‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన


కోమలి లాంటి భార్యలంతా కరువు కాలానికి చేతులెత్తి దండాలు పెట్టుకుని కాస్త ఉడకేసుకుని పళ్లేరాలు పట్టుకుని ఒక్కచోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ తినేవారు.

ఆరో ఏడు అరుగుమీద గడ్డి పరిస్తే అందులోనే కాలకృత్యాలు అన్ని.. కాలితో కాస్త పక్కకు తోసి గడ్డి మార్చేది కోమలి. ‘అయ్యో తప్పు కదా’ అనేవాడు లేడు. ఎవడి కడుపు దుఃఖం వాడిదే కదా!

కోష్టాగారంలో వడ్లున్న దుర్గయ్య అనే ఓ మారాజు బాగా తిని కోమలికి ఓ ఉచిత సలహా ఇచ్చాడు.

“అలా గడ్డిమీద శవంలా పడుకోబెట్టి బతికించి వుంచే కంటే ఒక్కసారి చంపేస్తే నీ పీడా వదిలి పోతుంది కదా..”

“అమ్మమ్మా.. ఆయన మా ఆయన. నాకు తాళికట్టి పాతివ్రత్యాన్ని ప్రసాదించినవాడు. ఆయన వయసు, మగతనం.. అన్నీ తెలిసే నన్ను పెళ్లి చేసుకున్నాడు. బోలెడు సోమ్మెట్టి కొనుక్కున్నాడు. అట్టాంటాడికి నా బాధ ఎందో తెలవోద్దా దురగయ్య మావా..??” అంది మంగళ సూత్రం కళ్లకద్దు కుంటూ.

ఈ మాట ఆ నోటా ఈ నోటా.. ఊరు ఊరంతా పాకిపోయింది. అట్లాగే చుట్టు ప్రక్కల ఊర్లకూ పాకిపోయింది. బాల్య వివాహాలు చేసుకున్న ముసలి యదవల బతుకులన్నీ అన్ని ఊర్లల్లో ఇలాగే ఉన్నాయని తెలియవచ్చింది. కాబట్టి కరువుకాలం బాల్య వివాహాలు చేసుకున్న మహిళలకు స్వర్ణ యుగమే. ఇలాంటి ముసలాళ్ల చావులు రాజ్య మంతటా కొన్ని వేలు, లక్షలు ఉంటాయని మహా ప్రధానుల వారికి అందిన సమాచారం.

*******

ఉరుగొండ గ్రామం, కొణిదెన రాజ్యం..

చంద్రమ్మ బక్క పలచగా సుమారు ఎత్తులో సామాన్యంగా నెత్తిన పెద్దకుండ.. దానిపై చిన్నకుండ పెట్టుకుని కుడిచేతి భుజానికి చుట్టి పెట్టుకున్న చేంతాడు చుట్టతో సాధారణంగా మనప్రక్కగా సాగిపోయే గ్రామీణ ముది వయస్సురాలు. ఆమెది బాల్య వివాహం. నలభై ఏళ్లకే అమ్మమ్మ, నాన్నమ్మ అయ్యింది. ముగ్గురు కూతుళ్లకు, ఇద్దరు కొడుకులకు కూడా బాల్యవివాహాలే. ఇప్పుడు మనుమరాళ్ల పెళ్లిళ్ల కోసం తన పిల్లలు పడుతున్న తిప్పలు చూస్తుంటే ఆమె అల్లాడిపోతోంది. మాకాలంలో అమ్మాయిలకు, అబ్బాయిలు, అబ్బాయిలకు అమ్మాయిలు కోకొల్లలుగా దొరికేవారు అని ఆమె చెబుతుంది. తనలో తానూ చెప్పుకుంటుంది. కానీ ఆమె తల్లిదండ్రులు ఆ కాలంలో కూడా ఇలాగే పెళ్లిళ్లు అయ్యేవరకు సతమతమయ్యేవారని ఆమెకు ఎరుక లేదు. ఆమె చాలా సౌమ్యురాలు. పదిమంది పిల్లల్లో వొకరుగా పుట్టి పెరిగింది. ఏ వేళప్పుడు నేలపై పడిందో గాని అప్పటి నుండి ఏదో వొక పని.. ఇంటిపని.. చావిడి పని.. చెల్లెళ్ల పని.. తమ్ముళ్ల పని.. తమ్ముడు కడుపులో ఉన్నప్పుడు అమ్మపని.. అన్ని పనులు తన భుజాన వేసుకుని అలా చేస్తూనే ఉండేది.

అలా చేస్తూ చేస్తూనే నలభై వర్షాలు చూసింది.

నాలుగేళ్లుగా వర్షం కనపడటంలేదు. పైన మేఘాలు కదలడం లేదు. కనిపించడం లేదు. కేవలం తెల్లని ఆకాశం.. ఆమెకు అత్యంత ఆనందాన్ని ఇచ్చేవి రెండు. ఒకటి వర్షం.. రెండోది తన దొడ్లోని పశువులతో సంభాషణ.. ఆమె ఇంట్లో సొంత మనుషుల కన్నా.. చావిట్లో సొంత పశువులతోనే ఎక్కువగా మాట్లాడుతుంది. దాదాపు పాతిక పశువులు.. పది పాలిచ్చే గేదెలు, రెండు ఆవులు, నాలుగు.. అంటే రెండు జతల ఎడ్లు, రెండో మూడో దున్నపోతులు, మిగిలినవి దూడలు.. ఆమె వీటన్నిటికి పేర్లు పెట్టుకుంది. అన్నింటిని పేర్లతో పిలుస్తూ ముచ్చట్లు చెబుతూ కోసుకొచ్చిన పచ్చగడ్డి వేస్తూ.. అది తిన్నాక మళ్లీ ఎండుగడ్డి వేస్తూ.. కుడితి పెడుతూ.. చెరువుకు తోలుకెళ్లి వొళ్లు కడుగుతూ.. కాసేపు నీళ్లల్లో పడుకోమని చెబుతూ.. నీళ్లల్లో పడుకుంటే వొంటికి మనసుకు ఎంత హాయిగా ఉంటుందో చిలవలు పలవలుగా వర్ణిస్తూ.. ఏదేదో మాట్లాడుతుంది. ఆమె ఇంట్లో మనుషులకన్నా పశువులతోనే ఎక్కువగా మాట్లాడుతుందని భర్త సోములు, కొడుకులు, కూతుళ్లు, కోడళ్లు అంటుంటే వినడం ఆమెను చాలా ఇష్టం. మళ్లీ వాళ్ల అభిప్రాయాలన్నీ ఆ పశువులతో పంచుకుంటుంది.

ఇంట్లో వాళ్లకు ఆమె పశువులతో ఆత్మీయంగా ఉండటం నచ్చుతుంది. కారణం అవి ఆమెకు మాత్రమే హెచ్చు పాలు ఇస్తాయి. మరెవ్వరు పితికినా అవి సరిగా పాలు ఇవ్వవు.

అవి కూడా ఆమెతో కబుర్లు చెబుతాయి. మెడ, కళ్లు, చెవులు ఊపుతూ.. నోటితో ఏవో చిన్న చిన్న అరుపులు, శబ్దాలు చేస్తాయి కాని.. వాటి శారీరక భాష.. మెడ కదలికల్లో, తోక ఊపుల్లో, కాళ్ల కదలికల్లో, దగ్గుల్లో, కన్నీటిలో.. కనిపిస్తాయి. అవి ఆమెకు పెద్దపెద్ద కథలు చెబుతాయి. శారీరక బాధ మొర పెట్టుకుంటాయి. లబ్జుగా గారాలు పోతాయి. ఆమెను తలతో మెల్లగా తాకుతూ అవి తమ ఆప్యాయతను వ్యక్తపరుస్తాయి. ఆమె పొంగిపోతుంది. ఒక్కొక్కసారి వాటి ఆప్యాయతకు ఆమె కళ్ల వెంట నీళ్లు తిరుగుతాయి. గేదెలు, ఆవులు గర్భం దాలిస్తే కన్నకూతురే గర్భం దాల్చినట్లు పొంగిపోతుంది. ఆ గుర్తింపు కలిగిన వేళ ఆమె ముఖమంతా ఆనందం పరుచుకుని పరవశిస్తుంటుంది. ఇరుగు పొరుగు అమ్మలక్కలు అడుగుతారు..

“ఏందే సెంద్రి.. ఏందీ ముకం కళకళ లాడతాంది.. ఏదైనా గేదె సూడి కట్టిందా..?!” అని.

అప్పుడు మాత్రం కాస్త తలెత్తి చెబుతుంది.

“అవునక్కా.. పారువతికి కడుపు..” అని. ఆ మాటలో ఎంత ఆనందం.. పరవశం.. పారువతి అనేది పార్వతి.

పేరున్న గేదె. ఇక అది ఈనే రోజున చూడాలి.. చంద్రమ్మ హడావిడి.. కూతురు ప్రసవించే రోజు కూడా ఆమె అంతలా హడావిడి పడలేదు.

చంద్రమ్మ లేచి లేవంగానే దేవుడిని తలుచుకోదు. ముందు దొడ్డి వైపు చూసి పశువులన్నీ కనిపిస్తే ఆమెకు దేవుడి దర్శనం అయినట్లే. అవి కూడా అంతే. ఆమె జ్వరంతోనో.. పరాయిఊరు వెళితేనో అవి అల్లాడి పోతాయి. విలవిలలాడిపోతాయి. దూడలు, ఆవుపెయ్యలు అయితే ఇంట్లోకి వెళ్లి ఆమె మంచం చుట్టూ తిరుగుతూ అక్కడే ఉంటాయి. లోపలికి రాలేని పెద్ద పశువులు బయటనుండి తెల్లవార్లూ అరుస్తూనే ఉంటాయి. కట్టుకొయ్యల వద్ద కదను తొక్కుతూనే ఉంటాయి.. పడుకోవు.. గడ్డి తినవు.

ఇక వాటికి జబ్బుచేస్తే ఆమె స్వయంగా వాటికి వైద్యం చేస్తుంది. ఆ అనుభవం ఆమెకు పుట్టింటి నుండే వచ్చింది. పుట్టింట్లో ఉండగానే ఏదైనా పశువుకు జబ్బు చేస్తే ఆమె అల్లాడిపోయేది కానీ తండ్రి, అన్నదమ్ములు ఏ మాత్రం పట్టించుకునే వారు కాదు. ఊళ్లో పశువైద్యుడు ఉన్నా వాళ్లు ఉదాశీనంగా ఉండేవారు. ‘అదే తగ్గుతుందిలే..’ అనేవారు. ఆమె పరుగుపరుగునా పశువైద్యుని వద్దకు వెళ్లి కాళ్లావేîళ్లా పడి ఆయనను ఇంటికి పిలుచుకొచ్చేది. వైద్యం చేయించేది. అయితే అది తగ్గేది కాదు. చనిపోయిన పశువులను తీసుకుపోయే మాదిగ కవులప్ప.. ఇంటి ముందుగా పోతూ గేదె బాధను చూస్తూ ఆమె పడుతున్న నరకయాతన గమనించి ఒకసారి వచ్చి పశువును చూసి నడుముకున్న సంచిలోంచి ఏదో పసరు తీసి దాని నోట్లో పోశాడు. అంతే!! అది లేచి కూర్చుంది.

అప్పటినుండి మాదిగ కవులప్పే ఆమెకు పశువైద్యుడు. అతడు కూడా ఎప్పుడూ ఖాళీగా దొరకడు. కాని అతడు చంద్రమ్మకు పశు ప్రాథóŠమిక వైద్యం నేర్పాడు. ఆమె ప్రాణాలన్నిపెట్టి క్షుణ్ణంగా నేర్చుకుంది. అప్పటినుండి ఆమె మళ్లీ కవులప్పను పిలవలేదు కానీ అప్పుడప్పుడు ఇద్దరూ కూచుని కొత్త కొత్త పశు జబ్బుల గురించి చర్చించుకుంటారు.

అత్తారింటికి వచ్చాక ఆమె గొప్ప పశువైద్యు రాలిగా రాటుతేలింది. కాని అందరూ గుర్తించేలా ఆమె ప్రవర్తించదు.

ఏదో తన మానాన తన పశువుల ఆరోగ్యం చూసుకుంటుంది. మెట్టిన ఊరులో మాదిగ భజరప్ప చంద్రమ్మతో ఒక్కసారి మాట్లాడగానే ఆమెకు శిష్యుడై పోయాడు. పశువైద్యంపై ఆమెకున్న విజ్ఞానం అతన్ని పరవశింప జేసింది. చంద్రమ్మను చూస్తే చాలు భజరప్ప రాముని చూసిన హనుమంతుడిలా ముకుళిత హస్తాలతో పాదాభివందనం చేస్తాడు.

ఇప్పటి ఈ కరువుకాలం ఆమె తన నలభై ఏళ్ల జీవితంలో ఎప్పుడూ చూడలేదు.

రోజు రోజుకూ ఇంట్లో ఊళ్లో పరిస్థితులు చేయి జారిపోతున్నాయి. పెద్దలు ఏవేవో చేస్తున్నారు. భర్త, కొడుకులు ఇంట్లో తిండితిప్పల కోసం నానా హైరానా పడుతున్నారు. కాని చంద్రమ్మ ధ్యాసంతా తన పశువుల మీదనే.

మొదటి ఏడాది భర్త అన్నాడు, “గడ్డి చూసివాడు. ఈ ఏడు పంట తక్కువ వచ్చేలా ఉంది. గడ్డివామి కూడా తక్కువే. ఎట్టాగో ఏవో..”

రెండో ఏడు ఆయన చెప్పకుండానే చంద్రమ్మే గుర్తించింది. మూడో ఏడు ఊరు ఊరంతా గుర్తించడమే కాదు గగ్గోలు మొదలయ్యింది. పొలాల్లో పచ్చగడ్డి కూడా మొలవడం లేదు. పాడికూడా తగ్గిపోతోంది..

రానురానూ ఇంట్లో వడ్లు, బియ్యం కూడా అడుగంటాయి. చిన్నపిల్లలకు తల్లుల పాలు సరిపోవడం లేదు.

గేదెల, ఆవుల పాలు వాటి దూడలకు ఇవ్వడం ఆపేసి ఇంట్లో పిల్లలకు తీసుకుంటున్నారు కోడళ్లు. దూడలను చూస్తూంటే చంద్రమ్మకు పేగులు తరుక్కుపోతున్నాయి. అవి బక్క చిక్కి ఎప్పుడు చస్తాయో అన్నట్లున్నాయి. కొన్ని రోజులకు పెద్దపశువుల పరిస్థితి కూడా అదే.

రోజూ భజరప్ప బృందం చచ్చినవో బతికినవో పశువులను తోలుకు పోతున్నాడు. పోతూపోతూ చంద్రమ్మ చావిడిలోకి తొంగి చూడటం ఆమెకు కోపం తెప్పించింది. “ఇయ్యాల కాపోతే రేపు.. రేపు కాకుంటే ఎల్లుండి. ఆటిని భజరప్పకు అప్పగిం చాల్సిందే.. సచ్చిన తర్వాతో.. సావబోయే ముందో..” అన్నాడు కొడుకు.. తల్లికి వినిపించేలా.

ఆమె నివ్వెరబోయింది. రెండేళ్లుగా ఆమె సరిగా తినడం లేదు. ఆమె తిండి తగ్గించడం.. కోడళ్లు మొగుడు గుర్తించినా మౌనంగానే ఉండిపోయారు. గుప్పెడు.. కాదు కాదు నాలుగు మెతుకులు మిగిలినా మిగిలినట్లే అనే దారుణకాలం వచ్చేసింది.

నాలుగో ఏడాది మొదట్లోనే దూడలు చనిపోవడం మొదలయ్యింది. తొలుత గుండెలవిసేలా ఏడ్చింది చంద్రమ్మ.

అప్పుడు కుటుంబసభ్యులు నిజంగానే ఆమె బాధను గుర్తించారు. భజరప్ప కూడా ఆమెను ఓదార్చాడు. “ఏదీ మన సేతుల్లో లేదు అమ్మగారో. మడుసులే సచ్చే రోజులు వోచేత్తన్నాయ్. ముసలి ముతకల్ని సంపుకుంటన్నారు. ఇక పశువుల కోసం ఎవుడూ ఏడ్డం లేదు. ఊళ్లో మీరొక్కరే ఆటి కోసం ఏడ్సేది.” అన్నాడు పై గుడ్డతో కళ్లు వొత్తుకుంటూ.

ఆ రోజూ వొచ్చేసింది. దూడలన్ని చచ్చి పోయాయి. ఇక పెద్ద పశువుల వంతు దగ్గరపడింది. ఊళ్లో చాలామంది పశువుల్ని అమ్ముకుంటున్నారు.

“మరీ ఇంత తక్కువ ఇచ్చావు భజరప్పా..” కొడుకు అంటుండగానే అడ్డు పడ్డాడు భజరప్ప.

“ఇది నాణేలు తీసుకుంటున్నారు కాబట్టి. అదే వడ్లు కావాలని అడిగితే పశువుల్ని ఎవ్వడూ కొనడంలేదు అబ్బాయిగారో..” అన్నాడు.

అవును. నాణేలు కుప్పలు తెప్పలుగా దొరుకు తున్నాయ్. వడ్లగింజ దొరకడం లేదు. బేరం లాగితే అసలు పశువుల్ని వదిలేసి పోతాడన్న భయంతో అన్నాడు భర్త. “సరే సరే.. అదేదో ఇచ్చి తోలుకుపో..”

అప్పటికే భజరప్ప మనుష్యులు పశువుల తాళ్లు పట్టుకుని బయటకు తీసుకుపోయారు.

కొడుకులు, కోడళ్లు బయటకు వచ్చి చూస్తు న్నారు. చంద్రమ్మ బయటకు రాలేదు.

మరి కాసేపటికి ఇంటి పశువుల దొడ్డి ఖాళీగా బావురుమంటోంది.

మరో అరగంట ఎవ్వరూ మాట్లాడలేదు. కేవలం మౌనం.. ఇల్లంతా మౌనం.. విషాదం..

నాలుగు మెతుకులు వేసి కంచంతో అత్త వద్దకు వచ్చిన కోడలు ప్రశాంతంగా నిద్రపోతున్న అత్తను అనుమానంగా చూసి గుర్తించింది. అది దీర్ఘనిద్ర. మరి లేవని నిద్ర.

పశువులతోనే ఆమె పంచప్రాణాలు ఇల్లువదలి వెళ్లిపోయాయి. పశువులకు మేత తగ్గిన నాటినుంచి చంద్రమ్మ కూడా తినడం తగ్గించింది. చూస్తున్న భర్త, కొడుకులు, కోడళ్లు మౌనంగా ఉండిపోయారు. పశువులతోనే ఆమె ప్రాణాలని వాళ్లందరికి తెలుసు. ఇప్పుడు చనిపోతే గ్రామంలో ఎవ్వరూ ఏడవడం లేదు. మైల పట్టడం లేదు. దశదిన ఖర్మలు అసలే లేవు. పీనుగను ఊరేగింపులు గట్రా లేకుండా నలుగురు మోసుకుపోయి దహనం చేసి రావడమే. దేవాలయాలు మూసేయడం, ఇంట్లో పూజలు ఆపేయడం లేదు. ఆడవాళ్లు బొట్టు తీసేయడం, పూలు పెట్టుకోకపోవడం, నేల పడక.. అన్నీ ఆగిపోయాయి.

బంధనాలు, బాధలు, దుఃఖాలు.. ఏమీ లేవు. కేవలం నాలుగు గింజలు మిగిలాయి అనే ఆలోచన తప్ప.

ఎందరు దేవుళ్లున్నా కరువు కాటకాల కంటే గొప్పోరు కాదు. ఇది నిర్వివాదాంశం!

*******

సంభాలపల్లి గ్రామం, పానగల్లు రాజ్యం.

తెలగలవృత్తి శెట్టి గొంటులప్ప తీవ్రమైన ఈ కరవుకాలంలో కూడా ఆనందంగా ఉన్నాడు. కారణం అతనికి తెలియడంలేదు కాని కొబ్బరినూనెకు పెరిగిన గిరాకి ఇంతా అంతా కాదు. ఇరవైనాలుగు గంటలూ గానుగ మీద కూర్చున్నా కొబ్బరినూనె ఒక్కబొట్టు కూడా మిగలకుండా అమ్ముడయిపోతోంది. స్థలలోని పది గ్రామాల వారే కాకుండా చుట్టుప్రక్కల గ్రామాలవారంతా కొబ్బరినూనె కావాలంటే అందరూ సంభాలపల్లి గొంటులప్ప గానుగకే వస్తారు. రాశివర్తకులంతా సంతల్లో కూడా “ఇది గొంటులప్ప గానుగనూనె.. కొనండమ్మా కొనండి.. కొనండి అయ్యా.. కొనండి..” అంటూ ఆయన పేరు చెప్పే నూనె అమ్ముకుని నాలుగు రాళ్లు మిగుల్చుకుంటారు.

కరవు కాలంలో దీపాలు ఆర్పేసి పడుకుంటు న్నారు కాబట్టి ఆముదపు నూనె కొనడం లేదు అంటే ఆశ్చర్యం ఏమీ లేదు గొంటులప్పకు.

కానీ కొబ్బరినూనె కోసం జనం నూనెకుండలతో ఎందుకు వస్తున్నారో

అర్థం కాలేదు. కొందరు కుండలు కుండలు ఎందుకు కొంటున్నారో అస్సలు అర్థం కావడం లేదు. బేరం బాగా సాగుతోంది కనుక కులాసాగా గానుగ మీద కూర్చుని కొనుగోలుదార్లు ఇచ్చిన నాణేలో.. వడ్లో.. పక్కనున్న బానల్లో నిండుతుంటే తత్వవేత్తలా

“వస్తావట్టిదే పోతా వట్టిదే..” అని కూనిరాగం తీస్తూ ఆనందంగా ఉన్నాడు.

 గొంటులప్పకు ఐదుగురు కొడుకులు, ఆరుగురు కూతుళ్లు. అందరికి పెళ్లిళ్లు చేసి పంపేశాడు. అందరికి బాగా ముట్టజెప్పాడు కూడా. తెలకల వృత్తిదారులంటే బాగా కలిగిన, పెద్ద వ్యాపార కుటుంబాలు కదా. రెండేళ్లనాడు భార్య మరణిం చింది. కొడుకులు ‘ఇక్కడికి రాలేము అక్కడ మా నూనె వ్యాపారం బావుంది. నువ్వే మావద్దకు వచ్చేయమ’ని చెప్పారు. కానీ వ్యాపారపు మత్తు పూర్తిగా తెలిసిన గొంటులప్ప వెళ్లలేదు. బేరం లేని సమయంలో గానుగ దిగి నాలుగు గింజలు ఉడకేసుకుని తింటాడు. భార్య సంవత్సరీకాలకు వచ్చిన కొడుకులు, కూతుళ్లుతండ్రి వద్ద మిగిలిన ఆస్తులపై ఆరా తీశారు. ‘ఇప్పుడు ఈ ఊళ్లో నువ్వే బాగా కలిగిన ధనవంతుడివని చెప్పుకుంటున్నారు. అదేదో మాకు పంచు’అని అడిగారు. ‘నేను పోయాకే ఈ గానుగ, నా చిరుగుల పంచెలు, ముసిలి ఎద్దులు పంచుకోండి’ అని కసిరాడు.

ఇప్పుడు ఈ కరవు తనకు కలిసొచ్చినందుకు ఉబ్బితబ్బిబ్బౌతున్నాడు గొంటులప్ప.

ఉదయాన్నే వేగంగా పరుగున వచ్చాడు.. ప్రక్క గ్రామంలో గానుగ పెట్టుకున్న పె<్దŠ కొడుకు మొగులయ.

“అయ్యా.. మా మామ సంకులయ నీ వద్దకు వచ్చాడా.. ఎటు పారిపోయాడో తెలియడం లేదు..” అన్నాడు

అరుగుపై కూలబడుతూ.

 గొంటులప్ప ఆశ్చర్యంతో చూసి, “పారి పోవడమా.. ఈ వయసులోనా.. బయటకు పోతే ఇంత ముద్ద దొరకడం లేదు కదా.. ఎక్కడికి పోతాడు మీ మామ.. నాకంటే పెద్దోడు కూడా..” అన్నాడు సాలోచనగా.

“పోవడం అంటే ఏదో పెళ్లికో సావుకో వెళ్లడం కాదు. ఇంట్లోంచి పారిపోయాడ్లె..”

అతని ముఖంలో ఆహ్లాదం తొణికిసలాడుతోంది. నోరు తెరచి కొడుకును చూస్తుండిపోయాడు గొంటులప్ప.

“ఎల్తా మరి. కనపడితే ఎవురితోనయినా కబురంపు. అందరూ.. ఆయన పిల్లలంతా ఓ మాట అనుకున్నారులే. అది తెలిసి పారిపోయాడు. అందరం తలో దిక్కూ వెతుకుతున్నాం. దొరక్క పోతాడా?!”

కొడుకు వెళ్లిపోయాడు. కానీ కొడుకు.. అతని మామ గురించి చెప్పిన మాటలు అర్థం అయ్యి కాకుండా ఉన్నా యి. కొడుకు ముఖంలో ఆనందం ఏవిటో ఎందుకో.. అర్థం కాలేదు.

సాయంత్రానికి కొడుకు మళ్లీ వచ్చాడు. ఈసారి నూనె కుండతో.

“నాన్నా. నీ కాడ నూనె ఎంతుంది? ఈ కుండెడు పొయ్యి. రెండ్రోజుల్లో నీకు తిరిగి పోసేస్తాను. కొబ్బరినూనెకు ఇంత గిరాకి ఎప్పుడూ సూడ్లేదు..”

కొడుకు ముఖంలో ఆనందం ఇప్పుడు మరింత వికసించి కనిపిస్తోంది.

“అవునూ.. మీ మామ దొరికాడా?” అన్నాడు నూనె పోస్తూ.

“దొరికాడు. అందుకేగా నూనె!” కుండ నెత్తిన పెట్టుకుని హుషారుగా వెళ్లిపోయాడు కొడుకు.

వచ్చినప్పటినుండి ఇప్పుడు కొబ్బరినూనె కుండతో వెళ్లే వరకు కొడుకు చెప్పిన ప్రతి మాటా గొంటులప్పకు ఎందుకో కొంచం తేడా కొడుతోంది.

రాత్రి వరకు వచ్చిన వాళ్లకు ఉన్న కొబ్బరినూనె అంతా అమ్మేసి ఇచ్చిన నాణేలు తీసుకున్నాడు. నాలుగు గింజలు ఉడకేసుకుని.. ఉట్టి మీదున్న ఉప్పుచేపను నిప్పులో కాల్చుకుని.. అన్నంతో కలుపుకుని తినేశాడు.

ఊరు దాదాపు నిర్మానుష్యంగా ఉంది.

పెద్ద రైతులు.. ఇంకా కొట్టాలలో ధాన్యం ఉన్నవాళ్లు మాత్రమే నాలుగు మెతుకులు తిని బతికి కనిపిస్తున్నారు.

ఆలోచనలన్నీ కొడుకు, వియ్యంకుడి చుట్టూ తిరుగుతున్నాయి.

ముదుసలి మామ పారిపోవడం.. వీళ్లు ఆయన కోసం వెదకడం.. పిల్లలంతా ఒక్క మాట అనుకో వడం.. ప్చ్..

ఏదో తేడా కొడుతోంది.. మళ్లీ మళ్లీ అనుకు న్నాడు.

అదేదో తెల్చుకోవాలనుకున్నాడు. లేచి కండువా భుజాన వేసుకుని గోచి బిగగట్టి వేగంగా పక్కూరు వెళ్లాడు. కొడుకు ఇంటివరకు వేగంగా వెళ్లినవాడు ఇప్పుడు మెల్లగా అడుగులో అడుగు వేస్తూ దగ్గరగా వెళ్లి ఆగిపోయాడు. వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. జనం కుక్కల్ని కూడా తినేశారు కాబట్టి వీధుల్లో అలికిడి కూడా లేదు. ఇల్లు దాటి ముందుకు వెళ్లి పక్కగా నాలుగడుగులు వేసి మెల్లగా చీకట్లో నక్కినక్కి వెళ్లి ఎడమవైపున్న కిటికీ నుండి తొంగి చూశాడు.

గుండె ఆగినంత పనయ్యింది.

మామను ఓ చెక్క బల్లపై కూర్చోబెట్టి ఇంటి నడిమి గుంజకు కట్టేశారు.

పెద్ద కూతురు.. అంటే తన కోడలు తండ్రి తలను కొబ్బరినూనెతో మర్దన చేస్తోంది.

చిన్న గుడ్డి దీపం వెలుగులో ఈ తతంగం జరుగుతోంది. చుట్టూ దగ్గరగా మిగిలిన కొడుకులు, కూతుళ్లు కూర్చుని ఉన్నారు. ఆయన తల వంచి ఉంది. కళ్లు మూసి ఉన్నాడు. స్పృహలో ఉన్నట్లు లేడు.

ఒళ్లు జల్లుమంది గొంటులప్పకు.

అసలు అక్కడ ఏమి జరుగుతోందో తెలియడం లేదు. ఆ నిశిరాత్రి వేళ ఆయనకు కడుపున పుట్టిన పిల్లలు నిశ్శబ్దంగా తల స్నానం.. స్నానమా.. కొబ్బరినూనెతో రాత్రి పూట స్నానం ఏవిటి..?

లోపల క్రిందికి తొంగి చూశాడు. ఎక్కడా నీళ్లకుండ కనిపించలేదు. కేవలం నాలుగైదు నూనె కుండలున్నాయి అక్కడ.

అప్పుడు వినిపించింది..

“ఎవరు?.. ఎవుర్రా అది.. కిటికీ కాడ.. ఏం సేత్తన్నావ్??”

ఎవరో వెనగ్గా అన్నారు. చివ్వున వెనుదిరిగాడు.

ఇరుగింటి పొరుగింటి వాడెవడో.. దూరంగా నిలబడి ఉన్నాడు. అక్కడి నుంచి అనడంతో లోపలకి వినిపించి ఉండదు. గబగబా దగ్గరకు వెళ్లాడు గొంటులప్ప.

“ఆ.. నేనే.. నేనే.. గొంటులయ్యని. నూనె గొంటులప్పని. మా అబ్బాయిని చూద్దామని వచ్చాలే..” అన్నాడు.

“ఓర్ని.. నువ్వా గొంటులప్ప బాబాయ్.. మరి సెప్పవేం.. మీవోడు పెద్ద పనిలో ఉండాడ్లె. పద.. అటు పోయి ఆ అరుగు మీద కూకుందాం..” అంటూ ముందుకు నడిచాడు.

అతని ధోరణి చూస్తే కొడుకు ఇంట్లో ఏమి జరుగుతుందో తెలిసినట్లే ఉంది.

“నీ యాపారం బాగా ఉండాలే?! మొన్న మాఇంట్లోకి కొబ్బరినూనె అవసరం పడినప్పుడు మీ అబ్బాయి కాడ తక్కువపడితే నీకాడే తెచ్చాడు. మా ఇంట్లో బాగా జరిగిందిలే. ఇయ్యాల వాళ్ల ఇంట్లో పెట్టారు. ఈ కొబ్బరినూనె లేకపోతే ముసలాళ్లు సావటల్లా. మా అయ్య సావడానికి పది కుండల నూనె కరుసయ్యింది. అయితేనేం ముసలాడు ప్రశాంతంగా పోయాడు. నేను సేప్పుకోకూడదు కానీ కర్మకాండ అదిరిపోయిందనుకో.. ఊరోళ్లు భలే సెప్పుకున్నారు. కరవులో అయినా తండ్రి సావు ఇంత బెమ్మాండంగా సేశానని పొగిడి.. పెట్టింది ఆబగా.. మెతుకు మిగలకుండా తిని పోయారంతా..” ఆనందంగా చెబుతున్నాడా పక్కింటివాడు.

అతని ప్రతి అక్షరం గొంటులప్ప ఊపిరి బిగబెట్టి వింటున్నాడు. కొన్ని మాటలు అర్థం అయ్యీ కానట్లున్నాయి.

“అదే.. ఈ నడిరేత్రి నూనెతో స్నానం ఏంటి??”

ఫెళ్లున నవ్వాడు వాడు.

“ఇది మన పద్దతి కాదు. తమిళం నుంచి వచ్చింది. మావూరి పూజారి లేడూ.. అడు తమిళం గాడు. అక్కడి సంగతి చెప్పాడు. అక్కడ ఎంతకీ సావని ముసలాళ్లకి తలకి బాగా కొబ్బరినూనె పట్టించి సచ్చేదాకా మర్దన చేస్తారంట. అప్పుడా పెద్దోడు ప్రశాంతంగా పోతాడంట. ఇయ్యాలరేపు మన చుట్టుపక్కల ఊళ్లలో ముసలాళ్లను ఇట్టాగే.. ” చేత్తో నేలపై దరువు వేస్తూ చెబుతున్నాడు.

గొంటులప్పకు వొళ్లు జలదరించింది. కొబ్బరి నూనెకు ఎందుకు గిరాకీ పెరిగిందో.. పూర్తిగా అర్థ్ధమైంది.

అప్పుడే కొడుకు ఇంట్లోంచి ఒక్కసారిగా ఏడుపులు పెడబొబ్బలూ వినవచ్చాయి.

“హమ్మయ్య. మీ వియ్యంకుడుగోరు ఎల్లి పోయాడు గొంటులప్ప బాబాయ్..” ఉత్సాహంగా లేచి గంతులేయ

సాగాడు ఈ ప్రక్కింటివాడు.

గుండెలు అదిరిపోయిన గొంటులప్ప లేచి తలగుడ్డ దులిపుకుని.. తిరిగి చూడకుండా పరుగు పెట్టాడు.

తర్వాత గొంటులప్ప ఏమయ్యాడో ఎటు పోయాడో.. ఉన్నాడో పోయాడో.. ఎవ్వరికి కనిపించ లేదు. కొడుకులు అల్లుళ్లు వెదుకుతూనే ఉన్నారు.

మత్తి భానుమూర్తి

About Author

By editor

Twitter
YOUTUBE