ఒకే ప్రధాని సారథ్యంలో తొమ్మిదిసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా, అందునా మహిళా ఆర్థికమంత్రిగా రికార్డు సృష్టించి, గతంలో ఎన్నడూ లేని విధంగా ఫిబ్రవరి 1 తేదీన 2026-27-బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఆర్థిక ప్రగతికి అవసరమైన సంస్కరణలు కొనసాగింపుగా, ప్రపంచంలో బలమైన ఆర్థికశక్తిగా ఎదగాలనే లక్ష్యంతో కృషి చేస్తున్న ప్రభుత్వ ప్రయత్నాలు కొనసాగింపుగా యువశక్తి బడ్జెట్‌ను మూడు కర్తవ్య నిష్టలతో మంత్రి ప్రవేశపెట్టారు. దేశ ఆర్థిక ప్రగతిని సుస్థిరపరుస్తూ వేగవంతం చేయటం మొదటి కర్తవ్యంగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రయత్నాలు కొనసాగించటం రెండవ కర్తవ్యంగా, సమ్మిళిత అభివద్ధి సాధనలో అన్ని వర్గాల ప్రజలకు ఆర్థికవృద్ధిలో భాగస్వామ్యం కల్పించే “సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ ”(అందరితో అందరి వికాసం) లక్ష్యం మూడవ కర్తవ్యంగా ఈసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ మూడు కర్తవ్యాలకు తగిన మద్దతు లేక సహాయ వ్యవస్థలు అవసరం, వాటిలో సంస్కరణలు ప్రధానపాత్ర పోషిస్తాయి, అలాగే పటిష్టమైన అర్థ, ద్రవ్య వ్యవస్థలు అవసరం. దానివల్ల పెట్టుబడులు సేకరించి, తగు విధంగా కేటాయింపులు చేయడానికి ఉపయోగపడుతుంది. వీటికి తోడు శాస్త్ర సాంకేతికరంగ వ్యవస్థ కూడా ముఖ్యం. అందుకే ప్రభుత్వం ఈ వ్యవస్థలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, తగిన సంస్కరణలు అమలు జరుపుతూ వృద్ధిరేటును పెంచటానికి ప్రయత్నాలు చేస్తున్నది.

ఈ బడ్జెట్‌ను అంతర్జాతీయ అనిశ్చితుల నడుమ ప్రతిపాదించారు కాబట్టి, వికసిత భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ప్రయత్నాలు ఉండాలి. అదీకాక ఆర్థిక క్రమశిక్షణను పాటించాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి, ఒక రకంగా క్లిష్టమైన పనే అని చెప్పాలి. అంతర్జాతీయ అనిశ్చితుల ప్రభావం తగ్గించాలంటే దేశీయ వ్యవస్థలకు అత్యధిక ప్రాధాన్యం కల్పించాలి. దానికితోడు విదేశీ వస్తు వులు, దిగుమతులు, విదేశీ రుణాలు వంటి వాటిపై ఆధారపడటం తగ్గించాలి. అలాగే మన ఎగుమతులు పెంచుకోవటానికి, మన దేశంలో స్వదేశీ ఉత్పత్తుల నాణ్యత పెంచటానికి తగిన చర్యలు తీసుకోవాలి. వీటిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ను రూపొందించినట్టు స్పష్టమౌతున్నది. దేశీయ ఆర్థిక వ్యవస్థను పటిష్ట పరచటానికి, ఉపాధి అవకాశాలు, ఉత్పత్తి, ఉత్పాద కత, నాణ్యత, మెరుగుపరచాలంటే Ease of Doing Business మెరుగుపడాలి. అందు కోసం అనేక సంస్కరణలు అవసరం. 2025లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి చేసిన ప్రసంగానికి లోబడి 350 సంస్కరణలను అమలు జరిపినట్లు ఆర్థికమంత్రి పేర్కొన్నారు. వాటిలో జీఎస్‌టీ సంస్కరణలు, లేబర్ కోడ్ (కార్మిక చట్టాలు) వంటివి అనేకం ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వ నిబద్ధతను సూచిస్తాయి.

ఆర్థిక ప్రగతిని సుస్థిరంగా పెంచటానికి 6 ప్రధాన అంశాలలో ప్రభుత్వం మధ్యవర్తిత్వం లేదా ప్రమేయం కల్పించుకోవాలని బడ్జెట్‌లో ప్రతిపాదిం చారు. అవి: 1. ఏడు కీలక రంగాలలో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడం. 2. పారంపర్యంగా విస్తరించిన పారిశ్రామిక వాడలకు పూర్వవైభవం తేవడం, 3. మధ్య, చిన్నతరహా, సూక్ష్మ సంస్థలకు ప్రాధాన్యం, 4. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట, 5. దీర్ఘకాలిక ఇంధన భద్రత, సుస్థిరత కల్పించటం, 6. పట్టణ ఆర్థిక రీజియన్ల అభివృద్ధి. ఈ ఆరు ప్రధాన అంశాలలో సంస్కరణల ద్వారా ఆర్థిక ప్రగతిని వేగవంతం చేయటానికి ఊతమివ్వా లని బడ్జట్‌లో ప్రతిపాదించారు. మొదటగా ఏడు కీలకరంగాలలో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచటానికి బయోఫార్మా శక్తిని ఒకటిగా గుర్తించారు. మన దేశంలో వర్తమాన కాలంలో ప్రజలు మధుమేహ, రోగనిరోధకశక్తి సమస్యలు, కాన్సర్ వంటి వ్యాధుల చికిత్స ఖర్చు పెరిగిపోతుండటంతో ప్రజలు ప్రత్యా మ్నాయ ఔషధాల వైపు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రోగనివారణకు, చికిత్సకు, దీర్ఘాయువుకు మూలికా ఔషధాలు మంచివనే భావన పెరుగుతున్నది. ఈ ఔషధాలు మంచి గుణమిస్తున్నాయని గుర్తిస్తే ప్రపంచ వ్యాప్తంగా వీటికి మంచి మార్కెట్ పెరిగే అవకాశ ముంది కాబట్టి, రూ.10వేల కోట్లతో వచ్చే 5 సంవత్సరాలలో ఈ రంగంలో ఉత్పత్తులు ప్రపంచ స్థాయి నాణ్యాలతో సరసమైన ధరకు అందించగలిగేలా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఒక పథకాన్ని ప్రవేశ పెట్టారు. అలాగే ఈ రంగంలోని ఔషధ పరిశ్రమల, అవసరాలకు తగిన నైపుణ్యం గల శ్రామిక శక్తిని సమకూర్చటంతోపాటు బలమైన పరిశోధనా వ్యవస్థను పెంచటానికి 3 నూతన NIPER లను ఏర్పాటు చేయటంతోపాటు ఇప్పటికే పనిచేస్తున్న 7 NIPER స్థాయిని పెంచుతామని ప్రకటించారు. మౌలిక ఔషధాల పరిశోధనలు వేగవంతమై అవి నాణ్యతా పరమైన ప్రామాణిక పరీక్షలు దాటటంతోపాటు నూతన ఔషధాలు, చికిత్స పద్ధతులు సురక్షితమైనవి, ప్రభావవంతమైనవని తేల్చటానికి దేశంలో వెయ్యి క్లినికల్ ట్రయల్స్ ప్రదేశాలను ఏర్పాటు చేయనున్నారు.

ఇక ప్రాధాన్యతాపరంగా సంస్కరణలు వేగవంతం చేయడానికి గుర్తించిన మరో రంగం సెమీ కండక్టర్ల రంగం. దీనికోసం ISవీ-2 అనే నూతన విధానాన్ని త్వరలో అమలు జరపడం ద్వారా, పూర్తిస్థాయి భారతీయ పరిజ్ఞానంతో రూపొందించిన సెమి కండక్టర్స్ ఉత్పత్తిని పెంచాలని ప్రభుత్వం కృషిచేస్తుంది. గత సంవత్సరం రూ. 22,919 కోట్ల పెట్టుబడితో ప్రారంభించిన ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి పథక లక్ష్యాన్ని రెట్టింపు చేస్తూ పెట్టుబడిని కూడా రూ.40వేల కోట్లకు పెంచారు. మన దీర్ఘకాల ఇంధన భద్రతకు ఉపయోగపడుతూ, సాంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి పెంచే క్రమంలో అరుదైన ఖనిజ శుద్ధి ప్రక్రియ సామర్థ్యం పెంచటంతోపాటు అరుదైన ఖనిజాలలో తయారయ్యే మాగ్నెట్ల ఉత్పత్తికి గత నవంబర్‌లో (2025) ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. దాని కొనసాగింపుగా ఇటువంటి ఖనిజ నిక్షేపాలున్న రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ, ఆ ఖనిజాల మైనింగ్‌కు, శుద్ధి ప్రక్రియకు, పరిశోధనకు, వాటిని ఉపయోగించి చేసే ఉత్పత్తులకు ఊతమిచ్చేట్టు 4 రాష్ట్రాలలో ఒక రేర్ ఎర్త్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.

ఖనిజవనరులు కలిగిన ఈ నాలుగు రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందించేలా చర్యలు తీసుకోనున్నారు. అలాగే రసాయన ఉత్పత్తుల విషయంలో దిగుమతులపై ఆధారపడడం తగ్గించి స్వావలంబన సాధించే దిశలో రసాయన ఉత్పత్తి పార్కులను రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఏర్పాటు చేయనున్నారు. అలాగే, మన దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువుల ఉత్పాదకత, నాణ్యత పెంచటానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం అవసరమైన యంత్రాల ఉత్పత్తిని కూడా మన దేశంలోనే చేయడానికి అవసరమైన ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. మౌలిక సదుపాయాల కల్పన రంగంలో అవసరమైన షిప్ కంటైనర్లను కూడా మన దేశంలోకి ఉత్పత్తి చేయడానికి రూ.10వేల కోట్లతో ఒక పథకాన్ని ప్రకటించారు. జౌళి రంగం అభివృద్ధికి 5 సూత్రాలతో ప్రత్యేక కార్యక్రమాన్ని అమలుచేస్తారు. ఉద్యోగ (ఉపాధి)కల్పనే లక్ష్యంగా మెగా టెక్స్‌టైల్ పార్కులను కూడా ఏర్పాటు చేయనున్నారు. మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్‌లో భాగంగా చేనేత, ఖాదీ, చేతివృత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో గుర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తారు. ఒక జిల్లాలో ఒక్కో రకం ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ, అందుకు అవసర మైన నైపుణ్య శిక్షణ, ఉత్పత్తులలో నాణ్యతా ప్రమాణాలు పాటించే విధంగా పథకాన్ని అమలు చేస్తారు. వారసత్వ పారిశ్రామిక క్లస్టర్లు మన పారిశ్రామిక ప్రగతికి ఎంతగానో దోహదపడి చాలామందికి ఉపాధి అవకాశాలు కల్పించాయి. అయితే కాలక్రమంలో అనేక కారణాలవల్ల అవి ప్రాభవం కోల్పోయాయి. వాటిని పునరుద్ధరించడానికి ప్రత్యేక కార్యాచరణ అమలుచేయనున్నారు. అలాగే అంతర్గత జలమార్గాల అభివృద్ధిని కొనసాగించటం, తూర్పు నుంచి పడమర అంటే ఈశాన్య రాష్ట్రాల నుంచి గుజరాత్‌వరకు మార్గాన్ని మెరుగుపరచటం వంటి అనేక కార్యక్రమాల ద్వారా అభివృద్ధి బాటను సుగమం చేసే ప్రయత్నం చేశారు.

గత కొన్ని సంవత్సరాలుగా అనుసరిస్తున్న విధానానికి కొనసాగింపుగా ఈ సంవత్సరం కూడా పెట్టుబడి వ్యయాన్ని పెంచారు. రూ.12 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి వ్యయానికి కేటాయింపులు చేయడం మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను సూచిస్తుంది. ప్రస్తుత పరిస్థితులలో రక్షణ రంగంపై తగినంత ఖర్చు చేయాల్సిన అవసరాన్ని గుర్తించి, ఈ రంగానికి 5.94 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే రక్షణ రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు ప్రోత్సాహాన్ని కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం స్వదేశీ అనే పదాన్ని వాడనప్పటికి విధానాల అమలులో ముఖ్యంగా దిగుమతులపై ఆధారపడటం తగ్గించే ప్రయత్నం చేయటం, వివిధ రంగాలలో స్వావలంబన సాధించాలనే ప్రయత్నం, తయారీ రంగాన్ని తగువిధంగా సంస్కరించి దేశీయ ఉత్పత్తులను పెంచి తద్వారా సంపద సృష్టించటంతోపాటు ఉపాధి అవకాశాలను మెరుగుపరచటం, వీలైనంతవరకు భారతీయ సంప్రదాయ, సంస్కృతులకు ప్రోత్సాహకాలు ఇవ్వటం వంటి అంశాలను పరిశీలించినప్పుడు స్వదేశీ విధానాలను అమలు జరుపుతున్నట్టు అనిపిస్తుంది.

గత కొన్ని సంవత్సరాలుగా అమలు జరిపిన సంస్కరణల ఫలితంగా దేశంలో బ్యాంకింగ్ రంగం తిరిగి గాడిన పడింది. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ సేవలు పటిష్టంగా ప్రజలకి అందించడానికి, రుణ సౌకర్యాలను మెరుగైన విధంగా అందిస్తూ బ్యాంకులు లాభదాయకంగా ఎదగడానికి తగిన సూచనలు చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీ నియమిస్తున్నట్టు ప్రకటించారు. అంతర్జాతీయ ఒడిదుడుకులు, అనిశ్చితుల నడుమ బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పటికి కస్టమ్స్ విధానంలో అవసరమైన మార్పులు చేయడానికి వెనుకాడలేదు. ఈ సంవత్సరం నుంచి నూతన ఆదాయపు పన్ను చట్టం అమలు జరుపుతున్నందున, గత సంవత్సరమే మధ్య తరగతి ఆదాయ వర్గాలకు ఆదాయపు పన్నుల భారీ ఊరటనిచ్చినందున, ప్రభుత్వ అవసరాలకు తగిన ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి కాబోలు వ్యక్తిగత ఆదాయపు పన్ను విషయంలో ఎటువంటి మార్పులు ప్రతిపాదించలేదు. కొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నా, ఆయా రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీలు, తాయిలాలు ప్రకటించకుండా ఆర్థిక క్రమశిక్షణను పాటించే దిశగా బడ్జెట్‌ను రూపొందించారు. క్రమంగా మన ద్రవ్యలోటును తగ్గించటంలో తమ నిర్ణయాత్మక శక్తిని చాటుకున్నారు. కొవిడ్ అనంతరం, అంత త్వరగా మామూలు (సాధారణ) స్థితికి వచ్చిన దేశాలలో మన దేశం ఒకటి. కొవిడ్ సమయంలో దాదాపు 9 శాతానికి చేరిన ద్రవ్యలోటును 4.3 శాతానికి తగ్గించటం ఆర్థిక క్రమశిక్షణకు ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యతను సూచిస్తుంది. గత దశాబ్దకాలంలో ఖర్చులు గణనీయంగా పెరుగుతున్నప్పటికి రాష్ట్రాలకు బదిలీ చేసే కేటాయింపులను 150 శాతానికి పైగా పెంచటం ద్వారా సమాఖ్య స్ఫూర్తిని చాటుకున్నారు. మొత్తం మీద ఈ బడ్జెట్ ప్రగతితోపాటు, సమ్మిళిత అభివృద్ధికి, దీర్ఘకాల అవసరాలను తీర్చటానికి, ప్రజల ఆకాంక్షలకు తీర్చటానికి రూపొందించిన బడ్జెట్ అని చెబితే అందులో అతిశయోక్తి లేదనిపిస్తుంది.


ఉద్యాన పంటలకు ప్రోత్సాహం

ఐఎమఎఫ్ అంచనాల ప్రకారం సగటున ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2026లో 3.3 శాతం వృద్ధి చెందే అవకాశం ఉంది. అలాగే 2027లో ఆ వృద్ధి స్వల్పంగా తగ్గి 3.2 శాతం ఉండవచ్చని అంచనా వేశారు. మన దేశంలో జాతీయ గణాంక కార్యాలయం అంచనాల ప్రకారం మన వాస్తవ స్థూల జాతీయ ఉత్పత్తి 2025`26లో 7.4 శాతం వృద్ధిని సాధించవచ్చు.

ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం మన స్థూల జాతీయ ఉత్పత్తి 8 శాతం కంటే ఎక్కువ వృద్ధిని నమోదు చేస్తుందని అస్త్రశీ అంచనావేసింది. మన స్థూల జాతీయ ఉత్పత్తిృద్ధికి ఎక్కువగా దోహదపడతున్నది సేవల రంగమే. సేవల రంగం 9.1 శాతం వృద్ధిని నమోదు చేయగా నిర్మాణ, ఉత్పత్తి రంగాల వృద్ధి 7 శాతంగా నిలిచింది. అదే వ్యవసాయ రంగం వృద్ధి మాత్రం 3.1 శాతానికి పరిమితమైనది. గత సంవత్సరం అనుకూల వాతావరణ పరిస్థితులు ఉండి, వరి, గోధుమ, మొక్కజొన్న, నూనెగింజల ఉత్పత్తి పెరిగి, మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో పెరిగి 3577.32 లక్షల మెట్రిక్ టన్నులకు చేరినప్పటికి వ్యవసాయ రంగ వృద్ధి రేటు మాత్రం 3.1 శాతానికి పరిమితమైనది. మన జాతీయ ఆదాయంలో వ్యవసాయరంగం వాటా ప్రస్తుత ధరల ప్రకారం 20 శాతం కాగా, మన శ్రామిక శక్తిలో 46.1 శాతం మంది అదే రంగంపై ఆధారపడి ఉన్నారు. ఇటీవలి కాలంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిపాటు ఉద్యాన పంటల ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగింది. ఈ సంవత్సరం ఉద్యాన పంటల ఉత్పత్తి ఆహార పంటల ఉత్పత్తికి మించిపోయి 3620.80 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుంది. కొన్ని పంటల విషయంలో ముఖ్యంగా ఉల్లిపాయల ఉత్పత్తిలో మనం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నాం. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే ఉల్లిలో నాలుగో వంతు మన దేశంలో ఉత్పత్తి అవుతున్నది. అందుకే ఈ బడ్జెట్‌లో ఉద్యాన పంటల ప్రోత్సాహానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఉద్యాన రైతుల ఆదాయాలు పెంచటానికి, దిగుబడి తక్కువగా ఉండే తోటల స్థానంలో అధిక దిగుబడి ఇచ్చే తోటల పెంపకానికి ప్రత్యేక కార్యాచరణను అమలు చేయనున్నారు. కొబ్బరితోటలు, జీడిపప్పు, గంధపు చెట్ల తోటలు వంటి అధిక విలువ గల ఉద్యాన పంటల కోసం ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టారు. ఆధునిక శాస్త్ర సాంకేతికతను, కృత్రిమ మేధను ఉపయోగించి రైతులకు నిపుణులు, వ్యవసాయ శాస్త్రజ్ఞుల నుంచి సమర్థవంతమైన, సమయానుకూల సూచనలు అందించటం ద్వారా రైతులు తమ దిగుబడులు పెంచుకోవటానికి ఉపయోగపడేలా పథక రచన చేశారు. పంటల దిగుబడి పెరగాలంటే నాణ్యమైన విత్తనాల లభ్యత కూడా ముఖ్యం కాబట్టి గత దశాబ్దకాలంలా రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించటానికి ప్రత్యేక శ్రద్ధతో పథకాలను అమలు చేశారు. వాటి ఫలితంగా ప్రస్తుతం లక్షలాది గ్రామాలలో విత్తన ఉత్పత్తి, వాటి నాణ్యత పరీక్ష, తదితర అంశాల ద్వారా 2.85 కోట్ల మందికి 1649.26 లక్షల క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలు అందిస్తున్నారు.  అలాగే గత బడ్జెట్‌లో ప్రకటించిన ప్రధానమంత్రి ధన`ధాన్య` కృషి` యోజన` అమలు చేయటానికి అవసరమైన మార్గదర్శకాలకు జూలై 16,2025న కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకాన్ని అక్టోబర్ 11,2025న ప్రధానమంత్రి ప్రారంభించారు.

దేశంలో ఎంపిక చేసిన 100 జిల్లాల్లో ఎక్కడైతే పంట దిగుబడులు తక్కువగా ఉన్నాయో, ఎక్కడైతే పంటలు ముమ్మరంగా లేవో, ఎక్కడైతే రైతులకు పంట రుణాలు సరిగా లేవో అటువంటి 100 జిల్లాల్లో ఈ నూతన పథకం అమలు జరుపుతున్నారు. ఈ పథకం ద్వారా పంట దిగుబడి పెంచటం, పంట మార్పిడులను ప్రోత్సహించటం, సాగునీటి లభ్యత పెంచటం, పంట రుణాలు అందుబాటులో ఉంచటం, కోతల అనంతరం పంటను నిలువ చేసుకోవడానికి గోదాములను అందుబాటులో ఉంచటం తదితర ప్రయత్నాల ద్వారా రైతుల ఆదాయాలు పెంచేందుకు కృషి చేస్తున్నారు. ఈ పథకం ప్రారంభించిన స్వల్ప కాలంలోనే 9750 మెట్రిక్ టన్నుల పంటలను నిల్వచేయడానికి గోదాముల నిర్మాణం పూర్తి చేశారు. మరో 70వేల మెట్రిక్ టన్నుల పంట నిల్వకు గోదాముల నిర్మాణం చేపట్టారు. అలాగే సాగునీటి లభ్యత పెంచటానికి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పథకాలను అమలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా రైతులకు వ్యవసాయ రుణాల క్రింద రూ.28.69 లక్షల కోట్ల అందించారు. రైతులకి ఇచ్చే వ్యవసాయ రుణాలపై రాయితీ ప్రక్కదారి పట్టకుండా, ఈ పథకాన్ని పటిష్టంగా అమలు చేయడానికి ఒక పోర్టల్‌ను ఇటీవల రూపొందించారు. దీనిద్వారా వడ్డీ రాయితీ పథకం అమలు చేసినప్పుడు మొత్తం రూ. 37,506.53 కోట్ల రాయితీలో రూ. 1080.88 కోట్లT నిబంధనలకు విరుద్ధంగా ప్రక్కదారి పట్టిందని తేలింది.


శ్రామిక శక్తికి జవజీవాలు

దేశంలోని 56 కోట్ల శ్రామిక శక్తి మన ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైనది. వచ్చే దశాబ్దకాలంలో మన దేశంలో 15 నుంచి 59 సంవత్సరాలలోపు వయసున్న వారి సంఖ్య 98 కోట్లకు చేరుతుందని అంచనా. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం 2030 కల్లా మన దేశ జనాభాలో 65 శాతం ప్రజల వయసు 15 నుంచి 59 సంవత్సరాలలోపు ఉంటుంది. ఈ శ్రామిక శక్తికి సరైన ఉపాధి అవకాశాలు కల్పించటానికి గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ మెరుగుపడి, ఉత్పత్తి, నిర్మాణ వ్యవసాయరంగాలు వేగంగా వృద్ధి చెందితే మన శ్రామిక శక్తికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయనే ఉద్దేశంలో ఆయా రంగాలలో సంస్కరణలను వేగవంతం చేయడం ద్వారా ఆర్థిక ప్రగతిని కొంతమేరకు సాధించారు. దాని  ఫలితంగా 2025 సంవత్సరంలో ఏప్రిల్ ` సెప్టెంబర్ మాసాల మధ్యలో నిరుద్యోగ రేటు తగ్గింది. 2025 సంవత్సరంలో జులై-సెప్టెంబర్ మాసాలలో మొత్తం 56.2 కోట్లమంది (15 నుంచి 59 సంవత్సరాల లోపువారు) ఉపాధి పొందారు. అదే త్రైమాసికానికి 56 శాతం కంటే ఎక్కువ మంది వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలలో ఉపాధి పొందారు. ఇటీవలి కాలంలో వ్యవసాయ రంగంలో వ్యవసాయ అనుబంధ రంగాలలో పురుషులకంటే మహిళలు ఎక్కువగా ఉపాధి పొందుతున్నారు. ఈ సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో వ్యవసాయరంగంలో ఉపాధి పొందిన మహిళా జనాభా దాదాపు 60 శాతంగా నమోదైంది. అంతేకాదు స్వయంగా ఏదో రకంగా ఉపాధి పొంది, మరికొంతమందికి ఉపాధి కల్పించటంలో కూడా (అంటే స్వయం ఉపాధి) పురుషుల కంటే మహిళలు తీసిపోలేదు. ఈ విభాగంలో ఉపాధి పొందుతున్న పురుషులు 42 శాతం ఉంటే, మహిళలు 35 శాతం. అయితే గ్రామీణ ప్రాంతాలలో మాత్రం స్వయం ఉపాధి పొందుతున్న వారిలో మహిళలే అధికం. Women & men India2024 నివేదిక ప్రకారం మహిళలు నడుపుతున్న వ్యాపార, పారిశ్రామిక సంస్థలు పెరుగుతున్నాయి. మహిళల యాజమాన్యంతో నడిచే వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు 26 శాతాన్ని దాటాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పత్తి రంగంలో మహిళా యాజమాన్యం క్రింద పనిచేస్తున్న సంస్థలు దాదాపు 60 శాతంగా నమోదైంది. 2023-24 PlfS నివేదిక ప్రకారం 4.9 శాతం మంది మాత్రమే (15 నుంచి 59 సంవత్సరాల మధ్య) ఏదో ఒక సంస్థలో నైపుణ్య శిక్షణ పొందినవారున్నారు. అంటే దాదాపు 95 శాతం శ్రామిక శక్తికి నైపుణ్య శిక్షణ అందలేదు. అయినా సరే, తమ స్నేహితులు, తల్లిదండ్రులు, సహోద్యోగులు తదితరుల నుంచి నేర్చుకుని పనిచేస్తున్నారు. అయితే మన దేశంలో నైపుణ్య శిక్షణ సంస్థలకు కొదవలేదు. అక్కడ ఇచ్చే శిక్షణ వ్యక్తులకు దీర్ఘకాల ఉపాధి అందించే విధంగా ఉండటం లేదు.

గత సంవత్సరం పార్లమంటుకు సమర్పించిన ఆర్థిక సర్వేలో దేశ విద్యాసంస్థలలో బోధించే అంశాలకు, వాస్తవంగా ఉపాధి పొందటానికి అవసరమైన నైపుణ్యానికి చాలా వ్యత్యాసం ఉన్నట్టుగా గుర్తించారు. మన దేశంలో 9వ తరగతి అంతకుపైన విద్యను బోధించే విద్యాలయాలలో కేవలం 47 శాతం విద్యాలయాలు నైపుణ్య ప్రాధాన్య కోర్సులను అందిస్తున్నాయి.వీటిలో కూడా అనేక కారణాలవల్ల అటువంటి కోర్సులలో చేరే విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా (29 శాతం) ఉంటున్నది. దీనివల్ల అనేక రంగాలలో నైపుణ్యం లోపం ప్రస్ఫుటంగా కనపడు తుంది. అందుకే ఈ బడ్జెట్‌లో నైపుణ్య వృద్ధికి ముఖ్యంగా కొన్ని ఎంపిక చేసిన రంగాలలో నైపుణ్య అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు. వైద్య అనుబంధ నైపుణ్య శిక్షణ సంస్థలను నవీకరించి, స్థాయిని పెంచటంతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో నూతన వైద్య, ఆరోగ్య అనుబంధ నైపుణ్య శిక్షణ సంస్థలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. దీనివల్ల వచ్చే 5 సంవత్సరాలలో కనీసం లక్షమంది ఆరోగ్య అనుబంధ వృత్తి నిపుణులు అందుబాటులో ఉంటారు. ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామంది వయోవృద్ధులకు సంరక్షకులుగా ఉపాధి పొందుతున్నారు. అయితే అలాంటివారిలో చాలామందికి వారి వృత్తికి సంబంధించి శిక్షణగాని, నైపుణ్యంగాని లేవు. అందువల్ల సంవత్సరానికి 1.5 లక్షలమంది సంరక్షకులకు వైద్యపరికరాల వాడకం, అత్యవసర సమయాలలో చేయవలసిన పనులు, నిత్యం సంరక్షణలో భాగంగా తీసుకోవలసిన జాగ్రత్తలతో కూడిన నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఈ వైద్యరంగమేకాక, పర్యాటక రంగం, పశుపాలన తదితర రంగాలలో నైపుణ్య శిక్షణను పెంచటానికి పథకాలు ప్రకటించారు.

– సాయి, ఆర్థిక నిపుణులు

About Author

By editor

Twitter
YOUTUBE