‘‌జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక
నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన


ఆమె ప్రతి మాటా గంగయ మౌనంగా విన్నాడు. ఆమె గణపతిదేవుని నిందిస్తుందని, సింఘణదేవుడిని మెచ్చుకుంటుందని ఊహించిందే. కాని నిజమైన భార్యాభర్తల్లా ఆమె మాట్లాడటం అతనికి లోలోన మనోహరంగా ఉంది. దురదృష్టకర మైన తన జీవితంలో పెళ్లి అనేది మరో దారుణ సంఘటన మాత్రమేనని తర్వాత నిరూపిత మయ్యింది. అది కేయూరను ఎంతో కుంగదీసింది. రాజప్రాసాదంలో నిత్యమూ అవమానాలతో బ్రతుకుతున్న తను.. తల్లి చనిపోయాక బయటకు వెళ్లి.. మంచి భార్యను పొంది గౌరవనీయమైన కులీన జీవితాన్ని గడపగలనని కలలు కనేవాడు. అలాంటిది మళ్లీ సింఘణదేవుడు తన అభిప్రాయంతో సంబంధం లేకుండానే తన పెళ్లి చేసేశాడు. ఆ వచ్చిన ఈ భార్య చాలాకాలం దీర్ఘ నిద్రలోనే ఉండేది. ఆరోగ్యం కుదుటపడ్డాక తనతో కాపురం చేయడం అనేది లేదు. తనను పురుగును చూసినట్లు చూసేది. తానెంతో కుంగిపోయాడు. అలా అలా అన్ని బాధలు అవమానాలు భరిస్తూనే బతికాడు.
ఆనాడు అభ్యర్థించినట్లు తిరిగి కాకతీయ రాజ్యాభిషిక్తుడైన గణపతిదేవుడే తనకు తగిన హోదా స్థాయి కల్పించాడు. ఇన్నేళ్ల తర్వాత తన భార్య నిజమైన భార్యగా తనతో మాట్లాడటం కూడా ఆయన ఇచ్చిన గౌరవం వల్లనే కదా అనుకున్నాడు కేయూర.
ఇది ఏమైనా బాల కవ్వలతో ఈ మాత్రం మాటామంతీ కేయూరను మొత్తంగా దిమ్మెరబోయేలా చేసింది. ఓ మధుర భావనామయ జగత్తులోకి తీసుకెళ్లింది. లేచి ఆమె దగ్గరగా వెళ్లాడు. ఇద్దరి శరీరాలు, మనసులు.. పాతికేళ్ల వైవాహిక జీవితం అనుభవించలేదన్న స్పృహతో ఓ ఉదాత్తమైన జీవిత సార్థకత ఏదో అవగతమైనట్లు దగ్గరగా కదలాడు తున్నాయి.
తానిప్పుడు గణపతిదేవుడు చేసిన గొప్ప గౌరవాన్ని ప్రస్తుతిస్తూ మాటలాడితే ఈ ఆలుమగల అనుబంధం మళ్లీ ఛిద్రమయ్యే అవకాశం ఉంది.
‘‘ఏది ఏమైనా నాకేమీ సింఘణదేవునిపై ద్వేషం, గణపతిదేవునిపై గొప్పభక్తి లేవు కవ్వలా! ఉన్నదల్లా నీపై అపారమైన ప్రేమ. అక్క కవ్వలపై అపారమైన కరుణ. నేను ఆమె మనసు గుర్తించి.. ఈ కాకతీయు నికి దగ్గర చేశాను. ఒక రకంగా ఆమె మరణానికి నేనే కారణం..’’ దుఖంతో గొంతు పూడుకుపోయింది.
కరిగిపోయింది కవ్వల. దగ్గరగా హత్తుకుంది. మరింతగా ఆమెను పొదవుకున్నాడు.
పాతికేళ్లుగా ఎరుగని ఆ గాఢపరిష్వంగం వికటాట్టహాసం చేస్తోంది. ఇద్దరూ అలా కౌగిలి వదలకుండానే లోపలికి తల్పం వైపుగా సాగి పోయారు.
అక్కడే మరి కొన్ని రోజులున్నాడు కేయూర.
కొన్నిరోజుల దాంపత్య జీవితం..
సింఘణదేవుడు రానున్నట్లు సమాచారం రావడంతో తిరిగి బయలుదేరాడు కేయూర.
విడువలేక విడిచి పుచ్చింది బాల కవ్వల.
ఆమె అతని భార్యగా అతని రాజ్యానికి వస్తుందా..? ఏమో.. అతడు అడగలేదు.
కాకతీయ రాజ్య సామంతుడిగా ఉన్న భర్త తన పగ, ప్రతికారం నెరవేర్చుకోవడానికి సహకరిస్తాడా.. ఏమో..
ఆమె అడగలేదు.
ఇద్దరూ భార్యాభర్తలుగా కొన్ని రోజులు జీవించారు.. అన్నదే నిజం.
బాల కవ్వల తిరిగి బాలకవ్వలాబాయిగా మిగిలింది.
కేయూర గంగయదేవునిగా తిరిగివెళ్లాడు.
కరువు పూర్తిగా తొలగిపోయింది.
రాజ్యాల కుట్రలు, కుతంత్రాలు మళ్లీ ప్రధాన రంగస్థలిపైకి వచ్చాయి.
మరి కొన్నిరోజులలోనే ఇద్దరూ వారి వారి ప్రధాన పంథాలోనే కొనసాగుతున్నారని బయటపడింది.
ళి ళి ళి
ఆరవ మెట్టు: తెలుగు సంక్షేమరాజ్యం
ప్రాచీనకాలంలో గణాన్ని, జనపథాన్ని, రాజ్యాన్ని కాపాడటమే పాలకుల ప్రథ•మ కర్తవ్యం. కాబట్టి బలమైన యుద్ధ్దవీరులే తొలిదశలో నాయకులుగా ఎన్నికై, తదనంతరం రాజులుగా ఎదిగారు. వీలయినప్పుడల్లా సరిహద్దు రాజ్యాలపై దాడులు చేస్తూ రాజ్య విస్తీర్ణం పెంచుకొనేవారు. అందువల్ల రాజ్యపరిధిలో మరికొన్ని లాభదాయక వనరులు వస్తాయి. పన్నులు విధిస్తూ ఆదాయం పెంపు ద్వారా సైనిక బలాన్ని మరింత పెంచుకుని బలమైన రాజ్యంగా అందరూ గుర్తించి భయపడేలా పాలించడం రాజ్యవ్యవస్థ ప్రధాన కార్యకలాపంగా స్థిరపడింది.
కానీ ఇప్పుడీ ఆధునిక కాలంలో కేవలం మహారాజు యుద్ధాలు, రక్షణ చూస్తూ పన్నులు వసూలు చేసుకుంటే సరిపోదు. ప్రజా సంక్షేమం కూడా చూడాలి. అశోకుని తర్వాత ఆ స్థాయిలో ప్రజా సంక్షేమం పట్టించుకున్న పాలకుడు లేడు. అదంతా పిచ్చి కాలం. ప్రజలు అమాయకులు. ఇప్పుడు ప్రతి రాజూ అశోకునిలా ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవలసిందేనని ప్రజలు కోరుకుంటున్నారు. లేకపోతే ఊరుకోరు. వారిలో తిరుగుబాటు వస్తుంది. ప్రజల తరఫున పోరాడే ప్రజానాయకులు కూడా ఉద్భవించే కాలం వచ్చేసింది. తస్మాత్‌ ‌జాగ్రత్త!!
రాజ్యపాలనాశాస్త్ర నిపుణుడు శ్రీ బద్దెనా మాత్యుడు, చింతనా శిబిరంలో… మహారాజు కంటే ఇవ్వాళ మహావర్తకుడు ధనవంతుడు. మహారాజులకే అప్పులు ఇవ్వగల విదేశీ వణిజులు మన రాజ్యంలో దాదాపు వందమంది వరకు ఉన్నారని ఓ అంచనా. కాబట్టి ఇప్పుడు రాజు ఎంత శక్తిమంతుడో వణిజుడూ అంతే శక్తిమంతుడు. భాషారాజ్యాలు స్పష్టమౌతున్న ఈ సంధికాలంలో ఇక్కడ తెలుగు రాజ్యాల్లో తెలుగు వణిజుల కంటే కన్నడ వణిజులు, వారికంటే తమిళ వణిజులు మరింత బలంగా సమాజంపై పట్టున్న వాళ్లు. వీళ్లు పూర్తిగా కాకపోయినా కొంతలో కొంత తమ భాషా జనానికి అన్ని తక్కువ ధరలకు.. తెలుగు వారికి ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. లాభాల సొమ్మునంతా వాళ్ల రాజ్యాలలోని దేవాలయాలకో రాజులకో కేటాయించుకుంటున్నారు. ఈ తారతమ్యాలను మహారాజు అరికట్టి అన్ని రాజ్యాల్లో.. అన్ని గ్రామాలలో ప్రజలకు ఒకే ధరలో నాణ్యమైన సరుకులు లభించేలా చూడాలి. అంటే వ్యాపారాలను క్రమబద్ధీక•రించాలి. ‘మేము వణిజులను పట్టించు కోము. ఎందుకంటే వాళ్లు మాకు బోలెడు పన్నులు చెల్లిస్తున్నారు. వాళ్లను మేము ఏమీ గట్టిగా మాట్లాడ లేము అంటే కుదరదు. వ్యాపార క్రమబద్ధీకరణ సరుకులు అన్ని ప్రాంతాలలో ఒకే ధరలో లభించేలా చూడటం మహారాజుల తక్షణ కర్తవ్యం.
ఆర్థిక శాస్త్రవేత్త శ్రీ రుద్రధాముడు, చింతనా శిబిరంలో తిండి.. బట్టా.. అందరికి అందేలా జరిగే పక్రియే తొలి దశలో వ్యాపారం. వ్యాపారం అనే కార్యకలాపానికి వస్తువు ఉండాలి. వస్తువులు రెండు రకాలు.. సహజంగా ప్రకృతిలో దొరికేవి.. వస్తువుగా ఉత్పత్తి చేసేవి.. వాణిజ్యం అనేది రెండు రకాలు. ఒకటి మన సహజ వనరులను సమీకరించి దూరప్రాంతాలకు, దూర దేశాలకు ఎగుమతి చేయడం.. రెండవది వస్తువుల ఉత్పత్తి.. ఉదాహరణ ఉప్పు. సహజ రేవులున్న మీ సముద్రతీరాలలో ఉప్పు కావల్సినంత దొరుకుతోంది నిజమే. దానికి అఖండ భారతమంతా వ్యాపారం ఉంది. కాని అది మట్టితో.. బురదతో కలిసి ఉండటంతో అమ్మకానికి మంచి ధర పలకదు. దానిని కొంత సంస్కరించి.. అంటే శుభ్రపరిస్తే.. తెల్లగా నిగనిగ లాడుతుంది. అప్పుడు దానికి మరింత ధర లభిస్తుంది. కాబట్టి అలా శుభ్రపరచే కర్మాగారాలను ప్రభువులు ప్రోత్సహించాలి. అలాంటివి ఇప్పటికే ఉన్నాయి కదా ఇక్కడ? అని ఎవరైనా అనవచ్చు. ఉన్నమాట నాకూ తెలుసు. కాని ఆయా ఉత్పత్తిదారులకు తగిన ప్రోత్సాహాలు, సహాయాలు అందిస్తే వారు ప్రభుత్వానికి తగిన శిస్తులు చెల్లించగలరు. తద్వారా తమరి ఆదాయం మరింత పెరుగుతుంది. కొనుగోలుదారులు అంటే ప్రజలు మరింత ధర చెల్లించగలరు. నాణ్యమైన వస్తువుల వాడకంతో ప్రజల జీవన స్థాయి.. తద్వారా రాజ్యస్థాయి పెరుగుతుంది కదా. ఉత్పత్తి జరగాలంటే ముందు సాధారణ వసతులు అన్ని గ్రామాలలో ఉండాలి. ముఖ్యంగా సహజవనరుల లభ్యత ఉన్న సామంత రాజ్యాలలో, స్థలాల్లో ఈ సాధారణ వసతులు.. ముఖ్యంగా చిన్న చిన్న దేశీయ ఉత్పత్తి దారులున్న గ్రామాలలో ఏర్పాటు చేయాలి. మన వద్ద పెద్ద పెద్ద వణిజులు, మహామహా ఉత్పత్తిదారులు ఉన్నారు. కానీ చిన్న చిన్న ఉత్పత్తిదారులు, సరఫరాదారులు ఉంటేనే ఆ మహావణిజుల విదేశీ, పరరాజ్య వాణిజ్యం పరిఢవిల్లేది. అందుకు తగిన సహాయ విధానాలు ప్రభువులు తీసుకోవాలని నా మనవి.
పండిత సుమేరు భట్టు, ప్రధానాచార్యులు, తక్షశిలా విశ్వవిద్యాలయం…ఈ ఆధునిక కాలంలో రాజ్యం, వాణిజ్యం, మతం..సమాజాన్ని ముప్పేటలా చుట్టుముట్టి ప్రభావితం చేస్తున్నాయి. ఈ మూడింటిని క్రమబద్ధీక•రించాల్సింది మహారాజులే. రాజ్యపాలనా వ్యవస్థను క్రమబద్ధీక•రిస్తే మిగిలిన రెంటిని నియంత్రించడం సాధ్యమే.
శిబిరాధ్యక్షులు తిక్కనామాత్యులు.
ళి ళి ళి
కాలం ఎన్నడూ ఆగదు. దానికి వరదలు, ఉప్పెనలు.. కరవు కాటకాలు, అంటువ్యాధులు.. అనేవి కొన్ని కొన్ని సంఘటనలు మాత్రమే. కాలం అలా ప్రవాహంలా సాగిపోతూనే ఉంటుంది.
కాకతీయ రాజ్యం, గణపతిదేవుని కుటుంబంలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. పెద్ద కూతురు గణపాంబ వివాహం జరిపించాడు. అదికూడా ధాన్యకటకమైన ధరణికోట పాలకుల కుటుంబంతో. రెండవ కుమార్తె రుద్రమ చరిత్ర మరో విశేషం. ఆమె పుట్టినప్పుడు ఇద్దరూ ఆడపిల్లలయితే ఆయన వారసులు ఎవరు అనే విషయంలో వచ్చే సందిగ్ధతను నివారించడానికి ఆమెను మగపిల్లవాడుగా ప్రకటించాడు. అందువల్ల తాత్కాలికంగా సమస్య తప్పినా యుక్తవయస్సు వచ్చేసరికి ఆడపిల్లను మగవాడిగా చూపడం పెద్ద సమస్య అయ్యింది. అప్పుడు పెద్దలందరి సలహాతో గతంలో జాతకరీత్యా అబ్బాయిగా ప్రకటించినట్లు, ఇప్పుడు అసలు నిజం.. రెండవ సంతానం కూడా అమ్మాయి అని, ఆమె గొప్ప యుద్ధవిద్యా ప్రవీణురాలని ప్రకటించాడు. సహజంగా తలెత్తిన అలజడి అంతే సహజంగా తగ్గిపోయింది. కారణం రెండవ భార్యకు ఉన్నది ఏకైక కుమారుడు కావడంతో అతడే గణపతిదేవుని వారసుడుగా ప్రజలు భావిస్తుండటంతో ఎలాంటి అలజడులు లేకుండా రాజ్యపాలన జరిగిపోతోంది. గణపాంబ అత్తవారికి వెళ్లిపోగా రెండవ కుమార్తె రుద్రమదేవి, కుమారుడు మురారిదేవుడు పాలనలో గణపతిదేవునికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. రుద్రమ కాస్త బాధ్యత కలిగి తండ్రికి సహకరిస్తుండగా మురారి ఇంకా అల్లరిచిల్లరగా తిరుగుతున్నాడు. పిల్లల బాధ్యత బావమరిది జాయచోడునిపై ఉంచి తన పూర్తి సమయాన్ని తెలుగురాజ్య స్థాపనకే అంకితం చేశాడు గణపతిదేవుడు.
కరవును అమోఘంగా ఎదుర్కున్న కాకతీయ రాజ్యపాలనావ్యవస్థలో గొప్ప విప్లవాత్మక సంస్కరణలు మొదలయ్యాయి. అది ‘రాజ్య విధానాలు’ రూపకల్పన చేసి ప్రకటించడం.
రాజ్య అధికార నియోగాల నుంచి విధానాలు అనే కొత్త అంశం పుట్టింది.
మహాప్రధాని నియోగం నుండి ఇలాంటి విధానాలు ప్రకటనల రూపంలో వెలువడుతున్నాయి. అవి రాజ్యమంతటా మండల, విషయ, నాడు, స్థల, గ్రామ పాలకవర్గాలకు ఆదేశాలుగా వెళుతున్నాయి. ఇప్పుడు ధనంతో సంబంధంలేని ప్రజాప్రయోజన విధానాల ప్రకటనలు విరివిగా వెలువడుతున్నాయి. ప్రజలకన్నా ముందు వివిధ స్థాయులలోని నియోగాల ఉద్యోగులు వాటిని చూసి ఆశ్చర్యపోతూ అమలు చేస్తున్నారు. అమలు చేసి తీరాలి.
ఈ విధాన ప్రకటనలలో కొన్ని ధనంతో ముడిపడినవి కూడా ఉన్నాయి. ఏడాది పన్నుల వసూళ్లలో ఆరవ వంతు రాజ కోశాగారానికి వెళుతుంది. మిగిలిన మొత్తంలో సింహభాగం గ్రామ స్వపరిపాలనకు కేటాయిస్తారు. అది వేరు వేరు స్థాయులలో ఉంటుంది. రాజ్యానికి వచ్చే పన్నుల ఆదాయంలో.. కొంత మండల పరిపాలనకు, కొంత నాడు పరిపాలనకు, కొంత స్థల పరిపాలనకు మిగిలింది గ్రామ స్వపరిపాలనకు కేటాయింపు ఉంటుంది. ఇప్పుడు కాకతీయరాజ్యంలో ప్రకటించిన విధానాలకు సొమ్ముకావాలంటే అది పూర్తిగా రాజ్య భండాగారం నుంచే మహారాజుగారి అనుమతితో మహాప్రధాని నియోగం నుంచి ఖర్చు చేస్తారు. చాలకుంటే రాజుగారి కోశాగారం నుంచి కూడా తీసుకోవడానికి ఆయన అంగీకరిస్తున్నారు. వాటి ప్రయోజనాలు మొత్తం సమాజానికి అందుతున్నాయి. ప్రజలు కూడా ఇది కదా మహారాజులు చేయాల్సినది అని చెప్పుకుంటున్నారు.
ళి ళి ళి
మందమాగలహళ్లి..
వాయవ్యంగా కాకతీయ రాజ్యం, హోయసల రాజ్యం, దేవగిరి రాజ్యం.. మూడు రాజ్యాల సరిహద్దు వద్ద ఉన్న గ్రామం ఇది.
ఇంకా ఏమాత్రం తెల్లవారలేదు. పిసరంత వెలుతురు కూడా లేదు. రాత్రి ఓ వెలుగు వెలిగిన చందమామ వెళ్లి పోతున్నవేళ అరకొరగా మిగిలిన చిరు మసక వెలుగు..
ఆ సమయానికే గ్రామం లేచిపోయింది. చావిళ్లలో కదలాడుతున్న ఆవులు, గేదెలు వేసిన పెంటను కుండల్లోకి ఎత్తి దాంట్లో నీళ్లు కలిపి కళ్లాపు చల్లుతున్నారు అమ్మలక్కలు. పొలాలకు కదులుతున్న రైతుల అదిలింపులు, ఎడ్ల మెడలలోని పట్టెడ మువ్వల ఘల్లుఘల్లు శబ్దాలు.. రైతుల పలకరింపుల ముచ్చట్లు.. ఆవలగా అప్పటికే తెరచిన గుడి నుండి మంత్రోచ్చాటన..
అలా మొదలైంది గ్రామీణ దైనందినం.
బారెడు పొద్దెక్కాక ఊరిలో వినిపించేవి వడ్రంగుల రంపం, బాడిస.. తదితర పనిముట్టులు చేసే శబ్దాలు, మధ్య మధ్య అంబా అంటూ ఆవుదూడల అరుపులు, కుక్కలు, కోళ్లు గుర్రాలు, గాడిదలు, అప్పుడప్పుడు ఎడ్ల బళ్ల గరగరలు.. రైతుల అదిలింపులు..
ఊరి బాటలపై ఎవరెవరో తిరుగాడుతున్నారు. రైతు సాంఖలప్ప ఇల్లు ఎక్కడ అని ఎవరో వాకబు చేస్తున్నారు. చెప్పకపోగా తమరెవరు అని ఎదురు ప్రశ్న. ‘వాళ్ల అమ్మాయి పెళ్లికున్నదని విని సంబంధం తెచ్చాను’ అన్నాడా ఆగంతకుడు. ఒహోహో పెళ్లిళ్ల పేరయ్యవన్నమాట. అదిగో అటు ముందుకెళ్లి కుడివైపు తిరిగితే మూడో ఇల్లు.. అంటూ ఒకరు దోవ చూపారు.
ఆయా రుతువులకు తగిన ఆయా పంటలు పండి ధాన్యం ఇంటికి చేరుతున్న చక్కని గ్రామం. అదే వాతావరణం కొరవి రాజ్యంలో.. ఇదే పరిస్థితి వెలనాడు రాజ్యంలో.. ఇదే పరిస్థితి అద్దంకి రాజ్యంలో..
కాకతీయరాజ్యం, దాని సామంతుల రాజ్యాలన్నీ ఓ నిబ్బరమైన.. నిత్యమూ ఎలాంటి వొడుదొడుకులు లేని.. జీవనసౌఖ్యాన్ని అనుభవిస్తున్నాయి.
పగలు రెండవ జాము మొదలయ్యేవేళ గ్రామ మంతా వినపడేలా ఓ మహిళ స్వరం దిక్కులు పిక్కటిల్లేలా వినపడింది. ఆమె గైకమ.. భర్త యుద్ధంలో చనిపోతే పుట్టింటికి వెళ్లింది. అక్కడ వాళ్లు అంగీకరించకపోవడంతో వ్యభిచారిగా ఎక్కడో జీవిస్తోందని ఊరి వారికి తెలిసిన సమాచారం. అలాంటి గైకమ నెత్తిన ఓ మూటతో ఏదో అమ్ముతా నంటూ ఊర్లోకి ప్రవేశించింది.
‘‘అమ్మా.. ఆకులు.. తమలపాకులండి.. వక్కలండి.. సున్నమండి.. దీనికోసం సంత వరకూ ఆగక్కరలేదండి.’’
ఈ మాటలు చెవిన పడగానే మొత్తం గ్రామం గ్రామమే సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యింది. అందరూ వీధుల్లోకి వచ్చి కళ్లు ఇంతింత చేసుకుని చూడసాగారు.
ఇలా ఊళ్లో.. వీధుల వెంట తిరుగుతూ వస్తువులు అమ్మడం ఏవిటి..
అంతవరకూ వస్తువులన్నీ సంతల్లో మాత్రమే కొనుక్కునేవారు. ఇలా గ్రామంలోకి.. ఇంటింటికీ వచ్చి అమ్మడం వారికి పూర్తిగా కొత్త.. ఊహాతీతమైన అంశం.
అలా కాకతీయరాజ్యంలో ఓ విప్లవాత్మక విధానాన్ని గణపతిదేవుడు ప్రవేశపెట్టాడు.
ఈ కొత్త విధానం రాజ్యమంతటా కాకతాళీ యంగా మొదలుకాలేదు. దీని వెనుక చాలా పెద్ద తతంగం జరిగింది.
ళి ళి ళి
మిథి•లానగరం. అయోధ్యరాజ్యపు రాజధాని నగరం.
రాజప్రాసాదాన్ని తలదన్నే భవనంలో చప్పన్న (56) రాజ్యాల వణిజశ్రేణుల పెద్దలంతా సమావేశమయ్యారు.
కోట్ల కోట్లకు పడగలెత్తిన ఆ ప్రపంచ ఐశ్వర్య వంతులంతా ఒక్కచోట చేరేసరికి ఆ భవనమే కాదు ఆ నగరమే వెలుగుజిలుగులతో మెరిసిపోతోంది.
మహానాడు..
ఆ నగరంలో మహానాడు వార్షిక సమావేశం జరుగుతోంది. మహానాడు అంటే చప్పన్న రాజ్యాల లోని వణిజ శ్రేణుల సమావేశం. చప్పన్న దేశాలు అంటే 56 రాజ్యాలు. అంగ, వంగ, కళింగ, కశ్మీర, కాంభోజ, కేదార, కల్హార, కళ్యాణ, వేంగీ, కుంతల, కాకతీయ, చేర, కైకేయ, కదంబ, హుణ, గౌహతి, గౌడ, ఫ్రిండ, గాంధార, కురు, పాంచాల, నేపాల. భూపాల, అయోధ్య, విదేహ, విదర్భ, బాహ్లిక, హోయసల, పాటలీపుత్ర, ఘూర్జర, బృహద్రధ, త్రిగర్ధ, మహారాష్ట్రం, మధ్యరాష్ట్ర, కొణిదెన, కొంకణ, మగధ, మాళవ, రాజస్థాని, అవంతి, యవన, విక్రమ సింహపురి, బార్బర, చేది, చోళ, పాండ్య, ఉజ్జయిని, హుణ, మంగి, వేంగి, బిజ్జల, సౌరాష్ట్ర, సింహళ, తుండి, ఉత్కళ, దశార్ధవ..
ఈ రాజ్యాల మధ్య వాణిజ్య శ్రేణి చాలా బలంగా ఉంది. ఉత్తరావర్త రాజ్యాలలో ఎక్కువ శ్రేణులు స్వదేశీ వాణిజ్యంలో బలంగా ఉండే దక్షిణాపథం, దక్షిణావర్త రాజ్యాలు స్వదేశీ, పరదేశీ వాణిజ్యంలో కూడా అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. అలాగే నేపాళశీ, సింహళ రాజ్యాలు, సువర్ణభూమి, మలయా.. తదితర అఖండ భారతం లోని దేశాలు అనేకానేక వస్తువుల కోసం ఈ సింధుభూమిలోని అంతర రాజ్యాలపై ఆధారపడి ఉన్నాయి.
ఏడాదికోకమారు ఈ చప్పన రాజ్యాల వణిజ్యశ్రేణులన్నీ సమావేశమౌతాయి.
దానినే మహానాడు అంటారు.
ఈ మహానాడులో పృధ్వీశెట్టిని ఎన్నుకుంటారు. అతను అఖండభారత వాణిజ్యానికి రారాజు. కిరీటం మాత్రం ఉండదు.. అంతే. అతని మాటకు మహా రాజులే కాదు చక్రవర్తులు కూడా తలవొగ్గవలసిందే. ఎందుకంటే అతడు మహారాజులకే సొమ్ములు అప్పు ఇవ్వగలడు. మహారాజులకు యుద్ధ సమయానికి అవసరమైన మిత్ర సైన్యాన్ని అతడే సమకూరుస్తాడు. అంతేకాదు యుద్ధాలకు ముఖ్యమైన ఆయుధ సంపత్తి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో.. ఏమేమి ఎలా ఎలా సమీకరించాలో అతనికే తెలుసు. అతని వల్లనే యుద్ధం సాధ్య పడుతుంది. యుద్ధంలో గెలుపోట ములు అతని వల్లనే నిర్ణయమౌతాయి కూడా.
గణపతిదేవుడు ఈసారి కూడా తన మిత్రుడు అంకాలసెట్టిని పృధ్వీశెట్టిని చేయడానికి విశ్వప్రయత్నం చేశాడు. విజయవంతమయ్యాడు. చప్పన్నదేశాల మహారాజులతో స్నేహ సంబంధాలు నెరపాడు. అన్ని రాజ్యాలకు తన సంధివిగ్రహీలను పంపాడు. సహజంగా గొప్ప బలిష్టమైన రాజ్యంలోని వణిజశ్రేణులను చప్పన్నరాజ్యాల పెద్దలు గౌరవిస్తారు.
ఒక రాజ్యాన్ని.. ఆ రాజ్యపు వణిజ శ్రేణులను గౌరవించడానికి ఒకే ఒక కారణం ఆ రాజ్యం అన్నపూర్ణ కావడం. ఆ రాజ్యంలో పండే పంట, దాని విస్తీర్ణం, ఆ రాజ్యపు విదేశీ వాణిజ్యం, గొప్ప పంటలు, గొప్ప వాణిజ్యం ఉన్న రాజ్యం చప్పన రాజ్యాలలో గొప్ప గౌరవాన్ని పొందుతుంది.
అలాంటి రాజ్యాలలో కాకతీయ రాజ్యం ఒకటి.
వెలనాడు తదితర ధాన్య రాజ్యాలు కలిశాక కాకతీయ రాజ్యం అఖండ భారతంలోనే గొప్ప రాజ్యాలలో ఒకటిగా గుర్తింపు పొందుతోంది. అందుకే కాకతీయ మహారాజు పనికట్టుకుని మరీ కోరుతున్నట్లు అన్నిరాజ్యాల వాణిజ్య శ్రేణి సభ్యులు ఆ రాజ్యపు సమయశెట్టి అంకాలసెట్టిని ఈ ఏడాది మహానాడులో పృధ్వీశెట్టిగా ఎన్నుకున్నారు. అంటే అంకాల గణపతిదేవుని అండదండలతో.. మరోమారు పృధ్వీశెట్టినిగా ఎంపిక అయ్యాడు.
అయోధ్య నుండి తిరిగి వచ్చాక అనుమకొండ రాజప్రాసాదంలో పృధ్వీశెట్ట్టి అంకాలసెట్టికి గొప్ప సత్కారం చేశాడు గణపతిదేవుడు.
‘‘మిత్రమా అంకాలా.. నువ్విప్పుడు రెండవమారు పృధ్వీశెట్టివి. నా విన్నపం ఏవిటంటే మన కాకతీయ రాజ్యం లోని వాణిజ్యాన్ని క్రమబద్ధీకరించాలి. ఇక్కడే కాదు మన మహాసామంత, సామంత రాజ్యా లన్నిటా.. అంటే తెలుగు రాజ్యాలన్నిటా.. అన్ని వస్తువుల ధరలు ఒక్కటిగా ఉండాలి. ఈ చివర దేవగిరి హద్దుల్లో ఉన్న గ్రామంలోనూ.. ఆ చివర విక్రమసింహపురి రాజ్యహద్దులోని గ్రామంలోనూ ఓ వస్తువు ధర.. ఉదాహరణకు ఓ కోక ఖరీదు మాత్రమే కాదు ఓ తమలపాకు, ఓ వక్క ధర కూడా ఒక్కటిగానే ఉండాలి. ఇది నా ఆజ్ఞ లేదా విన్నపం. లేదా సలహా. ఏ రూపంలో తీసుకున్నా ఇది జరిగి తీరాలి.’’
వినమ్రంగా తలవాల్చి అంగీకరించాడు అంకాల.
‘‘నా కోసం మీ సమస్త శక్తులు ఒడ్డి నన్ను రెండవసారి పృధ్వీశెట్టిని చేశారు మహారాజా! మన రాజ్యలన్నిటా అన్ని తెలుగు రాజ్యాలలో, ప్రాంతాలలో వాణిజ్యాన్ని నియంత్రించి ప్రజలకు అన్ని వస్తువులు సరసమైన ధరలకు అందేలా చర్యలు తీసుకుంటాను.’’
సభికులంతా ఘోల్లు ఘోల్లున నవ్వారు.
జరిగిన కథ:
‘‘సరసమైన ధర..’’
‘‘ధరల్లో సరసం ఏవిటో..’’
‘‘సరసం భలే వాడాడు మన శెట్టి..’’
ఇలా నవ్వులే నవ్వులు. కాని ఆ రోజు నుండి తెలుగురాజ్యాలలో వాణిజ్య విధానాలు మారి పోయాయి. తెలుగు రాజ్యాల్లో ఎక్కడైనా ఓ వస్తువుకు ఒకే ధర.. అది కూడా సరసమైన ధర. ధర వింటే ఎవ్వరికి కోపం రాదు. సరసంగా అనిపిస్తుంది.
ఒకప్పుడు కేవలం సంతల్లోనే వస్తువులు దొరికేవి. అక్కడే కొనుగోలు చేయాలి. ఇప్పుడు పురాలలో, నగరాలలో, పట్టణాలలో ఎల్లప్పుడూ తెరచి ఉండే దుకాణాలు వెలిశాయి. అవి సహజంగా ప్రజల అవసరాలను బాటు వైశ్యులు ఏర్పాటు చేశారు. పుర ప్రజలకు ఎల్లప్పుడూ దినసరి వస్తువులు అందు బాటులో ఉండటానికి వైశ్యు లు ఈ మఠియలను, అంగళ్ళను, కొట్లను, దుకాణాలకు నిర్వహిస్తున్నారు.
అంకాల పృధ్వీశెట్టి అయ్యాక పురాలలో లాగానే పెద్ద గ్రామాలలో కూడా దుకాణాలు ఉండాలని భావించి పెద్ద గ్రామాలలో కూడా దుకాణాలను ఏర్పాటు చేయించాడు.
అదే సమయంలో గణపతిదేవుని పాలనా యంత్రాంగం ఓ కొత్త విధానాన్ని ప్రకటించింది.
‘‘గ్రామాలలో, పురాలలో, పట్టణాలలో.. ఇంటింటికీ తిరిగి వస్తువులను అమ్మకునే వెసులు బాటు కల్పిస్తున్నాం. ఆసక్తి, అవసరం ఉన్నవారు నిత్యావసర వస్తువులు మోసుకుంటూ ఇంటింటికీ తిరిగి అమ్మవచ్చు. అలా అమ్ముకోవడం జీవనోపాధిగా చేసుకోవడానికి ఆసక్తి ఉన్నవారికి వణిజశ్రేణులు సహకరించాలి. వారికి సరుకులు ఇచ్చి అమ్మిన తర్వాత సొమ్ము వసూలు చేసుకోవాలి. మహిళలకు.. ముఖ్యంగా ఒంటరి మహిళలకు ఈ విధానం బాగా ఉపయోగ పడుతుంది. భర్త యుద్ధంలోనో.. ఆరోగ్యరీత్యానో మరణిస్తే ఆమెను అమ్మకందా రుగా ప్రోత్సహించాలి. వీరికి గ్రామాధికారుల నుండి మండలేశ్వరుల వరకూ అన్ని స్థాయులలోని నియోగులు సహకరించాలి. ఇది కాకతీయ ప్రభుత్వ ఉత్తర్వు. అమలు చేయనివారు శిక్షార్హులు..’’
అది కాకతీయరాజ్యమంతటా కలకలం సృష్టించింది.
కూరగాయలు, ఆకులు, వక్కలు అమ్మకాలతో మహిళలు గ్రామగ్రామాన అమ్మడంతో మొదలైన ఈ కొత్త అమ్మక విధానం అనతికాలంలోనే కార్చిచ్చులా అనేక వస్తువులకు విస్తరించింది. నిత్యమూ ఈ అమ్మకందారుల కేకలతో గ్రామాలకు గ్రామాలే మార్మోగుతున్నాయి.
‘‘ఉప్పు అండి.. ఉప్పో..’’
‘‘నూనె బాబూ నూనె అమ్మా.. కొబ్బరినూనె, ఆముదం, పల్లినూనె.. సంతకు వెళ్ళనవసరం లేదు. మీ ఇంటి ముందుకు వచ్చింది.. రావాలి.. రావాలి.. కొనాలి .. కొనాలి..’’
(సశేషం)


మత్తి భానుమూర్తి

About Author

By editor

Twitter
YOUTUBE