ఆలయ వ్యవస్థ, వంశపారంపర్య అర్చకత్వ పరిరక్షణకు ఉద్యమించిన ఆధ్యాత్మిక అక్షరయోధుడు డాక్టర్ ఎం.వి.సౌందరరాజన్. హిందూ దేవాలయాల నిర్వహణలో విశ్లేషణాత్మక దృష్టి, అంకితభావం, అనుభవం గల ఆయన ‘చట్టం కోరల్లో దేవాలయాలు’ అంటూ ఆలయాల పరిరక్షణకు సంబంధించిన అంశాలను గ్రంథస్థం చేశారు. ఆలయ వ్యవస్థలో ప్రభుత్వ జోక్యం కూడదంటూ దేవదాయ చట్టం సవరణకు నిరసనగా ఆందోళనకు దిగారు. ప్రధానంగా, వంశపారంపర్య అర్చక వ్యవస్థ రద్దు చట్టంతో నిరాశా, నిస్పృహలతో ఆత్మార్పణం చేసుకొన్న అర్చకుడి ఉదంతం ఆయన పోరుకు మరింత పదును పెట్టింది. ఆలయ వ్యవస్థకు సంబంధించిన వివిధ చట్టాలను, విశ్లేషిస్తూ లెక్కకు మిక్కిలి రచనలను చేశారు.
ఆలయ వ్యవస్థలో ప్రభుత్వ, ఇతరుల పెత్తనం ఏమిటి?అంటూ ఆలయాలపై ప్రభుత్వ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ ఉద్యమించారు సౌందరరాజన్. ఆ పోరును చిలుకూరు ఆలయం నుంచే ప్రారంభించారు. ఆ ఆలయం దేవదాయ శాఖలో విలీనం కాకుండా అడ్డుకొని స్వయం ప్రతిపత్తితో కొనసాగిస్తూ వచ్చారు.
సుమారు నాలుగున్నర దశాబ్దాల క్రితం (1987) ఉమ్మడి రాష్ట్రంలో ఎన్.టి.రామారావు ప్రభుత్వం, వంశపారంపర్య అర్చకత్వాన్ని రద్దు చేయడాన్ని తీవ్రంగా తప్పు పడుతూ, ఆ హక్కుకోసం న్యాయ పోరాటం చేశారు. ‘వంశపారంపర్య అర్చకత్వం దైవం నిర్దేశించిన కర్తవ్యం. వైద్య నిపుణులు, న్యాయ వాదులు, రాజకీయనేతలు, సినిమా నటులు… వీరెవ్వరికీ వంశపారంపర్య నిషేధం లేనప్పుడు ఒక బీద అర్చకుడు తన తండ్రి తరువాత సమాజానికి సేవ చేయాలనుకోవడం తప్పా? ఆ హక్కు చట్టాన్ని సవరించాలని, అమలు చేయాలని సూచించే శాసన సభా నేతలు ఎందరో తమ సంతానాన్ని వారసులుగా తయారు చేశారు, చేస్తున్నారు. వారికి వారసత్వం, వంశపారంపర్యంపై నిషేధం లేనప్పుడు అర్చకుడికి ఎందుకు?’ (‘వంశపారంపర్య అర్చకత్వం….’) అనే ప్రశ్నలతో నిలదీశారు. వంశపారంపర్య అర్చకుడికి పదవీ విరమణ లేదు. భగవంతుడి సేవే ప్రధానమని వాదించేవారు.(రెండేళ్ల క్రితంవరకు 87 ఏళ్ల వయసులో ఉత్సవాల వేళ చక్రాల కుర్చీపై కూర్చుని తిలకించేవారని ఆయన కుమారుడు, చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ ‘జాగృతి’ ఒక ముఖాముఖిలో చెప్పారు.)
కొన్ని చోట్ల దేవాలయ వ్యవస్థలో లోపాలు ఉండవచ్చని, అంతమాత్రాన శతాబ్దాల చరిత్ర గల ఆలయాల వారసత్వ విధానాన్ని తప్పు పట్టడం సరికాదని డాక్టర్ సౌందరరాజన్ వాదించారు. ఈ అంశంపై ఏర్పాటైన చల్లా కొండయ్య కమిషన్ తనను ‘ముంచింది’ అని సాక్షాత్తు నాటి ముఖ్యమంత్రే అంగీకరించారు. చల్లా కమిషన్ నియామకం, అమలులో పారదర్శకత లేదు.ఉదాహరణకు, తిరుమలలో మిరాసీ వ్యవస్థ రద్దుకు నిర్ణయం తీసుకొన్న తరువాత కమిషన్ ఏర్పాటైంది. అంటే… సదరు కమిషన్ సిపార్సు చేయకముందే ప్రణాళిక (ఎజెండా)సిద్ధమైందన్నమాట. కమిషన్ అధిపతి కొండయ్య ఆలయాలను సందర్శించలేదు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఒక్క ఆలయాన్నీ సందర్శించలేదు. కేవలం కొందరు వ్యక్తులు, వ్యక్తిగత సంస్థల అభిప్రాయాలు సేకరించి చట్టానికి రూప కల్పన చేసింది.పైగా అమలుపరచడానికి వీలు లేనుటువంటి అనాలోచిత సూచనలు చేసింది ఫలితంగా దేవాలయ వ్యవస్థ భ్రష్టుపట్టిపోయింది’ అని ఆవేదన చెందారు.
నిరంకుశ ప్రభువులు,అత్యంత నిరంకుశ దండయాత్రికులు కూడా సాధించలేని ఆలయ వ్యవస్థ వినాశనాన్ని ఒకే ఒక చట్టం అతి తక్కువ కాలంతో విజయవంతంగా సాధించగలగడం ఎంతో అమానుష మని వ్యాఖ్యానించారు. హిందూమతాన్ని, ధర్మాన్నీ సర్వనాశనం చేయడంలో మెకాలే వంటి తెల్లవారు సాధించలేని దానిని స్వతంత్ర దేశంలో స్వయం పాలకులు చేశారని, ఈ పరిస్థితుల్లో హిందూ ధర్మాన్ని, ఆలయ వ్యవస్థను కాపాడుకొంటూ, దానిని మనమే నడపాలన్న భావన ప్రజల్లో..భక్తుల్లో బలపడాలని పిలుపునిచ్చేవారు.
ఆలయాలకు ప్రభుత్వం ఏమి చేయకపోయినా వివిధ రూపాలుగా సుమారు 24 శాతం పన్ను విధిస్తోందని సౌందరరాజన్ ఆనేవారు. ‘హిందూ దేవాలయాల మీదే పన్ను ఏమిటి? లౌకిక రాజ్యంలో అందరూ సమానమనుకుంటే, ఇతర మతాల ప్రార్థనామందిరాలకూ వేయండి’ అన్నారు.
తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా మధురాం తకం గ్రామానికి చెందిన వెంకటాచారి, కోమలమ్మ కుటుంబం చిలుకూరు చేరి అక్కడి బాలాజీ సేవకు అంకితమైంది. వారి కుమారుడు సౌందరరాజన్ బాల్యం చెన్నైలో గడిచింది. హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ పూర్తి చేసి, అక్కడే అధ్యాపకుడిగా, ఆచార్యులుగా, రిజిస్ట్రార్‌గా సేవలు అందించారు. పదవీ విరమణ అనంతరం దేవ స్థానంలో ప్రధాన అర్చకత్వం చేపట్టారు. అప్పటి వరకు అంతగా గుర్తింపులేని సుమారు అయిదు శతాబ్దాల చరిత్ర గల ఆలయాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఆలయానికి స్వయం ప్రతిపత్తి హోదా కోసం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాన్ని (2008)లో ఒప్పించారు. అప్పట్లో ఏర్పాటైన ఆలయ మేనేజింగ్ కమిటీకి కడదాక చైర్మన్‌గా వ్యవహరించారు.. తెలంగాణ అర్చక సమాఖ్య అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య ఉపాధ్యక్షుడిగా, ఆలయ రక్షణ ఉద్యమ కన్వీనర్‌గా సేవలు అందించాs
భగవత్ సన్నిధిలో అంతా సమానమేనని, అందరు ఒకే వరుసలో వెళ్లి స్వామిని దర్శించుకో వాలనే నిబంధన విధించారు. ఆలయంలో హుండీని తొలగించారు. ‘హుండీ మన సంప్రదాయంకాదు. ఆగమ శాస్త్రప్రకారం హుండీ అనేది లేదు. ఆలయా నికి మాన్యాలే ప్రధానం. భూఆస్తి ఆదాయంతోనే ఆలయాలు నడవాలి’ అనేవారు. ఆలయాలు ఆగమశాస్త్రం ప్రకారం నడవాలే తప్ప చట్టం ప్రకారం కాదు. శతాబ్దాల తరబడి ఆగమ శాస్త్రానుసారం నడిచిన ఆలయాలు ప్రస్తుతం చట్టం ప్రకారం నడవవలసి వస్తోంది’ అనే వారు. ఆలయాల పరిరక్షణ అనేది కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదని, సమాజం కూడా చొరవ చూపవలసి ఉందని పిలుపునిచ్చేవారు.

డా॥ ఆరవల్లి జగన్నాథస్వామి,
సీనియర్ జర్నలిస్ట్