సంపాదకీయం

శాలివాహన 1947 శ్రీ విశ్వావసు ఫాల్గుణ శుద్ధ షష్టి – 23 ఫిబ్రవరి 2026, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్


వందేమాతరం గీత చరణాలంటే భారతీయుల పోరాటాగ్నిని రగిలించిన చెకుముకి రాళ్లు. ఆ ఆరు చరణాలు గుండె గుండెలో జాతీయతను ఆవాహన చేసిన మహామంత్రాలు. అది కేవలం గేయం కాదు, వేయేళ్ల బానిసత్వం ఇంకానా, ఇక చాలు అని ఒక కలం వేసిన పెనుకేక. స్వాతంత్య్ర కాంక్షకు స్వాగత వచనం. అలాంటి వందేమాతరం గీతంలోని అన్ని చరణాలను ఇకపై జాతి మొత్తం కలసి పాడుకోవలసి ఉంటుంది. భారత జాతీయ కాంగ్రెస్ 1937లో ఆ గేయం నుంచి కత్తిరించిన నాలుగు చరణాలను కలిపి మొత్తం ఆరు చరణాలను ఇక నుంచి ఆలపించాలి. 190 సెకన్లు లేదా మూడు నిమిషాల పది సెకన్ల ఆ గీతం వింటున్నప్పుడు సవినయంగా నిలబడాలని కొత్త నిబంధనలు చెబుతున్నాయి. ఇలాంటి ఒక ఆదేశం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి వెలువడడం ఎక్కువ మందికి సంతోషం కలిగించేదే. కొందరికి కంటగింపు కూడా. ఆ గొప్ప గేయం పుట్టి 150 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని ఇటీవలనే భారతజాతి సగర్వంగా నిర్వహించుకున్నది. ఆ సందర్భంగానే ఇంతకాలం పాడుతున్న రెండు చరణాలు కాకుండా, ఆ మహా గేయాన్ని గౌరవించుకుంటు మహాకవి బంకించంద్ర రాసిన అన్ని చరణాలూ కలిపి పూర్తిగా ఆలపించాలన్న నిబంధనను ఫిబ్రవరి 6, 2026న కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. జనగణమన ఆలాపనకు ముందే వందేమాతరం గేయాన్ని ఆలపించాలి. సాధారణంగా జనగణమనను కార్యక్రమాల చివరన ఆలపించుకుంటాం. జాతికి ఆ రెండూ రెండు కళ్ల వంటివే. రెండూ స్ఫూర్తిదాయకాలే. ఇద్దరు మహాకవులు ఆధునిక భారతజాతికి అందించిన అక్షర ఆయుధాలే. స్వతంత్ర భారతికి అపురూప కానుకలే.

ప్రభుత్వం నిర్వహించే పదవీ ప్రమాణ స్వీకారోత్సవాలలో ఈ గీతం ఇకపై పూర్తిగా ఆలపించాలి. రాష్ట్రపతి కార్యక్రమానికి హాజరైతే వారు వచ్చినప్పుడు, కార్యక్రమం ముగించుకుని వెళ్లినప్పుడు కూడా వందేమాతరం ఆలపించాలి. ఆకాశవాణి, దూరదర్శన్‌లలో రాష్ట్రపతి ప్రసంగానికి ముందు, వెనుక ఆ గీతం వినిపించాలి. గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల కార్యక్రమాలకు కూడా ఇదే వర్తిస్తుంది. ఏదైనా ఊరేగింపులో జాతీయపతాకం ఉంటే, వెనుక వందేమాతరం వినిపించాలి. దీని అర్థం జనగణమన అధినాయక జయహే గీతాన్ని ఆలపించనవసరం లేదని కాదు. ఆ గీతానికి ముందు వందేమాతరం ఆలపించడం లేదా, వాద్యగోష్టితో వినిపించాలి. పాఠశాలýలో ఈ గీత ఆలాపన అనివార్యం. తరగతుల ఆరంభానికి ముందే పాడుకోవాలి. రాజ్యాంగంలోని 51 ఏ (ఏ) అధికరణం జాతీయగీతాన్ని, జాతీయపతాకాన్ని గౌరవించాలని ఆదేశిస్తున్నది.

నవంబర్ 7,1875న (అక్షయ నవమి) బంకించంద్ర ఈ గేయం రచించారు. తరువాత ఆయన రాసిన ప్రఖ్యాత నవల ‘ఆనందమఠం’లో ఈ గేయానికి చోటు కల్పించారు. జనవరి 24, 1950న భారత రాజ్యాంగ పరిషత్ ఈ గేయాన్ని అధికారికంగా జాతీయగీతంగా స్వీకరించింది. ఆరు చరణాల ఈ గీతంలో నాలుగు చరణాలను తొలగించడం ద్రోహమే. ఇప్పటికి ఆ ఘోర తప్పిదాన్ని సరిదిద్దుకున్నాం. మొదట జాతీయగీతాన్ని విభజించారు. తరువాత దేశ విభజన జరిగింది అంటూ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కూడా వ్యాఖ్యానించిన సంగతి తెలిసినదే. చరిత్రలోని ఆ దురదృష్టకర క్షణాల మీద ఇది సరైన తీర్పు. ఆ నిర్ణయం కేవలం కవికీ, ఆయన కవితా సృష్టికీ జరిగిన అవమానం మాత్రమే కాదు, ఆ గీతమే స్ఫూర్తిగా సాగిన జాతీయోద్యమానికి సైతం అపచారం చేయడమే. కొత్త నిబంధన ప్రకారం ఏ వ్యక్తి అయినా జాతీయ గీతాన్ని అవమానించినా, పాడేవారికి ఆటంకాలు కల్పించినా మూడేళ్ల వరకు జైలుశిక్ష అనుభవించవలసి ఉంటుంది. సినిమాలలో లేదా డాక్యుమెంటరీలలో వందేమాతరం గేయం వినిపిస్తే, తొక్కిసలాటను నివారించడానికి అప్పుడు మాత్రం లేచి నిలబడాలన్న నిబంధనను సడలించారు.

వందేమాతర గేయాన్ని 1896 నాటి కలకత్తా కాంగ్రెస్ సమావేశాలలో సాక్షాత్తు గురుదేవ్ రవీంద్రనాథ్ టాగూర్ పాడారు. 1905 నాటి వారణాసి కాంగ్రెస్ సమావేశాలలో అన్ని సామాజిక, ఉద్యమ సందర్భాలకు పాడాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది ఒక ప్రార్థనాగీతం స్థాయి నుంచి ఒక సమర నినాదంగా మారినది మాత్రం ఆగస్ట్ 7, 1905న. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా విద్యార్థులు కలకత్తా టౌన్‌హాలుకు ఊరేగింపుగా వెళ్లినప్పుడు వందేమాతరం అంటూ నినదించారు. ఆపై వందేమాతరం అనడమే రాజద్రోహమైపోయింది. 1907లో మేడమ్ కామా జర్మనీ (స్టగార్ట్)లో ఒక అంతర్జాతీయ సమావేశంలో మూడు రంగుల జెండా రూపొందించి ఎగుర వేశారు. దాని మీద కనిపించే అక్షరాలు వందేమాతరం. 1909లో మదన్‌లాల్ థింగ్రా లండన్‌లో ఉరికంబం ఎక్కి, ఉరితాడును తగించిన క్షణంలో ఆయన కంఠం నుంచి వచ్చిన తుది మాట వందేమాతరం. వందేమాతరం ఆ తరానికి సమరనాదం. ఈ తరం తలెత్తుకు తిరిగేటట్టు చేసే ఉద్యమ జ్ఞాపకం.

ఇప్పుడు కూడా వందేమాతర గేయాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్లు గుర్తించ వలసినది ఒక్కటే – భారత విభజన, పాకిస్తాన్ ఏర్పాటు కోరుకున్న వాళ్లు నాడు ఏంచేశారో ఇప్పుడు తామూ అదే చేస్తున్నామన్న స్పృహ అవసరం. అదే వేర్పాటువాదాన్ని కొనసాగించడం మహా తప్పిదమన్న ఇంగిత జ్ఞానం ఉండాలి. మాతృమూర్తిని గౌరవించమని చెప్పని మతం మాతృభూమిని గౌరవించమంటుందని అనుకోనక్కరలేదు. కాబట్టి అలాంటి మతాన్ని అనుస రించేవారి అభ్యంతరాలను ఇకపై పట్టించుకోనవసరం కూడా లేదు. మనం తల్లికి సమున్నత గౌరవం ఇస్తాం. వందేమాతరం గీతం భావన అదే. మన మాతృభూమి గొప్పది అని చెప్పే గేయం మనకు నిశ్చయంగా మేలు చేసేదే. అందుకే ఇలాంటి సముచిత నిర్ణయం తీసుకున్న కేంద్రానికి ధన్యవాదాలు చెబుతూ, కొత్త నిబంధనను తు.చ తప్పకుండా ఆచరిద్దాం.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE