లిప్త కాలంలో తిరిగి ఊసి వేస్తున్న ఉడుతలు, కుందేళ్లు, గేదెలు, ఆవులు.. అలా గడ్డి తినే జంతువుల ప్రవర్తనను గుర్తించడమే అతని తొలి వైద్య పరిశోధన. అంటే ఆ గడ్డి, ఆ చెట్టు కాయలు, ఆకులు తిన కూడదన్నమాట. నోట్లోకి వెళ్లిన దానిని బట్టే శరీరానికి ఆరోగ్యం, అనారోగ్యం కలుగుతున్నాయని గుర్తిం చాడు. ఆ కాలంలోనే ఈ ఆరోగ్య అంశాలపై దృష్టి పెట్టిన కొందరిని దేవతల్లా కొలవడంతో అధర్వణ వేదకాలానికి, వైదŠ్యవ్యవస్థ ప్రతిభావంతులైన వైద్యులు ఏర్పడ్డాయి. అదే ఆయుర్వేదం అనే పేరుతో ఉపవేదంగా స్థిరపడింది. ఏమి తింటే అనారోగ్యం, ఆ అనారోగ్యానికి నివారణోపాయం, ఆ మందు మాకులు ఏవిటి? ఇలా వైద్యం విస్తరిస్తూ పోయింది. గణాలు, జనపదాలు, చిన్న రాజ్యాలు ఏర్పడేనాటికి వ్యక్తి అనారోగ్యం ఏన్ని రకాలు.. వాటికి తగిన మందులు.. కొంతవరకు సమాజంలో స్పష్ట మయ్యాయి.
వ్యక్తిగత దగ్గులు, జ్వరాల సంగతి అటుంచి ఒకరి నుండి మరొకరికి అంటుకుని అందరినీ.. ఊళ్లకు ఊళ్లనే చంపేసే అంటు వ్యాధులను గుర్తించాడు. వణికి పోయాడు. వాటికి అపరిశుభ్రతే ప్రధాన హేతువని గుర్తించాడు. ఇంటి శుభ్రత, ఒంటి శుభ్రత మాత్రమే కాదు.. వీధుల శుభ్రత, పరిసరాల శుభ్రత కూడా ఆరోగ్యానికి అవసరమని అంతగా తెలియని కాలం. ఆ తరహా సమాజ శుభ్రతకు అధికప్రాధాన్యత ఇచ్చినవాడు అశోక చక్రవర్తి. వీధులను శుభ్రం చేయించడం, అన్ని గ్రామాలలో మొక్కలు నాటించడం, బావులు తవ్వించడం తదితర కార్యక్రమాల ద్వారా సామాజిక పరిశుభ్రతకు అశోకుడు అధికప్రాధాన్యం ఇచ్చాడు. తద్వారా అంటువ్యాధులు గణనీయంగా తగ్గాయి. ఆ తర్వాత సమాజ శుభ్రతకు అంతటి ప్రాముఖ్యత ఇచ్చిన మహారాజు లేడు. దీనిపై ఈ శిబిరం తీవ్రంగా చర్చించి మన రాజ్యాలలో సామాజిక శుభ్రతకు తగిన ప్రణాళికలను రూపొందించుకోవడం తక్షణ కర్తవ్యమ్.
‘పరహిత వైద్యరత్న’ దీవి గోపాలాచార్యులు.. శిబిరంలో ఆ దేవుడు, ప్రకృతి కరుణిస్తే మనమంతా ఎన్నో వీరత్వ కబుర్లు, రాజ్య విస్తరణ, సాహిత్యం, ఆటలు, పాటలు, తెలుగులో అనువాదాలు, స్వతంత్ర కావ్యాలు, నాటకాలు, నాట్యాలు, వాణిజ్యం, పరదేశీ వాణిజ్యం.. ఎన్నైనా చెప్పుకోవచ్చు. కానీ సమాజాన్ని అతలాకుతలం చేసే కరవు కాటకాలు, వరదలు, ఉప్పెనల సంగతి ఏమిటి? ఆర్యావర్తపు రాజ్యాల సంగతి వదిలేయండి. ప్రకృతి విలయ విధ్వసం, విపత్తులతో మన రాజ్యాలు అతలాకుతలం అవ్వడం లక్షలాది మంది చనిపోవడం మనందరకూ అనుభ వమే. ఈ విపత్తులు సమాజాన్ని అతలా కుతలం చేస్తున్నాయి. సామాజిక సమీకరణాలు మారిపోతు న్నాయి. ఈ వరదలు, ఉప్పెనలు, మాయదారి అంటురోగాలవల్ల ఊళ్లకు ఊళ్లు నామరూపాలు లేకుండా పోతున్నాయి. పాడి పంటా, గొడ్డు గోదా ఊడ్చిపెట్టుకుపోతున్నా యి. రాజులు ప్రజల గురించి కంటే పన్నుల వసూలు ఆగిపోతుందని దిగులు పడుతున్నారు కాని ప్రజల ప్రాణాలను ఎలా కాపాడాలి? అని తలపోయడం లేదు. ప్రజలకు దేవుళ్లను వేడుకోవడం, పూజారులు చెప్పిన మంత్ర తంత్రాలను నమ్మడం, బలులు ఇవ్వడం తప్ప మార్గాంతరం లేకుండాపోయింది. మన రాజుగారిని నిలదీసి అడుగుదామనే కనీస ఆలోచన కూడా ఇప్పటివరకు ప్రజలకు లేదు. పన్నులు వసూలు చేసుకుంటున్న మహారాజులు మమ్మల్ని కాపాడటానికి ఏమీ చేయడం లేదన్న బాధా వారిలో ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. అప్పుడప్పుడు స్థానిక ‘స్థల’ పాలకులకు విజ్ఞప్తులు చేయడం, గ్రామాధికారులను నిలదీసి అడగడం చేస్తున్నారు. ఇకపై ఈ పరిస్థితి ఉండ గూడదు మహారాజా! ఈ విపత్తుల నివారణ రాజ్యవ్యవస్థ తీవ్రంగా పరిగణించాలి. దీనిపై దృష్టి పెట్టాల్సి ఉంది. ఈ చింతనా శిబిరం దీనిపై చర్చి స్తుందని భావిస్తున్నాను.
ప్రకృతి విపత్తుల నిపుణుడు, వాతావరణ శాస్త్రవేత్త వెంకటావధానులు
“మన రాజ్యాలన్ని ప్రాకృతంగా వ్యవసాయ సమాజాలు. వ్యవసాయానికే కాదు మన బ్రతుకులకే ప్రధాన వనరు నీరు. మన రాజ్యాలలోనే కాదు ప్రపంచమంతటా నీటి చుట్టూ.. నీటిపైనే.. నాగరికత వెల్లివిరుస్తోంది. మన అఖండ భారతాన్ని విదేశీయులు సింధూదేశంగా పిలుస్తారు.. అంటే సింధూ నదీ పరివాహక ప్రాంతమనే కదా అర్థం. ఇక ఈజిప్టు నాగరికత నైలునదీ తీరాన వికసిస్తే యూఫ్రటిస్, టైగ్రిస్ నదుల పరీవాహ రాజ్యాలే గ్రీకు,బాబిలోనియా రాజ్యాలు.
మన దక్షిణావర్తంలోని చోళరాజ్యంలో కావేరి నదికి వరదలు చోళరాజ్య ప్రజలను సర్వనాశనం చేసేవి. అప్పుడే తొలి చోళరాజు కరికాలచోళుడు కావేరి నదికి ఆనకట్టలు కట్టి నదీ ప్రవాహాన్ని నియం త్రించి ఎన్నో ప్రాణాలను కాపాడాడు. పంటలు, ప్రజలు నాశనం కాకుండా రక్షించాడు. సింధూ రాజ్యాలకు మార్గదర్శి అయ్యాడు. ఆ నీటి యజ్ఞంలో పాల్గొన్న వంశం నాది.
తెలుగురాజ్యాలకు నీటి కొరత లేదు. బావి తవ్వి ఇల్లు. చెరువు తవ్వి ఊరు నిర్మించే సంస్కృతి మనది. ఇక మన చుట్టూ చెరువు, సరస్సు, కొలను, కుంట, మడుగు.. ఇలా ఎన్నో పేర్లతో నీరు మన చుట్టూనే ఉంది.. ఇప్పుడు దేనిని నది అంటారో.. దేనిని వాగు అంటారో చెబుతాను.
నీరు.. దాని విభిన్న రూపాలను మధుర రాజ్యం నుండి వచ్చిన నీటివనరుల నిపుణుడు పండిత శ్రీప్రసాద నాయక శిబిరంలో వివరిస్తున్నాడు.
“పడమర నుండి తూర్పునకు ప్రవహించి తూర్పు సముద్రంలో కలిసేది నది, తూర్పు నుండి పడమరకు ప్రవహించి పశ్చిమసముద్రంలో కలిసేది నదం, కడలిలో కాకుండా పెద్దనదిలో కలిసేది దాని ఉపనది. మైదానం లాంటి సమతల ప్రదేశంలో తక్కువ దూరం ప్రవహిస్తూ వ్యవసాయానికి ఉపయోగపడుతూ ఆఖరున పెద్ద నదిలో కలిసే దానిని ఏరు అంటారు. పర్వతాల మధ్యల్లో కొండనెర్రల్లో పుట్టే నీటి ఊటను సెల అంటారు. కొండల్లో పుట్టి ప్రవహించేది సెలయేరు. కొండలమీదుగా శబ్దంచేస్తూ ప్రవహించేది వాగు. ఒక దిక్కునుండి మరో దిక్కుకు వంపులు వంపులుగా ప్రవహించే దానిని వంక అంటారు. తూర్పుకనుమల వాలులో పుట్టి వేగంగా ప్రవహించే కొండ వాగులను గెడ్డ అంటారు. మహానదుల నీటిని మళ్లించడానికి తవ్విన నదీ పాయలను కాలువ అంటారు. కొండల నుంచి దూకి అడవుల గుండా ప్రవహించే దానిని కోన అంటారు. ఊరి దగ్గరగా వెళుతున్న నదుల ప్రవాహాన్ని ఉపయోగించుకోవడానికి నిర్దేశించిన చోటును రేవు అంటారు. కొండల మధ్య చిన్నచిన్న నీటి గుంటలను సరి అంటారు. ఈ సరిలన్నీ కలిసి నది అవుతుంది కాబట్టి నదికి మరొ పేరు సరిత. పెద్ద నదులు అనేకానేక చోట్ల వరదల వల్ల, ఉప్పెనల వల్ల ఏర్పడ్డ చిన్న ప్రవాహాలను పాయ అంటా రు. అనేకానేక చిన్నచిన్న ప్రవాహాలు కలిశాక కొండల పైనుంచి పెద్దశబ్దంతో ఉరికే ప్రవాహాన్నే జలపాతం అంటారు. ఈ జలపాతాలు ఉధృతంగా దూకడం వల్ల ఏర్పడిన పెద్ద చెరువులాంటి దాన్ని గుండం అంటారు. భూజలం కూడా మనకు గొప్ప నిధి. కొన్నిచోట్ల భూమి లోపలి రాతి పొరల మధ్య నుండి పైకి ఉబికే జలధారనే నీటి బుగ్గ అంటారు. ఈ నీటి ప్రవాహాల వల్ల అక్కడక్కడా నీరు నిలిచి ఉంటే దానిని మడుగు అంటారు.
ఇక మన చిన్నచిన్న రాజ్యాలన్నింటిని కలిపేసి మనం ఊహిస్తున్న తెలుగుసామ్రాజ్యాన్ని తీసుకుంటే ఇందులో దాదాపు డెబ్బై నదీ పరీవాహక ప్రాంతా లున్నాయి. గోదావరి, కృష్ణ, పెన్నా, నాగావళి, వంశధార, ముచికుంద అనేవి అతి పెద్ద నదులు. శారద, వరాహ, స్వర్ణముఖి, బుడమేరు, రోశీపేరు, గుండ్లకమ్మ, కాళంగి.. వంటివి ఉపనదులు.. ఇలా సహజంగా ఏర్పడిన ఎన్నెన్నో వాగులు, వంకలు, సెలయేళ్లు, పాయలు, జలపాతాలు, గుండాలు.. ఉన్నాయి మహారాజా. వీటన్నింటి వలన అనాది నుంచి వ్యవసాయాన్ని దినదిన ప్రవర్ధమానం చేస్తూనే ఉన్నాడు రైతు. ఈ ఆధునిక కాలానికి కృష్ణానది పన్నెండు చిన్నరాజ్యాల గుండా ప్రవహిస్తూ పోయి రెండు మూడు చీలికలు అయ్యి అవి దివి రాజ్యం దగ్గరలో సముద్రంలో కలుస్తాయి. నదిపై ఏమీ చేద్దామన్నా ఈ పన్నెండు మంది రాజులు ఒక్కమాటకి కట్టుబడి ఉండటం జరగదు కాక జరగదు. కాబట్టి రాజ్యాలన్నింటిని కలిపితే కాని ఈ నీటివనరులను సమర్థమంతంగా ఉపయోగించుకోవ డానికి సాధ్య పడదు. గోదావరి నది పాతిక రాజ్యాల గుండా పోతుంది. ఈ అద్భుత నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలంటే ఏలినవారు ఈ చిన్న రాజ్యాలను జయించి ఏకం చేసి విస్తృత తెలుగు సామ్రాజ్యాన్ని స్థాపించి తీరాలి. అప్పుడే ప్రజలకు ఈ ప్రకృతి వనరుల ప్రళయాలనుంచి శాశ్వత రక్షణ ఏర్పడు తుంది.”
నీటి వనరుల నిపుణులు పండిత శ్రీ ప్రసాద నాయక, మధుర రాజ్యం, చింతనా శిబిరంలో..
* * *
శకునాలపల్లె, కోవెలకుంట్ల రాజ్యం కోవెలకుంట్ల రాజ్యంలో ఓ సాధారణ గ్రామం శకునాలపల్లె. సాధారణ పేద గ్రామం.
కోవెలకుంట్ల మెట్ట ప్రాంత రాజ్యం. కాలువలు లాంటి నీటి వసతులులేని రాజ్యం. గ్రామానికో చెరువున్నా వర్షం కురిస్తేనే అవి నిండేది.. కప్పలు బెకబెకలాడేది. వర్షాధారమే వ్యవసాయం. వ్యవసాయాధారమే జీవనం. అలాంటి శకునాల పల్లె ఇప్పుడు సంతోషసాగరమై పొంగిపోతోంది. కారణం ఇటీవల కురిసిన వర్షాలు. ఏనాడూ లేనంత ఉధృతంగా ఇళ్ల కప్పులు ఎగిరి పోగొట్టిన తీవ్రమైన గాలులతో.. ప్రచండ ఉరుములు, మెరుపులతో కురిసిన అమోఘమైన వర్షాలు ఆ గ్రామీణులను పులకింపజేశాయి. గ్రామదేవతలకు, పితృదేవతలకు కనిపించిన, కనిపించని దేవతలెందరికో పొర్లు దండాలు పెట్టారు. ప్రతి రైతు దంపతులు మెత్తగా తడిసిన తమ వ్యవసాయభూమిపై సాగిలపడి దండాలు పెట్టి ఏరువాక జరిపి పూజలు చేసి దుక్కి దున్నడం ప్రారంభించారు. శకునాలపల్లె మాత్రమే కాదు కోవెలకుంట్ల రాజ్యంలోని గ్రామాలన్నిటా ఈ వర్షరుతువు తెచ్చింది వ్యవసాయ సంబరం.. పల్లె పండుగ.
గ్రామ సమయం శెట్టి వకుళయ పొలానికి పోతూ, ముందు వెళుతున్న ఓబులప్పను గుర్తించి వడివడిగా నడిచి అతనిని చేరి “ఓబులప్పా..! నిన్నటి నుండి ఏదో మురికి వాసనలాంటిది వస్తోంది నాకు. నీకూ వస్తోందా.. నాకేనా??.. నాకే అయితే నాకేదో కొత్త జబ్బు వచ్చినట్లే..” అన్నాడు.
అప్పుడు వకుళయ వైపు తలతిప్పాడు ఓబులప్ప. అతని ముఖాన్ని చూసి తెల్లబోయాడు వకుళయ. కారణం అప్పటికే తన పై పంచెతో ముక్కు మూసుకుని పొలం వైపు పోతున్నాడు ఓబులప్ప. ఆయన పై పంచెతో ముక్కు మూసుకోవడం చూసి సంభ్రంగా వకుళయ. “అరే.. నేను అదే అడగబోతు న్నాను నీకు ఏదైనా చెడు వాసన వస్తోందా అని..? ముక్కు మూసు కున్నావంటే ఏదో చెడు వాసన వస్తోందన్నమాటే..
అవును కదా ఓబులప్పా..?!”
“అవును శెట్టి. నిన్నటి నుండి నాకు ఈ వాసన ఏదో తెలుస్తోంది. మా ఆవిడతో అన్నాను. ఆవిడ ఫక్కున నవ్వి వంద యోజనాల దూరాన ఏదైనా గేదె చస్తే కూడా ఆ వాసనను మీ ముక్కు పసిగడుతుంది కదా! ఏ వాసనా నాకు రావడం లేదు అంది.
“ప్చ్.. నాకేదో.. గాలిలో తేడా తెలుస్తోంది..” అన్నాడు తలెత్తి వాసన మరీ మరీ పీలుస్తూ.
అలా అలా సందేహాస్పదంగా ముక్కులకు తాకుతున్న చెడువాసన ఏదో మరునాటికి భరించ లేనంత తీవ్ర దుర్గంధంగా మారి ఊరిని చుట్టు ముట్టింది. చిన్న చిన్న జంతువులు, పిట్టలు, పురు గులు లాంటివి ఆ దుర్గంధాన్ని భరించలేక చని పోవడం మొదలయ్యింది. మూడో రోజుకు మనుషులు.. ముదుసలి వారు, పసిపిల్లలు మరణిం చడాన్ని గుర్తించిన పెద్దలు వైద్యం కోసం పక్క ఊరికి వెళితే ఆ ఊరు అప్పటికే సగం ఖాళీ అయ్యిందని గుర్తించి గుండేలు బాదుకుంటూ శకునాల పల్లెవాసులు ఒకరికి ఒకరు చెప్పుకుంటూ మూటా ముల్లె సర్దుకుని ఊరవతల నున్న అడవుల్లోకి పరుగులు పెట్టారు.
“అమ్మోరు.. మహమ్మారి మళ్లీ వచ్చింది. గాలి తగిలితే చాలు పక్కోళ్లకి అంటుకుంటుంది. పారి పోండి దాక్కోండి. జ్వరం వచ్చినవాళ్లు చచ్చినవాళ్లతో సమానమే. వదిలేసి మీ ప్రాణాలు రక్షించుకోండి ముందు..”
విషజ్వరం గ్రామాన్ని చుట్టుముట్టింది. పిట్టలు, పిల్లులు, కుక్కలు, కోళ్లు.. రాలిపోతుండగా అయిన వాళ్లను కాపాడుకోవడానికి ఊరవతల అడవిలోకి పోయి.. అంతా ఓ చోట ఉండకుండా దూర దూరంగా చిన్న చిన్న పందిళ్లు గుడిసెలు వేసుకుని బితుకు బితుకుమంటూ బతుకుతున్నారు. వేప మండలు ఒళ్లం తా కప్పుకుంటున్నారు. సాంబ్రాణి పొగ వేసుకుంటు న్నారు. బతుకంటే ఎంత భీభత్సమో.. భయానకమో..
బతుకుపై ఆశ అంత తీవ్రమైనది.. బతకాలి.. బతకాలి.. ఎలా??
మరికొన్ని రోజులకు తెలిసింది ఏవిటంటే..
‘మొన్నటి వర్షాలకు మనమంతా ఆనందంతో చిందులు వేశాం. పొంగి పోయాం. ఆ వరుణదేవుడు కరుణచూపాడని ఆకాశానికి దండాలు పెట్టాం. కానీ నిజానికి ఆ వర్షాలకు మన పక్క రాజ్యాల గుండా పోతున్న కృష్ణమ్మ నది పొంగి పొర్లిం దట. పై రాజ్యాలలో కురిసిన వర్షాలకు నది వరద లతో తీరాలలోని గ్రామాలను, పురాలను ముంచెత్తా యట. వాటి దెబ్బకు గ్రామాలకు గ్రామాలే నామ రూపాలు లేకుండా వరదల్లో కొట్టుకు పోయాయట. ఆ గ్రామస్తులు నీటిలో మునిగి చనిపోయారట. కొన్ని గ్రామాలలో ఒక్కరు కూడా బ్రతకలేదట. శవాలు నీటిలో నాని నాని.. వాటి నుండి పురుగులు పుట్టాయట. వాటివల్ల కొత్త జబ్బులు.. అంటే అంటు రోగాలు పుట్టాయట. అవి మనల్ని ఇప్పుడు చంపుతున్నాయట. పక్క ఊరు గౌరారం వణిజుడు చెప్పాడు. వాళ్ల గ్రామంలో వేంచేసి ఉన్న వైద్యుడు చెప్పాడట.. చెప్పి చచ్చాడట. ఆయన ఎవరికో వైద్యం చేయడానికి పొతే ఆయనకే అంటువ్యాధి అంటుకుని ఆయనే గిలగిల కొట్టుకుని చచ్చాడట..”
ఎంతటి విషాదం!!
సమాచారం ఏమాత్రం బయటకు తెలియని రోజులు.. అంటువ్యాధులు కూడా ఊళ్లో ఒకరికి సోకేవరకు పక్కవారికి తెలియదు. గ్రామానికి గ్రామానికి మధ్య దూరం చాలా ఎక్కువ. మధ్య అంతా దట్టమైన అడవుల్లాంటి చెట్లు చేమలు. దారి లేని అడ్డదిడ్డంగా ఎదిగిన పొదలు, చిన్న చిన్న కొండ ల్లాంటి గుట్టలు.. అన్ని క్రూరజంతువులకు, దోపిడీ దొంగలకు ఆలవాలాలు. అందుకే ఒక్కరుగా ఎవ్వరూ గ్రామం దాటడం జరగదు. కేవలం స్థల వద్ద వారం వారం జరిగే సంతలకు గుంపులుగా వెళ్లి వారానికి కావలసిన వస్తువులన్నీ మారకానికి కొని తెచ్చు కుంటారు. సంతల వద్ద ఇరుగుపొరుగు గ్రామాల వారితో జరిపే మాటామంతీతో మాత్రమే బయటి ప్రపంచంలో ఏమి జరుగుతోందో తెలుస్తుంది. అలా తెలిసింది నదులప్రక్కనున్న గ్రామాలన్నీ వరదలతో సర్వనాశనం అయ్యాయని.
ఎన్నో గ్రామాలు పూర్తిగా వరదల్లో ఒక్క ప్రాణి కూడా లేకుండా పీనుగుల దిబ్బలయ్యాయని తెలిసినప్పుడు కోవెలకుంట్ల రాజ్య గ్రామవాసులంతా తెల్లబోయారు. అంటే తగిన వర్షాలు కురుస్తున్నాయని ఈ మెట్ట రాజ్య గ్రామీణులు ఆనందంతో వరుణ దేవుడికి చేతులెత్తి మొక్కుతున్నకాలంలోనే దూరంగా పారుతున్న కృష్ణానదీ, మరింత ఆవలగా పారుతున్న గోదావరి, ఇవతలగా పెన్నా.. వీటి ఉపనదులు వర్షాలవల్ల వరదలతో పోటెక్కి వాటి పరీవాహక రాజ్యాలలో గ్రామాలలో ఎంతటి భీభత్సాన్ని సృష్టించాయో వీళ్లకు తెలియదు.
అంటురోగాలవల్ల మాత్రమే ఆ వరదల తీవ్రత, వాటి వల్ల ఆనవాలు లేకుండా కొట్టుకుపోయిన గ్రామాలు, ఒండ్రు బురద మేట వేసిన పొలాలతో ఆ గ్రామాలన్ని సర్వం కోల్పోగా.. ఆ పీనుగుల వల్ల పుట్టిన అంటువ్యాధులతో ఈ గ్రామాలు కూడా ఇప్పుడు పీనుగుల దిబ్బలుగా మారబోతున్నాయని గుర్తించిన ఈ రాజ్యవాసులు ఇప్పుడు చావు భయంతో వణికిపోతున్నారు.
ఈ ఏడాది దక్షిణావర్తంలోని నదీ ప్రవాహ రాజ్యాలన్నీ అతివృష్టితో అతలాకుతలమయ్యాయి. తెలుగు భాషారాజ్యాలలో ప్రవహించే అతి ప్రధాన నదులు కృష్ణ, గోదావరి, పెన్నానదులు. అయితే ఇవన్నీ మరాఠా భాషా రాజ్యాలలో పుట్టి.. కన్నడభాషా రాజ్యాలగుండా పోతూ.. ఎక్కువభాగం తెలుగు భాషా రాజ్యాల గుండానే ప్రవహిస్తూ తెలుగు రాజ్యాలలోనే సముద్రంలో కలుస్తాయి. అందువల్ల ప్రయోజనం ఇక్కడే ఎక్కువ. అపకారం కూడా ఇక్కడే ఎక్కువ.
గోదావరి, కృష్ణవేణి, పెన్నా నదీ.. తెలుగువారి అసలు సిసలు తల్లులు. నదీమాతలు.. నదులకు పేర్లు పెట్టింది ఎవ్వరు?? మహారాజులు, మహా పండితులు కాదు. సాధారణ ప్రజలు. ఆయా అమ్మతల్లుల ఒడిలో నిత్యమూ బ్రతుకులు పండించుకుంటున్న రైతులు.
కొండల రంగులను బట్టి నల్లకొండ, ఎర్రకొండ, వెలిగొండ అని పేర్లు పెట్టుకున్నట్లే నదులకు కూడా రంగును బట్టే పిలవసాగారని చెప్పుకోవచ్చు. అసలు నదిని సూచించే దక్షిణాదివారి పదం బెన్నా.. అదే పెన్నా అయ్యింది. తెల్లని నీరున్న నది కాబట్టి తెల్లబెన్న అంటే.. నల్లని నీరున్న నదిని కృష్ణ, నల్లబెన్న అన్నారు.
గోదావరి నది ఎక్కడో వింధ్య పర్వతాల మధ్య త్రయంబకేశ్వరం వద్ద పుట్టి మరాఠ రాజ్యాల గుండా ఆగ్నేయంగా సాగి పీఠభూమికి వచ్చి అక్కడి నుంచి తూర్పునకు తిరిగింది. ఏ నది అయినా మహానది అయ్యిందంటే దానికి బోలెడు ఉపనదులు కలిసినట్లే. దర్న, ప్రవర, మూలా, కద్రవ అనే ఉపనదులను కలుపుకున్న గోదావరి ఒకప్పటి శాతవాహనుల రాజధాని ప్రతిష్టానపురం చేరుతుంది. అక్కడ మంజీర, వంజీర.. ఆ తర్వాత ఉత్తరాది నుండి ప్రాణహిత, ఇంద్రావతి అనే మరో రెండు ఉపనదు లతో మరింత బలిష్టమై సరస్వతీ క్షేత్రమైన బాసర వద్ద తెలుగు రాజ్యాలలోకి అడుగిడి మన రాజధాని ఓరుగల్లు దగ్గరగా వెళుతూ రామక్షేత్రమైన భద్రాచలం వద్ద విశాలమై కోన రాజ్యాలను అడుగడుగునా తడిమి వసిష్ఠ గోదావరి, గౌతమీ గోదావరి అనే రెండు అఖండ పాయలతో మొత్తం ఏడు పాయలుగా చీలి సముద్రుడిని కలుస్తోంది. మొత్తం పాతిక తెలుగు రాజ్యాలగుండా వేయి గ్రామాల మధ్యగా వెళుతూ వేలవేల ఎకరాల భూమిని సస్య శ్యామలం చేస్తోంది.
అలాగే కృష్ణ నదీమతల్లి కూడా సహ్యాద్రి పర్వతశ్రేణుల్లో మహాబలేశ్వరం వద్ద పుట్టి మరాఠా రాజ్యాలు, కన్నడ రాజ్యాల మీదుగా తెలుగు రాజ్యాల లోకి గంతులు వేస్తూ వచ్చి దాదాపు ఇరవై ఎనిమిది రాజ్యాలలోని పన్నెండు వందల గ్రామాలను సస్యశ్యా మలం చేస్తూ ఆయా రాజ్యాల సాంసృతిక, ఆధ్యాత్మిక, సాహిత్య, వాణిజ్య, జన జీవనాన్ని అమోఘంగా ప్రభావితం చేస్తోంది.
పుట్టిన మహాబలేశ్వరం కొండలవద్దె కోయ్ నా, వేణీ, సావిత్రి, గాయత్రి.. అనే ఉపనదులను కలుపు కున్న కృష్ణమ్మ సముద్రాన్ని చేరేలోగా వరణ, భీమ, దిండి, ఎర్ల, పెద్దవాగు, హాయిలా, మూసీ, పాలేరు, మున్నేరు, దూద్ గంగ, ఘటప్రభ, మలప్రభ, తుంగ-భద్ర.. లాంటి ఎన్నో ఉపనదులను ఆహ్వానించి అక్కున చేర్చుకుంది. ప్రవాహమార్గమంతా దిండి, ఒకసెట్టి వాగు, హాలియా, పెద్దవాగు, మూసి, పాలేరు, మున్నేరు.. లాంటి చిన్న చిన్న నదులు.. లోత్తవాగు, బలుసుచండ కాల్వ, పెద్దపాయ వాగు, కొల్లం వాగు, మొగలూరు వాగు, నెక్కంటి వాగు, కామాక్షమ్మవాగు, వర్రపాటివాగు, కరక్లి వాగు, పాలంక వాగు, మద్దుఅసరి వాగు, కయ్యనాల, వరికా పూడి వాగు, జుర్రివాగు, జక్కులగుండం వాగు, మోతవాగు, మునిగుండాల వాగు, చంద్రవంక, ఎడిబొగుల వాగు, బోత్తలవాగు, వెదుళ్లపాయ వాగు, గుండాల వాగు.. మొదలైన వందల వాగులు, వేల వంకలు, వందల కాలువలు కూడా కృష్ణమ్మతో కూడి దాదాపు పన్నెండు వందల పైచిలుకు తెలుగు గ్రామాలను సస్య శ్యామలం చేస్తోంది.
అలాగే తుంగ, భద్ర అనే రెండు నదులు జమిలిగా పుట్టి కలిసి ఏకనది తుంగభద్రగా ముందుకు సాగుతూ అనేకానేక ఉపనదులను కలుపుకొంటూ పోయి కృష్ణమ్మకు ఉపనదిగా కూడా గుర్తింపుపొంది పది రాజ్యాల గుండా ప్రవహిస్తూ ఐదువందల గ్రామాలను పునీతం చేస్తోంది. అలాగే పెన్నా, నాగావళి, వేదవతి, వేగావతి, హంద్రి, మహేంద్ర తనయ, వంశధార, సువర్ణముఖి, గోముఖి, గోస్తని, శారద, మేఘాద్రిగడ్డ, వరాహ, తాండవ, ఏలేరు, శబరి, సీలేరు, పాములేరు, సోకలేరు, గుండేరు, బుడమేరు, తమ్మిలేరు, రామి లేరు, మున్నేరు, భవనాశి, రోశీపేరు, గుండ్లకమ్మ, ముదిగండి, పాలేరు, కుందూ, మన్నేరు, చిత్రావతి, కుందూ, పాపాఘ్ని, సగిలేరు, చెయ్యేరు, బొగ్గేరు, కండలేరు, కాళంగి, కుశస్తలి, పాలేరు.. కౌండిన్య.. ఇలా చెప్పుకుంటూ పొతే పదిరోజులు చెప్పగలిగిన నదులు, నదాలు, వాగులు, వంకలు, కాలువలు, చెరువులు, బావులు.. ఎందరెందరో నీటిదేవతలు, దేవుళ్లు మన తెలుగు రాజ్యాలలో అద్భుతాలను సృష్టిస్తూ.. అప్పడప్పుడూ ప్రళయాలు కూడా సృష్టిస్తారు.
అలాంటి ప్రళయమే ఈ ఏడాది ఒక్కసారిగా వచ్చి పడింది.

మత్తి భానుమూర్తి