కేంద్ర బడ్జెట్‌లో పోలవరం నుండి బుల్లెట్ రైళ్ల వరకు, అమరావతి రాజధాని నుండి అరుదైన ఖనిజాల కారిడార్ వరకు.. ప్రతి అంశంలోనూ ఏపీకి అగ్రతాంబూలం దక్కింది.

  1. ఏపీ మీదుగా హైస్పీడ్ రైల్ కారిడార్లు

దేశంలోని వివిధ నగరాల మధ్య ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దక్షిణాది రాష్ట్రాల కోసం ప్రకటించిన కారిడార్ల లో అత్యధిక భాగం ఆంధ్రప్రదేశ్ గుండానే వెళ్లనన్నాయి.

కేంద్రం ప్రకటించిన మూడు కీలక కారిడార్లు: 1.హైదరాబాద్ – అమరావతి – చెన్నై, 2.హైదరా బాద్ – బెంగళూరు, 3.చెన్నై – బెంగళూరు.

ఈ మూడు కారిడార్ల మొత్తం పొడవు 1,671 కి.మీ.లు కాగా, ఇందులో 51 శాతం, అంటే 857 కి.మీ.ల మేర రైల్వే లైన్ ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే నిర్మిస్తారు. మిగిలిన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలన్నింటినీ కలిపినా 49 శాతం మాత్రమే ఉంది. దేశంలో మరే రాష్ట్రానికి ఈ స్థాయిలో హైస్పీడ్ రైల్ నెట్‌వర్క్ ప్రతిపాదన లేకపోవడం గమనార్హం. ఈ ప్రాజెక్టు పూర్తయితే బుల్లెట్ రైళ్లు గంటకు గరిష్టంగా 320 కి.మీ. వేగంతో పరుగులు తీస్తాయి. దీనివల్ల ఒనగూరే లాభాలు అసాధారణంగా చెప్ప వచ్చు. రాజధాని అమరావతి నుంచి హైదరాబాద్‌కు గంటలోపే చేరుకోవచ్చు. అమరావతి నుంచి తిరుపతి, చెన్నైలకు కేవలం రెండు గంటల్లోపు చేరుకునే అవకాశం ఉంటుంది. రాయలసీమ వాసులు కర్నూలు, అనంతపురం నుంచి హైదరాబాద్‌కు గానీ, బెంగ ళూరుకు గానీ గంటలోపు ప్రయాణంతో చేరుకోవచ్చు. ఇది కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాదు, రాష్ట్రంలోని 11 జిల్లాలను కలుపుతూ పారిశ్రామిక కారిడార్‌గా మారుతుంది. విజయవాడ నుంచి విశాఖ వైపు మినహా, మిగిలిన దక్షిణ కోస్తా, రాయల సీమ జిల్లాలన్నింటికీ ఈ నెట్‌వర్క్ అందుబాటులోకి వస్తుంది.

అమరావతి మీదుగా వెళ్లే కారిడార్: హైదరా బాద్ – అమరావతి-చెన్నై కారిడార్ ఏపీ రాజధాని అమరావతి మీదుగా, కొత్తగా నిర్మించనున్న విమానా శ్రయానికి సమీపం నుంచి వెళ్లనుంది. దీనికోసం ఏపీలో దాచేపల్లి, అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, తిరుపతి వద్ద స్టేషన్లు నిర్మిస్తారు. దీనివల్ల అమరావతికి అంతర్జాతీయ స్థాయి కనెక్టివిటీ లభిస్తుంది.

రాయలసీమకు వరం: హైదరాబాద్-బెంగళూరు కారిడార్ సీమ జిల్లాల మీదుగా వెళ్తుంది. ఈ మార్గంలో కర్నూలు, డోన్, గుత్తి, అనంతపురం, కియా కార్ల పరిశ్రమకు సమీపంలోని దుద్దేబండ, హిందూ పురంలో స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ కారిడార్ నిర్మాణం వల్ల వెనుకబడిన రాయలసీమ ప్రాంతం పారిశ్రామిక హబ్‌గా మారే అవకాశం ఉంది. కియా వంటి పరిశ్రమలకు ఇది ఎంతో మేలు చేస్తుంది.

ఈ ప్రాజెక్టులకు లక్షల కోట్ల నిధులు వెచ్చించను న్నారు. ఉదాహరణకు, హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌కు రూ.1.51 లక్షల కోట్లు, హైదరాబాద్-చెన్నై కారిడార్‌కు రూ.1.90 లక్షల కోట్లు వ్యయమవుతుందని అంచనా.

  1. భవిష్యత్ టెక్నాలజీకి కేంద్రంగా రాష్ట్రం

కేవలం మౌలిక వసతులే కాకుండా, భవిష్యత్ తరాలకు అవసరమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా కేంద్రం ఏపీని తీర్చిదిద్దుతోంది.

డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్: ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ‘రేర్ ఎర్త’ (అరుదైన ఖనిజాలు) మూలకాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఎలక్ట్రానిక్స్, రక్షణ రంగం, పునరుత్పాదక ఇంధన వనరుల తయారీలో ఇవి కీలకం. అరుదైన ఖనిజ నిల్వలు అధికంగా ఉన్న నాలుగు దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం కారిడార్లు ప్రకటించగా, వాటిలో ఏపీ ఒకటి. రాష్ట్రంలో డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీనివల్ల రాష్ట్రానికి వచ్చే లాభాలు అనేకం. మైనింగ్, ప్రాసెసింగ్, పరిశోధన, ఉత్పత్తి రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి. స్థానిక యువతకు అత్యున్నత స్థాయి సాంకేతిక ఉద్యోగాలు లభిస్తాయి. చైనా వంటి దేశాలపై ఆధారపడకుండా, స్వావలంబన దిశగా భారత్ వేస్తున్న అడుగుల్లో ఏపీ కీలక పాత్ర పోషిస్తుంది.

సెమీకండక్టర్ పరిశ్రమకు ఊతం: రూ.40,000 కోట్లతో కేంద్రం ప్రతిపాదించిన ‘ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0’ లో భాగంగా రాష్ట్రానికి భారీ లబ్ధి చేకూరనుంది. కర్నూలు, తిరుపతిలో చిప్స్ తయారీ, అడ్వాన్స్డ్ ప్యాకేజింగ్ పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం సహకారం అందించనుంది.

కర్నూలు జిల్లా ఓర్వకల్లులో రూ.14,000 కోట్ల పెట్టుబడితో ‘సిలికాన్ కార్బైడ్ సెమీకండక్టర’ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ఇప్పటికే ఒప్పందం కుదిరింది.

  1. జీవనాధార ప్రాజెక్టులు

రాష్ట్రానికి రెండు కళ్లు లాంటివైన పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం తన వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో కుంటుపడిన ఈ ప్రాజెక్టులకు జీవం పోస్తూ నిధులు కేటాయిస్తోంది.

పోలవరం ప్రాజెక్టు: పోలవరం జాతీయ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కీలక కేటాయింపులు చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,320 కోట్లు కేటా యించగా, ప్రాజెక్టు తొలి దశ పూర్తి చేయడానికి అవసరమైన రూ.12,157 కోట్లలో.. తాజా కేటాయింపులతో కలిపి ఇప్పటివరకు రూ.11,850 కోట్లు సమకూరి నట్లయింది. దీంతో తొలి దశకు కేంద్రం ఇంకా ఇవ్వాల్సిన మొత్తం కేవలం రూ.306 కోట్లు మాత్రమే. ఈ నిధులను కేంద్రం రాష్ట్రానికి అప్పు రూపంలో ఇస్తూ, చేసిన ఖర్చును జలవనరుల శాఖ ద్వారా రీయింబర్స్ చేస్తోంది. 2024-25లో రూ.5,512 కోట్లు కేటాయించగా, 2025-26లో రూ.5,936 కోట్లు ప్రతిపాదించారు. అయితే, రాష్ట్ర అవసరాలు, నిధుల వినియోగాన్ని బట్టి ఈ మొత్తాన్ని రూ.3,017.40 కోట్లకు కుదించారు. ఇందులో ప్రస్తుతం రూ.1,500 కోట్లు విడుదల చేసి, అవి ఖర్చయ్యాక మరో విడత నిధులు ఇవ్వనున్నారు. అడ్వాన్సుగా ఇచ్చిన నిధుల్లో రాష్ట్రం రూ.4,318.96 కోట్లు (80%) ఖర్చు చేయడంతో, మిగిలిన నిధుల విడుదలకు ప్రతిపాదనలు పంపారు. ఇప్పటివరకు పోలవరంపై మొత్తం ఖర్చు రూ.26,236.18 కోట్లు కాగా, జాతీయ హోదా వచ్చాక కేంద్రం రూ.21,505.47 కోట్లు వెచ్చించింది.

రాజధాని అమరావతి: అమరావతి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడంలో కేంద్రం ముందుంది. ప్రపంచ బ్యాంక్, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థల నుండి రుణాలను సమకూర్చడంలో కేంద్రం చొరవ తీసుకుంది. రాజధాని అమరావతికి ఏడీబీ, ఐబీఆర్‌డీ నుంచి రూ.1,561 కోట్లు సమకూరుస్తోంది. ఇది రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేయడానికి ఎంతగానో దోహదపడుతుంది.

  1. వ్యవసాయం – గ్రామీణాభివృద్ధి

రాష్ట్ర రైతాంగానికి ఈ బడ్జెట్ ద్వారా విశేష ప్రయోజనాలు కలగనున్నాయి.

పీఎం కుసుమ్ – సూర్యఘర్: సౌరశక్తి ద్వారా రైతులకు ఉచిత విద్యుత్ అందించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన పీఎం కుసుమ్, పీఎం సూర్యఘర్ పథకాల ద్వారా రాష్ట్ర రైతులకు మేలు జరగనుంది. కుసుమ్ పథకంలో 3 లక్షల వ్యవసాయ కనెక్షన్లు, సూర్యఘర్ పథకంలో 2 లక్షల కనెక్షన్లు అదనంగా వస్తాయని అంచనా వేస్తున్నారు. దీనివల్ల రైతులపై విద్యుత్ బిల్లుల భారం తగ్గి, ఆదాయం పెరుగుతుంది.

సహజ వ్యవసాయం: ఏపీ సహజ వ్యవసాయ సాగు ప్రాజెక్టు కోసం జీఐడీఈ నుంచి రూ.155.32 కోట్లు కేటాయించారు. ఇది రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించి, ప్రజారోగ్యాన్ని కాపాడటానికి దోహదపడుతుంది.

ఉద్యాన పంటలకు ప్రోత్సాహం: అధిక విలువ కలిగిన పంటల సాగును ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్రంలో సాగయ్యే కొబ్బరి, కోకో, జీడిమామిడి వంటి ఉద్యాన పంటలకు కేంద్రం ఆర్థిక సాయం అందించనుంది. ఇది కోస్తా జిల్లాల రైతులకు ఎంతో ఊరటనిస్తుంది.

గ్రామీణ రహదారులు: గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి గ్రామీణ రహదారుల ప్రాజెక్టుకు ఏఐఐబీ  నుంచి రూ.500.99 కోట్లు కేటాయించారు.

  1. పర్యాటక రంగం

రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేలా కేంద్రం చర్యలు చేపట్టింది.

అరకు: అరకులోయలో ట్రెక్కింగ్, హైకింగ్ మార్గాలను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటిం చింది. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి వీటిని అభివృద్ధి చేయనుంది. ఇది గిరిజన ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచుతుంది.

పులికాట్ సరస్సు: పక్షుల ప్రేమికులను ఆకర్షించేందుకు పులికాట్ సరస్సులో పక్షుల్ని మరింత దగ్గర్నుంచి వీక్షించేందుకు వీలుగా ‘బర్డ్ వాచింగ్ ట్రైల్స’కు ప్రాధాన్యం కల్పించనుంది.

  1. విద్య, పారిశ్రామిక మౌలిక వసతులు

యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉన్నత విద్యను అందించే సంస్థలకు కేంద్రం బడ్జెట్‌లో నిధులు కేటాయించింది.

విశాఖ పెట్రో యూనివర్సిటీ: విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీకి పెట్రోలియం శాఖ రూ.302 కోట్లు కేటాయించింది. గత సంవత్సరం కేటాయించిన రూ.50 కోట్లతో పోలిస్తే ఇది చాలా రెట్లు అధికం. ఇది ఇంధన రంగంలో పరిశోధనలకు ఊతమిస్తుంది.

విద్యా సంస్థలకు గ్రాంట్లు: రాష్ట్రంలోని స్వయం ప్రతిపత్తి సంస్థలకు ఆర్థిక సాయంలో భాగంగా గీతం యూనివర్సిటీకి రూ.50 లక్షలు, వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీకి రూ.12 లక్షలు కేటాయించారు.

మెగా టెక్స్‌టైల్ పార్కులు: దేశవ్యాప్తంగా మెగా టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటులో భాగంగా రాష్ట్రం నుంచి ప్రతిపాదించిన ధర్మవరం, పిఠాపురం, మంగళగిరి పార్కుల ఏర్పాటుకు కేంద్ర ప్రోత్సాహకాలు అందనున్నాయి. ఇది చేనేత కార్మికులకు, వస్త్ర పరిశ్రమపై ఆధారపడిన వేలాది మందికి జీవనోపాధిని మెరుగుపరుస్తుంది.

షీమార్ట్‌ల ఏర్పాటు: మహిళా సాధికారతలో భాగంగా, క్లస్టర్ స్టైల్‌లో షీమార్ట్‌ల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో 670 పైగా మండలాల్లో ఒక్కోదానికి రూ.20 లక్షల మేర కేంద్ర గ్రాంట్ అందనుంది.

  1. విశాఖ అభివృద్ధికి పెద్దపీట

కేంద్ర నౌకాయాన శాఖ నుంచి విశాఖపట్నం పోర్టు ట్రస్ట్‌కు రూ.450 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.250 కోట్లు అంతర్గత వనరుల నుంచి, రూ.200 కోట్లు ఇతర మార్గాల నుంచి సమకూరు స్తారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు రూ.100 కోట్లు కేటాయించారు. ఇది తక్కువే అయినప్పటికీ, ప్లాంట్ పునరుద్ధరణపై కేంద్రం దృష్టి సారించిందనడానికి ఇది నిదర్శనం.

2026 కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్‌కు కేవలం నిధుల కేటాయింపు మాత్రమే కాదు, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు దక్కిన గుర్తింపు. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టులన్నీ కార్యరూపం దాల్చి, ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబెడతాయని అనడంలో సందేహం లేదు. ఈ బడ్జెట్ నవ్యాంధ్ర నిర్మాణానికి పునాది రాయి మాత్రమే కాదు, బంగారు భవిష్యత్తుకు ముఖద్వారం కూడా.

– తురగా నాగభూషణం, సీనియర్ జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE