దేశరాజధానిలో ఒకానొక శనివారం సాయంత్రం. ఆ ప్రాంగణంలోని దీపాలు వెలుగులు విరజిమ్ముతున్నాయి. అదే సమయంలో అక్కడి వాయిద్యాల హోరు వాతావరణానికి తగ్గట్టుగా ఉంది. గుమిగూడిన వందలాది యువగళాలు ముక్తకంఠంతో ఆలపిస్తున్నాయి. వారి కరకమలాలు గీతానికి తగ్గట్టుగా ఏకమవుతూ అక్కడి కార్యక్రమానికి మరింత శోభను తీసుకొనివస్తున్నాయి. అలాగని అదేదో పబ్ లేదా క్లబ్ అనుకుంటే పొరపడినట్టే. ఎందుకంటే బార్ కౌంటర్ మచ్చుకైనా కనిపించడంలేదు. బల్ల మీద వరుసకట్టే షాట్‌లు(ఉగ్గు గిన్నెడుకు కొంచెం ఎక్కువ పరిమాణంలో కిక్కు ఎక్కించే ఖరీదైన మద్యాన్ని నింపుకొని ఉన్న చిన్న చిన్న గాజు గ్లాసులను షాట్‌లు అని అంటారు)లేనే లేవు. ఉరకలు వేసే యువరక్తంలో మరింత జోష్‌ను నింపే డిస్కోజాకీ-డీజే లేడు. చెవులకు చిల్లులు పడేలా డీజే పెట్టే డ్యాన్స్ పాటల చప్పుడు అసలే లేదు. బదులుగా సంగీత కచేరి స్థాయిలో ఏర్పాటు చేసిన సౌండ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ బీట్‌లు, దేదీప్యమానమైన వెలుగులు, మ్యూజిక్ ఫెస్టివల్స్‌కు పరిమితమయ్యే సమష్టి ఉత్సాహంతో కూడుకున్న ఆధ్యాత్మిక భజనలతో ఆ ప్రాంగణం పవిత్రతను సంతరించుకుంది. అక్కడున్న వారి చేతుల్లోని మొబైల్ ఫోన్లు వాటిల్లోని టార్చ్ వెలుగుýతో ఇలవేలుపునకు సామూహిక హారతి ఇస్తున్నట్టుగా దర్శనమిచ్చాయి. అదే సమయంలో ఆధ్యాత్మిక రసానుభూతిలో తేలియాడుతున్నట్టుగా యువతీయువకుల కన్నులు అరమోడ్పులయ్యాయి. నమస్కార భంగిమలో జోడించిన హస్తాలు నిలువు నమస్కారం పెడుతున్నట్టుగా గాల్లోకి లేచాయి. చూడ్డానికి అచ్చం ఒక రేవ్ పార్టీలాగా ఉన్నప్పటికీ సత్సంగం భావనను అది కలిగిస్తోంది.


దీనికే భజన్ క్లబ్బింగ్ అని నామకరణం చేశారు. భారతదేశమంతటా అత్యంత వేగవంతంగా విస్తరిస్తున్న సరికొత్త సాంస్కృతిక ధోరణికి ఇది అద్దం పడుతోంది. దేవాలయాలకు మాత్రమే పరిమితమైన భజన్ సంస్కృతి క్లబ్ తరహా సెట్టింగుల్లోకి రంగ ప్రవేశం చేసింది. తద్వారా విశ్వాసాన్ని మోడర్న్ నైట్ లైఫ్ ఎనర్జీ తోటి, జిలుగువెలుగు సౌందర్యాల తోటి మేళవించింది. ఇది ఇటీవల కాలం వరకు ఇన్‌స్టా గ్రామ్ చోదక జెన్ జెడ్ ఉద్యమంగా ఉండేది. ఎప్పుడైతే ప్రధాన నరేంద్ర మోదీ తన మాసాంతపు రేడియో కార్యక్రమం మన్‌కీ బాత్‌లో ఈ సామూహిక కార్యక్రమాలను “అంతర్జాతీయ సంగీత కచేరీలకు ఏ మాత్రం తీసిపోవు” అని అన్నారో ఒక్కసారిగా ఇవి యావత్ దేశం దృష్టిలో పడ్డాయి. ప్రధాని ప్రస్తావనతో వీటికి ఎక్కడలేని గుర్తింపు వచ్చింది. అదే సమయంలో అనాదికాలపు భజన సంస్కృతికి అనూహ్యమైన కుదుపు వచ్చింది. నిన్నామొన్నటి దాకా సంప్రదాయబద్ధంగా, దేవాలయ ప్రాంగణాలకు, మహా అయితే భక్తులతో కూడిన కొన్ని సమూహాలకు మాత్రమే పరిమితమై, ఎలాంటి హంగూ, ఆర్భాటమూ లేకుండా జరిగే భజన కార్యక్రమం నేడు కొత్త పోకడలు పోతోంది. సాంస్కృతిక వ్యాఖ్యాతలు, బ్రాండ్‌లను సంతరించుకొని సామాన్యుల నుంచి ప్రభుత్వ విధానరూపకర్తల వరకు అందరూ అబ్బుర పడి చూసేలా తయారైంది. అయితే ఈ భజన్ క్లబ్బింగ్ అనతికాలంలోనే కాలప్రవాహంలో కను మరుగైపోయేదేనా? అనే ప్రశ్నకు తావులేదనే చెప్పాలి. ఎందుకంటే అది ఆధ్యాత్మికత, సామూహికత వేడుకలకు యువ భారతీయులు చెబుతున్న సరికొత్త భాష్యానికి తనంతట తానుగా ఓ నిదర్శనమైంది.

మద్యం, హ్యాంగోవర్లు లేని క్లబ్

భజన్ క్లబ్బింగ్ భారతీయ పట్టణాలు, నగరాలకు చెందిన నైట్ లైఫ్ వాతావరణంలో అరుదైన ఎలాంటి మత్తులేని ఆధ్యాత్మిక గాఢతను అందిస్తోంది. శారీరక, మానసిక ఆరోగ్యం, సంయమనం, నిగ్రహం పట్ల నానాటికి అవగాహన పెంచుకుంటూ పోతున్న నేటి నవతరానికి మద్యం ఆధారిత సామూహిక కార్యక్రమాలకు పూర్తిగా విరుద్ధమైన, ఒక మంచి ప్రత్యామ్నాయంగా భజన్ క్లబ్బింగ్ ఆదరణ పొందుతున్నది. ఇదే విషయంపై ఈస్‌మైట్రిప్ సీఈఓ, కో`ఫౌండర్ రికాంత్ పిట్టీ మాట్లాడుతూ మద్యంతో కూడిన నైట్ లైఫ్ వల్ల కలిగే అనర్థాలు మన జెన్ జెడ్‌కు బాగా తెలుసు. అందుకునే ఎలాంటి అనర్థాలు లేకుండా అంతులేని ఉత్సాహాన్ని కలిగించే సామాజిక, సామూహిక అనుభవాలు పొందడానికి మొగ్గు చూపుతున్నారు అని తెలిపారు. ప్రధాన జనజీవన స్రవంతి నైట్ లైఫ్ సృష్టించే హెచ్చుస్థాయిలో సంగీతం, ఆకర్షణీయమైన వెలుతురు, కిటకిటలాడిపోయే వేదికలు లాంటి వాతావరణాన్ని భజన్ క్లబ్బింగ్, ఆధ్మాత్మిక సంగీత కచేరీల్లోనూ చూడవచ్చు. కాకపోతే భజన్ క్లబ్బింగ్, ఆధ్మాత్మిక సంగీత కచేరీల్లో పాల్గొనేవారు పూర్తి స్పృహలో ఉంటారు. ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదిస్తుంటారు అని చెప్పారు.

వీటిలో పాల్గొంటున్న వారిలో అత్యధికులు ఈ కార్యక్రమాలు తమను పలాయనవాదంలోకి నెట్టివేయడానికి బదులుగా భావోద్వేగపరంగా తమను ఉన్నతస్థాయికి చేరుస్తున్నాయని చెబుతున్నారు. సంగీతం ప్రధాన ఉత్ప్రేరకంగా పనిచేసే చోటులో భాగం కావడం అనవసర విషయాలకు తావు లేకుండా చేస్తుంది. ఇక్కడ మద్యం తీసుకోవాలనే సామాజిక ఒత్తిడి మచ్చుకైనా కనిపించదు. సమ్మిళితత్త్వం అనే భావనకు పెద్ద పీట వేస్తుంది అని పిట్టీ తెలిపారు. అలా ఎలాంటి ఒత్తిడి లేకుండా పాల్గొనేవారిలో అనేక మందికి ప్రశాంతత మేళవించిన వేడుక ఆకట్టుకుంటుంది. పదార్థాల (మద్యం, మాదక ద్రవ్యాలు వంటివి)ను తోసిరాజన్న ట్టుగా సమష్టి భాగస్వామ్యంతోనూ, సంగీతం నుంచి పుట్టుకొచ్చే లయతోనూ ఎక్కడ లేని శక్తి వారిని ఆవహిస్తుంది. నైట్ అవుట్ థ్రిల్‌ను త్యాగం చేసే పని లేదు, వ్యక్తి బాగోగులకు విలువ ఉంటుంది, సదుద్దేశంతో కూడుకున్న సామాజిక సమూహాలతో చేరడం ద్వారా పొందుతున్న ఈ తరహా అనుభవాల కోసం జెన్ జెడ్ అత్యధికంగా ప్రాధాన్యం ఇస్తున్నారు. అదే ప్రస్తుతం చోటు చేసుకున్న ఈ పరివర్తన ప్రతిబింబిస్తోంది అని చెప్పారు.

కొత్త విశ్వాసం కాదు

ఈ ఫార్మాట్ సమకాలీనంగా అనిపించినప్పటికీ, దీనిని పూర్తిగా కొత్తదిగా భావించవద్దని సాంస్కృతిక నిపుణులు సూచించారు. “సత్సంగం, కీర్తనల సమకాలీన పునః వ్యక్తీకరణగా దీనిని బాగా అర్థం చేసుకోవచ్చు” అని బ్రైట్ యాంగిల్స్ కన్సల్టింగ్ ఎలఎల్‌పీ బ్రాండ్ కన్సల్టెంట్, మేనేజింగ్ పార్టనర్ నిషా సంపత్ తెలిపారు. “చారిత్రాత్మకంగా, ఈ ఫార్మాట్‌లు ఎల్లప్పుడూ భాగస్వామ్య ఆధ్యాత్మిక శక్తి ద్వారా సమూహాలను సృష్టించాయి. యువతకు చోటు కల్పించాయి” అని ఆమె చెప్పారు. మారిందల్లా ఆధునిక సౌండ్ సిస్టమ్స్, లైటింగ్ డిజైన్, జోరు, భారీ పరిమాణంతో కూడుకున్న వేదిక. “విశ్వాసం నుండి వైదొలగకుండా, ఆధునిక సంగీతం, సామూ హిక తీవ్రతతో సంపద్రాయాన్ని రీమిక్స్ చేయడాన్ని మనం చూస్తున్నాము” అని తెలిపారు. భజన్ క్లబ్బింగ్ అనేది నేడు యువ భారతీయులు ఆధ్యాత్మికతతో మమేకమైన తీరును వ్యక్తీకరిస్తుందని చెప్పారు.

మహాశివరాత్రి వేడుకలు, ఇస్కాన్ సమూహాలు, పుణ్యక్షేత్రాలకు కూడా అంతే భారీ సంఖ్యలో యువతీయువకులు వస్తున్నారని తెలిపారు. “యువతీ యువకులు అనిశ్చిత సమయాల్లో ఒత్తిడికి గురవుతూ స్వీయ అస్తిత్వం కోసం అలమటించిపోతుంటారు. సరిగ్గా అలాంటప్పుడే ఆధ్యాత్మికత అనేది వారికి సర్వరోగ నివారిణిగా పనిచేస్తుంది” అని నిషా సంపత్ చెప్పారు.

ఆ కోణంలో, భజన్ క్లబ్బింగ్ అంటే కొత్త నమ్మక వ్యవస్థలను కనిపెట్టడం గురించి కాదు. పాత వాటికి సమకాలీన భాషలను కనుగొనడం గురించి.

ఆలయ ప్రాంగణాల నుండి మెట్రో నగరాల వరకు

భౌగోళికంగా, ఈ భజన్ క్లబ్బింగ్ ఉద్యమం మెట్రో నగరాలకూ, ఆధ్యాత్మిక కేంద్రాలకూ ఒకే విధంగా విస్తరిస్తోంది. దీనికి బెంగళూరు, ముంబై, ఢిల్లీ, పూణే వంటి నగరాలు హాట్‌స్పాట్‌లుగా మారాయి. పాప్-అప్ హాళ్లు, ఆడిటోరియంలు, కేఫ్‌లు, సాంస్కృతిక కేంద్రాలు ఉత్సాహభరితమైన ఆధ్యాత్మిక సమావేశాలను నిర్వహిస్తున్నాయి. ముంబై, ఢిల్లీలోని ఇస్కాన్ మందిరాలు కూడా సాయంత్రం భజనలకు మొగ్గు చూపుతున్నాయి. ఇవి గంభీరంగా కాకుండా ఉల్లాసంగా, ఉత్సాహభరితంగా ఉంటు న్నాయి.

అప్పుడప్పుడు, పుణ్యక్షేత్రాలు, వారసత్వ ప్రదేశాలు పండుగ తరహా భక్తి కార్యక్రమాలను నిర్వహిస్తుంటాయి. సుదూర ప్రాంతాల నుంచి ఇలాంటి వాటికి హాజరయ్యేవారు తీర్థయాత్ర చేసిన అద్భుతమైన అనుభవాన్ని మూటగట్టుకొని స్వస్థలాలకు తిరిగి వెళుతుంటారని నిర్వాహకులు తెలిపారు. ఇలా వచ్చేవారిలో యువతీయువకులు అత్యధికంగా ఉండటం గమనార్హం. వారణాసి, హరిద్వార్, అమృత్‌సర్ వంటి ప్రముఖ దేవాలయ నగరాలను యువత పెద్ద ఎత్తున సందర్శిస్తోంది. వారు చేపట్టే ఈ తీర్థయాత్రలు వారికి ఆధ్యాత్మిక శక్తితో కూడిన అనుభవాలను అందిస్తాయి అని చెప్పారు.

చాప కింద నీరులాగా చడీచప్పుడూ లేకుండా వస్తున్న ఈ మార్పు ఆధ్యాత్మిక పర్యాటకాన్ని పునర్నిర్మిస్తోంది. ముఖ్యంగా సాంప్రదాయ తీర్థయాత్ర సీజన్లకు మించి, హోమ్‌స్టేలు, స్థానిక రవాణా, గైడ్‌లు, ఆతిథ్య సేవలకు డిమాండ్ పెరుగుతోంది. ఒకప్పుడు సంప్రదాయం, భక్తి, దైవ దర్శనం గురించి మాత్రమే యువభారతీయులకు పట్టింపు ఉండేది. ఇప్పుడు వాటికి తోడు ఆధ్యాత్మిక సంగీతం, సామూహిక చేతనత్వం ద్వారా పొందిన అనుభవాలను శాశ్వతంగా పదిలపరుచుకునే ధోరణి పెరిగిపోయిం దని సాంస్కృతిక నిపుణులు తెలిపారు.

సనాతన భక్తితో సాంస్కృతిక అనుభూతి

సనాతన జర్నీ వ్యవస్థాపకుడు నికుంజ్ గుప్తా వంటి భజన్ క్లబ్బింగ్ నిర్వాహకులకు వారు చేస్తున్న పని పట్ల స్పష్టత ఉంది. అదేమిటంటే ఎంతో ఆసక్తితో వస్తున్న జెన్‌జెడ్‌లో ఆధ్యాత్మికతను పాదుగొల్పాలే తప్ప దానిని నీరుగార్చకూడదు అని. “ప్రజలను ఆధ్యాత్మికత వైపు మళ్లించడం లక్ష్యంగా మేము సనాతన జర్నీని ప్రారంభించాము. భారతదేశంలోనే అతిపెద్ద భజన్ క్లబ్బింగ్ ఈవెంట్‌ను ఢిల్లీలో నిర్వహించడానికి మేము ఉత్సాహంగా ఉన్నాము” అని చెప్పారు. ఇది సామూహికంగా పంచుకునే అనుభవాలతో సనాతన భక్తిని సాంస్కృతిక అనుభూతిగా మిగుల్చుకోవడం తప్ప మరొకటి కాదు అని తెలిపారు. భజన్ క్లబ్బింగ్ యువతకు మాత్రమే పరిమితమై ఉంటుందని తాము అనుకోవడం లేదని ఆయన చెప్పారు.“ఈ ధోరణి పట్ల యువత మాత్రమే కాకుండా, కుటుంబాలు, వృద్ధులు సహా అన్ని వర్గాల ప్రజల స్పందన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం” అని ఆయన చెప్పారు. “వారు ఇక్కడ నిజమైన భాగస్వామ్యాలలో యోగ్యతను చూస్తారు. విలువలతో నడిచే తరంతో నిజమైన విధేయతను, సంబంధాలను ఏర్పరచుకోవడానికి సహాయపడతారు” అని భజన్ క్లబ్బింగ్‌లో వయోవృద్ధుల భాగస్వామ్యాన్ని గురించి గుప్తా అభిప్రాయపడ్డారు.

అయినప్పటికీ, ఇతర కార్యక్రమాల తరహాలో భజన్ క్లబ్బింగ్‌కు యువతను ఆకర్షించడంలో ప్రచారంలో ఆర్భాటాలు, పైపై మెరుగులు, ఆడంబరాలు పనిచేయవని నిర్వాహకులకు బాగా తెలుసు. కార్యక్రమాన్ని నిర్వహించే వేదిక, అందుకు అనువైన వాతావరణం మాత్రమే నవతరాన్ని రప్పిస్తుందని సంగతి వారికి అవగతమే. ఎందుకంటే సంగీతానికి ఎల్లలు లేవు అన్న మాట నిజమే కానీ భక్తి, ఆధ్యాత్మికత, సనాతనధర్మం అనేవి ప్రతీ భారతీయుడిలోనూ తరతరాలుగా పాదుకుపోయిన వెలకట్టలేని నిధులు. ఆ భావన నిగూఢమైనది. అంతర్గతంగా గూడుకట్టుకున్నది. అచంచలమైనది. సొంతంగా అనుభవిస్తే తప్ప అర్థం కానిది. పరాయి వారికి అంతుపట్టనిది. పాశ్చాత్య సంగీత కచేరిల తరహాలో ఇష్టానుసారం భజన్ క్లబ్బింగ్ నిర్వహించా లనుకుంటే ఆ ప్రయత్నం వికటిస్తుంది. మొదటికే మోసం వస్తుంది. అందుకనే భజన్ క్లబ్బింగ్ నిర్వాహకులు అత్యంత అప్రమత్తంగా ఉంటారని నికుంజ్ గుప్తా తెలిపారు.

బెల్లం చుట్టూ ఈగల్లా బ్రాండ్లు

భజన్ క్లబ్బులు పెరుగుతున్న కొద్దీ బ్రాండ్లు, ముఖ్యంగా జీవనశైలి, ఆరోగ్యం, ఆధ్యాత్మికత రంగాలకు చెందిన బ్రాండ్ల దృష్టిని ఆకర్షించడం ప్రారంభించాయి. కానీ ఇది అనుకున్నదే తడవుగా, ఆరుగాలం శ్రమిస్తే లాభాల పంట పండించే సగటు వ్యాపార ఫలసాయం కాదు. “భారతదేశం అత్యంత ధర్మబద్ధమైనది. అయినప్పటికీ ధార్మికత, ఆధ్యాత్మిక తతో ముడిపడి ఉన్న మార్కెటింగ్ కత్తి మీద సాము చేయడంతో సమానంగా ఉంటుంది” అని బ్రైట్ యాంగిల్స్ కన్సల్టింగ్ ఎలఎల్‌పీ బ్రాండ్ కన్సల్టెంట్, మేనేజింగ్ పార్టనర్ నిషా సంపత్ అభిప్రాయపడ్డారు.

 “ఆధ్యాత్మిక వ్యక్తీకరణను నేరుగా డబ్బు ఆర్జించడానికి లేదా తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించే బ్రాండ్లు అవకాశ వాదంగా కనిపించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా యువత ఈ వైఖరిని సమీపకాలంలోనే నిలదీసే ప్రమాదం ఉంది” అని ఆమె హెచ్చరించారు.

నమ్మకాలు, విశ్వాసాలకు ఎలాంటి విఘాతం కలిగించనంత కాలం భజన్ క్లబ్బింగ్‌లో అవకాశా లకు కొదవలేదని అన్నారు. “మెరుగైన ప్రదేశాలు, సురక్షితమైన అర్థరాత్రి రవాణా, దుస్తులు, ఆహారం, మద్యం లేని పానీయాలు ఇలా ఇన్ని విధాలుగా ఉపాధి, వ్యాపార అవకాశాలను అందుకోవచ్చు” అని అభిప్రాయపడ్డారు.

 దీనిని ఒక సాంస్కృతిక పునఃస్థాపనగా మైసూర్ డీప్ పెర్ఫ్యూమరీ హౌస్ అండ్ జెడ్ బ్లాక్ డైరెక్టర్ అంకిత్ అగర్వాల్ వర్ణించారు. “యువ భారతీయులు మితిమీరిన వాటి కంటే బుద్ధిపూర్వకమైన, విలువ-ఆధారిత అనుభవాలను కోరుకుంటున్న వైనాన్ని ఈ మార్పు ప్రతిబింబిస్తుంది” అని ఆయన చెప్పారు. “ఆధ్యాత్మికత ఇకపై ఏకాంతమైనది లేదా గంభీరమైనది కాదు. అది సామాజికమైనది. భక్తిభావనను వ్యక్తీకరించాలనే ఆకాంక్షతో కూడుకున్నది” అని అన్నారు. భజన్ క్లబ్బింగ్ అనేది ఆధ్యాత్మికతతో కూడిన జీవనశైలి పెరుగుదలను సూచిస్తుందని అగర్వాల్ అభిప్రాయపడ్డారు.

ప్రజా సంబంధాల్లో దశబ్దాల అనుభవం ఉన్న సంస్థలు సైతం భజన్ క్లబ్బింగ్ రంగంలోకి ఎంతో సంయమనం పాటిస్తూ ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఇదే విషయమై అవియన్ వీ సంస్థకు చెందిన పీఆర్(నార్త్) అకౌంట్ డైరెక్టర్ తనూ గుప్తా మాట్లాడుతూ లక్ష కోట్ల రూపాయల ఖర్చు పెట్టగలిగే శక్తి ఉన్న జెన్ జెడ్‌ను సొమ్ము చేసుకోవడానికి అనేక సంస్థలు పోటీ పడుతున్నాయి. కొత్తగా వచ్చిన భజన్ క్లబ్బింగ్ బంగారు గుడ్లు పెట్టే బాతు అని జీవనశైలి, వెల్ నెస్ రంగాల్లోని అనుభవజ్ఞులైన వారికి తెలుసు. అందుకే ఆరాటపడిపోయి బంగారు బాతును కోసేసి తర్వాత బాధపడకుండా అది పెట్టే గుడ్ల కోసం ఎంతో ఓపిగ్గా వేచి ఉన్నారు అని తెలిపారు.

క్షేత్ర స్థాయి కార్యకలాపాలతోనూ, ఒకరు కంటే ఎక్కువ మంది సృజనాత్మక వ్యక్తులు రచించిన, స్వరపరిచిన భజనలతోనూ రానున్న భజన్ క్లబ్బింగ్ ఈవెంట్‌లలో భాగస్వామి కావడానికి అవియన్ వీ సంస్థ సర్వం సిద్ధం చేసుకుంటోంది.

“ఇక్కడ పాల్గొనేవారి భావోద్వేగం పట్ల విధేయతను (నిర్వాహకులు) కలిగి ఉండాలి. వారిలో వెల్లువెత్తుతున్న ఉత్సాహానికి విలువ ఇవ్వాలి. ముఖ్యంగా ఆధ్యాత్మికతలో పవిత్రతకు ప్రాధాన్యతను ఇవ్వాలి. అంతే తప్ప భజన్ క్లబ్బింగ్‌ను నిర్వహించడ మనేది పుణ్య క్షేత్రాల ఫొటోల మీద కంపెనీ బ్రాండ్ లోగోలను ముద్రించడం అంత సులభం కాదనే విషయాన్ని ఎప్పటికప్పుడు గమనంలోకి తీసుకుంటూ ఉండాలి” అని గుప్తా స్పష్టం చేశారు.

ప్రస్తుతానికి, చాలావరకు ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు భజన్ క్లబ్బింగ్ ను అంచనా వేసే పనిలో ఉన్నాయి. ఈ అంచనాల్లో అనేక ప్రశ్నలకు సమాధానాలు వెదుక్కుంటున్నాయి. వీటిలో లాభాలు ఏ మాత్రం వస్తాయి అనే ప్రశ్నల కంటే సంస్కృతి, భావోద్వేగాలకు సంబంధించిన ప్రశ్నýకు సమాధా నాలు రాబట్టడమే కీలకంగా మారింది. భజన్ క్లబ్బింగ్‌లో ఎవరు పాల్గొంటున్నారు? ఏ రకమైన భావోద్వేగాలను కోరుకుంటున్నారు? ఈ ఈవెంట్లకు యువత పదేపదే హాజరుకావడంలో ఏది ప్రేరేపిస్తుంది? అనే ప్రశ్నలు ప్రస్తుతానికి ప్రధానంగా ఉన్నాయి.

మోదీ మాటే ఇంధనం

భజన్ క్లబ్బింగ్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమోదించడం ఈ ధోరణి పట్ల ప్రజల్లో అవ గాహనను నిస్సందేహంగా పెంచింది. అదే సమయంలో భజన్ క్లబ్బింగ్ వృద్ధి చెందుతున్న కొద్దీ దాని మూలసూత్రాన్ని నిలుపుకోగలదా? దాని పట్ల నానాటికి పెరుగుతున్న ప్రజాదరణ ఆధ్యాత్మికతను పలచన చేస్తుందా? ఆధ్యాత్మిక వ్యక్తీకరణకు సంబంధించిన ప్రత్యామ్నాయ రూపాలను సాధారణీక రించడంలో సహాయపడుతుందా? అనే ప్రశ్నలు విని పిస్తున్నాయి.

అయితే జెన్ జెడ్‌కు సంబంధించినంత వరకు ఈ ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు రాజకీయాలు లేదా బ్రాండింగ్‌లో కన్నా కూడా భజన్ క్లబ్బింగ్ నిర్వహించే చోటు, అక్కడ వారు పొందు తున్న అనుభూతిలోనే దొరుకుతున్నాయి.

ఆందోళన, పరిష్కారాల కోసం ఒత్తిడి, పనితీరుపై రేటింగ్ ద్వారా నడుస్తున్న ప్రపంచంలో, ఎలాంటి కల్లాకపటం లేని, మతిని చిత్తుచేసే మత్తు లేని మనస్ఫూర్తితో కూడుకున్న ఆధ్యాత్మిక వేడుకగా నవతరానికి భజన్ క్లబ్బింగ్ చేరువ అవుతోంది. ఇక్కడ హంగూ ఆర్బాటం అనేది మచ్చుకైనా కనిపించదు. కనిపించేదల్లా అచంచలమైన భారతీయ విశ్వాసం పట్ల నిజాయతీతో కూడుకున్న నివేదన.

భజనలో చివరి పాదం ముగిసిపోయి, లైట్లు మెల్లగా ఆరిపోతున్నప్పుడు, అప్పటిదాకా అక్కడ అలౌకికమైన ఆనందంలో మునిగితేలుతున్న వారు సామూహిక ప్రశాంతతను మూటగట్టుకొని ఇంటి ముఖం పడతారు. ఆ క్షణంలో, భజన క్లబ్బులు ఒక ట్రెండ్‌గా నిలిచి, భారతీయుల్లో నిగూఢమైన ఆధ్యాత్మిక చింతనను వెలికి తీయడం ప్రారంభిస్తాయి. నవతరం సంప్రదాయం, పరివర్తన మధ్య తన సొంత లయను కనుగొంటుంది.

బహుశా అదే నిజమైన ముగింపు కావచ్చు. భక్తి ఒక్కసారిగా పెరిగిపోయిందని చెప్పడం కాదు కానీ ఆధునిక భారతీయ ఆధ్యాత్మికత చివరకు జెన్ జెడ్ జతులకు కాలు ఎలా కదపాలో నేర్చుకుంటోంది.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE