భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీలో విశిష్ట బహుమతి పొందిన కథ
– డాక్టర్ ఎమ్ సుగుణ రావు
ఆ ఆస్పత్రిలోని డాక్టర్‌గారి కన్సల్టింగ్ రూమ్‌లో కూర్చుంది కీర్తన.
ఆకుపచ్చరంగుతో నిండి ఉంది ఆ ఆవరణంతా. గదిలో చల్లదనం ఎక్కువవడంతో తను వేసుకున్న కోటు సర్దుకుంది.
అంతలో తెల్లకోటు, మెడలో స్టెతస్కోపుతో ఉన్న తెల్లటి వ్యక్తి ఆమెకు ఎదురుగా వచ్చి కూర్చున్నాడు. అతను పొట్టిగా ఉన్నాడు. కళ్లు పిల్లి కళ్లులా అనిపించాయి ఆమెకు.
‘ఇతడు భారతీయుడు కాదు. బహుశా చైనా డాక్టర్ అనుకుంటా!’ అనుకుంది కీర్తన.
అతను ఆమెవంక నవ్వుతూ చూసి
‘‘మీ సమస్యేంటో నాకర్థమైంది’’ అన్నాడు.
ఆమె ఏదో చెప్పబోతుంటే… అతను ఆపుతూ
‘‘మీకు పిల్లలంటే ఇష్టం. మీకో బిడ్డ కావాలి. కానీ గర్భం దాల్చడం అంటే భయం. డెలివరీ టైంలో వచ్చే నొప్పుల గురించి మరింత భయపడతారు. అందుకోసం ఒక ప్రత్యామ్నాయం వెతుక్కుంటూ మా ఆస్పత్రికి వచ్చారు. అంతేకదా మేడం!’’ అన్నాడతను.
‘‘అవును’’ అంది కీర్తన.
అతను చెప్పడం మొదలెట్టాడు.
‘‘ఇప్పుడు మేం బిడ్డను గర్భంలో మోసి, జన్మనిచ్చే హూమనాయిడ్ రోబోలను అభివృద్ధి చేస్తున్నాం.’’ అన్నాడు.
ఆమె షాక్ తిన్నట్టు చూసింది.
‘‘ఎందుకలా విస్తుపోతున్నారు? మీరు అప్పట్లో వచ్చిన సినిమా చూడలేదా? పెళ్లి పీటల మీద నుంచి పెళ్లి కూతురుని ఎత్తుకొచ్చిన రోబో, తాను ‘అభివృద్ధి చేసిన కృత్రిమ జీవకణాన్ని నీ గర్భంలో ప్రవేశ పెడతాను. మనిషికి, యంత్రానికి పుట్టిన తొలిబిడ్డ, మనబిడ్డే అవుతుంది. అది హోమో సెపియన్ కాదు. రోబో సెపియన్.’ అని ఆ సినిమాలో రోబో చెప్పాడు కదా. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా ఆ సినిమాలోని రోబో చెప్పిన మాటలు నిజం కాబోతు న్నాయి. అయితే ఆ సినిమాలోని రోబో చెప్పినట్టు కాకుండా, ఒక ఆధునిక, అద్భుతమైన శాస్త్రీయతతో కూడుకున్న టెక్నాలజీ’’ అన్నాడు ఆ డాక్టర్.
‘‘ఓ మైగాడ్! ఇదంతా సాధ్యమేనా?’’ అంది కీర్తన.
‘‘మా పరిశోధనా సంస్థ అల్‌రెడీ ఒక హూమ నాయిడ్ రోబోను రూపొందించింది. దాని కడుపున బిడ్డను మోసేలా కృత్రిమ గర్భసంచిని ఏర్పాటు చేశాం. అంటే ఇది ఆర్టిఫీషియల్ ఊంబ్ అన్నమాట!’’
అతను ఇంకా ఏదో చెప్పబోతుంటే…‘‘అదెలా సాధ్యం?’’ అంది కీర్తన.
‘‘ఎందుకు సాధ్యం కాదు. నెలలు తక్కువగా పుట్టిన పిల్లల్ని ఏం చేస్తారు?’’ అన్నాడు.
‘‘ఇంక్యుబేటర్‌లో పెట్టి నెలలు నిండేవరకూ సాకుతారు’’ అంది కీర్తన.
‘‘ఇదీ అంతే. నెలలు తక్కువగా పుట్టిన పిల్లల్ని పెట్టే ఇంక్యుబేటర్ లాంటి కృత్రిమ గర్భంలోనే సాకినట్టు, ఈ రోబోకు కూడా కృత్రిమ ఇంక్యుబేటర్ అమరి ఉంటుంది. అది ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో పని చేస్తుంది. బిడ్డ పెరగడానికి కావలసిన వసతి, సౌకర్యం, పోషకాలు ఆ రోబోలో ఉండే ఇంక్యు బేటర్‌లోనే దొరుకుతాయి.’’
‘‘అదెలా జరుగుతుంది?’’ అంది.
‘‘మామూలుగా.. సహజంగా రూపొందించిన పిండాల్ని ఆ రోబోలోని కృత్రిమ గర్భసంచిలో ఉంచుతారు. ఆ గర్భసంచిలో ఆమ్యాటిక్ ఫ్లూయిడ్ అంటే ఉమ్మనీరు కూడా ఏర్పాటు చేస్తారు. ఒక పైపు ద్వారా పోషకాలను పంపుతారు. నెలలు నిండి, బిడ్డకు పూర్తి రూపం వచ్చిన తర్వాత, అంటే ప్రసవ కాలం పూర్తయ్యాక ఆ పిండాన్ని తల్లి చేతిలో పెడుతుంది రోబో. అలా తన గర్భాన పెంచే మన రోబోని ‘యంత్రమాతా’ అనవచ్చు. ఈ రోబో కేవలం ఒక ఇంక్యుబేటర్‌మీదే కాదు, కడుపున పెంచడం మొదలుకొని, డెలివరీ అయ్యేవరకూ సహజంగా తల్లులు ఏ రకమైన భావోద్రేకాలకు లోనవుతారో అలాగే డెలివరీ టైంలో జరిగే నొప్పులు సహా తాను అనుభవిస్తుంది. అయితే వీర్యకణం, అండం… ఈ ఫలదీకరణంతా టెస్ట్‌ట్యూబ్ మాదిరిగా బయటే జరుగుతుంది. ఆ తరువాతే ఫలదీకరణ జరిగాక, ఫెర్టిల్కెజ్డ్ ఓవంని రోబో గర్భంలో ప్రవేశపెడతారు.’’
‘‘మై గాడ్!’’ అంది కీర్తన.
‘‘ఏంటి మైగాడ్… మైగాడ్… అంటున్నావ్?’’ అన్నాడు సాకేత్.
సుమారు ఉదయం ఏదైనా, నిద్రలోంచి లేవని కీర్తనను లేపుతూ.
కళ్లు విప్పార్చుకుంటూ చూసింది, మంచం మీదనుంచి లేచిన కీర్తన.
ఎదురుగుండా బెడ్ కాఫీతో కనిపించాడు భర్త.
సింగపూర్‌లో తమింట్లో తానున్నానని, ఇదంతా కలని ఆమెకు అర్థమై, ఆ కలకు కారణమేంటోనని ఆమె ఆలోచనలో పడిది.
మంచం పక్కన పుస్తకం – ఇంగ్లీషులో రాసిన పుస్తకానికి తెలుగు అనువాదం ‘సీమంతానికి సిద్ధమౌతున్న ప్రెగ్నెంట్ రోబోలు’.
తాను పడుకోబోయే ముందు సీరియస్‌గా చదివిన ఆ పుస్తకంలోని విషయాలే కలలోకి వచ్చాయి అనుకుంది కీర్తన.
భర్త ఇచ్చిన కాఫీ కప్పును చేతిలోకి తీసుకుని, తన కల గురించి సాకేత్‌కి చెప్పింది.
అతను నవ్వుతూ ఆమెవంక చూసి
‘‘నీ మనసులోని కోర్కెలు, ఆశలు ఇలా కలలుగా రూపాంతరం చెందుతున్నాయి. సరే.. ఇక తయారవ్వు బయలుదేరదాం. నిన్ను ఒకచోటస్త్ర•కు తీసుకెళుతున్నాను. ఈరోజు మన ఆఫీసుకు సెలవే కదా’’ అన్నాడు.
సాకేత్ తొందర చేయడంతో, కీర్తన కాఫీ తాగడం పూర్తిచేసి, వాష్‌రూమ్‌లోకి వెళ్లింది.
ళి ళి ళి
వాష్‌రూమ్‌లో ఉన్నంతసేపూ తనకొచ్చిన కల గురించే ఆలోచిస్తోంది కీర్తన. స్నానం పూర్తిచేసి డ్రస్సు మార్చుకుని బాల్కనీలోకి వచ్చింది. ఎదురు ఫ్లాట్‌లో ఆ చైనా అమ్మాయి రెండేళ్ల కొడుకును ఎత్తుకొని నవ్వుతూ చూసింది. వాడు కూడా ఆమెలాగే బొద్దుగా ఉన్నాడు. కీర్తన వాళ్లింటికి తను తరుచుగా వెళుతుంది, ఆ పిల్లాడిని ఎత్తుకోవడం కోసమే! ‘కాసేప య్యాక వస్తాను’ అని చెప్పి, వంటగదిలోకి వచ్చేసరికి తమిళ కుక్ దేవకి వంటగదిలో పనిచేస్తూ కనిపించింది.
ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్లిపోవడంతో ఆమెను పెట్టుకున్నారు. ఆమెకు తెలుగు కూడా వచ్చు. ఆరోజు ఏమి వండాలో పురమాయిస్తూ ఆమెతో కబుర్లలో పడిది కీర్తన.
దేవకి ఆమాట ఈమాట చెబుతూ, ‘‘నా ఇల్లూ అద్దెకిద్దామనుకుంటున్నానమ్మా! మన ఇండియన్ కరెన్సీలో దాదాపు పాతిక లక్షలు అద్దె వస్తుంది నాకు’’ అంది నవ్వుతూ.
‘‘ఇల్లు అద్దెకివ్వడమేంటి? నీకేమైనా మతి పోయిందా? అసలే ఇరుకిల్లు. ఇద్దరు పిల్లలూ. సింగిల్ బెడ్‌రూమ్ అన్నావు కదా. గొప్ప జోకేస్తున్నావ్’’ అంది కీర్తన.
‘‘జోక్ కాదమ్మా! నా ఇల్లు అద్దెకిస్తాను ఏ అమ్మకైనా. శ్రీలంక తమిళమ్మాయి, తనిల్లు అద్దెకిచ్చి పాతిక లక్షలు సంపాదించింది’’ అంది నవ్వుతూ దేవకి.
‘‘బాబోయ్… నీకు మెంటల్ అనుకుంటా…’’ అంది కీర్తన, దేవకి వంక వింతగా చూస్తూ.
‘‘మెంటలేంటమ్మా! ఇప్పుడు బాల్కనీలోని బాబును చూశారు కదా. భలే ముద్దొస్తాడు. ఆ శ్రీలంక తమిళమ్మాయి ఆ పిల్లాడి తల్లికి తనింటిని అద్దె కిచ్చింది’’ అంది దేవకి.
కీర్తన బుర్ర గిర్రున తిరిగింది.
దేవకి వెంటనే అంది
‘‘ఇంకా మీకు అర్థంకాలేదా?’’
కీర్తన తల అడ్డంగా తిప్పింది.
‘‘అద్దెకివ్వడం అంటే, ఇల్లు అద్దెకివ్వడం కాదు. గర్భసంచి అద్దెకివ్వడం. అంటే సారోగేట్ మదర్’’ అంది దేవకి.
ఒక్కసారి షాక్ తిన్నటుగ్గా ఆమె వంక చూసింది కీర్తన.
కలలోనూ, ఇలలోనూ ఈ గర్భసంచి నన్ను వదలడం లేదు. అసలేం జరగబోతోందో? అనుకుంది కీర్తన.
‘‘మా కాలనీకి అద్దె తల్లుల్ని కుదర్చడం కోసం, సింగపూర్ పెద్ద ఆస్పత్రి నుంచి ఒక లేడీ డాక్టరమ్మ వచ్చింది. కాలనీలో ముసలవ్వలు ఆమెను మొహం మీదే తిట్టారు కానీ, మేం చాలామంది ఆడవాళ్లం చెవులు రిక్కించి విన్నాం. అద్దె తల్లికి 21 నుంచి 35 సంవత్సరాలలోపు వయసుండాలటమ్మా. ఐదు కన్నా ఎక్కువ కాన్పులు అవకూడదట. అలాగే అద్దె తల్లి కావడం కోసం, ఆమె భర్త అనుమతి కావాలట. ఇద్దరూ ఆరోగ్యంగా ఉండాలట.’’
దేవకి వంటగదిలో పనిచేస్తూనే చెప్పుకుంటూ పోతోంది.
ఆమె మాటలకు ఆశ్చర్యపడుతూనే చెవులు రిక్కించింది కీర్తన.
‘‘పాపం కాన్పు నిలబడని ఆడవాళ్లు బిడ్డల కోసం తహతహలాడతారు కదమ్మా! ఆ గర్భసంచి, పిండం నిలవలేకపోయినవారి కోసమే ఈ అద్దె తల్లుల్ని తీసు కుంటారంట. మగవాడి స్పెర్మ్, ఆడమనిషి అండం లాబ్‌లో ఫలదీకరణ చేయగా పుట్టిన ఆ పిండాన్ని, అద్దె తల్లి గర్భంలో ప్రవేశపెడతారు. అలా ప్రసవం వరకూ ఆ తల్లి, ఆ పిండాన్ని మోసి డెలివరీ అయిన తర్వాత యజమానులకు బిడ్డను అప్పగించాలి. ఆ ప్రసవకాలంలో అద్దె తల్లి సమస్త బాధ్యతా, ఆరోగ్య ఖర్చులూ యజమానులవే. ఇలా పదినెలలు కళ్లు మూసుకుంటే పాతిక లక్షలు దొరుకుతాయి. మాలాంటివారికి అది ఎక్కువే కదమ్మా!’’ అంది దేవకి.
‘దేవుడా! ఎక్కువగా చదువుకోని దేవకి, అద్దె తల్లి గురించి ఎంత గొప్పగా చెప్పింది. బహుశా సింగపూర్ ప్రభావమా? తమిళనాడు నుంచి సింగ పూర్‌కి వలస వచ్చి, ఇక్కడ లేబర్ కాలనీలో ఉంటూ, పిల్లల్ని చదివించుకుంటున్న దేవకి అద్దె తల్లిగా మారే సాహస కార్యానికి పూనుకోవడం… నిజానికి పాపం వారి ఆర్థిక స్థితే అలా ఆలోచింప చేస్తుందేమో.’ అనుకుంది.
గంట తర్వాత దేవకి, పని పూర్తి చేసిన తర్వాత, అప్పటికే తయారైన సాకేత్, కీర్తనతో కదిలి బయటకు బయలుదేరాడు.
‘‘మనం ఎక్కడికి వెళ్తున్నాం?’’ అంది కీర్తన.
‘‘కంగారుపడకు నీకే తెలుస్తుంది’’ అన్నాడు సాకేత్.
దాదాపు అరగంట తర్వాత సాకేత్ తీసుకొచ్చిన ప్రదేశం చూసి
‘‘ఆస్పత్రికి మనం ఎందుకొచ్చినట్టు?’’ అంది, కొంచెం కోపంగానే.
‘‘కలలోనూ.. ఇలలోనూ.. నీ మనసు దేనిచుట్టూ తిరుగుతుందో నాకర్థమైంది. నీలోని భయం పోగొట్ట డానికే ఈ ఆస్పత్రిలోని లేడీ కౌన్సెలింగ్ డాక్టర్ దగ్గరకు తీసుకొచ్చాను’’ అన్నాడు.
మరో పావుగంట తర్వాత ఆ ఆస్పత్రిలోని ఆ డాక్టర్ కౌన్సెలింగ్ రూమ్‌లో కూర్చుంది కీర్తన. సాకేత్ ఆమె సమస్య గురించి డాక్టర్‌తో చెప్పిన తర్వాత, అతన్ని బయట కూర్చోమని, డాక్టర్ మాట్లాడటం మొదలెట్టింది. అంతకుముందు రోజు రాత్రి తనకు కలలో కనిపించిన కన్సల్టింగ్ రూమ్‌లానే ఉంది ఆ రూమ్.
‘కొంపదీసి ఈమె, కలలోని డాక్టర్‌లాగ గర్భం దాల్చే రోబోల గురించి చెబుతుందా?’ అనుకుంది.
నవ్వుతూ చెప్పడం మొదలెట్టింది ఆ చైనా లేడీ డాక్టర్.
‘‘మీరు పిల్లలను ఎందుకు వద్దనుకుంటున్నారు? కొంతవరకు మీ భర్త మీ భయాలను గురించి చెప్పారు. అయితే ఆ విషయం మీ నుంచి విందామని.’’ అంది డాక్టర్ తన రివాల్వింగ్ చైర్‌లో వెనక్కి వాలి.
‘‘పిల్లలు కాదు, అసలు పెళ్లే వద్దనుకున్నాను. అయితే మా అమ్మానాన్నల బలవంతం మీద నాకు నచ్చిన సాకేత్ దొరకడంతో పెళ్లి చేసుకున్నాను. ‘మనకు పిల్లలు వద్దని’ సాకేత్ నుంచి మాట తీసుకున్న తర్వాతే నేను పెళ్లికి • ఒప్పుకున్నాను. మా పెళ్లి జరిగి రెండేళ్లు గడిచాయి. ఇంటా బయటా… ‘పెళ్లైంది.ఇంకా పిల్లలు లేరా? లేక డ్యూయల్ ఇన్‌కమ్ విత్ నో కిడ్స్ అనే ‘డింక్’ కాన్సెప్ట్‌తో వెళుతున్నారా?’ అంటూ మాకు కొంచెం ర్యాగింగ్ జరుగుతోంది.’’
కీర్తన చెప్పడం పూర్తిచేయక మునుపే, ‘‘అసలు నువ్వు పిల్లలు ఎందుకు వద్దనుకున్నావు?’’ అంది డాక్టర్, కీర్తన వంక సూటిగా చూసి.
‘‘నేను, మా అక్క ఇద్దరం. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. అక్కకి డిగ్రీ పూర్తవక మునుపే పెళ్లయింది. మా మావయ్యగారి అబ్బాయి అక్కను ప్రేమించి పెళ్లి చేసుకుంటాననడంతో ఆమెకు ఇరవై ఏళ్లకే పెళ్లయింది.
‘‘ఆ తర్వాత…’’ అంది లేడి డాక్టర్.
‘‘పెళ్లై సంవత్సరం తిరిగేసరికల్లా అక్క కన్సీవ్ అయ్యింది. అందరం చాలా సంతోషించాం. శ్రీమంతం కూడా జరిపాం. అక్క డెలివరీ టైంకి ఇంజనీరింగ్ చదువుతున్న నేను, అక్క దగ్గరకు వచ్చేశాను. అమ్మా, నాన్న, బావ అంతా అక్కకు డెలివరీ జరిగే ఆస్పత్రి గది బయటున్నాం. ఒక గంట గడిచిన తర్వాత ప్రసవ సమయంలో అక్కకు బీపీ ఎక్కువైందని, కడుపులో బిడ్డ అడ్డం తిరిగాడని, కాన్పు కష్టమయ్యేలా ఉందని డాక్టర్ చెప్పడంతో మేమంతా భయపడ్డాం. ఆస్పత్రిలో అక్కకు ఆపరేషన్ చేయడానికి డాక్టర్లు ఏర్పాట్లుచేయడం మొదలెట్టారు. కొద్ది సేపటికి ఆ థియేటర్ గదిలోంచి బేబీ ఏడుపు వినిపించింది. ఆ తర్వాత పాప ఏడుపు తప్ప, అంతా నిశ్శబ్దం. డాక్టర్లు వచ్చి చెప్పారు ‘‘బిడ్డని బతికించగలిగాం కానీ, తల్లిని బతికించలేకపోయాం’ అని.
ఆరోజు నేను ఏడ్చిన ఏడుపు ఇప్పటివరకు ఆగలేదు. నా ప్రియమైన అక్క ఈ లోకంలో లేదనే చేదు నిజం తెలిసిన క్షణం నుంచి, ఇంకా ఏడుస్తూనే ఉన్నాను. అందుకే భయం… డెలివరీ అన్నా, ప్రసవ వేదనతో నొప్పులు పడే ఆడవాళ్లను చూస్తే ఆ భయం ఎక్కువవుతుంది. అందుకే నేను పిల్లలు వద్దనుకున్నాను. ఆ తర్వాత మా బావ మళ్లీ పెళ్లి చేసుకుని, అమెరికా వెళ్లిపోయాడు. మా అక్క కూతుర్నే నేను పెంచుకుందామనుకున్నాను. కానీ అవకాశం కుదరలేదు. తర్వాత నా చదువు పూర్తయి ఉద్యోగం వచ్చిన తర్వాత మా అమ్మానాన్నల బలవంతం మీదే పెళ్లి చేసుకున్నాను.’’
చెప్పడం ముగించింది కీర్తన.
ఆ మాటలకు ఆ లేడీ డాక్టర్
‘‘అవును నిజమే. తమ తోబుట్టువును కోల్పోతే ఆ విషాదాన్ని జీవితాంతం మోయాలి.’’ అంది నిట్టూరుస్తూ.
‘‘అక్క నా ప్రాణం. ఇద్దరం ఒకే ప్రాణంగా బతికాం. అంటే ఇద్దరం కవలలం.’’ అంది కీర్తన.
‘‘ఓహ్ …. అర్థమైంది. ఒకే శరీరం మీరిద్దరూ. అందుకే మీకు అంత అటాచ్‌మెంట్. అయితే కొన్ని విషయాలు చెబుతాను వినండి…
సాధారణంగా మన శరీరం నలభై అయిదు డెల్ యూనిట్ల నొప్పిని భరించగలదు. కానీ గర్భాన్ని మోసే తల్లులు యాభై ఏడు డెల్ యూనిట్ల పురిటి నొప్పిని భరిస్తారు. అంటే శరీరంలోని ఒక పాతిక ఎముకలు ఇరిగితే ఎంత నొప్పి వస్తుందో, అంత నొప్పిని భరిస్తారు. ఆ దశలో వారికి మాతృత్వ హార్మోన్ అంటే మెటర్నల్ ఆక్సిటోసిన్ సహాయ పడుతుంది. పురిటి నొప్పులను భరించే శక్తినిస్తుంది. అది సహజంగా జరిగేదే. అంచేత ఏ స్త్రీ ప్రసవ వేదనకు భయపడదు. అది శాపంగా అనుకోదు, ఆమెకు మాతృత్వం వరమైనప్పుడు.’’ చెప్పడం ముగించింది ఆ లేడీ డాక్టర్.
కీర్తన ఆమెకు నమస్కారం చేసి, ఆ ఛాంబర్ లోంచి బయటకొచ్చింది.
భర్తతో ఏమీ మాట్లాడలేదు. ఇంటికి వెళ్లేంత వరకూ మౌనంగానే ఉంది.
ఆరోజు రాత్రి తల్లికి ఫోన్ చేసింది కీర్తన.
‘‘ఒకసారి నువ్వు నాన్నగారు సింగపూరు రండి. నాకు బెంగగా ఉంది’’ అంది కీర్తన.
‘‘వచ్చేవాళ్లమే… కానీ, అమెరికా వెళుతున్నాం తల్లీ!’’ అంది అమ్మ. ‘‘దేనికి?’’ అంది కీర్తన.
‘‘అన్నట్టు, నీకు చెప్పడం మర్చిపోయాం. అక్క కన్సీవ్ అయ్యింది. డెలివరీ టైం కూడా దగ్గర పడిందట. ఈ విషయం కూడా వాళ్లు మాకు లేట్‌గా చెప్పారు. డెలివరీ టైంలో అక్క దగ్గర ఉండాలని…’’ చెప్పింది తల్లి.
ఆ మాటలకు కీర్తన ఆలోచనలో పడిది.
‘అవును, ఆమె తనకు అక్కే! బావగారిని పెళ్లి చేసుకున్న ఆమె నాకు అక్కే అవుతుంది. అమ్మ మనసు ఎంత గొప్పది. కడుపున పుట్టకపోయినా అల్లుడు రెండో పెళ్లి చేసుకున్న ఆమెను కూతురుగా భావిస్తోంది. ప్రపంచంలోని తల్లులంతా అంతేనేమో!’ అనుకుంది మనసులో.
‘‘అలాగే అమ్మా! తప్పకుండా వెళ్లండి. ఇప్పుడు మీ అవసరం అక్కకే ఉంది.’’ అంది కీర్తన.
‘‘భలేదానివే! నీకూ రేపొద్దున ఆ అవసరం వస్తే, వచ్చి వాలిపోమూ…! నీ కడుపులోనూ నలుసు పడిందనే శుభవార్త తెలిసిన మరుక్షణమే రెక్కలు కట్టుకుని వచ్చి, నీ ముందుంటాం.’’ ఉద్వేగంగా తల్లి చెప్పిన మాటలు కీర్తనకు సంతోషాన్ని కలిగించాయి.
తల్లి అన్న ఆ మాటలను ఆ రాత్రంతా పదే పదే గుర్తు చేసుకుంటూనే ఉంది కీర్తన.
ళి ళి ళి
తర్వాతరోజు ఉదయం, రోజూలా కాకుండా సాకేత్ కన్నా ముందు నిద్రలేచిన కీర్తన, బెడ్ కాఫీతో భర్తను లేపడంతో అతను ఆశ్చర్యపోతూ ‘‘శుభోదయం’’ అన్నాడు.
‘‘అవును. ఇక అంతా శుభోదయమే…’’ అంది కీర్తన, తన బొటన వేలును పైకెత్తి.
ఆమె మనసులోని మాట అర్థమైంది సాకేత్‌కి. రెండు చేతులతో ఆమెను చుట్టేశాడు.
ళి ళి ళి
సంవత్సరం తర్వాత కీర్తనకు ఆడపిల్ల పుట్టింది. తన సోదరే తనకు పుట్టిందని ఆనందపడిరది కీర్తన.
అమ్మా నాన్న, ఆమె డెలివరీకి ముందే సింగపూరు చేరుకున్నారు.
కీర్తనలో ఎందుకు హఠాత్ మార్పు వచ్చిందో సాకేత్‌కి అర్థం కాలేదు.
పాపాయిని ఒళ్లో కూర్చోబెట్టుకుని, పాలిస్తున్న ఆమెను అడిగాడు
‘‘ఈ మార్పుకు కారణం ఏమిటి?’’ అని.
సంవత్సరం క్రితం, అమెరికా వెళుతున్నానని తన తల్లి చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ సాకేత్‌తో అంది.
‘‘దేవుడు ఎత్తిన అవతారాల గురించి మీకు తెలుసు కదా!
రాముడు తన అవతారం పూర్తికాగానే తనువు చాలిస్తాడు. పరశురాముడు అడవులకు బయలుదేర తాడు. కృష్ణుడు దేహత్యాగానికి పూనుకుంటాడు. మరి అమ్మ అవతారం ఎప్పుడు పూర్తవుతుంది?’’ అంది సాకేత్‌ని ప్రశ్నిస్తూ.
అతను ప్రశ్నార్థకంగా చూశాడు.
‘‘మాతృమూర్తి అవతారానికి సమాప్తం లేదు. అమ్మ జన్మనిస్తూనే ఉంటుంది.’’ అంది క్లుప్తంగా
ఆ మాటలకు సాకేత్, ఆమెవంక మురిపెంగా చూశాడు.
‘‘అవును. అమ్మే కనగలదు, అంత గొప్ప అమ్మను’’ అన్నాడు.. కీర్తన చెయ్యి నొక్కి వదులుతూ.