‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక
నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన
అలా కాకతీయ రాజ్యం.. దాని సామంత రాజ్యలలోని తెలుగు ప్రజలు అత్యంత వైభవంగా, యుద్ధభయాలు లేకుండా ప్రశాంతంగా జీవిస్తున్న కాలం మరో పదేళ్లు పూర్తిచేసుకుంది.
గణపతిదేవుని పట్ల ఆరాధనతో, ఉమ్మడిగా జీవించడంలోని మాధుర్యం, రక్షణ, నిబ్బరత గుర్తిస్తున్న సామంత రాజ్యాలు పక్క రాజ్యాలనుండి శత్రుభయం లేకుండా జీవిస్తున్నారు. దూరాన ఎక్కడెక్కడో ఉన్న తెలుగుప్రజలు తిరిగి తెలుగు రాజ్యాల్లో ఏదో ఒక తెలుగు రాజ్యానికి వచ్చి స్థిరపడుతున్నారు. ఇక్కడున్న పరభాషీయులు వారి వారి భాషా రాజ్యాలకు వెళ్లి పోతున్నారు. తిక్కనామాత్యుని ఉద్భోదల వల్ల చోడరాజులంతా తెలుగుచోడ రాజులుగా ప్రకటించు కుని, అలా చెప్పుకుంటున్నారు, పిలిపించుకుంటు న్నారు.. శాసనాలలో అలాగే వాయిం చుకుంటు న్నారు. చోళులకు, చాళిక్యులకు కప్పాలు, పన్నులు చెల్లించడం పూర్తిగా ఆగిపోయింది.
తెలుగు సామ్రాజ్యపు హద్దులు కనుచూపులో కనపడుతున్నాయి. విక్రమసింహపురి పాలకుడు మనుమసిద్ది మరణించాడు. ఆయన కుమారుడు తిక్కభూపాలడు నెల్లూరు రాజయ్యాడు. రెండవ భల్లాలుడు కూడా మరణించాడు. ఆయన కుమారుడు నరసింహదేవర హోయసల రాజ్యానికి పాలకుడ య్యాడు. దక్షిణావర్తంలో చోళుల పాలన కేవలం తంజావూరు పట్టణానికే పరిమిత మయ్యింది. ఇప్పుడు పాండ్యులు తమిళ రారాజులుగా ఓ వెలుగు వెలుగుతు న్నారు. తెలుగు, తమిళరాజ్యాల హద్దుల వద్ద మాత్రం ఏ గ్రామం ఎవరికి చెందాలి అనేది స్పష్టం కావడం లేదు. విక్రమసింహపురి మాత్రమే కాదు వెలనాడు.. అది దాటి వేంగీ వరకు తిరిగి జయిస్తామని పాండ్య ప్రభువు జటావర్మన్ కులశేఖర ప్రకటిస్తున్నాడు.
ఇటు వాయవ్యాన రాయచూరు రాజ్యప్రాంతా లపై కాకతీయులు, హోయ సలలు, దేవగిరి యాదవుల మధ్య పీటముడి ఉంది.
హోయసల బల్లాలుని మరణం గణపతిదేవునికి పెద్ద దెబ్బ.
నరసింహదేవర మంచివాడే కావచ్చు కానీ ఇచ్చిపుచ్చుకునే ధోరణి తక్కువ. అన్నింటిని మించి గణపతిదేవుడు ఊహించిన దానికంటే దేవగిరి సింఘణదేవుడు మరింత బలంగా ఎదిగిపోతున్నాడు. చెల్లెలు సోమలదేవి పట్ల మమకారం బోలెడు. చెల్లెలికి కానుకలకు లోటు రానివ్వడు. అన్నపై ఈగ వాలనివ్వదు సోమల. బావమరిదిగా బావగారి పట్ల వినయ విధేయతలకు తక్కువేం లేదు. కాని ఎందుకో సింఘణ పట్ల సౌకర్యంగా ఉండలేకపోతున్నాడు గణపతిదేవుడు.
కారణం కవ్వల హత్యకావచ్చు.
బాల కవ్వల భర్తగా చెప్పుకుంటూ వచ్చిన కేయూర..అతనితో పాటు వచ్చిన బృందశీ సింఘణ దేవుని అణచి వేతను తట్టుకోలేక గణపతిదేవుని శరణు వేడారు. వారిలో కాయస్తులు కూడా ఉన్నారు. కాయస్థ వీరులు అద్భుతమైన ఆశ్వికులు. అశ్వయుద్ధ్దంలో ఆరితేరినవారు. శత్రువులను మట్టి కరిపించగలరు. వారందరికి ఆశ్రయమిచ్చాడు గణపతిదేవుడు.
పనిలోపనిగా ‘‘వీళ్లను ఏమి చేద్దాం?’’ అని తిక్కనామాత్యునికి లేఖ పంపాడు.
‘‘ఏ శత్రువు వల్ల పారిపోయి వచ్చి మనలను శరణు కోరారో ఆ శత్రువు పైనే ప్రయోగించడం రాజనీతి’’ అన్నది ఆయన జవాబు.
అలాగే చేశాడు గణపతిదేవుడు. కొందరిని పానగల్లు, కొలనిపాక, కందూరు నాడు, ఎరువనాడు ప్రాంతాలను ఎంపిక చేసి కొన్నికొన్ని నాడుల పాలన వారికి అప్పగించాడు.
కేయూరకు పేరు మార్చి, గంగయ అనే తెలుగు పేరు ఉంచాడు. కేయూరను, కొందరు కాయస్త వీరులను తిక్కనామాత్యులు చెప్పినట్లు కన్నడభాషా సరిహద్దు వద్దనున్న తెలుగు ప్రాంతాలను అప్పగించాడు.
‘‘నువ్విప్పుడు పూర్తిగా కాకతీయ వీరుడివి. హద్దు అవతల కొత్తగా పాలనకు వచ్చింది సింఘణదేవుడు. అతనిపై పగ తీర్చుకోవడానికి తగిన స్థానం కల్పించాను. తగిన సమయం కోసం ఎదురుచూడు గంగయా..’’
గణపతిదేవుని కాళ్లపై పడ్డాడు కేయూర.
ఇప్పుడు కేయూర పేరు గంగయ.. గంగయ సాహిణీ!!
* * *
సిద్దప్పరుసుశెట్టి కోష్టాగారశీ, బెళగావి పట్టణం.
హోయసల రాజ్యంలో ఓ ప్రముఖ పట్టణం బెళగావి. దేవగిరి సింఘణదేవుడు అప్రతిహతంగా జైత్రయాత్ర చేస్తూ హోయసల సామ్రాజ్యాన్ని కబళిస్తూ దిగువకు చొచ్చుకుపోతున్నాడు. ఆతని ఆదేశాలపై మరాఠ కవి, పండిత, నాట్యశిల్పులే కాదు వణిజశ్రేణి ప్రముఖులు కూడా కన్నడరాజ్యాన్ని మరాఠ రాజ్యం చేసేస్తున్నారు.
మరాఠ వణిజ ప్రముఖులు కన్నడ మహావణి జులను పక్కకు నెట్టేసి కన్నడరాజ్య వ్యాపారాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు.
అందులో ముఖ్యుడు.. దేవగిరి సింఘణదేవునికి అత్యంత ఇష్టుడు సిద్దప్పరుసు శెట్టి.
అతని కోష్టాగారశీ ఓ చిన్న గ్రామమంత పెద్దది. కొత్తగా సాధించిన విజయంతో కొత్త తళుకుబెళుకులతో మెరిసిపోతోంది. విశాలమైన ఓ మహారాజ కోటలా ఉన్న ఆ ప్రాంగణం ఎడ్లబళ్లతో.. పెద్దపెద్ద పెరిక సంచులను ఎత్తుతూ.. దించుతూ.. మోసుకుని వేగంగా పరుగులు పెడుతున్న మందీమర్బ లంతో కిటకిటలాడుతోంది. అప్పుడే బయటనుండి ఓ అశ్వికుడు అతి వేగంగా లోపలికి వచ్చాడు. ఆ అశ్వాన్ని, దానికున్న మహారాష్ట్ర సంప్రదాయ అలంకరణను చూసి.. దాని కులీనతను గుర్తించిన రక్షణ భటులు, సైనికులు, వణిజుని ఆంతరంగిక రక్షణ భటులు ఎవ్వరూ దానిని ఆపలేదు. భవనం వరండా వరకు వెళ్లిన అశ్వికుడు అక్కడ అశ్వాన్ని దిగి వేగంగా మెట్లు ఎక్కి లోపలికి వెళ్లాడు. దౌవారికులు ద్వారం వద్దే ఆపేశారు.
తానెవరో చెప్పాడు అశ్వీకుడు.
అది విని ఓ దౌవారికుడు లోపలికి వెళ్లా చురుగ్గా.
అది శ్రీమతి బాల కవ్వలాబాయి గారి తాత్కాలిక విడిది గృహం.
దేవగిరిమహారాజు సింఘణదేవులవారి సంధివిగ్రహి ఆమె. మరాఠా వణిజుడు సిద్దప్పరుసుశెట్టి కోష్టాగారం ప్రక్కనే ఈ విడిదిగృహం ఉంది. అక్కడికి ఓ అశ్వికుడు వచ్చి తానెవరో అక్కడున్న దౌవారికునికి తెలియజేశాడు. అది విని ఓ దౌవారికుడు లోపలికి వెళ్లాడు చురుగ్గా.
అప్పడా బాలకవ్వలాబాయి పాతికమంది ‘రాశి వణిజులతో’ ఆంతరంగిక సమావేశంలో ఉంది. ఈ రాశి వర్తకులంతా సిద్దప్పరుసుశెట్టి సహాయ వణిజుల బృందం. దౌవారికుడు బాయిగారి ఆంతరంగిక కార్యదర్శి సొంకణ భట్టు దగ్గరకు వెళ్లి అతనితో.. ఎవరో అశ్వికుడు బాయిగారిని కలవడానికి వచ్చాడన్న సంగతి చెప్పాడు. ఆ ఆంతరంగిక కార్యదర్శి కదిలి ‘రాశి వణిజులతో’ నవ్వుతూ ముచ్చట్లు చెబుతున్న కవ్వలాబాయికి దగ్గరగా నిల బడి చెప్పాడు.
‘‘అమ్మా.. తమరి భర్తగారైన శ్రీ కేయూరదేవుల వారి నుండి వార్తాహరుడు వచ్చాడమ్మా. ప్రవేశపెట్టమందురా?’’
అంతే. హఠాత్తుగా పెద్ద బరిసె వచ్చిపడినట్లుగా అక్కడున్న అతిథులంతా లిప్తకాలం స్థాణువై పోయారు.
‘ఏవిటీ.. ఈ అప్సరసకు వివాహమయ్యిందా..!? చూడ్డానికి అద్భుతమైన రాజాస్థాన వేశ్యలా ఉంది కదా. ఆమెతో మాట్లాడుతున్నా ఆమె తనూ లావణ్యాన్ని రెప్పవేయకుండా చూస్తూ నోట చొంగ కార్చుకుంటున్న వారంతా లిప్తకాలం దిగులుపడి పోయారు.
ఆమె.. ఆ కవ్వలాబాయి.. చటుక్కున లేచి నిలబడింది.
‘‘ఆ.. మా శ్రీవారు జాబు పంపారా.. ఏది ఎక్కడ..’’ అంటూ వార్తాహరుని చూస్తూ తత్తరపాటుతో వేగంగా వెళ్లి అతని చేతిలోని మంజూషను అందుకుని తెరచి.. చుట్టి ఉన్నలేఖను విడదీసి చదువుకుని.. భర్తతోనే సంభాషించినట్లు అనురాగ పారవశ్యంతో ఆ లేఖను బుగ్గలకు హత్తుకుని.. కనులు మూసుకుని.. పులకించిపోతోంది.
ఈ దృశ్యం అక్కడున్న అతిథులకు కొంత ఆశ్చర్యాన్ని.. కొంత అసూయను రేకెత్తించింది.
ఆమె ఆ వార్తాహారుడ్ని అభినందించి పంపేసి తిరిగి తన పల్యంకంలో కూలబడింది.
శ్రీవారి ఉత్తరం కలిగించిన మాధుర్య మహిమ ఆమె ముఖమంతా అలము కున్నట్లు అందరికి తెలుస్తోంది. అందరిని చూస్తూ, ‘‘క్షమించండి అతిథులారా! మావారి నుంచి లేఖ అంటే ఆగలేకపోయాను. అది చదువుకుంటే వారిపై ఉన్న విరహం దూరమయ్యింది. ఆ చెప్పండి.. మన వ్యూహంపై చర్చ ఎంతవరకు వచ్చింది?!’’
ఆమెను ఆ అద్భుత తనూలావణ్యాన్ని.. ఎలా స్వంతం చేసుకోవాలా అని ఉవ్విళ్లూరుతున్న వాళ్లంతా కాస్త నిరుత్సాహపడినా కోలుకుని తిరిగి చర్చలు కొనసాగించారు. కాని ముందటి ఉత్సాహం లేదు.
చర్చల సారాంశం సరిహద్దు గ్రామాలలోని తెలుగుభాషా ప్రజలను నిలువరించి మరాఠీ భాషా వాదులుగా ఒప్పించి ఇక్కడే ఉంచాలి.
‘‘మీరేం చేస్తారో నాకు తెలియదు. మహారాజు సింఘణదేవులవారు, మహా వణిజులు సిద్దప్పరుసుశెట్టి గారు తరఫున చెబున్నాను. మీమీ ప్రాంతాలలో అమలు చేయవలసింది మీరే. తెలుగు ప్రజలు అనే వాళ్లు మనరాజ్యంలో ఉండకూడదు. అంతా మరాఠీభాషా ప్రజలే. వాళ్లు వాళ్లు హద్దు దాట కూడదు. ఇక్కడ తెలుగు మాట్లాడకూడదు. ఉంటే ఉంటారు లేకుంటే ఛస్తారు. అడ్డంగా నరికేయండి. బరిసెలతో పొడిచేయండి. భాషా గొడవలు సృష్టించండి. ఇళ్లు తగలేయండి. స్త్రీలను బలాత్కరించండి. ముసలాళ్లను పసిపిల్లలను మంటల్లో పడేసి మసి చేయండి. తెలుగు రాజ్యాలలో అల్లకల్లోలం సృష్టించాలి. అందుకు ప్రతిగా మీకేమీ కావాలంటే అది ఇవ్వడానికి దేవగిరి రాజ్యాధినేత సిద్ధం
మొదటగా సౌమ్యంగా చెప్పిన ఆమె చివరి చివరికి పిడికిలి బిగించి గట్టిగా అరుస్తూ ఉద్రేకంతో వణికిపోతూ తన కార్యక్రమాన్ని వివరించింది.
ఇక్కడ బెలగావిలోనే కాదు సూరవరంలో, ద్వారసముద్రంలో, ధార్వాడలో.. మరిన్ని కన్నడ పట్టణాలలో..
ఇలాగే వాణిజ్యవర్గాలను కూడగట్టి తెలుగన్నడ సరిహద్దు పొడవునా మారణ హోమం సృష్టిస్తోందామే. కొన్ని సరిహద్దు గ్రామాల వద్ద ఇనుపకంచెలు వేయిం చింది. అక్కడికి వెళ్లితే చాలు ఎక్కడి నుండో బల్లెం వచ్చి గుచ్చుకుంటుంది. పసిపిల్లలను తల్లిదండ్రుల ముందే నరికివేస్తారు. ఆడపిల్లలను పట్టపగలు అక్కడే బలాత్కరిస్తారు.
ఇది సరిహద్దు ఆవల హోయసల రాజ్యపు వ్యవహారమని, సరిహద్దు ఈవల ఉన్న తెలుగుచోడ రాజ్య పాలకులు, ‘మనకెందుకులే..’ అని ఊరుకున్నారు కాని తెలుగు ప్రజలు మాత్రం చావలేక బతకలేక అల్లాడిపోతున్నారు. ఈ తెలుగు ప్రజల ఊచకోత చూస్తూ హద్దు ఈవలనున్న ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది.
మొదటగా ఈ అంశం తిక్కనామాత్యుని వద్దకు వెళ్లింది. ఆయన తీవ్రంగా స్పందించారు. వెంటనే గణపతిదేవుని వద్దకు వేగును పంపాడు. అప్పటికే కాకతీయ వేగులు ఈ అంశాన్ని గణపతిదేవుని నివేదించారు. ఆయన వెనువెంటనే సర్వ సైన్యాధ్యక్షుడు రుద్రసేనానిని, మహాప్రధాని గంగాధరమంత్రిని సమావేశ పరచి చర్చించాడు. వెలనాడు మండలేశ్వరుడుగా పాలిస్తున్న ఆత్మీయుడు జాయ చోడునికి కూడా వర్తమానం పంపి ఆయన అభిప్రాయం కూడా తీసుకున్నాడు.
‘‘తెలుగు చోడులనందరిని సమయత్తపరచండి. సింఘణదేవుని అణచివేత తట్టుకోలేక మహారాష్ట్రం నుండి వచ్చి మమ్మల్ని శరణువేడిన కొందరు వీరులను అక్కడే కొన్నినాడులలో పాలకులుగా నియమించాను. వారంతా మరాఠ భాషీయులే కాని సింఘణ శత్రువులు. కనుక మనకు మిత్రులు. వారిని మీరు కలుపుకోవాలి. సింఘణ వణిజులను ముందు పంపి వెనక యుద్ధ్దసన్నద్ధు డౌతున్నాడు. మనమూ అదే పంథాను అనుసరిద్దాం. విక్రమసింహపురి అందుకు సిద్ధ్దంగా ఉండాలని మా మాటగా తిక్కభూపాలునికి చెప్పండి..’’
ఇది తిక్కనామాత్యునితో జరిపిన మంతనాల సారాంశం.
* * *
ముద్గల నగరం, హోయసల రాజ్యం. రాత్రి అప్పుడప్పుడే చిక్కపడుతోంది.
ముద్గల.. హోయసల రాజ్యంలోనిదే కానీ ఇటీవల యుద్ధంలో గెలిచిన దేవగిరి రాజ్య స్వాధీనంలో ఉంది.
ఈ ప్రాంతపు వణిజుడు చిక్కరేవేంద్రశెట్టి నివాసం మూడో అంతర్వు అంచున నిలబడి దూరంగా తగలబడుతున్న తెలుగువారి గ్రామాన్ని ఆనందంగా తిలకిస్తోంది బాలకవ్వలాబాయి.
ఆమెకు ఇష్టమైన కొబ్బరి పాయసాన్ని వేడివేడిగా పళ్లెరంలో పెట్టి తీసుకు వచ్చిన పరిచారిక వెనగ్గా నిలబడి ఆమె దృష్టి మరల్చడానికన్నట్లు గొంతు సవరించుకుంది.
అది విన్న కవ్వల వెనుదిరిగి బిగ్గరగా నవ్వుతూ, ‘‘విన్నావే.. ఆ మంటల చిటపటలు.. అవి తెలుగోళ్ల చావు మంటలు.. గ్రామంలోని తెలుగుల ఇళ్లనీన ఇళ్ళన్నీ మనవాళ్లు చలిమంటగా తగలబెట్టేస్తున్నారు. హహ్హహ్హహ్హ..హహ్హ.’’ ఆనందంతో వికట్టాట్టహాసాలు చేస్తూనే ఉంది. పగలబడి నవ్వుతూ మందిరమంతా కలయ తిరుగుతోంది. మంటల శబ్దాలు చెవికి వినరాకున్నా ఆ శబ్దాలు, ఆ గృహవాసుల హాహాకారాలు వినిపిస్తున్నట్లు కవ్వల చూస్తూ ఆనందించడం ఆ పరిచారికకు దినమూ అనుభవమే.
ఆమె ఏదో అనబోయింది.
అప్పుడే మెట్లెక్కి లోపలికి ప్రవేశించాడు సింఘణదేవుడు, పక్కన చిక్కరేవేంద్రశెట్టి.
‘‘ఏమి ఆనందం కవ్వలా.. ఏమి చూస్తున్నావ్ ??’’ నవ్వుతూ అడిగాడు సింఘణదేవుడు.
ఆమె చివ్వున తలతిప్పి చూసింది.
‘‘అరె.. మహారాజశ్రీ బావగారు.. ఎప్పుడు విచ్చేశారు తమరు. క్షమించాలి.. అస్సలు చూసుకోలేదు.’’
‘‘సరి సరి.. మరదల తుళ్లింతలు ఈ బావకు అనుభవమేకదా.. అనుభవమే కాదు.. ఆనందం కూడా’’ అంటూ ఆయన ఫక్కున నవ్వగా శెట్టి కూడా అర్థయమైనట్ల్లు శ్రుతి కలిపి మరింత పెద్దగా నవ్వాడు. అందమైన ఆమె ముఖం ప్రత్యూషపు సూర్యబింబంలా లేత ఎరుపు వర్ణంతో కళపెళలాడింది.
‘‘దేవగిరిరాజ్యపు వాణిజ్య సంధివిగ్రహి బాల కవ్వలబాయి గారు ఎల్లప్పుడూ అలా నవ్వుతూనే ఉత్సాహంగా ఉంటూ దేవగిరి పాలకుల సహృదయతను ఈ కన్నడ సీమశీతా గుబాళింప జేస్తున్నారు ప్రభూ..’’ అన్నాడు శెట్టి.
ముగ్గురూ నవ్వులతో తమ ఆత్మీయతను ప్రకటించారు.
‘‘కన్నడసీమ.. మరాఠాసీమ.. తెలుగుసీమ.. భాషాపరంగా రాజ్యాలు, తదనుగుణంగా హద్దులు ఏర్పడుతున్నాయి. రాజ్యాల వంశ నామాలు మరుగున పడిపోతున్నాయి. ఎంత మార్పు??!!’’ అన్నాడు సాలోచనగా సంఘణదేవుడు.
‘‘అవును ప్రభూ.. త్వరలో అన్ని.. మూడు రాజ్యాలూ.. ఏకమై మరాఠా రాజ్యంగా.. తమ చక్రవర్తిత్వం క్రిందికి వస్తాయి మహారాజా..’’ అన్నాడు శెట్టి.
శెట్టి అభిప్రాయాన్ని సమర్థిస్తున్నట్లు ఆనందంగా చేతెలెత్తి చప్పట్లు కొట్టింది బాల కవ్వలాబాయి. పొంగిపోయాడు సింఘణదేవుడు.
‘‘వచ్చి తీరాలి. ఏ భాష అయితేనేం.. అన్ని రాజ్యాలు.. ఈ దక్షిణావర్తం అంతటికీ సింఘణదేవ బావగారే చక్రవర్తులు. అందుకు ఎవరు అడ్డువచ్చినా.. అదిగో అలా మంటలకు మసి కావలసినదే..’’ అంది పళ్లు పటపట కొరుకుతూ. ముగ్గురూ దూరంగా ఆకాశానికి ఎగసిపడుతున్నమంటలను ఆనందంగా చూస్తున్నారు.
బాలకవ్వల పరిచారికను చూస్తూ, ‘‘ఏమే.. ఈ సంతోష సమయంలో మన అతిథులకు కూడా పాయసం తెచ్చి పెట్టవే. తీపి తింటూ మంటలను ఆనందంగా తిలకిస్తారు..’’ అంది.
పరుగున కిందికి వెళ్లి మరి రెండు పాయస గిన్నెలు తెచ్చి ముగ్గురికి అందిం చింది పరిచారిక. తింటూ ముచ్చట్లు అయ్యాక అన్నాడు శెట్టి.
‘‘ప్రభూ.. కొందరు వణిజులు కింద నాకోసం వేచి ఉన్నారు. నాకు శలవు ఇప్పించండి. తమరు ముచ్చట్లు కొనసాగించండి..’’ వంగి నమస్కరించి వెనుదిరిగాడు చిక్కరేవేంద్రశెట్టి.
ఇద్దరే ఉన్నారు. బాలకవ్వల, సింఘణ.
‘‘సంతోషం బావా.. నా పగ తీర్చుకోవడానికి నాకెంతో సహాయపడు తున్నావ్..’’ అంది బాలకవ్వల.
నవ్వి లేచి దూరంగా తగలబడుతున్న గ్రామాల మంటలను చూస్తున్నాడు.
‘‘ఈ మంటలను చూస్తుంటే నాలో రగిలిన ఆనాటి ఆ మంటలు జ్ఞప్తి కొస్తున్నాయి బావా..’’
అంటూ అతని పక్కకు వెళ్లింది కవ్వల.
‘‘సరే సరే.. ఇశీకెన్నాళ్లు ఆ దురదృష్ట దినాన్ని తలచుకుని బాధ పడతావ్ కవ్వలా?!..’’ అన్నాడు సింఘణ.
‘‘అది మర్చిపోయే సంఘటనా బావా..!అది ఎప్పుడూ నా గుండెల్లో మండుతూనే ఉంటుంది.నా అక్క దారుణమరణానికి కారణమైన ఆ కాక తీయుడు.. సర్వనాశనమై నా సోదరిని తలచుకుంటూ కుళ్లికుళ్లి ఏడవాలి. వాడ్ని ఓడించి తిరిగి మళ్లీ మన దేవగిరి కారాగారంలో బంధించాలి. అక్కడ వాడు తను చేసిన పాపానికి కుళ్లికుళ్లి ఏడుస్తూ చావాలి. అప్పుడే నాకు శాంతి.. మనశ్శాంతి..’’
బాల కవ్వలబాయి పల్యంకం నుంచి లేచి ఉద్వేగంతో ఊగిపోతూ గొంతెత్తి అరుస్తూ చెప్పింది. లేచి వెళ్లి కవ్వల భుజాలు పట్టి ఆమెను ఊరడిస్తూ పల్యంకంలో కూర్చోబెట్టాడు.
‘‘మనం ఆ దిశగానే వెళుతున్నాం. కవ్వలా.. విజయవంతంగా వెళుతున్నాం. ఇప్పుడు రాజ్యాలను వంశనామాలతో కాకుండా భాషా రాజ్యాలుగా పిలుస్తున్నారు. దాంతో మనం కూడా మరాఠా భాషారాజ్య స్థాపనకై విజృభిస్తున్నాం. ఇప్పటివరకు సామ్రాజ్యంగా విర్రవీగిన ఈ హోయసల రాజ్యం ఇప్పుడు మన పాదాక్రాంత మయ్యింది. రేపో ఎల్లుండో కాకతీయుల సామంతులను ఓడించడం.. వాడ్ని పట్టి బంధించడం తథ్యం..’’
ఉద్వేగం.. సింఘణ మాటలు కలిగించిన ఆనందం ముప్పిరికొనగా.. నవ్వింది.. వికటాట్ట హాసం చేసింది. ఉద్వేగంతో గట్టిగా గుండెలవిసేలా ఏడు స్తోంది. అనునయంగా ఆమె భుజం తట్టాడు సింఘణ.
అలా ఆమె పొర్లి పొర్లి దుఃఖిస్తూనే ఉంది.
అలా ఇరవై ఏళ్లుగా…..
ఆ మారణహోమం.. ఆ అర్ధరాత్రి జరిగిన ఆ దురదృష్టకర సంఘటన.. తన అక్క పెద్దకవ్వల.. ఖండఖండాలుగా పడి ఉండటం చూసిన సోదరి బాల కవ్వల.. ఈ కవ్వల.. ఇరవై ఏళ్లయినా మర్చిపోలేదు.
ఆ రాత్రి వివాహమండపం తగలబడుతుండగా అందరిలాగే తనూ బయటకు పరిగెత్తుకు వచ్చింది. సోదరి కోసం వెదికింది. కనపడలేదు. మండపం తగలబడటంతో అక్కడున్న ఆహ్వానితులంతా చెల్లాచెదురయ్యారు. కవ్వల తల్లి దండ్రులు కూడా ఆ వివాహానికి వచ్చారు. బాలకవ్వల తల్లిదండ్రులను ఓ చెట్టు వద్ద కూర్చోబెట్టి అక్క కోసం పరుగులు పెట్టింది. కనిపించడం లేదు. అంటే మంటల్లో చిక్కుకున్నదేమో అనే సందేహం.. భయం వణికిపోతూ మంటల్లో చిక్కుకున్నవారి హాహాకారాలు వింటూ అక్క అందులో ఉన్నదేమో..! బయట పడితే చాలు. మహాదేవా.. అక్కను రక్షించు… అయ్యో అక్కా.. అక్కా.. అటూ ఇటూ పరుగులు పెడుతూ వెదకుతోంది. తెల్లవారే వరకు వెదకుతూనే ఉంది. తెల్లవారాక గాని అక్కడెక్కడో.. ఆమె తల.. అది? కవ్వల శిరస్సు భాగం.. అవును.. అది తన అక్కముఖమే.. కేవలం తెగిపడిన తల భాగమే!!
స్పృహ తప్పింది బాల కవ్వల.
కళ్లు తెరిచేసరికి చికిత్సాలయంలో ఉంది. వివాహ మండపంలో క్షతగాత్రులైన వారంతా మంచాలపై, నేలపై పడి ఉన్నారు. చావు కేకలు పెడుతున్నారు. ఏడుస్తున్నారు. గిలగిలా కొట్టు కుంటున్నా రు. బాల కవ్వలకు మాత్రం.. రాత్రి చూసిన అక్క తల భాగం.. మళ్లీ గుర్తుకు వచ్చింది. ఆ ముఖం.. నవ్వుతోంది పగలబడి నవ్వుతోంది..
‘‘నా ప్రియుడు…వాడే ఆ గణపతిదేవుడు కాకతీయ ఖైదీ.. వాడే నన్ను చంపేశాడు.. నా ఊపిరి తీసేశాడు.
పెళ్లిమండపం నుంచి ఇక్కడికి తీసుకు వచ్చి నన్ను చెరచి నా బతుకు నాశనం చేసి.. నన్ను చంపేశాడు.. నేను చచ్చిపోయాను.. చచ్చిపోయా..’’ అన్నట్లు.. తన చెవుల్లో మార్మోగుతున్నట్లు..
బాల కవ్వల మళ్లీ స్పృహ తప్పింది.
తిరిగి కళ్లు తెరిచేసరికి ప్రపంచం చాలా మారిపోయింది. తల అంతా బోడిగుండు.. మెడలో తాళిబొట్టు.. ఐదేళ్ల మగతనిద్రలో ఉండిపోయావని ఆ చికిత్సాలయం వైద్యులు చెప్పారు. కూతురు శరీరభాగాలను చూసిన కవ్వల తల్లిదండ్రులిద్దరూ పిచ్చివాళ్లయ్యారట. ఇక్కడే ఈ వైద్యాలయంలోనే ఉన్నారట. తనను చూసి కూడా వాళ్లు గుర్తుపట్టలేదు. కానీ వలవలా ఏడ్చారు. హత్తుకుని బిగ్గరగా రోదించారు. తనూ అంతే. పిచ్చి ఏడుపులు.. మా జీవితాలను ఇలా రోదనమయం చేసింది ఎవరు ? వాడే ఆ గణపతిదేవుడే. వాడిని అమాయకంగా నమ్మిన నా అక్క హత్యకు గురయ్యింది. ఆ రాత్రి వాడ్ని రక్షించడానికి మెరుపుదాడి చేసిన ఆ కాకతీయ ధూర్తు లైన సైనికులు తన సోదరిని ముక్కలు ముక్కలుగా నరికి చంపారట. ఏమిచేసినా వాడ్ని తీసు కెళ్ళలేకపోయారట. మహా యోధులయిన దేవగిరి సైనికులు ఆ దుర్మార్గుడైన గణపతిగాడ్ని తిరిగి పట్టి బంధించి చెరశాలలో పడేశారట.
కాని జైత్రపాల మామను, చిల్లాదేవి అత్తను భయపెట్టి ఒప్పించి సోమలను వాడికిచ్చి వివాహం చేశారంటే వాళ్లెంత మాయగాళ్లో అర్థం చేసుకోవచ్చు. వాళ్లక వత్తాసు పలికి మామను, అత్తను పెళ్లికి ఒప్పించిన వాడు అసలు సిసలు దుర్మార్గుడు ఈ కన్నడ బల్లాలుడు. అందుకే సింఘణ బావ హోయసలను మాత్రమే కాదు మొత్తం కన్నడ రాజ్యాలనే జయించబోతున్నాడు.
మెడలో ఈ తాళి ఏవిటి?అని అడిగితే తాను మగతనిద్రలో ఉన్నప్పుడు ప్రాణాలు పోకుండా క్షుద్ర వైద్యులు అనేక పూజలు హోమాలు నిర్వహించారట. అందులో భాగంగానే తనకు పెళ్లి జరిపిస్తే బ్రతికే అవకాశం ఉందని చెబితే అప్పుడు కేయూరతో తనకు తాళి కట్టించాడట సింఘణ బావ. ఈ కేయూరే అక్క కవ్వలను, ఆ దుర్మార్గుడు గణపతికి పరిచయం చేసింది. ఇద్దరూ ఏకాంతంగా కలిసే అవకాశాలు వీడే కల్పించాడు. తాను తన భర్తయినా త•ను ఏనాడూ గౌరవించలేదు. అతడిని భర్తగా గుర్తించలేదు.
తన సుఖం కోసం దేవగిరి మహారాజయిన బావ సింఘణదేవుడు ఎంతో చేశాడు. తన ఆరోగ్యం బాగయ్యేవరకు ఎంతోమంది వైద్యులను ఏర్పాటు చేశాడు. తనకొక స్థాయి కోసం కేయూరను ఓ విషయ స్థాయి మహారాజును చేశాడు. తమ నివాసంలోనే తల్లిదండ్రులను ఉంచి వారికి అక్కడే వైద్యులతో చికిత్స చేయిస్తున్నాడు. తాను కూడా కాస్త కోలుకున్నాక మహారాజును కలిసి ఆయన కోసం ఏదైనా చేస్తానని చెబితే అలోచించి దేవగిరి రాజ్యానికి సౌహార్ద్ర సంధివిగ్రహిగా ప్రత్యేకహోదా కల్పించాడు. దాంతో దేవగిరి పటాలాలతో వెళుతూ ముఖ్యంగా వణిజ శ్రేణులను తన గుప్పిట పెట్టుకుని వారి ద్వారా సాధారణ సమాజాన్ని ప్రభావితంచేస్తూ ప్రజలను మరాఠ రాజ్యంలోకి మళ్లించడం.. అదే సమయంలో తెలుగు ప్రజలను హింసిస్తూ గణపతిదేవుని, అతని కాకతీయ రాజ్యాన్ని కూల్చడమే ధ్యేయంగా తను పనిచేస్తోంది.
‘‘గణపతిదేవుడు నాశనమయ్యేవరకు నాకు విశ్రాంతి లేదు..’’
నిత్యమూ తలచుకునే పగ ఆమెను నిలువ నియ్యదు. నిద్రలేదు. తిండిలేదు. కేవలం పగ… పగ… పగ.. ఇటూ దేవగిరి రాజ్య సహకారం.. అటు సమాజంలో అతి ముఖ్యమైన వణిజ శ్రేణి సహకారంతో ఆమె తన పగ తీర్చుకోవడానికి ప్రస్తుతం రాజ్యాల మధ్య అత్యంత ప్రముఖమైన భాషా రాజ్యాల అంశాన్ని ముందు పెట్టుకుని ముందుకు సాగుతోంది..
ఆమె ఆలోచనల్లో ఆమె ఉండగా అప్పుడే వచ్చిన దేవగిరి వేగును తీసుకుని పైకి వచ్చాడు చిక్కరేవేంద్రశెట్టి.

మత్తి భానుమూరి