‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన

మడపల్లె.. నతవాడి మహారాజులవారి రాజప్రాసాదం..

ఉదయం కొలువుకు సిద్ధ్దమయ్యాడు మహారాజు ఒక్కమల్ల రుద్ర మహారాజు. ఆయన రాజోచిత అలంకరణ పూర్తి అయ్యాక భర్తకు వృద్ధ ముత్తయి దువు అయిన పరిచారిక చేత దిష్టి తీశాక.. పరిచారి కలంతా అంతరంగిక మందిరం నుంచి వెళ్లి పోయాక.. భర్త ఉద్వేగంగా ఆమెను దగ్గరకు హత్తుకోగా బిడియపడుతూ ఇబ్బంది పడుతున్నట్లు లబ్జుగా కదులుతూ అందమైన కనుదోయిని అష్టవంకరలు తిప్పుతూ, “అబ్బ వదలండి..” అంటోంది గారంగా ఆయన పట్టమహిషి. ఆయన తమకంగా ఆమెను మరింతగా  తనవైపు గుంజుకుని తన అచంచల ప్రేమ కామ విశ్వాసాలు ప్రకటించ సాగాడు.

అప్పుడే మందిరం వాకిట వాద్యకారులు తమ పంచ వాద్యాలను శ్రుతి చేసుకుంటున్న శబ్దాలు అంతఃపురం లోపలికి వినబడ్డాయి. ఇద్దరూ  విడివడి ఆత్మీయంగా చేయిచేయి పుచ్చుకుని బయటకు వచ్చారు. అంతఃపుర ప్రతిహారీ, పరిచారికలు వంగి ఆయనకు వీడ్కోలు పలుకగా అంతఃపురం వెలుపల ద్వారం వద్ద వేచి ఉన్న ఆయన ఆంతరంగిక నియోగి, అంగరక్షకులు వంగి నమస్కరించగా ఆయన ముందుకు కదిలాడు. అంగరక్షకులు పరివేష్టించాక వారి మధ్యగా నిలబడి వెనుదిరికి తననే చూస్తోన్న పట్టమహిషికి రాజసపు వీడ్కోలు పలికి ముందుకు నడిచాడు. పంచవాదŠ్యకారులు, స్తోత్రపాఠకులు ఆయనకు నమస్కరించి ఆయనకు మరింత ముందు కదలుతుండగా  రాచరిక బృందం కోటప్రాంగణంని సభామందిరంలో ప్రవేశించింది.

ఎంత మనోహరంగా కన్నులపండువగా ఉన్నదీ దృశ్యం!!

ఈ దృశ్యం కాకతీయరాజ్యపు సామంతరాజ్యం నతవాడి రాజధాని మడపల్లె రాజప్రాసాదం వద్ద నిత్యమూ కనిపించే దృశ్యం. మడపల్లెలోనే కాదు ప్రతి సామంతరాజ్య రాజప్రాసాదంలో ప్రతి ఉదయం రాచరిక కొలువు ఇలాగే ప్రారంభం అవుతోంది. ఇప్పుడు నతవాడి రాజ్యానికి ఇబ్బందులు, కష్టాలు ఏమీ లేవు. కేవలం అనుమకొండలోని సామంత రాజ్యసహకార నియోగానికి తెలియచెÉబితే చాలు. ఆ ఇబ్బంది కానీ కష్టం కాని రోజుల వ్యవధిలో పరిష్కారమౌతాయి.

   * * * * * *

అదే సమయంలో అదే నతవాడి రాజ్యంలో రుద్రేశ్వర దేవాలయం..

ఆ గుడి వద్ద పల్లకీలు, గుర్రబ్బళ్లు, ఎడ్ల బళ్లు.. రహదారి కనిపించకుండా నిండి ఉన్నాయి. ఆ గుడివద్ద అడుక్కుంటున్న కుంటివాడిప్పుడు కాస్త వొళ్లు చేశాడు. వాడిప్పుడు కేవలం గుడి వద్ద అడుక్కుని తిని అక్కడే మూడు అంకె వేసి ముడుచుకు పడుకోవడం లేదు. ఇప్పుడు వాడికో భార్య ఉంది. ఆమె ఇప్పుడు ఓ చంకలో పిల్లవాడిని పెట్టుకుని నెలలు నిండిన గర్భాన్ని అలవోకగా లాగుతూ నెత్తిన నీళ్లకుండలను పెట్టుకుని చెరువు నుండి వయ్యారంగా నడిచివెళుతోంది. ముష్టివాడు అలవాటైన యాచన చేస్తూ దూరంగా సాగిపోతున్న భార్యను చూసి ముసిముసిగా నవ్వుకుంటున్నాడు.

లోపల పూజారిగారికున్న హోదా గౌరవ మర్యాదలు సహజంగా ఆ దేవుడికి కూడా లేవు. కాని సదరు పూజారి గారు లిప్తకోమాటు ‘అంతా ఆ భగవంతుడి దయ.. మన ప్రాప్తం’ అంటుంటాడు. ఆయన భార్య ఆరగారగా వెచ్చ వెచ్చని చెరకు పానకం.. మధ్యే మధ్యే చల్లచల్లని మజ్జిగ తెచ్చి భర్తకు అందిస్తోంది. భక్తుల కోలాహలం మధ్య ఆ భగ వంతుడు చిన్మయానంద చిరునవ్వులు చిందిస్తున్నాడు.

ఇది కేవలం నతవాడి రాజ్యంలోని మడపల్లె దేవాలయంలోనే కాదు.. ముదిగొండలో.. సబ్బి నాడులో.. పానగల్లులో.. కొణిదెనలో.. నెల్లూరులో.. వెలనాడులో.. కాకతీయ సామంతుల రాజ్యలన్నిటా నగరాలలో నగర సంస్కృతీ.. గ్రామాలలో సహజ సౌందర్యం.. నిబ్బరంగా ప్రశాంతంగా కాకతీయ సామంత రాజ్యలన్నిటా ఒకే సాంస్కృతిక జీవనం వెల్లివిరుస్తోంది.

గతంలో అత్యున్నత పాలకుడు మహారాజుకు ఓ మారుమూల గ్రామవాసులతో ఏమాత్రం దగ్గరితనం లేదు.

సాధారణ సమాజంపై మహారాజుల పని కేవలం పన్నులు వేసి వసూలు చేసుకోవడం. అందులో కొంత భాగం సాధారణ పాలనకు కేటాయిస్తారు కాబట్టి ఆ కొద్ది మొత్తంలో గ్రామ సమయశెట్టి ఆధ్వర్యంలో అందరికి వలసిన సౌకర్యాల కోసం ఖర్చు చేస్తారు.

అయితే ఇప్పుడు గణపతిదేవునిపాలనలో రాచరికపాలనా విధానం మారిపోయింది. నేరుగా మహారాజుగారే ఎప్పటికప్పుడు తగిన ఆదేశాలు, ఆజ్ఞలు  జారీ చేస్తూ.. కాకతీయ పాలనా రాజ్యంలోనే కాదు.. ప్రతి మహాసామంత, సామంత రాజ్యంలోని ప్రతి గ్రామంలో కూడా శాంతియుత సహజీవనం, సమస్త వస్తుసేవలు అందుబాటులో ఉండేలా.. ఎలాంటి ఒడుదుడుకులు లేకుండా సాఫీగా సాగి పోయేలా పర్యవేక్షిస్తున్నారు.

శిక్షల తీవ్రత తగ్గించమని గ్రామ న్యాయాధికారులకు శాసనం చేశాడు. ముఖ్యంగా గ్రామబహిష్కరణ అనే శిక్షనే తొలగించాడు. తక్కువ సొమ్ము చెల్లించాలనే శిక్ష చాలా వాటికి విధించడం వల్ల ఆయా నేరస్థులు కష్టపడి సంపాదించి గ్రామ కచేరికి చెల్లిస్తున్నారు. వారి కుటుంబం గ్రామంలోనే ఉంటోంది. నేరస్థుడు తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో మరింత గౌరవంగా బతకడానికి యత్నిస్తున్నాడు.

ఇప్పుడు రహదారుల వెంట వెళ్లేవారికి దొంగల బెడద తగ్గిపోయింది. అంతేకాదు. ప్రతి రహదారి వెంట దట్టమైన అరణ్యాలున్నచోట,అడవి ప్రారంభమయ్యేచోట రక్షకభట శిబిరాలు ఏర్పాటు చేశాడు. రక్షక„భటులు బాటసారులను కొందరిని జమ చేసి వెంట వెళ్లి అడవి దాటించి వస్తారు.వర్తక బిడారులు ప్రశాంతంగా సాగిపోతున్నాయి. రహదారు లను ఎప్పటికప్పుడు బాగుచేయడానికి రహదారుల నియోగాన్ని రాజధానిలో ఏర్పరచాడు. ఏ రహదారి పాడైనా ఆ గ్రామ సమయశెట్టి తక్షణమే రాజధానికి ఎరుకపరచాలి. సదరు నియోగం వెనువెంటనే దానిని బాగుచేయాలి. ఇవి కేవలం కాకతీయ రాజ్యంలోనే కాదు. అన్ని సామంత రాజ్యాలలో అమలౌతున్నాయి.

   * * * * * *

కొమరవోలు గ్రామం.

ఉదయం మొదటి జాము చివరికి వస్తోంది.

పొద్దుపొద్దున్నే గ్రామంలో అశేష ప్రజ (మూడు గ్రామాలకు కలిపి ఒక న్యాయసభ) న్యాయసభ పెట్టారు. గ్రామ సమయం వారి చావిడి వద్ద న్యాయ మూర్తులు ముగ్గురు సమావేశమయ్యారు. గ్రామ సమయం తలారి ఉప్పలయ ముగ్గురికి కూర్చోవ డానికి బల్లలు వేశాడు. గ్రామ గావుండ సంబరసు, సమయ సెట్టి అబ్బరశెట్టి, కరణీడు నన్నెప్రెగ్గడ కూడా హాజరయ్యారు.

ఊరు మహిళలు ఫిర్యాదు చేశారు. పాలు అమ్ముకునే అంకెలయపై అభియోగం.

“చెప్పండమ్మా.. ఏవిటి మీ అభియోగం?” న్యాయాధికారి పరమం భట్టు ప్రశ్నించాడు.

డెబ్బైఏళ్ల భట్టుగారి పెద్ద బాన పొట్ట మీద విబూది అడ్డగీతలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. న్యాయశాస్త్రంలో తానొక మహామేధావినని ఆయన భావిస్తున్నట్లు ఆయన ముఖ కవళికలు చెబుతు న్నాయి.

 ఓ యువతి ముందుకొచ్చింది. ఆమె ముఖం తడికట్టెలు కాలుతున్నట్లు కంపు, పొగ, ముసురు.. “అదుగో ఆ పాలు తీసుకు పోయేవాడు మా ముగ్గులన్ని గేదెలతో తొక్కిస్తున్నాడు. సంక్రాంతి పండుగంతా మేము ముగ్గులు వెయ్యడం.. వాడు తొక్కించుకుంటూ పోవడం.. ఇది పెద్ద తప్పు. పండుగపూట వేసిన ముగ్గులు అంటే ఆ సంక్రాంతి లక్ష్మికి పూజ చేసినట్లు. అలాంటి ముగ్గుల్ని తొక్కించడమంటే ఎంత అపరాధం.. వాడికి  గ్రామ బహిష్కరణ శిక్ష విధించండి.”

ఆమె మాటలు వింటూ చల్లగాలికి మాగన్నుగా తల ఊపుతున్న న్యాయమూర్తులకు ఆమె ఆఖరి మాట విని చిర్రెత్తుకొచ్చింది.

“వాడికి ఏ శిక్ష వేయాలో నువ్వు మాకు చెబుతావా.. ఏయ్..??!” అన్నాడందులో ఒకడు. బానపొట్ట భట్టు గారికి కూడా అరికాలి మంట నెత్తి కెక్కింది. ఇంత న్యాయశాస్త్రం అంతా బట్టీ పట్టిన తను చెప్పాల్సిన తీర్పును ఈ పిల్ల చెప్పడం ఏవిటి? బానపొట్ట మొత్తం కదిలిపోయేలా ఆయన కదిలిపోయాడు.

“అది చెప్పాల్సింది మేము..” అన్నాడు కుతకుత లాడిపోతూ.

“సరే సరే.. ఏవిరా గొల్లబ్బి.. ఏవిటి కావాలని ఆడపిల్లల ముగ్గులు తొక్కిస్తున్నావటా.. ఆయ్?!”

నిలబడ్డ చోటునుండే నేలను తాకి నెత్తి నోరు బాదుకున్నాడు గొల్ల అంకెలయ.

“అయ్యి గేదేలండి. మన మాట ఇనవండి. మొత్తంగా మొత్తం యాభె గేదేలండి. బాట నిండిపోతాయండే. మరి ముగ్గులు తొక్కక ఎట్టా పోతాయండే.. పెద్దోరు తమరికి చెప్పలేనండే..”

అప్పుడే గ్రామ గావుండ భట్టుగారి చెవిలో గొణిగాడు, “స్వామీ.. గ్రామ బహిష్కరణ మాత్రం విధించకండి. పైన గణపతిదేవ మహారాజులుంగారి ఆజ్ఞ. అది తప్ప అని. కాబట్టి చిత్తగించవలెను.”

ఇది ఆయనకు తెలుసు. మరో ఊళ్లో గ్రామ  బహిష్కరణ విధిస్తే.. ఊరు ఊరంతా తిరగబడింది. ఏదో న్యాయమూర్తివి అని చెబితే అన్నిటికి ఇదే శిక్షా అని..

“సరే సరే.. నేన్జూసుకుంటాలే..” అన్నాడు శబ్దం రాకుండా.

“దీనికి సరైనశిక్ష గ్రామ  బహిష్కరణ కానీ అంకెలయ తప్పు తక్కువ.. గేదెల తప్పు ఎక్కువ.. కాబట్టి గేదెలకు గ్రామ బహిష్కరణ విధిస్తూ తీర్పు చెప్పడమైంది..”

తీర్పు చెప్పాడు కానీ మర్నాటి నుండి భట్టుగారి ఇంటికి పాలు పోసేవాడు లేడు.

ఏది ఏమైనా గ్రామ బహిష్కరణ శిక్షలు రాజ్యాలన్నిటా తగ్గిపోయాయి. అప్పటివరకు కనిపించని శాంతి రాజ్య రహదారుల్లో కనపడింది. బాటసారులు  దారిదోపిడి భయం లేకుండా యధేచ్ఛగా తిరగసాగారు. ముఖ్యంగా వర్తక బిడారులు స్వేచ్ఛగా తిరగడంవల్ల ప్రజలకు అనేక వస్తువులు సమయానికి తగిన ధరల్లో దొరకసాగాయి.

శెట్టిలకు వర్తకం ప్రశాంతంగా జరిగితే.. ప్రజలకు మంచి వస్తువులు తక్కువ ధరల్లో దొరుకుతున్నాయి.

సుఖ జీవనానికి శాంతి భద్రతలు అప్పుడూ.. ఇప్పుడూ.. ఎప్పుడూ ముఖ్యమే!

   * * * * * *

పంజులురు గ్రామం, ముదిగొండ రాజ్యం..

పంజులురు గ్రామంలో జరగనున్న సంతకు ముక్కోటిశెట్టి బిడారు వెళుతోంది. అప్పటికి చీకటి దట్టంగా కమ్ముకుని దారి కనబడటంలేదు. కాని బిడారులోని వంద ఎడ్లబళ్లు మెల్లగా వెళుతున్నాయి. రహదారి కూడా కొత్తగా నిర్మించినట్లు దిట్టంగా ఉంది. బళ్ల గాలు మరింత ప్రత్యేకంగా గట్టిపరచినట్లు బండి చక్రాలు ఎలాంటి ఒడుదుడుకులు లేకుండా సునాయాసంగా కదులుతున్నాయి. ఎడ్లు కూడా చులాగ్గా బండి లాగుతున్నాయి. బిడారు అంతా ఆ చీకట్లో కూడా ఉత్సాహంగా సరదా సరదాగా ఉంది. వెనుక, ముందు బళ్లు తోలుతున్న పెరికలు చెప్పుకుంటున్న ముచ్చట్లు, పాడుతున్న కూనిరాగాలు, పగలబడి వినబడుతున్న నవ్వులు.. బూతులు..

ఉన్నట్లుండి రహదారి ప్రక్కనున్నదట్టమైన అడవుల నుండి దారి దోపిడీదారులు హఠాత్తుగా గుంపులు గుంపులుగా బిడారుపై వచ్చిపడ్డారు. ప్రశాంతంగా సాగుతున్న బిడారు నుండి బళ్లవాళ్లు బిత్తరపోయి, దొంగలు .. దోపిడీగాళ్లు.. రక్షించండి అంటూ అరవసాగారు. అయితే అది కేవలం కొన్ని లిప్తల కాలమే.

కాసేపటికి ఆ దారిదోపిడీగాళ్లు హాహాకారాలు చేస్తుండటం.. వారి శరీరాల నుంచి చిమ్మిన  రక్తం ఆ దారంతా, బళ్లమీదా, ఎద్దుల మీదా చిమ్మి భయోత్పాతం కలిగిస్తోంది.

ముందు వచ్చిన దుండగులు హాహాకారాలు చేస్తుంటే వెనుకనున్న దుండగులు వెనుదిరిగి అడవిలోకి పరుగులు పెట్టసాగారు.

కారణం అన్ని బళ్లకూ రక్షణ భటులను ఏర్పాటు చేసింది గణపతిదేవుని రక్షణ నియోగం.

   * * * * * *

కాకతీయరాజ్యంలో వినూత్న పాలనా వ్యవస్థ ఏర్పాటయ్యింది.

సాధారణంగా బిడారు నిర్వహిస్తోన్న సమయ సెట్టికి ఎప్పుడూ పని చేసే పెరికవారు, మున్నూరు వారు ఉంటారు. చిన్నబిడారు నిర్వహించే సెట్టికి మున్నూరు వారిని రక్షణగా పెట్టుకునే స్తోమత ఉండదు. అయితే కాకతీయ మహామండలేశ్వరుడు గణపతిదేవుడు తన రాజ్యంతోపాటు తన సామంతుల, మహాసామంతుల రాజ్యాల్లో కూడా ప్రజాసమస్యలపై ఆయా మండలేశ్వరులు, ‘నాడు’ అధిపతులు, గ్రామరట్టలు.. ప్రజాసంక్షేమం కోసం తీసుకోవాల్సిన కొన్ని విధివిధానాలను నిర్దేశించి ఖచ్చితంగా అమలు చేయవలసినదిగా శాసించాడు. ఈ పద్ధతి ఇంతకు ముందు ఎక్కడా లేదు. ఎవ్వరూ వినలేదు.. ఏ పండితుడు తానూ చదివినట్లు చెప్పలేదు. సాధారణంగా మహారాజులు రాజ్యరక్షణ తమ ప్రధాన విధిగా.. అంటే ఎప్పుడూ ఎవ్వడో మన మీద దాడి చేయబోతున్నా డని.. లేదా మనం ఎవడి మీదకో యుద్ధానికి వెళ్లబోతున్నామన్న వార్తలు వ్యాపింపజేస్తుండటమే సాధారణంగా  సమాజానికి తెలుసు.

రాజులు శ్రద్దగా నిర్వహించే రెండవ కార్యక్రమం పన్నులు విధించి నిర్బంధంగా వసూలు చేయడం!!

ఈ రెండూ తప్ప మిగిలిన అన్ని సామాజిక సమస్యలు గ్రామరట్టలకు, సమయసెట్టిలకు, మహాజనులకు వదిలేసినట్లు.. ప్రత్యేకంగా చెప్పకపోయినా.. రాజాస్థానం నుండి ఇలాంటి వాటికి స్పందన ఉండదు.

బాటలు బాగుండకపోతే రాజుగారికి ఫిర్యాదు చేస్తే ఏమీ ప్రయోజనం ఉండదు. పైపెచ్చు చేసిన వాడిని చితక్కొడతారు. అంతా స్థానిక పరిపాలకులే నిర్ణయించుకుని తమ తమ ప్రాంత సమస్యలను పరిష్కరించుకుంటారు.

అందుకు అయ్యే ఖర్చు గ్రామపన్నుల వసూలు నుంచి మినహాయించుకుని రాజ ఖజానాకు పంపుతారు.

అందుకు రాజ అధికార నియోగాలు అంగీకరిస్తాయి.

రాజపాలన అంటే రక్షణ, పన్నులు మాత్రమే అని సాధారణ ప్రజల అభిప్రాయం. అనుభవసారం కూడా. ఇక తమ సమస్యలన్నీ స్థానిక సమయాలు, మహాజనులు, గ్రామ న్యాయబృందాల ద్వారా పరిష్కారం చేసుకుంటారు. అలాంటిది ఇప్పుడు ఇలా గణపతిదేవుడు కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించడం నాడుల (జిల్లా) స్థాయి అధికారులను, గ్రామరట్టలను అమితాశ్చర్యానికి గురిచేసింది. వాటిని అమలు చేస్తుంటే సాధారణ ప్రజలే కాదు పాలకవర్గాలు, మహాజనులు, సమయసెట్టిలు.. అందరూ ఆనందంతో పొంగిపోతున్నారు.

అందులో మొదటిది బాటలను ఎప్పటికప్పుడు బాగుచేసుకోవడం.. చేసుకు తీరాలని మహారాజుల శాసనం. అందుకు అయ్యే ఖర్చు పన్నుల నుంచి  మినహాయింపు. అలాగే వీధి దీపాలు.. బాట  పక్క  మంచినీటి బావుల తవ్వకం. వాటివద్ద శుభ్రమైన వాతావరణం, దారి పక్క సత్రాలు.. గతంలో మహారాజ, కులీనవర్గాలకు మాత్రమే రాత్రి బస చేయడానికి సత్రాలు ఉన్నాయి. ఇప్పుడు సాధారణ ప్రజలు ఊర్లోకి వెళ్లి ఎవరినైనా బ్రతిమిలాడుకుని వారి అరుగులపై పడుకుని ఉదయాన్నే లేచి తిరిగి తమ ప్రయాణాలను కొనసాగిస్తారు. ఇకపై రహదారి ప్రక్కన సత్రాలు ఏర్పాటు చేసుకోవాలి.

 ప్రతి చిన్నతప్పుకు గ్రామ  బహిష్కరణ శిక్షగా వేయడం తగ్గించాలని కూడా గ్రామ పాలకవర్గాలకు హితవు. “అది హితవు కాదు.. శాసనం.” అన్నాడో గ్రామరట్ట. తన అధికారాలు మహారాజులు లాక్కుంటున్నారని అతగాడి ఏడుపు. కానీ అందువల్ల తన శత్రువులు తగ్గారని కూడా లోలోన సంతోషిం చాడు సదరు గ్రామరట్ట. శిక్ష వేసిన గ్రామరట్టను లేదా గ్రామన్యాయాధికారిని సదరు గ్రామ బహిష్కృతుడు ఎప్పుడో ఒకప్పుడు దారి కాచి కాలో చెయ్యో నరికేయడం లేదా చంపివేయడం సర్వ సాధారణం. ఆ సమస్య ఇప్పుడు పరిష్కారం దిశగా పయనిస్తోంది.

గణపతిదేవుని ఆదేశ శాసనాలు ఆయా రాజ్యాలలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి.

సాధారణ ప్రజలేకాదు.. మేధావులు, మహాజనులు, ఉపాధ్యాయులు, సమయ సెట్టిలు, వణిజులు, వృత్తుల వాళ్లు.. అందరూ చర్చించు కుంటూ ఆశ్చర్యపోయి ఆనంద పడుతున్నారు. ఇది రాజపాలన కాదు ప్రజాపాలన అంటున్నారు.

అయితే ఈ మహారాజ ఆస్థాన శాసనాలను, ఆజ్ఞలను అంగీకరించని వర్గాలు కూడా ఉన్నాయి.

ముఖ్యంగా కొందరు.. సమాజ హితానికి మతమే ముఖ్యమని నమ్మే వర్గాలు.

‘ఇది దైవ సంబంధిత.. మా మతాచారాలలో సాంస్కృతిక అంశాలలో పాలకులు జోరబడటమే..’ అంటున్నారు కొందరు మహాజన వర్గాలు.

సాధారణంగా పండితులు లేదా బ్రాహ్మణులు మూడు వర్గాలుగా ఉంటారు. అందరూ తప్పక అక్షరా భ్యాసం చేసి బాల్యం నుంచే విద్యలోకి ప్రవేశిస్తారు. అందులో మహామేధావులు ఒక వర్గం, మతావేశ పరులు ఒక వర్గం. మిగిలినవారు సాధారణ ఉపాధ్యాయులు, పురోహితులు, గ్రామమహాజన సంఘ సభ్యులుగా కొనసాగుతున్నవారు. ఈ మూడు వర్గాలలో అత్యంత బలవంతులు ఈ మతావేశ పరులు. వీళ్లే ఆ కాలానికి ప్రచలితమౌతున్న మతాచారాలను తీవ్రంగా అనుసరించే వర్గం. ప్రస్తుతం వీరిలో శైవ తీవ్రవాదులు, వైష్ణవ తీవ్రవాదులు, బసవణ్న భక్తులు, బౌద్ధ తీవ్రవాదులు, జైన తీవ్రవాదులు.. కూడా ఉంటారు. వర్తమాన సదాచార మతాచారాలలో ఎవరు జోక్యం చేసుకున్నా వీళ్లు అంగీకరించరు. తమ మతంపై, తమ ఆచారాలపై, తమ దైవంపై దాడిగా భావించి తీవ్రంగా స్పందిస్తారు. వీళ్లు మహారాజులను కూడా ఎదిరించడానికి జంకరు. కారణం వీరికి అమాయక మూఢభక్తులతో ఉన్న విస్తృత సంబంధ బాంధవ్యాలు. ఈ తరహా సంప్రదాయవాదులు భారతీయ రాజ్యాలలో అనాదిగా ఉన్నారు. ఇందులో వైదిక మతవాదులు ప్రస్తుత కాలానికి సమర్థంగా తమ వైదికమత విశ్వాసాలను నిర్వహిస్తున్నారు. ఇతర మతవాదుల ప్రాబల్యం సమాజంలో తగ్గిపోయింది. ఈ వైదిక మతవాదులు చెప్పినట్లు చావమంటే చచ్చేవాళ్లు, మంటల్లో దూకమంటే దూకేవాళ్లు కోకొల్లలుగా ఉన్నారు.

గణపతిదేవుడు సామాన్య ప్రజల జీవితాలను నాశనం చేసే వామాచార, మంత్ర తంత్ర పూజలు పూర్తిగా నిషేధిస్తూ శాసనం చేశాడు. అది ఎంతో మంది మంత్ర తంత్ర మహాపండితులను నివ్వెర పరచింది. ముదిగొండ రాజ్యంలోని మతాచార పండితులను మరీ కృంగదీసింది. సమాజాన్ని సజావుగా నడిపించే సదాచారాలను మహారాజులు అడ్డుకోవడం తీవ్రమైన దోషంగా ఆ వర్గాలు కుమిలిపోతున్నాయి.

ఇలాంటివి ఏదో గుట్టుగా జరుపుకుంటున్నా అక్కడికి వచ్చి ఆ క్రతువును పాడు చేసే డిండిమ అతి పెద్ద దుర్మార్గుడు! శత్రువు!!

సదరు వైదిక ప్రముఖులంతా మహారాజు నాగతి భూపతి వద్దకు వెళ్లి తమ అసంతృప్తి తెలియజేశారు. ఆయనకు అప్పటికే డిండిమపై అనేక ఫిర్యాదులు అందడంతో అతనికి మరణశిక్ష విధించాడు. అయినా అతని దండ నాయకులు డిండిమను బంధించలేక పోయారు. తర్వాత గణపతిదేవుడు ముదిగొండ మహారాజు నాగతి భూపాలుని బంధించి అనుమ కొండలో దారుణంగా అవమానించి అతని రాజ్యాన్ని కాకతీయ సామ్రాజ్యంలో కలిపేసుకుని.. తిరిగి అతన్ని ముదిగొండ సింహాసనంపై సామంతుడిగా కూర్చుండబెట్టాడు. ఇవన్నీ తెలుసుకున్న మంత్ర తంత్ర వామాచార పరాయణులకు ఇప్పుడు గణపతి దేవుడు కూడా శత్రువు అయ్యాడు.

ఈ వర్గానికి నాయకుడు శంకణభట్టు. ‘దెయ్యం మాయం’ పూజల నిర్వహణలో రాజ్య ప్రసిద్ధి పొందినవాడు.

ఏమీ చెయ్యాలో తోచక సతమతమౌతున్న సమయంలోనే వరదగూడెం గ్రామంలో ఎవరో మహిళకు దెయ్యం పట్టింది అని తెలిసి అక్కడ దెయ్యాలను పారద్రోలే మంత్ర తంత్ర విధి ‘దెయ్యం మాయం’ పూజ నిర్వహించడానికి సిద్ధ్దమయ్యారు శంకణభట్టు అతని శిష్యబృందం.

వరదగూడెంలో సైనికవీరుడు జరుగులప్ప మరణించాడు. అతనికి ముగ్గురు భార్యలు. అందులో సోమిదమ్మను జరుగులప్ప దెయ్యమై పట్టుకుని వదలడం లేదని.. అతని ఇతర భార్యలు.. ఆ గ్రామంలోని శంకణభట్టు శిష్యుల ద్వారా ఆయనకు తెలియబరచి ఆ దెయ్యాన్ని వదిలించాలని కోరారు. అందుకు తగిన పారితోషికం భారీగానే ముట్టజెబు తామని విన్నవించుకున్నారు.

ఈ విషయం మరో కంటికి  తెలియకూడదని షరతు పెట్టి దెయ్యాన్ని వదిలించడానికి తాను ఫలానా రోజు వస్తానని ‘దెయ్యం మాయం’ పూజకు తగిన ముహూర్తం పెట్టి పంపించాడు శంకణభట్టు. ఆ కుటుంబానికి పూర్తి సహకారం అందించవలసినదిగా తన శిష్యబృందాన్ని ఆదేశించాడు. ఆయన పూజలంటే ఇష్టపడే శిష్యులు ఊరూరా ఉన్నారు. వారంతా ఆయన తదుపరి పూజ నిర్వహించబోయే గ్రామంపై వాలతారు. నిశ్శబ్దంగా సదరు గ్రామస్తులు ఒక్కరొక్కరిని కలుస్తూ శంకణభట్టు నిర్వహించబోయే ‘దెయ్యం మాయం’ పూజకు ఒప్పిస్తూ ఊరందరి నుంచి పూజకు మద్దతు సాధిస్తారు.

అది తప్పకుండా అమావాస్య రోజు ఉంటుంది. కారణం అమావాస్య అంటే సామాన్యులకు అర్థం పర్థంలేని  భయం. సహజంగా గ్రామోద్యోగులను ముందే లొంగదీసుకుంటారు. ఆ రాత్రి వీధి దీపాలు వెలిగించకుండా గ్రామోద్యోగులు సహకరిస్తారు.

ప్రతి దుర్మార్గం వెనుకా అనేకానేక కుట్రకోణాలు ఉంటాయి.

చనిపోయిన జరుగులప్పకు ముగ్గురు భార్యలు. సహజంగా మూడవ భార్యపై ఓ పిసరు మోజు ఎక్కువ. అదే మిగిలిన ఇద్దరిని ఐక్యం చేస్తుంది. మొదటగా మురిపాల సవతిపై శత్రుత్వం మొదలవు తుంది. భర్త, ఆమె.. ఓ లిప్తకాలం కలసి కనపడినా వీళ్లిద్దరికి కోపాగ్ని మరింత ప్రజ్వరిల్లుతుంటుంది. అది పెరిగి పెరిగి భర్తపై కూడా శత్రుత్వం పుడుతుంది. ఇక్కడ భర్తను కడతేర్చే స్థాయికి ఆ క్రోధం ఎదుగుతుంది. ఆయన చనిపోయాడు. వీళ్లిద్దరూ అతనికి మందు పెట్టి చంపినా ఆశ్చర్య పోరాదు. సదరు చచ్చిన భర్త ఇంట్లోని బంగారమంతా మూడో సవతికి ఇచ్చి చచ్చాడని అన్యోన్య సవతుల అనుమానం.. ఆరోపణ. వారి పుట్టింటి వారికి సహజంగా ఈ ఆరోపణలో నిజం కనిపిస్తుంది. ఇప్పటికి ఆ మూడో సవతి సోమిదమ్మ సహగమనం చేస్తుందని.. ఆమెను మంటల్లో త్రోసి ఆనందించాలని ఇద్దరూ తలపోశారు. కాని ఆమె సహగమనం చెయ్యకుండా ఆమె పుట్టింటివారు అడ్డుకున్నారు. ఆమె ఇప్పటికి భర్తను మర్చిపోలేక గుక్కపట్టి ఏడుస్తోంది. తిండి తినకుండా మూలానపడి రోదిస్తోంది. ఆమె అంటే తీవ్రమైన ప్రేమ ఉన్న భర్త ఆమెకు వదలలేక దెయ్యమై పట్టుకున్నాడని,అందుకే  ఆమె ఇప్పటికి మెతుకు ముట్టకుండా.. కంటికి మింటికి ఏకధారగా ఏడుస్తోందని నిర్ణయించి.. ప్రకటించి ఊరూ వాడా ప్రచారం చేశారు. శంకణభట్టును సంప్రదించారు.

దెయ్యాన్ని వదిలించడం కాదు సోమిదమ్మనే వదిలిస్తాడని తోడికోడళ్లు ఇద్దరూ గట్టిగా నమ్మారు. ఎందుకైనా మంచిదని ముందే ఆయన శిష్యుడొకరికి తమ కోరిక తెలియజెప్పి భట్టుగారికి సంభావనలు ఘనంగానే ముట్ట జెబుతామని సూచన కూడా చేశారు. అయితే భర్త సోమిదమ్మకు బోలెడు బంగారం ఇచ్చాడని ఆమె దానిని ఎక్కడ దాచిందో తెలియడం లేదని.. ‘దెయ్యం మాయం’ పూజా సమయంలో ఆ బంగారం గురించిన సమాచారం రాబట్టాలని వినమ్రంగా కోరారు.

పూజ వెనుక జరగాల్సిన ఏర్పాట్లు అన్ని అయ్యాక దెయ్యాన్ని వదిలించడానికి శంకణభట్టు ముహూర్తం నిర్ణయించి, నిర్ణయించిన సమయానికి ముందే చిమ్మచీకటిలో శిష్య ప్రశిష్యులతో వరదగూడెం చేరుకున్నాడు.

(సశేషం)

  • మత్తి భానుమూర్తి

About Author

By editor

Twitter
YOUTUBE