భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
మాడుగుల అభ్యుదయ్
చీకటి పడి చాలా సమయం అవుతుండటంతో ఇంట్లో వాళ్లంతా గాఢ నిద్రలో ఉన్నారు ఒక్క అనురాధ తప్ప, మౌనం ఆవరించిన ఇంట్లో తను మాత్రం తన లోపలి నుండి వచ్చే మాటలని ఆపలేకపోయింది. ఇలా అయితే కష్టం అని బెడ్ మీద నుండి లేచి మంచి నీళ్లు తాగడానికి కిచెన్ లోకి వెళ్లింది.నీళ్లు తాగి కాసేపు ఇంట్లోనే అటు ఇటు నడుస్తూ తన చూపుని హాల్‌లో ఉన్న తన రీడింగ్ టేబుల్ మీద పడేసింది. కాసేపు ఏమన్నా చదివి పడుకుందాం అని అనుకోని టేబుల్ ముందు ఉన్న కుర్చీలో కూర్చుంది. ఇంతలో డైరీ రాయలేదు అనే విషయం గుర్తొచ్చి పక్కనే ఉన్న బాగ్‌లో నుండి డైరీ తీసి రాయడం మొదలు పెట్టింది అనురాధ.
‘‘ఈ రోజు అసలు ఏం బాగాలేదు.’’ ఒకసారి ఆగి వెనక పేజీలు తిరగేసి చూసింది. దాదాపు అన్ని పేజీల్లో మొదటి వాక్యం ఏ మాత్రం మారలేదు. తనలో తానే నవ్వుకొని మళ్లీ రాయడం మొదలు పెట్టింది. ‘‘ఒక పెళ్లి అయినా అమ్మాయి జీవితం అసలు ఎందుకు ఇంత కష్టంగా ఉంటుంది. నాకేం తక్కువ మంచి ఉద్యోగంఉంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. మంచి భర్త ఉన్నాడు. నా వాళ్లు అని చెప్పుకోడానికి వీళ్లు ఉన్నారు కానీ నన్ను అర్థం చేసుకోడానికి ఉన్నది. వీళ్లు అని చూపించడానికి ఎవరు ఉన్నారు?’’
‘‘ప్రతి రోజు లాగానే ఈరోజు కూడా ఉదయానే 5 గంటలకి లేచా, కాసేపటికే వంట పని మొదలు పెట్టాను. 6:30కి పిల్లలు ఇద్దరిని లేపాను. చిన్నోడు విసిగించకుండా లేచి రెడీ అయ్యాడు కానీ పెద్ద పిల్ల చాలా ఇబ్బంది పెట్టింది. ఎందుకు లేవట్లేదు అని అడిగితే రాత్రి పడుకునే సరికి లేట్ అయింది అమ్మ అని చెప్పి మళ్లీ పడుకుంది. అసలు ఈ పిల్ల రాత్రి పూట తొందరగా పడుకోకుండా ఏం చేస్తుందో అని అడిగితే దానికి కోపంతో అరిచేస్తుంది నా మీద ఇంటర్ చదువుతున్నప్పుడే ఇలా ఉంటే పెద్దయ్యాక ఎలా తాయారు అవుతుందో… దాన్ని నిద్ర నుండి లేపేసరికి నా తల ప్రాణం తోకకి వచ్చింది. ఈలోపు స్ట్టౌవ్ మీద పెట్టిన కూర మాడిపోతుంది.కిచెన్‌లోకి పరుగు పెట్టాను. కూర పూర్తి అయినా తరువాత ఇడ్లీ చేశాను. దాంతో పాటు చట్నీ ఉంటే కానీ ఆయన తినరు..చట్నీ ఉంటే పిల్లలు తినరు. ఇలా ఎవరికీ వారు అడ్జస్ట్ అవ్వకుండా టెక్కు చూపించేవాళ్లే కానీ నా కోసం అడ్జస్ట్ అయ్యేవాళ్లు ఎవరు లేరు. అయినా నేను చేసేది నావాళ్ల కోసమేగా అని సర్ది చెప్పుకొని ఆయన కోసం చట్నీ పిల్లల కోసం సాంబార్ చేస్తుండగా మా చిన్నోడు కేక వేసాడు వాడి బుక్స్ దొరకడం లేదు అని. చిన్న చిన్న పనులు చేసుకోవడం కూడా ఎంత కష్టం అయింది ఈ కాలం పిల్లలకి ఆ బుక్స్ ఏవో వెతికి ఇచ్చాను… ఇంతలో పెద్దది, దాని ఫేస్ క్రీం ఎదో కనపడటం లేదు అని, ఇంటర్ చదువుకునే పిల్లవి నీకు ఎందుకే క్రీములు మేక్‌అప్‌లు అని అంటే, ‘‘మా….దిస్ ఇస్ సన్ స్క్రీన్ .. నీకు చెప్పిన అర్థం కాదులే….’’ అని అంది. దీనికి మాటలు రాని వయసులో అది ఏం చెప్తుందో అర్థం చేసుకున్న నేను, ఇప్పుడు ఇది చెప్పినా అర్థం చేసుకోలేను అంటా..చెప్తేనేగా నాకు తెలిసేది. ఏం చెప్పకుండా అర్థం కాదు అంటే ఎలా?’’
ఒక్క క్షణం ఆగి గుండె లోతులోనుండి పైకి ఎగబాకుతున్న దుఃఖాన్ని దిగ మింగి పెన్ను కదపడం మొదలు పెట్టింది అనురాధ.
‘‘అలా పొద్దున్న పిల్లలిద్దరికీ తినిపించి లంచ్ బాక్స్ పెట్టి ఆయనకీ క్యారేజ్ ఇచ్చాను. చిన్నోడిని స్కూల్ బస్సు, పెద్దదాన్ని కాలేజీ బస్సు ఎక్కించి టైం చూసాను.నా కళ్లు పరిగెడుతున్న గడియారం ముళ్ల కన్నా వేగంగా గిర్రున తిరిగాయి. ఇంకా ఇరవయి నిమిషాలే ఉంది. ఈ లోపు నేను స్నానం చేసి టిఫిన్ తిని ఆటో వెతుక్కొని స్కూల్‌కి వెళ్లాలి. ఈ పక్రియ గురించిఆలోచించే సరికే రెండు విలువైన నిమిషాలు గడిచాయి. ఇంత పొద్దున్నే లేచిన కూడా ఎందుకు ఇంత లేట్ అయింది. ఇంకేం చేస్తాను లే అని స్నానా నికి వెళ్లి వచ్చా. పిల్లలు ఇద్దరు పడక సర్దుకోలేదు. చాలా ఛండాలంగా ఉంది వాళ్ల గది. కనీసం లేచాక బేడీషీట్స్ కూడా మడత పెట్టలేదు. ఆ పని చేయమని కొన్ని వందల సార్లు చెప్పాను. అయినా వింటేగా. స్నానం చేసి వచ్చాక తినే అంత టైం లేదు అందుకే తినకుండా పరుగు పరుగున ఆటో ఎక్కి స్కూల్‌కి వెళ్లాను. ఇంతకముందు ఉన్నంత ఆక్టివ్‌గా ఉండలేక పోతున్నాను. వయసు పెరగడం వల్లనో పిల్లలు పెరగడం వల్లనో అర్థం అవ్వట్లేదు. ఎక్కువ సేపు నిలబడలేకపోతున్న. నడవలేకపోతున్నాను. సరిగ్గా తినకపోవడం వల్లనేమో… అయినా నా పిల్లలు మావారు కడుపునిండా తినాలి అని ప్రతిరోజు పాకులాడుతానుగా అసలు వాళ్లకి నేను తింటున్నానో లేదో అనే విషయం అయినా తెలుసా? ఏమో తెలిసినా నాకు ఏమైనా సహాయం చేస్తారా ఏంటి?
ఈలోపు స్కూల్‌కి చేరుకున్నాను. కాస్త లేట్ అయ్యాను. ఆలస్యం చేయకుండా క్లాస్‌కి వెళ్లాను. మొదటి రెండు క్లాస్‌ల్లో పిల్లలు పెద్దగా అల్లరి చేయకుండా బానే ఉన్నారు. కానీ తరువాతి రెండు క్లాసుల్లో నరకం కనిపించింది. గవర్నమెంట్ స్కూల్ లోని పిల్లలు ఇంత మొరటుగా ఉన్నారు ఏంటి అని అనుకోని రోజే లేదు. మేము కూడా చదువుకుంది ఇలాంటి స్కూల్‌లోనే కదా? ఏ రోజు అయినా మా గురువుకి ఎదురు చెప్పేవాళ్లం కాదు. కానీ ఈ రోజులు వేరు ఒక వైపు క్లాస్ చెప్తుంటే కనీసం పర్మిషన్ అడగకుండా బయటకి వెళ్తాడు ఒకడు. మరొకడు లాస్ట్ బెంచ్‌లో నుండి అరుస్తూ క్లాస్ మొత్తాన్ని డిస్టర్బ్ చేస్తాడు. ఇలాంటివి ఎన్నో….
అసలే ఉదయం తినలేదు అంటే ఇక్కడ వీళ్లతో ఇంకొక లొల్లి, మూడు క్లాసులు దాటేసరికి నీరసం వచ్చింది. అయినా సరే లంచ్ వరకు ఉండగలిగాను. ఎంతో నిరీక్షణ తరువాత లంచ్ బెల్ మోగింది. ఆ బెల్ సౌండ్ నా పాలిట ఎ.ఆర్ రెహ్మాన్ సంగీతంలా అనిపించింది. స్టాఫ్ రూమ్‌లో కూర్చొని లంచ్ బాక్స్ ఓపెన్ చేసి ఒక ముద్ద పెట్టుకున్నా.. ఉప్పు కాస్త ఎక్కువైంది. ఆకలికి అదేం తెలియలేదు. కానీ మెదడు రాబోయే ప్రమాదాన్ని అంచనా వేసింది. ఫోన్ మోగింది. ఆయనే. ఫోన్ చేసి కూరలో ఉప్పు ఎందుకు ఎక్కువైంది? అని చీవాట్లు పెట్టాడు. నాకు అర్థం కాక అడుగుతున్నాను ఇప్పుడు నాకు కాల్ చేసి తిట్టడం వల్ల దాని రుచి మారుతుందా? లేదా నేను ఇప్పడికి ఇప్పుడు ఏమన్నా మంత్రం వేసి దాన్ని మార్చగలనా? నేను తినేది కూడా అదే కూర కదా? కావాలని మాత్రం చేయనుగా? మార్చలేని విషయాల గురించి ఆలోచిస్తూ ఎందుకు టైం వేస్ట్ చేస్తారో మనుషులు? వంటలో తప్పులు జరగడం అతి సామాన్యమైన విషయం దానికి ఎవరు అతీతులు కారు. అయినా మీరు ఎప్పుడైనా కిచెన్‌లోకి వస్తేగా తెలిసేది. ఒకసారి వీళ్లతో వంట చేయిస్తే కానీ మా బాధలు అర్థం కావు.. అని మనసులోనే అనుకొని ఫోన్ పెట్టేసాను. తినడం పూర్తి అయినా తరువాత మిగిలిన క్లాసులు కూడా చెప్పేసి ఇంటికి వచ్చా. కాసేపు రెస్ట్ తీసుకుందాం అని అలా సోఫాపై వాలాను. అలా కూర్చోగానే, ఉదయం టైం లేక మధ్యలోనే ఆపేసిన పనులు అన్నీ కళ్ల ముందు నాట్యం చేశాయి. గిన్నెలు కడగాలి, ఇల్లు క్లీన్ చెయ్యాలి, బట్టలు వాషింగ్‌మెషిన్‌లో వెయ్యాలి, డిన్నర్ ప్రిపేర్ చెయ్యాలి. ఒకొక్క పని సోఫాలో ఉన్న ‘నన్ను లేచిరా’ అని పిలుస్తున్నాయ్. ఇన్ని పనులు చేస్తున్నానని ఆయనకీ చెప్తే ‘పని మనిషిని మాట్లాడాలా?’ అని అడుగుతాడు. నాకు అర్థం కాదు, నలుగురు ఉన్న మిడిల్ క్లాస్ ఇంట్లో పని మనిషి అవసరమా? అందరు ఏదో ఒక పని చేసి సహాయ పడితే సరిపోదా? ఇంతలో పిల్లలు ఇద్దరు వచ్చారు. వాళ్లకి సాయంత్రం అయితే ఆకలి అవుతుంది. వంటగదిలోకి వెళ్లి, కొన్ని స్నాక్స్ చేసి పెట్టాను. ఈలోపు చీకటి పడింది.
సింక్‌లో ఉన్న గిన్నెలు కడిగాను. పెద్ద పిల్ల లంచ్ బాక్స్ మొత్తం అలానే ఉంది. అది తినలేదు అని అర్థం అయింది. బాధ కోపం ఒక దాన్ని మించి మరొకటి గుర్రాల లాగా పోటీ పడుతూ వచ్చాయి నాకు. ఎందుకు తినలేదు అని అడిగితే, ‘‘ఫ్రెండ్ బర్తేడుమా.. బయట తినేసాం’’ అని సింపుల్‌గా చెప్పింది. ‘పోనీలే ఎక్కడో చోట తినిందిగా’ అని సర్ది చెప్పుకున్నాను. ఇప్పుడు దాంతో వాదించే శక్తి నాకు లేదు. ఆ లంచ్ బాక్స్‌లో ఉన్న భోజనం ఇంకా పాడు అవ్వలేదు రాత్రికి తిందాంలే అని ఫ్రిడ్జ్‌లో పెట్టాను. తరువాత బట్టలు వాషింగ్ మెషిన్‌లో వేసి, ఇల్లు మొత్తం సర్ది పెట్టి మళ్లీ కిచెన్‌లోకి వచ్చి డిన్నర్ చేయడం మొదలుపెట్టాను. ఈలోపు ఆయన వచ్చారు. బాగ్ బెడ్ మీద పడేసి సాక్స్ చెల్లా చెదురుగా పడేసి కనీసం కాళ్లు కూడా కడుక్కోకుండా లోపలకి వచ్చి సోఫా పైన ఫోన్ చూస్తూ కూర్చున్నాడు. ‘చిన్నపిల్లలకి అంటే ఎన్ని అయినా చెప్తాము ఇంత పెద్దమనిషికి ఏమని చెప్తాము’ రగులుతున్న ఆవేశాన్ని అణుచుకోగలిగాను. ఓపికతో ఆయన చేసిన పను లన్నీ సర్దుతూ వచ్చాను. వంట పూర్తి అయింది.
అందరం డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాం. భోజనం మొదలు పెట్టాం. పెద్ద పిల్ల ఫోన్ చూస్తూ తింటుంది. ఈ మధ్య దాని ప్రవర్తనలో చాలా మార్పు వస్తుంది. ఎక్కువ సమయం ఫోన్‌లోనే గడుపుతోంది. ఆలస్యంగా నిద్రపోతోంది, చిన్న చిన్న వాటికే విసుక్కుంటోంది..
కోపంలో అరుస్తుంది. తినేటప్పుడు ఫోన్ ఎందుకమ్మా?తిన్నాక చూసుకుందువ్’• అని అన్నాను. అది వినిపించుకోలేదు. మళ్లీ చెప్పాను, వినిపించుకోలేదు. ఇక నా వల్లకాలేదు. ‘‘గీతా చెవులు వినపడటం లేదా? చెప్తుంటే నీకు కాదా ఫోన్ పక్కన పడేయ్’’అని అరిచాను. ‘‘ఎందుకు అమ్మ అలా అరుస్తావ్ తినేటప్పుడు కూడా ఎందుకు మైండ్ ఖరాబ్ చేస్తావ్’’ అని నా మీదే అరిచి లేచి బెడ్రూం లోకి వెళ్లిపోయింది. నేను అలాగే చూస్తూ ఉండిపోయాను. ‘‘ఎందుకే దాన్ని తినేటప్పుడే డిస్టర్బ్ చేస్తావ్ అది తినేదే తక్కువ’’ అని ఆయన దాని వెనకే వెళ్లాడు ప్లేట్ పట్టుకొని తినిపించడానికి.
ఇది మరీ బాగుంది ఒక తల్లి తన పిల్లలకి నాలుగు మంచి మాటలు చెప్తే ఇంత కోపం వస్తుందా? నేనేం తప్పుగా చెప్పలేదుగా మరి అది ఎందుకు అలా అరిచింది? నా కుటుంబం కోసం నేను ఇంత కష్టపడుతున్నప్పుడు వాళ్లేందుకు నన్ను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? లంచ్ బాక్స్ తినకపోయినా, మార్కులు సరిగ్గా రాకున్నా, రూమ్ నీట్‌గా సర్దుకోకపోయినా ఏం అనడం లేదుగా? అన్నీ పనులు నావే అనుకొని చేస్కుంటూ పోతుంటే వీళ్లకి నా కష్టం ఎందుకు తెలియడంలేదు? అయినా పనుల్లో సహాయపడమని అడిగానా?
నేను మాత్రం ఏం ఆశిస్తాను? నా పిల్లలు సంతోషంగా ఉండటమేగా… ఇంకా అంటే కూర బాలేనప్పుడు ‘‘పర్లేదు అమ్మ’’ అలిసిపోయినప్పుడు ‘‘ఏమన్నా సహాయం కావాలా రాధా?’’ అనే పిలుపులు చాలవా నా ప్రాణానికి వంద ఏనుగుల బలం రావడానికి? అసలు నేను ఏం తింటున్నానో అని అయినా చూస్తున్నారా ఎవరైనా?’’ అని రాస్తూ పెన్ కింద పెట్టింది. ఈసారి తన ప్రమేయం లేకుండా కురుస్తున్న కన్నీటి ధారలని ఆపలేకపోయింది. కొన్ని క్షణాల్లో తేరుకొని తన డైరీని బాగ్‌లో వేసింది.
ఒక్క క్షణం కళ్లు మూసుకుంది.
మరుసటి రోజు పోరు కోసం సిద్ధపడింది….
గుర్తింపు కోసమో, చప్పట్ల కోసమో కాదు.
కేవలం తన కుటుంబం కోసం.