భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది


వి. శారద

పావనికి విసుగ్గా ఉంది. తెల్లారి లేచింది మొదలు చాకిరీ తప్ప, ఇంట్లో ఎవరూ మాట్లాడరు. వాళ్ల సంభాషణ ఫోన్లోనే గడుస్తోంది. మానసికంగా ఎవరు ఒకరికి ఒకరు దగ్గరగా లేరు. ఒక్క ఫోన్లకి తప్ప అనుకుంది పావని. పావనికి ఇద్దరు పిల్లలు. పాప రమ్య ఇంటర్‌ ‌చదువుతోంది. కొడుకు వంశీ 8వ తరగతి చదువుతున్నాడు. భర్త రఘు సాఫ్ట్వేర్‌ ఇం‌జనీర్‌.
అతను సాఫ్ట్వేర్‌ ‌కాబట్టి ఎటూ పగలు రాత్రి లాప్టాప్‌తో కుస్తీ పట్టడం తప్పదు.
పావని ఈమధ్య గమనిస్తోంది. పిల్లలకి చదువు మీద ధ్యాస తగ్గింది. ఎప్పుడు చూసినా ఫోన్లలో గేమ్స్ ఆడడం, చాటింగ్‌లు ఎక్కువయ్యాయి. ‘‘చదువుకునే పిల్లలకి ఫోన్‌ అవసరమా? అంటే ఈ రోజుల్లో ఫోన్లు లేకపోతే ఎలా? పిల్లల యోగక్షేమాలు తెలియద్దూ’’ అంటూ ఇద్దరికీ మొబైల్స్ ‌కొన్నాడు రఘు.
‘‘పిచ్చాడి చేతిలో రాయిలాగ’’ ఏ వస్తువుని ఎంతవరకు ఉపయోగించుకోవాలో పిల్లలకి తెలియకుండా పోయింది.
ఒకరోజు పావని బజార్‌కి వెళ్తే అక్కడ. ‘‘పావనీ! నువ్వేనా! ఎవరో అనుకున్నాను’’. అంటూ పలకరించింది చిన్ననాటి స్నేహితురాలు ఉమ.
‘‘ఓ! ఉమా! నువ్వా! ఎన్ని సంవత్సరాలు అయింది నిన్ను చూసి. ఎలా ఉన్నావ్‌? ఎప్పుడొచ్చావ్‌ ‌సిటీకి’’ అంటూ ఆతృతగా అడిగింది పావని.
‘‘అన్ని ప్రశ్నలు ఒక్కసారేనా! నువ్వు ఏం మారలేదు. నీ చిన్నతనంలో గలగలా మాట్లాడే దానివి. అప్పుడు నిన్ను అనేవాళ్లం.‘‘మీ ఆయనకి అన్నం పెట్టకుండా కబుర్లతో కడుపు నింపేస్తావని గుర్తుందా’’అంది ఉమ.
‘‘ఇప్పుడు మాట్లాడడానికి మాటలే కరువయ్యాయి వినేవాళ్లు లేక’’ అనుకుంది మనసులో పావని బాధగా.
‘‘ఏమిటే ఆలోచిస్తున్నావ్‌ ? ‌కొంపముంచి నేను అన్నదే చేస్తున్నావా?’’అంది ఆట పట్టిస్తూ.
‘‘అబ్బే! అదేం లేదే! ఈ ఎలక్ట్రానిక్‌ ‌యుగంలో మాటలేం ఉంటాయి? అన్ని మీటలే కాని’’ అంది నిర్లిప్తంగా.
‘‘సరే! ముందు మా ఇంటికి రా! అక్కడ తీరిగ్గా మాట్లాడుకుందాం. మా ఇల్లు ఇక్కడికి దగ్గరే’’. అంటూ ఆటోను పిలిచి అడ్రస్‌ ‌చెప్పింది ఉమ.
ఉమ. పావని చిన్నప్పటి నుంచి కలిసి చదువు కున్నారు. డిగ్రీ అయిన తర్వాత ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. ఉమభర్త సంజీవ్‌ ‌కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. ఉమకి ఇద్దరు పిల్లలు.పాప ఎనిమిదవ క్లాసు. బాబు ఆరో క్లాసు చదువుతున్నారు.
ఉమ, పావని ఎప్పుడో, ఏదో ఫంక్షన్‌లో కలుసుకున్నారు. మళ్లీ ఇప్పుడే కలుసుకోవడం.
ఉమ గలగల మాట్లాడుతుంటే పావని మౌనంగా వింటోంది. అది గమనిం చిన ఉమ ‘‘పావని! ఏవిటే ఆ పరధ్యానం? ఇదివరకు మమ్మల్ని మాట్లాడనిచ్చే దానివా? ఏమైంది? ఎందుకు ఇలా అయిపోయావు? ఏవైనా సమస్యలు ఉన్నాయా?’’ అంది ఆత్రుతగా.
‘‘అబ్బే!అదేం లేదే! నువ్వు చెబుతుంటే వింటున్నాను’’అంది నవ్వు తెచ్చిపెట్టుకుంటూ.
ఇద్దరు ఉమ ఇంటికి వచ్చేటప్పటికి అప్పటికే ఉమ భర్త సంజీవ్‌ ‌వచ్చి, పావనిని పలకరించి, ఉమ చేతిలోంచి సరుకుల సంచి తీసుకుని లోపల పెట్టాడు. ఇద్దరికి గ్లాసులతో మంచినీళ్లు తీసుకువచ్చాడు.
ఉమ టీ పెట్టడానికి లేవపోతే ‘‘వద్దు మీ ఇద్దరు కబుర్లు చెప్పుకోండి. చాలా సంవత్సరాలయింది కదా కలుసుకుని, నేను టీ పెడతాను’’ అంటూ ప్లేట్లలో యాపిల్‌ ‌ముక్కలు కోసి తీసుకువచ్చి, టీ పెట్టడానికి లోపలికి వెళ్లాడు. ఇంతలో స్కూలు నుంచి పిల్లలు ఇద్దరు వచ్చి, కాళ్లు కడుక్కుని, అప్పుడు పావని దగ్గరికి వచ్చి, ‘‘నమస్తే ఆంటీ!’’ అన్నారు.
వాళ్ల సంస్కారానికి ఆశ్చర్యపోయింది. ఉమ వంటింట్లోకి వెళ్లింది.
పిల్లలిద్దరూ తల్లి వెనకాలే వెళ్లి, ఆ రోజు స్కూల్లో జరిగిన విషయాలు అన్నీ గబగబా చెప్తున్నారు.
‘‘పిల్లలు ఆగండి! మమ్మీని ఆంటీ తో మాట్లాడ నివ్వండి’’ అంటూ సంజయ్‌ ‌వారించాడు.
‘‘పర్వాలేదండి, వాళ్ల మాటలు వింటున్నాను, బాగున్నాయి’’ అంది మనస్ఫూర్తిగా పావని.
పావని ఆలోచిస్తోంది. తను ఇంటి పరిస్థితులు, ఇక్కడి పరిస్థితులకి భిన్నంగా ఉన్నాయి. ఆ కుటుంబాన్ని చూసేటప్పటికీ సంతోషంతో కడుపు నిండిపోయింది. తను కోరుకున్నది ఇది. తన కుటుంబంలో కూడా మార్పు రావాలి. తనకి డబ్బుకి లోటు లేదు. కానీ మనశ్శాంతికి క•వు వచ్చింది… అనుకుంటూ ఉమకి బైచెప్పి ఇంటికి వచ్చింది.
రాత్రి రఘు ఇంటికి వచ్చిన తర్వాత భర్తతో చెప్పింది ఉమ కుటుంబం గురించి. రఘు విసుగ్గా చూసాడు.
‘‘ఎవరి కుటుంబం వారిది. వాళ్లతో మనకి పోలిక ఏమిటి?’’ అంటూ లైట్‌ ఆపి పడుకున్నాడు.
కాలం గడుస్తోంది. పిల్లల తీరులో మార్పు లేదు. వాళ్లు చిన్నప్పటి నుంచి నేర్చుకున్న కళలని పక్కనపెట్టి ఫోన్లకి అతుక్కుపోతున్నారు. పావని అది భరించలేకపోతోంది. తను ఒక్కత్తి ఎంత చెప్పినా పిల్లలు వినేటట్లు లేరు.
ఒకరోజు రఘు ఆఫీసు నుంచి వస్తుంటే వెనకనుంచి ఆటో గుద్ది, అంత ఎత్తున ఎగిరి కింద పడ్డాడు. దాంతో తుంటి దగ్గర ఎముక విరిగింది.
తుంటిదగ్గర రాడ్‌ ‌వేసి ఆపరేషన్‌ ‌చేశారు. పది రోజులు హాస్పటల్లో ఉన్న తర్వాత ఇంటికి వచ్చాడు. ఆ పది రోజులు పావని తల్లడిల్లిపోయింది. జాగ్రత్తగా భర్తని ఇంటికి తీసుకువచ్చింది. వచ్చిపోయే చుట్టాలతో పావనికి పని ఎక్కువైంది. రఘుకి ఒళ్లు తుడవడం, కాలకృత్యాలు తీర్పించడం అన్నీ తనే చేస్తోంది. ఇంటి పని, రఘు పనితో అసలు విశ్రాంతి లేకుండా పోయింది.
ఒకరోజు పావని ‘‘రమ్యా! రైస్‌ ‌కుక్కర్‌లో బియ్యం పెట్టు’’ అంది. చెవుల్లో ఇయర్‌ ‌ఫోన్స్ ‌పెట్టుకున్న రమ్య ఆ మాటలు వినిపించుకోలేదు.
మధ్యాహ్నం రఘుకి అన్నం పెడదామని కుక్కర్‌ ‌తీసిన పావని ఉలిక్కిపడింది. ‘‘రమ్య! కుక్కర్‌ ‌పెట్టమన్నాను కదా! ఎందుకు పెట్టలేదు? మధ్యాహ్నం అయిపోయింది. ఇప్పుడు డాడీకి భోజనం ఎలాగ? ఏం చేస్తున్నావ్‌? ‌నా మాట నీకు వినిపించలేదా?’’ అంది ఖాళీ కుక్కర్‌ ‌చూసి.
‘‘ఏంటి అమ్మా! నేను వినలేదు. నువ్వు ఏం చేయమన్నావ్‌? అయినా నాకు చెప్పే బదులు నువ్వే చేసుకోవచ్చు కదా!’’ అంది గదిలోంచి బయటకు రాకుండానే. పావని వెంటనే కుక్కర్లో బియ్యం పెట్టి, రఘు కి ఆకలి వేస్తుంటే బ్రెడ్‌ ‌కాల్చి పెట్టింది.
భోజనాలు అయిన తర్వాత పావని వంటిల్లు సర్దుతుంటే రఘు పిలిచాడు.
‘‘ఎందుకు పిలిచారు?’’.
‘‘ఎందుకంటే మన రమ్య ప్రవర్తన ఏమి బావులేదు. మధ్యాహ్నం భోజనం సంగతి చూశాను. నువ్వు ఒక్కదానివి ఎంతకని కష్టపడతావు? ఇంటర్‌ ‌చదివే పిల్ల. ఆ మాత్రం తల్లికి సహాయం చేయకపోతే ఎలా? పిల్లాడిని చూస్తే వాడు అలాగే తయారయ్యాడు.
మొన్నటికి మొన్న నువ్వు మార్కెట్‌కి వెళ్లినప్పుడు మా ఫ్రెండ్‌ ‌వస్తే, వాడిని పట్టించుకోకుండా, ఫోన్లో గేమ్స్ ఆడుతూ కూర్చున్నాడు. నేను చెప్తేనే కానీ, వాడికి మంచి నీళ్లు కూడా ఇవ్వలేదు. నాకు తల కొట్టేసినంత పని అయింది. పిల్లలు ఇద్దరు ఇలా తయారవుతే ముందు ముందు ఎలాగా? నాకు చాలా ఆందోళనగా ఉంది’’అన్నాడు బాధగా.
‘‘ఇప్పుడు మీకు తెలిసిందా? దీనికి అంతటికీ కారణం మీరే. వాళ్లకి చిన్నప్పటినుంచి మొబైల్స్ ‌వద్దంటే ఇచ్చారు. సేఫ్టీ, స్టేటస్‌ అం‌టూ. ఇప్పుడు అనుకుని ఏం లాభం? మా ఫ్రెండ్‌ ‌పిల్లల గురించి చెబితే, ఆరోజు విసుక్కున్నారు. ఇన్ని రోజుల నుంచి నేను ఎంత బాధ పడుతున్నానో మీకు తెలుసా? ఏదైనా అంటే సమాజం ముందుకు వెళుతుంటే మనం కూడా ముందుకు వెళ్లాలి అంటారు. మనం ముందుకు వెళుతున్నాం కానీ, నైతికంగా దిగజారి పోతున్నా దిగజారిపోతున్నాం. కుటుంబ గౌరవం లేదు. పిల్లలు ఎప్పుడు చూసినా ఫోన్ల మీదే ఉంటున్నారు. మార్కులు కూడా తక్కువ వస్తున్నాయి. మీ అండ చూసుకునే వాళ్లు అలా తయారయ్యారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారో చెయ్యండి. ఇప్పుడు మీకు బాధ వచ్చింది కాబట్టి ఇలా అంటున్నారు. ఏం చేస్తారో మీరే చేయండి’’అంటూ ఆక్రోశంగా అంది పావని.
పావని అన్న దాంట్లో నూటికి నూరుపాళ్లు నిజమే ఉంది. తను ఆరోజు చెబితే నేనే కొట్టి పడేసాను. పెద్ద ఫోన్‌ ‌కొంటే ఒక స్టేటస్‌ అనుకున్నా ను కానీ, మనుషుల మధ్య బాంధవ్యాలు, ప్రేమానురాగాలు తగ్గి మానసికంగా దూరం అయిపోతున్నాం. ‘‘రాజుగారి కాలు విరగడం ఒకందుకు మంచిదే’’ అని నాకు కాలు విరగబట్టే ఇంట్లో పరిస్థితి ఏమిటో తెలుసుకోగలిగాను. లేకపోతే పిల్లలు ఎలా తయారయ్యే వారో?’’ అనుకుని రఘు తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు.
రాత్రి పిల్లలు ఇద్దరు నీ పిలిచి ‘‘రమ్యా! నీ సంగీతం ఎంత వరకు వచ్చింది?’’
‘‘మానేసాను డాడీ! నాకు టైం సరిపోవట్లేదు’’…
‘‘పొద్దస్తమానం ఫోన్‌ ‌నొక్కుతుంటే టైం ఎక్కడ సరిపోతుంది? అందుకే మీ ఇద్దరికీ చిన్న ఫోన్లు ఇస్తాను. అవి వాడుకోండి.
వంశీ! నువ్వు కూడా నీ ‘‘చెస్‌’’ ఆట కంటిన్యూ చెయ్‌. ‌స్కూల్‌ ‌తరఫున టోర్నమెంట్స్‌కి వెళ్లే వాడివి. అటువంటిది ఫోన్‌ ‌రావడంతో మీ కెరియర్‌ అం‌తా పాడైపోయింది. ఈరోజు నుంచి అందరం కలిసి భోజనాలుచేద్దాం.
ఒక్కొక్కళ్లు ఒక్కొక్క టైం కాదు. ఏ రోజు జరిగిన విషయాలు ఆ రోజు చర్చించుకుందాం. పిల్లలు! మీ స్కూల్లో జరిగిన విశేషాలు మీరు చెప్పండి. ఇక ఆదివారాలు, రమ్య! అమ్మ దగ్గర చిన్న చిన్న పనులు నేర్చుకో! అది నీకు ముందు ముందు ఉపయోగ పడుతుంది. ఇంటికి ఎవరైనా వస్తే మంచినీళ్లు ఇవ్వడం నేర్చుకోండి. ఇవన్నీ రేపటి నుంచి మొదలుపెడదాం.మీకు చిన్న ఫోన్లు కొనిస్తాను. తీసుకు వెళ్లండి’’ ఇంకో మాటకి తావు లేకుండా కోపంగా అన్నాడు రఘు.
పిల్లలు ముందు గొణుక్కున్న, చేసేదేమీ లేక తర్వాత వాళ్ల కెరియర్‌ ‌మీద దృష్టి పెట్టి గొప్పగా రాణించారు. వంశీ రాష్ట్ర చదరంగం 14 సంవత్స రాల విభాగంలో ఫస్ట్ ‌వచ్చాడు
రమ్య చిన్న చిన్న కచేరీలు చేస్తోంది. రమ్యని అందరూ పొగుడుతుంటే ఎంతో సంతోషంగా ఉంది. రమ్య అనుకుంది ‘‘ఫోన్‌ ‌వద్దన్నప్పుడు కోపం వచ్చింది కానీ, అది ఉంటే నా కెరియర్‌ ‌నాశనం అయిపోయేది. ఇప్పుడు నలుగురు నన్ను మెచ్చు కుంటుంటే ఎంతో బాగుంది. కాలేజీలో కూడా నన్ను ప్రత్యేకంగా గుర్తిస్తున్నారు’’అనుకుంది సంతోషంగా.
పావని కోరుకున్నది ఇదే. కుటుంబ సంబంధం ఎంత బలంగా ఉంటే దాని ప్రభావం అంతా సమాజం మీద చూపిస్తుంది. ఒక ఆరోగ్య కరమైన సమాజానికి ఒక మంచి కుటుంబం పునాది అవుతుంది.

About Author

By editor

Twitter
YOUTUBE