సంపాదకీయం
శాలివాహన 1947 శ్రీ విశ్వావసు మాఘ బహుళ చతుర్దశి – 16 ఫిబ్రవరి 2026, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
భారత సైనికదళాల మాజీ ప్రధానాధికారి జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే అచ్చుకాని పుస్తకం ఇప్పుడు పార్లమెంట్‌లో యుద్ధం సృష్టించింది. అపజయం తప్పని ఈ యుద్ధాన్ని విపక్షనేత రాహుల్ గాంధీ మొదలుపెట్టారు. భారత్ – చైనా సరిహద్దులలోని గల్వాన్‌లోయలో పొరుగు దేశ సైనికులను తిప్పికొట్టి, (2020) సాధారణ పరిస్థితులు సృష్టించినందుకు సైన్యాన్ని అభినందించాలా? అందుకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన ప్రభుత్వాన్ని అభిశంసించేందుకు సందు చూడాలా? ఈ ఇంగిత జ్ఞానం పూర్తిగా నశించినందువల్లనే ప్రతిపక్షం ఆరురోజుల పాటు సభా సమయాన్ని వృధా చేసింది. ‘ఫోర్ స్టార్స్ డెస్టినీ’ పేరుతో జనరల్ నరవణే పుస్తకంలో కనిపించిన ఒక వాక్యానికి పూర్తిగా వక్రభాష్యం చెప్పిన రాహుల్, మరో అవాంఛనీయ చర్చకు కారణమయ్యారు. సరిహద్దుýను కాపాడే సైనికులను నాడు అవమానించి, వారి విజయానికి కారణమైన ప్రభత్వాన్ని నేడు పార్లమెంట్‌లో దోషిగా నిలిపేయత్నం చేస్తున్నారు. ఫిబ్రవరి 2న ఈ రగడ మొదలయింది.
స్పీకర్ ఓం బిర్లా, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షాల తీవ్ర అభ్యంత రాల మధ్య కూడా, సభా నిబంధనలను పూర్తిగా గాలికి వదిలి, ఆ పుస్తకంలోని కొన్ని వాక్యాలను రాహుల్ చదివి వినిపించారు. ఇంకా అచ్చుకాని పుస్తకంలోని అంశాలను సభలో ప్రస్తావించడం నిబంధనలకు వ్యతిరేకమని స్పీకర్, మంత్రులు పదే పదే చెప్పారు. అయినా రచ్చబండ దగ్గరి చిల్లర నాయకుడిలాగే రాహుల్ తన ధోరణిని వీడలేదు. అక్కడి పరిస్థితికి తగిన విధంగా మీరే నిర్ణయం తీసుకోవలసింది అంటూ ప్రభుత్వం తనను ఆదేశించిందని జనరల్ నరవణే రాశారు. దీనికే మోదీ ప్రభుత్వం సైన్యం మీదకు బాధ్యతను నెట్టివేసి చేతులు దులిపేసుకుందని రాహుల్ కాకిగోల చేశారు. ఈ పనికిమాలిన, జాతి వ్యతిరేక వాదనకు మిగిలిన విపక్షాలు వహ్వా అంటున్నాయి. దీనికి విపక్షం ఇస్తున్న జుగుప్సాకర సమాధానం`ఇది సైనిక వ్యవహారాలలో పారదర్శకత కోసం ప్రయత్నమట. అందుకు చర్చ మార్గమట.
తాను రచన పూర్తి చేశానని, ప్రచురణ గురించి చర్చలు నడుస్తున్నాయని సాక్షాత్తు జనరల్ నరవణే ప్రకటించారు. నరవణే రచన ఇంకా ఏ రూపంలోను వెలువడలేదని ముద్రణకు సిద్ధపడిన పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా సంస్థ ఫిబ్రవరి 9న వివరణ ఇచ్చింది. అసలు అచ్చుకాని ఈ పుస్తకం రాహుల్ చేతికి ఎలా వచ్చిందన్న ప్రశ్నకు దీనితో పదును పెరిగింది. ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రతిపక్షనేతకు మాట్లాడే అవకాశం లేదని కాంగ్రెస్ మిత్రపక్షాలు చెబుతుంటే, ఆ పార్టీ నేత పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. అది ఇంకా అచ్చుకాకున్నా, ఇలాంటి ఒక పుస్తకం ఉన్నదీ అని యువతకు తెలియచేయడానికే పార్లమెంట్‌లో ప్రదర్శించానని ఆయన ఉవాచ. ఈ అబద్ధాల కోరును నమ్మి సభలో అల్లర్లకు దిగిన ఎనిమిది మంది ఎంపీలు బహిష్కరణకు గురయ్యారు. బడ్జెట్ చర్చకు సమాధానం ఇవ్వవలసిన ప్రధాని మోదీ మీద ఫిబ్రవరి 4న అవాంఛనీయ చర్యకు దిగడానికి కొందరు ప్రయత్నించారని, అందుకే ప్రధాని సభకు హాజరు కాకుంటే మంచిదని సలహా ఇవ్వవలసి వచ్చిందని స్పీకర్ ప్రకటన కూడా దీని కొనసాగింపు. ఫిబ్రవరి 10వ తేదీన కూడా మరొక ఎనిమిది మంది కాంగ్రెస్ మహిళా ఎంపీలు ప్రధాని స్థానం దగ్గరకు వచ్చి రచ్చ చేసి, స్పీకర్‌కు అందిన సమాచారం అబద్ధం కాదని రుజువు చేశారు. దీనికి పరాకాష్ట స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం యోచన.
భద్రతా దళాల అధికారుల అనుభవాలు, యుద్ధం వివరాలు వంటి అంశాలతో రచనలు కొత్త కాదు. అయితే అవి రక్షణ మంత్రిత్వ శాఖ పరిశీలన తరువాత మాత్రమే అచ్చుకు అనుమతి పొందే సంప్రదాయం ఉంది. అలాంటిది, జనరల్ నరవణే పుస్తకం కొన్ని వెబ్‌సైట్‌లలో పీడీఎఫ్ రూపంలో ఎలా అందుబాటులోకి వచ్చిందో తప్పక దర్యాప్తు చేయవలసిందే. ఇందులో కాంగ్రెస్, దాని మిత్రపక్షాల బాధ్యత ఎంత? ప్రచురణకర్తల సంజాయిషీ వంటివి తప్పనిసరిగా జాతికి తెలియవలసిందే. ఈ పుస్తకం లభ్యత మీద కొన్ని సందేహాలు ఉండక తప్పదు. ఇదే పుస్తకం అందుబాటులో ఉందనీ, ధర రూ.699 అనీ జనవరి, 2024లో కొన్ని చోట్ల సమాచారం వచ్చినా, ఇప్పుడు కనపడడం లేదని వార్తలు వచ్చాయి. కాబట్టి ఈ చౌర్యం గురించి చేపట్టబోయే దర్యాప్తునకు ప్రాధాన్యం ఉంది. పైగా రక్షణ రంగం, సరిహద్దులు, అగ్నిపథ్ పథకం, కొన్ని సైనిక, రాజకీయ నిర్ణయాల గురించిన ప్రస్తావనలు ఉన్న పుస్తకం. ఇలాంటి పుస్తకాలు గతంలోను వచ్చాయి. ఇదే ఆఖరిదీ కాదు.యుద్ధ అనుభవాలు, సరిహద్దు వాతావరణంలో ఎదురయ్యే అనుభవాలు నమోదు కావడం అనివార్యం. కానీ వీటికి వక్రభాష్యాలు వెలగబెట్టి, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేయడం ద్రోహం. ఒకటి వాస్తవం. రాహుల్ ఒక పుస్తకం పార్లమెంట్‌లో ప్రదర్శించారు. కానీ బీజేపీ సభ్యుడు నిశికాంత్ దూబె పది పుస్తకాల పేర్లు చెప్పారు. అవన్నీ కాంగ్రెస్ పార్టీ పరువును పాతాళానికి నెట్టినవే. ఎడ్వినా, నెహ్రూల గురించిన పుస్తకం అందులో ఒకటి. ఇంకా అచ్చుకానప్పటికీ నరవణే పుస్తకం మీద హక్కులు తమవే కాబట్టి, అందులో ఒక్క వాక్యమైనా తమ అనుమతి లేకుండా వినియోగించుకుంటే చట్టబద్ధమైన చర్యలు తప్పవని పెంగ్విన్ ఇండియా ప్రకటించింది. అదెలాంటి చర్య తీసుకుంటుందో చూడాలి. ఇంత నీతిమాలిన చర్యకు పాల్పడిన తరువాత రాహుల్ ఇంకా సభలో తలెత్తుకుని తిరగగలరా? అన్న ప్రశ్న అనవసరం. ఇంతకు ముందు కోర్టులు ఆయన వాచాలత్వం గురించి ఎన్నిసార్లు చీవాట్లు పెట్టినప్పటికీ ఆయన నిస్సిగ్గుగా దులిపేసు కున్నారు. ఏమైనా గల్వాన్‌లో చైనా, చట్టసభలో కాంగ్రెస్ ఓడిన మాట నిజం
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యే రోజుకి అంతర్జాతీయ మీడియాలో ఒక వార్తను ప్రచురించే ఏర్పాటు చేసి, సభా కార్యకలాపాలకు అడ్డంపడే దుశ్చర్యను కొన్నేళ్ల పాటు సాగించిన చరిత్ర కాంగ్రెస్‌ది. అవన్నీ అబద్ధాలనే తేలాయి. రాహుల్ వంటి బాధ్యత లేని నాయకుడికి ఇదీ అలాంటి వాటి మధ్య ఒకటి కావచ్చు. కానీ ఇలాంటివి దేశానికి మంచిది కాదు. కాబట్టి రాహుల్ వంటి నాయకుడు కూడా దేశానికీ, రాజకీయాలకీ మంచిది కాదు. అంటే కాంగ్రెస్ ముక్త భారత్‌కు తక్షణమే వాస్తవరూపం ఇవ్వాలి.