‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక
నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన
బాణాపూండి అగ్రహార గ్రామం. బ్రాహ్మణ వీధి. కందెనవోలు రాజ్యం.
ఉదయం రావడం రావడం భగభగలాడిపోతూ వచ్చాడు సూర్యభగవానుడు. సంధ్య వార్చుకుని పళ్లెం, గిన్నె లోపల పెట్టి పిలక సవరించుకుంటూ అరుగు దిగి బయటకు వచ్చి పైకి చూసి సూర్యునికి నమస్కరించాడు శరభయ్య శర్మ. ఎప్పటిలాగే చిటప టలాడిస్తూ చిరాగ్గా చూశాడు సూర్యదేవుడు. ఆ లిప్తకాలానికే శర్మకు చమటలు పట్టాయి. శరీరం కాస్త తూలింది. భోజనం అనే నాలుగు మెతుకులు తిని మూడు రోజులయ్యింది. బలవంతాన కళ్లు మూసుకుని కాళ్లు నిలదొక్కుకుని రెండు,మూడు లిప్తల కాలం అలాగే నిలబడి.. కళ్లు తిరగడం ఆగాక కాస్త కుడి ఎడమలుగా అటూ ఇటూ.. రెండు మూడు అడుగులు వేశాడు. ఏ ఇంట్లోనూ పొయ్యిలో నుంచి పిల్లి బయటకు వచ్చినట్లు లేదు. అసలు ఊళ్లో పిల్లులు ఉంటేగా.. ఎప్పుడో తినేశారు అనుకున్నాడు నిర్లిప్తంగా.
కరవు కరాళనృత్యం చేస్తోన్న ఆరవ ఏడాది ఇది.
బ్రాహ్మణ వీధిలో దాదాపుగా పది ఇళ్లు ఉంటాయి. అందరూ వేదాధ్యాయులే. అందరూ బాణాపూండి అగ్రహార గురుకులంలో ఉపాధ్యా యులు. ఒకరిద్దరు పూజారులు. ఒకరిద్దరు పాఠాలు చెప్పడమేకాక వ్యవసాయం కూడా చేస్తున్నారు.
పది ఇళ్లూ ఒకే వీధిలో పెద్ద పెద్ద చావడులతో.. విశాలమైన గదులతో ప్రహరీ గోడలతో ఉంటాయి. ఎప్పుడూ నిండా విరబూసిన పూలమొక్కలతో.. పచ్చగా ఏపుగా ఎదిగిన మామిడి, అరటి, పనస, సపోటా చెట్లతో నిండి ఉండేవి. ఆ చెట్ల మధ్యగా పూరి కప్పు అయినా చక్కని పర్ణశాలల్లా కనిపించేవి ఆ బ్రాహ్మణ గృహాలు. ప్రహరీలు అలాగే ఉన్నాయి కానీ కాని దొడ్లో పచ్చదనం లేదు. అసలు చెట్లే లేవు. ఇల్లు కూడా కప్పు సగానికి సగం ఊడిపోయి ఉంది. పట్టించుకునే నాథుడే లేడు.
వెనగ్గా ఇంటి అరుగులపైకి పిల్లలు వచ్చినట్లుగా గలగల శబ్దం విన రావడంతో వెనక్కు తిరిగాడు శరభయ్య.
ప్రధాన గృహం పక్కగా కుడి, ఎడమ, వెనుక మూడు కుటీరాలున్నాయి. వాటి నిండా గోలగోలగా దాదాపు వందమంది విద్యార్థులుంటారు ఎప్పుడూ. ఇప్పుడు కరవు వల్ల అందరికి వారి వారి ఊళ్లకు పంపేశాడు. మిగిలింది అనాథలైన ఐదుగురు యువకులు. తన కన్నబిడ్డలు ముగ్గురితో కలుపుకొని ఏడుగురు మగపిల్లలు, ఒక్క ఆడపిల్ల. అంతా అరుగుపై కూర్చుని బయట నిలబడిన శరభయ్యను చూస్తున్నారు.
వారి చూపుల్లో ఆకలి.. ఆకలి.. ఆకలి..
వాళ్ల వైపు చూడలేక వీధి వైపు తిరిగాడు. ఇటు చూసినా చూడలేక కళ్లు మూసుకున్నా ఒక్కటే దృశ్యం.. ఒక్కటే శబ్దం.. ఆకలి.. ఆకలి.. ఆకలి..
మహాపండితుడు కర్లపాలెం శరభయ్యశర్మ ముత్తాత రామేశశర్మకు అప్పటి మహారాజు విద్యా గురుకులం నిర్వహించే షరతుపై ఈ గ్రామాన్ని దేవమాన్యంగా ఇచ్చాడు. అప్పటి నుంచి కొందరు కాపులు గ్రామంలో పొలాలను సాగుచేస్తూ పండిన పంటలో శరభయ్యశర్మకు, అలాగే అన్ని వృత్తులవారికి వారి వారి వాటా ఇచ్చి మిగిలింది తాము తీసుకుంటు న్నారు.
కరవుతో మూడేళ్లుగా ఎలాగోలా నెట్టుకొచ్చిన రైతులు, వృత్తులవాళ్లు కూడా మెల్లమెల్లగా మూటాముల్లె సర్దుకుని వలస వెళ్లిపోయారు. ఊరిలోని మొత్తం పది వీధుల్లో ఒక్కొక్క ఇంట్లో ఒకరో ఇద్దరో.. అదీ ముసలివాళ్లు.. క్షణం తీరిక లేని యమభటుల కోసం కాచుకుని కూర్చున్నవాళ్లు..
బ్రాహ్మణ వీధిలోకూడా ఏడుగురు ‘‘మా అత్తింటివారు రమ్మని కబురు పెట్టారు శరభయ్య గారూ.. కరవు తగ్గాక వస్తాం..’’ నమస్కరించి వెళ్లి పోయారు. అత్తింటివారు, అన్నదమ్ములు, బంధు వులు.. వాళ్లకు మాత్రం కరవు లేదా..? విషాదంగా నవ్వుకుని వీడ్కోలు చెప్పాడు. వాళ్లు ఎక్కడికి వెళ్లారో.. ఎలా బతుకుతున్నారో.. ఊహించడం కంటే పైకి చూసి ఓ దణ్ణం పెట్టుకోవడం మేలు.
‘‘అలా వీధిలో నిలబడ్డారేం.. ఇలా వచ్చి అరుగుపై కూర్చోవచ్చు కదా..’’
భార్యామణి కాంతమ్మ.. లోపలినుండి బయటకు వచ్చింది.
అప్పటికే కాళ్లు పీకుతున్నాయి. చూసి చూసి మెల్లగా వెనకడుగు వేశాడు నలభై ఏళ్ల శరభయ్య శర్మ. నిత్యమూ ఈ పాటికి నాలుగైదు పల్లకిలో.. అశ్వరథాలో తన ఇంటి ముందు ఆగేవి. జాతకాల కోసం, పిల్లల పెళ్లిళ్ల కోసం, సమర్త ముహూర్తాల కోసం బిలబిలమంటూ గుంపులు గుంపులుగా జనం వచ్చేవారు. తాంబూలంలో నాలుగైదు నాణేలు, అంతో ఎంతో బంగారపుముక్క పెట్టి చేతికిచ్చి భక్తిగా కాళ్లకు సాష్టాంగ నమస్కారాలు చేసి కళ్లకద్దుకుని వెళ్లేవారు.
ఈ మహత్తర కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోయి ఏడాది అయినా అదో కలలా ఉంది ఆయనకు.
‘‘ఈ రోజయినా వస్తాడా.. రాములయ్య??’’ అంది కాంతమ్మ.
‘‘రావాలి. రెండో రోజే వస్తానన్నాడు. మరి వారం అయ్యింది. ప్చ్..’’ ఆశ, నిరాశ జమిలిగా వేసి చెప్పాడు.
కాంతమ్మే కాదు పిల్లలు కూడా విన్నారు. ఆమె వైపు చూశారు. కాస్త ఊపిరి పీల్చుకునే సంగతి ఏవిటంటే పిల్లలంతా మరీ చిన్నవాళ్లు, పసివాళ్లూ కాదు. ‘అమ్మ ఆకలి.’ ‘నాన్నా.. ఆకలి’ అని ఏడవ డానికి. పెద్దవాళ్లతో పాటే నిశ్శబ్దంగా లోలోన ఏడుస్తున్నారు గుక్కలు పట్టి ఆకలితో.
రాములయ్య అగ్రహారపు ప్రధాన కౌలుదారు. శరభయ్యకు అనుంగు బంటు. ఇద్దరిదీ ఒకే మాట. రాములయ్య బళ్లపై ఎంత ధాన్యం తోలితే అంతే తన వాటాగా కళ్ల కద్దుకుని తీసుకుంటాడు శరభయ్య. మూడేళ్లుగా తన కుటుంబాన్నే కాదు శరభయ్య కుటుంబాన్ని కూడా పస్తులు పెట్టకుండా తన వల్ల అయినంత ధాన్యం తెచ్చి ఇస్తున్నాడు రాములయ్య.
వారంనాడు భార్యాపిల్లలను అత్తారింట దింపి కొంతధాన్యం తెస్తానని వెళ్లిన వాడు మళ్లీ ఇప్పటివరకు రాలేదు.
అతని కోసమో.. లేక యమభటుల కోసమో ఎదురుచూడటం తప్ప మరో మార్గం తెలియదు శరభయ్యకు.
అందరూ అలాగే కాలే కడుపులతో కాస్త కాస్త నీళ్లతో గొంతు తడుపుకుంటూ పడుకున్నారు. ఆయన మాత్రం వీధి మలుపుపై చూపు నిలిపి అలాగే అరుగుపై రెప్పవేయకుండా కూర్చుని ఉన్నాడు.
అప్పుడు కళ్లముందు జరిగిందిది.
అర్ధరాత్రి దాటుతున్నవేళ పక్క ఇంటినుంచి దేమునిభట్టు బయటకు వచ్చాడు. తనతో పాటు వీధిలో మిగిలి ఉన్న ఇద్దరిలో ఒక పండితుడాయన. అటూఇటూ తిరిగాడు. ఏదో ఆలోచిస్తున్నట్లు ఇంటి వెనుకకు వెళ్లాడు. దొడ్డి నుండి మండుతున్న కట్టె పుచ్చుకుని తిరిగి వచ్చాడు. అటూఇటూ చూడకుండా కట్టెతో తన ఇల్లు అంటించాడు. బాగా మంటలు లేచాక తను కూడా లోపలికి వెళ్లిపోయి తలుపులు వేసుకున్నాడు దేమునిభట్టు.
దిగ్గున లేచాడు శరభయ్య. కళ్లు తిరిగి నట్లయ్యింది. తిండిలేక నోరు కూడా పెగల్లేదు. ఏమీ చెయ్య లేక తన ఇంటిని తనే కాల్చుకుని కుటుంబ మంతా ఆ మంటల్లో చనిపోతోందని అర్థమైంది.
స్పృహ తప్పాడు శరభయ్య.తిరిగి స్పృహ వచ్చే సరికి తెల్లారింది. దేముడిభట్టు ఇల్లంతా చిన్న బూడిద కుప్పలా కనిపిస్తోంది. ఊరు ఊరంతా వెదికితే పాతికమంది ముదుసలివాళ్లు మాత్రమే ఉన్నారు. వాళ్లే వచ్చి చూస్తున్నారు విషాదంగా.
ఇల్లు తగలబడుతుంటే ఆర్పేవాళ్లు కూడా లేరు. రెండిళ్ల అవతల మరో ఇల్లు ఉంది. అది కలవయా చారి నివాసం. ‘అతనికి నా అన్నవారెవ్వరూ లేరు’ అని అందరికి చెబుతాడు. అదే ఇపుడు అతనికి ఇబ్బంది అయ్యింది. ఎక్కడికీ వెళ్లకుండా ఊళ్లోనే ఉండిపోయారు.
ఆ రోజు కూడా రాములయ్య రాలేదు.
ఆ రాత్రి అరుగుపై కూర్చుని రాములయ్య కోసం చూస్తూ రోజులాగే నేలపై వాలి నిద్రపోయాడు. ప్రక్కన ఎవరో కదిలితే చివ్వున లేచాడు.. ‘‘రాముల య్యా.. వచ్చావా..’’ అంటూ.
భార్య కాంతమ్మ. ‘‘నేనే పడుకోండి. నిద్ర పట్టక పోతే బయటకు వచ్చాను.’’ అంది. పక్కకు తిరిగి పడుకున్నాడు. కాలువ కడుతున్న కళ్ల నీరు కనిపించకుండా. కొంగు అందించింది తుడుచుకో మన్నట్లు.
పైటతో పాటు ఆమెను కూడా దగ్గరకు పొదువుకుని మౌనంగా పడుకున్నాడు.
అప్పుడంది కాంతమ్మ మెల్లగా..
‘‘మనం కూడా ఇల్లు తగలేసుకుందామా??’’
* * *
ముందు నడుస్తున్నాడు శరభయ్యశర్మ. వెనగ్గా భార్య, కూతురు.. ఆ వెనగ్గా మగపిల్లలు..
అంతా నడిచి నడిచి నీరసించి పోయినా రొప్పుతూ మెల్లగా నడుస్తూనే ఉన్నారు. ఊరు దాటాక అక్కడెక్కడో అడవుల్లా ఉన్న చెట్ల నుండి ఆకులు తెంపి నోట్లో వేసుకున్నారు. రుచి తెలియడంలేదు కానీ అదేదో కాస్త కడుపులో పడ్డట్టయ్యింది. అందరూ ఆ తెలియని చెట్లపై పడి ఆకులన్నీ దూసి ఆబగా తినేశారు. పెద్దలకు కూడా పంచారు. శర్మ, కాంతమ్మ కూడా గబగబా తిన్నారు. అందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
ఇల్లు వదలడం మంచిదయ్యిందనిపించింది అందరికి. అలాగే నడుచుకుంటూ, అక్కడక్కడా చెట్లను చూస్తూ వాటికున్న ఆకులో.. పళ్లో.. తింటూ కాస్త ఆకలి తీర్చుకుంటూ ముందుకు పోతున్నారు. ఎక్కడికి వెళ్లాలో తెలియదు. కేవలం ఆకలి.. ఆకలి. అది తీరితే చాలు. ఈ అడవిలోనే గడప వచ్చు అను కున్నాడు శర్మ. ఆ రాత్రి అడవిలోనే పడుకున్నారు. ఇప్పుడు ప్రాణభయం లేదు. జంతువులు మీద పడి చంపినా ఏమైనా ఫర్వాలేదు. పిల్లాది మొదలు అందరూ ఆకలి కంటే చావే నయం అన్నట్లున్నారు.
కానీ ఆ రాత్రి అనుకోని సంఘటన జరిగింది.
రాత్రివేళ అందరికి నోరు నొప్పి. దాహం. కాసేపటికి అందరికి నోరు పుండులా అయిపోతోంది. తిన్న ఆకులు ఏవో సరిపడలేదు. అందరూ నోరు తెరుచుకుపోయి లోపల అంతా పుళ్లు పడ్డట్లు అయిపొయింది. మింగలేక కక్క లేక నోరు తెరుచు కుని రాత్రంతా నిద్ర లేకుండా కూర్చుండిపోయారు. దగ్గరలో మందు మాకూ దొరికే అవకాశం లేదు. ఉదయానికి పిల్లలకు జ్వరం.. పెద్దలకు తీవ్ర తలనొప్పి.. అలా పడి ఉన్నారు అక్కడే ఆ అడవి మధ్యలో.. ఓ చెరువు ప్రక్కన.
ఓ ప్రక్క ఆకలి.. మరో ప్రక్క జ్వర తీవ్రత.. పిల్లలు బాధతో విలవిలలాడి పోతున్నారు.
ఆ మర్నాడు పగలు కాస్త నోటి పూత తగ్గింది అందరికి. కాని ఆకలి తీవ్రత దారుణంగా ఉంది. అప్పుడే అవతలగా ఏదో కాలుతున్న కమురు వాసన. ఆ వాసన ఏదో జంతువును చంపి కాలుస్తున్నట్లుగా శర్మ, కాంతమ్మ గుర్తించాడు.
అందరూ నోరు ఆర్చుకుపోయి ఆకలితో కళ్లు తిరుగుతూ ఏ క్షణమైనా చనిపోయేలా ఉన్నారు.
కాంతమ్మ మెల్లగా లేచింది. ఆ వాసన వస్తున్న వైపుగా వెళ్లింది. దూరంగా గిరిజన భార్యా భర్తలు ఏదో జంతువును చంపి తినడానికి కాల్చుకుంటు న్నారు.
వెళ్లి వెళ్లి వాళ్లముందు సాగిలపడిందామే. ‘‘అయ్యా.. అమ్మా.. నా పిల్లలు ఆకలితో చనిపోయేలా ఉన్నారయ్యా. దయచేసి తినడానికి ఏవైనా.. ఏదైనా సరే. ఇంత.. ఇంత పెట్టండయ్యా. లేకుంటే పిల్లలు చనిపోతారయ్యా..’’
ఏడుస్తోంది. వారి ముందు చిన్నగా మొదలై గుక్కలు పట్టి ఏడుస్తోంది.
ఏదో జంతువు మాంసం తినబోతున్న ఆ జంట ఆమె ఏడుపు చూసి వేగంగా ఆమె వద్దకు వచ్చారు.
‘‘ఏరి.. యాడ పిల్లోల్లు?’’ అన్నాడా మనిషి.
వెనక్కు వేలితో చూపింది. అక్కడకు ఆ దంపతులు పరిగెత్తారు. శర్మతో సహా అందరూ నేలపై పడి ఉన్నారు. దగ్గరకు వచ్చిన వాసనతో అంతా కళ్లు తెరిచారు. ముందు ఆడపిల్లకు.. తర్వాత మగ పిల్లలకు నోటికి చిన్నచిన్న ముక్కలుగా అందించారు. ఏదో తినడానికి నోట్లోకి దగ్గరగా రాగానే అదేవిటో పట్టించుకోకుండా ఆబగా నోరు తెరిచారు. నోట్లో ఎవరో పెట్టింది తినేశారు. ఉడికిన ఆ పదార్థం బహురుచిగా తోచింది. మళ్లా మళ్లా నోరు తెరుస్తూ పెట్టింది పెట్టినట్లు అంతా తినేశారు.. శర్మతో సహా.
‘‘మావు మల్లీ ఏ పిట్టనో పిల్లినో సంపి తింటాం. మీరు సూత్తే బాపనోల్లు లెక్క ఉన్నరు. పాపం.. ఏం తింటారో ఏవో..’’ అనుకుంటూ ఆ గిరిజన జంట వెళ్లిపోయారు.
చాలా సేపు ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. మౌనం.. మౌనం!!
మహా పండితుడు, వేదవేదాంగవేత్త అయిన శరభయ్యశర్మ జంతుమాంసం తిన్నాడు. స్వయంగా భార్యే అందుకు సహకరించింది. ఆయన శిష్యులు, కడుపున పుట్టిన పిల్లలు కూడా తిన్నారు.
దీనిని ఎలా తీసుకోవాలి!? ఎవ్వరూ మాట్లాడు తోంది లేదు. కాని ఆ రోజంతా ఆక్కడే ఆ చెరువు ఒడ్డున అడవిలోనే ఉన్నారు. కారణం.. పిల్లలకు జ్వరాల వల్ల నడవడం చాలా కష్టంగా ఉంది.
రాత్రి మళ్లీ ఆ గిరిజన జంట వస్తారేమోనని పిల్లలు ఆశగా చూశారు. కానీ రాలేదు. అలాగే పడుకున్నారు.
అర్ధరాత్రికి ఎప్పటికో శర్మకు నిద్ర పట్టింది. కాసేపటికి తన పాదాలు ఎవరో ముట్టుకున్నట్లు తోచి కళ్లు తెరిచాడు. కాంతమ్మ ఆయన పాదాలకు నమస్కరిస్తోంది. ఆశ్చర్యం నుంచి తేరుకునేసరికి దగ్గరలోని చెరువులో పెద్ద శబ్దం..
అప్పుడు అర్థమైంది… ఎందుకు కాళ్లకు నమస్కరించిందో..
ఆమె ఆత్మాహుతి చేసుకుంది. చివ్వున కూతురి కోసం చూశాడు. ఆమె కూడా లేదు. ముందు పిల్లను తోసి తర్వాత తను ఉరికింది.
గుండెలు అవిసేలా అరిచాడు శర్మ.. పిల్లలు లేచి వచ్చి జరిగింది చూసి గుక్కలు పట్టి ఏడ్చారు.
అది అరణ్యరోదన..
ఉదయం ఆ గిరిజన జంట వచ్చారు. ఏదో జంతువు మాంసం తెచ్చారు. ఆలోచించకుండా శర్మ, పిల్లలతో ఆరగించాడు. కాంతమ్మ చనిపోయిందని తెలిసి వాళ్లిద్దరూ ఎంతో బాధ పడ్డారు.
‘‘జంతుమాంసం తినకూడదు అనుకుంటే ఎట్టా.. పేనాలు ముఖ్యమా.. మానం ముఖ్యమా సావీ..’’
ఆ జంట శర్మ బృందానికి మరో రెండు రోజులు ఉదయం, రాత్రి ఇలాగే జంతు మాంసం తెచ్చి పెట్టారు.
మూడవరోజు శర్మ అన్నాడు. ‘‘బాబూ.. మీరేవ్వరో దైవస్వరూపులు. దయచేసి ఇదిగో ఈ పిల్లల్లో ఇద్దరిని మీతో తీసుకుపోయి పిట్టలను కొట్టడం నేర్పండి. జీవితానికి పరమార్థం ఏవిటో నాకిప్పుడు తెలిసింది. గ్రంథాలు పఠిస్తే కాదు.. ఆకలి.. ఆకలే దేవుడు. దానికంటే దేవుడు లేడు. వీళ్లను బ్రాహ్మణ్యం నుంచి బయటకు తీసుకుపోండి.’’
అతని కొడుకు, ఓ శిష్యుడు వాళ్లతో వెళ్లడానికి సిద్ధ్దమయ్యారు.
‘‘ఒక్కక్షణం ఆగండి..’’ అంటూ గిరిజనుడి వద్ద ఉన్న కత్తితో పిల్లలకున్న పిలకలను స్వయంగా తీసి వేశాడు. ఆయన కూడా పిలక తీయించుకున్నాడు.
‘‘వెళ్లండి. ఒరే. ఎక్కడైనా క్షేమంగా బతకండి..’’ అన్నాడు వాళ్లను చూడకుండా.. చెరువు వైపు చూస్తూ.
ఆయనిప్పుడు స్థిరంగానూ నిర్ణయాత్మకంగానూ కదులుతున్నాడు. ఆ అడవిలోనే కలయదిరుగుతూ మరో గిరిజన బృందంతో మరో ఇద్దరిని పంపించి వేశాడు.
అలా పిల్లలందరికి తలో దారి చూపించిన అగ్రహారీకుడు శరభయ్యశర్మ.. ఒక్కడిగా మిగిలాడు. వెదుకుతూ, వాసన పీలుస్తూ పోతూ.. ఓ మాదిగవాడలోకి వెళ్లి చచ్చిన గేదె కళేబరాన్ని ముక్కలుగా కోసి మంటపై కాలుస్తున్న మాదిగ బృందానికి సాష్టాంగ నమస్కారం చేశాడు. తనూ మాదిగనేనని.. తనకు ఇంత ముద్ద పెట్టమని.. వాళ్లకు బానిసగా ఉంటానని అభ్యర్ధించాడు.
అప్పటినుండి శరభ అనే మాదిగ వానికి తిండికి లోటు లేకుండా పోయింది.
కరవు గొప్పది.. దేవుడంత గొప్పది. వృత్తుల ఆభిజాత్యాన్ని, మనిషి తన చుట్టూ తానూ నిర్మించు కున్న కుహనా విలువలను నిర్దాక్షిణ్యంగా అణిచేస్తుంది. బతకడం నేర్పుతుంది. కరవు గొప్పది. ఇది నిర్వివాదాంశం!
* * *
సాతులూరు గ్రామం, మానుకోట రాజ్యం..
ఏడవ ఏడాది కరవు వచ్చి..
ఊరంతా యమకింకరుల పద ధ్వనులు.. ఏ ఇంటి నుండి ఎప్పుడు చావు ఏడుపు వినిపిస్తుందో తెలియదు. ఊరంతా నిర్మానుష్యం.. ఆవులు, ఎద్దులు, గేదెలు, దూడలు, కుక్కలు, కోళ్లు, మేకలు, పిల్లులు, బాతులు అన్ని జనం తినేశారు. చచ్చినవాళ్లు చావగా శవాలు కాబోతున్న జనాలు మాత్రమే ఊరిలో మిగిలారు.
ఆ రోజు గ్రామమంతా చాటింపు. ఏదో వినబడు తోంది.
‘‘గ్రామస్తులందరికీ విన్నపం.. గ్రామ సమయ కచేరివద్ద గంజిపోస్తున్నాం. అందరూ రావలసినది..’’
కాసేపు నిశ్శబ్దం.. ఆ జీవశవాలు ఒక్కరొక్కరుగా బయటకు వచ్చి అదిరే గుండెలతో కళ్లు పెద్దవి చేసి ఆ కచేరి వైపు చూస్తున్నారు. నిజమా, అబద్దమా.. కలా, నిజమా.. అన్నట్లు.
గుర్రాలు పూన్చిన బళ్లపై పెద్ద పెద్ద ఇత్తడి కాగులు కనిపించాయి గ్రామస్తులకు. ఆ వచ్చినవాళ్లు ఆ బరువైన ఇత్తడి కాగులను దించడం చూస్తూనే అవి నిజంగానే గంజితో బరువెక్కినవని అర్థమై ఇక పరుగులు, అరుపులు.. ఏడుపులు పెడబొబ్బలు. ఆ గుర్రాలబండి చుట్టూ కూడిపోయి ఏడుస్తున్నారు. శరీరాలపై బట్టలేదు. ఏదో నడుము వద్ద చిన్న గుడ్డ పీలిక.. జుత్తు జడలు కట్టి.. కళ్లు పుసులు కట్టి.. పెదాలు పగుళ్లిచ్చి.. శరీరం అంటే తోలు కప్పుకున్న ఎముకల గూళ్లు.. అవి ఊగిపొతున్నాయి. అందరూ కదులుతున్న శవాల్లా ఉన్నారు. నీళ్లు కారుతూ చంచలములై కదలాడుతున్న గాజుకళ్లతో.. పిడచకట్టుకుపోయిన నాలుక పాము నాలుకలా లోపలికి బయటకు కదలుతుంటే.. ముందు కొంచం గంజి పోస్తే ప్రాణాలు నిలుపుకుంటాం అన్నట్లు చేతులు చాచి దోసిలి పట్టి ఊరు ఊరంతా ఆ బండి వద్దకు వచ్చేశారు. వచ్చిన కొందరు వెనక్కు పరిగెత్తి ఇంటి నుంచి చెంబులు, కడవలు, సత్తు గిన్నెలు పట్టుకుని మళ్లీ అదే వేగంతో వచ్చిపడుతున్నారు. గంజి తెచ్చిన వారు వాళ్ల పరిస్థితి తెలుసునన్నట్లు తాపీగా వేగంగా గంజిపోయడానికి బల్లలపై గంజి బానలను పెట్టి గరిటేలతో సత్తు గిన్నెలతో గంజి పోస్తూ అందరికి అందించసాగారు. అందరూ ఆబగా తాగగా కొందరు పొలమారి కక్కుకున్నారు. కొందరూ తాగుతూ గుక్కలు పట్టి ఏడ్చారు.
ఇది అన్ని గ్రామాలలో అన్ని స్థలాలలో.. అన్ని నాడులలో, అన్ని మండలాలలో, అన్ని రాజ్యాలలో మొత్తంగా ప్రారంభమై క్రమక్రమంగా అన్ని గ్రామాలకూ విస్తరించాయి.
మరి కొన్నిరోజుల తర్వాత అన్నిగ్రామాలలో ఆయా గ్రామసమయాల ఆధ్వర్యంలో ఆ గ్రామంలోనే గంజి కాచేలా ఓ వారానికి సరిపడా బియ్యం, తదితర వస్తువులు అందజేస్తున్నారు.
కాస్త ఆకలి తీరాక, అన్ని గ్రామాలలో అన్ని రాజ్యాల్లో అందరికి కలిగిన సందేహం ఒక్కటే.
ప్రతి నిత్యమూ మూడు పూటలా గంజి వండి పోస్తున్నది ఎవరు అని.
మహామండలేశ్వరుడు శ్రీశ్రీశ్రీ గణపతిదేవ మహారాజులని.. ఆయన తరఫున అంకాలశెట్టి అని.. ఆయన తరఫున శ్రేణి సభ్యులైన వందలాది శెట్టిలు ఎక్కడికక్కడ గంజికేంద్రాలు ఏర్పాటు చేసి స్థానిక సమయశెట్టి ఆధ్వర్యం లో నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నా రని.. ఇప్పుడు ఏ గ్రామంలో కూడా ఆకలి చావులు లేవని.. గంజి పోస్తున్న వీరంతా సాక్షాత్తూ దేవుళ్లేనని అందరిపైనా పెద్దదేవుడు గణపతిదేవుడని గ్రామ గ్రామాన చెప్పుకుంటున్నారు.
అయితే ఈ కరవు వికటాట్టహాసం చేయకముందే మహారాజులను హెచ్చరించినవాడు ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఆయన డిండిమ!!
* * *
సాధారణంగా కరవు అనేది ప్రారంభమైన మొదటి ఏడాది ఎవ్వరూ గుర్తించలేరు. రెండో ఏడాది అనుమానం రైతులలో కలుగుతుంది కాని పాలనా వ్యవస్థ ఎప్పటిలాగే ‘నా పన్నులు నాకు కట్టు’ అనే తన ప్రధాన కార్యాన్ని కొనసాగిస్తుంది. వాణిజ్య వ్యవస్థ మరిన్ని లాభాలను పొందుతుంది. కారణం పంటలు తగ్గినప్పుడు సరుకు సరఫరా తగ్గుతుంది కాబట్టి అదే కావాలనే వారి కోరిక పెరుగుతుంది. అది ధరలు పెంచి కొనగలిగిన వారికే అమ్ముతారు. తద్వారా అధిక లాభాలను పొందుతూ రైతుల బాధను గుర్తించలేరు. సాధారణంగా వర్షం అనేది ప్రతి ఏడాది ఒకే విధంగా కురవదు. ఈ ఏడాది ఈ రాజ్యంలో ఎక్కువ కురిస్తే ఆ రాజ్యంలో తక్కువ కురుస్తుంది. నదుల పరిస్థితి కూడా అంతే. ఎగువ రాజ్యాలలో వర్షం ఎక్కువ కురిస్తే కృష్ణ, గోదావరి, తుంగభద్ర, పెన్నా తదితర ప్రధాన నదులు, వాటి ఉపనదులు నిండుకుంటాయి. రైతులు మురిసిపో తారు. మరో ఏడు ఎగువ రాజ్యాలలో తక్కువ కురిస్తే తమ ఖర్మ అని సరిపెట్టుకుంటారు.
మూడో ఏడు నుండి అన్ని ప్రాంతాలలో ఇదే పరిస్థితి అన్న సంగతి బయల్పడుతుంది. కాని మహారాజులకు అది చేరదు. కేవలం పన్నులు ఎగ్గొట్టటానికి రైతులు అబద్దాలు చెబుతున్నారు అని వారి పన్నువసూలు నియోగులు చెబుతారు. అలా పాలకులకు తెలిసే అవకాశం లేదు. లాభాలు చవి చూస్తున్నవణిజులు తెలిసినా పట్టించుకోరు.
కాని పట్టించుకున్నవాడు అంకాల శెట్టి. అతనికి తెలియజెప్పినవాడు డిండిమ.
ఒకనాడు అతని కోష్టాగారం చాలా హడావిడిగా ఉంది. అవతలగా ఉన్న కార్యాలయం చావిడిలో ఉన్నతాసనంపై కూర్చుండి మొత్తంగా కళ్లముందు కనిపిస్తోన్న దృశ్యం.. వస్తూపోతున్న వందలాది ఎడ్లబళ్లు, సరుకుల పెరికె సంచులు దింపుతున్న పనివాళ్లు, లెక్కలు రాసుకుంటున్న కరణీలు..
మొత్తంగా దుమ్మురేగుతూ చాలా గోల గోలగా ఉంది.
అందుండి ఆ దుమ్ము నుండి దగ్గరకు వచ్చేవరకు ఓ పరిచితుడిని గుర్తించలేదు అంకాల.
గుర్తించగానే ఉలిక్కిపడ్డాడు.
ఆ మనిషి డిండిమ!
‘‘వందనాలు శెట్టిగారికి..’’ అన్నాడు చూరు క్రిందగా నిలబడి.
(సశేషం)

మత్తి భానుమూరి