– విజయవాడలో డాక్టర్ మోహన్ భాగవత్

విజ్ఞానశాస్త్రం, ధర్మశాస్త్రాల మధ్య విభేదాలు లేవు; రెండింటినీ సమన్వయం చేసుకుని మూఢనమ్మకాలను వదిలేయాలి. భారత్ విశ్వగురువుగా ఉద్భవించాలంటే ఇలాంటి సమన్వయం, ఐక్యత అవసరం అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరఎసఎస్) సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్ అన్నారు.

సంస్థ గురించి బయట జరిగే ప్రచారాన్ని నమ్మవద్దని, సంస్థను సందర్శించి, దాని పనితీరును ప్రత్యక్షంగా అనుభవించి, స్వంత అవగాహనను ఏర్పరచుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆరఎసఎస్ శతాబ్ది వేడుకల్లో భాగంగా జనవరి 29,30 తేదీలలో విజయవాడ, నేషనల్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ క్యాంపస్‌లో ‘భవిష్యత్ భారతదేశ దృక్పథం, దిశ’ పేరిట జరిగిన కార్యక్ర మంలో సంస్థ తత్త్వం, పనితీరు, భవిష్యత్తు కోసం దార్శనికతను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మొదటి రోజున ఆహ్వానితులతో సంభాషించారు. వారి ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఆరఎసఎస్‌పై అపోహలను స్పష్టం చేసి, వాటిని దూరం చేయడానికి ప్రయత్నించారు.

ఆరఎసఎస్‌తో మరే ఇతర సంస్థకు పోలిక లేదని, సంస్థ కొనసాగిస్తున్న కార్యక్రమాలు అత్యంత విస్తారమైనవని అందుకే చాలా మందికి, కడకు ఆరఎసఎస్‌లో చాలా కాలంగా పనిచేస్తున్నవారికి కూడా ఆరఎసఎస్ గురించి తెలుసుకోవలసినది ఇంకా మిగిలి ఉంటుందని మోహన్ భాగవత్ అన్నారు. ఈ సందర్భంగా ఆరఎసఎస్ ద్వితీయ సర్‌సంఘ్‌చాలక్ పరమపూజనీయ గురూజీ మాటను ప్రస్తావించారు. 15 సంవత్సరాలుగా సర్‌సంఘ్ చాలక్‌గా పనిచేస్తున్నప్పటికీ ఆరఎసఎస్ గురించి తనకు తెలిసింది చాలా తక్కువ అని వారు ఒకానొక సందర్భంలో అన్నారని మోహన్ భాగవత్ తెలిపారు. ఏదైనా విషయానికి సంబంధించి కేవలం ప్రసంగాలు విన్నంత మాత్రాన, పుస్తకాలు చదివినంత మాత్రాన నిజ అనుభవం సాక్షాత్కారం కాదని, ఇది ఆరఎసఎస్‌కు కూడా వర్తిస్తుందన్నారు.

ఆరఎసఎస్ కేవలం ఒక సంస్థ కాదని, ఒక జీవన విధానమని భాగవత్ అన్నారు. దాని మూలాలను గుర్తుచేసుకుంటూ, హిందూ సమాజాన్ని ఏకం చేసే లక్ష్యంతో 1925లో విజయదశమి నాడు డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గెవార్ ఆరఎసఎస్‌ను స్థాపించారని అన్నారు. ఆరఎసఎస్ ఏ వ్యక్తి, సమాజం లేదా పరిస్థితులకు వ్యతిరేకంగా, ఎవరి తోనో పోటీపడటానికి ఏర్పడలేదని, రాజకీయ అధికారం కోసం ఆవిర్భవించలేదని స్పష్టం చేశారు. మాకు(ఆరఎసఎస్) అధికారం, పేరు, ప్రతిష్ఠలు లాంటివి ఏమీ అక్కరలేదని తేల్చిచెప్పారు. వాటి వెంట తాము పరుగులు తీసేదీ లేదని తెలిపారు.  “సమాజ సంక్షేమం కోసం పనిచేసే నిస్వార్థ వ్యక్తులను సృష్టించడం ఆరఎసఎస్ లక్ష్యం” అని తెలిపారు.

హిందూ ధర్మ భావనను వివరిస్తూ, హిందూ అనేది ఒక మతం కాదని, వైవిధ్యాన్ని స్వీకరించే, అన్ని రకాల ఆరాధనలను గౌరవించే సాంస్కృతిక లక్షణం అని అన్నారు. భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరూ సాంస్కృతికంగా హిందువులేనని స్పష్టం చేశారు. బీజేపీ, వీహెచ్‌పీ వంటి సంస్థలు స్వతం త్రంగా పనిచేస్తాయని, అవి ఆరఎసఎస్ నియంత్ర ణలో లేవని కూడా స్పష్టం చేశారు.

ప్రతిరోజూ ఒక గంటసేపు జరిగే ఆరఎసఎస్ శాఖలు వివిధ కులాలు, ప్రాంతాలు, మతాల ప్రజలను ఒకచోట చేర్చి, క్రమశిక్షణ, దేశభక్తి, ఐక్యతను పెంపొందిస్తాయని  భాగవత్ తెలిపారు. ఆరఎసఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించ నున్నట్లు తెలిపారు.

దశాబ్దాలుగా ఆరఎసఎస్ ఎదుర్కొంటున్న విమర్శలను ప్రస్తావిస్తూ, దాదాపు 70 సంవత్సరాలుగా సంస్థ వ్యతిరేకతను, దుష్ప్రచారాన్ని భరించిందని అన్నారు. ఆరఎసఎస్ ముస్లింలకు లేదా మైనారిటీలకు వ్యతిరేకం కాదని, సమాజం, దేశం అభ్యున్నతి కోసం పనిచేస్తుందని పునరుద్ఘాటించారు.

1857 తొలి స్వరాజ్య పోరాటంలో భారతదేశం ఓడిపోవడాన్ని ప్రస్తావిస్తూ; ‘ఆ పోరాటంలో మనం ఎందుకు ఓడిపోయాం? అని ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టారు. మనకు ఏం తక్కువ? ధైర్య, సాహసాలతో మూర్తీభవించిన  వీరసైనికులకు లోటు లేదు. ధన,ధాన్యాలు పుష్కలంగా ఉన్నాయి.  వనరులు కావలసినన్ని ఉన్నాయి. ఆర్థికంగానూ, ఆధ్యాత్మికం గానూ నిండుగా ఉన్నాం. ఐనా  మనకు ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తులు, మనతో ఏ మాత్రం సరితూగని గుప్పెడు మంది పరాయి దేశాల నుంచి వచ్చి మన దేశంలోకి చొరబడ్డారు. మనపై విజయం సాధించారని భారతీయులు పరిపరి విధాలుగా కలతచెందారు. ఇదేదో ఒకసారో రెండు సార్లో జరిగింది కాదు లెక్కలేనన్ని సార్లు జరిగింది (విదేశీ చొరబాట్లు, వారి గెలుపు). అలా దురాక్రమణతో గెలిచినవారు భారత్‌పైన ఇస్లాంను రుద్దారు’ అని మోహన్ భాగవత్ తెలిపారు. ఇలా ఎందుకు జరిగింది? అని భారతీయుల్లో అనేకులు ఆత్మపరిశీలన చేసుకున్నారు. చివరకు భారతీయులకు అన్నీ ఉన్నప్పటికీ ఐక్యత లేకపోవడం భారత్‌పై సంఖ్యా బలం లేని విదేశీయుల దండయాత్ర, దురాక్రమణ, విజయాలకు దారితీసిందనే ముగింపునకు వచ్చారని  తెలిపారు. ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా జరిగిన స్వరాజ్య ఉద్యమం సందర్భంగా భారతీయుల్లో వ్యక్తి నిర్మాణం కోసం సంస్కరణలకు మహాత్మా గాంధీ నడుం బిగించారని చెప్పారు. అనేక మంది ఆయన బాటలో నడిచారు. అయితే స్వరాజ్యం సిద్ధించిన తర్వాత అలాంటి సంస్కరణవాదులంతా స్వప్రయోజనాలకు అంకితమై పోయారని అన్నారు. అయినప్పటికీ వ్యక్తి నిర్మాణం దిశగా సంస్కరణలు నేటికీ కొనసాగుతున్నాయని తెలిపారు. స్వామి వివేకానంద,  అరబిందో స్ఫూర్తిగా భారతీయ మూలాలకు చేరుకోవడంద్వారా ప్రతీ ఒక్కరు అంతర్గతంగా జాగృతమై బయటి ప్రపంచాన్ని మేల్కొలపాలని సభికులకు సర్‌సంఘ్‌చాలక్ పిలుపునిచ్చారు. ఆ క్రమంలో ప్రజల్లో అజ్ఞానాంధ కారాన్ని తొలగించాలని, సమాజంలో అసమానత లను, పేదరికాన్ని రూపుమాపడానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

డాక్టర్ హెడ్గెవార్ జీవితం గురించి కూడా మాట్లాడారు. ఆయన దేశభక్తి, త్యాగం, సామాజిక ఐక్యత పట్ల నిబద్ధతను ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఆరఎసఎస్ వ్యవస్థాపకులు జన్మతః దేశభక్తులు. వారు మూడవ తరగతి చదువుతున్నప్పుడు విక్టోరియా మహారాణి పట్టాభిషేకం వజ్రోత్సవాలు జరిగాయి. ఆ సందర్భంగా పాఠశాలలో మిఠాయిలు పంచి పెట్టారు. డాక్టర్‌జీ వాటిని చెత్తబుట్టలో పారేశారు. అదేంటి అలా చేశావు? అని తోటి విద్యార్థులు ప్రశ్నించారు. అందుకు సమాధానంగా ఇది మన వేడుక కాదు. ఎవరైతే మనల్ని బానిసలుగా చూస్తున్నారో వారు వేడుక చేసుకుంటున్నారు. వారి వేడుక మనకు విషాదంతో సమానం. అలాగేవారు పంచిపెట్టిన మిఠాయిలు మనకు విషంతో సమానం అని బదులిచ్చారు. అలాంటి ఒక దేశభక్తితో కూడిన జ్వాలను  అంతటి చిరుప్రాయంలోనే డాక్టర్‌జీ తనలో ఇముడ్చుకున్నారని తెలిపారు.

దేశంపై విదేశీ దురాక్రమణలను ప్రస్తావిస్తూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ రాజ్యాం గాన్ని సమర్పించే సమయంలో రెండు పర్యాయాలు ప్రసంగించారని ఆరఎసఎస్ సర్‌సంఘ్‌చాలక్ తెలిపారు. విదేశీయులకు వారి స్వంత బలంతో భారత్‌ను జయించే తాహతు లేదు, కేవలం భారత్‌లో వేర్వేరు వర్గాల మధ్య అంతర్గత విభజనలను తమ శక్తిగా మార్చుకొని వారు మన దేశాన్ని కబళించారు, అలాంటి అంతర్గత విభజనలు భారత్‌ను బలహీన పరిచాయి అని అంబేడ్కర్ వ్యాఖ్యానించారని చెప్పారు.

కానీ నేడు మనం పార్లమెంట్‌లో వేర్వేరు పక్షాలకు ప్రాతినిధ్యం వహిస్తూ  పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాం. అది ప్రజాస్వామ్యంలో సర్వ సాధారణం అని ఎవరైనా అనవచ్చు. కానీ అలాగని మనలోని ఐక్యతా భావనను విస్మరించరాదు అని మోహన్ భాగవత్ తెలిపారు. ఐక్య పోరాటంతోనే మనకు స్వరాజ్యం వచ్చింది. స్వరాజ్యం సిద్ధిస్తే భారతీయులందరూ బాగుంటారనే ఐక్యతా భావనతో అనేక మంది స్వతంత్ర సమరయోధులు అమరులై నారు. మన పెద్దలు కూడా ఐక్యంగా ఉండటం ద్వారా సమాజంలోని అన్ని రుగ్మతలను పారదోలవచ్చు అని అన్నారని సర్‌సంఘ్‌చాలక్ గుర్తు చేశారు. అందుకనే డాక్టర్‌జీ భారతీయుల్లో ఐక్యతను తీసుకురావడానికి ఎనిమిది నుంచి 10 సంవత్సరాల కాలానికి అనేకానేక ప్రయోగాలు చేశారు. ఆ ప్రయోగాలు ఆశించిన ఫలితాలను ఇచ్చిన తర్వాత వారి సన్ని హితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో విజయ దశమినాడు హిందూ సమాజం కోసం ఒక సంస్థను స్థాపిస్తున్నట్టు డాక్టర్‌జీ ప్రకటించారని చెప్పారు. సంస్థ ద్వారా మనం చేయాల్సిన పనులు ఏమిటి? అని కూడా ఉన్నవారు ప్రశ్నించినప్పుడు మనమంతా కూర్చొని మాట్లాడుకొని, సమాజంలో అనేకమందిని కలవడం ద్వారా కార్యాచరణను నిర్ణయిద్దాం అని డాక్టర్‌జీ అన్నారు. వారు చెప్పినట్టుగానే కూర్చొని మాట్లాడుకోవడం, అనేకమందిని కలిసి చర్చించిన తర్వాత ఒక విధానాన్ని డాక్టర్‌జీ ప్రకటించారు. ఆ మెథడాలజీకి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అని పేరు పెట్టారు. అయితే ప్రజలు ఆరఎసఎస్‌ను అర్థం చేసుకోవడంలో దానికి అనుబంధంగా ఉన్న వీహెచ్‌పీ, బీజేపీ, తదితర సంస్థల ఆసరా తీసుకుం టారు. వాటిల్లో స్వయంసేవకులతో పాటుగా ఇతరులు కూడా ఉంటారు. అలాగని ఆ సంస్థల ఏర్పాటులో ఆరఎసఎస్ ప్రమేయం ఏ మాత్రమూ లేదు. వాటిని స్వయంసేవకులు ఏర్పాటు చేసుకున్నారు. అవి స్వయంప్రతిపత్తితో పనిచేసుకుంటూ ముందుకు సాగుతున్నాయి. వాటిపైన ఆరఎసఎస్‌కు ఎలాంటి నియంత్రణ ఉండదు. దేనినైనా నియంత్రిం చాలనుకునేవారికి అధికారం ఉండాలి. అలా చూసినప్పుడు ఆరఎసఎస్ వద్ద ఎలాంటి అధికారం లేదు. అందుచేత నియంత్రించే అవకాశం లేదు అని మోహన్ భాగవత్ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆరఎసఎస్‌కు అనుబంధంగా అన్ని రంగాలకు సంబంధించిన సంఘాలు ఉన్నాయి. మీకు ఇష్టమైన సంఘంలో చేరి ఆరఎసఎస్ కోసం పని చేయవచ్చు. ప్రపంచంలో అతిపెద్ద స్వచ్ఛంద సేవాసంస్థగా ఆరఎసఎస్ నిలిచింది. ఆరఎసఎస్‌కు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. కొన్ని ప్రభుత్వాలు గతంలో ఆరఎసఎస్‌లో ప్రభుత్వ ఉద్యోగులు చేరకూడదని నిషేధం విధించాయి, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆరఎసఎస్ దృష్టిలో భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ హిందువే. భారతదేశ వారసత్వాన్ని, హిందుత్వాన్ని కాపాడాలంటే ఆరఎసఎస్ వంటి సంస్థతో కలసి పనిచేయడమే మార్గం అని పిలుపునిచ్చారు.

ఆ దిశగా సమాజంలో రావాల్సిన మార్పు గురించి మాట్లాడుతూ సమాజానికి ఆలోచనాశక్తి ఉండదు. నిర్ణయించే శక్తి అసలే ఉండదు. సాధారణంగా చూసినప్పుడు సమాజంలో ఎవరైనా సరే వారి పెద్దలను చూసి, తోటివారిని చూసి నడతను అలవరచుకుంటారు. అనుసరిస్తుంటారు ఆ దిశగా వ్యవహరిస్తుంటారు అని తెలిపారు. ఇందుకు ఉదాహరణగా సర్‌సంఘ్‌చాలక్ తన స్వీయ అనుభ వాన్ని వెల్లడించారు. “ఒకసారి రైల్వేస్టేషన్‌లో ఒక కూలీ నాకు తారసపడ్డాడు. అతడు ఎర్రచొక్కా వేసుకొని ఉన్నాడు. నువ్వెందుకు ఎర్ర చొక్కా వేసుకున్నావు? అని నేను అతడ్ని అడిగాను. అందుకు సమాధానంగా కూలీ సినిమాలో అమితాబ్ బచ్చన్ వేసుకున్నాడు కాబట్టి అని అతడు చెప్పాడు”  అని మోహన్ భాగవత్ తెలిపారు. ఇలాంటి గుడ్డిగా అను సరిస్తున్నవారు ఉంటున్న సమాజంలో మంచి మార్పును తీసుకురావడానికి అందుకు అనువైన వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరం ఉందన్నారు.

భాషలు, విజ్జానశాస్త్రం, మూఢనమ్మకాల గురించి మాట్లాడుతూ స్థానిక భాషలను నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం. మాతృభాషలో విద్య తప్పనిసరి. విద్య, క్రమశిక్షణ, సాధనతోనే ప్రపంచ పోటీలో నిలబడగలం. విజ్ఞానశాస్త్రం, ధర్మశాస్త్రాల మధ్య విభేదాలు లేవు; రెండింటినీ సమన్వయం చేసుకుని మూఢనమ్మకాలను వదిలేయాలి. భారత్ విశ్వగురువుగా ఉద్భవించాలంటే ఇలాంటి సమ న్వయం, ఐక్యత అవసరం అని మోహన్ భాగవత్ అభిప్రాయపడ్డారు.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE